ప్రపంచ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా అన్ని రకాల హింసలకు, పీడనలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజాసంఘాల కృషి గురించి మరొక్కసారి చర్చించుకుందామని “కొలిమి” టీం భావించింది. అందులో భాగంగా హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న ప్రజాసంఘాల మానవహక్కుల దృక్పధాన్ని తెలుసుకోవడంతో పాటుగా వారి ఆలోచనల అమలులో ఎదురయ్యే అనుభవాలను కొలిమి పాఠకులకు అందించాలని అనుకున్నాము. అందులో భాగమంగానే “చైతన్య మహిళా సమాఖ్య” (CMS)తో మా ఈ సంభాషణ.
కొలిమి: గత కొన్ని సంవత్సరాలుగా “మానవ హక్కుల దినోత్సవం” కూడా ఒక పండుగలా మారిపోయింది. కాని మీలాంటి సంఘాలు అనునిత్యం హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు. అయితే ఈ “పండుగ” సందర్భంలో మానవహక్కులను, పౌరహక్కులను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు.
CMS: ఒక మనిషి అనే వారికి తల్లిగర్భంలో పడిన దగ్గర నుండి కొన్ని హక్కులు అనేవి సహజంగానే ఉంటాయి. దానికి కారణం మనం మనుషులం. మనం పుట్టిన తర్వాత ఒక మానవ సమాజం అనేది ఉంటుంది ఆ మానవ సమాజంలో కలిసి బ్రతకాలి కాబట్టి సహజంగానే మానవులకి ఉండి హక్కులు.
మనమంతా మానవ కుటుంబం. ఎలాంటి హద్దులు లేని ఎల్లలు లేని కుటుంబం. సహజంగా ఒక మానవుడు కోరుకునే గౌరవం సమానత్వం , స్వేచ్ఛ ,న్యాయం, శాంతి ఇవి మానవులు కోరుకునే అత్యంత ముఖ్యమైనవి. ఇక పౌరులు అంటే ఆయా దేశాల బట్టి లేదా ప్రాంతాలను బట్టి నియమ నిబంధనలు లేదా రాజ్యాంగం అనేది ప్రత్యేకంగా మనుషులందరికీ వర్తించే విధంగా రూపొందించుకునే హక్కులు.
మనం పౌరులు కంటే మొదట మనుషులం.కానీ ఈ దేశంలో ఉన్న కోట్ల ప్రజలు కనీసం మానవ హక్కులు అనేవి ఉన్నాయని తెలియదు. తెలియకుండానే జీవిస్తున్నారు.తెలియకుండానే మరణిస్తున్నారు. దేశంలో మనుషులందరు గౌరవిoపదగినవారని ఎంతమందికి తెలుసు..? ఎంతమంది గౌరవంగా బ్రతుకుతున్నారు? అంటే చాలా ఎక్కువ శాతం అగౌరవంగా లేదా ఆ గౌరవానికి గురి కాభడుతున్నారు. కారణం నిరక్షరాస్యత గల దేశంలో కులం, మతం, వర్గం, జాతి వివక్షత నలిగిపోతున్నారు. ప్రపంచంలో అణగారి,హక్కులు లేకుండా బ్రతికేస్తున్నారు. వీరికి హక్కులు ఉన్నాయి అని చెప్పే బాధ్యత తోటి మనుషులుదే.
కొలిమి: మారుతున్న సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక సంబంధాల సందర్భంలో ప్రజలకు (ముఖ్యంగా పీడితులకు) హక్కుల సోయిని కలిగించే విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ పని విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా?
CMS: ముఖ్యంగా మనం మొదట సాంఘిక దురాచారాల గురించి మాట్లాడుకున్నట్లు అయితే మనదేశంలో అత్యంత ఎక్కువగా బాధించబడుతున్న టువంటి అంశాలు 1. బాల్య వివాహాలు,2. వెట్టి చాకిరి 3. సంఘ బహిష్కరణ లేక వెలి 4. జోగిని వ్యవస్థ 5. కుల వ్యవస్థ 6. అంటరానితనం 7. బాల కార్మికులు 8. దేవాలయ ప్రవేశం నిషిద్ధం 9. స్త్రీ పురుష వివక్షత 10. స్త్రీ సామాజిక నిర్బంధం 11. బృణ హత్యలు 12. వరకట్నం 13. కన్యాశుల్కం 14. బాల కార్మిక వ్యవస్థ 15. బలివ్వడం 16. మూఢనమ్మకాలు.17.మహిళల పై హత్యాచారాలు.
ఇవి కాకుండా అనేక రూపాల్లో అనేక విధాలు గా మనుషులు వివక్షతకు గురి అవుతున్నారు. అంధవిశ్వాసాలు నిరక్షరాస్యత, మతమౌఢ్యం అనేక రూపాలుగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో సామాజిక ,సాంస్కృతిక ఆర్థిక అంశాల్లో భిన్న రూపంలో స్పష్టంగా కనబడుతుంది. మహిళకు సామాజిక స్వేచ్ఛ పేరుతో ఆమెపై ఆర్థికభారం పెనుభారంగా మారింది. ఇంటాబయటా ఉద్యోగం ఆయా వృత్తుల్లో రాణిస్తున్న మహిళలకు పని ఒత్తిడి పెరిగింది. అనేక రూపాల్లో హింస కూడా పెరుగుతూ వస్తుంది. సామాజిక మాధ్యమాలు రూపంలో సమస్యలు మహిళలను వెంటాడుతూనే ఉన్నాయి.
మొత్తంగా దేశంలో ప్రవేశపెట్టిన టెక్నాలజీతో చూసుకుంటే ఆక్షరాస్యత పై అంత ఎక్కువగా దృష్టి పెట్టలేదు. గుళ్ళూ గోపురాలు మతవిశ్వాసాలను ఇచ్చిన ప్రాముఖ్యత నిరక్షరాస్యతకు మరియు సాంఘిక దురాచారాలను అరికట్టడంలో ఇవ్వలేదనే చెప్పాలి. ఇక్కడే ప్రధానమైన లోపం గా కనబడుతుంది.గుడికి,శిలా విగ్రహాలను ఇచ్చినటువంటి ప్రాముఖ్యత విద్యకు ఇవ్వకపోవడం వలన శాస్త్రీయమైన విద్య లేకపోవడం వల్ల అజ్ఞానం గూడుకట్టుకుంది .ఎక్కడ అజ్ఞానం గుడు కట్టుకుంటుందో అక్కడ అవినీతి గుడ్లు పెడతాయి. సరైన అక్షరాస్యత లేని ఈ దేశంలో అత్యంత వేగంగా టెక్నాలజీ ప్రవేశపెట్టడం వల్ల, టెక్నాలజీ మిధ అవగాహన లేని యువతరం ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఆచారాలు సంప్రదాయాలు గురించి మాట్లాడే సమాజంలో నడిరోడ్డుపై మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారంటే లోపం ఎక్కడ ఉంది. ఎంత విస్తృతంగా ఉందో అర్థం చేసుకోవాలి. చట్టాల పై నమ్మకం ఉంచి ఆచరించాల్సిన అధికారులు
వాటిని ఉల్లంఘిస్తున్నారు అంటే వాటిపై భిన్న అభిప్రాయాలు అయినా ఉండి ఉండాలి. లేదంటే వాటిని వ్యతిరేకించే స్వభావం అయినా ఉండి ఉండాలి. ఇలాంటి స్వభావం వాళ్ళకి ఎక్కడ నుంచి వచ్చాయి అని మనం ఒకసారి చూస్తే అది పూర్తిగా మత విశ్వాసాలు, మనుషుల పట్ల వివక్ష చూపించడం నుండి ఇలాంటి భావ వ్యాప్తి కలుగుతుంది.ఇవన్నీ విభిన్న సమస్యలు గా కనిపించవచ్చు. కానీ, ఒక దాని పై ఒకటి ఆధార పడి వుంటాయి.
ఎన్నో సాంఘిక దురాచారాలు కళ్లెదుటే సమాజంలో జరుగుతున్నప్పటికీ వాటిని తీవ్రంగా ఖండించాల్సిన రాజకీయ నాయకులు, అధికారులు వాటినీ వ్యతిరేకించ కుండా, వాటి పై స్పష్టమైన అవగాహన లోపం కలిగి ఉండడం ప్రధాన కారణం. అందుకే అమ్మాయిల పెళ్లికి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు పెట్టి ఆడపిల్ల పెళ్ళిళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. దళితవాడలో భజగోవిందం కార్యక్రమాలు పెట్టి మతమౌ డ్యాన్ని పెంచి పోషిస్తున్నారు.
ఈ 75 సంవత్సరాలుగా ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటున్నo కానీ, ఎన్నడూ అలాంటి పరిపాలన లేదు. రాజకీయ చైతన్యం రాజకీయ నాయకుల్లో కూడా లేదు. సాంఘిక దురాచారాలు తగ్గాయి అని చెప్పలేము గానీ, వాటి రూపాలు మాత్రం మారాయి.
హక్కులు ఉన్నాయి అని సోయి అయితే కొంత వచ్చింది గానీ హక్కుల కోసం మరింత విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఉంది. ఎవరికోసం హక్కులు ఉన్నాయి ఎందుకోసం ఉన్నాయి అనే విషయాలను విస్తృత చర్చలు ప్రచారం కల్పించడం విషయంలో కొంత వెనకబడే ఉన్నామని అనుకోవచ్చు. పని విధానంలో కూడా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రాక్టికల్ గా ఉన్న సమస్యలపై నిరంతరం మాట్లాడాలి. మనుషులకు మనుషుల మధ్య కుటుంబ బంధాలు మాత్రమే కాదు, సమస్యలు తో కూడిన బంధాలు కలిగించే విధంగా పని చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎంత సమస్య నైనా ప్రజల్లో మమేకమై పని చేసిన రోజున విజయం సాధించిన చరిత్ర ఉంది కాబట్టి, విషయాలను అర్థం చేసుకొని వాటిని అవగాహనతో పని చేయాలి. సాంఘిక దురాచారాలపై ఒక యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం సామాజిక కార్యకర్తగా ఉంది.
కొలిమి: ముఖ్యంగా ఏదైనా ఒకసందర్భంలో మీరు నిజనిర్థారణ ఒక కమిటీగా చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పద్దతులు ఎంచుకుంటారు. ఇది ఒకరాజకీయ ప్రాసస్, మెథడ్ కు సంభందించినది. ఒక సత్యాన్ని నిర్మాణం చేయడానికి, నిర్థారణ చేయడానికి మీరు ఎంచుకునే పద్దతులు ఏమిటి? (ఇందులోభాదితులను ఎలా అప్రోచ్ అవుతారు, ఎలాంటి ప్రశ్నలు అడిగుతారు, ఎవరెవరిని అడుగుతారు…) నిజనిర్థారణ ఇలాగే చెయ్యాలనే పద్దతి వుండక పోయినా, మీ అనుభవంలోమీరు ఎదురుకున్న మంచి, చెడులను చర్చించడం అవసరం అని భావిస్తున్నాము.
CMS: ముఖ్యంగా నిజనిర్ధారణ అనేది బాధితులకు సత్వర న్యాయం అందించడానికి ప్రధానమైతే, రెండవది బాహ్య ప్రపంచానికి మరిన్ని విషయాలు తెలియజేయడానికి. నిజనిర్ధారణ కి అనేక రకాలైన సంఘటనలో వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆయా అంశాలలో కొంత నిష్ణాతులు ఉన్నవారు వెళితే బాగుంటుంది. ఉదాహరణకి భూ వివాదం, యురేనియం విధ్వంసం, అత్యాచారాలు, కుల హత్యలు, మత విధ్వంసాలు, సామూహిక హత్యలు, ఆదివాసీలపై విధ్వంసం, ముడాచార హత్యలు, వరకట్న హత్యలు ఇలా అనేక సంఘటనలకు సంబంధించినవి ఉంటాయి వీటిలో ఆయా అంశాలపై విశ్లేషణ సామర్థ్యం ఉన్న వారు వెళితే మంచిది. అందులో కచ్చితంగా స్త్రీలు కూడా ఉండాలి
ఒకవేళ అత్యాచారాలు మహిళకు సంబంధించిన అంశం అయితే ఎక్కువ శాతం మహిళలు ఉంటారు. ఎందుకంటే బాధితులు ఇబ్బంది పడకుండా కొంత ఓపెన్ గా చెప్పగలిగే స్పేస్ ఉండాలి. కాబట్టి మరీ ఎక్కువ మంది తో కాకుండా నిజ నిర్ధారణకు వెళ్లడం జరుగుతుంది. మొదట పత్రికలో వచ్చిన అంశాలు, న్యూస్ ఛానల్ లో వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని సంఘటన జరిగిన ఊరిలో లేదా ప్రాంతంలో మన మిత్రులు ఎవరైనా ఉంటే వారి అభిప్రాయం సలహాలు సూచనలు తీసుకుని సంఘటన జరిగిన తక్కువ సమయంలో అక్కడికి వెళితే మంచిది.
1. బాధితులు కుటుంబ సభ్యులు వారి మిత్రులు చెప్పిన విషయాలను తెలుసుకుంటాము
2. చుట్టుప్రక్కల వారి అభిప్రాయాలు
3. నేరస్తుల తీరు వారి స్వభావం వారి స్టేట్మెంట్ ఇవన్నీ కలిపి
1. అంశం
2. పోలీసులు ఎన్ని రోజులు విచారణ చేశారు
3. క్రైమ్ బ్రాంచ్ లో నమోదు చేసిన అంశాలు
4. చార్జిషీటు
5. పోస్టుమార్టం రిపోర్టు నివేదిక
6. చుట్టుపక్కల వారి వాదన
7. మీడియా పత్రికల కోణం
8. నిందితుడు వాదన
9. బాధితుల నివేదిక
10. మిత్రుల కోణం
11. ప్రేరేపించిన అంశాలు
12 మనం చేయగలిగే సిఫార్సు
ఇవి ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకొని నిజనిర్ధారణ చేయాలి. అయితే నిజనిర్ధారణ కి వెళ్ళినప్పుడు సంఘటన జరిగిన అంశం మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల అనేక మానవ హక్కుల ఉల్లంఘన జరిగే అంశాలు ప్రత్యక్షంగా చూస్తాము. కాబట్టి వాటిని కూడా మనం మాట్లాడవచ్చు. వాటిని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయవచ్చు. ఇక్కడ భలం గా కనబడే పోలీసుల నిర్లక్ష్యం, నిందితునికి ఉన్న రాజకీయ అండదండలు ఇవి కూడా ప్రజలకు తెలియజేయాలి. దీనివలన బాధితులను లొంగదీసుకుని పరోక్ష వ్యక్తుల ప్రెజర్స్ తగ్గుతాయి.
ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడమే కాకుండా చట్టపరమైన కోణాలు సంస్థలు లోనైనా విచారణ చేయాలని డిమాండ్ చేయాలి. బాధిత పక్షాన న్యాయపరమైన సహాయం కావాలంటే వారికి ఏర్పాటు చేయాలి. చట్టాల్లో ఉన్న లొసుగులను చట్టపరంగా తీసుకొని అడ్డువచ్చిన అంశాలను కోడ్ చేయాలి. వీలైతే ఎక్కువగా ఈ అంశం ప్రజల్లోకి తీసుకు పోవాలి నిరంతరం పని చేయాలి. కరపత్రాలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలి. ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలి. ఏ వేదిక ఎక్కిన ఈ సంఘటనపై ప్రస్తావన చేయాలి.
న్యాయస్థానం పై పడే ప్రభావాన్ని ఇచ్చే తీర్పులను కూడా విశ్లేషణ చేయాలి.
కొలిమి: పెట్రేగుతున్న హిందుత్వ, కుల, పితృస్వామ్య, రాజ్యహింస సందర్భంలో మీ సంఘ పరిధిలో ఇప్పుడు చేస్తున్నది, ఇంకా చేయాల్సినవి ఏమిటని మీరు అనుకుంటున్నారు.
CMS: అన్ని రకాల హింసలు మహిళలపై ప్రధానంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మతపరమైన హింస పితృస్వామ్య హింస నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. ఇవి ఎంత లోతుల్లోకి పాతుకుపోయి అంటే మహిళలు కూడా కుల పితృస్వామ్య హింసలను ఆమోదించి వాటిని అంగీకరించే విధంగా సమాజంలో పేరుకుపోయాయి. ఈ హింస అనేక రూపాల్లో పనిచేస్తుంది. ముఖ్యంగా పాఠ్యాంశాలు కూడా ఫాసిజం కు దగ్గరగా ఉన్నా పాఠాలు ఎక్కువయ్యి, సమాజంలో విలువలను పెంచే పాఠాలు లేకపోవడం బాధాకరం. పూర్తిగా పితృస్వామ్య భావజాలం తో నిండిన కవులు, రచయితలు రాసినవే ఉంటున్నాయి. టెక్నికల్ గా ముందుకు వెళుతున్న యువత ఫాసిజం లో మాత్రం కొట్టుకు పోతున్నారు. ఈనాటికీ ఈ దేశంలో బాల్య వివాహాలు, విధవా ఆచారాలు, అనేక సాంఘిక దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కారణం సాంఘిక దురాచారాలను నిర్మూలించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దానికి కారణం ప్రభుత్వాలే ఫాసిజాన్ని, అశ్లీల చిత్రాలను, ఇంటర్నెట్లో వస్తున్న అశ్లీల సినిమాలు అశ్లీల దృశ్యాలను పెంచి పోషిస్తున్నాయి.
వీటిపై ప్రజా సంఘాలు మహిళా సంఘాలు పూర్తిస్థాయిలో పని చేయాలి మరింత లోతుగా విశ్లేషణ జరిపి విస్తృతంగా తమ ఆలోచనలను స్కూల్స్లో కాలేజీలో చర్చల ద్వారా అవగాహన కల్పించాలి. మహిళలు మాత్రమే బాధ్యులు కాకుండా పురుషులు కూడా బాధితులు గా గుర్తించాలి.
కొలిమి:హక్కుల పరిరక్షణ సంఘాల వరకే పరిమితమవుతున్న స్థితి ఒకటి వచ్చింది. దానిని మొత్తం సమాజం భాద్యతగా మార్చడానికి ఏమి చేయాల్సివుంది. దానికి కావాల్సిన శక్తులు, సాధనాలు ఏవని మీరనుకుంటున్నారు.
CMS: హక్కుల సంఘాల కి వరకే పరిమితమవుతున్న స్థితి వుంది. దీనికి పరిష్కారం విశాలంగా పనిచేయడమే. చిన్న అతి చిన్న సంఘాలు కుల సంఘాలు సంస్థలు కలుపుకొని పని చేయాలి. ముఖ్యంగా కాలేజీలో బహిరంగ చర్చలు పెట్టాలి. విద్యార్థుల్లో రాజకీయ సామాజిక హక్కులపై చైతన్యం తీసుకురావాలి. బస్టాండు, ట్రైన్స్ లో ప్రచారం చేయాలి. సాంస్కృతిక కళా రూపాలు ఏర్పాటు చేయాలి. సంతలో, వాడల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. అన్ని ఏరియాల్లో ఉన్నా మహిళా పొదుపు సంఘాలను కలుపుకోవాలి. అవసరం అయితే ప్రభుత్వ అధికారులతో కూడా చెప్పించే ప్రయత్నం చేయాలి. మనువాద అ భావజాలాన్ని ఎంతో విస్తృతంగా వ్యాప్తి చేయడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా అన్ని వేళలా అన్ని సందర్భాలలో జరుగుతూ వచ్చింది. అలాంటిది మానవ సమాజానికి అవసరమైన హక్కులకోసం మనం మరింత గా పని చేయాల్సిన అవసరం ఉంది.
కొలిమి : మీరు చేస్తున్న మానవ హక్కుల కృషిలోనిరాశ చెందకుండా పని చేయడానికి మిమ్ముల నడిపిస్తున్న పరిస్థితులు, ఆశ, ఆశయాలు, ఆదర్శాలు ఏమిటి?
CMS: ఆదర్శంగా నిలిచే ది ఎప్పుడు
1. స్ఫూర్తినిచ్చే మనుషులు. వారి ఆచరణ, వారి అనుభవాలు. ఎంత కఠినమైన సందర్భంలో కూడా ఏమాత్రం చెక్కు చెదరని ఆలోచనలు.
2. పుస్తకాలు
3. పాటలు, ప్రసంగాలు
4. ప్రజల కోసం పని చేస్తూ నిర్బంధాన్ని ఎదుర్కొనే పరిస్థితులు, వారి మరణాలు
5. పని చేస్తున్న క్రమంలో సాధించిన విజయాలు.
6. ఏ మాత్రం రాజకీయ అవగాహన లేకపోయినా అనుభవం ద్వారా చెప్పే ప్రజల మాటలు.
7. చరిత్ర లో జరిగే మార్పులు
8. కోర్టు ఇచ్చిన తీర్పు లు.
ఇంటర్వ్యూ స్ఫూర్తివంతంగా ఉంది!👍
చైతన్య మహిళా సమఖ్య గత చరిత్ర.
చైతన్య మహిళా సంఘం ఇప్పుడు ఉంది.
మీరు గతించిపోయిన చరిత్రని ఇంటర్వ్యూ చేశారా?
లేక ఇప్పుడు మనుగడలో ఉన్న సంఘాన్ని చేశారా?
సమాధానం చెప్పగలరు.