బొగ్గులు (కథ నేపథ్యం)

ఈ కథ రాసింది 1979లో. నిజామాబాదు నుండి వెలువడే ”అగ్నిపూలు” అనే పక్షపత్రికలో 1981 ఫిబ్రవరిలో అచ్చయింది. 1974 నవంబరులో నేను మా కరీంనగర్ జిల్లా గోదావరి దాటి ఆదిలాబాదు జిల్లాలోని మంచిర్యాలకు ఉద్యోగరీత్యా వలస వచ్చాను. ఉద్యోగం సిమెంటు కంపెనీలో. అప్పటికి కార్మికుల గురించి చదవడమేగాని పత్యక్షంగా కార్మిక జీవితం తెలియదు. ఇంకా పల్లె చేండ్లు, చెలుకలు, గుడిమెట్టు, చెట్లు, పిట్టలు… నిండా మునిగిపోయిన పల్లెల కొట్లాటలు, యవ్వనారంభ ప్రేమలు. అలాంటి వాగులాంటి జీవితంలో నుండి ఒడ్డున బడ్డ చేప తీర్గైపోయింది.

సైరన్ కూతతో పరుగులెత్తడం ఏదో భూతం తరిమినట్టుగా ఉండేది. ఫ్యాక్టరీ నుండి ఖాకీ బట్టల కార్మికులు గుంపులు గుంపులుగా బయటకు వెళ్లడం పాము కడుపులో నుండి అప్పుడే బతికొచ్చిన మనుషులుగా కన్పించేవారు. పొగ గొట్టాలు. గుండెలను పిండే యంత్రాల రొద. ఇండ్లమీద, చెట్లమీద మనుషుల మీద పేరుకుపోయిన దుమ్ము. వసుకూ వసుకు దగ్గులు. కార్మికులు ఎప్పుడు చిరచిరలాడుతూ ఊరుపేరు లేకుండా బండ బూతులు తిట్టేవారు. చదివిన చదువు అక్కడ నడిచే నడిపించే యంత్రాలు అర్థంకాక అధికారులు ఉత్పత్తిలో కలువకుండా కార్మికుల మీద అధికారం చేసే కుట్ర ముఖాలతో ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాళ్లు. యూనియన్లు, స్థానిక భూస్వాములు, దొరల ఆధీనంలో ఉండేవి.

నాకు టైంఆఫీసులో టైకీపర్ పని. మూడు షిప్టులు. కార్మికులు మొత్తం అస్తవ్యస్త కోపోద్రిక్త స్థితులు, కంగాళీ అంతా టైం ఆఫీసులో టైంకీపర్ దగ్గర వ్యక్తమయ్యేవి. ఆంధ్ర ప్రాంతం నుండి మా కన్న తక్కువ చదువుకున్న వాళ్లు క్లర్కులుగా, ఇతర ఉద్యోగులుగా ఆఫీసులల్లో కూర్చుండి మా మీద పెత్తనం చేసేవాళ్లు. తెలంగాణకు సంబంధించిన నలుగురం టైం ఆఫీసులో కార్మికుల మధ్య యుద్ధరంగంలో…

వరుసగా నాలుగు సంవత్సరాలు అరకొర వర్షాలతో వ్యవసాయం దెబ్బతిన్నది. ఇద్దరు తమ్ములు అల్లం వీరయ్య, నారాయణలను పోలీసు లాకప్పులో నెలల తరబడి అనేక పోలీసు స్టేషన్లు తిప్పుతున్నారు. వాళ్ల స్నేహితులు ఆగమై తిరుగుతుండ్లు. అప్పుడు కిరణ్ చిన్నపిలగాడు. నేనొక్కన్నే మా దోస్తుల్లో ఈ కిరికిరి ఉద్యోగంలో. చచ్చినట్లు ఈ నౌకరి చేయాల్సిందే…

మళ్ల కలవర పెట్టే సాహిత్యం. ఈ లోపటి బయటి తల్లడమల్లడం. అట్లా నడుస్తుండంగనే మెల్లెమెల్లెగా కార్మికా జీవితంలో లీనమయ్యాను. చిరచిరలాడే మాదుమ్ము నిండిన కార్మికులు నాతో పరాచికాలాడే స్థితికి వచ్చిండ్లు. ఎడతెగని ముచ్చెట్లు. మార్చి, 1977 ఆఖరి వారంలో అత్యయిక పరిస్థితి ఎత్తేసిండ్లు. డొక్కు సైకిల్ రైలు పట్టాలు దాటిస్తుండగా నైట్ డ్యూటి నుండి వచ్చే నాకు ఒక కార్మికుడు ఎదురై ఆ వార్త చెప్పిండు. నా టిఫిన్ క్యారియర్ డొక్కు సైకిల్ దుబ్బల పారేసి ఆ కార్మికుడు నే కలిసి రైలు పట్టాల దగ్గర డ్యాన్స్ చేశాము. రైలు కట్టనానుకొని ఉన్న గుడిసెల్లోని బిచ్చగాళ్లు మా చుట్టు మూగిండ్లు. కండ్లల్లో నీళ్లు…

రైల్వే స్టేషన్ దగ్గరి జగదాంబ హోటల్ నాయర్ ఎదురొచ్చి ‘‘మన బ్రదర్స్ బతుకుతరు’’ అన్నాడు. మధ్యాహ్నం దాకా ఆ హోటల్లనే కూచున్న. వారం రోజులకు కరీంనగర్ సబ్ జైల్లో నారాయణ ఉన్నట్టు తెలిసింది. బస్సు కిరాయిలకు పైసలులేవు. అప్పు పుట్టలేదు. మొత్తానికి మరో వారానికి పిల్లలతో సహా జైలుకు పోయిన. అక్కడ నారాయణతో పాటు గజ్జెల గంగారాం ఒళ్లంత పుండ్లతో జుట్టు పెరిగి ఉంది. డజను అరటి పండ్లు తప్ప కొనియ్యడానికి డబ్బులేదు. నాస్లిప్పర్సు యిచ్చిన. బరికాళ్లతో ఇంటికచ్చినం.

తరువాత నారాయణ, గంగారాం విడుదలైండ్లు. నారాయణ గోదావరిఖని, గంగారాం బెల్లంపల్లి, మందమర్రి సింగరేణి కార్మికులల్లో పని చేయడం ఆరంభించారు. సహచరులందరితో పాటు డ్యూటీలు చేయడం, అప్పుడప్పుడు ఎగ్గొట్టడం, మందమర్రి, బెల్లంపల్లి, గోదావరిఖని బొగ్గుల బాయి సుట్టు కార్మికుల బస్తీలల్లో డొక్కు సైకిలేసుకొని తిర్గడం… ఈ సమయంలోనే గోర్కి సాహిత్యం, ఇతర కార్మికుల గురించి వచ్చిన సాహిత్యం చదవడం కొంత ఊరట కలిగించాయి.

కరీంనగర్, ఆదిలాబాదు గ్రామీణ ప్రాంతాలల్లో పెద్దయిన రైతుకూలీ సంఘాలు ఏర్పడ్డాయి. జన నాట్యమండలి పాముల రామచందర్ తో పాటు నారాయణ ఓ మాదిరి టౌన్ లల్లో పెద్దపెద్ద మీటింగులు. ఈ మీటింగులల్లో సింగరేణి కార్మికులు కూడ పాలుపంచుకున్నారు. ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాల్లో గోదావరికి అటుయిటు విస్తరించిన అతిపెద్ద పరిశ్రమ, మాంచెష్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సింగరేణి. పేరుకు పెట్టుబడిదారి ఉత్పత్తి విధానమే. అయినా అటు కార్మికులు యజమానులు, కులాలు, మతాలు, ఊళ్ల తీర్గనే భూస్వామిక భావజాలంతో ఉండేటోల్లు. చుట్టు పక్కల ఊళ్లల్ల అగ్రకులపు దొరే సింగరేణి ప్రాంతంతో సకల దందాలు చేసేటోళ్లు యూనియన్ నాయకులు వాళ్లే, సేట్లు వాళ్లే, చిట్టీలోల్లు, సినిమా టాకీసులు, బ్రాండీషాపులు, గుండాలతో కార్మిక బస్తీలు గడగడలాడేది. దాదాపుగా ప్రభుత్వ యంత్రాంగం నామమాత్రం.

కార్మిక బస్తీలు పందుల గుడిసెలు, ఇరుకు దారులు, పందులు, ఈగలు, దోమలు, ముగుగు కాలువల మధ్య నరక కూపాల్లాగ ఉండేవి. క్వార్టర్లు అతి తక్కువ అవి అగ్రకులాల వాళ్లకు యూనియనోల్లకు, పై ఉద్యోగులకే ఉండేవి. బొగ్గు గనులకు నివాసాలకు మైళ్లకొద్ది దూరం నీళ్లులేక, రవాణ లేక, కార్మికులు అవస్థలు పడేటోల్లు. మళ్లా అతి ప్రమాదరకరమైన పనులు చేస్తూ అస్తవ్యస్తంగా ఉండేది బతుకు.

దుర్భరమైన పని పరిస్థితులు. అడిగేటోడు లేడు. కనీస వసతులు లేవు. పట్టించుకున్నోడు లేడు. మార్కెటంతా గుండాలతో నిలువు దోపిడీమయం. కార్మికులు భయంభయంగా బతికేవాళ్లు. గుండాలు బ్రాండీషాపుల దగ్గర సినిమా హాళ్ల దగ్గర కార్మికుల మీద పడి కొట్టేవాళ్లు. వీధుల్లో నుండి మహిళలను ఎత్తుకపోయి చెరిచేవాళ్లు. యూనియన్లు ఈ గాయి గత్తరలో భాగసామ్యంతో కార్మికులను అన్ని రకాలుగా మోసం చేసేవి.

రాడికల్ విద్యార్థులు గ్రామాలల్లో మాదిరిగా కార్మిక బస్తీలకు గనుల దగ్గరికి వెళ్లారు. అక్కడున్న పరిస్థితులను అధ్యయనం చేసి అనేక కరపత్రాలు ప్రచురించారు. ముఖ్యంగా గనుల్లో ఉన్న పరిస్థితులేమిటి? మైనింగ్ చట్టాలు ఏం చెప్తున్నాయి? రక్షణ విషయంలో ఏం జాగ్రత్తలు పాటిస్తున్నారు? ఉత్పత్తి జీవితాల్లో ఎంత మోసం జరుగుతుంది? ముఖ్యంగా కార్మికుల శ్రమ శక్తిని మాయోపాయంగా కొల్లగొడుతున్నదెవరు? గనికి అనుబంధంగా ఉంటే మిగతా పనులేమిటి? అలాంటి వాటిలో యూనియన్ నాయకులు, దొరలు కాంట్రాక్టుల పేరుమీద ఎంత కొల్లగొడుతున్నారు? బొగ్గు చుట్టూ అల్లుకున్న గూడు పుఠాణి మొత్తం వెలికితీసి కరపత్రాలు పంచారు.

అట్లాగే ఎక్కడో అడవుల్లో గనులు తెరిచి గఈహవసతి కల్పించకుండా యాజమాన్యం.. అనేక ఇతర మౌలిక, కనీస వసతులు ఎందుకు కల్పించడం లేదు? దొంగ యూనియన్లు ఎందుకు నిలదీయడం లేదు?

మార్కెట్ లో జరిగే దోపిడీ ఏమిటి?
గనుల ప్రాంతంలో ఏర్పడి ఉన్న దోపిడీ, హింసాత్మక స్థితులను మార్చాలనుకున్నారు. మొదట పైకి కన్పిస్తున్న ఈ కాలనీ జీవితం వెనుక ఉన్న దోపిడీ శక్తుల , భూస్వాముల, పెట్టుబడిదారుల, అధికార యంత్రాంగాన్ని బద్ధలు కొట్టాలి. కార్మికులను సంఘటితం చేయాలి. అందుకు తగిన నిర్మాణ రూపాలు ఏర్పాటు చేసుకోవాలి.

గనుల మీద యాజమాన్యం నామమాత్రంగా పెట్టిన ఫిట్ కమిటీలు లడ్డూ చాయ్ కమిటీలుగా మారిపోయాయి. అలాంటి కమిటీలను గనిలో సమస్యల మీద కదిలించాలి. ఆ నిర్మాణాలను బలోపేతం చేయాలి. ఎట్లా?

ఎమర్జెన్సీ నిర్బంధంలో కాలరీలో బీభత్సం సఈష్టించింది. కార్మికుల అన్ని సమస్యలు కలుపుకొని.. జులై 16, 1977నాడు గోదావరి ఖనిలో పౌరహక్కుల కమిటీ ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అంటే ఎమర్జెన్సీ ఎత్తివేసిన సుమారు నాలుగు నెలల తర్వాత ఈ సభకు జార్జ్ ఫెర్నాండెజ్ వచ్చారు. అన్ని సమస్యల మీద కరపత్రాలైతే వేశారు గానీ, కార్మికుల సమస్యల మీద పెట్టే అతిపెద్ద మీటింగ్ లో జననాట్యమండలి రైతుల గురించి పాటలు పాడితే బాగుంటుందా? అప్పటికప్పుడు రైతాంగ సమస్యల మీద స్ర్కిప్టు లేని ”బీదల పాట్లు” నాటకం వేస్తున్నారు గానీ, అది మీటింగ్ లో సుమారు నాలుగైదు గంటలు కార్మికులను ఆపగల్గుతుందా? జన నాట్యమండలిలోని గద్దర్, భూపాల్ లాంటి కవులకు అప్పటికప్పుడు ఏదన్నా రాయాలన్నా, కార్మిక ప్రాంతాల గురించి … అక్కడి సమస్యల గురించి అవగాహన వస్తుందా? అనుభవం కూడా లేదు కదా?

పాటలు కావాలి. నేను అప్పటికి కార్మికుల విషయాలు తెలిసి నాలుగు రాజీ లాంటి కథలైతే రాసిన గానీ, పాటలు కథల తీరుగా కాదు గదా?

అప్పటికప్పుడు అల్లం వీరయ్యతో రెండు పాటలు … ప్రపంచ వ్యాప్తంగా మార్చింగ్ సాంగ్ గా మారిన ”ఎర్రెజెండెర్రజెండెన్నియలో…”, ”పల్లె పల్లెనా పోరు బాటలో”, ”బావయ్యో బంగారయ్య…” పాటలు రాయించారు. మహ్మద్ హుస్సేన్ ”బండ కింద బతుకులు” పాట, జన నాట్యమండలి పాడిన ఆ పాటలకు కార్మికులు ఉర్రూతలూగిపోయారు. వేలాది మంది కార్మికులు ఆ సభకు హాజరయ్యారు. ”బావయ్యో బంగారయ్య…’ కాలనీలో మార్మోగింది.

ఆ తరువాత ఆగస్టు నెలలో మోర్గాన్ ఫిట్ బెల్లంపల్లి గనిలో పరిస్థితులకు గాలి సప్లై కోసం కార్మికులు పనులు బహిష్కరించి.. సమ్మె చేశారు. సమ్మె విజయవంతమై గాలి సప్లై పెరిగింది. సెప్టెంబర్ లో బెల్లంపల్లిలో పౌరహక్కుల మీటింగ్ జరిగింది.

సింగరేణి పొగచూరుతుంది. లోపల మసులుతుంది. కానీ, ఈ రగిలే నిప్పును… కోపోద్రిక్త కార్మికుల చుట్టూ గూండాలున్నారు. కార్మికుల చట్టాలున్నాయి. కుట్రలు చేసే యజమానులున్నారు. బాయి అధికారులున్నారు. వేలాదిమంది కార్మికులు అసంఘటితంగా ఉన్నారు. గూండాలతో భయబీతులయినారు. ఏమి చేయలేక… పరిస్థితులను సంఘటితంగా ఎదుర్కోలేక, కార్మికులు విపరీతంగా తాగుతున్నారు. అప్పులపాలువుతున్నారు. కుటుంబాలు, పల్లె నుంచి బతుకుతెరువు లేక… కాలనీకొచ్చిన కుటుంబాలు, ముఖ్యంగా దళిత కుటుంబాలు బాయి పని దొరకక నలిగిపోతున్నాయి.

మార్చ్ 1978లో బెల్లంపల్లిలో పట్టపగలు వీధుల్లో క్రూరులయిన గూండాలను రాడికల్స్ చంపారు. ఆ వార్త దావానలంలా అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. దోపిడీ శక్తుల క్రూరమైన వ్యక్త రూపం హతమైంది. అది ఒక హెచ్చరిక.

మొట్టమొదటిసారిగా సింగరేణి ఉలిక్కిపడింది.
పర్సనల్ ఆఫీసర్ కొడుకు తమ ఇంట్లో పని చేస్తున్న రాజేశ్వరిని చెరిచి ఉరిన నాటకం చేశారు. కార్మికులు, మహిళలు వేలాది మంది ఈ అన్యాయానికి వ్యతిరేకంగా వీధుల్లో కదం తొక్కారు. 144 సెక్షన్ పెట్టినా ప్రజలు చెదిరిపోలేదు. పోలీసు కాల్పుల్లో నలుగురు కార్మికులు చనిపోయారు.

కార్మికులు, మహిళలు రగిలిపోయారు. అన్ని గనుల్లో తమ సహక్కుల కోసం సమ్మెలు ఆరంభమయ్యాయి. నిర్బంధం పెరిగింది. దొంగ ట్రేడ్ యూనియన్ నాయకులని నిలదీశారు. అత్యంత దారుణంగా దోపిడీ చేస్తున్న లోడింగ్ కార్మికులు కాంట్రాక్టర్ ట్రడ్ యూనియన్ నాయకుడైన దొరను నిలదీశాయి. దొర గూండాలు దాడులు చేశారు. వాళ్లకు నాయకత్వం వహిస్తున్న మరో ట్రేడ్ యూనియన్ కు సంబంధించి కార్మికులని గూండాలు హత్యచేశారు.

ఆఖరుకు కమ్యూనిస్టు పార్టీ అనుబంధ యూనియన్ ‘రాడికల్ విద్యార్థులు’ కలిసి పెద్ద ఊరేగింపు తీశారు. భూస్వామి సినిమా నాటకాలు పెట్టారు. గూండాల ఇండ్లు కాలబెట్టారు. జనవరి 6, 1979నాడు జరిగింది.

ఆ కోపోద్రిక్త ఊరేగింపు మందమర్రి యాపలకాడికొచ్చి భూస్వామి బ్రాండి షాపు, సారా గిడ్డంగి మీద దాడిచేసి ధ్వంసం చేశారు. పోలీసు కాల్పులు… ఆరుగురు కార్మికులు చనిపోయారు.

భగభగమండే సింగరేణి… నా లోపల ఏం చేయాలో తోచేది కాదు. కాల్పుల్లో చనిపోయిన కార్మికులు, వాళ్ల కుటుంబాలు పదే పదే గుర్తుకు వచ్చేవి. యుద్ధరంగంలో నిలబడడం ఎంత హింసాత్మకం? సరిగ్గా అప్పుడే ‘గోర్కీ’ కథ ”బురదలో స్త్రీ” కథ చదివాను. ఇలాంటి ఒక అమానవీయ సంఘర్షణలోంచి వచ్చిన కథ…

అప్పటికే సింగరేణిలో అనుబంధం కలిగిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి, ఉరుగొండ యాదగిరి(పి. చంద్) ఇంకా కథలు రాయడం మొదలుపెట్టలేదు.

ఆ అలజడిని మార్చ్ 1979లో ”బొగ్గుల ”కథగా రాశాను. లోపల గనుల గోడల మీద బొగ్గుతో కార్మికులు ఒత్తిడిలో, కోపంలో గీసిన బూతు చిత్రాలు… సింగరేణి అంతటా విస్తరించిన ఒక నిర్మాణం. కానీ, చిల్లంకల్లం జీవితం. రాయడం నా వల్ల కాలేదనుకున్నాను. కానీ, నాకింతకన్నా రాయరాదు.

రెండు సంవత్సరాల తర్వాత ఈ కథ నిజామాబాద్ నుండి వెలువడే ‘అగ్నిపూలు’ పత్రికలో ఫిబ్రవరి 1981లో ప్రచురించారు. రెండు సంవత్సరాలు ఈ కథ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పటికి కూడా.

*25 జనవరి, 2020

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply