ఫాసిజాన్ని సవాలు చేసిన మహిళలు – జర్మనీ, ఇటలీ

‘అంతరాత్మ స్వేచ్ఛ, జ్ఞాపకాలు, భయం – వీటిని కలిగివున్న వ్యక్తులు ఒక చిన్న చెట్టు కొమ్మ లాంటి వాళ్ళు, ఒక గడ్డిపోచలాంటి లాంటి వాళ్ళు. ఉరకలు వేస్తూ ప్రవహించే నది దిశని సైతం అవి మళ్లించగలుగుతాయి. ఆ మనుషులూ అలాంటివాళ్లే’.
– నదేజ్ద మాండెల్ స్టామ్

విద్వేష ప్రచారంతో అధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రత్యర్థులపై, అసమ్మతి వ్యక్తం చేసిన వాళ్లపై కనీవినీ ఎరుగని దాడులు, హింసాకాండలకి పాల్పడటం, ప్రపంచ యుద్ధం వీటన్నిటితో కలగలిసిన ఫాసిస్టు ప్రయాణంలో జర్మనీ, ఇటలీదేశాల సాధారణ ప్రజల పాత్ర ఏమిటన్నది చరిత్రలో ఒక చర్చనీయాంశం. ఫాసిస్టులు అధికారంలో స్థిరపడిన తర్వాత, వ్యతిరేకులపైన విస్తృత హంతక దాడులు, చిత్రహింసల నేపథ్యంలో ఆ రెండు దేశాలలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ అసమ్మతిని ఎలా వ్యక్తం చేశారన్నది ఇంకో ఆసక్తికరమైన విషయం. ఈ చరిత్రలో ఎక్కువగా ప్రచారంలోకి రాని రెండు ఉదాహరణల గురించి తెలుసుకుందాం.

జర్మనీ: రోజెన్ స్ట్రాసె – గులాబీల వీధిలో జయించిన ప్రేమ!

1943 ప్రారంభ దినాలు. స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో అప్రతిహతమైన జర్మన్ పురోగమనానికి మొట్టమొదటిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందు కొంచెం దాచివుంచినా, చిట్టచివరికి ఫిబ్రవరి 2 నాటి ఓటమిని జర్మనీలో బహిరంగంగా అంగీకరించక తప్పలేదు. జర్మన్ ప్రజలు సర్వ శక్తులూ, వనరులని ఒడ్డిన ‘సంపూర్ణ యుద్ధాని’కి సన్నద్ధంకావాలని హిట్లర్ అనుంగు ప్రచార మంత్రి గోబెల్స్ పిలుపునిచ్చాడు. కేవలం హిట్లర్ వ్యతిరేక కరపత్రాలు పంచిన నేరానికి ఇద్దరు విద్యార్థులకి (అన్నాచెల్లెళ్లు) మరణశిక్ష విధించి, అదేరోజున వెనువెంటనే చంపివేసిన రోజులవి. యూదులని సమూలంగా నిర్మూలించే ‘అంతిమ పరిష్కారం’ సన్నాహాలు ఉధృతంగా కొనసాగుతున్న కాలమది. సరిగ్గా అదే సమయంలో మహిళల నిరసన పోరాటం ఒకటి ముందుకొచ్చింది. అది జర్మనీ రాజధాని బెర్లిన్ నడిబొడ్డున హిట్లర్, గోబెల్స్, గెస్టపో యంత్రాంగాన్ని ఎవరూ ఊహించని విధంగా వెనకడుగు వేయించింది.

జర్మనీలోనూ, యూరప్ లోనూ యూదులు లేకుండా చేయాలని ఫాసిస్టులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జర్మనీ నుంచి బలవంతంగా యూదులని గెంటివేయడం మొదలుపెట్టారు. అయితే, మిశ్రమ వివాహాలు చేసుకున్న వాళ్ళతో, అంటే యూదులని పెళ్లి చేసుకున్న జర్మన్లతో చిక్కు సమస్య వచ్చిపడింది. 1935 నాటి న్యూరెంబర్గు చట్టాల ప్రకారం మిశ్రమ వివాహాలని నిషేధించారు. అయితే, అప్పటికే జరిగివున్న వివాహాలని రద్దుమాత్రం చేయలేదు. యూదులని పెళ్లి చేసుకున్న జర్మన్లు విడాకులు తీసుకుంటారని ఫాసిస్టులు భావించారు. అలా జరగలేదు. మొదట్లో యూదులని గెంటివేసే చర్యలలో జర్మన్లని పెళ్లి చేసుకున్న యూదులని మినహాయించారు. అయితే, 1943 ప్ర్రారంభం నాటికి పరిస్థితి మారిపోయింది. బెర్లిన్ నగరాన్ని యూదు రహితం చేయాలనే లక్ష్యానికి చేరువలో ఉన్నామని గోబెల్స్ ప్రకటించాడు. ఒక్క ఫిబ్రవరి 27, 1943 నాడు బెర్లిన్ లో వున్న పదివేలమంది యూదులని నాజీ అధికారులు పట్టుకున్నారు. అందులో ఎనిమిదివేలమందిని ఆష్విట్జ్ కి తరలించి చంపేశారు. జర్మన్లని పెళ్లి చేసుకున్న రెండువేలమంది యూదులని మాత్రమే ఇంకా బెర్లిన్ లోనే నిర్బంధించి ఉంచారు. ‘పోయిన ఆదివారం నాడు ఒక్క దెబ్బతో బెర్లిన్ లో మిగిలివున్న యూదులందరినీ ఒక్క చోటికి చేర్చి నిర్బంధించాము. అతి త్వరలో వాళ్లందరినీ తూర్పు ప్రాంతాలకి పంపించివేస్తామ’ని గోబెల్స్ తన డైరీలో రాసుకున్నాడు.

అప్పుడు జరిగింది ఈ సంఘటన. హిట్లర్ ప్రభుత్వాన్ని ధిక్కరించి బెర్లిన్ లో ఎవరైనా ముందుకొస్తారని గానీ, అసలు అటువంటిది జరుగుతుందని గానీ ఎవరూ కనీసం ఊహించలేదు. బెర్లిన్ నడిబొడ్డున వున్న రోజెన్ స్ట్రాసె లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఆ యూదులందరినీ బంధించారు. అలా నిర్బంధంలో వున్న యూదుల భార్యలు (జర్మన్లు) ఒక్కొక్కరుగా అక్కడ గుమికూడడం ప్రారంభించారు. తెల్లవాసరేసరికి అక్కడ గేటు దగ్గర వందలాదిమంది చేరుకున్నారు. ‘మా భర్తలని మాకు అప్పగించండి అని నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. ఎల్సా హోల్జర్ ఒక జర్మన్ మహిళ. ఆమె భర్త రూడీ యూదు జాతీయుడు. ఆమె మాటల్లో చెప్పాలంటే, ‘నేను అక్కడికి చేరుకున్నాను, ఉదయం ఆరుగంటలు, అప్పటికే అక్కడ ఒక గుంపు జమకూడి వుంది. జనాలు అటూ ఇటూ కదలడం ప్రారంభించారు. ఆ చిన్న వీధి వీధంతా జనంతో నిండిపోయింది. వాళ్లొక కెరటంలా కదులుతున్నారు. అందరూ కలిసి ఒకే దేహంలా, ఆవేశంతో కదిలిపోతున్న ఒక సామూహిక దేహంలా నడుస్తున్నారు’.

నాజీ అధికారులకి ఏం చేయాలో పాలుపోలేదు. ‘వెళ్లిపోండి, లేదంటే కాల్చిపారేస్తాం ‘అని బెదిరించారు. ఆ మహిళలు ‘మీరే హంతకులు’ అంటూ బదులిచ్చారు. అయినా, బెదిరింపులకు భయపడి పక్క సందుల్లోకి పారిపోయారు, మళ్ళీ అంతలోనే ధైర్యం చిక్కబట్టుకుని తిరిగి అక్కడికే చేరుకున్నారు. ఇదే తంతు తిరిగి, తిరిగి కొనసాగింది. ఒక సమయంలో అక్కడ ఆరువందలమంది మహిళలు గుమికూడారు. నెమ్మదిగా వాళ్ళ కుటుంబ సభ్యులు కాని వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడం మొదలైంది. ఒక మహిళ, సిపాయిగా పనిచేస్తున్న తన సోదరుణ్ణి తోడుగా తీసుకొచ్చింది. అతను తనతో మరో ముగ్గురు సిపాయిలని తీసుకొచ్చాడు. తన సోదరి భర్తని విడిచిపెట్టకపోతే తాను యుద్ధానికి వెళ్లబోనని అధికారుల ముందు ఆ సిపాయి ప్రకటించాడు. ఆ ఘటనలో పాల్గొన్న మరొక మహిళ మాటలలో, ‘ఒకరోజు పరిస్థితులు ఉద్రిక్తంగా మారేయి. నాజీ అధికారులు మర తుపాకులు ఎక్కుపెట్టి, వెళ్ళిపోతారా, మమ్మల్ని కాల్చేయమంటారా అని అడిగేరు. మేము లెక్క చేయలేదు. మేమూ అరిచాం, హంతకులారా అని అని జవాబిచ్చాం. ఆరోజున నిజంగానే కాల్చేస్తారనుకున్నాం. ఎవరో ఒక అధికారి గట్టిగా అరిచాడు. బహుశా కాల్చమని ఆదేశమిచ్చాడు కాబోలు. ఆ గోలలో మాకేమీ వినపడలేదు. వాళ్ళే వెనక్కి తగ్గారు, ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. ఆ రోజు భరించలేనంత చలి, నా చెక్కిళ్ళపై కన్నీళ్లు గడ్డకట్టాయి’.

నాజీ అధికారులు చాలా రకాలుగా ఆలోచించారు. వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా అని సాధించారు. ఎవరూ లేరని తేలింది. అందరూ స్వచ్ఛందంగా , ఒకరితో ఒకరు మాట్లాడుకుని చేస్తున్న ఆందోళనయేనని తేలింది. వాళ్ళని అరెస్టు చేయవచ్చు, కాల్చి పారేయవచ్చు. అయితే అలా చేస్తే పరిస్థితులు చేయిదాటిపోతాయేమోనని భయపడ్డారు. అలాంటి నిరసనలు ఇతర ప్రాంతాలకి పాకుతాయేమోనని జంకారు. పరిపరి విధాలుగా ఆలోచించినా వాళ్లకి ఏమీ తోచలేదు. ఒక వారం రోజులు గడిచినా ఆందోళనలు చల్లారకుండా కొనసాగుతుండేసరికి, విధిలేక తప్పనిసరై మిగిలిన యూదులందరినీ వదిలి వేశారు. చరిత్రకారుడు రిచర్డ్ ఇవాన్స్ మాటలలో చెప్పాలంటే, ‘సంపూర్ణ యుద్ధానికి సన్నద్ధం కావాలని అప్పటికే ప్రచార శాఖామంత్రి పిలుపునిచ్చాడు. అలాంటి సమయంలో బెర్లిన్ లో మహిళలని రెచ్చగొట్టకూడదని హిట్లర్, గోబెల్స్ లు భావించారు…అప్పటికే ఆష్విట్జ్ కి తరలించిన మరొక ముప్ఫయి ఐదుమంది మిశ్రమ వివాహాలు చేసుకున్న యూదులని కూడా వెనక్కి రప్పించారు. ఆ మహిళలు గెలిచారు, వాళ్ళ భర్తలు సజీవులుగా మిగిలేరు’.

జర్మన్ పత్రికలలో ఈ నిరసన ఆందోళనల వార్తలు రాకుండా కట్టడి చేశాడు గోబెల్స్. అయినా ఆ వార్త అటూ, ఇటూ పాకిపోయింది. స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికా పత్రికలలో ఆ ఆందోళనలపై కథనాలు వచ్చాయి. గోబెల్స్ వీటిని గిట్టని దేశాల ప్రచారంగా కొట్టిపడేశాడు. ఆ మహిళలు, బ్రిటన్ బాంబు దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారని బొంకాడు! కారణాలేమైనా, యుద్ధానంతరం చాలారోజులపాటు ఈ సంఘటన అంతగా ప్రచారంలోకి రాలేదు. 1993లో నాథాన్ స్టోల్జ్ ఫుస్ రాసిన ‘రెసిస్టెన్స్ ఆఫ్ ది హార్ట్’ అన్న పుస్తకం అచ్చయింది. 2003 లో జర్మన్ దర్శకురాలు మార్గరెత్ వాన్ ట్రోతా, రోజెన్ స్ట్రాసె పేరుతొ సినిమా తీశారు. రోజెన్ స్ట్రాసె మహిళల పోరాటాన్ని జర్మన్ చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చారు. నాథాన్ స్టోల్జ్ ఫుస్ ఇలా రాసేడు, ‘రోజెన్ స్ట్రాసె నిరసనలలో మిణుకుమిణుకుమంటున్న ఒక చిన్న కాగడా వుంది. ఆ రోజెన్ స్ట్రాసె మహిళల పోరాటాన్ని మిగతా జర్మన్లు గుర్తించి, ఆ సామూహిక ఉల్లంఘన చర్యలని అనుసరించి ఉంటే బహుశా అది ఒక పెను సామూహిక ప్రతిఘటన జ్వాలని రగిలించివుండేదేమో. బహుశా మహిళలు చేసే పనులుగానీ, శాంతియుత ఆందోళనా చర్యలు గానీ రాజకీయంగా శక్తివంతమైనవి కాలేవు అన్న ఆలోచనలకి వాళ్ళు అలవాటుపడి ఉన్నారేమో, వాళ్ళు అలా చేయలేదు’.

రోజెన్ స్ట్రాసె మహిళల పోరాటానికి స్మృతిచిహ్నం
‘పౌరుల సామూహిక ఉల్లంఘన, ప్రేమలోని శక్తి ఇవి నియంతృత్వ పాలన హింసని ఓడిస్తాయి. ‘మా భర్తలని మాకు అప్పగించండి’అని ఆ మహిళలు నిలబడ్డారు, వాళ్ళు చావును జయించారు, వాళ్ళ భర్తలు స్వేచ్ఛని పొందారు’.
– స్మారక స్థూపం వెనక రాసిన వాక్యాలు

ఇటలీ: వరి కలుపు కూలీ మహిళలు – ప్రతిఘటన పాటల పల్లవి

ఫాసిజాన్ని ఎదిరించిన ఇటాలియన్ యోధుల ప్రతిఘటనా గీతం ‘బెల్లా చావ్’ (Bella Ciao) పాటని చాలామంది వినేవుంటారు. వివిధ దేశాలలో, దాదాపు 32 భాషలలో ఆ గీతపు అనువాదాలు, అనుకరణలు ప్రాచుర్యం పొందాయి. థాయిలాండ్ లో సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా నిలబడిన ‘రెడ్ షర్ట్స్’ఉద్యమం, కుర్దు మహిళా గెరిల్లాలు, కొలంబియా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, బ్రెజిల్ లో బొల్సోనారొ మితవాద దురహంకార ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల దాకా ప్రపంచవ్యాపితంగా తిరగబడుతున్న ప్రజలకు ఉత్తేజాన్నందించే గీతమది. నిజానికి ఈ పాటకి మూలం వరిపొలాలలో నాట్లు, కలుపు తీయడం వంటి పనులు చేసిన మహిళా కూలీల గీతాలలో వుంది.

మొత్తం యూరప్ ఖండంలో వరి పంటని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఇటలీ. యంత్రాలు రాకముందు, 1960ల దాకా, ఇటలీ ఉత్తరాది ప్రాంతాలలో మే – జూలై నెలల మధ్య మోకాటిలోతు బురదలో వరి నాట్లు వేసిందీ, కలుపు తీసిందీ, మహిళా కూలీలే. దారుణమైన పని పరిస్థితులతోపాటు, దోమలు, వాటితో వచ్చే మలేరియా మొదలైన సమస్యలతో ఆ మహిళలు సతమతమయ్యేవాళ్ళు.

1950ల నాటి ఇటలీ మహిళా కూలీల చిత్రం

ఈ పని పరిస్థితులే ఆ మహిళా కార్మికుల్ని కమ్యూనిస్టు, సోషలిస్టు సంఘాలవైపు నడిపించేయి. 1909లో 8 గంటల పనిదినం కొరకు వాళ్ళు పోరాడారు. ఆ పోరాటం వాళ్ళ పాటలలో, జ్ఞాపకాలలో చెరగిపోకుండా నిలిచిపోయింది. ఇటలీలో ఫాసిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత, 1922-43 మధ్య కాలంలో వామపక్ష సంస్థలన్నీ రహస్యంగా పనిచేయాల్సి వచ్చింది. కానీ వరికలుపు తీసే మహిళా కూలీలు మాత్రం తమ అభిప్రాయాలని దాచుకోలేదు. ఎక్కువమంది ఎరుపురంగులోని ఓటింగ్ కార్డులనే వుంచుకునేవాళ్ళు (ఫాసిస్టుల ఓటింగ్ కార్డు రంగు నలుపు).

వరి నాట్లు, కలుపు తీత పనులలో ప్రధానంగా మహిళలే ఉండడానికి వేరు,వేరు కారణాలున్నాయి. ఫాసిస్టు సంస్థలు మహిళలకి ఓపిక ఎక్కువ అనీ, వాళ్ళ వెన్నెముకలు సులభంగా వంగుతాయి కనుక కష్టమైనా ఈ పనిని వాళ్ళే తేలికగా చేయగలుగుతారనీ హాస్యాస్పదమైన వాదనలు చేసేవి. ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, అది పురుషులకి చెల్లించే వేతనాలలో సగం మాత్రమే మహిళలకి చెల్లించేవాళ్ళు.

ఫాసిస్టుల భావజాలం, ప్రచారంలో మహిళల స్థానం పరమ సంకుచితమైనది. మహిళల స్థానాన్ని అది గృహిణుల, తల్లుల పాత్రకి పరిమితం చేసింది. ప్రత్యేకించి ఇటలీలో ఈ ప్రచారం ఎక్కువమంది పిల్లలని కనడం, పాలిచ్చి ఆరోగ్యంగా పెంచడం, ఇంకా కుటుంబం, పిల్లల ఆహారపు అలవాట్లని మార్చడమే మహిళల బాధ్యత అనే దానిపై కేంద్రీకరించింది. పాస్తా, బ్రెడ్ లకి బదులుగా బియ్యం వాడకాన్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. అందుకు పది సంవత్సరాలపాటు ఒక సుదీర్ఘమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. పత్రికలు, ఇంటింటి వంటల పుస్తకాలూ ప్రచురించింది. ఇందుకోసం, జాతీయ వరి సంస్థ, మాతా, శిశు పరిరక్షణా సంస్థలని ఏర్పాటు చేసి, అందులో మహిళలు పాల్గొనడాన్ని ప్రోత్సహించింది. ముస్సోలినీ, ఫాసిస్టు యంత్రాంగమూ ఎంత ప్రచారం చేసినా మహిళా కూలీలు మాత్రం ఆ ప్రచారపు మాయలో పడలేదు. ఫాసిస్టు ప్రభుత్వం అడుగడుగునా భూస్వాములకీ, ధనిక రైతులకీ అనుకూలమైన విధానాలనే అనుసరించడాన్ని వాళ్ళు స్వయంగా తమ అనుభవంలోనే చూశారు.

ఇలాంటి నేపథ్యంలో, తమ దుర్భరమైన పని పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలన్నా, బాధలని వ్యక్తీకరించుకోవాలన్నా, తమ రాజకీయాల గురించి చర్చించుకోవాలన్నా ఆ మహిళా కార్మికులు ఎంచుకున్న రూపం పాటలు. అందులో సంభాషణలుండేవి, 1909 సమ్మె పోరాటం గురించిన మాటలు ఉండేవి, రష్యన్ విప్లవం గురించిన ఉత్తేజం ఉండేది, కమ్యూనిస్టు, కార్మిక నాయకుల ప్రస్తావనలుండేవి. పరిశోధకురాలు డయానా గార్విన్ మాటలలో చెప్పాలంటే, ‘కలుపుతీసే మహిళా కూలీల గీతాలు పనులలో మగవాళ్ల అనుభవాల మీద ఆధారపడిన పాటల సంప్రదాయానికి భిన్నంగా ఉండేవి. అందులో ఆడవాళ్ళ పనులకి సంబంధించిన కష్టాలు – కొద్దిపాటి దినుసులతో వంటలు చేయడం, పెళ్లి, ఆయా పెళ్లితో పిల్లలని కనడం, వ్యభిచారుల కష్టాలు మొదలైన అంశాలతో కూడిన లైంగిక శ్రమ గురించీ ఆ గీతాలలో ఉండేవి. ఆ గీతాలలో, సుఖ వ్యాధుల ప్రస్తావనలుండేవి (Quando avevo quindic’anni – నాకు అప్పుడు పదిహేనేళ్ళు), శిశు హత్యలు (Cara Adele, L’infanticida- డియర్ అడెలె, శిశు హత్య ), వేశ్యలపై అమలు జరిగే హింస (జూలై 29), ఆకర్షించి, మోజు తీరేక వదిలివేసి మగవాళ్ళు , బందీగా మార్చిన పంజరంలాంటి ఇల్లు (Bell’uccialin dal bosc – అడవిలో అందమైన పక్షి), కోరికలు తీరకుండానే వయసు మళ్లిపోవడం (Ho quarant’anni compiuti – నేను నలభై ఏళ్ళు గడిపాను) వంటి పాటలు ఉండేవి’. ఆ పాటలలో వాళ్ళు కమ్యూనిస్టు నాయకుడు టోగ్లియాటి చెల్లెళ్లమని ప్రకటించుకునేవాళ్ళు. ఈ పాటలు ఏ ఒక్కరో రాసినవి కాదు. కొన్నిసార్లు ఫాసిస్టు ప్రచార గీతాలలోని పదాలని కమ్యూనిస్టు, సోషలిస్టు, అనార్కిస్టు భావాలకి అనుగుణంగా పాడుకునేవాళ్ళు. 1924లో ఫాసిస్టు పోలీసులు హత్య చేసిన సోషలిస్టు నాయకుడు మతియోటిని తలచుకుని విలపించేవాళ్ళు. ఒక్క మాటలో లైంగికత, వర్గం, రాజకీయాలు ఆ పాటలలో కలగలిసి వ్యక్తమయ్యేవి.

బెల్లా చావ్ పాట తమ రోజువారీ జీవితం గురించీ, గట్టుపై నిలబడి కర్ర పట్టుకుని తమపై జులుం చెలాయిస్తున్న పెత్తందారు గురించీ చెబుతుంది. తాము స్వేచ్ఛగా జీవించే ఒక రోజు వస్తుందనే ఆశతో ఆ పాట ముగుస్తుంది. నేను వరి కలుపు కూలీని, దోపిడీకి గురవుతున్న మనిషిని (Son la mondina, son la sfruttata) అనే మరొక పాట విలక్షణమైనది. ‘నేను ఎన్నడూ భయపడని కార్మిక వర్గాన్ని / మమ్మల్ని హత్య చేశారు, సంకెళ్లు వేశారు/ జైళ్లలో బంధించారు, హింసించారు/ ఇవేవీ మమ్మల్ని ఆపలేవు’ అంటూ మొదలైన ఆ పాట, దోపిడీ లేని భూమికోసం ఐక్యంగా పోరాడుతామనీ, ఫిరంగి గుళ్ళని తట్టుకుని నిలబడతామనీ ముగుస్తుంది. రైలు పట్టాలపై ప్రాణమొడ్డి, దోపిడీదారులని నిలువరించామనీ, వరి మళ్ళనిండా బురద వున్నా, తమ పనికి మాత్రం ఎలాంటి కళంకమూ లేదని సగర్వంగా ప్రకటిస్తుంది. 1909 నాటి సమ్మె పోరాటాన్ని ప్రస్తావిస్తుంది.

1944 నాజీ ఆక్రమణ సమయంలో మహిళలు వరిచేలలో పనిచేయ నిరాకరించారు. ఫాసిజం పతనమయ్యేదాకా వాళ్ళు పనిలోకి రాలేదు. అనేకమంది ఫాసిజాన్ని ఎదిరించిన ప్రతిఘటనా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రతిఘటనా దళ సభ్యులకి తమ ఇళ్లలో ఆశ్రయం ఇచ్చేవారు, బెటాలియన్ల మధ్య కొరియర్లుగా పనిచేశారు. ఈ మహిళా కార్మికుల ప్రతిఘటనా చరిత్ర గుర్తింపుకు నోచుకోకపోవడం ఒక విషాదమని పరిశోధక విద్యార్థి ఫ్లోరా డెరూనియన్ వ్యాఖ్యానిస్తుంది.

మహిళలు ఫాసిజాన్ని ధిక్కరించి నిలబడిన ఈ చరిత్రనంతా గుర్తించాల్సిన, గుర్తుంచుకోవలసిన సందర్భం మన ముందున్నది.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

4 thoughts on “ఫాసిజాన్ని సవాలు చేసిన మహిళలు – జర్మనీ, ఇటలీ

  1. Dear kiran, it is very inspiring model to build an emotional unity to fight out fascism. Very much relevant to the context. Thank you for this article

  2. Dear Sudhakiran,
    జర్మనీ,ఇటలీ మహిళల పోరాటం గూర్చి చదువుతుంటే ఈ నాటిషాహిన్ భాగ్ మహిళల పోరాటం గుర్తొస్తోంది.ఫాసిస్టు వ్యతిరేక పోరాట స్పూర్తిని అందించే మరిన్ని వ్యాసాలు రాస్తారని
    రామారావు

  3. సుధా కిరణ్ గారు చాలా మంది సమాచారం నిండిన వ్యాసమిది.

Leave a Reply