అనువాదం: పద్మ కొండిపర్తి
సరిగా విచారణ జరపకుండానే మా ప్రజా ప్రయోజన కేసును (పీపుల్స్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ – పిఐఎల్) సుప్రీంకోర్టు 2025 మే 15నాడు పరిష్కరించింది.
నా సంతృప్తి కోసం నేను ఈ బ్లాగు రాస్తున్నాను.
2007లో కేసులను దాఖలు చేసాం. నా పుస్తకం ‘ది బర్నింగ్ ఫారెస్ట్’ లో తిరుగుబాటు నిరోధక చర్యలకు సంబంధించి వేసిన కేసు గురించి రాసిన అధ్యాయాలతో పాటు కలిపి ఈ పోస్ట్‌ను చదవాలి. ఆ అధ్యాయాలలో 2011 తీర్పు గురించి మరింత వివరంగా చర్చించాను.
ప్రజాహిత వ్యాజ్య పుట్టుపూర్వోత్తరాలు
2005-07 మధ్య కాలంలో ‘సల్వాజుడుం ‘ (శాంతి యాత్ర) పేరుతో రాజ్య ప్రాయోజిత సాయుధ నిఘా ముఠాలు వందలాది గ్రామాలను (అధికారిక లెక్కల ప్రకారం 644 గ్రామాలను) తగులబెట్టాయి. అనేక వందల మందిని చంపాయి. ఛత్తీస్‌ఘఢ్‌లోని బస్తర్ డివిజన్లో, ప్రత్యేకించి బీజాపూర్, సుక్మా జిల్లాల్లో అనేక మంది మహిళలపైన అత్యాచారం చేశాయి. ఇదంతా సిపిఐ (మావోయిస్టు)ను లేదా నక్సలైట్లను ఓడించాలనే పేరుమీద జరిగింది.
ఆరంభంలో సల్వాజుడుంకి ఒక రూపం లేదు. బిజెపి ప్రభుత్వం, పోలీసు అధికారుల సమావేశాలు జరిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుడు మహేంద్ర కర్మ ఈ ఉద్యమ ప్రముఖ వ్యక్తిగా, అధికారిక నాయకుడిగా వ్యవహరించాడు. స్థానిక సమావేశాలకు హాజరయ్యేలా గ్రామస్థులను బలవంతం చేశారు (హాజరుకాకపోతే జరిమానా విధిస్తామని లేదా ఇల్లు తగలబెడతామని బెదిరించారు); రానివాళ్ళను ఇతర గ్రామాలను తగలబెట్టే కార్యకలాపాలలో పాల్గొనమని ఒత్తిడి తెచ్చారు. వారిని సల్వాజుడుం క్యాంపులకు బలవంతంగా తరలించి సుమారు రెండు సంవత్సరాల పాటు తీవ్రమైన నిఘా కింద ఉంచారు. ఈ క్యాంపులకు వెళ్లడాన్ని తప్పించుకోవడానికి లక్షలాది మంది పొరుగు రాష్ట్రాలకు పారిపోయారు.
మావోయిస్టుల మద్దతుదారులను గుర్తించి, వారిని అరెస్టు చేయడం లేదా చంపేసే లక్ష్యంతో భద్రతా బలగాలు (ప్రారంభంలో నాగా, మిజో రిజర్వ్ బెటాలియన్లు, తరువాత సిఆర్పిఎఫ్) గ్రామాలపైన చేసిన దండయాత్రలకు మద్దతునిచ్చే ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్‌పిఒ) కేంద్రంగా సల్వాజుడుం త్వరలోనే స్పష్టమైన రూపాన్ని దాల్చింది. ఈ ఎస్పిఒలలో ఎక్కువ మంది “లొంగిపోయిన” లేదా అరెస్టు అయిన మావోయిస్టులు; వారిలో చాలామంది మైనర్లు.
రాజ్య మద్దతును అంతం చేయాలని, విస్తృతంగా మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో 2007 సంవత్సరం వేసవిలో రెండు కేసులు దాఖలయ్యాయి. 2007 నాటి రిట్ పిటీషన్ (సివిల్-250)ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మీద నందినీ సుందర్, రామచంద్ర గుహా, ఇ.ఎ.ఎస్. శర్మలు దాఖలు చేశారు. 2007వ సంవత్సరానికి సంబంధించిన రిట్ పిటీషన్ (క్రిమినల్-119)ను బస్తర్, సుక్మా జిల్లాకు చెందిన బాధిత నివాసితులు కర్తమ్ జోగా, దుధి జోగా, మనీష్ కుంజమ్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపేసారు. రిట్ పిటీషన్-250, 119లను మొదట్లో న్యాయవాదులు టి. ఆర్. ఆంధ్య రుజినా, అశోక్ దేశాయ్‌లు వాదించారు. కానీ ఆ తరువాత రెండింటికీ న్యాయవాదులు దేశాయ్, నిత్య రామకృష్ణన్‌లు ప్రాతినిధ్యం వహించారు.
2008 లో ప్రధాన న్యాయమూర్తి కె జి బాలకృష్ణన్ దర్యాప్తు చేయమని ఇచ్చిన ఆదేశానికి స్పందనగా ఎన్హెచ్ఆర్సి తయారుచేసిన నివేదిక మా ఆరోపణలకు మద్దతునిచ్చినప్పటికీ ఆ కమిషన్ పైన ప్రభుత్వ ప్రభావం ఉన్నదని స్పష్టమైంది. అయితే, ఎన్హెచ్ఆర్సి తన నివేదికకు సంబంధించిన అనుబంధాలను బయటపెట్టలేదు. కోర్టుకు దరఖాస్తు చేసి 2018 లో మేం వాటిని సంపాదించగలిగాం. అత్యాచారం, అగ్నిప్రమాదం, కుటుంబ సభ్యుల హత్య ఘటనల బాధితులు నేరుగా దాఖలు చేసిన అనేక పిటిషన్ల వివరాలు ఉండడం వల్ల ఈ అనుబంధాలు మా కేసుకు సమగ్రంగా మద్దతునిచ్చాయి. 2010 మార్చిలో, ప్రధాన న్యాయమూర్తి మమ్మల్ని ఒక పునరావాస ప్రణాళికను తయారుచేసి ఇవ్వమని, పర్యవేక్షణ కమిటీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ప్రముఖ వ్యక్తుల సమ్మతిని తీసుకోమని చెప్పారు; మేం చేసాం. కానీ ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ పదవీ విరమణ అయిపోయింది.
సల్వాజుడుంని నిషేధిస్తూ 2011 జులై తీర్పు
2011 మార్చిలో అప్పటి దంతెవాడ ఎస్ఎస్పి ఎస్.ఆర్.పి. కల్లూరి నేతృత్వంలోని ఎస్‌పిఒలు, తాడ్మెట్ల, మోర్పల్లి, తిమ్మాపురం అనే మూడు గ్రామాలను దహనం చేసి, ముగ్గురిని చంపి, ముగ్గురు మహిళలపైన అత్యాచారం చేశారు. మొదటి సారిగా ఈ ఘటనపైన వార్తలు ఒకేసారి వచ్చాయి.
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్.ఎస్. నిజ్జార్లు 2011 జులై 5నాడు ఒక కీలకమైన తీర్పును ఇచ్చారు. దీనిలో ఏ పేరుతోనైనా నిఘా పెట్టడాన్ని, సల్వాజుడుంకు రాజ్యం మద్దతునివ్వడాన్ని నిషేధించారు. తాడ్మెట్ల, మోర్పల్లి, తిమ్మాపురం ఘటన ఇటీవలే జరిగింది కాబట్టి ఆ ఘటనపై దర్యాప్తు చేసి ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సిబిఐని ఆదేశించారు.
మానవ హక్కుల ఉల్లంఘన కేసులన్నింటినీ దర్యాప్తు చేసి, విచారణ జరిపి, పరిహారం చెల్లించాలని మునుపటి బెంచీలు అలాగే రెడ్డి-నిజార్ బెంచి కూడా రాష్ట్రానికి ఆదేశాలు జారీచేసాయి. ఈ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. భద్రతా బలగాలు ఆక్రమించిన పాఠశాలలను ఖాళీ చేయాలి; మైనర్లను సైన్యంలో చేర్చుకోవడాన్ని నిలిపివేయాలనే రెండు ఆదేశాలను మాత్రమే ప్రభుత్వం అమలు చేసింది.
2011 జులైలో తీర్పు రాగానే, తీర్పు తేదీ నుండి అమలులోకి వచ్చే విధంగా ఇప్పటికే ఉన్న ఎస్పిఒలను ‘ఆక్సీలరీ ఆర్మ్డ్ ఫోర్స్’ (సాయుధ సహాయక దళం)గా మార్చే ఒక చట్టాన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఆమోదించింది. సుప్రీం కోర్టు తీర్పును తిప్పికొట్టడం అనేది ఈ చట్టం ఉద్దేశ్యం. తీర్పు ప్రాతిపదికను తొలగించే ఏ దిద్దుబాటు చర్యలనూ తీసుకోలేదు.
2012 లో మేము వేసిన ఒక ధిక్కార పిటిషన్‌ను దేశాయ్‌గారు ఆమోదించారు.
2010లో తాడ్మెట్ల ఆకస్మిక దాడిలో 76 మంది సిఆర్ పిఎఫ్ సిబ్బంది చనిపోయిన ఘటనతో సంబంధం ఉన్నదనే అబద్ధపు ఆరోపణతో కార్తమ్ జోగా తదితర సిపిఐ సభ్యులను అరెస్టు చేసారు. వారు జైలులో రెండు సంవత్సరాలు గడిపాక నిర్దోషులుగా విడుదలయ్యారు.
2015లో జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల బెంచి ముందుకు కేసు వచ్చింది. 2016 అక్టోబరులో తాడ్మెట్ల గ్రామాన్ని కాల్చివేసినందుకు, స్వామి అగ్నివేశ్‌పై దాడి చేసినందుకు ఎస్పిఒలపైన సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసి తన రిపోర్టును కోర్టులో దాఖలు చేసింది.
దీనికి ప్రతిస్పందనగా, 2016 నవంబర్‌లో ఒక హత్యకు పాల్పడ్డామని ఎస్పి కల్లూరి స్పష్టంగా అసంబద్ధమైన ఒక బూటకపు యుఎపిఎ కేసును మా ఆరుగురిపైన నమోదు చేసాడు. (మాపై దాఖలు చేసిన హత్య కేసును 2019లో కొట్టివేసారు. మానసిక వేదన, అవమానాలకు గురి చేసినందుకు మాకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఎన్హెచ్ఆర్సి ఆదేశించింది).
మా ఫిర్యాదులన్నింటినీ కలిపి పరిశీలించి, కోర్టుకు ఒక జాబితాను సమర్పించాలని న్యాయమూర్తులు లోకుర్, గుప్తాలు ఎన్‌హెచ్‌ఆర్‌సిని ఆదేశించారు కానీ ఎన్హెచ్ఆర్సి ఆ ఆదేశాన్ని పాటించలేదు. చివరకు 2018 నవంబర్‌లో తుది విచారణ జరిపేందుకు నిర్ణయించారు. ముఖ్యమైన వాదనలు, సాక్ష్యాలను సంకలనం చేసి ఇవ్వాలని ఇరుపక్షాలను కోరారు. అడ్వకేట్ నిత్యా వివరణాత్మక వాదనలు ప్రారంభించారు. న్యాయమూర్తులు అన్ని సమస్యలను అర్థం చేసుకుంటున్న సమయంలో పదవీ విరమణకు మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో, న్యాయమూర్తి లోకుర్ కొద్ది భాగం విన్నామని రికార్డు చేసి కేసును ఆపివేసారు.
2019-2024: కోవిడ్ కాలం, విచారణ లేదు. కేసును రిజిస్ట్రీ జాబితా చేయలేదు.
2024: ఈ కేసు జస్టిస్ హృశికేశ్ రాయ్, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టిల ముందు నమోదైంది. కేసుల విచారణ జరిగి కొంత సమయం గడచిపోయింది, కాబట్టి తాజా నివేదికలను దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వానికి, సిబిఐకి చెప్పింది. తాము కోర్టు ఆదేశాలను అనుసరిస్తున్నామని అంటూ రాజ్యం చాలా తేలికపాటి ప్రతిస్పందననిచ్చింది. కానీ వాస్తవానికి ‘ఎస్పిఒలను నిరాయుధులను చేశాం’ అని అబద్ధపు ప్రమాణం చేసింది. సిబిఐ దర్యాప్తులో ఉన్న అన్ని సమస్యలను ఎత్తి చూపుతూ మేము వ్రాతపూర్వకంగానూ, వివరణాత్మక ప్రతిస్పందనను కూడా దాఖలు చేసాము.
న్యాయవ్యవస్థ చేసిన ఆకస్మిక దాడితో చనిపోయిన కేసు
2025: జస్టిస్ రాయ్ పదవీ విరమణ చేసిన తరువాత, మా కేసు 2025 మే లో న్యాయమూర్తులు నాగరత్న, జస్టిస్ సతీష్ శర్మల ముందుకు వచ్చింది. మే 6వ తేదీన నేను రోజంతా కోర్టులో కూర్చుని, జస్టిస్ నాగరత్న అనేక విడాకుల కేసులను పరిష్కరించడం, పంచాంగం ప్రకారం వివాహాలకు అనుకూలమైన తేదీలను గురించి చర్చించడం చూశాను. మధ్యాహ్నం 4.00 గంటలకు మా వంతు వచ్చింది. న్యాయమూర్తులు వెంటనే కేసును కొట్టేయాలనుకున్నారు; కాని, 2024-25 సంవత్సరంలోనే 500 మంది మరణించారన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి కనీసం తాము చెప్పేది వినాలని అడ్వకేట్ నిత్యా కోరారు.
2025 మే 15: కేవలం 15-20 నిమిషాల పాటు విని కేసును పరిష్కరించేసారు. న్యాయమూర్తులు కేసును కొట్టేయడానికే సిద్ధమై వచ్చారు. ఉదయం పూట అంతా వివాహాలు, విడాకుల కేసులు విన్న తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు న్యాయమూర్తులు ఒక జంటను కోర్టులోకి తీసుకువచ్చారు. వారికి పువ్వులు ఇచ్చారు. మహిళకు ప్రతిపాదన చేయమని పురుషుడికి చెప్పారు. అందరూ చప్పట్లు కొట్టారు. జులై నెలలో వివాహం జరుగుతుందని, పంతులు ఖచ్చితమైన తేదీని నిర్ణయిస్తాడని చెప్పారు.
నిత్యకు హైకోర్టులో సగం విన్న కేసు ఒకటి ఉండింది. ఉదయం అంతా కోర్టులో కూర్చున్న ఆమె మధ్యాహ్న భోజనం సమయంలో కేసు వాయిదా వేయమని కోరింది. కానీ జస్టిస్ నాగరత్న తిరస్కరించారు, “మీరు అడిగారు కాబట్టి మేము కేసును వింటున్నాము; ఇప్పుడు చదువుకుని వచ్చాం కాబట్టి మీరు భోజన విరామం తర్వాత ఉండాల్సిందే” అని అన్నారు. 3.00 గంటల వరకు తిరిగి వస్తానన్నా కూడా ఒప్పుకోని వారు చివరికి 3.30 గంటలకు పిలిచారు.
ఈ కేసులో ఇంకా విచారణకు తీసుకోవాల్సి ఉన్న విషయాలను నిత్య చెప్పడం మొదలుపెట్టారు. తీర్పులో ఉన్న సంబంధిత పేరాను చదవి వినిపిస్తానంటే న్యాయమూర్తులు ఒప్పుకోలేదు; సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వమూ అఫిడవిట్లు దాఖలు చేసాయి కదా అన్నారు.
“క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి తెలియకుండానే ఢిల్లీకి చెందిన బయటివారు జోక్యం చేసుకుంటున్నా”రని అనడం ఒకటే ఎఎస్జి నటరాజన్ ఈ విచారణలో చేసిన ఏకైక సహకారం. అందుకు నేరుగా ప్రభావితమైన కర్తమ్ జోగా, దుధి జోగాలు పిటిషనర్లలో ఉన్నారు అని నిత్యా ఎత్తి చూపారు.
అర్లంపల్లిలో దుధి యోగ ఇంటిని గ్రామంలోని మిగతా అన్ని ఇళ్లతో పాటు కాల్చేసారు. చదువుకుని వచ్చానని చెప్పిన జె. నాగరత్న అప్పుడు కేసు జాబితాను పరిశీలించి, రెండు పిటిషన్లు లింక్ అయి ఉన్నాయని, ఒకటి స్థానిక నివాసితులు దాఖలు చేశారని గ్రహించింది.
“నేను మాట్లాడాను కాబట్టి పోలీసుల్లో ఎస్పిఒలను నియమించడం చాలా మంచిదని నాకు తెలుసు” అని అన్న జస్టిస్ శర్మ సర్దుకొని, “నేను పొరుగు రాష్ట్రం నుండి వచ్చాను కాబట్టి నాకు పరిస్థితి తెలుసు” అని మాట మార్చాడు. అలా కాకుండా గ్రామాలలో ఏం జరుగుతుందో పొరుగు జిల్లాల ప్రజలకు కూడా తెలియదు అని చెప్పి ఉండాల్సింది.
మా కేసును కొట్టివేస్తూ జూన్ 3న వచ్చిన తుది ఉత్తర్వులో ఈ కింది అంశాలు ఉన్నాయి:
1. 2011 తీర్పును పునరుద్ఘాటించారు; అందువల్ల కనీసం పౌరులకు పోరాడటానికి ఆయుధాలు ఇవ్వకూడదు అనే నియమం నిర్థారితమైంది; సల్వాజుడుం ఏర్పాటు పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీసింది అనే వాస్తవాన్ని గుర్తించారు.
2. 13వ పేరాలో శాంతి, పునరావాసం కోసం ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది (కానీ ఏ చర్యలు తీసుకోవాలి లేదా ఆదేశాలను ఎలా అమలు చేయాలి అని ప్రస్తావించక పోవడం వల్ల ప్రభుత్వ అణచివేత నేపథ్యంలో ఈ ఆదేశం అర్థరహితం అవుతుంది. అమలుచేయడానికి అవసరమయ్యే అంశాలని ప్రస్తావంచని ఈ ఆదేశాల కారణంగానే మేము మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది.) పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 315లోని ప్రస్తావన ఈ సందర్భంలో అర్థం లేకుండా పోతుంది.
3. సంబంధిత ఎంపిక చేసిన తీర్పులను ఉటంకించినప్పటికీ, ఒక చట్టం ఆమోదాన్ని పొందిన తరువాత, ఆ చట్టాన్ని ధిక్కరిస్తూ పిటీషన్ దాఖలు చేయడానికి కుదరదు అని కోర్టు పేర్కొంది. మా రాతపూర్వక విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోనే లేదు (క్రింద చూడండి).
4. సాయుధ సహాయక బలగాల చట్టాన్ని తగిన కోర్టులో సవాలు చేసే స్వేచ్ఛను మాత్రం ఇచ్చింది.
5. ప్రతిస్పందన దాఖలు చేసింది కాబట్టి ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పాటించినట్లే అని కోర్టు తెలిపింది. వాస్తవానికి ప్రతిస్పందనలో పేర్కొన్న అంశాలు పూర్తిగా అర్థరహితమైనవి అయినప్పటికీ కోర్టు ఏమాత్రం పట్టించుకోలేదు.
6. “మేము ఈ విషయాలను తొలగిస్తున్నాము; కాబట్టి ఈ కేసులలో పేర్కొన్న బాధలను మేము మరింతగా గమనించాలనుకోవడం లేదు” అని అంటూ మానవ హక్కుల ఉల్లంఘనలన్నింటి గురించి కోర్టు తన చేతులను దులిపేసుకుంది.
2025 మే – విచారణ – విశ్లేషణ
కేసు విచారణ జరపకుండానే లేదా రికార్డులో ఉన్న ఏవిషయాన్నీ కూడా చదవకుండానే న్యాయమూర్తులు కేసును కొట్టివేయడానికి సిద్ధమై వచ్చారని మొత్తం విచారణా సరళి నుంచి స్పష్టమైంది.
కనీసం కోర్టు ప్రభుత్వం దాఖలు చేసిన విషయాలను మాత్రమే చదివి, మేం దాఖలు చేసినవాటిని పట్టించుకోకపోయిఉంటే కనక, కోర్టు ప్రభుత్వాన్ని ఏమాత్రమూ ఇబ్బంది పెట్టలేదని; ఎంతవరకంటే కేసు విచారణ జరుగుతున్నా క్రమంలో ప్రభుత్వం కనీసం ఒక సున్నితమైన ప్రతిస్పందన వ్యక్తం చేసే అవసరం కూడా లేకుండా చేసిందని స్పష్టమై ఉండేది.
ఈ కేసు కోర్టులో కొనసాగినంత కాలం (జాకియా జాఫ్రీ కేసులో మాదిరిగానే) మాకు వ్యతిరేకంగానే ఉండింది; అయినప్పటికీ ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వమే వాయిదాలు అడిగింది. కోర్టు కూడా విచారణలను ఆలస్యం చేసింది. ఎన్నో రోజులు (వందకు పైగా) వాదనలు సిద్ధం చేసుకొని న్యాయవాదులు కోర్టులో కూర్చున్నారు; కానీ విచారణ జరగలేదు.
వారిని మధ్య తరగతి, పై తరగతులకు చెందిన పెళ్ళిళ్ళు, విడాకులు, పన్నులకు సంబంధించిన కేసులు కాకుండా ఆదివాసులు, భారీ మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించమని కోరడం కూడా న్యాయమూర్తులను అసంతృప్తికి గురిచేసింది.
ధిక్కారం: సుప్రీంకోర్టు ప్రతిష్టను కాపాడుకునేందుకు ధిక్కార కేసును దాఖలు చేశాం. ఎస్‌పిఒలు ఇప్పుడు డిఅర్జిగా పేరు మార్చుకొన్నారని; మానవ హక్కుల ఉల్లంఘనలను మరింత ఎక్కువగా కొనసాగిస్తున్నారని IA 10/2016 లో వివరించాం. ఎస్పిఒల నియామకం, సేవల పరిస్థితులు ఎప్పుడూ మా ప్రధాన ఆందోళన కాకపోవడం వల్ల మేం ఈ చట్టాన్ని హైకోర్టులో సవాలు చేయలేదు. అది మా వినతిలో ఒక చిన్న భాగం మాత్రమే. కొంతమంది పౌరులకు(ఎస్‌పిఒలు-డిఅర్జిలు),అందులోనూ లొంగిపోయిన మావోయిస్టులకు, నేరారోపణలు ఉన్న వారికి సైతం ఇతరులపై పోరాడటానికి ఆయుధాలు ఇవ్వడం అనేది సల్వాజుడుం విధానానికి కొనసాగింపు అనేది మా ప్రధాన ఆందోళన.
లొంగిపోయిన మావోయిస్టులను పోలీసు బలగాల్లో చేర్చినా, ‘గోపనీయ (రహస్య) సైనికులు’గా ఉపయోగించినా వారిపై కేసులను రద్దు చేయలేదనే విషయాన్ని గమనించడం ముఖ్యం. అందువల్ల, సాయుధులై పోలీసులను చంపుతున్నారు కాబట్టి మావోయిస్టులను చంపడానికి తీవ్రమైన హత్యారోపణలున్న, సాయుధులైన సహాయక బలగాలను లేదా కానిస్టేబుల్స్‌ని, మరో మాటలో చెప్పాలంటే, “కావల్సిన వారిని” నియామకం చేసిన పరిస్థితి ప్రస్తుతం ఉన్నది.
భవిష్యత్ తరాల న్యాయవాదులు జె. నాగరత్న, జె. శర్మలు ధిక్కారానికి సంబంధించి ఇచ్చిన తీర్పును వివాదాస్పదం చేస్తారు; ఎందుకంటే ఇలాంటి తీర్పులు వినాశకరమైన సౌలభ్యంతో తారుమారు చేయడానికి రాష్ట్రాలకు వీలు కల్పిస్తాయి. ఏ చట్టం అయినా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న లోపాలను తొలగించాల్సి ఉంటుందని పేర్కొంటూ కూడా, ఛత్తీస్‌ఘడ్ ఆర్మ్డ్ ఆక్సిలియరీ ఫోర్స్ చట్టంలో ఉన్న లోపాలను పరిశీలించడానికి న్యాయమూర్తి నాగరత్న నిరాకరించారు. మా రాతపూర్వక సమర్పణల నుండి ఉదహరించిన ఈ క్రింది అంశాలు (న్యాయమూర్తులు విస్మరించినవి), లోపాలను తొలగించకపోవడం వల్ల, చట్టానికి ఉన్న ప్రామాణికతను ప్రశ్నార్థకంగా చేస్తాయి.
1. “ఒక న్యాయ నిర్ణయాన్ని” తొలగించాలన్నా, అధిగమించాలన్నా లేదా వ్యతిరేకంగా రాయాలన్నా కేవలం శాసన ప్రకటన చేస్తే సరిపోదు; అటువంటి చట్టాన్ని చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించాలంటే, మునుపటి చట్టాన్ని రద్దు చేయడానికి ప్రాతిపదికగా చేసుకుని న్యాయ నిర్ణయం జరిగిన పరిస్థితులను మార్చాలి లేదా సరిదిద్దాలి. (ఐ. ఎన్ సాక్సేనా వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఎఐఆర్ 1976 ఎస్సీ 2250 పేరా 22& 23)
2. అంతేకాకుండా, చట్టబద్ధతను మంజూరు చేసే చట్టంపై ఒక న్యాయస్థానం నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ న్యాయ నిర్ణయాన్ని అసమర్థమైనదిగా ప్రకటించే శాసన ప్రకటన మాత్రమే ఉన్నదా లేక న్యాయ నిర్ణయాన్ని అసమర్థంగా మార్చగల చట్ట స్వభావాన్ని మార్చడానికి శాసనసభ శ్రద్ధ వహించిందా అనే విషయాన్ని న్యాయస్థానం తెలుసుకోవాలి.
ఒక న్యాయస్థానం యిచ్చిన ముందస్తు తీర్పును అటువంటి ముందస్తు న్యాయ నిర్ణయానికి ఉండిన చట్టపరమైన ప్రాతిపాదకను రద్దు చేయడం ద్వారా పనికిరానిదిగా మార్చే శక్తి శాసనసభకు ఉన్నప్పటికీ, ముందస్తు న్యాయ నిర్ణయాన్ని అనుసరించాల్సిన అవసరం లేదనే ఒక సాధారణ ప్రకటన న్యాయ అధికారాలను అధిగమిస్తుంది; కాబట్టి అలా చేయడానికి అనుమతి ఉండదు. (వీరేంద్ర సింగ్ హూడా vs హర్యానా రాష్ట్రం & ఓర్స్ (2004) 12 ఎస్ సి సి 588 పేరాలు 46, 47, 49 మరియు 51)
3. అంతేకాకుండా, న్యాయస్థానం గుర్తించిన ఒక చట్టంలో ఉన్న లోపాలను తొలగించడానికి శాసనసభ అనుమతించినా, లోపాలను తొలగించకుండా చట్టాన్ని ఆమోదించడం అనేది న్యాయస్థానం తీర్పును రద్దు చేయడం లాంటిది; ఇది అధికారాల విభజన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటుంది. (ఇందిరా సాహ్నీ వి యూనియన్ ఆఫ్ ఇండియా & అదర్స్. , (2000) 1 ఎస్సీసీ 168 (పారా 1, 6, 61, 83 కూడా చూడండి) 28వ పేరా.
తిరుగుబాటును ఎదుర్కోవడానికి ఎస్పిఒలను సాయుధులను చేయడం, వినియోగించడం రాజ్యాంగంలోని మూడో భాగాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది అని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు, అలా చేయడం ఒక చట్టాన్ని రూపొందించడం ద్వారా సాధ్యం కాదు; అలా చేస్తే లోపాన్ని తొలగించడం మాట అటుంచి రాజ్యాంగంలోని మూడవ భాగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని వ్యతిరేకించడానికి చేసింది అనేది స్పష్టం; ఇది ఒక చట్టం ద్వారా చేసినప్పటికీ, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం అటువంటి చట్టాన్ని అనుసరిస్తున్నంత వరకు, ఇది కోర్టు ధిక్కారమే అవుతుంది.
ఎస్పిఒలను నిరాయుధులను చేసినట్లు రాజ్యం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ (అఫిడవిట్ 30.8.2024, పారా 9; అఫిడవిట్ 31.07.2013, వాల్యూమ్ 33 పేజీలు 1160-1290 @ పేజీ 1183)” రాజ్యం వారిని ఒక ‘సాయుధ బలగంగా’ ఏర్పాటు చేసింది; తద్వారా ఇతర అతిక్రమణలకు అబద్ధ ప్రమాణాన్ని జోడించింది”.
మానవ హక్కుల ఉల్లంఘనలను పట్టించుకోలేదు: న్యాయమూర్తులు మూడు రోజుల పాటు విలువైన న్యాయస్థానం సమయాన్ని వివాహాలను ఏర్పాటు చేయడం, వివాహం, విడాకుల విషయంలో సలహా ఇవ్వడం వంటివాటి కోసం వృథా చేయడాన్ని చూసి నాకు చాలా బాధ కలిగింది; కోపం వచ్చింది. నిస్సందేహంగా ఇవి సంబంధిత వ్యక్తులకు ముఖ్యమైనవే; కానీ రాజ్యాంగ న్యాయస్థానం అంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్నవి కాదు. అదే సమయంలో ఆ న్యాయమూర్తులు మానవ హక్కుల తీవ్రమైన ఉల్లంఘనల గురించి, మేము యిచ్చిన వందలాది, అక్షరాలా వందలాది మరణాలు, అత్యాచారాలు, గృహదహనాలకు సంబంధించిన, చాలా వరకు బాధితులు నేరుగా ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఇచ్చిన కేసుల కోసం సమయం కేటాయించడానికి నిరాకరించారు.
వారు ఒక పర్యవేక్షణ కమిటీని ఆదేశించినప్పటికీ, ఇరవై సంవత్సరాల తరువాత బాధితులను, వారి కుటుంబాలను గుర్తించడం చాలా కష్టం అనేది వాస్తవం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకుండానే కాల్చివేసిన ఇళ్లను ప్రజలే స్వయంగా తిరిగి కట్టుకున్నారు.
ఆదేశించే బాధ్యతను తీసుకొనే ఒక నియమం లేకపోవడంతో, వ్యక్తిగత నేరస్థులను గుర్తించాల్సిన అవసరం ఉన్న సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం ఈ నరసంహారాలు, సామూహిక హత్యల కేసుల్లో తీర్పు చెప్పడం కష్టం.
మనకు కావలసింది కనీసం హింస స్థాయిని సూచించే ఒక సత్య, సయోధ్య కమిషన్ (ట్రూత్ అండ్ రికన్సిలియేషన్)లాంటి యంత్రాంగం. ఈ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశం న్యాయ జోక్యం ద్వారా కాకుండా రాజకీయ తీర్మానం ద్వారా ఉందనేది వాస్తవం. కానీ మావోయిస్టులు పదేపదే పిలుపునిచ్చిన శాంతి చర్చలకు స్పందించడానికి నిరాకరిస్తున్న ప్రభుత్వం; “చనిపోయిన లేదా సజీవంగా” మావోయిస్టులను పట్టుకున్నవారికి బహుమతులు ఇస్తున్న తన లొంగిపోయే విధానం ద్వారా హత్యలను ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉంది.
ఏనాడైనా ఈ దేశ చరిత్ర రాసినప్పుడు, స్వతంత్ర భారత గణతంత్ర రాజ్యంలో వివిధ సముదాయాలకు చెందిన ముస్లింలు, ఆదివాసీలు, సిక్కులు, దళితులను వందలాది మందిని రాజ్య ప్రాయోజిత బలగాలు చంపాయని, వారు ఎన్నడూ ఉనికిలో లేరని, వారికి ఎన్నడూ న్యాయం జరగలేదని రాస్తారు. తమ పౌరులకు ఒక కవచంగా ఉండగల రాజ్యాంగంతో ఈ దేశం ఉనికిలోకి వచ్చిందని; కాని కోర్టులు అలా చూస్తూ కూచుంటే ప్రభుత్వం రక్తం చిందించడాన్ని, చిలకరించడాన్ని ఎంచుకుంది అని రాస్తారు.
కొంత మినహాయింపు ఉన్నప్పటికీ నేను న్యాయవ్యవస్థపట్ల చాలా నిరాశ చెందాను. అయితే, ఉచితసేవలనందించిన మా న్యాయవాదులందరికీ, సీనియర్లు, జూనియర్లకు, ముఖ్యంగా అశోక్ దేశాయ్, నిత్యా రామకృష్ణన్లకు, టిఆర్ ఆంధ్య రుజీనా, సుమితా హజారికా (మా అడ్వకేట్ ఆన్ రికార్డ్; దశాబ్దాలుగా అనేక అఫిడవిట్లు దాఖలు చేసింది), రాహుల్ క్రిపాలనీ, సుహాసిని సేన్, మేనకా గురుస్వామి, మొహమ్మద్ సాద్, స్తుతి రాయ్, నిత్యా జూనియర్లకు ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. రాజ్యాంగంపైన వారికి ఉన్న విశ్వాసం, వారి వృత్తి నైపుణ్యం నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి. నా తోటి అభ్యర్థులందరికీ కూడా నేను కృతజ్ఞురాలిని. ఈ బ్లాగ్ వ్యాసాలలోని పరిశీలనలు నావే అని చెప్పనవసరం లేదు. అన్నిటికన్నా ఎక్కువగా, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికి బస్తర్ ప్రజలు చూపిస్తున్న ధైర్యాన్నీ, దృఢ నిశ్చయ వైఖరినీ ప్రశంసిస్తున్నాను.
Nandini Sundar, 8th June 2025
http://nandinisundar.blogspot.com/2025/06/post-mortem-of-pil.html#more