ఆస్కార్ అవార్డ్స్ ని ప్రధానం చేసే సందర్భంలో యీ సారి రెడ్ కార్పెట్ స్టయిల్ స్టేట్మెంట్ ఆసక్తిని, అవార్డ్స్ అందుకొన్న సినిమాల కథాంశం, నటీనటుల యెఫెక్ట్స్, సంగీతమూ, విశ్లేషణలని మించి ఆ వేదిక మీద విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ మీద క్రిస్ రాక్ పై వేసిన జోక్ కి రియాక్షన్ గా విల్ స్మిత్ క్రిస్ రాక్ పై చెంపదెబ్బ వేసిన సంఘటన మీద బోలెడంత చర్చ జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలు వచ్చాయి. బాడీ షేమింగ్ అనే అంశం తిరిగి విస్తృతంగా చర్చకి వచ్చింది. సెలబ్రీటీలు బాడీ షేమింగ్ ని యెదుర్కోవటం మొదటి సారి కాదు. రోజువారి జీవితంలో యీ బాడీ షేమింగ్ కి లోనైనవారెందరో. హాస్యంగా భావిస్తూ యెదుటి వారిని అవమాన పరుస్తూ అదేదో సరదా వ్యవహారంలా నవ్వుకునే వారు కోకొల్లలుగా వున్న ప్రపంచంలో బాడీ షేమింగ్ అనేది ప్రతి వొక్కరూ తమ జీవితాల్లో యేదోవొక సందర్భంలో పదేపదే యెదుర్కొనే భయంకరమైన అవమానం. యింతకీ బాడీ షేమింగ్ అంటే యేమిటి?
శరీరాకృతి, రంగు, పొడవు, కన్ను ముక్కు, జుట్టు యిలా బయటకి కనిపించే శరీరం యెలా వుండాలో యెలా వుంటే బాగుంటుందో యేది అందమో యేది కాదో నిర్ణయించిన పట్టికలు ప్రామాణాలు కొలతలకి అత్యంత దగ్గరగా వుండని వ్యక్తులపై జోక్స్ వేస్తూ, విమర్శిస్తూ, చిన్న చూపు చూస్తూ ఆనందాన్ని పొందేవారెందరో. చాల మందికి తాము చేస్తోంది వొక అమానవీయమైన చర్యగా కూడా అనిపించదు. చాల మందికి అసలు ఆ యెరుకా వుండదు.
బాడీ షేమింగ్ కి పాలుపడే వాళ్ళు అధిక బరువు వున్న వ్యక్తులను వారి బరువుని, వారి ఆహారపు అలవాట్లను విమర్శిస్తూ, వేధిస్తూ వారు తమను తాము చూసుకుంటూ సిగ్గుపడేట్టు మాటాడటం. అలాగే శరీరపు రంగుని, శరీరపు ఆకృతిని, కన్నుముక్కు తీరుతెన్నులను విమర్శించటం. జుట్టుపై తోటకూర కట్ట అనో, కొత్తిమీర కట్టా అనో, వంకీల జుట్టు వున్నవాళ్ళ జుట్టుపై జోక్స్ వేస్తుంటారు. మానవశరీరాకృతికి కొలతలు నిర్ణయించటంలో వున్న రాజకీయాలని యెప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే వున్నా నిత్యం వ్యక్తులు బాడీ షేమింగ్ కి లోనవుతూనే వున్నారు.
యీ బాడీ షేమింగ్ అనేది యింటాబయటా యెదుర్కొనే అవమానం. చాల యిళ్ళల్లో పెద్దవాళ్ళు మేనిచాయ మీద పిల్లల్ని నల్లదానా అనో, బర్రిని తోమినట్టు తోమాలి నిన్ను అనో జోక్స్ వేస్తుంటారు. యీ విధమైన మాటలు పిల్లల మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. యీ గాయపు మచ్చలు అదృశ్యంగా పిల్లల వ్యక్తిత్వాన్ని పలువిధాల సంతరించుకునేలా చేస్తాయి. పిల్లలు పెద్దవుతోన్నప్పుడు తమని తాము వ్యక్తపరుచుకునేటప్పుడు యీ ధోరణిని ప్రశ్నిస్తారు. కొందరు తమలో తామే భగ్గుమంటూ చుట్టూ వారిమీద విరుచుకుపడుతుంటారు. కొందరు ఆత్మనూన్యతలోకి జారుకుంటారు. యెప్పుడో తాము వాడిన పొరపాటు మాటల్ని గుర్తించి పెద్దలు నాలిక కొరుక్కుంటూ కన్ ఫెషన్ ప్రకటించినా అప్పటికే పిల్లల మనస్సుల్లో యీ మాటలు ముళ్ళులా గుచ్చుకొంటూనే వుంటాయి. వొక వ్యక్తి ఆత్మగౌరవాన్ని యీ విమర్శలు ప్రభావితం చేస్తాయనటంలో యెటువంటి సందేహం లేదు.
అధిక బరువు వున్న వ్యక్తులు తమ బరువు లేదా ఆహారపు అలవాట్లను చూసి సిగ్గుపడేలా మాటాడితే వారు ఆరోగ్యంగా వుండేందుకు ప్రయత్నిస్తారని కొందరు బలంగా నమ్ముతారు. అటువంటి వారి మాటలతో కొంతమంది తాము బరువుని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల విషయంలో స్ప్లిట్ సెకనులో బరువుని తగ్గిస్తామని నమ్మబలికే వారి ప్రకటనలని నమ్ముతూ చాల పొరపాటు నిర్ణయాలని తీసుకుంటుంటారు.
బాడీ-షేమింగ్ వల్ల వుత్సాహం తగ్గడం, డిప్రెషన్, తినే రుగ్మతలు, ఆత్మగౌరవం తగ్గడం, వొత్తిడి, బరువు పెరగడం యిలా అనేక మానసిక సమస్యలకి లోనవుతున్నారని అనేక సర్వేలు చెపుతున్నాయి. అధిక బరువు వున్న వ్యక్తులు అనేక పదార్ధాలు తినడం మానేయాలని, ప్రతి రోజు వ్యాయామం చేయాలని బరువు తగ్గకపోతే అందంగా కనిపించరని వారికి గుర్తు చేయని రోజుండదు. యిలాంటివి అధికబరువున్న వ్యక్తులు పదేపదే వినటం మానసిక ఆరోగ్యాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. కొన్ని రోజులు తినకూడదనుకుంటూ అన్ సైంటిఫిక్ డైట్ చేస్తారు. సమతుల్య ఆహారం లేకపోయేసరికి కొద్దిమందిలో ప్రతికూల ఆలోచనలన్నీ చుట్టుముట్టాయి. ఆతరువాత యేదైనా తిన్నందుకు అపరాధభావంలో కుంగిపోయే సందర్భాల్లోకి జారుకుంటారు. ఆరోగ్యంగా వుండటానికి శరీరపు బరువు అదుపులో వుంచుకోవటం ముఖ్యమైన విషయమని అందరికీ తెలిసిందే. బరువు విషయాన్ని యెదుటివారి ఆరోగ్యం మీద శ్రద్ధతో చెప్పినప్పుడు ఆ గొంతులో కన్సర్న్ వుంటుంది. కన్సర్న్ స్వరానికి యెగతాళి గొంతుకీ తేడా అందరికి అర్ధమవుతుంది.
దాదాపుగా ప్రతి వొక్కరూ తమ జీవితంలో యీ బాడీ-షేమింగ్ ని యెదుర్కొంటారు. సెలబ్రిటీలు యెదుర్కొన్నప్పుడు యీ విషయాన్ని పబ్లిక్ గా మాటాడుతుంటారు. చర్చ జరుగుతుంది. యీ బాడీషేమింగ్ భుజాలపై వో బరువుగా వున్నప్పుడు వ్యక్తుల మానసిన పరిస్థితి దయనీయంగా మారిపోకుండా వుండాలంటే సెల్ఫ్ యిమేజ్ ని పెంచుకోడానికి ముందుగా యెవరికి వారు తమ శరీరాన్ని ప్రేమించడం నేర్చుకోవటం చాల ముఖ్యం. వ్యక్తులలో ఆత్మవిశ్వాసంని పెంపొందించే దిశగా పనిచేయ్యాల్సిన అవసరం వుంది.
ఎమ్మా స్టోన్ “మనం వొకరికొకరు దయగా వుండాలంటే మన పట్ల మనం దయగా వుండటమే. యితర వ్యక్తులను అవమానించడం మానేయడం, చాలా లావుగా, చాలా సన్నగా, చాలా పొట్టిగా, చాలా పొడవుగా, చాలా యేదైనా. సరే మనమందరం వొకే తీరున వుండటం సాధ్యం కాదు. యిది జీవితం, మన శరీరాలు మారుతాయి, మన మనస్సులు మారుతాయి, మన హృదయాలు మారుతాయి.” అంటారామె.
ముఖ్యంగా అమ్మాయిలు యీ బాడీ షేమింగ్ కి తరచూ లోనవుతుంటారు. ప్రతి వొక్కరికీ శరీర సమస్యలు వుంటాయి. అమ్మాయిలుగా పొందలేని శరీరపు అంచనాల్ని వారి ముందు నిలబెడతారు. నిర్దేశించే వారి అంచనాల్ని యెప్పటికీ పొందలేము. యీ అవాస్తవ అంచనాలను పక్కకు తోసి మనం ఆరోగ్యంగా బలంగా కనిపించడం ముఖ్యమనే విషయాన్ని పదేపదే చెప్పటం అవసరం. అయితే యీ చెప్పటానికి ముందు తల్లితండ్రులకి, పిల్లలని పెంచే వాళ్ళకి, టీచర్స్ కి యిలా పిల్లల పెంపకంలో వున్నవారికి పేరెంటింగ్ లో యీ విషయం మీద సరైన అవగాహనని కలిగించాలి.
అలాగే కాస్మోటిక్స్, బాడీ ప్రోడెక్ట్స్ మొదలైన వాణిజ్యప్రకటనల్లో సమన్వయము యెంతో అవసరం. వొకప్పుడు శరీరపు రంగు యెలా వుంటే పెళ్ళి అవుతుందో చెప్పే చోట యిప్పుడు శరీరపు రంగుకి బట్టల మిలమిలకీ యింటర్వ్యూలకి వుద్యోగాలకి ముడిపెట్టి ప్రకటనలు రావటం చూస్తున్నాము. మనకి మనం శుబ్రంగా కనిపించటం, అందంగా అనిపించటం కోసం మనకి తోచినవి అందుబాటులో వున్నవి చెయ్యటంలో చిన్నిదో పెద్దదో సరదాగా అనిపించటం, ఆసక్తి వుండటంలో సంతోషమెయ్యటం కొత్తగా వస్తోన్న స్టయిల్స్ ని ఫాలో కావటం వుత్సాహంగా అనిపించటం యివన్నీ జీవితోత్సాహాన్నిస్తాయి. నిర్వచించిన అందంలో యిమడనందుకు జోక్స్ వేస్తే మాత్రం అందంకి యిచ్చిన నిర్వచనాన్ని ప్రశ్నించాల్సిందే. కొలతల్లో అందాన్ని అందుకోవాలనే పందెం లేదా ఛాలెంజ్ యెవరి ముందుకు వచ్చినా అది గెలవలేని యుద్ధం. అందాన్ని నిర్వచనంలో కుదించాలనుకోవటమే మార్కెట్ రాజకీయం.
“నేను యెలా వున్నాను అని నేను పట్టించుకోను, యెక్కడ వున్న స్త్రీలు తాము కనిపించే తీరుతో సంతోషంగా వుండాలని కోరుకుంటాను. యెలాంటి మూస పద్ధతులకు ప్రయత్నించకుండా సంతోషంగా ఆశాజనకంగా ఆరోగ్యంగా వుండండి .” రెబెల్ విల్సన్ అన్నట్టు ఆరోగ్యంగా వుండటం కోసం సమయాన్ని వెచ్చిద్దాం.
అసలు అంతా వొకే లా వుంటే యేమి బాగుంటుంది. బోరింగ్ కదా. డిఫరెంట్గా కనిపించడం పట్ల అవగాహనని పెంచుకోవటమూ ముఖ్యము. భిన్నంగా కనిపించటం పట్ల “ప్రతి యితర అమ్మాయిలా నేను కనిపించను కాబట్టి, దానికి వోకే అనుకోడానికి కొంత సమయం పడుతుంది. విభిన్నంగా వుండాలి. భిన్నమైనది బాగుందనిపిస్తుంది నాకు ” – అంటారు సెరెనా విలియమ్స్.
బాహ్యరూపం గురించి మాటాడుతున్నప్పుడు బయటకి కనిపించని విషయాలు తెలియక యెదుటివారు చేసే కామెంట్స్ వొక్కోసారి వ్యక్తుల్ని యెలా బాధిస్తాయంటే “నా తొడల మీద గడ్డలు వుంటే యెవరు పట్టించుకుంటారు? వాటి వలన వొక్కోసారి యెగుడుదిగుడుగా కూర్చోవల్సి వస్తుంది. కొవ్వు, కండరాలు. చర్మంతో చేసిన మానవ కాళ్ళను కలిగి వున్నందుకు నేను దోషిని – అని క్రిస్టెన్ బెల్ అన్నప్పుడు యెదుటివారి శరీరం పట్ల యెంత గౌరవంతో వుండాలో మరింత లోతుగా యెవరికైనా అర్ధమవుతుంది.
సాధ్యమైనంత వరకు శరీరం గురించి యెలాంటి నిర్ణయాలనైన తీసుకోగలగటం యెవరికి వారు తమతమ చేతుల్లోన్నే వుంచుకోవటం చాల ముఖ్యం. జీవితంలో యెవరికి వారు తమ శరీరం నేను దానితో యేమి చేయాలో నిర్ణయించుకునే హక్కుని జారవిడుచుకోకుండా చూసుకోవాలి.
చర్మం గురించి పదేపదే ఆలోచిస్తూ చింతిస్తూ యెక్కువ సమయాన్ని మేని లావణ్యం కోసం వృధా చేసుకోవటంలో వ్యక్తులుగా చెయ్యాలనుకొన్న పనులు చెయ్యలేక మిగిలిన నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోకుండా మొత్తం వంట గదిలో వున్నవి బయట మెడికల్ షాప్స్ లో వున్నవి మొత్తం చర్మానికి రాయటంలోనే సమయమంతా గడిపేస్తుంటే అనుకున్నశరీరపు రంగు రావటం యేమో కానీ వ్యక్తుల్లో ఆలోచన, శక్తి, పనిలో సృజనాత్మక మొదలైనవన్నీ బూజు పట్టిపోతాయి. డిఫైన్ చేసిన పరిపూర్ణ శరీరాన్ని కలిగి వుండాలనే ప్రయత్నంలో మానసిక ఆరోగ్యాన్ని త్యాగం చేయ్యకుండా మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టటం వ్యక్తుల యెదుగుదలకి చాల ముఖ్యం.
యీ బాడీ షేమింగ్ పట్ల అవగాహన కలిగించటం చాల ముఖ్యం. వొకటి యెదుటి వారి శరీరాలపై జోక్స్ వెయ్యటం యెంత పొరపాటో అర్ధం అవ్వటానికి. అలాగే బాడీ షేమింగ్ కి లోనైనప్పుడు ఆ విషయానికి కుంగిపోకుండా నిటారుగా నిలబడి ప్రశ్నించటం. ప్రశ్నలని, నిలదీతల్ని చిన్నప్పుడే అందరికీ సాధ్యం కాదు కాబట్టి పిల్లలు వారు యెదుర్కొంటున్న బాధని, అవమానాన్ని పెద్దలకి చెప్పే వాతావరణాన్ని అందించటం. పిల్లలపై లైంగిక హింసకి యిళ్ళు యెలా అతీతం కాదో బాడీ షేమింగ్ కి సొంత యిళ్ళు అతీతం కానేకాదు. చాల మంది పిల్లలు తమ శరీరాల గురించి బాధించే కామెంట్స్ ని ముందు యిళ్ళల్లో ఆత్మీయుల నోటే వింటారు. పిల్లల్ని బాధించాలని యెవరూ అనుకోరు కానీ అదంతా వో హాస్యంలా ముద్దుగా మాటలు దొర్లిపోతుంటాయి. అసలు తమ యీ మాటలు పిల్లలని బాధిస్తున్నాయనే యెరుక కూడా వుండదు. అదో అలవాటుగా సహజంగా సాగిపోతుంటుంది. శరీరపు రంగూ, బరువులపై కొన్ని సినిమాలు వచ్చాయి. యీ విషయాలపై అవగాహనకి ప్రసార మాధ్యమాలు చెయ్యవలసినదెంతో వుంది. అయితే ప్రసార మాధ్యమాల్లో పనిచేసే వారిలో యిప్పటికీ చాల మందికి అనేక విషయాల్ని అనాలోచితంగా అనేస్తుంటారు. వారి ధోరణి యెలా వుంటున్నదంటే పిల్లల్ని వదిలిన తల్లిని మాత్రమే నిందిస్తూ “కసాయి తల్లి’’ అని రాస్తుంటారు. అలా రాయకూడదని కానీ ఆ ఆలోచనలే సరియైనవి కావనే సృహ లేనట్టే అనేస్తుంటారు. శరీరాలకి సంబంధించి రాసే విషయాల్లో అవగాహన మరింత తక్కువ. బాడీ షేమింగ్ లోని అమానవీయతని, వివక్షని అర్ధం చేయిస్తూ అవగాహన కలిపించే కార్యక్రమాలు, సదస్సులు, వర్క్ షాప్స్ రావాల్సిన అవసరం యెంతైనా వుంది.
మన శరీరాన్ని మనం గౌరవించుకొంటూ ప్రేమిస్తూ శరీరాన్ని అవమానించే గొంతులకి చూపులకి అలా యెందుకు ప్రవర్తించకూడదో అర్ధం చేయించాల్సిందే. పిల్లల మానసిక ఆరోగ్యం కోసం యిప్పటికైనా సీరియస్ గా ఆలోచించటం అత్యంతఅవసరం. శరీరమూ మనసూ వేరువేరు కావు వొక్కటే. బాహ్య అంతర్గతాల సమ్మిళితమే జీవనపు శక్తి. జీవితానందపు సౌందర్యం.
బాడీ షేమింగ్ చేయటమంటే… అది మొరటుతనమూ, కుసంస్కారమూ తప్ప మరేమీ కాదు. తన వ్యాఖ్యలతో ఎదుటివారిని గాయపరచకూడదన్న దృష్టి లేకపోవటం. హాస్యం, వ్యంగ్యం ముసుగులో ఈ అమానవీయ ధోరణి కొనసాగుతోంది.
ఈ అంశం గురించి మీరు ఈ ‘మైదానం’ కాలమ్ లో బాగా రాశారు . సమస్యను చర్చించటమే కాకుండా పరిష్కారాలనూ సూచించారు. ఉపయోగకరమైన ఈ వ్యాసం ఆసక్తికరంగానూ ఉంది.
ఇచ్చిన కొటేషన్లూ బాగున్నాయి. ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ఉత్పత్తుల పేర్లు మారేలా చేయటం వెనక ఇలాంటి ఎందరో ఆలోచనాపరుల భావ ధార , విమర్శలూ, క్యాంపెయిన్ల ప్రభావం ఉంది. ప్రసార మాధ్యమాల రాతల్లో, మాటల్లో ఉన్న అమానవీయమైన వ్యక్తీకరణల గురించి ప్రస్తావించటం బాగుంది.
మీరు గమనించిన విషయాలు పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు వేణూ గారు.
Important yet ignored issues. Well analytical one. Nice article andi.
Thank you very much Sriram M garu.
Good to see an article on very sensitive and important social issue. Well articulated by Padma garu.
Thank you very much Krishnamurthy Yenugu garu.
బాడీ షేమింగ్ గురించి లోతైన విశ్లేషణతో కూడిన మీ వ్యాసం ఆలోచనాత్మకం పద్మ గారు.మీరన్నట్లు ఈ విషయంలో అందరికి అవగాహన కల్గించాలి. అనాలోచితంగా చేసే బాడీ షేమింగ్ వల్ల కలిగే అనర్థాలను అరికట్టాలి.
హృదయ పూర్వక కృతజ్ఞతలు డా. శోభ కొణిదల గారు.
నిన్న మీ వ్యాసం చదివాను, చాలా బావుంది . నిజానికి చాలా బాగా చెప్పారు. ఎడోలసెంట్ దగ్గరనుంచి దాదాపు మూసిలితనం వచ్చేవరకు మొగాళ్లలో ఈ వ్యాధి వుంధి. స్త్రీలను అవమానించే ప్రక్రియలలో ఇదొకటి. పైగా వాళ్ళు ధరించే దుస్తులే అలా చూడనిస్తాయి అనే వెదవ అబద్ధం ఒకటి. ఈ విషయాలన్నీ చాలా బాగా విమర్శించారు. మిరురాసే మైదానం శీర్షిక నేను తప్పక చదివే వాటిలో ఒకటి.
హృదయ పూర్వక కృతజ్ఞతలు సుబ్రహ్మణ్యం గారు.