1969 ల్లో ఉద్భవించిన నక్సల్బరీ ఉద్యమం ఊపిరిగా తెలుగు నాట శ్రీకాకుళం లో అడుగుపెట్టి తెలంగాణ నేలన విస్తరించిన రాడికల్ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించిన గురిజాల రవీందర్ వ్రాసిన బొగ్గురవ్వలు పుస్తకంలో తన జీవన ప్రస్థానాన్ని, తనతో పాటు తన సహచరుల పోరాటాన్ని అక్షరీకరించిన తీరు నేటి తరానికి కావాల్సిన వైద్యం పుష్కలంగా ఉంది. సమస్యలనుండి పారిపోయే నేటి తరం వాట్సాప్ ల్లో ఫార్వార్డ్ చేయబడుతున్నదే చరిత్రగా అదే నిజమనే భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్న తరం చదవాల్సిన పుస్తకం ఇది. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, విలువల కోసం బ్రతికిన బ్రతుకులోని ఆనందం కన్నా మించినది మరొకటి ఉండదని మొగిలమ్మ లింగయ్య ల పుత్రుడు రవీందర్ ఋజువు చేసారు. బతుకు దెరువు కోసం ఊరు విడిచి కార్మిక ఆవాసాల మధ్య ఓ హోటల్ నడుపుకుంటూ హోటల్ నిర్వహణ కోసం కావాల్సిన పాలకై పశువులను పెంచుతూ వనరులను సమకూర్చుకోవడం నాటి తరంలోని శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది.
తన చుట్టూ ఉన్న మనుషుల జీవితాలని గమనిస్తూ చదువుతూ లోతుపాతుల పై విశ్లేషిస్తూ లోటుపాట్లను సరిదిద్ద అవసరమైన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళ గలిగిన రవీందర్ పయనం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఊరు వదిలి వచ్చినా ఆప్యాయతను వదలలేని హుస్సేన్ మామ తిరిగి వెతుక్కుంటూ హోటల్ కి రావడం పాటలతో ఉత్తేజితులను చేయడం, దొరల చేతుల్లో నడుస్తున్న సింగరేణి యూనియన్ లకు ప్రత్యామ్నాయంగా సికాస ను ఏర్పాటు చేయడంలో రవీందర్ పాత్ర మాత్రమే కాక నాటి కార్యకర్తల కఠోర శ్రమ ను త్యాగాన్ని గుర్తు చేసారు. ఈ నేలన జరిగిన సాయుధపోరాట స్ఫూర్తి ని నిలబెట్టిన ఆర్ వై ఎల్ పోరాటాలను సమస్యలను ఉటంకిస్తూ చర్చించిన అంశాలు సోదాహరణంగా ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనుల్లో అలసిన శరీరాల వల్ల చెదిరిన దాంపత్య జీవితాలను జైలు జీవితాల్లోని బీడీలు డబ్బులు హోమోసెక్సువల్ ఘటనలు, బలం ఉన్న వాడి చేతుల్లో బానిసలు గా ఆ జైలు గోడల మధ్య… బాహ్య ప్రపంచానికి తెలియచేసారు.
తన ఆత్మకథ అని అనటం కన్నా తాను నడిచిన మార్గం లోని ఒడిదుడుకులను తెలియచేస్తూ అనుభవించిన పోలీసు చిత్రహింసల ను నిర్బంధాలను పాఠకులకు పరిచయం చేయడం ద్వారా ఎన్ని నిర్బంధాలైనా ఉద్యమాలను ఆపలేవని చెప్పగలిగారు. తన బాట ముళ్ళబాట అని తెలిసినా ఆ బాటలోనే నడవటానికి నిర్ణయించుకున్న మేన మరదలు సరళ పదిహేడేళ్ళకే పరిణతి చెందిన నిర్ణయం తీసుకోవడం వెనుక సిద్ధాంత స్ఫూర్తి ఉంది. షెల్టర్ ఇవ్వడానికి తోబుట్టువులు తండ్రి జంకినా సానుభూతిపరుల ఇంట అజ్ఞాత జీవితం గడిపి తాను నడిచే బాటలోని ఔన్నత్యాన్ని గుర్తు చేసారు.
చదివే క్రమంలో బతుకుల బాగుకోసం సామాజికార్థిక అసమానతలు మూలమని గ్రహించి లీగల్ గా సేవలందిస్తూ పార్టీ కి అవసరమైనప్పుడు అండర్ గ్రౌండ్ కి వెళ్ళి అత్యవసర సమయంలో మురుగు నీరు సైతం మంచి నీరు గా సేవించాల్సిన పరిస్థితులను విశదీకరించారు. అజ్ఞాత జీవితంలోకి భార్యాభర్తలను ఒకేసారి పార్టీ అనుమతించ నిరాకరించడంతో కలిసే జీవించాలనుకునే మౌలిక సూత్రానికనుగుణంగా కోర్టు లో లొంగిపోయానని రవీందర్ తేటతెల్లం చేసారు.
ఉద్యమకారులకు పిల్లలు వుంటే ఉద్యమంలో చురుకుగా పాల్గొనేందుకు అడ్డని భావించి పిల్లలు పుట్టకుండా సరళ ఆపరేషన్ చేసుకున్నా ఆపాటికే గర్భం దాల్చడం అబార్షన్ కోసం వివిధ డాక్టర్లను సంప్రదించడం జరిగినది జరిగినట్లు ఎక్కడా అతిశయోక్తి లేకుండా రచించారు. పుట్టిన పిల్లను తాత దగ్గర వదిలి ఉద్యమంలో పాల్గొంటూ బిడ్డ తమకు దూరం అవుతుందనే బాధను వెలిబుచ్చారు సగటు తల్లితండ్రుల్లా.
పోలీసు చిత్ర హింసలకు వెన్ను నొప్పి నివారణకు ఆయుపంక్చర్ వైద్యాన్ని ఆశ్రయించి డాక్టర్ మిత్ర చేసిన వైద్య సహాయాన్ని ఉటంకించారు. వివిధ ప్రముఖ ఉద్యమకారులను ఉద్యమ నేపథ్యంలో కలిసిన, చర్చించిన మరియు ఏర్పాటు చేసిన సందర్భాలను తేదీలవారీగా ఇన్నాళ్ళ తర్వాత సైతం వ్రాయగలగడంలో తన డైరీ లు ఉపయోగ పడ్డాయని భావించవచ్చు లేదా జ్ఞాపక శక్తి కి సెల్యూట్ చేయవచ్చు.
తోటి కామ్రేడ్ గంగారం ఎన్కౌంటర్ అయినప్పుడు తాను అనుభవించిన బాధను అధిగమించటానికి చాలా సమయం తీసుకున్నారని తన వేదన ద్వారా గ్రహించవచ్చు. కొత్త దంపతుల నివాసానికి గుడిసెల మధ్య పందులు తిరుగాడుతుంటే సరళ వేరే ప్రాంతం చూడమన్నప్పుడు రెండు కవితలు చెబుతూ ఆ నివాసాల మధ్య ఉంటే సదరు ప్రజానీకం తమతో కలిసిపోతేనే సిద్ధాంత భూమిక త్వరగా నెరవేరుతుందని చెప్పటంలో తన సామాజిక బాధ్యత ను పరిణతిని అంచనా వేయవచ్చు . అజ్ఞాత జీవితం నుండి బైటికి వచ్చి ముప్పై ఏళ్ల పాటు విద్యాసంస్థలను నడిపి తాను ఆశించినట్లు నేడు నడపలేకపోతున్నందున తప్పుకోవడం అతని వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
చివరగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కు ముందే బీజం పడి అబార్షన్ ను తప్పించుకుని పుట్టిన బిడ్డే వ్యాఖ్యాత గా ఈ బొగ్గురవ్వలు ఆవిష్కరణ జరగడం గమనార్హం!
ప్రతులకు అమెజాన్ ను సంప్రదించవచ్చు లేదా రచయిత చరవాణి +91 98495 88825 ని సంప్రదించండి.
థాంక్యూ సార్.. Underground జీవితం కాబట్టి డైరీ లు రాయలేదు.. నాకు మొదటి పుస్తకం.. 20ఏళ్ల పునచ్చరన.. నిజానికి 400 పేజీలు గా రావాల్సి వుండే.. చాలా పరిమితులు విధించుకుని రాసాను.. కొన్ని విషయాలు కాక పోయినా పరవాలేదు కానీ.. ఒక్క పదం, వాక్యం.. నా అనుభవం లో లేనిది రాయకూడదని నిర్ణయించుకుని రాసాను.. ప్రపంచ కార్మికోద్యమ చరిత్ర లో ##సికాస## త్యాగ పూరిత మయిన చరిత్ర మరే దేశం లో జరుగలేదు…. ( రష్యా, చైనా, క్యూబా, వియత్నాం, మినహాయింపు ).. సింగరేణి లో ప్రతీ బొగ్గు పెళ్లకు అమరుల రక్తం అంటుకుంది….
ధన్యవాదాలు సార్
రాక పోయినా అని ఉండాలి