రచన: జ్యోత్స్నా కపూర్
అనువాదం: సి. యస్. ఆర్. ప్రసాద్
ఆలోచనారాహిత్యం, బాల్యచేష్టలను సాధారణ విషయంగా హిందూత్వ ప్రచారం చేస్తోంది.
“ప్రతిదీ బీటలు వారుతుంది- అలా వెలుగు లోపలికి ప్రసరిస్తుంది.”- లియోనార్డ్ కోహెన్ *
నేలకూలిన ఆశల నిర్ధాక్షిణ్య క్షణాల నుండి మనం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం. 2022 అక్టోబరు 14 శుక్రవారం నాడు బొంబాయి హైకోర్టు జి.యన్. సాయిబాబా, మహేష్ టిక్రి, హేమ్ మిశ్రా, ప్రశాంత రాహి, విజయ్ టిక్రి, అప్పటికే జైలులో చనిపోయిన పాండు నరోటేలపై కేసు కొట్టివేసింది. రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రపన్నారనే నెపంతో ఈ ఆరుగురిని ఊపా చట్టం కింద అరెస్టు చేశారు. నేర విచారణలో ముఖ్యమైన సాంకేతిక లోపం వుందని హైకోర్టు అభిప్రాయపడింది. (ఊపా చట్టాన్ని కేవలం సాంకేతిక అంశాల ఆధారంగానే సవాల్ చేయగలం). అయితే ఆ మరుసటి రోజే – ఆదివారం సెలవు దినంనాడు, హైకోర్టు తీర్పు సరైంది కాదని చెప్పకుండానే సుప్రీంకోర్టు ఆ ముగ్గురిపై కేసు కొట్టివేయడం పై స్టే విధించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు దీనిని నిరసిస్తే పోలీసులు వాళ్ళని బలప్రయోగంతో చెల్లాచెదురు చేశారు. న్యాయవ్యవస్థ ఇంకా పనిచేస్తూనే వున్నదనే అభిప్రాయాన్ని ఈ సంఘటన కొంతమందికి కలిగించింది. మనదేశంలో నిరోధ సమతౌల్యాల పద్దతి ఉన్నదనే వాస్తవం ఈ ఉదాహరణ ద్వారా రుజువవుతుందని వాళ్ళంటారు. హైకోర్టు విడుదల చేస్తే దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకదా. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఇది మరొక రోజు మాత్రమే.
అయితే ఈ మొత్తం సంఘటనలో నుండి తీసుకోవాల్సిన అతిముఖ్యమైన పాఠాన్ని, ఒక న్యాయమూర్తి తన మాటల ద్వారా బహిరంగం చేశారు. వైద్య కారణాల రీత్యా మానవతా దృక్పథంతో సాయిబాబాను గృహనిర్బంధంలో వుంచాలని ఆయన తరఫున న్యాయవాది కోరితే, హైకోర్టు తీర్పుపై స్టే విధించిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరైనా ఎమ్.ఆర్. షా ఇలా అన్నారు…. “మేం ఈ కేసు గురించి ప్రస్తావించడం లేదు. ఒక సాధారణ అర్థంలో మాట్లాడుతున్నాం. మెదడు అత్యంత ప్రమాదకరమైంది. టెర్రరిస్టులకు, మావోయిస్టులకు మెదడే అంతా”.(1) 1928 జూన్ 4న ఆంటోనియో గ్రాంసీకి 20ఏళ్ల శిక్ష విధించిన వైనంతో దీన్ని పోల్చారు. ఇటలీ ఫాసిస్టు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ గ్రాంసీని వేలెత్తి చూపుతూ, “20 సంవత్సరాల పాటు ఈ మెదడు పనిచేయకుండా మనం ఆపడం తప్పని సరి” అని అన్నాడు. (Fretigne, 2021 pp, 194-195)
భారతదేశం ఫాసిస్టు రాజ్యమా? కాదా? అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇది ఫాసిస్టు దేశం కాదనే ఐజాజ్ అహ్మద్ (2019) అభిప్రాయంతో నేను అంగీకరిస్తున్నాను. కనీసం మనకు తెలిసిన 20వ శతాబ్దపు ఐరోపాలోని సాంప్రదాయక అర్థంలో ఇది ఫాసిస్టు రాజ్యం కాదు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, విద్యా సంస్థలు, ప్రసార సాధనాలు – అంటే ఉదారవాద ప్రజాస్వామిక సంస్థలన్నింటినీ లోలోపలి నుండి తమకు అనుకూలంగా మార్చుకోడమే మోడీ, హిందూత్వ పథకం సాధించిందని అహ్మద్ భావన. బయటకు మాత్రం ఉదారవాద ప్రజాస్వామ్యం ఆచరణలో వుందనే భ్రమను కల్పిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాపిత ధోరణి అని అహ్మద్ అభిప్రాయం. అమెరికా, ఇజ్రాయెల్, టర్కీ వంటి దేశాలలో జరుగుతున్న ఘటనలను బట్టి ఫాసిస్టు జాడలు ఉ దారవాదంలో అంతర్గతంగానే వున్నాయని, ఉదారవాద ప్రజాస్వామ్యం దానికదే ఒక పెద్ద డొల్ల అని మనం గుర్తించవచ్చు. ఆయన ప్రత్యేకించి టర్కీ ఉదాహరణ పేర్కొన్నారు. సైనిక చర్య ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోకుండానే టర్కీ అధినేత ఎమ్డిగాన్ మేధావులను , అభ్యుదయవాదులను నిర్బంధించి లౌకిక సమాజపు అల్లికను నాశనం చేయడానికి అక్కడి ఉదారవాద సంస్థలను ఉపయోగించుకున్నాడు.
అయితే, రాజ్య ఆమోదంతో అమలవుతున్న హింస మద్దతుతో కొనసాగుతున్న మోసపూరిత ప్రజాస్వామ్యం ఎలాంటి సంస్కృతిని ఉత్పన్నం చేస్తుందో మనం అవగాహన చేసుకోవాలి. అది వ్యక్తుల్ని ఎలా ఆకర్షిస్తుంది. అది తన భావజాలానికి ఎవరిని ఎరగా చేసుకుంటోంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతోందా? విచారణ కోసం ఎదురుచూస్తున్న ఊపా నిర్బంధితులలాగా మనం కూడా కోర్టుల చుట్టూ అవిశ్రాంతంగా తిరగడం మాత్రమే మిగులుతుందా? చివరి నిముషంలో న్యాయమూర్తుల్ని ఆకస్మాత్తుగా మార్చడమే జరుగుతుందా? విచారణ పూర్తికావడానికి ముందే ప్రధాన స్రవంతి మీడియా ముద్దాయిలను దోషులుగా చిత్రీకరించడాన్ని మాత్రమే చూడాల్సి వస్తుందా? ఇదంతా ఒక దుర్మార్గమైన, అసంబద్ధమైన వ్యవహారం కాదా? ప్రజాస్వామ్యం ఉనికిలో వుందనే దానికి నిదర్శనంగా కుప్పకూలిపోతున్న ఉదారవాద ప్రజాస్వామ్యాన్నే చూపడం కాదా ఇది.
అదే ఇంటర్వ్యూలో అహ్మద్ ప్రతి దేశమూ దానికి తగిన ఫాసిజాన్ని అనుభవిస్తుందని, ఆయా దేశాల విలక్షణమైన చరిత్ర, దేశంలోని లోతైన నిర్మాణాల మీద ఆధారపడి ఫాసిజం వుంటుందని అన్నారు. ఆ న్యాయవాది మన దేశంలోని భాజపా, ఆర్ఎస్ఎస్ఎ నాయకత్వంలోని హిందూత్వ స్వభావాన్ని, దాని అవసరాన్ని బట్టి అది దేన్ని పెంచిపోషిస్తుంది అనే అంశాన్ని గుర్తించడం ద్వారా వర్ణించారు. దానికి కావలసింది బాల్యావస్థలోని ప్రజలు- అంటే తమ మెదళ్ళను మూసి ఉంచాలనే ఉత్సుకత ఉన్న పెద్దలు. ఎలాంటి సందేహాలనీ, ప్రశ్నలనీ తమ మెదళ్ళలోకి రానీయకుండా ఉండే పెద్దలు. తాము పోగొట్టుకున్న గత వైభవాన్ని పునరుద్ధరిస్తాడనే నమ్మకంతో అత్యున్నత అధినేత పట్ల భక్తిభావంతో కళ్ళుమూసుకుని శాంతిని అనుభవిస్తున్న పెద్దలు. ఇలాంటి తిరోగమన వైఖరి నుండి వాళ్ళుపొందే ఆనందమేమిటో అర్థం చేసుకుంటే ఈ ధోరణి మనకు అవగాహన అవుతుంది. ఈ నయా ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రతిఘటనకు సంబంధించిన ఉదాహరణలు ఏమైనా వున్నాయా?
హిందూత్వ భావజాలానికి రూపకల్పన చేసిన వ్యవస్థాపకులు నాజీలను అభిమానించారన్నది, వాళ్ళ నమూనాలోనే భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారన్నది రహస్యమేమీ కాదు. అయితే, తమకు జరిగిన అవమానానికి ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం జరిగే యుద్ధంలో పురుషులు, ప్రత్యేకించి యువకులు చేరాలని పిలుపునిచ్చిన నాజీలకు భిన్నంగా (Theweleit, 1987) హిందూత్వ తన ప్రజల్ని మాతృదేశానికి జరిగిన అవమానానికి ప్రతీకారాన్ని తీర్చుకునే ‘పిల్లలు’గా తయారుకావాలని పిలుపునిస్తోంది. ఆర్యసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన గోల్వాల్కర్ 1939లో ఇలా రాశారు.
“జాతితత్వం మనకు ఒక సంకేతం. అది భావదారిద్య్రంలో వున్న పిల్లలకు వాళ్ళ హృదయాల్లో పాదుకున్న ఆదర్శాన్ని ఆచర సాధ్యం చేయడానికి వెలుగు మార్గాన్ని చూపిస్తుంది. సజీవమైన ఆధ్మాత్మిక సంపద అందులో కీలకమైన అంశం. వాస్తవమైన మన జాతీయత కోసం చైతన్యవంతులం అవుదాం. మన జాతి తత్వం అందించే నాయకత్వాన్ని అనుసరిద్దాం. వివిధ సముద్రాల మధ్య వున్న మొత్తం భూమి అంతా ఒకే జాతి అనే వేద పండితుల పిలుపుతో విశ్వాన్ని నింపివేద్దాం. ఒక మహత్తరమైన హిందూజాతి యావత్ ప్రపంచంమీద శాంతిని, సమృద్ధిని వెదజల్లేటట్లుగా చేద్దాం.” (132/133)
బాల్యచేష్ట అనే పదాన్ని నేనిక్కడ ఫ్రాయిడియన్ అర్థంలో వాడుతున్నాను. అంటే బాల్యంలో అందరం అనుభవించే నరాల బలహీనతలోకి తిరోగమించడం అని అర్థం. నిస్సహాయత, మొత్తం ప్రపంచంమీద ఆధిపత్యాన్ని పొందాలనే కాంక్ష ఇలాంటి మానసిక స్థితికి దారితీస్తాయి. అవి క్రమంగా విపరీతమైన కోపాన్ని పిల్లల్లో కలిగిస్తాయి. తమని పట్టించుకోని పెద్దవాళ్ళని శిక్షించాలనే కోరికలాంటి వికృత వ్యక్తీకరణ దీనిమూలంగానే పిల్లల్లో తలెత్తుతుంది. వాళ్ళు తమ కోపాన్ని తమలోనే అణుచుకుంటారు. వాస్తవమైన లేక ఊహించుకున్న జబ్బును నటిస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హిందూత్వ భావజాలం బాల్యదశలోని సుప్తచైతన్యం నండి ఇలాంటి అనుభవాలను వెలికితీస్తుందని అంటున్నానంటే అర్థం – నిజంగా పిల్లలందరూ ఇంతటి నిర్దాక్షిణ్యమైన వికృత పురుషత్వాన్ని ప్రదర్శిస్తారని కాదు. ఒకపక్క ఆవుల్ని పూజిస్తూనే మరోపక్క తమని వ్యతిరేకించిన వాళ్ళమీద మూకదాడులు చేసి వాళ్ళ శరీరాలను ఛిద్రంచేసే ‘భక్తుల’లాంటి విపరీత మనస్తత్వాన్ని పిల్లలు కలిగివుంటారని చెప్పడం కాదు. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలలాగే తమ కోపాన్ని, లొంగుబాటును వ్యక్తీకరించడానికి బాల్యంలోకి జారుకుంటారని చెప్పడమే నా ఉద్దేశ్యం.
గోరక్షకులు బాధితులమీద ప్రదర్శించే హింస, తమ చర్యలని వీడియోల రూపంలో ప్రచారం చేయడం- ఈ వికృత చర్యల మరొక కోణం. కేవలం బీఫ్ కలిగివున్నాడనే నెపంతో మొహమ్మద్ అఖ్తక్ లాంటి చాలామందిని వాళ్ళు పాశవికంగా హత్యచేసారు. ఆవుల మృతకళేబరాల నుండి చర్మాన్ని వలిచినందుకు దళిత పురుషుల్ని బహిరంగంగానే కొరడా దెబ్బలతో హింసించారు. ఉన్నత, మధ్యతరగతికి చెందిన ఈ మూకలు ఎలాంటి వికృత ఆనందాన్ని పొందుతున్నాయో దీని నుంచి మనందరం గమనించగలం. కేంద్రప్రభుత్వం అకస్మాత్తుగా లాక్డ్ డౌన్ ప్రకటించినప్పుడు కాలినడకన తమ స్వస్థలాలకి కార్మికులు వెళుతుంటే వాళ్ల పట్ల సానుతాపాన్ని ప్రకటించడానికి బదులు, మధ్య, ఉన్నత మధ్యతరగతికి చెందిన ప్రజలు కోవిదు విరుగుడుగా చప్పట్లు కొట్టటం, కంచాలను మోగించడం, దీపాలు ఆర్పడం, కొవ్వుత్తులు వెలిగించడం లాంటి నటనలకు, అధినేత ఇచ్చిన పిలుపులకు అనుగుణంగా పాల్పడ్డారు.
ఇలాంటి వికృతమైన మగతనపు సంస్కృతిని అందించే శిక్షణ వ్యక్తుల జీవితాలలో తొలి ప్రాయంలోనే ప్రారంభమౌతుంది. ఈ విషయంలో హిందూత్వ సంస్కృతి గురించి తనికా సర్కార్ (2022) చేసిన శ్లాఘనీయమైన పరిశోధన మనకు విలువైన పాఠాలను అందిస్తుంది. ఆర్ఎస్ఎస్ చాలా చిన్నతనంలోనే పిల్లల్ని ఎట్లా రిక్రూట్ చేసుకుంటుందో, వాళ్ళు నడిపే బడులలో స్వీయ విధ్వంసక సంస్కృతిని, అధికారంలో ఉన్నవాళ్ళపట్ల తిరుగులేని విధేయతను- చరిత్రకూ, పురాణాలకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని తుడిచిపెట్టడం ద్వారా ఎట్లా వివరిస్తాయో ఆమె వివరించారు. ఆర్ఎస్ఎస్ శాఖలలో లాగానే ఈ స్కూళ్ళల్లో కూడా తమ ప్రాణాలను బలిపెట్టి తమకు జరిగిన అవమానానికి ప్రతీకారాన్ని తీర్చుకున్న ‘హీరోలను’ నమూనాలుగా చిత్రించడం జరుగుతోంది. ముస్లింలను చారిత్రక శత్రువులుగా చూపిస్తారు. మరోచోట తనికా సర్కార్, దేశాన్ని ఒక పవిత్రమైన శరీరంగా ఎలా ఊహిస్తారో, నిరంతరం దురాక్రమణలకు, బెదిరింపులకు గురైన దేశంగా హిందూత్వ వాదులు ఎలా చిత్రిస్తారో కూడా వివరించారు. (2)
తమ తిరోగమనం నుండి తాము ఎలాంటి ఆనందాన్ని సంతృప్తిని పొందడం లేదని ఈ భక్తులంటారు. అందుకు బదులు తాము చరిత్రలో దొర్లిన తప్పుల్ని సరిదిద్దుతున్నామని అంటారు. తమ రాజకీయ, ఆధ్యాత్మిక జీవితాల్లో నియంతృత్వపు పోకడలు కలిగిన వ్యక్తుల్ని బహిరంగంగానే శ్లాఘిస్తారు. ప్రమాదకరమైన న్యూరోసిస్ వ్యాధిగ్రస్తులను మనం ఎదుర్కొంటున్నాం. యువతీ యువకులు హేతుబద్దంగా ఆలోచించే శక్తిని తమంతటతామే కావాలని కోల్పోతున్నారు. అధికారయుత రాజ్యం అందించే వికృతమైన మగతనపు చర్యల ఫలితంగా ఆనందంలో మునిగితేలుతున్నారు. రాజ్యం వాళ్ళలో బాల్యచైతన్యాన్ని రెచ్చగొట్టి భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించకుండా చేస్తూంది.
ఇందుకు భిన్నంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలోనూ, రైతుల పోరాటంలోనూ ఒక గణనీయమైన సాధారణ లక్షణం మనకు కనపడుతోంది. అక్కడ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగానే ఆచరణలో వున్నారని మనకు అర్థం అవుతుంది. వివిధ తరాలకు చెందిన ప్రజల మద్య – 70లు, 80లు, 90లలో వున్న వృద్ధులు యువతీ యువకులతో, చిన్నపిల్లలతో కలిసి తమ సమష్టి అవసరాలకోసం ఎలా అత్యున్నతమైన సహకారంతో ఉద్యమిస్తున్నదీ మనం చూస్తున్నాం.
ఈ రెండు ఉద్యమాల్లోనూ వాళ్ళు ఒక అస్పష్టమైన భవిష్యత్తుకోసం కాదు పోరాడుతుంది. తమ వారసులుగా తాము భావిస్తున్న తమ సంతానానికి సంబంధించిన భవిష్యత్తుకోసం వాళ్ళు పోరాడుతున్నారు. అవి భవిష్యత్తుకోసం జరుగుతున్న పోరాటాలు. బహిరంగంగా జరుగుతున్న పోరాటాలు. వాళ్ళ సామూహిక వనరులన్నింటినీ ఉపయోగించుకొని జరుపుతున్న పోరాటాలు. అది ఒక సామూహిక ప్రత్యామ్నాయం. చిన్నపిల్లలు చదువుకుంటూ, ఆడుకుంటూనే పోరాటంలో పాల్గొంటున్నారు.
బాల్యాన్ని సక్రమంగా అవగాహన చేసుకునే మానసిక శక్తి హిందూత్వవాదులకు లేదు. బాల్యంలో జీవితమంతా సాధ్యమైనంత పారదర్శకంగా వుంటుంది. ఆ దశలో సంకుచితమైన సరిహద్దులు వుండవు. ఈ వాస్తవాలు హిందూత్వవాదుల దృష్టికి అందవు. ఫాసిస్టు రాజ్యం తమ పౌరులకు స్వతంత్రంగా జీవించే హక్కును నిరాకరిస్తుంది. అది దాని ప్రాథమిక లక్షణం. 1932లో ముస్సోలిని తన “ఫాసిస్టు సిద్ధాంతం”లో ఇలా అన్నారు.
“ఫాసిస్టు దృక్పథంలో రాజ్యం మానవజీవన పార్శ్వాలన్నింటిపై ఆధిపత్యాన్ని కలిగి వుంటుంది. రాజ్యం వెలుపల ఎలాంటి మానవీయ, ఆధ్యాత్మిక విలువలు వుండవు. ఉన్నా వాటికి విలువ వుండదు. అంటే ఫాసిజం ఒక మితిమీరిన అధికార కేంద్రీకరణ అని అర్థం. అన్ని విలువలనూ తనలో సంలీనం చేసుకున్న ఫాసిస్టు రాజ్యం ప్రజల జీవితాలన్నింటినీ వ్యాఖ్యానిస్తుంది, ఎలా అభివృద్ధికావాలో నిర్ణయిస్తుంది, ఎంత శక్తివంతం కావాలో కూడా నిర్ణయిస్తుంది.”
మరో మాటలో చెప్పాలంటే జీవించడానికి తగినవాళ్ళెవరో, మరణించాల్సిన వాళ్ళెవరో ఫాసిస్టు రాజ్యమే నిర్ణయిస్తుంది. ఈ విషయంలో చిన్న పిల్లలకు కూడా అది మినహాయింపును ఇవ్వదు. నిజానికి పుట్టుకలోనే ఎలాంటి పిల్లలు కావాలో అది నిర్ణయించి అందుకు అవసరమైన చర్యలు చేపడుతుంది. “ఆదర్శవంతమైన” పిల్లలను ఎలా కనాలో, అవసరంలేనివాళ్ళను అవసరమైన వాళ్ళనుండి వేరుచేసి వాళ్ళను బలహీనులను చేసి, వాడుకుని అంతిమంగా ఎలా చంపివేయాలో కూడా అది నిర్ణయిస్తుంది. నాజీల పాలనలో 1934లో ఏర్పడిన జర్మన్ విద్యా, సంస్కృతి, సైన్సు శాఖ, 1935లో యూదుల పిల్లలని పాఠశాల నుంచి దూరంపెట్టింది. తమకు వ్యతిరేకమైన రాజకీయ దృక్పథాన్ని కలిగిన ఉపాధ్యాయుల్ని సర్వీసు నుండి తొలగించి కేసులు మోపింది. సైనికతత్వాన్ని ఆదర్శీకరించేటట్లుగా పిల్లలకు శిక్షణ నిచ్చింది. ‘మెయిన్‌కాంఫ్’ పుస్తకాన్ని తప్పనిసరిగా పిల్లలు చదివేటట్లు చేసింది. ఆర్యరక్తం కలిగిన పిల్లలను కనడం జర్మన్ మహిళల ప్రాథమిక విధిగా ప్రచారం చేసింది.
ముస్లిం పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని వాళ్ళని ఒక పథకం ప్రకారం ఒంటరివాళ్ళని చేసే పద్ధతి ప్రస్తుతం రూపొందింది. వాళ్ళను తల్లిదండ్రుల నుంచి వేరుచేస్తామని బెదిరించడం, లేదా వాళ్ళను ఒంటరివాళ్ళని చేసి శిక్షించడం జరుగుతోంది. భారతదేశపు మొదటి రక్షణ అధిపతి జనరల్ బిపిన్ రావత్ 2020 జనవరి 16న, “రాడికలైజ్” కాబడిన కాశ్మీరీ ముస్లిం పిల్లలను వాళ్ళ కుటుంబాల నుండి వేరుచేసి వాళ్ళను డిరాడికలైజేషన్ శిబిరాలలో పెట్టాల్సి వుందని ప్రకటించారు (సేన్, 2020). ఈ ప్రకటన తరవాత ఢిల్లీలోని షహీన్ బాగ్ నిరసన ప్రదర్శనలో తల్లులతోపాటు వాళ్ళ పిల్లలు ఎందుకు వున్నారని సుప్రీమ్ కోర్టు ప్రశ్నించింది. (3) యూపిలోని ముజఫర్ నగర్లో మైనర్లను అరెస్టుచేసి, “మిమ్మల్ని రక్షించడానికి అల్లా వస్తాడా?” అని ప్రశ్నిస్తూ వాళ్ళను చిత్రహింసలకు గురిచేశారు. (మసూద్, 2020) ఈద్ పండగ సందర్భంగా సరుకులు కొనుక్కొని ఇంటికి తిరిగివస్తున్న జునైద్ అనే 15సంవత్సరాల బాలుడిని ఢిల్లీలో 2017 జులైలో ఒక గుంపు దారుణంగా చంపివేసింది. (4)
హిందూత్వ దృష్టిలో పిల్లల పుట్టుక- వాళ్ళు హిందువులా కాదా అనేదాన్ని బట్టి- వాళ్ళ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. “పవిత్రత” అనే ఈ వెర్రి – హిందూమతంలోనే వేళ్ళూనుకుని వుందని కుంబం (2020), కంచె ఐలయ్య (2004) తదితరులు గుర్తించారు. హిందూ మహిళలు “పవిత్రులైన” అగ్రకుల హిందూ పిల్లలకు జన్మనివ్వాలనే వెర్రి ఆలోచనలకు ఇది దారితీసింది. భాజపా ప్రభుత్వం 2019లో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. “ఆవులకు సంబంధించిన వనరులను జెనిటిక్ పద్ధతుల్లో వున్నతీకరించి వాటి పునరుత్పత్తి శక్తిని పెంచేలా చేయడం దీని వుద్దేశం (హిందూస్తాన్ టైమ్స్ విలేకరి, 2019). పంచగవ్య అనే మందును తయారుచేశారు. అందులో ఆవు మూత్రం, పేడ, నెయ్యి వుంటాయి. ఈ మందు తీసుకున్న గర్భిణీ స్త్రీలు “చురుకైన, గొప్ప మేధస్సుతో కూడిన ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని” నమ్మకం (ఆర్నిమేష్, 2019).
గర్భాశయం వెలుపల జీవులను సృష్టించడమనేది వాళ్ళ అంతిమ ఊహ. స్త్రీల మీద ఆధారపడడానికి సంబంధించిన చికాకులన్నింటినీ తొలగించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ కారణంగానే ప్రధాని మోడీ వైద్యులనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇలా అన్నారు. “మహాభారతంలో కర్ణుడి గురించి మనమందరం చదువుకున్నాం. కర్ణుడు తల్లి గర్భం నుండి జన్మించలేదని కూడా మనకు తెలుసు. అంటే అప్పటికే జెనటిక్ సైన్సు ఉందని దీని అర్థం” (రహమాన్, 2014), కెమిస్ట్రీ ప్రొఫెసరు, ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన నాగేశ్వరరావు భారత సైన్సు కాంగ్రెస్ సమావేశంలో చేసిన వ్యాఖ్య దీని ప్రతిధ్వనే. కౌరవులు టెస్ట్యూబ్ పిల్లలని ఆయన నొక్కి చెప్పారు. ఇలాంటి మరొక ఉద్దండుడు పదవీవిరమణ చేసిన న్యాయవాది (రాజస్థాన్ హైకోర్టు) మహేష్‌చంద్ర శర్మ నెమళ్ళు భౌతికంగా సంపర్కానికి పాల్పడవని అన్నాడు. “నెమలి జీవితమంతా సెక్స్‌కు దూరంగా వుంటుంది. మగ నెమలి కన్నీళ్ళను మింగడం ద్వారా ఆడ నెమలి గర్భం దాలుస్తుంది. అప్పుడు ఒక కొత్త మగ లేక ఆడ నెమలి పుడుతుంది… అందుకే సాధువులు నెమలి ఈకలను వాడతారు” అని అన్నారు (దక్కన్ క్రానికల్, 2017).
తల్లులతోటి, వాళ్ళ గర్భాశయాలతోటి సంబంధం లేకుండా పిల్లలను ‘పవిత్రం’ చేయాలనే, మహిళల పట్ల ద్వేషంతో కూడిన స్వభావం ఫాసిస్టుల ఆలోచనలకు సంబంధించిన ఒక ప్రధానమైన లక్షణాన్ని వెల్లడిచేస్తోంది. ఊహల్లోనూ ఆచరణలోనూ ‘అపవిత్రులైన’ ఇతరులను నిర్మూలించాలనే సర్వవిధ్వంసపు సామ్రాజ్యవాద తత్వంతో కూడిన కోరిక వాళ్ళది. షహీన్బాగ్గాని, రైతుల నిరసన ప్రదర్శనల్లోగాని పాల్గొన్న మహిళలు ఈ అంశాన్ని గుర్తించకపోలేదు. మోడీ ఒంటరిగా జీవించడం, ఆయనకు పిల్లలు లేకపోవడం, భార్యను వదిలివేయడం వంటి అంశాల గురించి వాళ్ళలో చాలామంది వ్యాఖ్యానించారు. ఆయనలో సహానుభూతి లేకపోవడానికి ఇదే ప్రధాన సాక్ష్యమని వాళ్ళన్నారు. ఒక మంచి భవిష్యత్‌ను ఊహించే శక్తి కూడా ఆయనకు లేదన్నది వాళ్ళు గమనించారు. ఇందుకు భిన్నంగా ఆ మహిళలు తమ పిల్లల భవిష్యత్తుకోసం పోరాడుతున్నారు. అందుకోసం వాళ్ళు చావుకు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే, తమ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందించలేకపోతే తాము జీవించడంలో అర్థం లేదు కాబట్టి.
మనుషులు “శాశ్వతంగా చిన్నపిల్లలుగా వుండిపోలేరు. చివరికి వాళ్ళు తప్పనిసరిగా బాధాకరమైన జీవితంలోకి ప్రవేశించక తప్పదు”అని ఫ్రాయిడ్ అన్నారు. (1927), (1989 పుట. 717) బాల్యావస్థలోని సున్నితత్వం నుండి, శక్తి హీనత నుండి పిలలను బయటకు తీసుకురావడమే ఫ్రాయిడ్ చెప్పిన మాటలకు అర్థం అని మనం గుర్తించడం అవసరం.
జీవితం నిజంగానే కష్టభరితమైందని హిందూ మధ్యతరగతి, అగ్రకులాల వ్యక్తులు వెంటనే అంగీకరిస్తారు. భారత ఆర్థిక వ్యవస్థ నయా ఉదారవాద సూత్రీకరణలకు అనుకూలంగా నిర్మాణం కావడం ప్రారంభమైన గత మూడు దశాబ్దాలలో మధ్యతరగతి చాలా ఆశ్చర్యకరమైన ఉన్నతినీ, పతనాన్నీ కూడా చవిచూసింది. ప్రస్తుతం నిరాశాజనకమైన భవిష్యత్తును వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ల ఆశలన్నీ నిరంతరం భగ్నమౌతున్నాయి. ఈ పతనం ఊహించనంత వేగంగా జరుగుతోంది. 1980లలో కొత్తగా ఎం.బి.ఏ. డిగ్రీలు చేతబట్టి కార్పొరేట్ ప్రపంచంలో కొత్తకొత్త వుద్యోగాలను స్వంతం చేసుకున్న అప్పటి తల్లిదండ్రులు, ఈ రోజు తమ పిల్లలతోపాటు ఎలాంటి రక్షణ వలయాలూ లేని ప్రమాదకరమైన మార్కెట్ కూడలిలో నిలబడి వున్నారు. ‘ గతంలోని వేతన జీవులకు వున్న భద్రతలు వీళ్ళకు లేవు. ఈ అవమానాల నుండి బయటపడాలని హిందూత్వ యువతకు విజ్ఞప్తి చేస్తోంది. వాళ్ళలో ఉన్న న్యాయమైన ఆగ్రహాన్ని దారిమళ్ళిస్తుంది. తమ హోదా పడిపోవడానికి కారణం ముస్లింలు, పాశ్చాత్య భావజాలంతో ప్రేరేపితులైన వామపక్షవాదులు, మావోయిస్టులేనని, ప్రపంచాన్నంతటిని తమ ఏలుబడిలోకి తెచ్చుకొని ఘనకీర్తిని సంపాదించాలన్న ఆకాంక్షకు వాళ్ళే అడ్డంగా వున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.
హిందూత్వ కార్యకలాపాలలో పాల్గొంటున్నవాళ్ళకుగాని, ఆ చర్యలను నేరాలుగా భావించనివాళ్ళకుగాని తాము చేస్తున్నదేమిటో తమకు తెలియదని నేను అనను. ఇవన్నీ వాళ్ళ ఎరుక లేకుండా సుప్తచేతనావస్థలో వున్న విషయాలని కూడా నేను అనను. వాళు ఎ) కోరుకుంటున్న హిందూ రాష్ట్రం పట్ల వాళ్ళకి పూర్తి ఎరుక వున్నది. హింసను సమర్థించడానికి, వాళ్ళ నాయకులు చేస్తున్న తప్పులను క్షమించడానికి, భారతదేశం స్వేచ్ఛాయుత దేశంగా వుందని చెప్పడానికి వాళ్ళు “కారణాలను, వాస్తవాలను” వల్లెవేస్తారు. కాని సౌమ్యులైన ఈ శిష్టులు ఈ హిందూత్వ వాదులకు లొంగిపోవడం ద్వారా, ఇతరులను లొంగదీసుకోవడం ద్వారా తాము ఆనందాన్ని, సంతృప్తిని పొందుతున్నామని అంగీకరించరు. నేను ఇది రాస్తున్న సమయంలోనే గేటెడ్ కమ్యూనిటీలలో విందుల సందర్భంలో ముసిముసి నవ్వుల మధ్య జరిగే సంభాషణలన్నీ ఆహార నియమాల గురించి ధ్యానం గురించి వాటి మూలంగా తమకు కలుగుతున్న లాభాల గురించి మాత్రమే కాక, మూకదాడుల గురించి, ముస్లింల ఇళ్ళను, షాపులను బుల్డోజర్లతో కూల్చివేయడం గురించి కూడా జరుగుతున్నాయి. “తుపాకులు పట్టుకున్నా, కలాలు పట్టుకున్నా- రూపం ఏదైనా – అన్ని రకాల నక్సలిజాన్ని నిర్మూలించాలి. తద్వారా దేశంలోని యువతను వాళ్ళు దారి తప్పించకుండా నిరోధించాలి” అని 2022 అక్టోబరు 22న మోడీ చేసిన ప్రకటనకు వాళ్ళు తప్పనిసరిగా అంగీకారాన్ని తెలియచేస్తారు. మానవ శరీరంలో అన్నింటికంటే ప్రమాదకరమైంది మెదడు అని నొక్కిచెప్పే నాయకుడు మనకు వున్నాడు. తమలో గూడు కట్టుకున్న హిందూ వైభవం అనే ఫాంటసీని ప్రశ్నించే వాళ్ళందరిపైనా దాడులు జరగడం పట్ల ఈ హిందూత్వ ఉన్నతి మధ్యతరగతి వారు తమ ఆనందాన్ని దాచుకోలేని స్థితి త్వరలోనే వస్తుందని ఊహిస్తున్నారు. ఇతరుల పట్ల ఇప్పటికంటే మరింత భయానకమైన హింసను ప్రదర్శించాల్సిన అవసరం వుందనికూడా వాళ్ళు గుర్తిస్తారు. ఇలాంటి చీకటి అగాధం మన కళ్ళ ఎదుట వుంది.
హేతుబద్ధంగా ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం, వాస్తవాలను బహిర్గతం చేయడం, ఉదారవాద ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలలో పదేపదే వైఫల్యం చెందుతున్నా ఓపికగా అంగుళం అంగుళం ముందుకు సాగుతూ మనం చేసే కార్యకలాపాలే మన జీవితాలు ఫాసిస్టు జడివానలో కొట్టుకుపోకుండా కాపాడతాయి. వివిధ తరాల మధ్య సంఘీభావాన్ని పెంచి పోషించడం, రాబోయే తరాలకు సంతోషాన్ని స్వేచ్ఛను అందించాల్సిన బాధ్యతను గుర్తించడం వంటి అంశాలను షహీన్ బాగ్ ఉద్యమం నుండి రైతాంగపోరాటాల నుండి మనం స్వీకరించాలి.
- “మాతృభూమి”ని రక్షించుకోమని సాధ్వీ రితంభర ఇచ్చిన పిలుపుపై సర్కార్ (2001, పేజి. 268-290) రాసిన వివరణాత్మక వ్యాసంలో హిందూత్వ మూలాలు దేశాన్ని ఒక పవిత్రమైన శరీరంగా చిత్రించడంలోనూ, నిరంతరం దేశం ప్రమాదానికి, దురాక్రమణకు గురి అవుతుందన్న భావాన్ని కలిగించడంలో వుందనీ రాశారు.
- ముస్లింలు అధిక సంఖ్యలో నివాసం వుండే తూర్పు ఢిల్లీలోని ఒక ప్రాంతం షహీన్ బాగ్. మోడీ ప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మహిళల నాయకత్వంలో డిసెంబర్ 15, 2019న ఉద్యమం ప్రారంభమైంది. నిరసనలు కొనసాగుతున్న క్రమంలో అక్కడ చిన్నపిల్లలు ఉండడాన్ని గమనించాలని సుప్రీమ్ కోర్టు 2020 ఫిబ్రవరి 11న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- ఈ హత్య సందర్భంగా హిందూత్వ దౌర్జన్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభమైంది.
- మనిషి మనస్తత్వంలో అసంబద్ధమైన, నిర్హేతుకమైన స్వభావం ఎందుకుంటుందో కారణాలను వెదకడానికి ఫ్రాయిడ్ తన జీవితకాలాన్నంతా వెచ్చించాడు. మెదడు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవడానికి విశ్లేషించడానికి మనిషికున్న శక్తిమీద ఫ్రాయిడ్‌కు విశ్వాసం వున్నది. మతం ఒక సామూహిక భ్రమ అని ఆయన వర్ణించారు. “మేధావి గొంతు మెత్తగా వుంటుంది. అయితే తనను వినేవాళ్ళు దొరికేవరకు అది విశ్రాంతి తీసుకోదు…. మానవ జాతి భవిష్యత్తు గురించి ఆశాజనకంగా వుండడానికి మనల్ని పురిగొల్పే అంశాలలో ఇదొకటి. అయితే దీని ప్రాధాన్యత అంత తక్కువేమీ కాదు” (1927, 1989, పేజి 720)
- నేను రాసిన “ది పాలిటిక్స్ ఆఫ్ టైమ్ అండ్ యూత్ ఇన్ బ్రాండ్ ఇండియా : బార్గెయినింగ్ విత్ క్యాపిటల్” అనే పుస్తకంలో దీన్ని మరింత వివరంగా చర్చించాను.
(జ్యోత్స్నా కపూర్ సినిమా, మీడియా అధ్యయనాల శాఖలో ప్రొఫెసర్. యూనివర్శిటీ ఆనర్స్ ప్రోగ్రాంకు డైరక్టర్. ఆమె “ది పాలిటిక్స్ ఆఫ్ టైమ్ అండ్ యూత్ ఇన్ బ్రాండ్ ఇండియా : బార్గెయినింగ్ విత్ క్యాపిటల్” (2013, “కాయినింగ్ ఫర్ క్యాపిటల్ : మూవీస్, మార్కెటింగ్ అండ్ ది ట్రాన్సఫర్మేషన్ ఆఫ్ చైల్డ్ హుడ్” (2005) అనే పుస్తకాలు రాశారు. 1970ల నుండి ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాదం తరాల మధ్య సంబంధాన్ని, కాలానికి సంబంధించిన మన చైతన్యాన్ని ఎలా మౌలికంగా పరిణామానికి గురిచేసిందో ఈ రెండు పుస్తకాలలో ఆమె వివరించారు. ఆమె ఇన్సాఫ్ ఇండియా (భారతదేశంలో అకడమిక్ స్వేచ్ఛకోసం అంతర్జాతీయ సంఘీభావ కమిటీ)లో సభ్యులు. 2022 అక్టోబర్‌లో అమెరికాలోని విస్కాన్సిన్ మాడిసన్లో జరిగిన దక్షిణాసియా వార్షిక మహాసభలో ఆమె చేసిన ప్రసంగ వ్యాసాన్ని కొద్దిగా మార్చి తయారుచేసిన వ్యాసం ఇది.)
* లియోనార్డ్ కోహెన్ : కెనడాకు చెందిన గాయకుడు, పాటల రచయిత, కవి, నవలా రచయిత. జననం – సెప్టెంబరు 21, 1934. మరణం- నవంబర్ 7, 2016. మతం, రాజకీయాలు, ఏకాకితనం, లైంగికత, డిప్రెషన్, రొమాంటిక్ సంబంధాలు ఈయనకు ఇష్టమైన విషయాలు.