వుదయపు యెండ కొండల పై నుంచి నిటారుగా చిమ్ముతోంది. అడవి తీగెల పసుపురంగు గాలి అంతటా ఆవరిస్తోన్న వెచ్చదనం. నెమ్మది నెమ్మదిగా యీ ప్రపంచం మామూలుగా యెప్పటిలా అయ్యే దిశగా లాక్ డౌన్ నుంచి కోలుకునే దిశగా అడుగులు వేస్తోంది. మన లోపలంతటా వొక విముక్తానుభూతి. యెటువంటి రోజులని చూసామో కదా!!! యీ లాక్ డౌన్ లో మనం యేమేమి చూసామో మనందరి మానసికానుభవం వొక చేదు జ్ఞాపకంగా రూపాంతరం చెందుతోంది.
అదే సమయంలో యింటాబయటా బోలెడన్ని ఘర్షణలని, సంఘర్షణలని చూస్తున్నాం. వో వైపు ఉక్రెయిన్ లో యుద్ధపు భీతావహ దృశ్యాలు మనల్ని కలవరపెడుతున్నాయి. ప్రపంచం నడిచేందుకు అనేకానేక విధివిధానాలని పొందుపర్చుకొన్నా యుద్దరహిత ప్రపంచం అత్యాశేనా!!! ప్రపంచాన్నిచుట్టుకొన్న యుద్ద కాంక్షాసర్పాన్ని సమూలంగా పెకలించే సాధనమేదో మనకింకా అందనే లేదు.
యెన్నన్నో అలజడులు, భయాల నుంచి యీ మొత్తంలో స్త్రీల పరిస్థితి యేమిటనే ప్రశ్న లోలోపల తొలుస్తూనే వుంది. వొకప్పటిలా యుద్ధం స్త్రీ స్వభావానికి విరుద్ధం అని గట్టిగా అనలేం. స్త్రీలు రాజకీయాల్లో భాగం అవ్వటం మొదలైతే యెన్నో విషయాల్లో వస్తుందనుకొన్న మార్పు లోతుగా రాలేదు. వున్నరాజకీయాధికారపు స్వభావాన్నే స్త్రీలు అనేక విషయాల్లో అందిపుచ్చుకొన్నారు. అది వో అనివార్యత కూడా అనిపించే పరిస్థితి. దాదాపు స్త్రీలకి వోటు హక్కు వచ్చి నూరేళ్ళు దాటిన సందర్భంలో ప్రపంచం వుందిప్పుడు. మొదటి వేవ్ ఫెమినిజంలో స్త్రీలకి వోటు హక్కు కావాలని స్త్రీలు గొంతేత్తినప్పుడు బ్రిటిష్ విమెన్ కి 1918లో 30 యేళ్ళు నిండిన స్త్రీలకి వోటు హక్కు వచ్చింది. 1920లో అమెరికాలో స్త్రీలకి వోటు హక్కు వచ్చింది. వీటన్నిటి కంటే ముందే న్యూజిల్యాండ్ లో 1893లో కేట్ షెప్పర్డ్ (Kate Sheppard) యాక్టివిస్ట్ గళం యెత్తారు. మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చాక స్త్రీలకి వోటు హక్కు వచ్చింది. భారతీయ మహిళా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నప్పటికి మొదట్లో స్త్రీల ప్రాతినిధ్యం చట్టసభల్లో చాల తక్కువగా వుండేది. 20వ శతాబ్దపు అత్యంత విజయవంతమైన సామాజిక వుద్యమాలలో స్త్రీవాదం వొకటిగా పరిగణిస్తారు. ప్రశంసలని, విమర్శలని అందుకొంది.
ఫెమినిజం మూడు వేవ్స్ లోనూ అత్యంత విలువైన విషయాలని చర్చకి పెట్టాయి. ప్రశ్నించాయి. అనేక సూక్ష్మమైన విషయాలని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాయి. స్త్రీలకి సంబంధించిన అనేక విషయాల్లో కావాల్సిన హక్కులని పొందాం. అన్ని రంగాల్లోకి ప్రవేశించాం. ప్రతి చోట స్త్రీలు కనిపిస్తున్నప్పుడు స్త్రీపురుష సమానత్వం వచ్చినట్టే కనిపిస్తున్నప్పుడు యింక స్త్రీవాదం యెందుకు! యిప్పుడు యేమి రిలవెన్స్ వుంది అనే మాటల్ని, ప్రశ్నలని వింటుంటాం. యే అస్తిత్వవాదమైనా ఆయా ఆస్తిత్వాలకి సంబంధించిన కొన్ని నిర్దిష్టమైన అంశాలని వెలికితీస్తుంది. ప్రశ్నిస్తుంది. కానీ వీటన్నిటి ప్రశ్నలని, పరిష్కారాలు మొత్తంగా ఆ వొక్క వాదంలోనే మనకి లభ్యం కావు. సాధ్యమూ కాదని యిన్నేళ్ళ అస్తిత్వ వుద్యమాల వల్లా మనకి తెలుస్తూనే వుంది. కొన్ని అసమానతల్ని, కొన్ని పెత్తనాల్ని ప్రశ్నించాలన్నా చర్చకి పెట్టాలన్నా, వాటికి పరిష్కారాలని కనుక్కోవాలన్నా కొన్నిసార్లు భిన్న అస్తిత్వాలు కలవాల్సి రావటం, కొన్ని సార్లు అక్కడా పరిష్కారం దొరకనప్పుడు పరిష్కారానికి వేరే దృక్పథం వైపు చూడటం. యిలా యెప్పటికప్పుడు వేదనా పీడనా లేని సమసమాజం కోసం ప్రయాణిస్తూనే వున్నాం. స్త్రీలపై హింస పలు రకాలుగా వుంటుంది. యెన్ని రంగాల్లోకి వెళ్ళినా యెంత పవర్ చేతిలో వున్నాఆ స్త్రీల సంఖ్య పురుషులతో పోలిస్తే తక్కువే. వొక దృక్పథం నుంచి వాటిని చూసినప్పుడు స్త్రీవాద దృక్పథం నుంచి పవర్ఫుల్ గా ప్రశ్నించడానికి చర్చించడానికి అవకాశం వుంటుంది. ప్రస్తుతం 4th వేవ్ ఫెమినిజంలో స్త్రీవాద వుద్యమం మహిళల సాధికారత, intersectionality, gender equality మీద యెక్కువగా దృష్టి పెట్టింది.
అలాగే సోషల్ మీడియాలో పనిచేసే స్థలాల్లో లైంగిక హింస ని హాష్ ట్యాగ్ చేస్తూ యింటర్నెట్ స్త్రీలకి తాము యెదుర్కొంటున్న లైంగిక హింసని నిమిషాలలో ప్రపంచానికి తెలియచెప్పే అవకాశాన్ని కలిగించింది. యిందులో భాగంగా 4th వేవ్ లో వచ్చిన మీ టూ మూవ్మెంట్ అందరి దృషిని తన వైపు తిప్పుకొంది. అత్యంత బలమైన మూవ్మెంట్ మీ టూ. అలాగే యింటర్నెట్ స్త్రీలకి ప్రపంచంతో సంభాషించే వో అవకాశాన్ని యిచ్చింది. యింటర్నెట్ వినియోగం అనేది అత్యంత కీలకమైన అంశం 4 th వేవ్ లో.
జాత్యహంకారం, మత వ్యతిరేక ద్వేషం, అంగవైకల్యం, స్వలింగ సంపర్కం అణచివేత మొదలైన వాటి మీద యెక్కువ అవగాహన వుందిప్పుడు. సమాజంలో అట్టడుగు సమూహాలు, అలాగే వారివారి రంగు వల్ల వెనక్కి నెట్టివేయబడుతోన్న సమూహాలాని, ట్రాన్స్ జెండర్ సమూహాల మీద యెక్కువగా దృష్టిని నిలిపింది 4th వేవ్ ఫెమినిజం. ఆయా సమూహాలకి వివిధ రంగాల్లో రావాల్సిన అవకాశాల మీద పనిచెయ్యటం, లేవనేత్తిన అంశాలకి చట్టబద్దత కల్పించటానికి కృషి చెయ్యటం యీ సమూహాలకి రాజకీయాల్లో చోటు కల్పించటం మీద తమ గళాన్ని సంధించారు ఫెమినిస్ట్ లు. విస్తృత శ్రేణి స్వరాలు యిప్పుడు స్త్రీవాదంగ పరిగణించబడుతున్నాయి.
వాటి ఫలితాల్ని మనం కొన్నాళ్ళుగా యీ సమూహాలు వివిధ రంగాల్లో ప్రవేశించటం చూస్తున్నాం. యే ప్రశ్నా పట్టింపుకి నోచుకోకుండా యెక్కువ కాలం వుండదు. యే వుద్యమం యే ఫలితాలని పూయించకుండా వృధా కాదు. కావాల్సిందంతా సమసమాజం కోసం మనం యెంత నిజాయితీగా అందరి కోసం యెంత విశాలంగా ఆలోచిస్తున్నాం… ప్రశ్నిస్తున్నాం… గొంతు విప్పుతున్నాం అన్నది చాల ముఖ్యం.
స్త్రీవాదిగా పిలుచుకోవడం గురించి చాలా భయపడుతున్న వారు యెందుకు భయపడుతున్నారో ఆలోచించుకోవాలి. స్త్రీవాదం అంటే పురుషవ్యతిరేకత కానే కాదు. ఆధిపత్య ధోరణిని గుర్తించి ఆ రుగ్మతకి చికిత్స చెయ్యటం చాలా అవసరమని స్త్రీవాదం చెపుతుంది. ఆధిపత్యం పురుషులలో మాత్రమే కాదు స్త్రీలలో కూడా వుంటుంది. స్త్రీపురుషుల్లో యెవరిలో ఆ ఆధిపత్య లక్షణాలు వున్నా వాటిని ప్రక్షాళన చెయ్యాల్సిందే. చేసుకోవలసిందే. యెక్కడ అన్యాయం జరుగుతుందో, అక్కడ ప్రతిఘటన వుంటుంది కదా.
యిప్పుడు స్త్రీవాద వుద్యమం గతంలో కంటే చాలా వైవిధ్యమైనది. అలాగే అనేక బలమైన అస్తిత్వవాదాలు బలంగా అనేక విషయాల్లో పనిచేస్తున్నాయి. అయినప్పటికీ యిప్పుడు ప్రజలు యెదురుక్కుంటున్న ఆధిపత్యం, రాజకీయ ఘర్షణ, సాంస్కృతిక సవాళ్ళు, అధిక ధరలు యిలా యెన్నో సమస్యలని అడ్రస్ చెయ్యాలంటే యేదో వొక అస్తిత్వ రాజకీయాల నుంచే సాధ్యం కాదు. కాకపోవచ్చు కూడా. అనేక విషయాలని మాటాడటానికి వర్గసమాజ దృక్పథపు చూపు కూడా అవసరం యెంతో అవుతుందనిపిస్తోంది. అయితే యిప్పుడున్న పరిస్థితుల్లోని చీకటిని తొలగించాలంటే, యిదిగో యిదే యీ వొక్కటే పరిష్కారం చూపిస్తుందని చెప్పలేము. అది సాధ్యం కూడా కాదు. కలిసి పనిచెయ్యాలంటే ముందు సమాజం కోసం పనిచేస్తోన్న వారంతా మాటాడుకోవాలి. కలవాలి. కలవాలి అంటే స్నేహాలు సూర్యరశ్మిలా విచ్చుకోవాలి. అప్పుడే చీకటి విముక్తి సాధ్యం.
వుదయపు యెండ కొండల పై నుంచి నిటారుగా చిమ్ముతోన్న పోరాటరశ్మి అంతటా పరుచుకొంటూ…
అవును…
మనం ప్రపంచం కోసం మాట్లాడితే
ప్రపంచం మనకోసం మాటాడుతుంది.
Excellent article madam
Thank you very much Alladi Srinivas garu.
అవును అంతా మాటాడుకోవాలి కలిసి మాటాడుకోవాలి.
Thank you very much Sir Kcube Varma garu.
చాలా బావుంది పద్మా.పీడిత అస్తిత్వాలకు సంబంధించిన వివిధ దృక్పథాల నడుమ సమన్వయం కోసం ప్రయత్నం జరగాలి.
యీ ప్రయత్నం దిశగా త్వరగా జరిగితే బాగుండును కాత్యాయనీ గారు.
థాంక్యూ అండి.
బాగుంది మీ వ్యాసం. మీ చివరి వాక్యాలు నచ్చాయి.
థాంక్యూ సునీత గారు.
చాలా బాగా చెప్పారు…ఇంకా అందరూ ఐకమత్యంగా…ఈ విషయంలో ఆలోచించి అడుగులు ముందుకు వేసి…ప్రతి ఒక్కరూ మిగతావారికి ప్రేరణగా నిలిచి…..5th wave,6th wave fiminism వరకు వేచి చూడాల్సిన అవసరం రాకుంటే బాగుండు అని కోరుకుంటున్నా…..
బావుంది, మంచి వ్యాసం, నిజానికి లెఫ్ట్ మూమెంట్స్ గుర్తించ నిరాకరించిన అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలతోనే అస్తిత్వ వాద ఉద్యమాలు వచ్చాయి. ప్రతి ఉద్యమంలో రెండు రకాల ధోరణులు ఉన్నట్టుగానే వీటిలోనూ వున్నాయి. ఆ ఉద్యమాలు వేసిన ప్రశ్నలకి జవాబులను చెప్పకుండా ఆ ఉద్యమాల మీద బురద జల్లడం వల్లనే సమస్యలు వస్తున్నాయి.
వీటన్నింటి మధ్య ఒక డైలాగ్ రావాలని కోరుకోవడం ద్వారా వ్యాసం ఓపెన్ గా, విశాలంగా వుంది. మీకు అభినందనలు పద్మ గారూ👍
రవి గారు, థాంక్యూ. ఆ అవసరమైన అడుగు త్వరగా పడితే బాగుండును అని వుంది.
వుదయపు యెండ కొండల పై నుంచి నిటారుగా చిమ్ముతోన్న పోరాటరశ్మి అంతటా పరుచుకొంటూ…,
అవును…
మనం ప్రపంచం కోసం మాట్లాడితే
ప్రపంచం మనకోసం మాట్లాడుతుంది.
“యిప్పుడు స్త్రీవాద వుద్యమం గతంలో కంటే చాలా వైవిధ్యమైనది. అలాగే అనేక బలమైన అస్తిత్వవాదాలు బలంగా అనేక విషయాల్లో పనిచేస్తున్నాయి. అయినప్పటికీ యిప్పుడు ప్రజలు యెదురుక్కుంటున్న ఆధిపత్యం, రాజకీయ ఘర్షణ, సాంస్కృతిక సవాళ్ళు, అధిక ధరలు యిలా యెన్నో సమస్యలని అడ్రస్ చెయ్యాలంటే యేదో వొక అస్తిత్వ రాజకీయాల నుంచే సాధ్యం కాదు. కాకపోవచ్చు కూడా. అనేక విషయాలని మాటాడటానికి వర్గసమాజ దృక్పథపు చూపు కూడా అవసరం యెంతో అవుతుందనిపిస్తోంది. అయితే యిప్పుడున్న పరిస్థితుల్లోని చీకటిని తొలగించాలంటే, యిదిగో యిదే యీ వొక్కటే పరిష్కారం చూపిస్తుందని చెప్పలేము. అది సాధ్యం కూడా కాదు. కలిసి పనిచెయ్యాలంటే ముందు సమాజం కోసం పనిచేస్తోన్న వారంతా మాటాడుకోవాలి. కలవాలి. కలవాలి అంటే స్నేహాలు సూర్యరశ్మిలా విచ్చుకోవాలి. అప్పుడే చీకటి విముక్తి సాధ్యం.
వుదయపు యెండ కొండల పై నుంచి నిటారుగా చిమ్ముతోన్న పోరాటరశ్మి అంతటా పరుచుకొంటూ…
అవును…
మనం ప్రపంచం కోసం మాట్లాడితే
ప్రపంచం మనకోసం మాటాడుతుంది”
చాలా బాగా రాశారు . చివర్లో చెప్పినట్టు “మనం ప్రపంచం కోసం మాట్లాడితే
ప్రపంచం మనకోసం మాటాడుతుంది””
హృదయ పూర్వక కృతజ్ఞతలు సుబ్రహ్మణ్యం గారు.
మంచి వ్యాసం పద్మ గారూ…. మన దేశంలో స్త్రీలకు ఓటు హక్కు వచ్చిన పరిణామాన్ని కూడా ప్రస్తావిస్తే మంచిగ ఉండేదనిపించింది
Thank you Muralikumar garu.
మరో సారి మరో వ్యాసంలో అవకాశం వుంటే ప్రస్తావిస్తాను సర్.
చాలా బాగా చెప్పారు…ఇంకా అందరూ ఐకమత్యంగా…ఈ విషయంలో ఆలోచించి అడుగులు ముందుకు వేసి…ప్రతి ఒక్కరూ మిగతావారికి ప్రేరణగా నిలిచి…..5th wave,6th wave fiminism వరకు వేచి చూడాల్సిన అవసరం రాకుంటే బాగుండు అని కోరుకుంటున్నా…..
ప్రతి నెలా మీరు యీ కాలమ్ మీద అభిప్రాయాలను పంచుకోవటం యెంతో సంతోషంగా వుంది. హృదయ పూర్వక కృతజ్ఞతలు వాణి ప్రసాద్ గారు.
బాగుంది పద్మ గారు. అందరూ ఆలోచనలను కలబోసుకోవటం చాలా చాలా అవసరం. అంగీకారం ఉన్న మేరకు కలిసి నడవడం కూడా చాలా అవసరం
Thank you D. Rama Devi garu.
కే పీ గారు : ఉ (వు)దయపు (ఎ)యెండ కొండల పై నుంచి నిటారుగా చిమ్ముతోంది. అడవి తీగెల పసుపురంగు గాలి అంతటా ఆవరిస్తోన్న వెచ్చదనం. నెమ్మది నెమ్మదిగా యీ ప్రపంచం మామూలుగా యెప్పటిలా అయ్యే దిశగా లాక్ డౌన్ నుంచి కోలుకునే దిశగా అడుగులు వేస్తోంది. మన లోపలంతటా వొక విముక్తానుభూతి. యెటువంటి రోజులని చూసామో కదా!!! యీ లాక్ డౌన్ లో మనం యేమేమి చూసామో మనందరి మానసికానుభవం వొక చేదు జ్ఞాపకంగా రూపాంతరం చెందుతోంది.
విమర్శ: ఇలా అద్భుతంగా మొదలెడితే అచ్చెరువొంది మీరు రాసిన విషయం ఆశక్తితో చదవడం మొదలు పెట్టా.
కానీ అలా మొదలయ్యిన వ్యాసం ఒక జలపాతంలా ప్రవహించి వాగై వంకై..చివర్కి కొండల మీదనుంచి దూకి మహా నదిగా మారకుండా మూసీ నదిగా ….!!
2 భారతీయ మహిళా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నప్పటికి మొదట్లో స్త్రీల ప్రాతినిధ్యం చట్టసభల్లో చాల తక్కువగా వుండేది.
జవాబు..నిజానికీ స్త్రీ పాత్ర భారత దేశంలో ఎప్పుడూ కూడా తక్కువగా చూపించ పడలేదు… త్రేతా యుగం నాటినుంచి..ఆమె స్థానం అద్భుతంగా వ్యక్తీకరణమయ్యింది. సాహిత్యంలో ఆ ప్రస్థానం వెలుగులనే విర జిమ్మింది.
3 త్యంత బలమైన మూవ్మెంట్ మీ టూ! స్త్రీవాదిగా పిలుచుకోవడం గురించి చాలా భయపడుతున్న వారు యెందుకు భయపడుతున్నారో ఆలోచించుకోవాలి.
జవాబు: మీ టూ అనే సాహిత్య ప్రస్థానాన్ని ఎంత హాస్యస్పదంగా ఒక రచయిత్రి..తన రచనకి అన్యాయం చేసేసారోచ్.. అంటూ గగ్గోలు పెట్టి మొత్తం వ్యవహారాన్ని నవ్వుల పాలు చెయ్యడం (అది కేవలం ఒక వ్యాపార దృక్పధంలో చేసిన నాటకీయ ఎత్తుగడే అయ్యినా కూడా..మూలపుటుద్దేశ్యం కుంటు పడిపోయింది). అంతే కాదు సదరు కధ ఎడిటింగ్ తీసి పారేసినా కూడా జుగుప్స కలిగించే వ్యక్తీకరణంలో అసలు సమాజంలో కొన్ని బంధాల మీద అసహ్యం కలిగించేలా అంటే భయ పడి పోయేలా ఒక చని పోయిన్ వ్యక్తి మీద చల్లిన బురద చూసాకా కూడా మమ్మల్ని నమ్మడానికి మీకెందుకంత ప్రొబ్లెం టిల్లూ అని సిద్ధూ ని నేహ ప్రశ్నించి నంత వెటకారంగా ఉంది…అనేది మీరు అర్ధం చేసుకోక పోవడం ఎవరి అవగాహనా రాహిత్యం. డబ్బు ముఖ్యమా సమస్య మీద అవగాహన ముఖ్యమా అంటే అక్కడ డబ్బు కోసం గడ్డి తినే మనుషులే కనిపించడం ఎవరి పాపం.. ఆవిడెవరో అడిగినట్లుగా ఆత్మ పరిశీలనా విమర్శ అనే పదాలకి మీకు అర్ధం తెలుసా అనిపిస్తుంది..జవాబివ్వండి..అప్పుడు నమ్ముతాను.
కే పీ గారు: యిప్పుడు స్త్రీవాద వుద్యమం గతంలో కంటే చాలా వైవిధ్యమైనది. అలాగే అనేక బలమైన అస్తిత్వవాదాలు బలంగా అనేక విషయాల్లో పనిచేస్తున్నాయి. అయినప్పటికీ యిప్పుడు ప్రజలు యెదురుక్కుంటున్న ఆధిపత్యం, రాజకీయ ఘర్షణ, సాంస్కృతిక సవాళ్ళు, అధిక ధరలు యిలా యెన్నో సమస్యలని అడ్రస్ చెయ్యాలంటే యేదో వొక అస్తిత్వ రాజకీయాల నుంచే సాధ్యం కాదు. కాకపోవచ్చు కూడా. అనేక విషయాలని మాటాడటానికి వర్గసమాజ దృక్పథపు చూపు కూడా అవసరం యెంతో అవుతుందనిపిస్తోంది. అయితే యిప్పుడున్న పరిస్థితుల్లోని చీకటిని తొలగించాలంటే, యిదిగో యిదే యీ వొక్కటే పరిష్కారం చూపిస్తుందని చెప్పలేము. అది సాధ్యం కూడా కాదు. కలిసి పనిచెయ్యాలంటే ముందు సమాజం కోసం పనిచేస్తోన్న వారంతా మాటాడుకోవాలి. కలవాలి. కలవాలి అంటే స్నేహాలు సూర్యరశ్మిలా విచ్చుకోవాలి. అప్పుడే చీకటి విముక్తి సాధ్యం.
విమర్శ ముగింపు: అసలు ఏం చెప్ప దలుచుకుని ఎలా ముగించారో చూస్తే కాస్త బాధ వేసింది..మీరు లేవనెత్తినవి ఎన్నో సమస్యలు …అన్నీ స్త్రీ వాద పోరాటం అనే మహా సముద్రంలో కలియాలి..అనే మహోన్నతమైన ఆలోచన అవగాహనకి మించి పోయి. ఒక సమగ్ర అవగాహన ప్రక్రియ సంకుచితంగా ముగిసిపోయింద్ లేదా అద్భుతంగా అదృశ్యం అయ్యిపోయింది…
కారణం మీలాగ సమస్య మీద అద్భుతమైన పట్టు అవగాహనా ఉండి కూడా రచనా శిల్పం మీద పెట్టిన దృష్టి..ఒక్క అంశం మీద నిజాయితీగా చర్చించినా…ఎంతో అద్భుతంగా ఉండేది..
చివరగా పద్మగారు , మీరంటే.. ఎంతో గౌవురవమూ ఉన్న కూడ.. నేను మీ మీద నా విమర్శనా ఖడ్గం ఎత్తాల్సిన చోట..తగ్గను.. గుండెల నిండా అభిమానం ఉంది. కానీ మీ ప్రస్తానం చాలా ఘోరంగా ముగించుకుంటున్నారనే ఆవేదన కలచి వేస్తోంది..మీకు వినే గుణం ఉంటే..నిజాయితీగా నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలరా.?????.
మన రాత అందంగా ఉంటే సరిపోదు..నిజాయితీగా కూడా ఉండాలి అవగాహన కల్పించడంలో..ఒక జాతిని తమని తొక్కేస్తుంది అనే ఆరొపణ మీద సిద్ధాంతాలు రావు..సమస్యా పరిష్కార దిశలో ఎదుగుదల ఉంటుంది తప్పా సమస్యని అందంగా వ్యక్తీకరించి పని అయ్యిపోయిందోచ్ అనుకున్నంత కాలమూ..ఈ సమస్యని తమ ఎదుగు దలకి వాడుకునే రాజ కీయనాయకులకి స్త్రీ వాద రచయిత్రులకి పెద్ద బేధం లేదు..అనేది నా ఉద్దేశ్యం..
ఇలా సివరాఖరుకి వచ్చేటప్పడికి మూసీ మహా నది కాస్త.హైదరాబాదు మొత్తానికి త్రాగు నీరు అందించే నది కాస్త .చాదర్ ఘాట్లో భూ ఆక్రమణల్లో కలిసి ముగిసిపోయింది. .మూసి కాలువగా ప్రయాణం..
అవును సమాజం కోసం మాట్లాడుకొనే స్నేహితు సూర్యరశ్మిలా విచ్చుకోవాలి
బాగుంది మేడమ
మన దగ్గర కులం, మతం ఉన్నంతకాలం వర్గ పోరాటం ముందుకు పోదు. వర్గ పోరాటం విజయవంతం కానంత వరకు మీరు ఈ వ్యాసంలో లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లేదు. అవును మీరు చెప్పినట్టు అందరూ కలిసి చర్చించాల్సిన అవసరం ఉంది.
హృదయ పూర్వక కృతజ్ఞతలు ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు.