ఒక నవ ఉషోదయం ఉదయించిన వేళ ఒక కొత్త ఊపిరి పురుడు పోసుకోవాలని అదీ భయానక రణ రంగాన దారుణంగా నేలకొరిగిన అమాయకుల ప్రాణాలు తిరిగి నేలకు వచ్చి ఎన్నో ఊహల భవిష్యత్తును కలలు కన్న ఆ జీవితాన్ని తిరిగి పొందాలని, చావు అంచుల దాకా వెళ్లి శరీరాలు, గుండెలు తూట్లమయమై ఆదరణకై ఆర్తిగా ఎదురుచూస్తున్న ఆ లేత హృదయాలు కోరుకునే తల్లి లాలి పాటల గోరు ముద్దలు, బడి గంటల గణ గణలు వారిని సీతాకోక చిలుకల్లా ఎగిరి బడిలో వాలేలా చేయాలని, నల్ల బల్లపై అక్షరాలు నింపే జ్ఞానం పొంది ఆట పాటల పతంగుల్లా విహరించాలని, తల్లి ఋణం నేల ఋణం తీర్చే భావి పౌరులై జీవన సాఫల్యాన్ని పొందాలని ఆశావహంగా పుస్తక పేరును నిర్ణయించడంలోనే తన దయార్ద హృదయాన్ని ఆశావాహ దృక్పదాన్ని కనపరిచిన దొంతం చరణ్ గారు రచించిన “ఉదయించే ఊపిరి” పుస్తకం మనసులను కదిలించి చదివిన వారిలో కూడా ఒక దయార్ద హృదయ, ఊపిరి వేగాలను పెంచే విధంగా ఉంది. ముందుగా దొంతం చరణ్ గారికి ఈ విషయంలో మరియు దాసరి శిరీష జ్ఞాపిక 2024 కి ఎంపిక అయినందుకు అభినందనలు.
అంతే కాకుండా పాలస్తీనా పిల్లలకు, వారి హృదయాలపై నవ్వులు పూయించిన ఫ్రీ గాజా సర్కస్ సెంటర్ కు అంకితమిస్తూ తన అంతరాళంలో నిండి ఉన్న ఆకాంక్ష పిల్లల మొహాల్లో నవ్వులను చూడాలని చెప్పకనే చెప్పిన వైనం ఈ పుస్తకానికి ఇంకో హైలైట్.
చరణ్ తన ముందు మాటలో “నేను యుద్ధాన్ని చూసే చూపులో సిరియా, పాలస్తీనా, కశ్మీర్, బస్తర్.. వేరు కాదు. నా అవగాహనలో వీటన్నింటికీ ఉన్న ఇంటర్లింక్స్ ఏమిటంటే ‘ఆయుధాలు-మహిళలు-పసిపిల్లలు’ అని రాసారు. నిజమే అదేంటో యుద్ధ నీతి అని ఒక శాస్త్రం, దాన్ని ఆచరించే నియమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా మనుషుల శవాలు, రక్తాలు, గావు కేకలు తేలికగా, తక్కువ సమయంలో కనపరచి భయానక వాతావరణాన్ని సృష్టించామని చూపెట్టుకోడానికి కొలమానంగా అమాయక పిల్లలను, మహిళలను ఉపయోగించుకుంటున్నారు. దైవం మానవ రూపేణా అన్నారు అన్నీ పవిత్ర గ్రంధాలలో. మరి ఆ మనుష్యుల మాన ప్రాణాల హత్యాకాండ ఆ దైవానికి చేసినట్టు కాదా?
“ప్రజలు ఏ మార్గంలో ప్రేమించబడాలని కోరుకుంటున్నారో.. మనం ఆ మార్గంలోనే ప్రేమించాలని నా జీవితం నాకు నేర్పింది” అన్న మౌరిన్ బర్ఘౌటి సందేశాన్ని ఉటంకిస్తూ ఇప్పటికైనా యుద్ధ నరమేధాన్ని నిరసిస్తూ నోరువిప్పుతామా లేదా? అని ప్రశ్న వేస్తున్నారు కవి దొంతం చరణ్.
‘కాష్టం రగులుకుంది‘ అన్న కవితలో –
“దుఃఖంతో, ఆకలి కేకలతో
గాజా గుండెలు రగులుతుంటే
ఆ పసి హృదయాల పేగులు మండుతుంటే
సూర్యగోళం సైతం చిన్నబోయింది!
పేగులు పటపటమనే శబ్దానికి
ఉరుముల సత్తువ సన్నబోయింది”
ఎంత చక్కని వర్ణన. సూర్యగోళం వేడి, ఉరుముల శబ్ద తీవ్రత కూడా తక్కువగానే అనిపిస్తున్నాయి గాజాలో ఆర్తనాదాల ముందు అని చెప్పిన తీరుతో అక్కడ ఉన్న పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉంది అని మన కళ్ళముందు ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా మన హృదయాలను కలిచి వేస్తుంది ఈ కవిత చదువుతుంటే.
“గాలికి రంగు లేనట్టుగా బాల్యానికి రంగులుండవని
అతి పెద్ద అబద్దాన్ని చెప్పనా?
యుద్ధ క్షేత్రంలో బాల్యమంటే
హరివిల్లు బూడిదయిన ఆకాశం”.
ఆ లేత మనసులకు బాల్యం అంటే ఇంతే రంగులుండవు అనే అబద్దపు సాంత్వన పలుకులు ఎలా చెప్పాలి అని బాధ పడుతూ తన రంగుల పెట్టె కవితలో పిల్లల బాల్యం, వారి మనస్సుల్లో ఊహించుకున్న హరివిల్లుల ఆనందాలు అన్నీ మొదట ఎర్రని రక్తం రూపంలో ఒలికిపోయి బూడిదగా వివర్ణం అయిందంటూ తన బాధను వ్యక్తపరుస్తున్నారు కవి.
“ఆకుపచ్చ చాక్పీస్” కవితలో
“పాలస్తీనా నేలంతా
ఇలా ఆకుపచ్చ రంగు నిండాలనేదే నా కోరిక”
అని చెబుతూ
బోర్డుపై ఉన్న పచ్చదనాన్ని
చేతులతో స్పర్శిస్తూ వెళ్ళిపోయింది
చూపు లేని అమ్మాయి..”
“ఇప్పుడు
ప్రతి ఇంట్లో, ప్రతి బడిలో, ప్రతి దేశంలో
ఆకుపచ్చ చాక్ పీసులు అనివార్యం !”
పాలస్తీనా ఇలా పచ్చగా ఎప్పుడు మారుతోందో అంటూ చూపు లేని విద్యార్ధిని ఆకుపచ్చ చాక్పీస్ తో పచ్చగడ్డి గీయటం దాన్ని స్పర్శిస్తూ వెళ్ళిపోవటం గురించి చదువుతుంటే ఆ పసి పిల్లల్లో ఉన్న బలీయమైన ఆకాంక్ష, వాళ్ళు పడే కష్టాలు, చూసిన రణ బీభత్సాలు, చుట్టూ బాంబులకు ఆహుతి అయి గడ్డి కూడా మొలవని నిర్జీవ నేల దృశ్యాలు ఇవన్నీ వాళ్ళను ఎలా బాధకు గురిచేస్తున్నాయో చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరగాల్సిందే.
“A kind of protest” అనే కవితలో
“తల్లి మేను తాకనివ్వని
సైనికుల పైశాచిక ఆనంద డోలికల్లో
అమ్మలను చూడనివ్వని యుద్ధంలో
నాలో అమ్మను చూడడానికి త్వరపడు”
అంటూ స్త్రీ అమ్మ ఔదార్యాన్ని స్నేహితుడిపై కనబరుస్తున్న వైనం ఎంతటి కరుడుగట్టిన గుండెనైనా కరిగించాల్సిందే. మరి యుద్దాన్ని నివారించగలిగి, ప్రపంచ శాంతికి దారి చూపే ఎందరో మానవ మాధవ మేధో సంపన్న సంప్రాప్తుల హృదయాలను కూడా కరిగించి కదన రంగాన్ని శాంతి కపోత విహారాల వనాలుగా మార్చాల్సిన కవనం ఇది.
Yes! Every kind of action which intends peace and tranquility, which protests homicide is necessary in this brutal war situations.
ఇందులోని కవితలు స్త్రీ ఎదుర్కునే యుద్ధ సమయంలో నెలసరి కష్టాలు, తల్లి పాలు పిల్లలకు చేరక పడే ఆవేదన, శరీరాలు ఛిద్రమై రక్తమోడుతున్న పిల్లలు తల్లుల ఒడిని చేరాలన్న తపన, ప్రాణాలను లెక్క చేయక యుద్ధంలో పాల్గొనే పౌరులందరి దీనాతి దీన స్థితిని అక్కడే ఏ కాలుతున్న లేదా ఒరిగిపోయిన గోడ పక్కనో దాక్కొని చరణ్ తో పాటు మనమూ చూస్తూ గుండెలు బరువెక్కి, గొంతులు మూగవోయి, కళ్ళ నీళ్ళతో ఆవేదన చెందుతున్నంత feeling కలిగేట్టుగా ఉన్నాయి.
ఆఖరిగా ..
“త్వరగా..” అనే కవితలో
“నాకొక కలమూ కాగితమూ ఇవ్వండి
ప్రతి అక్షరానికి శవాల బూడిదను పూస్తాను
ఊపిరిని ఉదయింప చేస్తాను.. “
అంటూ ఆ దహన బూడిదతో అక్షరాలల్లో వీలయినంత త్వరగా ఊపిరిని ఉదయింప చేస్తా అంటూ ఆశావహ దృక్పథాన్ని కవితలో ప్రక్షిప్తం చేసి నిజంగా manifestation తో ఇక్కడ ప్రాణాన్ని పోసే శక్తి అక్షరాల కవనాలకు వచ్చింది అనిపించేట్టు బూడిదకు ప్రాణం పోసి ఊపిరిలు ఊదగలం అని దొంతం చరణ్ తన కవితలో తనలో బలమైన ఆవేదనాపూరిత ఆశను, దాని ద్వారా క్షతగాత్రులకు మనోధైర్యాన్ని ఇచ్చే వచనాలను పొందుపరిచిన విధం బాగుంది. మరోసారి కవి దొంతం చరణ్ గారికి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. చదివిన వారందరికీ ధన్యవాదాలు. నమస్సులు.
మీ సమీక్ష చదివిన తరువాత, ఎప్పుడెప్పుడు పూర్తి కవిత చదవాలనే కుతూహలం హెచ్చింది – అనసూయపుత్రఅనంత్ 🙏