విరసం తన యాభై ఏళ్ల ప్రయాణాన్ని సమీక్షించుకొని సృజనాత్మక ధిక్కారం అజెండాగ పీడిత అస్తిత్వ గళాలను, వర్గపోరాట కలాలను కలుపుకొని జనవరి 11-12 తేదీల్లో ఇరవై ఏడవ మహా సభలు జరుపుకున్నది. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నది. దానికి కార్యదర్శిగా ప్రొ. కాశీం ఎన్నికయ్యాడు. కాశీం ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు అధ్యాపకుడు. సాహిత్యకారుడు, వక్త, ప్రజా ఉద్యమకారుడు. పాలమూరు జిల్లాలోని ఒక వెలివాడ నుండి సమాజంలోని కుల, వర్గ అణిచివేతలతో సంఘర్షణ పడుతూ సమాజంలో ఒక గుర్తింపు పొందిన ప్రజా మేధావిగా ఎదిగివచ్చాడు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు కూడా (ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా) ప్రత్యేక రాష్ట్ర ఆలోచనలు చెయ్యక ముందే తాను తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ నిర్మాణంలో భాగమై, దానికి నాయకత్వం వహించాడు. తెలంగాణ కోసం జరిగిన ప్రతి పోరాటంలో “తెలంగాణ జనసభ” లో భాగంగా ప్రధాన భూమిక పోషించాడు. తెలంగాణ ఉద్యమ సమాజంలో ఒక స్టార్ వక్తగా పేరు తెచ్చుకున్నాడు. “నడుస్తున్న తెలంగాణ” అనే పత్రికకు ఎడిటర్ గా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమమే కాదు, సమాజంలో జరిగే అన్ని రకాల హింసలకు, అసమానతలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా గళమెత్తాడు. మాదిగ దండోరకు తన మేధస్సును అందించాడు. అన్ని అస్తిత్వ ఉద్యమాలను స్నేహపూర్వకంగా ఆహ్వానించాడు. మద్దతు పలికాడు. ఇటువంటి ప్రజా మేధావిని తెలంగాణా ప్రభుత్వం 2016 నాటి తప్పుడు కేసును చూపుతూ జనవరి 18న తాను నివసించే క్యాంపస్ క్వార్టర్ మీద దాడి చేసి గడ్డపారతో తలుపులు పగులగొట్టి నాలుగు గంటలు సోదాలు నిర్విహించి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ తాను విడుదల చేసిన ప్రకటనలో కాశీంను కార్తీక్ అనే మావోయిస్టుగా, ప్రొఫెసర్ ను ప్రొఫెషనల్ రెవల్యూషనరీగా మార్చేశాడు.
2016లో కేసు నమోదైనప్పటి నుండి కాశీం మొత్తంగా ప్రజా జీవితంలోనే వున్నాడు. క్యాంపస్ క్వార్టర్ (ఆర్ 9)లోతన భార్యాపిల్లలతో నివాసం వుంటున్నాడు. ప్రతి రోజు తప్పనిసరిగ తరగతి గదుల్లో పాఠాలు చెబుతూనే వున్నాడు. అందుకు ప్రతి నెలా యూనివర్సిటీ నుండి జీతం తీసుకుంటున్నాడు. అంతేకాదు అనేక బహిరంగ వేదికల మీద నిరంతరంగా మాట్లాడుతున్నాడు. అయినా కూడా ఆయన పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడని, ఇప్పుడు తలుపులు బద్దలుకొట్టి పట్టుకున్నమని తెలంగాణ పోలీసులు సమాజానికి, న్యాయ వ్యవస్థకు చెబుతున్నారు. ఇది కట్టుకథ. అంతేకాదు ఈ చర్య ద్వారా ప్రభుత్వానికి అందులో భాగమైన పోలీసులకు చట్టం మీదకాని, న్యాయ వ్యవస్థ మీద కాని, పౌర సమాజం మీద కాని ఎలాంటి గౌరవం లేదని తేలిపోయింది. అధికారం చేతిలో వుంది కాబట్టి ఏమైనా చేయొచ్చు అనుకునే పాలకులు చరిత్రను కాస్త ఓపిగ్గా చదువుకోవాలి. వెంగళ్రావ్ మొదలుకొని చంద్రశేఖర్ రావు పాలన వరకు తెలంగాణలో ఎంకౌంటర్ అంటేనే బూటకం అనే స్థాయికి పోలీసుల రికార్డ్ ఎదిగిపోయింది. ఇక ఈ అరెస్ట్ చట్ట వ్యతిరేక చర్య అని ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఒక ప్రొఫెసర్ ను ప్రొఫెషనల్ రెవల్యుషనరీగా ఎలా మార్చగలిగారు. అసలు ప్రొఫెషనల్ రెవల్యూషనరీ అంటే ఏమిటి? ఈ పదాన్ని మొదటిసారిగా లెనిన్ “వాట్ ఈజ్ టు బీ డన్” అనే దీర్ఘ కరపత్రంలో కార్మికులు ఆర్ధికవాద సంస్కరణల భ్రమలో పడకుండ వాళ్ళను విప్లవ మార్గంలో గైడ్ చేయాడానికి ఒక విప్లవ మేధావి సమూహం పూర్తి కాలంగా విప్లవం కోసం పనిచేయడం అవసరం అని గుర్తుంచి వాళ్ళనే ప్రొఫెషనల్ రెవల్యూషనరీస్ అని అన్నాడు. కాని ఆ పాత్ర కాశీం పోషించడానికి తెలంగాణలో విప్లవోద్యమం ఆ స్థాయిలో ఎక్కడుంది. మావోయిస్టులు లేరని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు వాళ్ళ పేరిట అణిచివేత కొనసాగిస్తుంది. ఎందుకు అంతగా భయపడుతుంది.
తెలంగాణలో పోలీసులకు ‘పుస్తకాల దొంగలు’ అని మరో పేరుంది. కొత్త రాష్ట్రం కదా కాస్త అప్ డేట్ అయ్యారేమో ఈసారి కాశీం ఇంట్లో పుస్తకాలతో పాటుగా కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, పిల్లల బొమ్మలు కూడా ఎత్తుకెల్లారు. ‘వేల పుస్తకాలు చదివిన’ అని చెప్పుకునే ముఖ్యమంత్రి వున్న రాష్ట్రంలో సాహిత్యం ఎలా నేరమవుతుంది? బహుశా తెలుగు అధ్యాపకుడిగా కాశీం చదువుకునే పుస్తకాలతో ముఖ్యమంత్రికి, అతని సలహాదారులకు మంచి పరిచయమే వుండొచ్చు. వాళ్ళ దగ్గర కూడా వుండి వుండొచ్చు. బహుశా అవి కూడా జప్తు చేయాలేమో!
అక్షరాలు వాటికంతటిగా విప్లవాలు తీసుకురావు. విప్లవకర సామాజిక పరిస్థితులు లేనప్పుడు ఏ సాహిత్యం కూడా ఎవ్వరిని విప్లవ మార్గంలో నడపలేదు. పాలకులు అక్షరాలను, మాటను, పాటను చూసి భయపడుతున్నారంటే తమ పాలన పట్టాలుతప్పి నడుస్తున్నట్లే. సమాజంలో అసహనం నెలకొని వున్నట్లే. వాటిని అక్రమ అరెస్టులతో ఆపగలరా పాలకులు? అలా అయివుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు.
తమ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడం కోసం పాలక వర్గాలు అణిచివేతను ఆశ్రయించడం చరిత్ర పొడువునా జరుగుతున్న విషయమే. కాని ఉద్యమ కాలమంతా తమతో గొంతు కలిపి నడిచిన ఒక సహచరుడుని అక్రమంగా నిర్భందిస్తే మౌనం వహించే కవులు, రచయితలు, బుద్ధిజీవులు రేపటి చరిత్రలో దోషులుగా మిగిలిపోతారు.
రాజ్యాంగ పరిరక్షణ అంటూ గొంతెత్తే ప్రతి ఒక్కరు తప్పక కాశీం అరెస్ట్ పై స్పందించాలి. ఎందుకంటె రాజ్యాంగాన్ని compartmental గా కాపాడడం కుదురదు. పౌరహక్కులు, భావస్వేచ్ఛ కూడా రాజ్యాంగం పౌరులకు ఇచ్చినవే. ఆ హక్కులు అందరికి వర్తిస్తాయి. కాశీంకు కూడా. అరెస్ట్ కాబడిన ఆ అధ్యాపకున్ని మళ్ళీ తరగతి గదుల్లో పాఠాలు చెప్పించే బాధ్యత తెలంగాణ పౌరసమాజం, అణగారిన కులాలు, వర్గాలు తీసుకొని తన చైతన్యాన్ని, ప్రతిఘటనను మరోసారి నిరూపిస్తాయని ఆశిద్దాం.
Narration is good. Since vengal Rao period, feudalistic domain attitude has been towards undemocratic arrests.
అక్రమ నిర్బంధం