తెలంగాణ పోరాటానికి ఉత్ప్రేర‌క గీతం ‘బండెనుక బండిగట్టి…’

తెలంగాణ సాయుధ పోరాటంలో బండి యాదగిరి అనే గెరిల్లా యోధుడిది విభిన్నమైన పోరాట పాఠం. రాత్రిబడిలో రాత నేర్చుకుని తమలాంటి బానిస బతుకుల రాతను మార్చాలనుకున్నాడు. తన తుదిశ్వాస తర్వాత కూడా శత్రువు గుండెల్లో ప్రతిధ్వనించే పోరాట గీతాన్ని రచించిన కవి బండి యాదగిరి. ‘బండెనుక బండిగట్టి పదహారు బండ్లుగట్టి / ఏ బండ్లపోతవ్ కొడుకో / నైజాం సర్కరోడ / నాజీల మించినోడ’’ అనే పాట యాదగిరి కలంలోంచి గళంలోకి దూకి తెలంగాణ సాయుధ పోరాట క్షేత్రమంతా మారుమ్రోగింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఎల్కపల్లి గ్రామంలో 1920లో యాదగిరి జన్మించాడు. ఎర్రబాడు భూస్వామి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఇంట్లో వ్యవసాయ కూలీగా పని చేస్తున్నప్పుడే దొరల దాష్టీకమంతా అనుభవమైంది. లక్షా యాభైవేల ఎకరాల భూమిని ఆధీనంలో ఉంచుకున్న ప్రతాపరెడ్డి వందలాది గ్రామీణ ప్రజలను అనేక విధాలుగా పీడించేవాడు. దీనికితోడు నిజాం కిరాయి మూకలు మిల్ట్రీ వారితో కలిసి ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తూ చంపేసేవారు. జమీందారులు, జాగీర్దారులు, నిజాం పాలకులు కుమ్మక్కై తెలంగాణ గ్రామాలను నాశనం చేస్తున్న భయానక రోజులవి. అటువంటి అరాచక పాలనను అంతమొందించడానికి అలుపెరుగని పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధుడు భీమిరెడ్డి నరసింహ్మారెడ్డి. నిజాం నియంతృత్వ రాజరికాన్ని కూల దోయడం కోసం విప్లవ దళానికి కీలక నాయకుడై వీరోచిత పోరాటం చేశాడు. ఈ యాదగిరి కూడా బి.ఎన్. దళంలో సభ్యుడిగా చేరి కందగట్ల, కోటపాడు పోరాటాలలో పాల్గొన్న సాహసి. బి.ఎన్. తిరుగుబాటుల్లో, ఎదురుదాడుల్లో వెనుకంజ వేయకుండా ముందు వరుసలో నిలబడి తుపాకీ పట్టుకున్న ఉద్యమకారుడు యాదగిరి.

1947లో రాసిన ఈ గీతం అనేక దాడులకు దళాలు సమాయత్తమవుతున్నపుడు మార్చ్ ఫాస్ట్ సాంగ్ గా ఈ పాట గెరిల్లా వీరులకు ఉత్తేజాన్ని అందించేది. ఆ పాటలో కవి దాచిన తెలంగాణ దుఃఖాన్ని, ఆవేదనను, ఆవేశాన్ని, ధిక్కారాన్ని నిర్భయత్వాన్ని, నిచ్చితాభిప్రాయాలను స్మరించుకోక తప్పదు. నిజాం పాలనలో భయంకరమైన దౌర్జన్యాలతో నెత్తురు కన్నీళ్లతో తడిసి ముద్దైన తెలంగాణ ప్రాంత చరిత్రంతా ఈ పాటలో నిక్షిప్తమైంది. ప్రజల గుండెల్లోని వ్యధలకు వ్యవహార భాషా రూపంలో, పదునైన భావప్రకటనతో ఈ పోరాట పాట కదంతొక్కింది.

‘‘బండెనుక బండిగట్టి పదహారు బండ్లు గట్టి…’’ అనే పల్లవిలోనే దొరల ఆధిపత్యం, అహంకారం కళ్ళముందు ఆవిష్కృతమైంది. ఆధునిక కాలంలో మంత్రులు, ముఖ్యమంత్రుల, కాన్వాయ్ ఎలా మెరుపువేగంతో దూసుకుపోతూ ప్రజల సహనానికి అగ్నిపరీక్ష పెడుతుందో అలాంటివే పదహారు బండ్ల వరుస కూడా. ‘ప్రాణభీతితో ఏ బండ్లో దాక్కున్నాడో దొరా నా కొడకా’ అనే వెక్కిరింపు అందరికీ అందుతుంది. విచ్చలవిడిగా కిరాతకంగా ప్రవర్తించిన నాజీల్లాంటి నియంతల క్రూరదుష్ట పాలనను మించిన నైజాం సర్కారోడి పై తీవ్ర ఆగ్రహం పల్లవిలోనే ప్రతిధ్వనించింది. ఇక చరణాల్లో అనేక చారిత్రక సత్యాలు సూటిగా వ్యక్తమయ్యాయి.

‘‘పండిన పంటనంతా / తిండికై ఉంచకుండా / తీసుకెళ్లినావు’’ అనే చరణంలో ప్రజల ఆకలి అగ్నుల సెగలు తగులుతాయి. ‘‘దున్నాను భూమిలేక / ఉండాను ఇల్లు లేకా / పరదేశమెల్తిమి కొడుకో’’ లో తను నమ్ముకున్న నేల తనది కానిదైంది. ఇల్లు శిథిలమైంది. జీవితం వలస దారుల్లోకి వెళ్ళింది. బతుకు పరాయీకరణమైంది. నాటి తెలంగాణ ప్రజల ధైర్యం కొలమానాలకు అందనిది. ‘‘పోలీసు మిల్ట్రీ జూసి / మేము లొంగివస్తమాని / నువు ఆశపడ్తివి కొడుకో’’ నిజాం ఆశలు కోల్పవడమే కాకుండా కోటలు కూలిపోయే దశకు దగ్గరైంది. ‘‘లాఠీల దెబ్బలుగాని / తుపాకి కాల్పులుగాని / మిషిను గన్నులుగాని తుపాకి బాంబులు గాని/ నీవెన్నితెచ్చినగాని / మేము లొంగిపోము కొడుకో’’ అన్నట్లుగానే తెలంగాణ ఉద్యమకారులు వజ్ర సంకల్పులై ఉక్కు మనుషుల్లాగా పోరాడారు. లాఠీల దెబ్బలు, బుల్లెట్లగాయాలు మరింత పోరాట స్ఫూర్తిని రగిలించాయి.

‘‘కంచారు గాడ్దులను / లంచ గొండి పోలీసోళ్ళు / నువ్వు పెంచినావు కొడుకో’’ అనే చరణంలో పాలక వ్యవస్థలు భ్రష్టుపట్టిన తీరును తెలుపుతుంది. లంచగొండితనం పోలీసులకు వారసత్వంగా నిజాం రాజుల నుండి అందినట్లు అర్థమవుతుంది. ఆ వారసత్వం నేడు ఇంకా బలంగా వేళ్ళూనుకుని పోవడం ఎంత విషాదం. ‘‘పోలీసు మిల్ట్రి రెండు/ బలవంతులనుకోని/ పల్లెలు దోస్తివి కొడుకో/ జాగీర్దారులంతా జామీను దారులంతా/ నీ అండ చేరి కొడుకో’’ అనే పంక్తులు నేటికి సజీవమే. జాగీర్దారులు, జమీందారుల స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ప్రవేశించి అధికార అండ దండలతో పల్లెలను మాయం చేస్తున్నారు. ‘‘ స్త్రీ పురుషులంతా కలిసి / పిల్లలమంత కలిసి / వడిసెల్లొ రాళ్లు నింపి / వడివడిగా కొట్టితేను / కారాపు నీళ్ళు తెచ్చి / కండ్లళ్ళ జల్లితేను / నీ మిల్ట్రీ పారిపోయే ’’ తెలంగాణ పోరాటంలో పరిసరాల్లోని పనిముట్లే ఆయుధాలై దాడులు చేశాయి. పక్షులనుండి పంటలను కాపాడే వడిసెల రాయి సైనికుడి తూటాగా మారింది. కారపు అన్నంతో కడుపు నింపుకునే ప్రజానీకానికి ఆ కారపుపొడే మరోసారి శత్రువు నుంచి ప్రాణాన్ని కాపాడింది. కారపు నీళ్ళు ఉప్పెనలా ముంచెత్తాయి. ‘‘చినపంది మల్లిగాడు/ పెద్ద పంది సూరిగాడు / ఆల్లిద్దర్ని తింటముకొడుకో / నా కొడకా ప్రతాపరెడ్డి’’ ఈ చరణాల్లో ఆనాటి ప్రజల కసి ప్రదర్శితమైంది. దుర్మార్గుడైన భూస్వామి ప్రతాపరెడ్డిని కాపాడే అంగరక్షకులను ఉద్దేశించి చెప్పాడు కవి. భూస్వామి అండతో దోపిడి సొమ్ము తిని పందుల్లా తెగబలిసిన మల్లిగాడు, సూరి గాడు అనే వ్యక్తుల్ని నమిలి మింగేయాలన్నంతా కోపాన్ని బలంగా వ్యక్తపరిచాడు యాదగిరి.

యాద‌గిరి త‌న పాట‌లో ”గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి క‌డ్తం కొడుకో /నా కొడ‌క ప్ర‌తాపరెడ్డి” అని రాసాడు. క‌వి మ‌ర‌ణానంత‌రం తెలంగాణ సాయుధ పోరాట ఉద్య‌మ‌కారులు పాట‌లోని తీవ్ర‌త‌ను మ‌రింత విస్తృత‌ప‌రుస్తూ ప్ర‌తాప‌రెడ్డి పేరుకు మారుగా ‘నైజాం స‌ర్క‌రోడా’ అని మార్చుకుని పాడుకున్నారు.

‘‘చుట్టు పట్టు సూర్యాపేట/ నట్టనడుమ నల్లగొండ / ఆవాల హైదరాబాదు/ తర్వాత గోల్కొండ / గోల్కొండ ఖిల్లా కింద / నీ ఘోరి కడతాం కొడుకో నైజాము సర్కరోడా / ఓ నైజాము సర్కరోడ ’’ పాటలోని చివరి చరణాలు ఇవి. తెలంగాణ పోరాటం ఉధృతంగా జరుగుతున్న సూర్యాపేటను నల్లగొండను తలుచుకుంటూ తమ యుద్ధ పరిధిని ఎంతవరకు విస్తృతపరచుకోవాలనేది నిర్దేశించుకున్నాడు. తమ అంతిమ లక్ష్యం. ఆఖరి గమ్యం గోల్కొండ కోటను లొంగదీసుకోవడం. గోల్కొండ కోట మీద ఎర్ర జెండా ఎగరవేయడం. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించడం. ఇవన్నీ నెరవేరాలంటే విప్లవ ఆశయాలు ఫలించాలంటే కోటలోని నిజాం రాజు, ఊర్లోని దొర అంతుచూడాలి. వారు అంతమవ్వాలి. వాళ్ళను ఆ గోల్కొండకోట కిందే సమాధి చేయాలి. అదే బండి యాదగిరి విప్లవ స్వప్నం. ఆ స్వప్న సాధన దిశగా తన గన్నుని పెన్నుగా మలిచి రాసిన గీతం ఇది. ఈ పాట విశాలాంధ్ర పత్రికలో 1948 లో ప్రచురితమైంది. ఆ తర్వాత బి.నరసింగరావు ‘మాభూమి‘ చిత్రంలో గద్దర్ గళం నుంచి వెలువడి అమిత ప్రజాదరణ పొందింది. కొత్తతరంలోకి ఉద్యమావేశాన్ని ప్రవహింపజేసింది.

యాదగిరి 1947లో సాయుధ పోలీసులు మిల్ట్రీతో పోరాడుతూ క్షతగాత్రుడైన వారికి బందీగా చిక్కాడు. అనేక చిత్రహింసలకు గురైనా తమ విప్లవ రహస్యాలు వెల్లడించని నిజమైనా కామ్రేడ్ యాదగిరి. తుది శ్వాస విడుస్తూ కూడా
‘‘నిజాం రాజ్యం నశించాలి
కమ్యూనిజం జిందాబాద్
ఎర్రజెండా జిందాబాద్’’ అనే నినాదాలతో నిప్పులు గ్రక్కుతూ తెలంగాణ ప్రజలకు విప్లవస్ఫూర్తిని ఉద్యమ చైతన్యాన్ని అందించాడు. తన మరణానంతరం ఈ పాట విప్లవోద్యమాలకు ఉత్పేరక గీతంగా ఊరేగింది.

‘బండెనుక బండిగట్టి’… పాట పూర్తి పాఠం
‘బండెనుక బండిగట్టి
పదహారు బండ్లుగట్టి
ఏ బండ్లపోత‌వ్‌ కొడుకో
నైజాం సర్కరోడ
నాజీల మించినోడ !
యమబాధ పెడ్తివి కొడుకో
నైజాం సర్కరోడ !
పండిన పంటనంతా
తిండికైనా ఉంచకుండా
తీసుకెళ్లినావు
నైజాం సర్కరోడ !
దున్నాను భూమిలేక
ఉండాను ఇల్లు లేక
పరదేశమెల్తిమి కొడుకో
నైజాం సర్కరోడ !
పోలీసు మిల్ట్రీ జూసి
మేము లొంగివస్తమాని
నువు ఆశపడ్తివి కొడుకో
నైజాం సర్కరోడ !
లాఠీల దెబ్బలుగాని
తుపాకి కాల్పులుగాని
మిషిను గన్నులుగాని
తుపాకి బాంబులు గాని
నీవెన్నితెచ్చినగాని
మేము లొంగపోము కొడుకో
నైజాం సర్కరోడ !
కంచారు గాడ్దులను
లంచ గొండి పోలీసోళ్ళు
నువ్వు పెంచినావు కొడుకో
నైజాం సర్కరోడ !
పోలీసు మిల్ట్రీ రెండు
బలవంతులానుకోని
పల్లెలు దోస్తివి కొడుకో
నైజాం సర్కరోడ !
జాగీర్దారులంతా
జామీనుదారులంతా
నీ అండ జేరిరి కొడుకో
నైజాం సర్కరోడ !
స్త్రీ పురుషులంతా కలిసి
పిల్లలమంత కలిసి
వడిసెల్లొ రాళ్లు నింపి
వడివడిగా గొట్టితేను
కారాపు నీళ్ళు తెచ్చి
కండ్లళ్ళ జల్లితేను
నీ మిల్ట్రీ పారిపోయే
నైజా సర్కరోడ !
చినపంది మల్లిగాడు
పెద్ద పంది సూరిగాడు
ఆలిద్దర్ని తింటముకొడుకో
బండెనుక బండిగట్టి
పదహారు బండ్లుగట్టి
ఏ బండ్లే పోతవ్ కొడుకో
నా కొడకా ప్రతాపరెడ్డి
నైజాం సర్కరోడ !
చుట్టు పట్టు సూర్యాపేట
నట్టనడుమ నల్లగొండ
ఆవాల హైదరాబాదు
తర్వాత గోల్కొండ
గోల్కొండ ఖిల్లా కింద
నీ గోరి కడతాం కొడుకో
నైజాం సర్కరోడ !
ఓ నైజాము సర్కరోడ // నీగోరి //

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

4 thoughts on “తెలంగాణ పోరాటానికి ఉత్ప్రేర‌క గీతం ‘బండెనుక బండిగట్టి…’

  1. చాలా బాగుంది సర్..
    జన్నారెడ్డి ప్రతాపరెడ్డి దాష్ఠికాలను ,నిజాం ప్రభుత్వాన్ని ఎండగడుతూ రాసిన బండి యాదగిరి పాటలోని దృష్టి కోణాన్ని విశ్లేషించిన తీరు గొప్పగా ఉంది సర్..

  2. .తెలంగాణ జాతి చైతన్య యాత్రలో మహోజ్వల ఘట్టం ఈ పాట.నైజాం ప్రభుత్వం,రజాకార్లు తెలంగాణ పల్లెలపై దొరలు,భూస్వాముల సాయంతో కొనసాగించిన అకృత్యాలు,అమానవీయ దారుణ మారణకాండపై తిరగబడ్డ విప్లవసింగం బండి యాదగిరి గళం నుండి వచ్చిన ఆవేశపు లావా ఈ పాట.
    …….నైజాంపై తిరగబడ్డ నాటి ప్రజల సాయుధపోరాటానికి ఉత్ప్రేరకమే ఈ పాట. రైతు కూలీలు,కార్మికులు,అణగారిన సబ్బండ వర్గాలను ఐకమత్యం చేసి రజాకార్లపై పోరాటానికి ఉసిగొల్పింది ఈ పాట.

    …..కమ్యూనిస్టుల సాయుధపోరాటానికి ఇంధనంగా పనిచేసిన ఈ పాటపై డా.రఘు గారి విశ్లేషణ బాగుంది. మనసు పేజీలో దాచుకొనే చాలా చక్కటి వ్యాసం ఇది.

    సి.వి.శ్రీనివాస్

  3. మన ఇంటి చుట్టూ జరిగిన పోరాటాలు తెలుసుకుంటుంటే ఉద్వేగంగా ఉంటుంది. ఇప్పటి తరం అది తెలుసుకోవడం అవసరం. పాట పుట్టిన విధం వివరణ బాగుంది.

  4. బాల్యాన్ని గుర్తుచేసారు సా ర్.మీ రచనకు అభినందంనలు చాల బాగుంది 👏👏👏👏

Leave a Reply