బతుకు సేద్యం – 12

మేం వెళ్ళినప్పుడు స్వీడెన్ నుంచి వచ్చిన కొందరు యువతులు సంఘం ఆఫీసులో కలిశారు. వాళ్ళు గత రెండేళ్లుగా వీళ్ళ వ్యవసాయ పద్ధతుల మీద రీసెర్చ్ చేస్తున్నామని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

సంఘం కమ్యూనిటీ ప్రొడక్షన్ సెంటర్ దగ్గర జర్మన్ మహిళ క్లారెట్ కలిసింది. ఆవిడ పదేళ్ల క్రితం జహీరాబాద్ వచ్చి సంఘం సభ్యులతో వారం రోజులు ఉండి వెళ్లిందట. ఇప్పుడు మళ్ళీ వచ్చి వారం రోజులయిందట. ఈ మహిళల సెల్ఫ్ ఎంపవర్మెంటు ప్రాసెస్ గురించి స్టడీ చేయడానికి వారం క్రితమే వచ్చానని చెప్పింది.

సంఘం మహిళల్లో కొందరు సభ్యులు లండన్, ప్రాన్స్, కెనడా, జర్మనీ వెళ్లి అక్కడి పార్లమెంట్ ముందు వీరి పంటల విధానంపై ప్రసంగించారట. అట్లా జర్మనీ వెళ్ళినప్పుడు క్లారెట్ వీళ్ళని తన ఇంటికి తీసుకువెళ్ళిందట. పది రోజులు తన దగ్గర ఉంచుకుని అక్కడ అన్నీ చూపించి పంపించానని చెప్పింది. ఈ రైతు మహిళలంటే ఆమెకి చాలా అభిమానమట. గౌరవమట. పర్యావరణానికి, ప్రకృతికి ఆ భూమి పుత్రికలు చేస్తున్న మేలు అంతా ఇంతా కాదంటుంది క్లారెట్.

వేలమైళ్ల ఆవల ఉన్న వాళ్లకు తెల్సిన విషయాలు మనకి అసలే తెలియకపోవడం, తెలిసిన వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం, వారవలంబిస్తున్న విధానాలను అర్ధం చేసుకోకపోవడం ఆ సంఘం గురించి, ఆ రైతక్కల గొప్పదనం గురించి ఏమీ తెలియకపోవడం సిగ్గనిపించిందా క్షణాన. ఇక్కడున్న వ్యవసాయ విధానాలను, మహిళల జీవన స్థితిగతులను అధ్యయనం చేస్తున్న క్లారెట్, స్వీడన్ యువతులు తాటిచెట్టు కంటే ఎత్తులో కనిపించారు నాకు. “పోనీలే ఇప్పటికైనా తెల్సుకోగలిగినందుకు నన్ను నేను అభినందించుకున్నానుకో…” ఉద్వేగంతో అన్నది పద్మ.

జర్మనీ వెళ్ళినప్పుడు కారెట్ దగ్గర పది రోజులు ఉన్నాను అని చెప్పింది మొగులమ్మ. కారెట్ అంటే అర్ధంగాక తికమక పడుతుంటే రూతమ్మ అందుకుని క్లారెట్ తెల్లామె అని చెప్పింది. తెల్లోళ్ళు అస్సలు పనులు చెయ్యరు. అందుకే అట్ల తెల్లగ ఉంటరు అనుకున్న…కానీ వాళ్ళు కూడా అన్ని పనులు మనలెక్కనే చేసుకుంటరని మొగులమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చి నవ్వుకుంది రేఖ.

“ఏంటీ ఏం మాట్లాడవ్… ఆశ్చర్యంగానూ… అద్భుతంగానూ ఉన్నదా.” పద్మ ప్రశ్న.

“అవునే…. ఎంత అదృష్టవంతులు. ఎన్నెన్ని దేశ దేశాలు తిరిగివస్తున్నరు?” అన్నది రేఖ.

“అది వాళ్ళ అదృష్టం అంటే నేనొప్పుకోను. వాళ్ళ కృషి. అదే వాళ్ళని అక్కడికి పంపింది. వాళ్ళు సంఘం సహాయంతో చేస్తున్న ప్రయోగాలు పంపించాయి.”

అంతర్జాతీయ వేదికల మీద ఆ చిన్నకారు రైతక్కలు మాట్లాడుతున్నారు. దేశంలో ఢిల్లీ, ఒరిస్సా వంటి చాలా చోట్లకు వెళ్లామని చెప్పారు కొందరు. మరి మన యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి…? మనకు సమీపంలోనే జరుగుతున్న ప్రయోగాల్ని పట్టించుకుంటున్నాయా… ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నాయో…” అన్నది పద్మ.

“వాళ్ళ మీడియా ఆక్టివిటీస్ చూశావా…” అడిగింది రేఖ.

“టీవీలో అనుకోకుండా చూశాను. ఛానెల్స్ తిప్పుతుంటే వీడియో షూట్ చేస్తున్న గ్రామీణ మహిళ కనిపించింది. అది చూశాను. పొలం పనులు కార్యక్రమంలో చూపించారు. అది సాధారణంగా మనం ఎవ్వరం చూడని కార్యక్రమం. ఆ తర్వాత వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు చాలా తెలుసుకున్నా…

నీకు తెల్సా… ఏమీ తెలియనివాళ్లుగా కనిపించే వాళ్ళు 50 పైగా డాక్యుమెంటరీలు చేశారట. నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీసులో ఉన్నవాటిలో రెండు నాపెన్ డ్రైవ్ లో కాపీ చేసుకొచ్చా…” చెప్పింది పద్మ.

“రియల్లీ… గ్రేట్… ఐయామ్ సో క్యూరియస్ అబౌట్ ఇట్. వాటిని నాకు మెయిల్ చెయ్యగలవా…” ఆత్రుతతో అడిగింది రేఖ.

ఆ తర్వాత తానే చెప్పటం మొదలు పెట్టింది. “గత నెలలో మా ఊరు వెళ్లాం చూడు. అప్పుడు జహీరాబాద్ అవతల కర్ణాటక బార్డర్ లో బంధువుల పెళ్లికి వెళ్ళాం. అప్పుడక్కడ ముగ్గురునలుగురు మహిళలను అనుకోకుండా కలిశాం. అప్పటి నుంచి మా ఇంట్లో సంఘం గురించి, సంఘం మహిళల గురించి, వాళ్ళ వ్యవసాయం గురించి అనేక చర్చలు, ఆలోచనలు పురుడు పోసుకుంటున్నాయి. ఇప్పుడూ సీరియస్ గా సాగుతున్న మా చర్చని, ఆలోచనలను నీ ఫోన్ బ్రేక్ చేసింది ” అంటూ నవ్వేసింది రేఖ.

“నిజమా…” పద్మ గొంతులో ఆశ్చర్యం.

“అవునే…” అంటూ ఆ నాటి ముచ్చట చెప్పింది రేఖ.

ఆరోజు పెళ్లి అయిపొయింది. మేం బయలుదేరదాం అనుకునేప్పటికి మా ఆడపడుచు పిల్లలు కదల్లేదు. ఇంకాసేపు అన్నారు. వాళ్ళకి ఆ పల్లెలో మేకపిల్లలతో ఆడడం, కుక్క పిల్లల్ని చూడడం, కోడిపిల్లలతో గడపడం చాల ఇష్టంగా ఉంది.

పెళ్లికొడుకు వాళ్ళు కూడా ఉండడంతో సరే లే… అంత హడావిడిగా వెళ్లి చేసేది ఏముందిలే… వాళ్ళని ఎంజాయ్ చెయ్యనిద్దాం అని ఇంకాసేపు ఉండిపోయాం. సంఘం మహిళలు మొగులమ్మ, సంతోషమ్మ, రూతమ్మ మాతో ముచ్చట పెడుతూనే ఉన్నారు. అంతలో మొగులమ్మ కూతురు పూలమ్మ హడావిడిగా వచ్చింది. ఆమెకు పెళ్లయి ఐదేళ్ల లోపు పిల్లలున్నారట.

అమ్మా… ఇంటికాడ నా పిల్లలు ఉన్నారు. చూసుకో… ఆనంద్ రావడానికి టైం పడ్తది. ఒక రికార్డింగ్ కోసం పోయివచ్చిన. కుదిరితే ఇంకోదానికి పోవాలె అని ఆమె తల్లి మొగులమ్మతో చెప్పింది. రికార్డింగ్ ఏమిటో ఆసక్తిగా చూస్తున్న మాతో ఇక మేము పోయస్తం. ఇది నా బిడ్డ పూలమ్మ. సంఘం రేడియోకు పనిచేస్తది అని లేచి నించుని కొంగు భుజం చుట్టూ తిప్పుకుంటూ చెప్పింది మొగులమ్మ.

అప్పటికే వాళ్ళ మాటల్లో పూలమ్మ పేరు విన్నాను కాబట్టి తనేనా పూలమ్మ అని ఆమెకేసి ఆసక్తిగా చూశాను. అక్కడున్న మిగతావాళ్ళు అదేవిధంగా చూస్తుంటే కొంచెం ఇబ్బంది పడింది పూలమ్మ. ఆ మాట దూరంగా కూర్చున్న పెళ్లి కూతురు పెద్దమ్మ కూతురు విన్నది కావచ్చు. ఒక్క అంగలో చటుక్కున వచ్చింది.

నువ్వా పూలమ్మ అంటే… సంఘం రేడియోలో యారాళ్ల ముచ్చట్లు పెడ్తవు… ఆమెవేనా… అని అడిగి సందిగ్ధంగా చూసింది. అవునన్నట్లు సిగ్గుపడింది పూలమ్మ.

మేము మీ సంఘంల లేం. గానీ… మీ సంఘం రేడియో ముచ్చట్లు ఎప్పటికి వింటం. ఎప్పుడెప్పుడు సాయంత్రం ఏడవుతది అని టైం చూస్కుంటం. టీవీ ల సీరియళ్ళకంటే మీ ముచ్చటనే మంచిగుంటది. నువ్వు బిచ్చపోళ్ళ తోటి మస్తు ముచ్చట జేస్తవ్ గద… కళ్ళు పెద్దవి చేసి గుండ్రంగా తిప్పుతూ అడిగింది పెళ్లికూతురు పెద్దమ్మ బిడ్డ.

ఆమె పూలమ్మను ఆకాశంలోంచి దిగివచ్చిన వ్యక్తిని చూసినట్లు ఆరాధనపూర్వకంగా చూస్తున్నది. ఆమె మనసులోని ఆనందం పచ్చటి మొఖం మెరుపులో ప్రతిఫలిస్తున్నది. ఇది సంఘం రేడియో. వింటున్న మీ అందరికీ నమస్తే అని పలకరిస్తావు కదా… అప్పటి సంది మా ఇంటిల్లిపాది చెవులూ రేడియాకు అతుక్కుపోతాయి. నీ పలకరింపు ఇంటుంటే మా ఇంటి మనిషివన్నట్టే ఉంటది. నీ గొంతు మల్ల మల్ల వినసొంపుగా ఉంటది.గలగలా మాట్లేడేస్తున్నది. ఇంకొంతమంది వచ్చి చుట్టూ చేరారు. ఆ మాటలు వింటూ. పూలమ్మ అంటే ఇంత చిన్నామెనా… మస్తు పెద్దామె అనుకున్న అంటున్నారు ఆ గుంపులోంచి ఒకరు. ఎన్నడన్న జల్ది పండుకుంటే లే… లెవ్వు సంగం రేడియో టైమయిందని మా బాపమ్మ లేపుతది. అమ్మ వంట పనులు కానిచ్చుకొని కూసుంటది. ఒక్క మా ఊర్లె నేనా… ఈ చుట్టుముట్టు అన్ని ఊర్లల్ల అంతే… చీకటియితందంటే ఇంట్ల అందరు జమయితరు. సంఘం రేడియో కోసం ఎదురుజూస్తరు. తలా ఓ మాట చెబుతున్నారు.

ఆమె అట్లా అడగడం చూసి పూలమ్మ లోపల్లోపల ఆనందపడుతున్నది. అవునని తలూపి చిరునవ్వుతో చెప్పింది పూలమ్మ. అప్పుడు నేను అడిగిన పాట ఏసినవ్ గుర్తున్నదా… అడిగింది ఆమె. అట్లనా… నవ్వింది పూలమ్మ.

మీ యారాండ్లు దునియా ముచ్చట్లన్నీ పెడ్తరు. అవ్వన్నీ మీకెట్ల తెలుత్తయ్… మీ యారాలు రాలే… అడిగిందా యువతి. దాదాపు ఆమె వయసే ఉన్న పూలమ్మను ఒక సెలబ్రిటీ గా చూస్తున్నది ఆమె. అందరి చూపూ పూలమ్మపై కేంద్రీకృతం అవడంతో కొద్దిగా ఇబ్బందిగా కదిలి ‘ఆమె నేను యారండ్లం కాదు. ఇద్దరం రేడియో కి పనిజేస్తం ‘ చెప్పింది పూలమ్మ.

‘అయ్యో… అట్లనా… మీరిద్దరూ సొంతం యారాండ్లే అనుకుంటం మేం’ అన్నది నమ్మలేనట్లుగా చూస్తూ. తాను అప్పటివరకు విన్న కార్యక్రమాల గురించి చాలా చాలా ముచ్చట్లు పెట్టాలని ఉబలాటపడిపోతున్నది ఆమె.

ఇయ్యల్ల పాతపంటల జాతర అయింది. అక్కడికెళ్లి రాంగ రాంగ పెర్కపెల్లి కాడ బిచ్చపోల్లు ఉన్నారని తెల్సింది. సీదా అటేపొయ్యి రికార్డు చేసుకొని ఇటొచ్చిన. పోయి ఎడిటింగ్ చేసుకోవాలె. అంతలకంటే ముందు ట్రాన్స్మిషన్ టైం అవుతున్నది. పోవాలె. ఏమనుకోకున్రి… వినమ్రంగా చెప్పింది పూలమ్మ. పద్మా… ఇంకో విశేషం ఏంటో తెలుసా…

దళిత, గ్రామీణ, నిరక్షరాస్య మహిళలు నిర్వహిస్తున్న మీడియా కార్యక్రమాలు అంతర్జాతీయ గుర్తింపు పొందడమే కాకుండా కమ్యూనికేషన్ ఫర్ సోషల్ చేంజ్ అవార్డు కింద అంతర్జాతీయ పోటీలో ‘అవుట్ స్టాండింగ్ వర్క్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ ‘ (విధికి మించిన విశేష కృషి ) ప్రశంస పత్రం అందుకున్నారు. ఆడియో వీడియో ఈ వ్యవసాయ నిరక్షరాస్య మహిళలే నిర్వహించడం గొప్ప విషయం” గబగబా చెప్పింది రేఖ.

“అవునా… ఆ అమ్మాయి రేడియో ప్రసారాలు చేస్తుందా… ఏం చదివిందట” గొంతులోకి వస్తున్న ఆశ్చర్యాన్ని దాచేస్తూ ప్రశ్నించింది పద్మ.

“అదే ఆమె దిగులట. రేడియోకి అవుట్ డోర్, ఇండోర్ రికార్డింగ్ చేస్తుంది, ఎడిటింగ్ చేస్తోంది. ఇంటర్వ్యూ లు చేస్తుంది. గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తుంది. రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. ట్రాన్స్మిషన్ చేస్తుంది. ఆక్టివిటీ లాగ్ చేస్తోంది. రేడియో జాకీ గా వ్యవహరిస్తుంది. కానీ ఆమె చేతిలో డిగ్రీ లేదు. అదే దిగులు అని చెప్పింది పూలమ్మ.”

“వావ్… గ్రేట్ లేడీ. డిగ్రీ దేముంది… ఇవ్వాళ కాకపొతే రేపు ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో బోలెడన్ని ఆప్షన్స్” అభినందించకుండా ఉండలేకపోయిన పద్మ.

“నేనూ అదే చెప్పాను. ఓపెన్ డిగ్రీ చేయమని. ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టానని చెప్పింది. ఇంకో విషయం తెలుసా… తాను చదివిన 10 తరగతి కూడా మనం చదువుకున్నట్లు ఫార్మల్ స్కూల్ లో కాదు. నాన్ ఫార్మల్ స్కూల్ లో చదివిందట. ఆమె స్కూల్ మాత్రం నాకు చాలా చాలా నచ్చేసింది, నాకేంటి… ఎవరికైనా ఇట్లే నచ్చేస్తుంది.”

“ఏంటో అంత గొప్పదనం? నువ్వు చూశావా?”

“లేదే…” విన్నాను.

ఇప్పుడు ఆ స్కూల్ నడపడం లేదు. కానీ బిల్డింగ్స్ ఉన్నాయి. స్కూల్ పేరే పచ్చబడి. పిల్లలు వయసు ఎక్కువుంటుంది. చిన్న క్లాసులో కూర్చోవాలంటే నామోషీగా ఫీలవుతారని వాళ్ళ క్లాసులకి పక్షుల పేర్లు పెట్టారట. పూలమ్మ పదమూడేళ్ల వయసులో పావురం క్లాస్ అంటే మూడో తరగతిలో చేరిందట. ఐదో సంవత్సరానికి 10 తరగతి పరీక్షలు రాసిందట. వాళ్ళ స్కూల్ సిలబస్, సెలవులు అన్నీ భిన్నంగానే ఉన్నాయి.

“ఏదో ఎక్స్పెరిమెంటల్ స్కూల్ లా ఉందే…”

“అవును సంఘం తరపున నడిపిన స్కూల్ అంట. ఇప్పుడు బడికి వెళ్లని పిల్లలే లేరట. వాళ్ళ సంఘాల్లోని కుటుంబాల్లో. చాల మంది ఆరో తరగతికి వచ్చేసరికి హాస్టల్స్ లో చేరిపోతున్నారట.”

“చాలా తెల్సుకున్నావే…”

“ఇవేనా ఇంకా చాలా కబుర్లున్నాయి. వాళ్ళ గురించి. వాళ్ళ పంటలు, వాళ్ళ బతుకులు ఎట్లా పండించుకున్నారో…”

మొదట్లో నారో కాస్ట్ చేసే వాళ్ళం అని చెప్పింది పూలమ్మ. అదేంటో నాకర్ధం కాలేదు. గ్రామాల్లో సంఘం కార్యకర్తలు క్యాసెట్ లో రికార్డు చేసుకొచ్చిన కార్యక్రమాలు టేప్ రికార్డర్ లో వేసి అందరినీ ఒకదగ్గర కూర్చోబెట్టి వినిపించేవారట. ఒకరివి ఇంకకరికి, వాళ్ళవి వీళ్ళకి, వీళ్ళవి వాళ్ళకి అట్లా.

“ఓ చాలా మంచి ఐడియా కదా… వాళ్ల సంఘం కార్యక్రమాల్లో రేడియో పాత్ర ప్రధానమైనదే నన్నమాట.”

“అవును, ఇప్పుడు అంటే 2008 నుండి పూర్తి స్థాయి ప్రసారాలు ప్రారంభించుకున్నారట. దేశంలో మొట్ట మొదటి కమ్యూనిటీ రేడియో తమదేనని చాలా గర్వంగా చెప్పింది పూలమ్మ. అయితే అనుమతుల కోసం ప్రభుత్వంతో చాలా యుద్ధమే చేయాల్సి వచ్చిందట. మా మాటలు మేమే చెప్పుకుంటాం. మీ రేడియోలో మాకు జాగా ఉండదు. మా మాట, మా పాట, మా ముచ్చట, మా పంటలు, మా తిండి, మా తిప్పలు అన్ని మావి మేమే చెప్పుకుంటాం అని పోరాడి తెచ్చుకున్నాం అని చెప్పింది.”

“రేడియోకి పనిచేయాలన్న ఆలోచన ఆమెకెలా వచ్చిందో… నాకూ చిన్నప్పుడు రేడియో వింటుంటే నేనూ అట్లా రేడియోలో మాట్లాడాలి చాలా అనుకునేదాన్ని… కానీ ఏం చేయాలో ఇప్పటికీ తెలియదు.” అని పద్మ నవ్వేసింది.

“చిన్నప్పటి నుంచి నారో కాస్ట్ చేసేదట వాళ్ళ ఊళ్ళో… కానీ అసలు రేడియో కేంద్రం ప్రారంభం అవుతున్నప్పుడు ట్రాన్స్మిషన్ చేయమని సంఘం వాళ్ళు చెప్పారట. నా బొంద… నేనేం జేస్త. కూలీ పనులు జేసుకునుడు తప్ప అనుకుందట. ఇట్లా అసలు ఊహించలేదు. కలలో కూడా అనుకోనిది జరిగింది. నాకు చాలా సంతోషాన్నిచ్చింది. గౌరవాన్నిచ్చింది. దేశాలు, విదేశాలు తిప్పింది ఈ రేడియో అని చెప్పింది పూలమ్మ. అప్పుడామె మోహంలో తొణికిసలాడిన గర్వరేఖ, కళ్ళలోని మెరుపు చూస్తే ఎంత ముద్దొచ్చిందో…” వెంటనే ఒక హాగ్ ఇచ్చేసా. బోలెడు సిగ్గుపడిపోయింది.

“ఓ… ఈమె కూడా విదేశాలకు వెళ్లి వచ్చిందా…”

“అవును, ఆకాశంలో పిట్టలాగా ఎగిరే విమానాల్ని ఆశ్చర్యంతో చూసిన తాను ఆ విమానం ఎక్కి శ్రీలంక, బాంగ్లాదేశ్, నేపాల్ వెళ్తానని ఎప్పుడయినా అనుకున్నానా… ఇట్లా తనకొక గుర్తింపు వస్తుందనీ అనుకున్నానా అన్నది పూలమ్మ. భలే మాట్లాడింది. ఆమె మాటలు చాలా క్లుప్తంగా చెప్పాను కానీ, స్థానిక సామెతలతో పలుకుబడులతో కలిపి ఆమె మాట్లాడే భాష చాలా వినసొంపుగా ఉంటుంది. ఆమె ఎంత సేపు మాట్లాడినా అసలు బోర్ రాదు, విసుగు రాదు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. గొంతులో తియ్యదనంతో పాటు ఆత్మీయత రంగరించి ఉంటుంది ఆమె చెప్పే ముచ్చట.

పూలమ్మ తో పాటు వాళ్ళ రేడియో స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొకావిడ పరిచయం అయింది. పూలమ్మతో పాటే పచ్చబడిలో చదివిందట. కాని పూలమ్మ కంటే చాలా పెద్దది. పదో తరగతి తర్వాత నర్సు ట్రైనింగ్ చేసిందట. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా వెళ్లనని సంఘంలోనే, సంఘం వాళ్ళకే పనిచేస్తున్నదట.

ప్రభుత్వ ఉద్యోగం వదిలేసిందంటే ఆశ్చర్యం వేసింది. అదే అడిగాను. నేను సర్కారు నౌకరీలో చేరితే ఇప్పటికంటే ఎక్కువ పైసలు సంపాదించేదాన్నేమో కానీ ఇప్పుడు అంతకంటే గొప్ప సంపద నాకున్నది. మా ఊర్లల్లో వాళ్ళ అభిమానం ముందు, సంపాదించుకున్న గౌరవం ముందు ఆ పైసలు చాలా చిన్నవి అంటుంది ఆమె. వారంలో ఒకరోజు సంఘం రేడియో కి పనిచేస్తుందట. పని మీద గ్రామాలకు వెళ్ళినప్పుడు, ట్రైనింగులప్పుడు వచ్చిన వాళ్ళతో సంభాషించే విషయాల్ని అవుట్ డోర్ రికార్డు చేసి తెస్తుందట. పూలమ్మ దగ్గర కూర్చొని ఎడిటింగ్ చేయిస్తుందట.

ఎన్నెన్ని విషయాలు… వాళ్ళతో మాట్లాడం… నీవన్నట్లు మనకో ఎడ్యుకేషన్. ఏ పుస్తకాల్లో దొరుకుతుంది…? నువ్వు పదిమందిలో తిరుగుతావు, వేరే దేశాలకు పోయొస్తున్నావు. మీకంటూ ఒక గుర్తింపు ఉంది. ఎక్కడికి పోయినా నిన్ను రేడియో పూలమ్మ అని గౌరవం ఇస్తున్నారు. అట్లాటప్పుడు మీ ఇంట్లో… అంటే మీ ఆయన దగ్గర నుండి ఎటువంటి సమస్యలు వచ్చాయని అడిగాను.

అందుకామె పెద్దగా నవ్వేసింది. ఆలా నవ్వుతూనే ఇప్పటివరకయితే అట్లాటివి మా మధ్య రాలేదు. నేను సంఘంల పనిచేస్తున్న. అంత నాకే తెలుసని ఎప్పటికి అనుకోను. బయటి వాళ్లకు నేను గొప్పేమో కానీ మా ఆయనకు ఎందుకు గొప్ప. మేం ఆలుమగలం. అంతకుమించి దోస్తుల్లెక్క ఉంటం. కావాలని కోరి కోరి చేసుకున్నాడు కదా… ఇప్పటివరకయితే ఏం పంచాయితీలు పెట్టలేదు. ఎప్పుడన్నా కోపమొస్తే మొఖం మాడ్చుకుంటాడు. నాకు కోపమొస్తే సప్పుడు చెయ్యక బయటికి నడుస్తా… అంతే. ఆ తర్వాత మామూలే… ఎప్పటిలెక్కనే ఉంటాం అని చెప్పింది అన్నది రేఖ.

స్త్రీ పురుష సంబంధాల్లో ఎక్కువ తక్కువలు, అధిపత్యాలు, అహంకారాలు లేకుండా కుటుంబాన్ని నడుపుకోవడం వారి పరిణతిని చూపిస్తున్నది కదా…చదువుకున్న మనకంటే, వాళ్ళ మధ్య ఉన్న పరస్పర అవగాహన ఎక్కువనుకుంటా… అన్నది పద్మ. కొన్ని క్షణాలు ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు.

ఆ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ, “ఆ…, నువ్వు విన్నావో లేదో గానీ వాళ్ళ మరో వండర్ఫుల్ కాన్సెప్ట్ అత్తాకోడళ్ల సంఘం. నాకయితే భలే నచ్చేసింది. అత్తలు, కోడళ్ళకు తాము చేసిన, చేస్తున్న పాతతరం వ్యవసాయ పద్ధతులను, ఆహారపు అలవాట్లను నేర్పడం ద్వారా వారసత్వ మార్పిడీ చేస్తున్నారు. అస్తిత్వం పొల్లు పోవడం లేదు. శతాబ్దాల ఉనికి అలాగే కొనసాగుతుంది. భవిష్యత్ తరాలకు అందుతుందని చెప్తున్నారు.

ఆ విధంగా తరతరాల విత్తన సంపదను, ఆహారపు అలవాట్లను, భూములను కాపాడుకుంటామని, జన్యుమార్పిడి పంటలు వేయమని, అమ్మలు అత్తలు వారసత్వంగా ఇచ్చిన తిండిని, పశువుల మేతను, చెట్ల మందులను చేతిలోకి తీసుకుని తర్వాతి తరాలకు అందిస్తామని వారసత్వం అందుకున్న మహిళలు తీర్మానం చేశారట. ” అన్నది పద్మ.

“వండర్ఫుల్… అయితే… పాతతరం బాటలోనే నడవాలనడం… ఎక్కడో నాకు మింగుడు పడడం లేదు. మనిషి జీవితం ప్రవహించే నది లాంటిది. నది ఎప్పుడూ మార్గంలో ఏర్లనుండి, సెలయేర్లనుండి, వాగులు వంకల నుండి వచ్చే కొత్త నీటిని కలుపుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటుంది. నిలువ ఉంటె ఆ నీరు మురిగి కంపు కొడుతుంది. మనిషి జీవితమైనా అంతే కదా…” సాలోచనగా రేఖ.

“అట్లా ఎందుకనుకుంటావు? పాతనించి తీసుకున్న మంచితో భవిష్యత్ నిర్మించుకోవడం అని ఎందుకనుకోవు. ఆధునికం అవడం ఎందుకనుకోవు…” అన్నది పద్మ.

“అవునవును, నీవన్నదీ నిజమే కావచ్చు. సంఘం మహిళల వ్యవసాయం విధానం, వంటలు, మార్కెట్ పద్ధతులు చూసినా, టెక్నాలజీ వినియోగం చూసినా వాళ్ళ ముందు చూపు, ఆధునిక పరిజ్ఙానం అర్ధమవుతూన్నది. మర్రి వృక్షం కింద మరో మొక్క మొలవదు అన్న సామెతను బద్దలు కొడుతున్నారన్నమాట. వృక్షాల్లా ఎదిగిన ఆ మహిళలు. వాళ్ళే మరిన్ని మొక్కలు నాటి నీళ్లు పోసి పెంచి తమ వారసత్వాన్ని ముందుకు తీసుకుపొమ్మంటున్నారన్న మాట” అన్నది రేఖ.

“ఎగ్జాట్లీ… రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పోషకాహారలోపం సమస్య ఉన్నది. ఈ సమస్యను అధిగమించడం కోసం చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ సంఘం వాళ్ళు ఉద్యమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం పదిరాష్ట్రాలలోని సంస్థలతో కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారట. పౌష్టికాహారానికి చిరునామా చిరుధాన్యాలు. ఆహార భద్రతను, పోషకాహార భద్రతను సాధించాలంటే పాతతరం పంటల పట్ల ప్రజల్లో అవగాహన కల్గించడం కోసం రాష్ట్రాల సమాఖ్యలు ఏర్పరచడంలో సంఘం ప్రధాన పాత్ర పోషిస్తున్నదట. అందులో భాగంగా సంఘం పనిచేస్తున్న గ్రామాలలో ముప్పై నుంచి నలభై మంది సభ్యులతో కూడిన చెల్లెళ్ళ సమాఖ్యలు ఏర్పడ్డాయట.

తెలుగురాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒరిస్సా, ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, నాగాలాండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదువేల మంది సభ్యులు ఉన్నారట. వీళ్లందరి అధ్యక్షురాలుగా మణెమ్మ బాధ్యతలు నిర్వహిస్తున్నదట. చిరుధాన్యాలతో పాటే కూరగాయల సాగు చేస్తూ తమ ఆదాయం పెంచుకునే విధంగా కూరగాయపంటల సమాఖ్య ఏర్పాటు చేసుకున్నారట. సేంద్రియ పద్ధతుల్లో పండించే కూరగాయలు, చిరుధాన్యాలను, పోషకాహార భద్రతతో పాటు ఆదాయ భద్రతకు కృషి మొదలుపెట్టారు.

వారి పంటలద్వారా ఆరోగ్య భద్రత సాధించాలని మా ఆకాంక్ష. చెప్పి ” ఆ…” అన్నది పద్మ.

“మా క్వార్టర్ లో ఉన్న స్థలంలో నేనూ నా ప్రయత్నం మొదలుపెట్టాలి…” నవ్వింది రేఖ.

“సారీ… ఏమనుకోకే… వాకింగ్ కి టైం అయింది. మా వాళ్ళు వచ్చేశారు. పిలుస్తున్నారు” అంటూ ఫోన్ పెట్టేసింది పద్మ.

“ఏరీ… కిషోర్ వాళ్ళు… వెళ్లిపోయారా…” లోనికి వస్తూ ఖాళీగా ఉన్న కుర్చీలు, ఒంటరిగా కూర్చున్న వినోద్ ని చూసి అడిగింది రేఖ.

“వాళ్లెప్పుడో వెళ్లిపోయారు… వాళ్లెళ్లడం కూడా గమనించనంతగా లీనమై పోయారు ముచ్చట్లలో… హమ్మయ్య… ఇప్పటికయినా అయింది… అసలు మీ కోసమే ఈ ఫోన్ కంపెనీలు పోటీపడి చార్జీలు తగ్గించేసినట్లున్నాయి… లేకపోతే బిల్లు తడిసి మోపెడయ్యేది…” నవ్వాడు వినోద్?

“ఆ…అవును మరి. అయినా ఆ విషయం మాకు తెలీదా… ఏంటి? సంఘం గురించి, వీడియో, రేడియో ఉపయోగిస్తున్న వాళ్ళ గురించి ముచ్చట్లలో… అలా అలా…” చెప్పింది రేఖ.

“అహ్హహ్హా. హా ఏంటీ పద్మతో కూడా సంఘం మహిళల ముచ్చట్లేనా…” విస్మయంగా భార్యకేసి చూస్తూ వినోద్.

“అవును, పద్మ సంఘం ఆఫీసుకు వెళ్లి వాళ్ళని కలసి వచ్చిందట. తాను చూసిన విషయాలు తాను, నేను చూసినవి నేను ఇద్దరం చెప్పుకోవడంలో సమయమే తెలియలేదు. మనమే కాదు పద్మ వాళ్ళు కూడా సంఘం మహిళల చైతన్యం ముందు, అనుభవాల ముందు మనం బలాదూర్ అనుకున్నారట. స్ఫూర్తిదాతలుగా అనిపిస్తున్నారు కదా…” దోమలు రాకుండా మెష్ డోర్ వేసి వచ్చి కూర్చున్న రేఖ భర్త కేసి చూస్తూ అన్నది.

ఆ రోజు విన్న సంఘం రేడియో అతని మదిలో మెదిలింది. మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు.

‘సంఘం రేడియో వింటున్న మీ అందరికీ నమస్తే… అందరూ బాగున్నారా… ఏం జేస్తున్నరు? పొద్దుబోయింది. శెనిగలు రాశులవుతూన్నాయేమో… పొద్దంత చేన్లల్ల పనులన్నీ ముగిచ్చుకోని ఇంటికొచ్చిన్రు గదా… మరి పిల్లలను జ్యూసుకుంట… రొట్టె కూర జేసుకుంట సంగం రేడియో తట్టు ఒక చెవి పెట్టుకుంటే మంచిగుంటదని నేను కోరుతున్న.

ఈ రోజు ఫిబ్రవరి 12, 2019 సంవత్సరం, మంగళవారం. ఇవ్వాళ మనవూరి పంటలు, బాలానందం, యారాళ్ల ముచ్చట్లు,….ఇయ్యాల్ల పాత పంటల జాతర ముంగిపు అయినది కదా. అందరు పోకపోవచ్చు… అది లైవ్ ఇచ్చినం. మీరు ఇన్నరోలేదో… అసొంటోళ్ల కోసం కెనడా దేశం నుంచి వచ్చిన మేడం మనకోసం ఏం ముచ్చట చెప్పిందో విందురు. మీ పనులు మీరు జేసుకుంట వింటరు కదా…’

“వావ్… వండర్ ఫుల్ వినోద్… మీరు రికార్డు చేసిన విషయమే చెప్పలేదు. ఆ గొంతు వింటుంటే మళ్ళీ పూలమ్మతో మాట్లాడినట్లే ఉంది. ఎంత నిండుగ మాట్లాడింది” మెచ్చుకోలుగా అంది రేఖ.

ఇంతలో ఆటల నుండి పిల్లలు వచ్చారు. పిల్లల పనులు వంట పనిలోకి వెళ్ళిపోయింది రేఖ. ఆలోచనలతోనే వాకింగ్ కి వెళ్ళిపోయాడు వినోద్.

***

తమ ప్రయోగ ఫలాల లోతుల్లోకి పొతే అంతా డొల్లగానే అనిపిస్తున్నది అతనికి ఆలోచిస్తుంటే… అవి తెగడంలేదు. చాలా గజిబిజిగా అల్లుకుపోయాయి. పంటల దిగుబడి పెరిగింది సరే… రాబడి పెరిగిందా…?
అయితే బుక్కెడు బువ్వ పెట్టే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆ ప్రశ్న పదే పదే రగులుతూ…

భూగర్భాన్ని చీలుస్తూ వేసే బోర్లలో నీళ్లు పడక ఒకదాని తర్వాత ఒకటి వేయడం, అందుకు చేసిన అప్పులు, నేల చీల్చుకుని మొలకెత్తని నాసిరకం విత్తనం, పెరిగిన పంటని చీల్చి చెండాడే పురుగులు, డస్సిపోయిన భూమి ఎరువులు, పురుగుమందులు, పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టం చేస్తే లేని ధర… అప్పుల మోత… అన్నదాత ఆత్మహత్యలు… ఇలా ఎన్నెన్నో… ఆలోచనలు రొదచేస్తూ… కుటుంబ పెద్ద తనదారి తాను చూసుకున్నప్పుడు ఆ కుటుంబం ఏమైపోతున్నది…? మదిలో రేగిన తుట్ట ఒళ్ళంతా కుట్టేస్తూ.

ఆ మొగులమ్మ ఏమన్నదీ… మాకు విత్తనాలకోసం వెంపర్లాడడం, ఎరువుల కోసం కుస్తీపట్లు పట్టడం, గంటల కొద్దీ లైనులో నిలబడడం, విత్తన సంక్షోభం ఏమీ ఉండదు. మా విత్తనాలు మేము చేసుకుంటాం. అవసరమైతే ఒకరికొకరం ఇచ్చి పుచ్చుకుంటాం. మా విత్తన బ్యాంకులు మేము నడుపుకుంటున్నాం అన్నది. మేమిప్పుడు ఒకళ్ళకిచ్చేటోళ్ళమే కానీ ఒకరి ముందు చెయ్యి చాచేటోల్లం కాదన్నది…

నిజమే, ఆమె మాటల్లో నిజాయితీ ఉన్నది. హైబ్రీడ్ పేరుతో నాసిరకం విత్తనాలు కొని మోసపోవడం, అధిక ధరలతో అనివార్యంగా కొనుగోలు చేయడం, ఇతరుల మీద ఆధారపడడం ఏమీ లేవు వీళ్లకు.
ఆహారపంట ఉత్పత్తులు బాగా పెంచేసుకోవచ్చని కల్పించిన భ్రమల్లో పడిన రైతు సంప్రదాయ విత్తనానికి దూరమయ్యాడు. తన దగ్గరి సంపదను తానే దూరంచేసుకుంటున్నానని తెల్సుకోలేకపోయాడు. కోల్పోయిందేమిటో ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. ఫలితంగా అనేక నష్టాలకు గురవుతున్నాడు.

ఇప్పుడు ఈ ప్రాంతంలో పండే పాత పంటలు స్థానిక అవసరాలు తీరిన తర్వాత ఎంత మందికి అందించగలరని అడిగినప్పుడు ఆ రైతక్కలు చెప్పిన విషయాలు కళ్ళముందు నిలిచాయి.

‘మా పక్క జిల్లా కలెక్టర్ పౌరసరఫరాలో జొన్నలిద్దామని అనుకుంటున్నాం. మీరు సరఫరా చేస్తారా అని ఫోన్ చేసి అడిగాడు. ఆలోచించుకొని చెప్తాం అని చెప్పినం. మా సంఘంలో చర్చచేశాం. చేయొచ్చు అనుకున్నాం. వాళ్ళిచ్చే రేటు కూడా గిట్టుబాటవుతుంది. అంతా బాగానే ఉంది. మేం మా విస్తీర్ణం పెంచి పంట పండిస్తాం. ఈ లోగా ఆ కలెక్టర్ మారిపోతాడు. అప్పుడు కాదంటే… ఒక ప్రశ్న వచ్చింది. అట్లా ఒక పంటకి డిమాండ్ వచ్చినప్పుడు రైతు ఒకే పంట విధానానికి పోతాడు కదా అన్నది ఇంకొక ప్రశ్న.

ఏక పంట మా లక్ష్యం కాదు. కలిపి పంటలు వేయడం మా పద్ధతి.అన్నిటికంటే ముఖ్యంగా మా పంటలను ప్రభుత్వం గుర్తిస్తుందా… మిగతా పంటలకు ఇచ్చినట్లు మా పంటలకూ ప్రభుత్వ విధానాలు వర్తింప చేస్తుందా… అట్లా ఇస్తామన్న రోజున మేమే కాదు మా చుట్టూ ఉన్న రైతులు సంప్రదాయ పంటలు పండించడానికి ముందుకు వస్తారు అని చెప్పినాము… తర్వాత ఆ కలెక్టరు నుంచి జవాబు లేదు.

‘అయ్యో… అట్లా ఎందుకన్నారని అడిగినప్పుడు’ ఆయన ఒక జిల్లా అధికారి. మమ్ములను అడిగే బదులు ఆ జిల్లాలో ఉన్న మెట్ట రైతులను సాంప్రదాయ పంటలవైపు మళ్లించవచ్చు. తిండి పంటలు పండించుకొమ్మని చెప్పవచ్చు. కానీ అట్లా చేయలేదు. అక్కడే ఆ అధికారి ఫెయిల్ అయ్యాడనుకున్నం.

అక్కడంతా పత్తి పండిస్తారు. అడవుల్లోపలికి కూడా పత్తి చొచ్చుకపోయింది. తిండి పంటలు తగ్గిపోయినయ్. పత్తి మీద మస్తు మంది రైతులు చచ్చిపోయిన్రు. మేము పదేళ్ల క్రితమే జోడేఘాట్ దిక్కుపోయి షూటింగ్ చేసుకొచ్చినం. ఆ సినిమా అప్పటి ముఖ్యమంత్రికి చూపెట్టినం. పత్తి బందుపెట్టియ్యమని తిండి పంటలు ప్రోత్సహించమని అడిగినం ఆయనను కలిసి. ఒక ఏడాది రాష్ట్రంల పత్తి బందు పెట్టిచ్చిండు… అంతే ఏమయిందో ఏమో… మళ్ళీ పత్తి ఇంకా ఎక్కువయింది.

అప్పట్లో మా దగ్గర పత్తి లేకుండే… ఎక్కడో తప్ప… ఇప్పుడు చూడండి నల్లరేగడి ఎక్కడుంటే అక్కడ పత్తి కనిపిస్తాంది. ఇక తిండి గింజలు కరువు కాక ఏమయితది…? మనుషులకేనా… గొడ్డు గోదకు కూడా తిండి కరువే… పిట్టలకు కరువే… భూతల్లికి బరువే…అవుతది.

అక్కడ జోడేఘాట్ దిక్కు చూసిన… చివరాఖరికి వాళ్ళు తాగే నీళ్లు కూడా విషమే. అక్కడి వాళ్లు వాగుల్ల వంకల్లో నీళ్లు అట్లనే తాగుతరు. పత్తికి కొట్టిన మసాలా విషమంతా ఆ నీళ్లల్లకు దిగుతున్నది. అవి తాగి మూగజీవాలు కూడా మట్టిలో కలిసిపోతున్నయి. రోగాలతోని తన్నుకులాడే వాండ్లను చూస్తే పరేషాన్ అయితరు ఎవరైనా…

జనం మంచి చెడు ఆలోచన చెయ్యాల్సిన సర్కారు తిండి పంటలు వెయ్యిమని చెప్పాలె. రైతులు అయినకాడికి ఏదో రేటుకు అమ్ముకోకుంట మిల్లెట్స్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలె. వాటికి సరైన ధర ఇవ్వాలె. అవి ప్రాసెస్ చేసే కేంద్రాలు ఏర్పాటు చేయాలె. సంప్రదాయ పంటలు పండించండి మీ వెనక మేమున్నాం అని భరోస ఇవ్వాలె. కానీ అదేం జరగుత లే… రేషన్ బియ్యం బదులు చిరుధాన్యాలు ఇస్తే మంచిగుంటది. బడిపిల్లలకు, అంగన్వాడీ పిల్లలకు ఆరోగ్యం తిండి పెట్టాలె…

ఓట్లేసి మనం కదా ఎన్నుకున్నది. మనమెన్నుకున్నోళ్లు మన మాట వినాలె.మనకోసం జెయ్యాలె. అట్ల అయితలేదు. సర్కారోళ్లపై వత్తిడి మనమే తేవాలి. మనం అనకపోతే, అడగకపోతే, వత్తిడి తేకపోతే ఎట్లా…మేమిప్పుడు అదే పనిలో ఉన్నం’.

మొగులమ్మ మాటల్లోని తాత్వికతను పట్టుకోవడానికి వినోద్ చేస్తున్న ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ తమకు రెండిళ్ళవతల ఉండే కొలీగ్ వెంకటేష్ ఎదురొచ్చి పలకరించాడు. “ఏం సార్ ఆరోగ్యం బాగోలేదా… ఈ మధ్య కొంచెం సుస్తు కనిపిస్తున్నారు” అంటూ.

అదేం లేదు బాగానే ఉన్నానంటూ ముందుకు నడిచాడు. అతను కూడా వెనక్కి తిరిగి వినోద్ తో పాటే నడవడం మొదలు పెట్టాడు. సాలెగూడల్లే ఆలోచనల తీగ వినోద్ వెంట సాగుతూనే ఉంది. అంతలో
“ఈ మధ్య కొర్రలు. అరికెలు, సామలు, ఆండు కొర్రలు, ఊదలకు ఏం డిమాండ్ సార్… ఎవ్వని నోట్ల చూడూ అవే నానుతున్నాయి. పోయిన నెలలో ఎనభై కి దొరికిన కొర్రలు ఇవ్వాళ తెద్దామని వెళ్తే రేటు డబులయిపోయింది. గడ్డి గింజలని పక్కకు పడేసేవాళ్ళం. అటువంటివిప్పుడు బంగారమయిపోయినాయ్” అన్నాడు వెంకటేష్.

“పెరిగే డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి కావాలి. అదిలేనప్పుడు రేట్లు ఇట్లాగే పెరిగిపోతాయ్ ” అనేశాడు వినోద్. కానీ లోలోన ఆలోచనల సుళ్ళు తిరుగుతున్నాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెరగాలంటే… ఒక్కసారిగా అతని ఒళ్ళు జలదరించింది. పరిస్థితి మళ్ళీ పునరావృతమవుతుందా… అనేక ప్రశ్నలు మదిలో చెలరేగుతున్నాయి. అధిక దిగుబడులకోసం కొత్త హబ్రీడ్ రకం చిరుధాన్యాల కోసం పరిశోధనలు, అవి అధిక దిగుబడి ఇవ్వాలంటే రసాయన ఎరువుల వాడకం, పురుగుమందుల వాడకం మొదలై కలిపి పంటల విధానం పోయి ఏక పంటల విధానంలోకి రారు కదా… మరో వైపు… అధిక ధరకు ఆశ పడి ఉత్పత్తిదారులైన మహిళలు తాము పండించిందంతా మార్కెట్ కు ఇచ్చేస్తే… వారి ఆరోగ్యం ప్రశ్నార్థకమవుతుంది. సుడిగుండంలో చిక్కుకున్నట్లు ఉక్కిరిబిక్కిరి అవుతూ… ఈ రోజుకి వీడ్కోలు అంటూ ఎదురుగా కనిపిస్తున్న కొండల్లోకి జారిపోతున్న భానుడిని చూస్తూ నడుస్తున్నాడు.

***

టిక్ టిక్ శబ్దం ఎవరో తలుపు తడుతున్నట్లు… గబుక్కున మెలకువ వచ్చింది మాధవ్ కి. కళ్ళు తెరిచి చెయ్యి తిప్పాడు. చేతికున్న ఆపిల్ వాచ్ 6. 30 చూపుతూ… 8 గంటలకు బయలుదేరుదాం అని కదా దీక్ష చెప్పింది. ఇంకాసేపు పడుకోవచ్చులే అని బద్దకంగా పక్కకు ఒత్తిగిలి బ్లాంకెట్ మీదకు లాక్కున్నాడు. అంతలో మళ్ళీ టిక్ టిక్ శబ్దం… ఎవరబ్బా కళ్ళు విప్పి లేవబోతుంటే మూసివున్న కిటికీ గ్లాస్ ఆవలి వైపున అనుకుని రెండు పిచ్చుకలు… ముక్కుతో ఆ అద్దాన్ని టిక్ టిక్ కొడుతూ… లే లే ఇంకెంత సేపు పడుకుంటావ్ అని తనని నిద్ర లెమ్మని లేపుతున్నట్లుగా…అనిపించింది చిన్నగా నవ్వుకున్నాడు మాధవ్. లేచి ఏసి ఆఫ్ చేసి కిటికీ కేసి తల తిప్పాడు.

తూరుపు రంగు వివశుణ్ణి చేస్తుండగా నెమ్మదిగా లేచి వెళ్ళాడు. ఫోన్ అందుకుని పిచ్చుకల్ని, ఉదయకిరణాల్ని కెమెరాలో బంధించాడు. అపురూప దృశాలు ఎన్ని మిస్ అయ్యాడో… ఉరుకుల పరుగుల జీవితంలో వద్దన్నా వచ్చిపడే డాలర్లు… ఖరీదైన ఏసీ రూములు కార్లు… బ్రాండెడ్ వస్తువులు, బట్టలు… ఖరీదైన విలాసవంతమైన జీవితం… అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి… ఏం కావాలి తనకి వడ్డించిన విస్తరిలాంటి జీవితం అని బంధుమిత్రులు తన జీవితాన్ని చూసి మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకుంటే, కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటారు. అయినా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అతనిలో.

సూర్యోదయానికి ఆహ్వానం పలుకుతూ అటూ ఇటూ గిరికీలు కొడుతూ మళ్ళీ వచ్చి కిటికీ అద్దంలో చూసుకుని మురిసిపోతూ… వాటిని అవి పలకరించుకుంటూ ఆనందంగా ఉన్న పిచ్చుకల్ని చూస్తుంటే తను కోల్పోయినదేదో అవగతం అవుతున్నట్లుగా ఫీలయ్యాడు మాధవ్.

“తాతయ్యా లేచావా… రావచ్చా” అంటూ తలుపు తీసుకుని సుడిగాలిలా వచ్చింది పదకొండేళ్ల లక్ష్య.

“రారా బంగారు తల్లీ… రా…” అనే లోపల.

“ఇంకా ఇట్లాగే ఉన్నారా… లేచి రెడీ అవండి. మనం ఫార్మ్ కి వెళ్ళాలి కదా…” ఆరిందాలాగా తొందర పెట్టింది.

రెండు రోజుల క్రితం సండే మనం ఫార్మ్ కి వెళ్తున్నామని తల్లి దీక్ష చెప్పినప్పటి నుండి లక్ష్య చాలా చాలా ఎక్సయిట్ అవుతోంది. పల్లె వాతావరణం తెలియని లక్ష్యకి పల్లె బాట పట్టడం చాలా ఆనందంగా ఉంది. పల్లెను రకరకాలుగా ఉహించుకుంటూ ఉంది. టీవీలోనో, కార్టూన్ సినిమాలోనో చూసిన పల్లెటూరి దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుంటూ తాను వెళ్లబోయే ఊరి చిత్రాన్ని మదిలో గీస్తున్నది ఆ చిన్నారి లక్ష్య. అలాంటి సమయంలో ఆమెలో ఎన్నెన్నో ప్రశ్నలు, సందేహాలు…

ఆ ప్రశ్నలకు జవాబు కోసం, సందేహాలు తీర్చుకోవడం కోసం తల్లిదండ్రులతో ముచ్చటించే సమయంకోసం వేచి చూస్తున్నది. తల్లిదండ్రులిద్దరూ వైద్యులు అవడంతో హాస్పిటల్ లో పేషేంట్స్ తో ఎప్పుడూ బిజీ… ప్చ్ అమ్మమ్మ కూడా ఇంట్లో లేదు. తానూ హాస్పిటల్ లోనే. అమ్మమ్మ పేషేంటయి హాస్పిటల్ లో అడ్మిట్ కాకపొతే తనకు చాలా కబుర్లు చెప్పేది. అమ్మ తీసుకెళ్లే విలేజ్ గురించిన సందేహాలన్నీ తీర్చేసేది… ప్చ్…

ఇంకా మూడు రోజుల వరకూ అమ్మమ్మ రాదని అమ్మ చెప్పింది. అమ్మమ్మ తమ్ముడేగా అమెరికా తాతయ్యని అడిగితేనో… అనుకుంది. మళ్ళీ వెంటనే, ఆ…. ఈ అమెరికా తాతయ్యకి తనలాగే ఏమీ తెలిసినట్లు లేదులే… అందుకేగా తాతయ్యని కూడా పల్లెకు తీసుకుపోయేది అనుకుంది మనసులో.

“తాతయ్య గెట్ రెడీ…” అంటూ తుర్రుమంది.

అక్క మనవరాలు లక్ష్య ఉత్సాహం చూసి చిన్నగా నవ్వుకున్నాడు మాధవ్. నిజానికి ఎక్కడో 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెకు వెళ్లడం మాధవ్ కి ఎంత మాత్రమూ ఇష్టంగా లేదు. కాకపోతే, ఈ రోజు ఫిక్సడ్ ప్రోగ్రామ్స్ ఏవీ లేకపోవడం వల్ల మేనకోడలి ఆహ్వానాన్ని కాదనలేక పోయాడు. ఏదో అద్భుతం చూపిస్తానంటోంది. ఏమి చూపుతుందో చూద్దాం అని కాకుండా బిజీగా ఉండే మేనకోడలితో డ్రైవ్ సమయంలో నైనా కొంత టైం స్పెండ్ చేసినట్లుంటుందని సరేనన్నాడు.

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply