మన స్త్రీలకు ‘ఇంకా’ ఈ బంగారం నగలు ఏమిటి? అని గురజాడ చిరాకుపడి ఏ నూట పాతికేళ్ళో అయింది. ‘లోహాలతోనూ, పూసలతోనూ అందం వస్తుందని’ భ్రమపడటం ఎందుకని, చలం జాలిపడి కూడా వందేళ్లయినా అయ్యుంటుంది. నగల మీది మోజు ఓ కుటుంబాన్ని ప్రమాదాల్లోకి నెట్టిన ప్రమాదంపై ఓ నవలనే రాశాడు ప్రేమ్ చంద్. ‘గోల్డ్ రష్’, అనే పరుగులో మానవులు ఎంత హీన స్థాయికి దిగజారగలరో జాక్ లండన్ కన్నా తీవ్రంగా ఎవరు హెచ్చరించగలరు? మధురవాణి కంటె చుట్టూ చెలరేగిన దుమారం ఎందరికి గుర్తుందో కానీ, ‘చెవులకూ, ముక్కుకి రంధ్రాలు పొడిచి, అలంకృత గంగిరెద్దులం’ కావద్దని విమల ఇచ్చిన పిలుపు ముప్పయ్యేళ్ళ కిందటిదే కదా?
ఇంతలేసి చర్చల తర్వాత ఏమన్నా మారిందా భారతీయ సమాజం? స్త్రీల జీవితాలకూ, బంగారానికీ ఉన్న లంకె తెగిందా? ముఖ్యంగా, బంగారం ప్రమేయం లేకుండా ఆడపిల్ల పెళ్లి జరిగే సందర్భాలను ఇప్పటికీ వేళ్ల మీద లెక్కపెట్టాల్సిందే కదా?
బంగారానికి ఉన్న ప్రాధాన్యం వెనక ఎన్నో కారణాలు. అరుదుగా దొరికే లోహం కావటమూ, ఆకర్షణీయమైన మెరుపు ఉండటమూ, నాజూకైన ఆభరణాలుగా ఒదిగే స్వభావమూ, మతపరంగా ఆపాదించిన పవిత్రత వంటివన్నీ ఒకెత్తయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మారకం విలువ కలిగి ఉండటం అసలు విషయం. పెళ్లిళ్లలో డబ్బు రూపంలో తీసుకునే వరకట్నం ప్రత్యక్షంగా కనబడుతుంది. కానీ, కూతురిమీద ప్రేమ ప్రకటన పేరుతో వసూలు చేసే బంగారం పరోక్ష రూపంలోని వరకట్నమే. ఇక, తమకంటూ ఆస్తులూ, సంపాదనలూ లేని ఆడవాళ్ళకు ఒంటిమీద కాస్త బంగారాన్ని ఉంచుకోవటం ఒక భరోసాగా కనబడుతుంది.
బంగారానికీ, కుటుంబ సంబంధాలకూ ఉన్న సంక్లిష్టమైన రాజకీయాన్ని అట్టే హడావిడి లేని సరదా కథ రూపంలో చెప్పిన మలయాళ సినిమా ‘పొన్ మాన్.’
కేరళ లోని కొల్లాం పట్టణంలో నివసించే, దిగువ మధ్యతరగతి మత్స్యకార కుటుంబం కథ ఇది. ఇంటి యజమాని ఒకప్పుడు బాగా సంపాదించి, బంధుమిత్రులకు ధారాళంగా సహాయాలు చేసి మరణించాడు. మిగిలిన తల్లి, కొడుకు, కూతురు… వాళ్ళ చుట్టూ ఆర్థిక ఇబ్బందులు. ముప్ఫై రెండేళ్లొచ్చిన కూతురు, స్టెఫీ పెళ్లి ప్రధాన సమస్య. ఆ అమ్మాయికి చదువూ, ఉద్యోగమూ లేవు. కొడుకు కమ్యూనిస్టు పార్టీలో చురుకైన కార్యకర్త. పార్టీమీద మాటపడితే ఎవరిమీదనైనా తిరగబడే నిబద్ధత ఉండి కానీ, శ్రమవిలువ తెలియని నిష్క్రియాపరుడు. తల్లికి దేవుడిపై భారం వేసి, నిష్టగా చర్చికి వెళ్లటంతప్ప ఏ మార్గం లేదు.
చివరికి అమ్మాయికి పెళ్లి కుదిరింది, కానీ పాతిక సవర్ల బంగారం పెట్టాలనే ఒప్పందంతో. ఆ సమస్యకు ఒక పరిష్కారంగా అజీష్ ప్రవేశిస్తాడు. రసీదులూ, టాక్సులూ లేకుండా నగల వ్యాపారంతో బ్లాక్ మనీ సంపాదించే వర్తకుడి వద్ద బ్రోకర్, అజీష్. పెళ్ళికి ముందు ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకుని నగలు ఇవ్వటం, పెళ్లి లో వచ్చిన చదివింపుల డబ్బును ఆ కుటుంబం చెల్లిస్తే వసూలు చేసుకోవటం, ఇవ్వలేకపోతే నగలు తిరిగి తీసుకోవటం అతడి పని.
అజీష్ తెచ్చిన నగలతో స్టెఫీ పెళ్లి జరిగిపోయింది. కానీ చదివింపుల్లో వచ్చిన డబ్బు, పన్నెండు సవర్ల నగలకు తక్కువ పడుతోంది. ఆ మేరకు నగలను తిరిగి తీసుకు వెళ్ళాలి అజీష్. విషయం బయట పడితే పెళ్లి పెటాకులవుతుందని స్టెఫీకీ, తల్లికీ భయం. కోడలి నగలతో అత్తవారింటికి చాలా అవసరాలున్నాయి. పెళ్ళయిన వాళ్ళ పెద్దకూతురి అత్తవారికి ఇంకా ఇవ్వవలసిన నగల బాకీ, చిన్నకూతురికి చెయ్యాల్సిన పెళ్లి, వాళ్ళకూ గొంతుమీది కత్తులే.
స్టెఫీ పరిస్థితులు దయనీయమైనవే. కానీ, దయ చూపించగల వెసులుబాటు లేదు అజీష్ కు. అతనిదీ నిరుపేద కుటుంబమే. తల్లి, చెల్లెలు కూలి చేస్తున్నారు. అతనికి దొరికిన ఏకైక జీవనోపాధి ఈ బ్రోకర్ పని. నిర్దాక్షిణ్యంగా ఉండకపోతే ఉద్యోగం ఊడుతుంది. నష్టపోయిన డబ్బు తన మెడకు చుట్టుకుంటుంది. నగలు వసూలు చేసుకు పోవటానికి స్టెఫీ వెంటపడి, ఆమె అత్తవారింటికి చేరాడు.
సరదాగా మొదలయిన కథ సంక్లిష్టంగా మారిపోతుంది. స్టెఫీ కుటుంబంతోనూ, అటు ఆమె అత్తవారి కుటుంబంతోనూ పోరాటం అజీష్ ది. వేడుకోళ్ళు, కన్నీళ్లు, దాడులు, బెదిరింపులు… అన్నిటి నడుమ అజీష్ చేతికి నగలు అందే సమయానికి అన్ని పాత్రలూ కొత్త రూపాలతో ఎదురు పడతాయి మనకు. అప్పటివరకూ ఆయా వ్యక్తుల మంచిచెడులుగా కనబడిన స్వభావాలను నడిపిస్తున్న సామాజిక శక్తులు బట్టబయలుగా కనబడతాయి.
ఒప్పందాన్ని అతిక్రమించి నగలను సొంతం చేసుకుందామనుకున్న స్టెఫీ, ఆమె తల్లి, మోసకారులు కాదు, అజీష్ కనబడినట్టుగా కఠినుడు కాదు, స్టెఫీ భర్త దుర్మార్గుడూ కాదు… అందరూ కుటుంబాలను, అన్నీ మానవ సంబంధాలనూ కూడా నిర్దేశించే ఆర్థిక సంబంధాల గొలుసుల్లో చిక్కుపడిన బందీలు. ఈ ప్రధాన పాత్రల మధ్యన అనుసంధానంగా కనబడే ఒక ఆటో డ్రైవర్, పడవ మనిషి మానవీయత మీద నమ్మకాన్ని నిలబెడతారు.
*
ఇంతకూ ఈ చిక్కు సమస్య ఎలా పరిష్కారమైంది? ఏ సమస్య ఎన్ని మలుపులు తిరిగినా, బాధితుల చైతన్యం తప్ప మరొక పరిష్కారం ఉండదు కదా! ఇక్కడ అసలు సమస్య స్టెఫీది. బంగారం లేనిదే జరగని పెళ్లికీ, నిలబడని కుటుంబానికీ తన జీవితంలో ఎంత చోటు ఇవ్వాలో నిర్ణయించుకోవాల్సింది ఆమె మాత్రమే.
అది స్టెఫీకి అర్థం కావటంతోనే, సమస్య విడిపోయింది. అజీష్ నగలను అతనికి అప్పగించటమే కాదు, కుటుంబాన్ని పోషించుకోటానికి ప్రాణాలకు తెగించి, కష్టపడే అతడిని నమ్మవచ్చని కూడా నిర్ణయించుకుని అతడితో బయల్దేరింది. ‘నగలు లేనిదే నీ కుటుంబం నిలబడదు కదా?’ అనే అతని ప్రశ్నకు ‘నా ఒంటిమీది బంగారాన్ని బట్టి, నా విలువ నిర్ణయించే అధికారం ఇక ఎవ్వరికీ ఇవ్వను,’ అనే జవాబు ఆమె వద్ద అప్పటికే సిద్ధంగా ఉంది. అది ఆమె వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాదు, డబ్బు ప్రాతిపదికన నడిచే కుటుంబ సంబంధాలన్నిటి మీదా!
‘బంగారం లేకుండా ఆడపిల్ల ఉండలేదా?’ అజీష్ వేసిన ప్రశ్న ఒక్క స్టెఫీకేనా?
‘ప్రయత్నించనీ నన్ను,’ ఒంటిమీది నగలన్నీ తీసేస్తూ ఆమె సమాధానం. ఎంత దూరపు ప్రయాణమైనా ఒక మొదటి అడుగుతోనే మొదలవ్వాలి కదా!
‘స్టెఫీ, నువ్విప్పుడు వెలిగిపోతున్నావ్. బంగారం బరువు వదిలించుకుని సహజంగా, స్వచ్ఛంగా ఉన్నావ్. ఆడపిల్లల అసలైన అందం బంగారం లేనప్పుడే’- అజీష్ చెప్పిన ఈ మాటలు కేవలం ఒంటిమీది అలంకరణ గురించే కాదు, వరకట్నాలకు తల ఒగ్గే బానిసత్వం గురించి కదా!
ఒక అమ్మాయి పెళ్లికీ, ఆమె కుటుంబంలో సమస్యలకూ సంబంధించినదిగా మొదలయ్యే ఈ కథను ఒక సామాజిక సమస్యకూ, స్త్రీల స్వీయ గౌరవానికీ సంబంధించిన విస్తృతిని తీసుకు వచ్చిన దర్శకుడు జోతీష్ శంకర్, ప్రధాన పాత్రలలోని బాసిల్ జోసెఫ్, లిజోమల్ జోస్ లను ఎంత అభినందించినా తక్కువే.