చిన్నదొర మంత్రయిండు. విదేశాల్లో చదివి, పెద్ద కంపెనీలో ఉద్యోగం మానేసి ప్రజా సేవకే అంకితం కావాలని ఇక్కడికొచ్చిండు. రాజకీయాల్లో కాకలు తీరిన సీఎం గారి మనుమడు. రాజకీయ వారసత్వం కొడుకుదే అనుకుంటుంటే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ తండ్రిని మించి పోయిండు చిన్న దొర.
‘ఎప్పుడొచ్చామన్నది కాదు… అధికారం ఎవరితో ఉందన్నదే ’పాయింట్ అంటూ మల్లామల్లా చెబుతడా చిన్నదొర. అధికారం ఎట్ల రాబట్టుకోవాల్నో? ఎట్ల నిలబెట్టుకోవాల్నో? ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుండు. తాత దారిల నడుస్తనే తనదైన ముద్ర కోసం తహతహలాడుతుండు.
అధికార పగ్గాలు చేతికి రాంగనె తనదైన ముద్ర వేయాలనే తొందరెక్కువైంది చిన్న దొరకు. ఆ ముద్రతోనే అందరి మెప్పు పొందాలనుకున్నడు. ఆ మెప్పే తన ఎదుగుదలకు సోపానం అయితదనుకుంటున్నడు.
‘ఎట్టా మెప్పు పొందాలా?’ అని ఒకటే రంది.
రోజూ పేపర్లు చదువుతున్నడు. అందరితో మాట్లాడుతున్నడు. ఆ మాటల్లో మెప్పించే పనికి దారి వినడబడతదేమోనని.
ఎన్నో రోజులకు ఓ మంచి వార్త కంటబడ్డది. అది సూడంగనే ఓ ఆలోచన తట్టిందా బుర్రకు. రంది తీరే దారి దొరికిందని మాంచి హుషార్‌గున్నడు.
ఆ వార్తేందంటే?…
ఊళ్లో మొగుళ్లుపెట్టే బాధలు పడలేక, సారా వద్దని ఆడోల్లంతా గోల చేస్తున్నరు. వాళ్లకు ముసలోళ్లు మద్దతిచ్చినరు. కొంపలు ఆగమయితన్నయి. మా ఊరికి సారొద్దని అందరూ బందు పెట్టాలన్నరు. పోరాడి బందు పెట్టినరు. ఇంకేముంది. సారా తాగినా, అమ్మినా ఊరి నుంచి వెలే అన్నరు. చచ్చినట్టు అందరూ సారా మానుకున్నరు. తాగుబోతుల్లేని ఊరంటే ఎట్లుంటది భలేగుంటదది. అందరూ సంతోషంగా ఉన్నరు.
ఆ సంతోషం గురించి పేపర్లో మంచి వార్తొచ్చింది.
ఆ వార్త మంత్రి గారి కంట్లపడ్డది. ఇగ ఆ వార్త సదివినప్పటి సంది ఆయన కాలు ఆగట్లే. ఏదో చేయాల.. ఏదో చేయాలని ఒకటే హడావిడితో ఇంట్ల అటూ ఇటూ తిరుగుతున్నడు.
ఆఫీసుకు పోయిండు. దారిలో అదే రంది. ఎవరి ఫోన్లూ లిఫ్టు చేయట్లేదు. తనకు లిఫ్ట్ ఇచ్చేదేదో చేయాలని ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. ఆఫీసుకు పోంగనే టేబుల్ మీద తెల్లకాగితాలు పెట్టి రకరకాల ప్లాన్లు గీసిండు. కానీ అవి వర్కవుటయ్యేట్లు లేవు. గీకీ గీకి కాగితాలన్నీ అయిపోయినయి.
బెల్ కొట్టిండు.చప్రాసీ పోశెయ్య వచ్చిండు.
”అరె పోశిగా నాలుగు తెల్లకాగితాలు పట్టుకరారా…” అన్నడు.
”కాగితాలు లేవు” సారన్నడు. ”వన్ సైడ్ పేపర్లున్నయి ఓకేనా..”? అంటూ గుర్తు చేసిండు. ”సర్లే ఏదో ఒకటి పట్రా” అన్నడు మంత్రి.
”వన్ సైడ్ పేపర్లున్నయి ఓకేనా..”? అంటూ గుర్తు చేసిండు. ”సర్లే ఏదో ఒకటి పట్రా” అన్నడు మంత్రి.
ఆ వన్ సైడ్ కాగితాలు చేతికందంగనే జారి కిందపడ్డయి. తీస్తుంటే పాత వార్తలు కనిపిస్తున్నయి. కొత్తగా మంత్రి అయినప్పుడు ఓ పేద పిల్లకు రోగం వస్తే ఆర్థిక సాయం చేసిన ఫొటో చిన్న దొర కంట్ల పడ్డది. చెక్కు ఇస్తూ ఉన్న ఫొటో.. దాని కింద మంత్రికి నెటిజన్ల ప్రశంసల స్క్రీన్ షాట్లు… మంత్రిగారు ఫ్లాష్ బ్యాక్‌లోకి పోయిండు. ఆ వార్త వచ్చిన రోజు మస్తు ఖుషీ అయిండుగా గదంతా మల్లా గుర్తొచ్చింది. అట్లనే మల్లా చేయాలని రంది పడుతున్నడు.
ఆలోచించి… ఆలోచించి మాపటికి ఓ మంచి ఆలోచనకొచ్చిండు.
సారా వద్దన్న ఆదర్శ గ్రామానికి సపోర్ట్ చేయాలనుకున్నడు. వాళ్లను ఉత్తిగా అభినందిస్తే సరిపోదనుకున్నడు. మంత్రి తాహతుకు తగ్గ ప్రొత్సాహం కూడా ఇయ్యాలె అనుకున్నడు. రాజు తలచుకుంటే ఏదైనా సాధ్యమే. కానీ రాజుకే సాధ్యమయ్యే పనే జేయాలనుకున్నడు.
మల్లా ఆలోచన.
పొద్దుగూకే సరికి ఓ ఆలోచన వచ్చింది. సెక్రట్రీకి ఫోన్ కొట్టిండు. ఠంచనుగా రమ్మని ఆదేశించిండు.
మంత్రి గారి పిలుపు అందిందో లేదో వాయు వేగంతో సెక్రెట్రీ రెక్కలు కట్టకుని మంత్రి పేషీలో వాలిపోయిండు. ఏం జరిగిందో? ఏమంటరో? ఏందో?’ అని టెన్షన్‌తో వచ్చిన సెక్రట్రీకి మంత్రిగారి మందహాసం చూసి టెన్షన్ తగ్గింది.
సార్ పిలిచిన్రు… అనేలోపే మంత్రిగారు మాటలు షురూ చేసిండు.
‘సారా తాగొద్దు.. సారా అమ్మొద్దు వార్త’ చూసినవా. ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలె. ఆ ఊరి జనం చేసిన మంచి పనికి అభినందనగా ఓ మంచి చేయాలె. ఏం చేస్తే బాగుంటదని ఆలోచించిన. ఇగో ఈ ఆలోచన వచ్చింది? అంటూ కాగితం మీద గీసిన ప్లాన్ చూపిండు మంత్రి.
అందులో ఏముందంటే? ఊళ్లో చిన్న బడి ఉంటే దానిని పెద్దబడిగా మార్చాలె.
ఇప్పటికే పెద్ద బడి ఉంటే ఇంకొంతమంది పంతుళ్లని పంపాలె. ప్రహరీ కట్టిచాలె. కొత్త బిల్డింగులు, లైబ్రరీ ఇప్పించాలె.
ఆరోగ్యం కోరుకునే ఊరి జనం కోసం ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంట్టించాలె అన్నడు. రోడ్డు వేయించాలె. పంచాయితీ కార్యాలయానికి సున్నం కొట్టించాలె.. సెక్రెట్రీ చదువుతూ పోతుంటే మంత్రి చెబుతూ పోతుండు. మంత్రి గారి మాటలకు భలే భలే అంటూనే తలూపుతూ కంటి చూపును అక్షరాలపై సారిస్తున్నడు సెక్రటరీ.
కాసేపటికి…
”సార్ ఈ పని చేస్తే పత్రికల్లో పతాక వార్త సార్. మీడియాలో రోజంతా ఇదే ముచ్చటుంటది. సోషల్ మీడియాలో వైరల్ అవుతది. ఆ రాష్ట్ర మంత్రిగారు సూడు ఎంత మంచి పని జేసిండోని దేశమంతా చెప్పుకుంటది. మంచి ఆలోచన జేసిండ్రు. మొదలుబెట్టున్రి” అన్నడు సెక్రటరీ.
వెంటనే పీఏని పలిచిండు.
ఫోటో షాప్‌లో అభినందనలు, ఊరి ఫొటో, న్యూస్ క్లిప్పింగ్, నా ఫొటోతో ఓ మంచి పోస్టర్ డిజైన్ చేయమన్నడు.
సెక్రటరీ, మంత్రి టీ తాగుతూ కాసేపు ముచ్చట పెట్టుకున్నారో లేదో… పోస్టర్ రెడీ అయింది. వెంటనే ట్వీట్ చేసిండు మంత్రి. ట్వీట్ అయిన క్షణంలోనే లైకులు, షేర్లు. ఫేస్‌బుక్‌లో మంచి మంచి కామెంట్లు..! ఫేస్‌బుక్ నోటిఫికేషన్లు వస్తుంటే అబ్బో మంత్రి గారికి చక్కిలిగింతలు పెట్టినట్టే ఉంది .
సారు పోస్ట్ సూడంగనే మంత్రులు అబ్బో సూడుర్రి కాబోయే సీఎం సారు చేసిన ఘన కార్యమంటూ షేర్లు కొట్టినరు. వాట్సాప్‌లో డీపీలు పెట్టినరు. ఎవలెవలు తన పోస్టుని డీపీగా పెట్టుకున్నరోనని వాట్సాప్ కాంటాక్ట్స్‌ని స్క్కోల్ చేస్తుండు చిన్న సారు.
కాబోయే సీఎం కామెంట్లు. పాలాభిషేకాలు, కవితలు, మీమ్స్ అబ్బో సోషల్ మీడియాలో మంత్రిగారి పేరు మోగిపోతోంది.
***
తెల్లారింది. సోషల్ మీడియాలో హడావిడి నిన్ననే చూసిన. ఈ రోజు పేపర్లలో హడావిడి ఏందో చూడాలని ఆత్రంగా పండ్లు తోముకోకుండనే మంత్రిగారి బయటికొచ్చిండు. పేపర్లన్నింట్లో ఆ ఊరు గురించే. సారు స్పందిచారని ఒక పేపరు.
‘కొత్తపల్లికి మంచి రోజులు’ అని ఇంకో పేపరు.
టైటిల్ ఏదైనా వార్తలో హైలెట్ సారే. సారు సంతోషానికి అవధుల్లేవు. నెక్లస్ రోడ్‌లో స్పెషల్ డేస్‌కి వదిలిన గాలి బుగ్గలా సారు గాల్లో తేలిపోతూ పేపర్లన్నీ తిరగేస్తుంటే పంటి కింద రాయిలా ఓ సబ్ హెడ్డింగ్ కంటవడ్డది. ‘మంత్రులంతా చిన్న సారు సాయం’ గురించే మాట్లాడుతుంటే ‘పెద్దసారు స్పందనేది?’ అంటూ రాసుందందులో. గిదేంది పెద్దసారు మెచ్చుకోలేదా? అనుకుంటనే స్మార్ట్‌ఫోన్ తీసి, ఫేస్‌బుక్‌లో సీఎంఓ అకౌంట్‌ని చూసిండు. చిన్నసారు ముచ్చటే లేదు. రాష్ట్రంలో ఇంత చర్చ నడుస్తున్నా తెలియనట్లే ఉన్నరేందనుకున్నడు. ఏకంగా పెద్దసారుకు ఫోన్ కొట్టిండు.
పీఏ ఫోన్ ఎత్తిండు. సార్ గరంగరంగా ఉన్నడని చెప్పిండు. ఓ సారి సార్‌కి ఫోన్ ఇయ్యమన్నడు. సారే నిన్ను పొద్దుగాలే ఓ పాలి రమ్మనడు. మీకే ఫోన్ చేద్దామనుకుంటంటే మీరే చేసిన్రు. పదింటి తర్వాత ఇంటికి రండ్రి. అంటూ పీఏ ఫోన్ పెట్టేసిండు.
చిన్నసారు ఆగమేఘాల మీద సీఏం సారు ఇంటికిపోయిండు.
సీఎం సారు కోపంగున్నడు. పోంగనే కూర్చోమనలే. బళ్లు బాగుచేస్తే నీకే మొస్తది. పేరొస్తది. ఓట్లొస్తయి. ఆ ఓట్లు సారా పోసి కూడా తెచ్చుకోవచ్చు. సారా బందుపెట్టి తెచ్చుకోవడం కన్నా సారాతోనే ఎక్కవ ఓట్లు తెచ్చుకోవచ్చన్నడు.
జనం మంచి పని చేసినరు. మంచిపనికి మన సాయం ఉండాలెగా అన్నడు అనుభవంలేని చిన్న సారు.
పెద్ద సారుకు అడ్డం చెప్పకూడదంటూ సీఎం పీఏ సైగ చేస్తుండు. ఆ సైగతో చిన్న సారు ఆగిపోయిండు.
‘జనానికి మనం సాయం జేయాలె. కానీ ఆ సాయం మనకు సాయపడాలె అన్నడు పెద్దసారు. ఏమనుకుంటున్నవ్? సారా తాగితే ఆగమయ్యేది ఎవలు? తాగేటోల్లు. తెలిసి తాగెటోళ్లని ఆగంగానీ. నీకెందుకు? బాధ పడేటోళ్లు బందు పెట్టమంటరు. మందు బందు పెడితే మనం బాధపడుతం. నీకీ రాజకీయాలు తెల్వది. మందు బందు పెడితే మనల్ని బొంద పెడుతరు. జరంత చరిత్ర సదవాలె. మందంటే మత్తనే నీకు తెలుసు. ‘కల్లు మానండోయ్.. కళ్లు తెరవండోయ్’ అని గాంధీ సూక్తులు వల్లిస్తే గెలిచే రోజులు కావు. గాడ్సేలా ఖతం జేస్త పోవాలె. గదే రాజకీయం. మందు కోట్ల బిజినెస్. ఆ బిజినెస్ లేకపోతే పార్టీకి చందాలెట్లొస్తయ్. అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పంచే మందంతా ఆ కపెనీలోళ్లు ఫ్రీగా ఇచ్చేది బందు పెట్టనీకి కాదు. లిక్కర్ని పారించమని. రాజ్య పాలనంటే వ్యాపారి సక్కగుండేట్టు ఉండాలె. ఇప్పుడు లిక్కరు వ్యాపారం పెరిగేట్టే సూడాలె. సంక్షేమానికి ట్యాక్సులు. మన సోకులకు చందాలు కావాలంటే గిట్లనే నడవాలె. ప్రజలే దేవుళ్లని అంటం. అనాలె. చేసేది చేయాలె. గీ హామీలు మరవాలంటే ఏదో ఒకటి జేయాలె. ఓట్లప్పుడు మన తప్పులు మంది మర్చిపోయేట్టు జేయాలే. ఈ రెంటికీ ఒకటే మందు. అట్లనే మన తప్పులు తెల్వకుంట ఉంటయ్. ఈ మందు లేనిదే రాజకీయం లేదు. రాజకీయాల్ని కలుషితం చేసిన మందును తీసేయడమంటే మనల్ని మనం చంపుకన్నట్లే. నువ్వు చేసిన తప్పుతో పార్టీకి పెద్ద చిక్కొచ్చిందని పెద్ద సారు గుక్కతిప్పుకోకుండ అంటుంటే చిన్నసారు నోరు విప్పకుండ వింటుండు. సర్లే ఏం చేస్తాం కూర్చో అంటూ సైగ చేసిండు పెద్దసారు.
కాసేపాగి.. అయిందేదో అయింది. ఇగనుంచి ఏది చేసినా చెప్పి చెయ్ అంటూ చిన్నసారు దగ్గరకు వచ్చిండు పెద్దసారు. ఇంకా ఏమంటోడోనని బిక్కముఖమేసిండు చిన్న సారు. భుజం మీద చేయి వేసి ‘పాలనంటే ట్వీట్ చేసినంత ఈజీ కాదు. ఏమార్చడ తెలిసినోడే లీడర్. ఇది నీకో మంచి అవకాశం. నీ సామర్థ్యాన్ని పరీక్షించుకో’ అంటూ పెద్దసారు అక్కడి నుంచి వెళ్లిపోయిండు. చిన్నసారుకి ఏమీ అర్థం కాలేదు.
సారు కారిడార్లో నడుచుకుంటూ పోతున్నడు. కొంత దూరం పోయిన తర్వాత ఓ గది తలుపు తీసి లోపలికి పోయిండు. చిన్న సారు అటే చూస్తూ ఉన్నడు. ఓ అర నిమిషం తర్వాత అదే గది నుంచి ఇంకో మనిషెవరో వస్తున్నడు. చిన్న సారు ఆయన్నే చూస్తున్నడు. ఆయనెవరో పోల్చుకోలేకపోతున్నడు. ఆయన నడిచొస్తుంటే అట్లనే చూస్తూ ఉన్నడు. దగ్గరికొస్తుంటే ఆ ముఖాన్ని పోల్చుకున్నడు. సెక్రటేరియట్ పేషీల్లో ఎప్పడూ కనిపించే మనిషే. ఏదో ఒక కన్సల్టెన్సీ హెడ్. సర్వేలు. ప్రమోషన్లు, ఈవెంట్ల గురించి ప్రభుత్వ పెద్దలకు సలహాలిచ్చే మనిషి. పెద్దగా పరిచయం లేదు. కానీ చిన్నసారుకి ఆయన ఎరుకే. నడుచుకుంటూ వచ్చిన ఆ కన్సల్టెంట్ చిన్నసారు దగ్గరికి రాంగనే ఆగిపోయిండు.
కంగ్రాట్స్ అంటూ చిన్న సారు’కి చేయి అందించిండు. ఏమీ అర్థం కాని చిన్నసారు కదలకుండా ఉండిపోయిండు. కంగ్రాట్స్ సర్ అంటూ నవ్వుతూ చేయిని ఇంకొంచెం ముందుకు సాచిండు.
అయోమయంలో ఉన్న చిన్నసారు అయిష్టంగానే షేక్ హ్యాండ్ ఇచ్చిండు. మీకు అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకి వచ్చింది. పది రోజులే ఉంది. మీరు రేపే పోవాలి. ముందే ఎందుకంటే అక్కడ ఉండే ఎన్ఆర్ఐలను కలవాలి. అలాగే కొన్ని కంపెనీల యజనమానులతో మాట్లాడాలి. ట్వీట్లలో మనవాళ్లే ఉండాలి. కార్పొరేట్స్‌కి ఇవి ఇష్టం ఉండదు’ మీకు అనుభవం లేదని చెబుతున్న. కంపెనీలు చెప్పిన మాటలు ఏవీ ఎవరితో షేర్ చేసుకోకండి. వాటిని అందంగా మలచి మీడియాలోవచ్చేలా మేం ఏర్పాట్లు చేస్తాంలే అన్నడా కన్సల్టెంట్.
ఆ కాన్ఫరెన్స్ కాగితాలు, టూర్ షెడ్యూల్ చేతిలో పెట్టి చకచకా వెళ్లిపోయిండు. ఏమీ అర్థంకాకుండ కదలకుండ ఉండిపోయిండు చిన్నసారు. ఈ తతంగమంతా చాలా సేపటి నుంచి చూస్తున్న ఓ చిన్న ఉద్యోగి దగ్గరికొచ్చిండు. ‘ఇంకా అర్థం కాలేదా సార్’ అంటూనే.. ఏమీ లేదు. ఆ ఊరికి మీరు ప్రకటించిన ఆఫర్లు జనం మర్చిపోవాలంటే మీరు ఇక్కడి నుంచి వెంటనే పోవాలె. పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతరు. ఆ ఊరి వాళ్లు తప్ప. ఆ ఒక్క ఊరు ఏమనుకుంటే ఏందిలే అన్నడు. మరి అపోజిషన్ అన్నడు చిన్నసారు. వాళ్లు అడగర్లే సారు. అంటూ అభమిస్తున్నట్లుగా అన్నడా ఉద్యోగి. ‘అనకుండా ఎట్లుంటరు?’ అన్నడు చిన్నసారు. వాళ్లు అడగాలని అనుకున్నా ఆగుతది. మీరు అమెరికా పోవాలనుకున్నరా? లే! ఇదీ గట్లనే అయితది. మీరేమీ ఆలోచించకున్రి’ అంటూ చిన్న ఉద్యోగమే అయినా చాలా అనుభవంతో చెప్పిండా ఉద్యోగి. చిన్నసారుకి సినిమా అర్థమయింది.
సప్పుడు జేయకుండా ఇంటికి చేరిన చిన్న సారు సూట్ కేస్ సర్దిండు. విమానం ఎక్కిండు. ఇంగ్లండ్‌లో దిగిండు.
తెల్లారినంక…
ఈ పేపర్లు తిరగేస్తే ‘అంతర్జాతీయ సదసుకి చిన్న సారుకి ఆహ్వానం’ అని తాటికాయంత అక్షరాలతో హెడ్డింగులు. ‘అరుదైన గౌవరం’ అంటూ సబ్ హెడ్డింగులతో మల్లా పేపర్లలో మస్త్ ప్రమోషన్. గవన్నీ చూసి సిత్రంగా ఉందే రాజకీయం అనుకున్నడు. ఆ పేపర్లు సదువుతుంటెనే ఫోన్ మోగింది. హలో అన్నడు. అటునుంచి ‘సార్’ అంటూ సీఎం ఆఫీసు నుంచి ఫోన్ ఓ ఉద్యోగి. ‘ఏమిటో చెప్పండి?’ అని చిన్నసారు అనంగనే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది సార్. ఓ ముస్లిం అమ్మాయి పేద కుటుంబంలో పుట్టింది. గవర్నమెంట్ స్కూల్‌లో చదివి ఐఐటీలో సీటు సంపాదించింది. ఆమెను మీరు అభినందించారు కూడా. అప్పుడు యాబై వేలు సాయం చేశారు. అన్నడు.
అవును గుర్తుంది ఇప్పుడెందుకా ముచ్చట?
ఆ అమ్మాయికి ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది సార్. ఆ డిసీజ్ తగ్గాలంటే ఖరీదైన వైద్యం చేయాలె. సర్జరీ, మెడిసిన్స్‌కి ఓ ఆరు లక్షలు ఖర్చవుతాయట. అంత డబ్బులేక ఆమెకు సాయం చేయమని ఎవరో వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అది సర్క్యులేట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది మీకు ట్యాగ్ చేశారు. ఇప్పుడే పూర్తి సాయం ప్రకటించమని పెద్ద సారు మీతో చెప్పమన్నారంటూనే సీఎం ఆజ్ఞను గడగడా చదివేసిండు.
‘ఓకే అర్థమయింది. చేస్తాలే’ అన్నడు చిన్న సారు.
‘సార్ ఒక్కమాట..’
‘ఏమిటది?’
‘దవాఖానాలు కట్టిస్తం. ప్రభుత్వ దవాఖానాలను ఇలాంటి రోగాలకు వైద్యం చేసే స్థాయికి తీసుకుపోతం అని ఎక్కడా అనకండి.’ అంటూ షరతు వినిపించాడు.
‘ఇంకానా? ఇంకెప్పుడూ అలాంటి మాటలు అననులే’ అంటూ ఫోన్ పెట్టేసిండు చిన్నసారు. క్షణాల్లో ట్వీట్ చేసిండు. ఆర్థిక సాయం వార్త న్యూస్ పోర్టల్స్‌లో ప్రధాన వార్తగా ప్రత్యక్షమయింది. సారుకి పాలాభిషేకాలు. నెటిజన్ల అభినందనలు, పొగడ్తలు. ఇవన్నీ చూసి సారు భలేగా ఖుషీ అయిండు. ఖుషీ ఖుషీగా అమెరికా యాత్ర యాత్ర ముగించుకుని రాష్ట్రానికి వచ్చిండు. రాంగనే ఘన స్వాగతం. ప్లెక్సీలు. పూల దండలు. ఆహా ఎంత గొప్ప పాలకుడో అంటూ పత్రికల్లో ప్రకటనలు. ఊరేగింపుగా వచ్చిన మంత్రి గారు ఇంట్లో అడగుపెట్టారు. ఘనస్వాగతం పలికిన వాళ్లంతా ఖర్చులు, కమీషన్లు అడుగుతుంటే ఎంతెంత ఇచ్చుకోవాలో అర్థం కాలేదు. విమానాశ్రయం నుంచి బయటికి రాగానే జిందాబాద్ చెప్పిన అభిమానుల్లో అంత మంది కూలిజనమున్నరా? అనుకున్నడు. కూలి కాదు దారి ఖర్చులంటూ అందమైన పేరు పెట్టుకుని బాజాప్తా పైసలు వసూలు చేసినరు. అప్పటి దంక గర్వంగా ఊరేగొచ్చిన సారు ముఖం చిన్నబోయింది. ఎవరి డబ్బులు వాళ్లకు ముట్టజెబుతుంటే వాళ్లు పోతున్నరు. అందరూ పోయాక ఇంకొకలు మిగిలినరు.
‘మీకెంత ఇయ్యాలె’ అని చిన్నసారు అనంగనే ఆ మనిషి నవ్విండు.
‘నేను కూలీని కాదు. యజమాని’ అన్నడు నవ్వుతూ. అతనెవరో కాదు సీఎంఓ ఆఫీసులో అమెరికా టూర్ షెడ్యూల్ చేతికిచ్చిన కన్సల్టెంట్. నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చిండు కన్సల్టెంట్. నవ్వలేక.. కాదనలేక చేయి అందించిండు చిన్న సారు.
కన్సల్టెంట్ వెళ్లిపోయిండు. అతను అన్న చివరి మాట చిన్న సారు చిన్న సారు మెదడుని తొలుస్తున్నది. చెవిలో అదే మాట మల్లా మల్లా వినబడుతున్నది. ‘నేను కూలి కాదు. యజమాని.’ అన్నమాటే ఆయనకు గుర్తుకొస్తాంది.
‘అతనెవరికి యజమాని? కంపెనీకా? నాకా? అయితే నేను కూలీనా?’ అనుకుంటూ తలదించుకున్నడు. ఛీఛీ… ర్యాలీకి కూలీ డబ్బులు అడిగిన కార్యకర్తల్ని చూసి కూలి నా కొడుకులు… ఇసుమంత అభిమానం లేదని తిట్టుకున్న. నేను చేసేది ఏంది? కూలేగా? థూ.’ అనుకుంటూ హాల్లోంచి ఇంట్లోకి నడుచుకుంటూ పోయిండు.