అరుంధతీ రాయ్ 2002 లో ఇలా రాసింది: “ఈ దేశంలో నువ్వొక కసాయివాడివీ, ఊచకోతలు జరిపేవాడివీ అయి ఉండి, దానికి తోడు రాజకీయనాయకుడవయ్యే అవకాశం నీకు లభిస్తే – ఇక వెనకడుగు వేసే పనే లేదని నువ్వు ఆశించవచ్చు.”
2002 ఏంటీ ముస్లిం మతకల్లోలాలలో 1000 మందికి పైగా ప్రజలు మరణించారు. ఆ హత్యలకు సంబంధముందనే ఆరోపణకు గురైన – అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి , నరేంద్రమోదీని ఉద్దేశించి – రాయ్ ఆమాటలు రాసింది. మోదీ తాను నిర్దోషినని -(చాలా మంది దృష్టిలో అది నిజం కాకపోయినా కూడా) – చెప్తూ వచ్చారు. కాని, అతని భవిష్యత్తు గురించి రాయ్ వేసిన అంచనా తూచా తప్పకుండా జరిగింది. మోదీ భారతీయ జనతా పార్టీ – మొండిగా పంపే హిందూ ఆధిక్యత అనే సందేశాన్ని నిర్లజ్జగా పంపి, భారీవిజయం సాధించిన మొన్నటి ఎన్నికల తర్వాత, ఆయన రెండోసారి ప్రధాన మంత్రి అవుతున్నారు. ఎప్పటి కంటే ఎక్కువ శక్తివంతులైనారు.
“ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్యం”. గర్వంగా చెప్పుకునే ఆ పదప్రయోగాన్ని ఆమె బెదురు చిహ్నాల (scare quotes) మధ్య ఉంచి రాస్తుంది. భారతదేశం – ఒకే సమయంలో అనేక శతాబ్దాలలో జీవిస్తోంది. ఆ విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే దేశాన్ని పీడిస్తున్న సమస్యల రూపాన్ని గమనించాలి. సంప్రదాయం, కుల వ్యవస్థ, ఏ రోజుకారోజు బలం పుంజుకుంటూ కేపిటలిజం సృష్టించే అస్తవ్యస్తత – ఇవన్నీ – వేర్వేరు కాలాంతరాలలోకి వేళ్లూనిన సమస్యలు. ఈ వైరుధ్యాలన్నీ మోదీలో మూర్తీభవించి ఉన్నాయి. ఒక ‘టీ’ అమ్మి జీవించిన ఒకప్పటి కుర్రవాడు ఇప్పుడు 16,000 డాలర్ల ఖరీదు సూట్లు వేసుకుంటాడు. అటువంటి ఉదంతాల సహాయంతో – ఏక కాలంలో స్వయంసిద్ధతకూ, ఆకాంక్షకూ (authentic and aspirational) ప్రతినిధిగా, తేజోవంతమైన హిందూ పునరుజ్జీవనం, నవీన ఉదారవాద ఆర్ధిక సంస్కరణలకి రెంటికీ ఏక చిహ్నంగా మోదీ తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు.
1997లో తొట్టతొలి నవల – ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ తోనే మేన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరుంధతీ రాయ్, ఫిక్షన్లో విశ్వవిఖ్యాతి సాధించినప్పటికీ, ఆమే ఒక చోట అన్నట్టూ – ‘ఓ పుస్తకం రాసిన అందమైన స్త్రీ’ గా మిగిలిపోడం ఆమెకు సమ్మతం కాదు. పాశ్చాత్య మీడియా దృష్టిలో 21వ శతాబ్ధపు ఇండియా – ఒక ఆధునిక దేశం, వృద్ధి చెందుతున్న దేశం. ఆ దేశానికి సాంస్కృతిక ప్రతినిధిగా ఎదగాలన్న కోరికా లేదు ఆమెకు. ఈనాడు రాయ్ ఫిక్షన్ తో సమానంగా తన రాజకీయ దృక్పధానికి కూడా అంత పేరూ పొందింది. ఆమె మీద ఒకసారి దేశద్రోహనేరం మోపబడింది. ఇండియాలోని అరణ్యాలలో మావోయిస్టులను కలిసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ ఉద్యమాలకి తన సంఘీభావం ద్వారా వారికి సహాయపడింది. ఆమె వ్యాసాల సంకలనం – ‘మై సెడీషియస్ హార్ట్’ , వెయ్యి పేజీలకు పైగా ఉన్న పుస్తకం – జూన్‌లో రాబోతోంది.
ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న రాయ్ రెండవ నవల – ‘The Ministry of Utmost Happiness’ – (2017)లో మోదీ పేరైతే వినిపించలేదు. కాని అతని ఆశయం అయిన ‘హిందూ రాజ్యం’ – పుస్తకాన్ని వెంటాడుతుంది. ఆమె అంటుంది – “నేను చెప్పకూడదేమో, కాని ఒక నవలకు శత్రువు ఉంటుందని అనుకుంటే – ఈ నవలలో ఆ శత్రువు మోదీ హిందూత్వ భావజాలం – ‘ఒక జాతి, ఒక మతం, ఒక భాష’ అనే నినాదం.”
ఎలక్షన్ల అనంతరం, రాయ్‌తో ‘ది న్యూ రిపబ్లిక్’ పత్రిక కోసం జర్నలిస్ట్ సామ్యూల్ అర్ల్ (Samuel Earle) ఈమెయిల్ ద్వారా మాట్లాడి తీసుకున్న – ఈ ఇంటర్వ్యూ – స్పష్టత, శైలి మెరుగయ్యేలా కొద్దిగా ఎడిట్ చేశాం.
● ప్రపంచంలోనూ, మీ రాతలోనూ ఎన్నో మార్పులు వచ్చి ఉంటాయి, మారకుండా ఉన్నది మాత్రం – మీ రచనలో కనబడుతూ వచ్చే మోడీ భయంకర స్వరూపం. అతని అధికారం అనే “ట్రాజెడీ” మీరూహించినట్లే నడిచిందా లేక ఆయన నాయకత్వం ఎక్కడన్నా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిందా?
మోదీ మొదటి పదవీకాలంలో జరిగిన వాటిలో- నేనూహించినవీ, ఊహించనివీ కూడా ఉన్నాయి. బీజేపీ వెన్నుదన్ను, ఫాసిస్ట్ నమూనా అయిన ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్’ – భారతదేశాన్ని హిందూరాజ్యంగా ప్రకటించింది. దాని అనుంగు అనుచరుడైన మోదీ ఎలా ప్రవర్తిస్తాడని ఊహించానో అలాగే ప్రవర్తించాడు. ముస్లిం సమూహాలపై దాడి, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులను దుష్టులన్నట్టు చిత్రీకరించడం, దళితుల అణచివేతతో పాటు వారి ఆకాంక్షలను సైతం స్వంతం చేసుకోడానికి దళితులను హైందవీకరించడం – నా ఊహలన్నీ తూచా తప్పకుండా అక్షరం పొల్లుపోకుండా అమలయ్యాయి. ఎలక్షన్లకి సరిగ్గా ముందు – ఉగ్రవాది దాడి / యుద్ధం కూడా ఊహించాను (పుస్తకంలో సైతం రాసాను). పెద్ద కార్పొరేషన్లను ఆలింగనం, ప్రైవేటీకరణకి ప్రోద్బలం – ఇవి ఊహించాను. కాని రాత్రికి రాత్రి 90శాతం భారత కరెన్సీని ఇల్లీగల్‌గా ప్రకటించిన డిమోనిటైజేషన్ లాటి చర్యని మాత్రం ఊహించలేకపోయాను. ప్రజలని చాలా పెద్దదెబ్బ కొట్టింది అయితే పెద్ద సంఖ్యలో అతనికి వోట్ చెయ్యడానికి మాత్రం అది ఆటంకం అవలేదు.
ఇంతకు మునుపు కంటే పెద్ద ఎత్తున దేవతాస్వరూపం లాగా పూజలందుకుంటూ మోదీ మళ్లీ వచ్చాడు. ఇదొక ఆసక్తికరమైన మనస్తత్వం. బాధను దిగమింగి, అదే సౌఖ్యమనుకోడం దేని కోసం? అని ప్రశ్నిస్తే “దేశం” కోసమని సమాధానం. ఇది భీతిగొలిపే విజయం. కులాలు, వర్గాలు, ప్రాంతాలు, తెగలు – ఇదీ అదీ అని కాక – అన్నిటా వ్యాపించిన వోటర్లు అందించిన విజయం.
వేలాది ప్రజలు తన పేరును ఉచ్ఛరిస్తూ ఉండగా అతను చేసిన విజయోత్సవపు ఉపన్యాసంలో రెండు జడిపించే విషయాలు ఉన్నాయి- ఒకటి, 2019 ఎలక్షన్ – సెక్యులరిజం అన్న పదాన్ని అధికారికంగా ఉపసంహరించిందని. ఒక్క రాజకీయ పార్టీ కూడా సెక్యులర్ అన్న పతాకం కింద ప్రచారం సాగించే ధైర్యం చెయ్యలేదని – అతను గుర్తుచేసాడు. అతనన్నదానిలో అణుమాత్రం అబద్ధం లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి, ముస్లిం అన్న పదాన్ని పలకడానికి కూడా భయం. ముస్లిం ప్రియులమని పేరు వస్తుందని. అంచేత లించింగ్, ముస్లింల సామూహిక హత్యలు – ఇవన్నీ గాలికి కొట్టుకుపోయాయి. మెజారిటేరియనిజం, హిందూజాతీయవాదం – ప్రస్తుతం గెలుపును కైవసం చేసుకున్నాయి.
అతను అన్న రెండో మాట – దిగువ కులాలకు ‘ప్రాతినిధ్యం’ వహిస్తున్నామ’ని చెప్పుకునే పార్టీలను చిత్తుగా ఓడించింది కనుక బీజేపీ “కులాన్ని” జయించిందని. రెండే కులాలు మిగిలాయట ఇప్పుడు – పేదవారూ, పేదరికాన్ని పోగొట్టేందుకు పాటుపడేవారూ నట. అంటే సాంఘికపరంగా, బీజేపీ శత్రువును చూపించి పబ్బంగడుపుకుంటుంది. కాని, ఆర్ధికపరంగా, శత్రువులే లేరన్నమాట. తొమ్మిది మంది వ్యక్తులు కలిసి, దిగువనున్న 500 మిలియన్ల మంది ఉమ్మడి సంపదనీ – తమ గుప్పిటిలో ఉంచుకున్న ఈదేశంలో – ధనవంతులు సాధుపుంగవులన్నమాట. ఇది అమితంగా భయపెట్టే దృక్పథం. తిరిగి ఎన్నుకోబడి, దైవాంశసంభూతుడి స్థాయిని చేరుకుని, నిరుపేదలకు ఎంగిలి మెతుకులు విదిలించి, ఆకలితో మాడుతున్న గ్రామాల్లోని కుటుంబాలకు గేస్ సిలిండర్ ఇచ్చి, వందలవేల సంఖ్యలో ఋణభారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకి 2000 రూపాయలు (30 డాలర్లు) ఇచ్చి, మిలియన్ల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువకుల చేతికి ద్వేషపూరిత భావజాలమనే మారణాయుధాన్నిచ్చి – ఈ సమస్యకి కారణమైన ఆర్ధిక విధానాలనే కొనసాగించేందుకు మోదీ అధికారం సంపాదించుకున్నాడు.
పేదలూ, పేదరికాన్ని పారద్రోలాలనుకునేవారూ తప్ప వేరే కులాలే లేవని ప్రకటించడం ద్వారా – దళితుల మార్గదర్శి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సైతం సాధించని ‘కులనిర్మూలనాన్ని’ – తనూ, ఆర్ఎస్ఎస్ కలిసి సాధించేసాం అని చెప్పడమన్న మాట. ఇది చాలా కలతపెట్టే వాక్యం. ఎందుకంటే, అంబేద్కర్ చెప్పినట్టూ, హిందూమతం అంటేనే కులం. ఆర్ఎస్ఎస్ – బీజేపీ చేసినదేమిటంటే – కులాన్ని మరింత ధృఢపరచడం – కుల విభజనల్ని వాడుకోడం, కులాలకీ, ఉపకులాలకీ మధ్యనున్న భౌతిక పరమైన వైరుధ్యాలను ఉపయోగించుకుని– ఒకదానితో మరొకదానిని ఢీకొట్టించి– అతి నిపుణతతో ఎత్తులు వేసి లాభం పొందడం.
● రాజకీయ కేంద్రాన్ని ఆయన తన ఇమేజిలో విజయవంతంగా పునర్నిర్వచించాడని అనిపిస్తోంది. ఇది ఇప్పుడు “నూతన సాధారణం (new normal).”-దీనిని ఎదుర్కునేందుకేవన్నా కొత్త మార్గాలు కనిపిస్తున్నాయా?
తను ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత, అంతర్జాతీయ ప్రెస్ ఘాటైన విమర్శలు చేసిన నేపథ్యంలో, మోదీ ఒక ఉపన్యాసం చేసాడు. అందులో మైనారిటీలకు రక్షణ కల్పిస్తానని, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాననీ చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఆ ప్రకటన – ముందురోజు తానన్న మాటలకీ, తన సీనియర్ సహచరులన్న మాటలకీ కూడా పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ రకమైన స్వప్రయోజన పరాయణత్వం – పూర్తిగా ఆర్ఎస్ఎస్ తరహా చిట్కా. చిత్రమైన విషయం అదే, మోదీని దేవుడిలా పైకెత్తడం అనే ప్రక్రియ – బీజేపీని ఒక పార్టీగా మసకబార్చుతోంది. దాని వద్ద రాశులు పోసి ఉన్న సంపద, దాని పార్టీ యంత్రాంగం – చక్రవర్తిని సింహాసనం మీద ప్రతిష్టించడానికి వినియోగపడ్డాయి. మోదీ బయోపిక్ అనే హాస్యాస్పదమైన ‘పురాణకథా’చిత్రం, పూర్తి అబద్ధాలతో – విడుదలైంది. అది అతని దైవీకరణకి తోడ్పడుతుందనడంలో సందేహమే అవసరం లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా, నేననుకోడం అయితే – మోదీ చక్రవర్తిగా ఉండేది, ఆర్ఎస్ఎస్ అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నంతసేపే.
ఆర్ఎస్ఎస్- శాసనం ఇప్పుడు నూతన సాధారణం, (new normal) దీనిని ఎలా ఎదుర్కోవచ్చని అడిగారు కదా, ఉత్తరభారతంలో ప్రస్తుతం, దాదాపు అన్ని రాజకీయపార్టీలూ చితికిపోయాయి. కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది, కమ్యూనిస్ట్‌లు కూలిపోయారు. దళిత బహుజనుల కోసం పెట్టిన పార్టీలమని అనే పార్టీలన్నీ సుమారుగా చెల్లాచెదురయ్యాయి. మొత్తం మీద అన్ని ప్రతిపక్ష పార్టీలూ అల్పత్వం తోనూ, అహంకారంతోనూ ప్రవర్తించి, ఒక దాని బలాన్ని మరొకటి తగ్గించుకుంటూ వచ్చాయి. ఈలోగా కొంపకూలిపోయింది. పార్టీలు ఇప్పటికైనా తమని తాము సీరియస్ ప్రశ్నలు వేసుకుని, ఆత్మవిమర్శ చేసుకుంటాయని ఆశిద్దాం.
ఆర్ఎస్ఎస్ దగ్గర – 600,000 మందికి పైగా క్రమశిక్షణ కలిగిన, దండిగా శిక్షణ పొందిన కేడర్ సిద్ధంగా ఉంది. తక్కినవారికి – కార్యకర్తల బలం దాదాపు శూన్యం. వారందరి దగ్గరా కలిపితే వచ్చే మొత్తం ధనానికి 20రెట్లు ధనం బీజేపీ దగ్గర ఉంది. వచ్చేసారి అది 50 రెట్లు అవుతుందేమో. ఇండియాలో ఎలక్షన్లంటే ఏమిటో – మనందరికీ తెలిసిన సత్యమే. డబ్బు; కళ్లు మిరమిట్లు గొలిపే తమాషాలు; మెయిన్ స్ట్రీం ఇంకా సోషల్ మీడియాల మీద పట్టు! ఈమూడిటి శక్తీ అనూహ్యం. ఎలక్షన్ కమిషన్‌తో సహా, దేశంలోని ప్రతీ వ్యవస్థనీ ఇవి తమకి కావలసినట్టూ ఆడించగలిగే పరిస్థితి – బహుశా ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు కూడా వాటి చేతిలోనే ఉన్నాయేమో. ఆ డబ్బుతో వాళ్లు వేలాది ఐటి నిపుణులని, డేటా విశ్లేషకులనీ కొనగలిగేరు. సోషల్ మీడియా ఏక్టివిస్ట్లతో, వేల కొద్దీ వాట్సాప్ గ్రూపులని నడిపి – వాటిలోకి ఒక ప్రణాళిక ప్రకారం తయారుచేసిన సమాచారాన్ని పంపడం. అంతే కాక, ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సమూహాన్నీ, కులాన్నీ, ప్రాంతాన్నీ, వర్గాన్నీ, చివరికి ప్రతీ ఒక్క వోటింగ్ బూత్నీ వదలకుండా లెక్కలోకి తీసుకుని, వాటికి తగినట్టూ ఆ సమాచారాన్ని సవరించి మరీ ప్రసారం చేసారన్నది నమ్మశక్యం కాని నిజం.
ఆ అపార ధనరాశి శక్తి ఊహాతీతం. తాను అమ్మాలని నిర్ణయించుకున్న వస్తువును దేనినైనా సరే – నిస్సందేహంగా విక్రయించగలదు. ఇప్పుడు అమ్మబడుతున్న ఆ వస్తువు ఎంత విషపూరితమైనదంటే – దాని వల్ల కొత్త మహమ్మారి వ్యాపించింది.
అవసరమైన విషయం ఏదీ – వాతావరణంలో మార్పు, ముంచుకొస్తున్న ఆర్ధిక సంకటం, ఆరోగ్యం, విద్యా – ఒక్కటంటే ఒక్కటి కూడా – ప్రచారంలో చోటు చేసుకోలేదు. వినిపించిందల్లా ఏమిటంటే – తలమునకలయ్యే విషపూరిత మధ్యయుగాల మూర్ఖత్వం. దీనిని మనం న్యాయమైన ఎన్నికలని ఎలా అనగలం? ఫెరారీ కారుకీ, కొన్ని సైకిళ్లకీ మధ్య జరిగిన రేసులాటిదిది. అందులో దానికీ ఏమీ అసహజమైన విషయమే కనిపించనట్టు – ఫెరారి గెలుపు కోసం మీడియా కేరింతలు. ఇప్పుడు ఆ ఫెరారీ అద్భుత ప్రదర్శనకి దానిని పొగడ్తలలో ముంచెత్తుతోంది. సైకిళ్లు మరీ నీరసంగా పరిగెట్టాయని వాటిని వెక్కిరిస్తోంది.
అయితే, ఈ నిర్మాణాన్ని ప్రశ్నించేందుకు మిగిలిన మార్గాలు ఏవన్నది ప్రశ్న. ఈ ప్రజాస్వామ్యానంతరపు ప్రథమ రూపంలో ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలూ – ఈ ధనభారంతో నిలిచి, ద్వేషంతో నడిచే భయంకర యంత్రాన్ని ఎదుర్కోలేవు. ప్రజల ఆవేశం ఏదో ఒక రోజు ఈ యంత్రాన్ని నేలకూల్చగలదని నా విశ్వాసం. నేను మాట్లాడేది విప్లవం గురించి కాదు. తిరుగుబాటు గురించి. ఎన్జీవో చేతుల్లో కీలుబొమ్మలు కాని సాంఘిక ఉద్యమాల పునరాగమనం గురించి మాట్లాడుతున్నాను. దాని రాక అనివార్యం. తప్పకుండా వచ్చి తీరుతుంది. దాని నుండి ఉత్పన్నమైన శక్తితో – నియంత్రణకి లొంగని ఒక నూతన ప్రతిపక్షం ఏర్పడుతుంది. మనం ఒక కొత్త ఆట, ఇలా మోసంలో కూరుకుపోని కొత్త ఆట మొదలుపెట్టాలి. ప్రజాస్వామ్యపు ఉత్తమ ప్రదర్శన అని కొనియాడబడుతున్న భారతదేశపు ఈ ఎలక్షన్ – సరిగ్గా దానికి విరుద్ధం. ప్రజాస్వామ్యం అనే పదాన్ని చేస్తున్న ఎగతాళి.
● బీజేపీ విజయం – బ్రిటన్, అమెరికా, బ్రెజిల్ లలో ఏర్పడిన జాతీయతా విక్షోభంలో భాగం గానే కనిపిస్తోందా?
ఔను, ఇదీ ఆ ప్రకోపాలలోకే జమ ఔతుందని నేను భావిస్తాను. అయితే ఇండియాలో ఈ ‘మహత్వపూర్ణ క్షణం’ దిశగా ఆర్ఎస్ఎస్ చిత్తశుద్ధితో 95 సంవత్సరాలుగా నడుస్తూ వచ్చింది. దానివల్ల – మరే ఫాషిస్ట్లకీ, శ్వేతజాతి శ్రేష్టతావాదులకూ లేని – పటిష్టమైన వ్యవస్థలు దానికున్నాయి.
● 2009లో మీ వ్యాసాల సంకలనాన్ని, “హేతువుకు అతీతమైన ఆశను అభ్యాసం చేసేవారికి” అంకితం చేసారు. ఆశకు హేతువుకు మధ్య నున్న సంబంధం ఎలా ఉందనిపిస్తోంది ఇప్పుడు? వాటి పునర్ మిలనం జరిగే సూచనలేవన్నా కనిపిస్తున్నాయా?
ఎలక్షన్ సన్నాహ సమయంలో ఈ సూత్రాన్ని నేను పాటించాను. దాదాపు నిపుణులందరి భవిష్యవాణిలోనూ -బీజేపీ విజయమే (ఇంత మెజారిటీ కాదనుకోండి) వినిపించింది. మేం ‘ప్రజల’నాడిని సరిగ్గా పట్టుకోగలిగేమని చెప్పుకోడం ఉద్దేశమై ఉంటుంది. మనని చుట్టుముట్టి ఉన్న దానిని తెలుసుకోడం ఏమంత ఘనకార్యం?
నేనూ, నావంటి మరి కొందరూ మాత్రం బీజేపీ ఓడిపోతుందని అన్నాం. నేనైతే పబ్లిక్‌గా చెప్పాను, ఎందుకంటే ఆ ‘ఫలితపు నిశ్చయత’ (certainty of the outcome)కు చిల్లు పొడవడం ఆవశ్యకం. బీజేపీ గెలుస్తుందని పబ్లిక్‌గా ప్రకటించిన వారిలో దాని ప్రభంజనాన్ని చూసి జడుసుకున్న వారూ ఉన్నారు. కానీ ఆ దీనాలాపాలు మరింత ప్రచారానికీ, ఫలితపు అనివార్యతకీ – దోహదం చేసాయి. కనక హేతువుకు అతీతమైన ఆశను అభ్యాసం చేసే కొందరం – ప్రతిపక్షాలే గెలుస్తాయని, వారి మధ్య రహస్య ఒడంబడికలు జరిగేయనీ, తెలివైన వ్యూహాలున్నాయనీ మొండిగా వాదించాం, పట్టుబట్టేం. గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ పీడకలను ఎదిరించి తెలివిలోకి తేగలిగినది – కేవలం ఈ రకమైన పిచ్చి ఆశ మాత్రమే. కనక – ఔను, హేతువుకు అతీతమైన ఆశ – కావాలి. దానితో పాటు హేతువుతో సంబంధంలేని ధిక్కారం కూడా కావాలి.
● ఇండియా మానసిక స్థితి – నానాటికీ – సైనికమయమౌతోంది, ఎన్నికల ప్రచారంలో మోదీ ఆ సెంటిమెంట్‌ని వాడుకోడంలో మోదీ ఏలోటు చెయ్యలేదు – సైన్యంతో తనను కలుపుకుని మాట్లాడడం, పొంచిఉన్న “దేశ శత్రువుల” పట్ల ప్రజల భయాందోళనలను రెచ్చగొట్టడం – అన్నీ చూసాం. “దేశద్రోహం గుండెల్లో దాగిఉందని” పేరు పడిన రచయితకి ప్రత్యేకించి ఇలాటి వాతావరణంలో ఎలాటి స్థానం ఉంది?
హా! స్వల్ప స్థానం అంటాను నన్నడిగితే. అత్యంత ప్రమాదకరంగా మారిన స్థానం కూడా. పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందంటే… హిందూ జాతీయవాదాన్ని వ్యతిరేకించినవారు సైతం, ఇప్పుడు రకరకాల పేర్లతో ప్రచారమయ్యే ‘మెరుగైన’ హైందవాన్నీ, ‘మెరుగైన’ జాతీయతా వాదాన్నీ బలహీనంగా ప్రతిపాదిస్తున్నారు. మన మెదళ్లని కుదించి, జాతీయ పతాకంలో చుట్టచుట్టేసాం. దాడి జరగబోయేది, మేధావుల మీదే కాదు. మేధస్సు యొక్క ప్రతి ఒక్క రూపం మీదా అది భీభత్సంగా ఉండబోతోంది. రాజకీయనాయకులూ, కార్పొరేట్ సియీవోలూ, వారికి సేవలందించే మీడియా భాగస్తులూ – ఊహాతీతమైన సంపదతో వీరంతా మిలియనీర్లూ, బిలియనీర్లూ అయిఉండగా – విద్యార్ధులనీ, ప్రొఫెసర్లనీ, రచయితలనీ, స్వతంత్ర పాత్రికేయులనీ – elitist “ఏంటీ నేషనల్స్” అని ముద్ర వేసి వెంటాడతారు.
‘కులీనం’ (Elite) అనేది పడికట్టుపదంగా మారింది. సగటు మేధస్సుకి కాస్త పైన ఆలోచించగలిగిన, స్వప్రయోజన కాంక్ష కాస్త తక్కువగా ఉన్న ప్రతీ ఒక్కరినీ ఉద్దేశించి వాడబడుతోంది ఆపదం. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా, జనరల్ సెక్రటరీ రాం మాధవ్ దాపరికంలేకుండా సూటిగా బెదిరింపులు జారీచేసారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిననాటి రాత్రి, విజయవేదిక మీద నుంచీ ఇచ్చాడు. మరునాటి వార్తాపత్రికలో రాం మాధవ్ “సత్యమే నాయకుడు (The Leader is the Truth),” అనే కోలంరాసేడు. “దేశంలోని బౌద్ధిక వ్యవస్థల మీదా, పాలసీ రంగాలలోనూ – ‘ఉండాల్సిన కంటే ఎక్కువ మోతాదులో’ పట్టు చిక్కించుకున్న సూడో లౌకిక/ఉదారవాదుల ముఠాలు ఇంకా అక్కడక్కడా మిగిలి ఉన్నాయనీ, వారందరినీ సాంస్కృతిక బౌద్ధిక రంగాలనుంచి తరిమేయాలనీ” అంటున్నాడు రాం మాధవ్. ముసుగులేని ఫాషిస్ట్ మాటలవి. అనాదిగా వింటూ వస్తున్నాం. ఈ రెండో టెర్మ్‌లో, వారు అయిదేళ్ల క్రితం మొదలుపెట్టిన నిజమైన విద్యనూ, విజ్ఞానాన్నీ, ఆలోచననీ, కళనీ అన్నిటికీ తెరదించే పనిని పూర్తి చేస్తారు. విశ్వవిద్యాలయాల మీదా, మేధస్సు మీదా దురాక్రమణ పొంచి ఉంది.
● కొంతమంది, మీ “కళ”నీ, మీ“క్రియాశీలత”నీ వేరు చేసి, విడివిడిగా మీకు ఆపాదిస్తారు. అలాటి విభజనను ఎప్పుడూ నిరాకరిస్తూ – కేవలం రచయిత అనే మాట సరిపోతుందని అంటు వచ్చారు మీరు. రచయిత పరిమితిని నిర్దేశించే – ఈ నిర్బంధం, ప్రపంచంతో సీరియస్‌గా, క్రియాశీలకంగా వ్యవహరించడమనేది – రచయిత పని కాదని చెప్తుంది. ఈ ధోరణి ఇండియాలో బలంగా కనిపిస్తోందా మీకు?
లేదు. నిజానికి యూరప్ అమెరికాలలో ఎక్కువ కనిపించింది నాకు. చూసాను. ఒక రకమైన సంతృప్తితో కూడిన ఉదాసీనత (smug complacency) అది. ఇక అడిగేందుకు ఏమీ ప్రశ్నలు మిగలలేదని వారి నిర్ధారణ. తక్కిన ప్రపంచానికి ఉండతగిన ఉన్నతాశయం అల్లా తమని అనుకరించగలగడమేనని వారి ధృఢ విశ్వాసం. అయితే అది కొద్దికొద్దిగా మారుతోంది. అస్థిరత చోటు చేసుకుంటోంది. మహా భయాలు ఉత్పన్నమౌతున్నాయి. పెద్ద ప్రశ్నలు మళ్లీ అడిగే వేళయ్యింది. మొత్తం ప్రపంచం గిరగిర తిరుగుతూ కిందా మీదా ఔతున్న ఈ సమయంలో కళ, సాహిత్యం – దానిని ప్రతిబింబించక తీరదు.
● భాష, దాని బహుళతలూ, సాధ్యాసాధ్యతలూ, దాని రాజకీయ విపరీతాలూ అన్నిటితోనూ కలిపి – విశాలార్ధంలో తీసుకుంటే – మీ భావనాప్రపంచంలో అది కేంద్రస్థానం ఏర్పరుచుకుంది. దానికి కారణం ఏమిటంటారు? జాతీయవాదులందరూ నినదించే “ఒకే జాతి, ఒకేభాష, ఒకే మతం”—అనే హిందూత్వ సిద్ధాంతానికి అది మీ ప్రతిస్పందనా లేక కేవలం భాష – రచయిత కర్మభూమి కావడం చేతనా?
ఈ బహుళతా, క్లిష్టతా ఈ దేశపు భూమిలో సహజసిద్ధంగా ఉన్నాయి. రచయితగా నేను దానిని చూసి మురుస్తూ ఉంటాను. హిందూ జాతీయవాదుల “ఒకే జాతి, ఒకేభాష, ఒకే మతం” సిద్ధాంతాన్ని వింటే నవ్వొస్తుంది. ఇక్కడ వారి నినాదం – “ హిందీ, హిందూ, హిందుస్తాన్” లో మూడు పదాలూ కూడా నిజానికి పర్షియన్‌వి.
సరే. సీరియస్ విషయాని కొస్తే మాట్లాడే భాషలు 780. అందులోనూ వాటిలో 20 రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషలు. అలాటి ఒక భూభాగంలో ఇది ఎంతటి హింసాత్మక సిద్ధాంతం కాగలదో ఊహించగలరా?
ఇంకా ఇక్కడ – “ఇంగ్లిష్ మాట్లాడే కులీనులు!” అని ఒకరినొకరు(ఇంగ్లిష్) నిందించుకునే ‘ఇంగ్లిష్ మాట్లాడే’ కులీనులు ఉన్నారు.
‘ఇంగ్లిష్ మాట్లాడని’ అగ్రకులాల కులీనులున్నారు. వారి సంగతెలా ఉంటుందంటే – తమ పిల్లలని వారు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకి పంపుతారు. అయితే ఇంగ్లిష్ నేర్చుకుంటేనే తప్ప, బాగుపడే అవకాశాలు లేని పేదవారికి మాత్రం ఆ భాషను నేర్చుకునే హక్కును నిరాకరిస్తారు.
● చివరగా, మీ జీవిత పయనంలో, ఎన్నో మాధ్యమాలలో మిమ్మల్ని మీరు అభివ్యక్తం చేసుకున్నారు. ఫిక్షన్, సినిమా, నాటకం, వార్తల చేరవేత, వ్యాసాలు, ఇంకా నటన, ఆర్కిటెక్చర్ – వీటన్నిటిలో ఏ రూపం, ఏ అమరిక (సెట్టింగ్), ఏ కాలం, ఏ ప్రదేశం – మీ వ్యావృత్తికి అతి సహజమైందని తోచింది?
నేనొక కథకురాలిని. నా ఆలోచనలు కూడా కథల రూపంలోనే ఉంటాయి. కథలే నా స్వగృహం, స్వస్థానం. వాటినే ప్రేమిస్తాను.
ఈ దేశ వనరుల మీద మొట్ట మొదటి అధికారం కేవలం ముస్లిం లకి మాత్రమే ఉంది — మన్మోహన్ సింగ్ .
వోట్ లు పోలరైజ్ అవుతున్నాయి మొర్రో అని మొత్తుకున్నప్పుడు , ఈ మేధావులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని , ఇప్పుడు తీరిగ్గా ….. Sorry if my comment is irrelevant.