“నేనే సుధాకర్ ని. నీకు పెద్దబాపమ్మ మనుమడిని. బాపమ్మ చూపెట్టింది. మీరీడున్నరని” అంటూ అరవింద్ కేసి తిరిగి “బావ కదా ” అంటూ చెయ్యి కలిపాడు సుధాకర్.
ముగ్గురూ కూర్చొని బాతాఖానీ వేస్తున్నా వినోద్ ధ్యాస దార్లో చూసిన పాత పంటల పండుగ పైకే మళ్లుతున్నది. అదేంటో తెలుసుకొమ్మని మనసు ఉసిగొల్పుతున్నది.
“అన్నా.. నువ్వు సైంటిస్ట్ అట కదా.. ఏమి జేస్తవే ” వినోద్ మొహంలోకి సూటిగా చూస్తూ ఆసక్తిగా అడిగాడు సుధాకర్.
పిల్లలు పరిగెత్తుకొచ్చారు ఆటలు ఆడుకుంటూ…
చైతు వచ్చి వినోద్ చేతిలో ఉన్న మొబైల్ అందుకోబోయాడు. వద్దని కళ్ళతోనే వారిస్తూ భోజనాల వైపు చూశాడు.
కాస్త ఒత్తిడి తగ్గింది. జనం తగ్గారు.
పిల్లలను తీసుకుని నెమ్మదిగా భోజనాల టెంట్ వైపు వెళ్ళాడు అరవింద్.
చెప్పమన్నట్టుగా వినోద్ నే చూస్తున్నాడు సుధాకర్.
కొత్త కొత్త వరి వంగడాలను కనుక్కుంటాం. అధిక దిగుబడినిచ్చి ఆహార భద్రతపెంచే వరి వంగడాల గురించి పరిశోధన చేస్తుంటాం అంటూ తన పరిశోధనల గురించి క్లుప్తంగా చెప్పాడు వినోద్.
“ఆహార భద్రత…” ఒక్క క్షణం ఆగి “అన్నా.. నువ్వేమనుకోనంటే ఒక డౌట్.. అడగాల్నా..” సంశయంతో ఆగాడు సుధాకర్.
తన ఉద్యోగాన్ని గురించి వివరాలడగడం వినోద్ కి ఆనందం కలిగించింది. సాధారణంగా ఎవరూ ఆ ప్రశ్నలు అడగరు. పెద్ద ఉద్యోగంలో ఉన్నాడని మాత్రమే అనుకుంటారు. ఇప్పుడు సుధాకర్ వచ్చి పరిచయం చేసుకుని ఆసక్తిగా అడుగుతుంటే అతన్ని సంభ్రమంగా చూశాడు వినోద్.
సుధాకర్ ఇంటర్ వరకూ చదివి తన ఊళ్ళోనే ఓ ప్రముఖ దినపత్రికకు గ్రామీణ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు.
“అన్నా నువ్వు ఆహారభద్రత అంటున్నవు. నేను మొన్న వార్తల కవరేజ్ కోసం పోయినప్పుడు సంఘపోళ్ళు సుత తమ పంటలతో ఆహారభద్రత గురించే చెప్పింరు.
నువ్వు వరి మీద పనిజేస్తున్నవు. వాండ్లేమో చిరుధాన్యాల మీద పాత పంటలమీద పనిజేస్తున్నరు” అన్నాడు సుధాకర్.
సంఘం అని అతనినోట రాగానే అలర్ట్ అయ్యాడు వినోద్. వెతకబోయిన తీగ దొరికినట్లుగా ఫీలయ్యాడు. ఈ ప్రాంతపు విలేఖరి కాబట్టి సంఘం వాళ్ళ గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. సుధాకర్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చేమోనని తలపోశాడు.
సుధాకర్ అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా “నీకు సంఘం వాళ్ళు తెలుసా..?” ప్రశ్నించాడు వినోద్
“ఆ.. ఎందుకు తెల్వదన్నా.. ఈ చుట్టు ముట్టు ఎనభై ఊళ్లల్ల సంఘమున్నది. సంఘపోళ్లున్నరు..” అంటుండగా…
“అప్పటికెళ్లి జూస్తాన్న, గా సంగపోళ్ల ముచ్చటదప్ప వేరే ముచ్చట లేదు. గా.. మాల మాదిగోళ్ల ముచ్చట గీనకెందుకో… ఎటమటం..” వెనక నుండి పెళ్లికుమార్తె చిన్న తాత అసహనపు గొంతు.
సుధాకర్, వినోద్ లిద్దరూ అతని మాటలు విన్నప్పటికీ విననట్లుగానే తమ సంభాషణ కొనసాగించారు.
తాను వచ్చేటప్పుడు చూసిన పాత పంటల పండుగలో విన్న ప్రసంగం గురించీ, తాను చూసిన ఆ మహిళల గురించీ క్లుప్తంగా చెప్పాడు వినోద్.
“అవునన్నా… ఆ ఆడోళ్లు ఆడోల్ల లెక్క ఉన్నరా.. లేరు. కత్తి… కత్తిలెక్క తయారయింరు. నిన్న మొన్నటిదాంక మనసొంటి ఇండ్లల్ల ఎట్టిజేసినోళ్లు, గాయిదోళ్లు, కూలినాలి జేస్కొనేటోళ్లు, మనమేసే ఇంతంత రొట్టెముక్క కోసం దినమంత ఒళ్ళుకరగ బెట్టుకుంట పడిగాపులు పడినోళ్లు వాండ్లేనంటే నమ్ముతరా… వాళ్ళు నేర్వని విద్య లేదు. పంటలు పండిస్తరు, సీడు బాంకు నడుపుతరు, సంఘం దుకాణం నడుపుతరు, ఆరోగ్యం అంటరు, ఎరువులు-పురుగుమందులు జేస్తరు, పంచాయితీలు తీరుస్తరు, అవ్వే గాదు ఇంకా వీడియోలు తీస్తరు, రేడియో నడుపుతరు, విమానాలల్ల ఔటాఫ్ తిరుగుతరు. కలెక్టర్ గాని, ఎస్పీ గానీ, మంత్రిగానీ, ముఖ్యమంత్రి గానీ నజర్లేదు, బెదర్లేదు. సక్కగబోయి పోయిన పనిజేస్కొనొస్తరు” మధ్యలో వచ్చి కూర్చున్న అరవింద్, వినోద్ ల వైపు చూస్తూ చెప్పి కొద్దిగా ఆగాడు సుధాకర్. ఇద్దరూ నోరెళ్ళబెట్టి వింటున్నారు.
“వాళ్ళ మాటలు విన్నప్పుడే చాలా గొప్పగా అనిపించింది. అటువంటిది నువ్వు చెప్పిన విషయాలు విన్నాక మరింత అద్భుతంగా ఉంది. వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న కోరిక మరింత పెంచింది నాలో.. అసలు అంత ధైర్యం వాళ్ళకెట్లా వచ్చింది. అంత తెలివి ఎవరిచ్చారు” ప్రశ్నించాడు వినోద్
“ఇంకెవరు..? సంఘం” చెప్పాడు సుధాకర్.
“డ్వాక్రా సంఘాలు, గ్రూపులు లేనిదెక్కడ.. దేశమంతా ఉన్నాయిగా.. మరి, ఇక్కడ మాత్రమే ఇంత తేడా ఏమిటి?” ప్రశ్నించాడు వినోద్.
“అన్నా.. నువ్వు జెప్పేటివి డ్వాక్రా సంఘాలు. అవి ఎన్కసిరి ఎల్లినయ్. అవి రాకన్నా ముందే మా అక్కడ ఈ సంఘం ఎల్లింది. సంఘపు ఆడోళ్లమీద ఛత్రి ఎత్తిపట్టి మండుటెండల నుంచి గాలివానలకెల్లి కాపాడింది.” వివరించాడు సుధాకర్.
అతను చెప్తున్నది వింటుంటే వినోద్ తోపాటు అరవింద్ కి కూడా ఆ మహిళల పట్ల, సంఘం పట్ల మరింత ఆసక్తి, ఉత్సుకత పెరిగింది.
” అన్నా.. ఈ ముచ్చట తెల్సానే.. మా సంగారెడ్డి జిల్లాల పోషకాహార లోపం పదకొండు శాతం ఉన్నది.
కానీ ఈ సంఘపోల్లు ఉన్నక్కడ మాత్రం అది కేవలం మూడు శాతమేనట” రెండురోజుల క్రితం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ చెప్పిన విషయాలు చెప్పాడు సుధాకర్.
“నిజామా.. ఆశ్చర్యంగా ఉందే..” ఒకేసారి బావ, బామ్మరుదుల గొంతులోంచి.
“బహుశా వాళ్ళు తినే తిండి అలవాట్ల వల్లనే అది సాధ్యం అంటున్నరు” వినోద్ వైపు సూటిగా చూస్తూ మళ్ళీ తానే అన్నాడు సుధాకర్.
“స్వతంత్రం వచ్చాక ఆహార భద్రత గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. ఇతర దేశాల నుండి ఆహార పదార్ధాలు దిగుమతి చేసుకున్నాం. ఆ తర్వాత ఆహార ఉత్పత్తుల దిగుబడులు పెంచుకునే దిశగా ఎన్నెన్నో ప్రయోగాలు చేసుకున్నాం. అధిక దిగుబడులు సాధించే ప్రాంతాల్లో లేని పోషకాహార భద్రత ఈ మెట్ట నేలల వాళ్ళు ఎలా సాధించారో అంతు చిక్కడం లేదు.
“సంఘం వాళ్ళను కలవాలి. ఆహార భద్రత, పోషకాహార భద్రత ఎలా సాధించారో ఈ పల్లె పడుచులు.
ఆశ్చర్యంతో పాటు ఆ విషయం తెల్సుకోవాలన్న ఆసక్తి మరింత పెరిగిపోతున్నది” ఉద్వేగంగా అన్నాడు వినోద్.
“పళ్ళు ఫలాలు బాగా తింటారేమో..” అన్నాడు అరవింద్.
ఆమాటలకు పెద్దగా పకపకా నవ్వేశాడు సుధాకర్. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆ నవ్వుకు తల తిప్పి వీళ్ళనే చూస్తున్నారు.
అతనంతగా ఎందుకు నవ్వాడో అర్ధం కాక బిక్కమొహం వేసుకున్నాడు అరవింద్.
“బావా.. నీకంటే పట్నంల మా లెస్స పండ్లు ఫలాలు దొర్కుతయ్. గానీ, గీ ఊర్లల్ల యాడియే.. మీ అసొంటోళ్లు విటమిన్ గోలీలు తింటరేమో.. గవ్వన్నీ.. ఈడనా..” నవ్వుతూనే అరవింద్ నుంచి దృష్టి వినోద్ కేసి మళ్లించి… “ఎన్కట తిండి లేక మన్ను బుక్కినోళ్లున్న జాగా ఇది. సంఘమోల్లకు ఈడ తిండిగింజలు కరువైనాయని షోలాపూర్ కెల్లి జొన్నలు తెప్పిచ్చి ఇచ్చిన్రట. ఎండుమిరపకాయలిచ్చిన్రట.. అప్పటి దినాలల్ల.” ఒక్క క్షణం ఆగి “ఇయ్యాల్ల పాతపంటల జాతరల మొత్తం ఉన్నవంటే నీకే అంతా ఎర్కవుతుండే.. ఆడ వచ్చినోల్లతోని ముచ్చట బెడితే వాండ్లు మాస్తు జెప్తుంటిరి గద…” ప్రశ్నార్ధంకంగా చూస్తూ అన్నాడు సుధాకర్.
“నిజమే కానీ మనకది కుదరదుగా.. పెళ్ళికి వచ్చి అటువెళ్తే బాగుండదు. మరోసారి చూద్దాం..” అంటున్న వినోద్ ని చూస్తూ…
“నారాజు గాకే.. నీకెప్పుడంటే అప్పుడు రావే అన్న.. ఒక్క ఫోన్ కొడితివాంటె వాళ్ళ దగ్గరకు నేనే కొండబోత” చెప్పి మళ్ళీ తానే “నీ ఫోన్ నంబర్ ఇయ్యన్నా.. సంఘం మీటింగులుంటే మాకు పిలుస్తరు కద. అది నీకు జెప్తా..” అన్నాడు.
ఎన్నడూ లేనిది సంఘం మహిళల గురించి తెలుసుకోవాలని ఇంత ఎక్సయిట్ అవుతున్నాడు. బహుశా తాను విత్తన శాస్త్రవేత్త అవడం వల్లనా.. గడ్డి పరకల్లాంటి మనుషులు ఆహార భద్రత సాధించారని తెలియడం వల్లనా.. ఎండిపోయిన గడ్డిపోచలు శక్తినంతా ధారబోసి మొక్కలు కాదు మానై అద్భుతాలు సృష్టిస్తున్నారనా.. ఏదేమైనా వాళ్ళ మాటలతో తనలో తెలియని అలజడి. ఆ అలజడిలోంచి మొలుచుకొస్తున్న ప్రశ్నలు. వాళ్ళు మళ్ళీ కనిపిస్తే చేతులెత్తి మొక్కొచ్చు.. ఆలోచిస్తున్నాడు వినోద్.
పెళ్లిమండపం దగ్గర ఉన్న మైకులోంచి అప్పటివరకూ వినిపించిన మంత్రాలు ఆగిపోయాయి. పెండ్లి పిల్లకు, పెండ్లి కొడుక్కు కట్నాలు చదివిచ్చేటోళ్లు చదివియ్యండి.. అని అంటున్నాడు అప్పటివరకూ పెళ్లి చేసిన అయ్యవారు.
కుర్చీల్లో ఉన్నవాళ్లలో కొందరు లేచారు. భోజనాల దగ్గర రాయించుకునే వాళ్లలో కొందరు పెళ్లి మండపం కేసి కదులుతున్నారు. కట్నాలు.. కట్నాలు.. మళ్ళీ ప్రకటించాడు అయ్యవారు.
భోజనాల దగ్గర కాస్త ఖాళీ అయింది. అందరూ భోజనాలకు లేవండి అంటూ ఆడపెళ్ళివాళ్ళు టెంటు కింద కుర్చీల్లో కూర్చొని కబుర్లలో మునిగిన వాళ్ళను భోజనాలకు లేపుతున్నారు.
ఆలోచనలో ఉన్న వినోద్ కేసి ఒకడుగేసి “బావా లేవండి. మనమూ తినేద్దాం” అన్నాడు అరవింద్.
ఆడవాళ్లు ఇంకా పెళ్లి దగ్గర నుండీ లెగవలేదు. వాళ్ళు కూడా తినేస్తే ఇక్కడి నుండి త్వరగా బయటపడొచ్చు అనుకున్నాడు అరవింద్.
అక్కడ కూర్చున్న మగవాళ్ళంతా భోజనానికి లేసారు. సుధాకర్ ప్లేటులో కావాల్సినవిపెట్టుకుని కూర్చొని తిందామని చూసేసరికి కుర్చీల్లో వేరెవరో కూర్చొన్నారు. ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.
అరవింద్, వినోద్ ప్లేటు పట్టుకొని నించొని తింటున్నారు.
చుట్టు పక్కల పెద్ద చెట్లు ఏమీ లేవు. వేసిన షామియానాలు పై నుండి వస్తున్న ఎండ వేడిని ఏమాత్రం ఆపలేకపోతున్నాయి. ఆ వేడికి తోడు వేడి వేడి అన్నం. మసాలా ఘాటుతో ఉన్న కూరలు మరింత ఉడుకెక్కిస్తున్నాయి. మౌనంగా ముద్ద లోపలికి పంపుతున్నారు కానీ తినాలనిపించడం లేదు. చల్లటి నీళ్లు తాగాలనిపిస్తున్నది.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగా… సుధాకర్ భోజనం చేస్తూ చుట్టూ పరికిస్తున్నాడు. తెలిసిన వాళ్ళు ఎవరెవరు వచ్చారో గమనిస్తున్నాడు. తింటూనే కొందరికి అభివాదం చేస్తున్నాడు. మరోవైపు తెలిసినవాళ్ళు పలకరించడంతో తింటూ వెళ్లి వాళ్ళ దగ్గర నుంచున్నాడు సుధాకర్. కొద్ది దూరంలో కనిపించిన స్త్రీలను చూసి అతని కళ్ళు మెరిశాయి. కాస్త బొద్దుగా, ఎండావానలకు నలిగిన మొహంతో, సాంప్రదాయ వస్త్ర ధారణతో, నూనె పెట్టి నున్నగా దువ్వి సిగ చుట్టిన ఆమెను చూపుతూ “అన్నా.. అగో.. ఆమెకు చూడు. సంఘపామె.. మొన్న జహీరాబాద్ కాడ మీటింగుల జూసిన” నాలుగడుగులు ముందుకేస్తూ గట్టిగా అన్నాడు సుధాకర్.
కాస్త దూరంగా ఉండడంతో సుధాకర్ మాటలు వినోద్ ను చేరలేదు. పత్రికా విలేఖరి తనను గుర్తుపట్టి అంతరాలు మరిచి పలకరించడం సంతోషమ్మకు చాలా సంతోషం కలిగించింది. ఒకప్పుడు ఇదే వూళ్ళో ఈ ఇంటివాళ్లతోనే ఎంత పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళే ఇప్పుడు అందరిపాటు తినడానికి తమను భోజనానికి పిలిచారు. ఒకప్పుడయితే అందరి భోజనాలయినంక మిగిలింది మేం తెచ్చుకున్న గిన్నెల్లో వేసేవారు. లేదంటే పైట తీసి పరిస్తే అందులో ఎత్తేసేవారు.. అటువంటిది ఇప్పుడు వాళ్ళ బంధుమిత్రులతో పాటే మేము.. అనుకుంది సంతోషమ్మ. ఆమె పక్కనున్న మొగులమ్మ లోనూ అదే భావన.
కొన్ని కుర్చీలు ఖాళీ అయ్యాయి. కుర్చీలను గుండ్రంగా సర్దమని ఖాళీగా నుంచొని ఉన్న ఓ పిల్లవాడికి పురమాయించి, “ఇటురాన్రి. ఈడ కూచుందాం” సంతోషమ్మ వాళ్ళని పిలిచాడు సుధాకర్. అతని వెనకే వాళ్ళు. ఓ పక్క భోజనం చేస్తూనే మరో పక్క మైకులోంచి వినిపిస్తున్న చదివింపులు వింటున్నారు. పెండ్లి పిల్లకు నాగయ్య కట్నం ఐదు రూపాయలు.. మైకులోంచి వినవస్తున్నది. అదివింటూ తమ చిన్నప్పటి జ్ఞాపకాలు పంచుకుంటూ నవ్వుకుంటున్నారు.
“అన్నా ఇటు రాండ్రి. ఈడ కూసోని తిందురు “వినోద్ వాళ్ళని కూడా పిలిచుకొచ్చాడు సుధాకర్.
అప్పుడు, అక్కడ కుర్చీలో కూర్చున్న ఇద్దరు మహిళల్ని చూశాడు వినోద్. అందులో ఒకర్ని చూడగానే గుర్తు పట్టాడు. ఆమె మాటలే కదా తనని ఇంత కదిలించింది. ఆ మాటలు వినే కదా అట్లా వెళ్ళిపోయింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా ఉందతనికి. అతని మొహం వేయి వోల్టుల బల్బుకంటే ఎక్కువగా వెలిగిపోయింది. ఆనందంతో గబగబా అడుగులేసాడు వినోద్. అతన్ననుసరిస్తూ అరవింద్.
“ఈయన మా అన్న, ఈయన మా బావ” అంటూ ఇద్దరినీ ఆ స్త్రీలకు పరిచయం చేశాడు సుధాకర్.
“మా అన్న మంచి మంచి వరి ఇత్తునాలు తయారు జేస్తడు. ఎక్కువ పంట తీసేటి ఇత్తనాలు తయారు జేస్తడు.” గొప్పగా చెప్పాడు సుధాకర్.
“పంట మీన ఇత్తునం దీస్తరా…” ప్లేటు లోని లడ్డు కొరకబోతూన్నదల్లా ఆగి వినోద్ మొహంలోకి చూస్తూ అడిగింది మొగులమ్మ.
“ఆహా. ఇత్తనాలు అంటే మీరు జేసినట్టు ఇత్తునం జేసుడు గాదు. మా అన్న మాస్తు చదివిండు. పెద్ద పెద్ద సదువులు చదివిండు. కొత్త కొత్త పంటలు కనుక్కునే సదువు చదివిండు” ఒకింత గర్వంతో వివరిస్తున్న సుధాకర్ మాట్లాకడ్డు తగులుతూ…
“ఇత్తునాలా.. రోగాల తిండి గింజలా..” ప్రశ్నించింది సంతోషమ్మ.
“వ్వాట్..? ” అదిరిపడ్డాడు వినోద్.
“ఏవనుకోకు సారూ.. ఇట్ల అంటున్ననని. తెల్ల బియ్యం బువ్వ అంటే రోగం తిండే. అది పండించ్చేటోళ్లకు మా లెస్స పైసలిచ్చి తెస్తున్రు. అది రోగం తిండి అని తెల్సిన సుత.. ఎక్కడెక్కడికెల్లో తెచ్చి కూపన్ బియ్యం ఇస్తరు. అయ్యిటి బదలు ఆరోగ్యాన్నిచ్చే మా కొర్ర బియ్యం ఇయ్యచ్చు. సామ బియ్యం ఇయ్యచ్చు. సజ్జలియ్యచ్చు. జొన్నలియ్యచ్చు. అట్ల జెయ్యది సర్కారు. సర్కారు వెట్టే తిండిగింజల ఇత్తునాలే మీరు తెస్తరు. మీరు కనుక్కునేటివి కొత్తగనే ఉండొచ్చు. మందులతోటి పంట బాగనే తీస్తుండచ్చు. గని అది రోగపు తిండే గద. గందుకే మేమా బువ్వ తినం.” అన్నదామె స్పష్టంగా.
“మేం తిండి పంటలు పండిచ్చుకుంటం. ఆరోగ్యపు పంటలు పండించుకుంటం. అవే తింటం.” సంతోషమ్మ పక్కన కూర్చున్న మొగులమ్మ కంచు కంఠంతో చెప్పింది.
“మీ తిరకాసు మాటలేంటో అస్సలు బుర్రకెక్కడం లేదు” అన్నాడు అరవింద్. కొంచెం విసుగు ఆ కంఠంలో.
“అవును బావా, వీళ్ళు తమ చేన్లల్ల పండిచ్చుకున్న పంటలే తింటరు. పైసలు పోసి కొనరు.” వివరించబోయాడు సుధాకర్.
“సరే.. అవే తిననీ.. మనం తినే అన్నాన్ని రోగపు తిండి అంటే ఇంకో ముద్ద నోట్లోకి పోతుందా..” ప్లేటును అట్లాగే పట్టుకుని అసహనంగా అరవింద్.
“అయ్యో.. తినుంరి సారూ.. గట్ల నారాజు కాకుంట తినుంరి. ఇప్పుడు మేం సుత అదే బువ్వ తింటున్నం. ఇట్ల ఆ పొద్దు, ఈ పొద్దు తింటనే ఉంటం. కానీ దినాం అదే తినము” అన్నది సంతోషమ్మ.
“ఉన్నమాటంటే ఉలుకే సారూ.. మీరు పండించే పంటల్ల సర్కారీ మసాలా ఎరువులు, పురుగు మందులు జొరబడ్డయి. లెక్కలేకుంట పోస్తరు. సంచులు సంచులు పంట దీసి కొత్తలెంచుకుంటరు. గని ఆ తిండి తింటే బీమార్లు రావా..?” నిలదీస్తున్నట్లుగా ఉన్నదా బక్క ప్రాణి మొగులమ్మ కంఠం.
“తెల్ల బియ్యం తిన్నోళ్లు మంచుగుండరు. కాళ్ళ నొప్పులొస్తయి. దొడ్డుకు దొడ్డు ఉంటరు. ఎప్పటికి ఏదొక రోగం అంటరు. మీ పెద్ద పెద్దోళ్లు అన్ని తెల్సినోళ్లు ఆ తిండి తింటే తిన్నరు. తినుంరి. మాకన్న కూపన్ బియ్యం కొర్ర బియ్యం కావాల్నని అంటున్నం. అట్ల ఇత్తె మా పంటకు రేటొస్తది. మాకు లాభమయితది. అది తిన్నోళ్లకు లాభమయితది. వాండ్ల ఇంట్ల అందరికి మంచిగుంటది. అగ్గువకు ఆరోగ్యమస్తది. ఇప్పుడేమయితాంది శానా సొమ్ములువోసి కొని తెల్లబియ్యం ఇస్తున్నరు. ఇచ్చిన బియ్యం పడేస్తమా అని తింటున్నం. పెద్ద పెద్దోళ్ళంత తెల్ల బియ్యమే తింటరని మా పిల్లగాండ్లు తెల్లబియ్యానికే ఎగవడవట్టె. బల్లె సుత తెల్ల బియ్యం తినవట్టె..” అంటున్న సంతోషమ్మ మాటలకు మధ్యలో అందుకొని…
“మనమెన్నుకున్నోళ్ళు మన మాట ఇనాలే. మన కోసం జెయ్యాలె. కానీ జేస్తలేరు. అంటే మనమే ఒత్తిడి తేవాలె. అడగకుంటే అమ్మయినా బువ్వ పెట్టదని పెద్దలంటరు. అట్లనే మనం వత్తిడి తేవాలె” అన్నది మొగులమ్మ.
“మనమున్నది గుప్పెడు మందిమి. మొత్తుకుంటనే ఉన్నం. సర్కారు చెవుల కెక్కుతలేదు గదా. ఇసొంటి సదూకున్నోళ్ళు ఒత్తిడి తేవాలె” అన్నది సంతోషమ్మ.
పొగచూరిన మేఘాల్లా ఉన్న ఆమె కళ్ళు చూస్తూ ఈ అమ్మల ఆలోచనా దృక్పథమే చాలా కొత్త మార్గాలేస్తున్నట్లుగా ఉన్నది. కడుపు నింపే పంటలు కాదు కల్తీ లేని పంటలు కోరుకుంటున్నారు వీళ్ళు. అందులో తప్పేముంది. న్యాయమే కదా అనుకున్నాడు. ఆమెలో అలసిన మనసుకు చల్లటి ముద్ద అందించాలన్న, సేదతీర్చాలన్న ఆరాటం కనిపించింది అరవింద్ కి.
తమ ఎరుకలో ఎప్పుడూ ఎవరి వద్ద ఇటువంటి ఆలోచనా ధోరణి చూడలేదు. ఒక క్షణం గతంలో కదం తొక్కిన మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ కళ్ళముందు కదలాడి మాయమైంది సుధాకర్ కి. ఆ వెంటనే “మీ సంగం గురించి మా అన్న తెల్సుకుంట అంటే మీకు పిల్సిన. మీరేదేదో మాటాడవడ్తిరి” నిష్టురంగా అన్నాడు.
“మా ముచ్చట్లే చెప్తాన్నం గద సారూ.. మీకేం కావాల్నో అడుగుంరి. అట్లనే సెప్తమ్” సంతోషమ్మ నవ్వుతూ.
“సంగం జేసుకొని అంత ఒక్కతాటిమీద ఉంటున్నరు. అప్పటికెల్లి పెద్దోళ్ళయిపోయిన్రు. ఇగో గిట్లనే అడ్డం దిడ్డం మాటాడుతున్నరు. ఒక పెద్దంత్రం లేదు. చిన్నంత్రం లేదు.” అంటూ వచ్చి అక్కడున్న ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు శుభ్రమైన తెల్లదుస్తుల గ్రామస్తుడొకరు.
అతని వైపు ఒక్క క్షణం అలా తీక్షణమైన చూపు విసిరారు ఇద్దరూ. “మీరేమడుగుతరో అడగుంరి” కొంచెం సర్దుకు కూర్చుంటూ అన్నది మొగులమ్మ.
“జనం మర్చిపోయిన పాత పంటలు మీరెందుకు పండిస్తున్నారు” ఎప్పుడెప్పుడు అసలు విషయంలోకి వద్దామా అని ఎదురు చూస్తున్న వినోద్ ప్రశ్నల పొదిలోంచి మొదటి ప్రశ్న సంధించాడు.
“అట్లడుగుతరేంది సారూ.. అవి తిండి పంటలు. బతికిచ్చేటి పంటలు. బతుకునిచ్చేటి పంటలు. అవ్విటికి నువ్వు నేను ఏమివ్వకున్న అవి మనకిస్తయి. మన కోసం ఆశ పడయ్. గాలి పంటలు. బైలు పంటలు. ఉత్తగ గాలికి పండుతయ్. అవీటికి ఏమివ్వకున్న సరే.. నాలుగానలు పడి జర భూమి నానితే సాలు. మీకు మేమున్నం ఫికర్ చేయకుంరి అని బరోసా ఇస్తయ్. కడుపు జూసి కావల్సిన తిండినిస్తయి. పసులకు మ్యాత నిస్తయి. మట్టికి బలాన్నిస్తయి” గబగబా చెప్పింది మొగులమ్మ.
“వరి పంట వెయ్యరా..” అరవింద్ లో ఉత్సుకత.
“నల్లర్యాగడి ఉన్నోళ్లు కొందరు వడ్లు అలుకుతరు. నాట్లేసుడు గాడు. సర్కారీ మసాలా ఎరువులు అస్సలే ఎయ్యం.” అన్నదామె అరవింద్ ప్రశ్నకు జవాబుగా.
అప్పటివరకూ తలాడిస్తూ వాళ్ళు చెప్పేది శ్రద్దగా వింటున్న వినోద్ అందుకుని “మేము కొత్త కొత్త వరి వంగడాలు కనిపెడుతున్నాం. మీ లాంటి వాళ్ళకోసం. పంట బాగా పండి పేదరికం పోవడం కోసం ” ఆ మాటలంటున్నప్పుడు ఒకింత గర్వం అతని స్వరంలో
“సారూ.. ఏమనుకోకురి గిట్ల అంటన్ననని.. మీరు పంట దిగుబడి జూస్తరు. రాబడి జూస్తరు. ధర, మార్కెట్ గిట్ల జూసుకుంట పంటలు జేస్తరు. మేమట్లగాదు. ఆదాయం పంటలు గాదు ఆరోగ్యం పంటలు కావాల్ననుకుంటం. వాటి మీదనే ఆలోచన జేస్తం. మీ సర్కారోళ్లు రైతుకు ఏది కావాల్నో అది సూడరు. అదే ఎయ్యని అనుకోరు. మీరు తయ్యారుజేసిందే పండిచ్చుమంటరు. అమ్డానీ తెచ్చేటిదే పంట అంటరు. అదే ఎయ్యిమంటరు. మా చుట్టుముట్టు సూడుంరి. ఆందరు పత్తి పంటకు ఎగవడ్డరు. పత్తికి మా లెస్స అమ్డానీ అని పత్తులేస్తున్నరు. జర నీళ్లుంటే అల్లం, పసుపు అంటున్రు. మేము అవ్విటి దిక్కే సూడం. మా పంటలకు ఇప్పటి దినాలల్ల పిట్టలతోని, పందులతోని మా లెస్స పరేషాన్ అయితాంది. పందులతోని తక్లిబ్ అయితాంది. అయినా మానలే.. ఆళ్ళది పైసల పంట. మనమేసేది తిండి పంట. కడుపు తిప్పలు జూసేటి పంట. జొన్నలేస్తున్నం, కొర్రలేస్తున్నం, సామలేస్తున్నం, తొగర్లేస్తున్నం, మినుములేస్తున్నం, అనుములేస్తున్నాం, యాల్లకింత బువ్వ పెట్టేటి పంటలేస్తున్నం. మన చేనుకు పిట్టలెగవడ్డయ్. పందులెగవడ్డయ్. అయిన.. ఎందుకు జేస్తున్నం. తిండి కోసం జేస్తున్నం. నా చేత నేనే ఎరువు తయారు జేసుకుంట, చేన్ల తగ్గట్ల పోస్త. పంట మంచిగనే వస్తది. కానీ తినేటియాన్ని తిన్నంక చారాణా పంటనే ఇంటికస్తది. బారాణా వంతు పిట్టలకు, పందులకే పోతున్నది.”
“చాలా నష్టమే.. నష్టపోయినా ఆ పంటలే వేయడం ఎందుకు” సుధాకర్ ప్రశ్న.
“ఈ ఏడు నేను మూడెకరాలల్ల కొర్రల్తోని కలిపి పంటలేసిన. ఎన్ను మంచిగనే ఎల్లింది. పదిహేనిరవై సంచులైతాయనుకుంటి. కానీ, మూడు పల్లాలు కొర్రలొచ్చినై. గంతే.. చూస్తే అంత లుక్సానా.. అయిన, ఆ బాధకు తట్టి ఎంతోతే అంతేనని ఆ పంటలే ఏస్తాన్న.”
“అవునా.. ” ఆశ్చర్యంగా అరవింద్.
“బతకనీ.. పిట్టల, పందుల అన్నిటిని బతకనీ.. అనుకుంటున్న.. అవ్వి బీ మనోలె బతకాలే అనుకుంట తిండి పంటలే ఇత్తుతున్న. సంగంల ఒక్క తట్టు ఉన్నోల్లంత తిండి పంటలంటున్నరు.
మా చుట్టు ముట్టు అందరు తిండిపంటలెత్తే పిట్టలు పందులు ఆడింత ఈడింత తిని కడుపు నింపుకుంటయి. ఇగో ఒకరిద్దరు ఏస్తే ఏమున్నది అన్ని అటుదిక్కే బాటవడ్తయి. పంట మీనకు ఎగవడతయ్. ఆ రైతుకు అంత లుక్సానా అయితది.”
“మిమ్ముల చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది..వింతగా ఉంది ” ముక్కుకు పెదాలకు నడుమ మడిచి ఉన్న వేళ్లు నెమ్మదిగా నోటికి మీదకు జారుతుండగా అన్నాడు వినోద్.
“మీకు అట్లనే ఉంటది సారూ.. గని కడుపుల కరకరలేకుంట మంచిగ ఫుర్సత్ ఉన్నమనరు. ఊర్లె అందరం ఒక్క తట్టు ఉండి తిండి పంటలు పెట్టుకుంటే మంచిగుంటదనరు. పెతాకం పైస పంటల దిక్కే జూస్తరు. ఎన్కటి దినాలకంటే ఇప్పటి దినంల కాలం తక్కువైంది. చినుకులు తక్కువైనయి. అప్పటిలెక్క దొడ్డు బొడ్డు పంటలు రాకొచ్చినయ్. పంటలయినప్పుడు మేము బీ దొడ్డు బొడ్డు ఇస్తుంటిమి. కల్లంలకొచ్చినోల్లకు, ఇంటికొచ్చినోల్లకు కాదనకుంట ఇస్తుంటిమి. మనతోటి ఆల్లు సుత బతకాల గద అనుకుంటుంటిమి..” చెప్తున్న మొగులమ్మ మాటలకు అడ్డు వస్తూ.
“మీ దగ్గర ఎవరు తీసుకునే వారు” అన్నాడు సుధాకర్.
“బిచ్చగాళ్ళు, బుడబుక్కలోల్లు, కూలాటోల్లు వస్తుండే. ఇస్తుంటిమి. చాటలతోని వాళ్లకిన్ని, వీళ్లకిన్ని తిండికి పోస్తుంటిమి. అట్లా పంటలు తీసినం. అట్లనే ఇస్తుంటిమి. ఇటుకెల్లి కొంత బోతే అటుకెల్లి డబులొస్తుండే.. ఇప్పుడట్ల పంటలుగాకొచ్చినయ్. ఈ రెండు మూడేండ్ల సంది సరిగ కాలం గాక పెట్టిన పంట సరిగ వాపస్ రాకచ్చింది. కొన్ని ఊర్లల్ల ముందు జల్ది పెట్టుకున్నోళ్లకు జర మంచిగనే వచ్చింది. వాండ్లకు బీ తక్కువనే గని జర నయం.” పొంగుతున్న సముద్రం వెనక్కి పోతున్నట్టు మొగులమ్మ మాటలు.
ప్రకృతి మెడలు వంచి చేసే వ్యవసాయం కాదు. ప్రకృతి మీద ప్రేమతో చుట్టూ చెయ్యేసి మనసుతో చేసే వ్యవసాయం వీళ్లది. అసలు వ్యవసాయం అంటే అదే కదా.. మనసులో తలపోస్తున్నాడు వినోద్.
“మీరేమనుకోనంటే ఒకటడగనా..” అన్నాడు అరవింద్.
“ఇండ్ల అనుకునేటిదేమున్నది గని అడుగుంరి సారూ..” అన్నది సంతోషమ్మ.
“మీ సంగం రైతుల్లో ఆత్మహత్యలున్నాయా..?” వెంటనే వచ్చింది అరవింద్ నుంచి.
“పత్తులేసినోల్ల వత్తులు కాలి మట్టిల కలుస్తున్నయ్” సంతోషమ్మ కళ్లలో నీలి నీడలు.
“మా ఏరియాల జరిగిన రైతు ఆత్మహత్యల్ల అగ్రభాగం పత్తి రైతులవే బావా..” అన్నాడు సుధాకర్.
“నగినోళ్ల ముందర ఆళ్ళే జారి పడ్డరు. విత్తు చిత్తు చిత్తు జేసే.. ఎరువు బరువాయే.. కడివెడు దాహానికి సుక్క నీరు కరువాయే.. అట్లనో ఇట్లనో తిప్పలు పడి చేతికి తెచ్చిన పంటకు ధర గిట్టుబాటు కాకొచ్చే.. కాళ్ల కింది భూమి కదిలిపోవట్టె.. రైతు కాడి వదలవట్టె.. కూలికి పోదామంటే అది కరువయ్యె.. బాకీలోల్లు పిడుగులోలె మీదపడవట్టె.. ఏం జేత్తడు..? పెండ్లాం పిల్లల ఎట్టికొదిలి ఆడి కర్మం ఆడుజూసుకునే.. ఆశకు పోయినోడి కర్మం అట్ల కాలిపోయింది. కానీ.. మా కర్మం అట్ల లే.. మా చేతిల ఉన్నది. మా చేతిలనే ఉంచుకున్నం. తిండి పంటలతోని, బాకులు లేని పంటల తోని. పిట్టలు గిట్టలు ఎన్ని తిన్న మా ఇంట్లకిన్ని గింజలొత్తయి. మా కడుపు జూస్తయి. మేమెట్ల జారిపోతం..?” అన్నది సంతోషమ్మ.
“అవునన్నా.. ఆ పెద్ద రైతులకేమో గాని చిన్న చిన్న రైతులకు ఎవుసం మస్తు పరేషాన్ అయితాంది. అప్పట్ల పత్తి కింటాలకు పద్నాలుగువేల దాంక పోయింది. గదే పత్తికి ఇప్పుడు నాలుగువేలొస్తే గొప్ప. గిట్లున్నప్పుడు రైతులేడ ముంగట వడ్తరు” అన్నాడు సుధాకర్.
తన పేరుమీద ఉన్న పది ఎకరాలకు, భార్య పేరు మీదున్న ఆరెకరాలకు ఒకసారి వెళ్లి ఎకరాకు నాలుగు వేల చొప్పున మొత్తం అరవైనాలుగువేలు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మరో అరవై నాలుగు వేలు తమ ఖాతాలో జమయ్యాయి. ఆ విషయం గుర్తొచ్చి “రైతు బంధు వచ్చింది కదా.. ఇట్లా చిన్న రైతులకు చాలా సాయమవుతుందేమో..” అన్నాడు అరవింద్.
“ఆ.. ఏమవుతది బావా.. మా చిన్నన్న నారాయణ నీకు ఎరకున్నడో లేదో.. తనకున్న ఆరెక్రారాలకు తోడు ఇరవైఎక్రాలు కౌలుకు చేస్తున్నడు. ఆరేక్రాలకు రైతుబంధు పైసలొచ్చినయ్. ఇరవైఎక్రాలకు పెట్టువడి తానే పెట్టుకోవాలె. ఎన్నడు చేన్ల కాలువెట్టనోనికి, మట్టి వాసనెరుగనోనికి, భూమున్నదని ఇంట్ల కూసున్న గానీ ఎనభైవేలు, ఎనభైవేలు మొత్తం లక్ష అరవైవేలు ఉత్తగనే జమయ్యే.. ఇగో గిట్లుంటయ్.. చేను చేసినోనికి ఇస్తే మంచిదే.. ” సుధాకర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా…
“నువ్వు అవుతలి పార్టీ దిక్కా..” కొంచెం దూరంలో కూర్చొని వీళ్ళ ముచ్చట్లని శ్రద్దగా వింటున్న మధ్యవయస్కుడు అడిగాడు సుధాకర్ దగ్గరకు తన కుర్చీ జరుపుకుంటూ. వేడి వాతావరణానికి తోడు సంభాషణ కూడా వేడెక్కే సూచనలు కనిపిస్తుండడంతో అసలు విషయం తెలుసుకోకుండానే సమయం గడచిపోతున్నదని గ్రహించిన వినోద్ అందరినీ ఆ సంభాషణ నుండి బయటికి తెస్తూ “సంఘం ఎట్లా మొదలయిందో తెలుసుకోవాలని ఉంది. చెప్తారా..” మొగులమ్మ, సంతోషమ్మలకేసి చూస్తూ అడిగాడు.
మౌనంగా వింటున్న ఇద్దరు స్త్రీలూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఎవరు చెప్తారన్నట్టుగా.
పెద్దదయిన సంతోషమ్మ భుజం చుట్టూ కప్పుకున్న చీర చెంగు తీసి మొహాన్ని నెమ్మదిగా తుడుచుకుని మళ్ళీ భుజం చుట్టూ తిప్పింది. ఆమె చెబుతుందేమోనన్నట్లుగా చూస్తూ ఉంది మొగులమ్మ.
అక్కడున్న అందరినీ ఒకసారి కలియజూసి సంతోషమ్మ చెప్పటం మొదలు పెట్టింది. “అవి తిండికి గతిలేని రోజులు. పురాగ కరవు దినాలు. లోకమంత ఏ రీతినుండెనో గానీ మా అక్కడ సుట్టు సీకటి, సిమ్మ సీకటి ముసురుకొని కండ్ల ముంగిట తొవ్వ దొర్కక పరేషన్ల ఉన్నప్పటి దినాలు. మా అవ్వలు, తాతలు చెప్తుంటిరి. ఆరం ఆరం దినాలు బువ్వలేక ఉండెటోరని. ఆకలికి యోర్వలేక ఒక్కోపారయితే మన్ను, దుబ్బమన్ను పిసుక్కోని బుక్కుతుంటిరని. అసొంటి దినాలుంటుండే. నేనయితే ఎన్నడు మన్ను మశానం బుక్కలేదనుకోరి. పటేండ్ల ఇండ్లల్ల అలుకనికిబోతే రొట్టె ఇస్తుండిరి. అదే రొట్టె ఇంతదీని మిగిలింది పిల్లలకు పట్కబోదమని పోతుంటి. దానిమీన దినమెల్లగొట్టిన నేను. పొద్దుందాన్క శానా తక్లిబ్ అయిన ఆ దినాలల్ల. బియ్యం తినుడంటే బంగారం తిన్నట్టే.. అసొంటి దినాలల్ల కూపన్ బియ్యం ఇస్తుండే. కానీ యాడివి. సేతుల చిల్లపెంక ల్యాకపాయె. అయ్యో.. ఆ దినాల గురించి ఇప్పుడు సెప్పవశంగాదు ” దీర్ఘంగా నిట్టూర్చి వదిలింది సంతోషమ్మ.
ఆ వెంటనే “మేమెన్నడు కలల సుతం అనుకోని తీర్గ మా జీవితాలల్లకొచ్చింది సంగం. ఇప్పుడు అది లేకుంటే మేము లేము. తోల్తతోల్త సార్లొచ్చినప్పుడు మేమెవ్వరం అండ్లకు పోతమనుకోలే. ఆళ్ళ మొకమే సూసెటోళ్ళం గావు. ఆ దిక్కే ఆలోచన సేసెటోళ్ళం గావు. పొద్దుగాల్ల, పొద్దుమీకి దినాం అచ్చిపోతయి గదా.. గట్లనే సంఘం సార్లు, మేడంలు మల్ల మల్ల మా ఊర్లకొచ్చిన్రు.. మా ఇండ్లల్ల కొచ్చిన్రు. సంగం జేసుకోంరని సెప్పిన్రు. అగో.. గప్పుడు గీ మొగులమ్మనే ముంగటవడ్డది. అటెన్క ఒకళ్ళేన్క ఒక్కళ్ళం బోయినం. నేనయితే సంగపోల్లు ఇచ్చేటి తిండి గింజల జూసే సంఘంల జొచ్చిన. అట్ల ఇరవై మందైనం, ఆ తర్వాత ఇప్పుడయితే డెబ్బయి మంది గుంపయినం ఊర్ల. మాదంతా ఒక్కటే జట్టు. ఒక్కటే కట్టు. మా ఊరు జూసి ఇరుగు పొరుగూర్లల్ల పొంటి ఆడోల్లు సంగంల జొచ్చిన్రు. పూర ఖరాబున్న ఆ దినాలల్ల సంగంలజేరి పైసలెట్ల జమజేసుడని కిందిమీదయినం గని సార్ల మాటలకు నమ్మినం. అప్పటి దినంల కాలమెట్ల ఎల్లదీసినమో..” కళ్ళముందు నిలిచిన ఆనాటి బాధను వదిలించుకోవడం కోసం ఒక దీర్ఘ శ్వాస విడిచి చుట్టూ చూసి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది సంతోషమ్మ.
అక్కడున్న అందరూ ఆమె చెప్పే విషయాలకోసం ఆసక్తితో కదలక మెదలక…
“తొల్త తొల్త వారానికి రూపాయి జమేస్తుంటిమి. జమ చేసుడొక్కటే కాదు గుంపుల కూసోని ఒకరి తిప్పలు ఒకరం ముచ్చట పెడుతుంటిమి. కడుపుల ఉన్న బరువు జరన్న తగ్గుతుండే. ఒక్కరి బాదలు ఒక్కరు ఎట్లున్నాయో సెప్పుకొనుడు తోని ఆగలే. అయ్యెట్ల తీర్పుకోవాల్నో సుత యోచనజేస్తుంటిమి. అట్ల గుంపు పెరుగుతాంటే మా బలగం, బలం పెరగబట్టే.
సంగం మాతోటి అన్నట్టే మాకు ఏదోటి పని దొరికిపిస్తున్నది. సౌలతు జేస్తున్నది. రోడ్లపొంటి గుంతలు దీసి మొక్కలు నాటుడు, కాల్వలు తవ్వుడు, బండలేరుడు ఇట్ల ఏదో పని. మా చేతుల కూలి పైసలు పడుతున్నయి. సంగంకు జమజేసుడు తక్లిబ్ కాలే. సంగంకు మా పైస జమయితున్నది.
అట్లనే కూసున్నప్పుడు ముచ్చట జేసినట్టు రూతమ్మ, సుశీలమ్మ ఇద్దరు కూడి చిన్న పటేల్ దగ్గర మూడెకరాల భూమిని ఎనిమివేలకు కౌలుకు తీసుకున్నరు. వొచ్చిన ఆమ్దాని చెరిసగం పంచుకొనే ఒప్పందం ఖరా చేసుకున్నరు. అది నల్ల ర్యాగడి. బోరున్నది. పెంట ఎరువు తోలింరు. రెండెకరాలల్ల చెరుకు నాటింరు. మిగిలిన ఎకురంల జొన్నలేసింరు. రాత్రి లేదు పగలు లేదు మా లెస్స కష్టం జేసిన్రు. పంట మంచిగెళ్లింది. మల్లెడాదికి అట్లనే ఇంక నాలుగెకరాలు వేరే వాళ్ళ తాన కౌలుకు తీసుకున్నరు. అది ఎర్ర న్యాల. సారం తక్కువున్నది. పెంట ఎరువు కొని పోసింరు. పోశన జేసిన్రు. దానికి సుతం బోరున్నది. నాలుగెకరాలల్ల వడ్లు పెట్టిన్రు. పంట మంచిగనే ఎల్లింది. పంట అంత పటేల్ ఇంటికి తోలింరు. ఆడ చెరింత పంచుకోవాల్నని. పంట ఇంటిముంగటికి జేరేదంక మంచిగనే ఉన్నడు పటేల్.
అటెన్క తప్పిచ్చుక తిరుగుడు షురూ జేసిండు. ఇయ్యాల రేపు, మాపు, పొద్దుగాల్ల ఇట్లనుకుంట ఇంటి సుట్టు తిప్పిచ్చుకుంటున్నడు. ఇసుర్రాయోలె మా వొల్లు తిరుగుతనే ఉన్నరు. అకిరికి పంట ఇయ్య పైసలిస్తనన్నడు. రూతమ్మ, సుశీలమ్మ ఒప్పలే. మాటనుకున్నట్టే ఇయ్యాల్నని అన్నరు. అసలియ్య ఏం జేస్కుంటరో జేస్కోరి అనుకుంటా బోయిండు. దొంగోలె తప్పిచ్చుక తిరుగుతున్నడు. ఇద్దరాడోల్లు ఏడ్సుకుంట సంగంల మా గుంపు తానకొచ్చింరు. గిట్ల జేత్తరా అని బీరుబోయినం. ఏం జెయ్యాల్నని అందరం కూడి మా లెస్స ఇచారం జేసినం.
రూతమ్మ పెనిమిటి ఎడ్లబండి తెచ్చిండు. పటేల్ బోరును బండిల ఏస్కోని ఇంటికి రాంగరంగ పటేల్ కొడుకు అడ్డం గొట్టిండు. ఏమన్నా గొడువ, కొట్లాట గిన గా గల అని మేమెంత అటే బోతున్నం. పటేల్ కొడుకు రూతమ్మ పెనిమిటి మీనికెగవడ్డడు. దుడ్డు కర్ర లేపిండు తల పగులగొట్ట. అది మేం జూసినం. ఇగ ఊకోలే.. ఆనికి ఒక్కటిచ్చుకున్నం. దుడ్డు కర్ర మా చేతుల కచ్చింది. అటెన్క వోయి ఆ ముచ్చట సంగం ఆపీసుల జెప్పినం. పటేల్ మా మీన పంచాయితీ జేస్తాడనుకున్నం. కానీ అట్ల జెయ్యలే.. సంగం ఆడోల్ల చేతిల తన్నులు తిన్నడంటే నామర్ద కద. సప్పుడు చెయ్యలే..
ఒక ఒప్పందం చేసుకున్నం. దానిమీదనే నడవాలె కద. అట్ల కాలే.. ఇగ ఏంజేత్తం.. గ్రామ పంచాయితీ కాడ పంచాయితీ పెట్టిపిచ్చినం. మేం పెట్టిపిచ్చిన పంచాయితీకి కచేరికాడికి కొచ్చిండు పటేల్. సర్పంచ్, పట్వారి వచ్చింరు. ఆల్లదంత ఒక్కటే కట్టు మాకు ఎరుకే. గందుకే మా మనసు మనసుల లేదు. ఏమయితదోనని. అగో.. గప్పుడొచ్చిండ్రు సంగం సార్లు. ఆల్లకు సూడంగనే మా మోకాలల్ల ఎలుగు. నియతి తోటి పంచాయితీ నడుస్తదని. మాకు జరిగిన అన్యాలం ఊరందరి ముంగిటవెట్టినం. చెమటలు కక్కిన కడుపు మండి మేం చేసిన పని సుత జెప్పినం. మాకేం బుగులు, మాకేం బయ్యం.. ఆ.. మాకు న్యాయం జరగకుంటే ఊకోము. పెద్దకులపోల్లు, పైసలున్నోల్లు అని సుత చూసేది లేదు. తగిన బుద్ది జెప్తాం, శాస్తి జేస్తం అని గా..ట్టిగ జెప్పినం.
సర్పంచు, పట్వారీలు మమ్ముల తప్పువట్టిన్రు. ఆల్ల మనుసులు మా మీదికి వురుకిన్రు. మేం ఊకున్నామా.. ఊకోలే.. వాళ్ళమీదకేగవడ్డం. సార్లు కళ్ళతోనే జెప్తున్నరు ఊకుండుమని. అందరికి సైసుండురని జెప్పి, ముందుగల రాంరావు పటేల్ తరీఖ మంచిగున్నదా చెప్పుంరి. తప్పుగాదా చెప్పుంరి. అది తప్పుగాకుంటే మేం జేసింది సుత తప్పుగాదని మా అక్కడికెల్లి మొగులమ్మ ముందటవడ్డది.
అనాది మీ అసొంటోళ్లు మాకు అన్యాలం జేత్తనే ఉన్నరు. మోసం జేత్తనే ఉన్నరు. ఇంగ మీ ఆటలు సాగనియ్యం. మీరు గిన ఇట్లనే ఉంటారంటే మేం సుత దుడ్డుకర్ర అందుకోనేతందుకు ఎన్కకు జూసేదెలేదు. ఇప్పటిదాంక మాలేస ఓపికదిన్నం. ఇగ మాతోని గాదు. మీ పాత తరీఖ మారకుంటే.. జూస్కోరి.. రుద్రకాళికమ్మ అయ్యింది సుశీలమ్మ.
మా సార్లు మమ్ముల బుదరకిచ్చిన్రు. నిమ్మళింప జేసిన్రు. పంచాయితీల మా తరపున మాటాడింరు. పంచాయితీ తీర్పు వచ్చింది. రాంరావు పటేల్ ముందనుకున్నట్టే మా ధాన్యం మాకు వెంటనే ఇవ్వల్నని సెప్పిన్రు. అట్లనే మావోల్లు కొంటబోయిన మోటరు తెచ్చియ్యమని జెప్పిన్రు. అట్లా మొదాటి సారి జయం మాదయింది. మేం మాదిగోల్లం. మాదిగతనం దప్ప ఏమి ఎర్కలేని ప్యాదోళ్లం, బలంలేనోల్లం, పూచికపుల్లలసొంటి ఆడోల్లం. గని అంత ఒక్క తట్టు, ఒక్క కట్టుతోని నడిసినం. ఒక్కొక్క నుల్కపోగు కలుపుకుంట తాళ్లు పేనుడు మాకు అనాది అలవాటే. అది మా కోసం గాదు.
పటేండ్ల కోసం. పెద్ద పెద్దోళ్ల కోసం.
మీకోసం మా రక్తమాంసాలు కరిగిచ్చి మీ గుమ్ములు నింపుతాన్నం. అయిన ఊర్ల పెద్దలు ఏం లేకుంటనే ఊరికి అసుంటున్న మమ్ముల ఏదో దాన్ల ఇరికిచ్చి దండిచ్చుడు, దోషిచ్చుడు చేయవట్టింరు. సన్నటి పోగులకది సమజయింది. సంగల జొచ్చినంకనే ఒక్కొక్క నూలుపోగు కలిత్తే ఎంత బలమో ఎరుకయింది.
దారప్పోగులన్నీ ఒక్క తాటిమీదున్నయి. సంగం బలమున్నది. అది ఇప్పటికయిన మాకెరుకయింది గద. ఊకుంట లేం. జరా మంచిగుండురి. లేకుంటే మేమంత మీ నుదుటి రాత మార్చేస్తాం.. మీ ఖర్మకు మీరే బాధ్యులు. అటెనుక మమ్ముల తప్పువడ్తె నడవదని ఖరాఖండి జెప్పినం. పంచాయితికాడ ఊరందరి ముంగట జెప్పినం. వాండ్ల కడుపుల భగభగ మండుతాంది. పెయ్యంత కారం ఉప్పు రాసుకున్నట్టున్నది. అయిన సప్పుడు లే.
మేము మీ కండ్లకు గడ్డిపరకలమే అయ్యుండొచ్చు. కానీ గడ్డిపరకలన్నీ ఏకమైతే తాళ్లయితయని మరుస్తున్నరు. అవే మిమ్ముల ఉరెత్తయని మరవకుంరని బాజాప్త సెప్పినం. తాళ్లు మాకోసం మేం పేనుకోవాల్నని ఆనాడే మాకు సమజయింది. మా బలమేందో మాకు ఎరుకయింది.” ఉద్వేగంతో చెప్పుకొచ్చిన సంతోషమ్మ వైపే అందరూ ఉత్కంఠతో చూస్తుండడంతో ఆమె ఒకింత సిగ్గుపడింది. అవునన్నట్లు తలూపుతూ ఉన్నది మొగులమ్మ.
“వావ్.. అద్భుతం ” చప్పట్లు చరుస్తూ అన్నాడు వినోద్.
“బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ..” అనుకున్నాడు అరవింద్.
“వీళ్లు ముందు తీస్కొని చేసిన భూమి ఎవరిదో ఏర్కేనా.. పెండ్లి కూతురు చిన్న తాతది. గాలికి పోయే కంప ఎక్కడ ముడ్డికి తగులుకుంటుందోనని ఈడ లేకుంట పోయిండు చూడు. లేకుంటేనా.. ముచ్చట కోసం మూడొద్దులయిన కదలక ముచ్చట పెడ్తుండే.. ” మీసం సర్దుకుంటూ వస్తున్న నవ్వును ఆ వెనక దాచేస్తూ లేచాడు అంతా విన్న గ్రామస్తుడు.
ఓ.. అదన్నమాట సంగతి. అందుకే అతను అట్ల మాట్లాడుతున్నాడేమో.. ఇన్నేళ్లయినా సంఘం సభ్యుల మీద అతని కోపం పోలేదన్నమాట మనసులో అనుకున్నాడు వినోద్.
దొంగకు తేలుకుట్టినట్లు తిరుగుతున్నాడనుకున్నాడు అరవింద్.
“వ్యవసాయం అంటే పండించే పంటలూ, వాటి దిగుబడులూ, మార్కెట్, వచ్చే సొమ్ములూ మాత్రమేనా..? గ్రామీణ జీవితంలో నిక్షిప్తమై ఉన్న అనేకానేక రాజకీయాలు, సంఘర్షణలు, సమస్యలు, ఆర్ధిక, సామాజిక అసమానతల వల్ల ఉత్పన్నమయ్యే బాధలూ.. వాటినధిగమిస్తూ హక్కుల సాధన కోసం చేసే పోరాటంలో ఈ గడ్డి పరక లాంటి మనుషులు సాధించే అనూహ్య విజయాలు కూడా..వ్యవసాయంలో భాగమేనని వీళ్ళ మాటలబట్టి అర్ధమవుతున్నది” ఉద్వేగంతో అన్నాడు వినోద్.
“సంగం రాక ముందు నాట్లకు, కలుపులకు, కోతలకు పోతుంటిమి. పొద్దెల్లిన కాడికెల్లి పొద్దు వాలేదంక పని పని… ఆ దున్నపోతులకన్న కనాకష్టంగ ఉంటుండే.. ఆ దినాలల్ల కూలీ ఎంత రూపాయి, సవారుపాయి ఉంటుండే.., నాకు చేను లేకుండే. ఏం లేకుండే, ఆళ్ళ తాన పనిజేస్తుంటి. దొరికినాడు దొరికినట్టు, లేన్నప్పుడు లేనట్టు.. ఈ దినం నా తాననే చేనున్నది. పంటున్నది. నా చేనుకు పోత గాని వాండ్ల చేన్లకు కాదు కద!
(ఇంకా ఉంది…)