“ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్” అన్నడు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గ్రెహండ్ స్పెషల్ ఆఫీసర్ గంగాధర్‍తో వినయంగా.
ఆ మాటకు స్పెషల్ ఆఫీసర్ లావాటి గుండ్రటి మొఖం సంతోషంతో విప్పారింది. గత కొన్ని నెలలుగా ఛత్తీస్‍గడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలోని గోదావరి పరివాహక ప్రాంతంలో మళ్ళీ నక్సలైటు కదిలికలున్నాయనే సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి గాలింపు చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా అడవులు పరిరక్షణ పేరు మీద అడవిలోని గిరిజనులను ఖాళీ చేయించాలని తద్వారా అడవులను పర్యావరణాన్ని కాపాడాలని నమ్మబలుకుతుంది. అట్లా తరలించిన ఆదివాసులకు అడివి అంచు ప్రాంతంలో, భూములు ఇస్తామని, రైతు బంధు పథకాలు అమలు చేస్తామని, ఉచిత కరెంటు ఇస్తామని నమ్మబలుకుతుంది.
అడివిలోని గిరిజనులను ఖాళీ చేయించి ఆ భూములను కార్పోరేటు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం లోపాయి కారిగా కుట్ర పన్నింది. కాని గిరిజనులు ప్రభుత్వ మాటలు నమ్మటంలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే హామీలు అచరణకు వచ్చే సరికి కంటి తుడుపు చర్యగా తప్ప అమలు కావని, అయినా మేం అనాదిగా అడివిని నమ్ముకుని బ్రతికే వాళ్ళం. అడివే మా జీవనాధారం అడివిని వదిలితే మా బ్రతుకులు నీళ్ళు లేని కాడ బొండిగ కోసినట్టేనని చావో బ్రతుకో అడివిలోనే అని మొండికేసి అడువులు ఖాళీ చేయ్యటానికి సిద్ధంగా లేరు.
దాంతో ప్రభుత్వం గిరిజనులను అడివిలో నుండి ఖాళీ చేయించటానికి పారెష్టు వాళ్ళకు అండగా పంపి బలవంతంగా ఖాళీ చేయించాలని చూసింది. అడవిలోని గిరిజనుల గుడిసెలను కాలపెట్టింది. ఆడ మగ పిల్లపాప అన్నతేడా లేకుండా చావబాది, కేసులు పెట్టింది. అయినా గిరిజనులు అడివిని మాత్రం వదలటానికి సిద్ధంగా లేరు.
ఇటువంటి పరిస్థితుల్లో ఎండుటాకుల్లా రెపరెపలాడుతున్న గిరిజనల్లోకి మళ్ళీ అన్నలు వస్తే ఎనకటి రోజులు వస్తాయని భావించిన ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
గ్రేహండ్ స్పెషల్ ఆఫీసర్ గంగాధర్‍కు నక్సలైటు అపరేషన్స్ చేపట్టడంలో మంచి ఉద్దండుడని పేరుంది. ఆయన ఎన్నో ఆపరేషన్స్ విజయవంతం చేసిండు. ఎంతలేదన్నా పాతిక ముప్పయి మంది నక్సలైట్లను మట్టుబెట్టాడని పేరుంది. ఆవిధంగా ఆయన తర్వత్వరగా అగ్జలరీ ప్రమోషన్లు పొంది యస్సే స్థాయి నుండి ఐ.జి. స్థాయి వరకు చేరుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కూడా ఆయన హోదాకు ఏం బంగం కల్గలేదు సరికదా సమర్థుడైన అధికారిగా గుర్తించి, ప్రమోషన్ కల్పించి, కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన ఎదైనా ఆపరేషన్ చేపట్టితే రెండు మూడు నెలలో టార్గెటును చేదిస్తాడనే పేరుంది. అటువంటి వాడు గత ఆరు నెలలుగా స్థానిక ఆర్గనైజర్ “లక్మా” కోసం పనిపాటలేని లంపేన్ పోరగాండ్లను చేరదీసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి, ఊరూరా ఇన్‍ఫార్మర్ వ్యవస్థను నెలకొల్పుకొని వేట సాగిస్తున్నా “లక్మా” దొరికినట్టె దొరికి మళ్ళీ తప్పించుకొనిపోతున్నాడు.
ఒకసారి అయితే పక్కా సమాచారంతో పోలీసు బలగాలు అక్కడికి చేరుకొనేసరికి తృటిలో తప్పించుకొని పోయిండు.
అంత పాతిక ఎండ్లు కూడా లేని “లక్మా” స్పెషల్ ఆఫీసర్‍కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.
లక్మా ఆదివాసి గుత్తి కోయ సామాజిక వర్గానికి చెందిన వాడు కావటం, ఆ ప్రాంతవాసి కావటం, అక్కడి జనం గురించి, ఆ ప్రాంతం గురించి తెలిసిన వాడు కావటంతో నీళ్ళలోని చాపలాగ ప్రజల్లో కలిసిపోయి పోలీసులకు చిక్కకుండా పోతున్నాడు. అటువంటి ‘లక్మా’ గురించి సమాచారం వచ్చిందని తెలిసిన తరువాత అతృత, ఉత్కంఠ పెరిగి పోయి “వాన్ని తీస్కరా” అంటూ సర్కిల్‍ను ఆదేశించిండు.
మరి కాసేపట్లో సర్కిల్, ఇన్‍పార్మర్ అయిన గిరిజన యువకున్ని వెంటబెట్టుకొని వచ్చిండు. గంగాధర్ వానికేసి ఒక్క క్షణం ఎగాదిగ చూసిండు అంతా పాతికేండ్లు కూడా లేని ఆయువకుడు పంచెకట్టుకొని, బనీను వేసుకొన్నాడు. రెండు చేతులు జోడించి స్పెషల్ ఆఫీసర్‍కు నమస్కరించిండు.
“ఏం పేరురా నీది” అన్నాడు గంగాధర్ వాన్ని పరిక్షగా చూస్తూ.
“మంగు దొర” అన్నాడు ఆ యువకుడు వినయంగా.
“దొరచట్టపోల్లారా”
“అవునయ్యా”
“ఏవూరు”
“గుమ్మిడి దొడ్డి”
ఒక్క క్షణం మౌనం వహించిన గంగాధర్, గాఢంగా ఊపరిపీల్చుకొని “లక్మా వచ్చిండని నీకేట్లా తెలుసు” అని అడిగిండు.
“నిన్న మావూరుకు వచ్చిండు”
“ఎందుకు” అన్నాడు గంగాధర్ ఆసక్తిగా.
“పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళన జర్గుతుంది కదా దాని విషయమై మాట్లాడటానికి వచ్చిండు.”
“వచ్చి”
“వూరోల్లందరిని కుప్పేసి చాలా చెప్పిండు.”
“ఏం చెప్పిండు?”
“మూడు లక్షల మంది గిరిజనులను బలిపశువులను చేసిన సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కేసిఆర్ ఆదివాసులను మరింత అన్యాయము చేస్తున్నాడు. పోడుభూములకు పట్టాలు ఇస్తామని, తండాలు గ్రామపంచాయితీలు చేస్తామని హామీలు ఇచ్చి, గద్దెనెక్కిన తరువాత ఇచ్చినమాట మరిచిపోయి, చివరికి అడువుల నుండి గిరిజనులను ఖాళీ చేయించి, అడవులను కార్పోరేటు శక్తులకు అప్పగించాలని కుట్రలు చేస్తాండు. మనం గట్టిగా నిలబడి పోరాడకుంటే మనకు బ్రతుకు లేదు…” అంటూ చాలా చెప్పుకొచ్చిండు.
“తరువాత ఎటుపోయిండు?”
“సాయంత్రం దాకా ఊళ్ళనే ఉన్నాడు, చీకటైనంక పోయిండు”
“ఎటుపోయిండు?” అన్నడు మళ్ళీ గంగాధర్ ఆసక్తిగా ముందుకు వంగి.
“అదే ఎటుపోతాండో తెలుసుకుందామని వాళ్ళకంట పడకుండా మెల్లగా వాళ్ళను అనుసరించిన”
“పోతే”
“నాగారం ఉళ్ళేకు పోయిండ్లు. మళ్ళీ వస్తడేమోనని చాలా సేపు చూసిన కాని బయటికి రాలే ఊళ్ళనే ఎక్కడో ఒకకాడ ఉండిఉంటడు” అన్నాడు.
“ఎక్కడున్నది నీకు తెల్వదా?”
“తెల్వదు”
“అదే ఎందుకు”
“నేను ఉళ్ళెకు పోతే వీడు ఇటెందుకు వచ్చిండని అనుమానం వస్తదని ఉళ్ళెకు పోలే”
“అయితే నువ్వు చూడకుండా పోయిండేమో”
“లేదయ్యా”
“అంతకచ్ఛితంగా ఎలా చెప్పుతావు”
“ఎటైనాపోతే కనిపెడ్తామని అరాత్రంత చూసిన తెల్లారింది కాని ఉళ్ళేనుంచి ఎవరు బయటికి పోలేదు… ఉళ్ళెనే ఎక్కడో ఒకకాడ ఉండి ఉంటాడు”
“నువ్వు ఇటు వచ్చినంక పోయిండేమో”
“అట్ల పోతలేరయ్యా”
“అదే ఎందుకు”
“ఎందుకంటే అయ్యా… ఈ మధ్య పోలీసు పిట్రోలింగ్‍లు ఎక్కువైనవని వెలుగుపూట ప్రయాణం చేస్తలేరు… చీకటితోనే వచ్చి చీకటితోనే పోతాండ్లు. నేను తెల్లారిందాక చూసిన… ఎటుపోలే… ఊళ్ళనే ఎక్కడో ఒక ఇంట్ల ఉండి ఉంటాడు. మళ్ళీ చీకటైతే కాని బయటికిపోడు… ఈలోపు మనం పోతే దొరుకుతాడు” అన్నాడు నమ్మకంగా.
వాన్ని పంపి గంగాధర్ చాలసేపు ఆలోచన చేసిండు… ఒక వేళ ఇన్‍ఫార్మర్ చెప్పింది నిజమే అయితే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే… కాకుంటే పోయ్యేది ఏముంది” అనుకున్నాడు. ఏదీ ఎమైనా ఈసారి వచ్చిన అవకాశాన్ని జారవిడువ వద్దు అని ఒక నిర్ణయానికి వచ్చిండు… మూడోకంటికి తెలియకుండా సాయంత్రంలోగా ఊరును చుట్టుముట్టాలని ప్లాను తయారు చేసిండు ఆవెంటనే సర్కిల్‍ను పిలిచి మాట్లాడిండు. తరువాత జిల్లా యస్పితో ఫోన్లో మాట్లాడి అదనపు బలగాలను తెప్పించుకున్నాడు.
గ్రేహండ్ దళం వందమందికితోడు మరో మూడు వందలమంది అదనపు బలగాలు వచ్చినవి. మొత్తం నాలుగు వందల మందైండ్లు… అంతమంది పోలీసులు వస్తే జనానికి తెలిసే అవకాశం ఉంది. జనానికి తెలిసిందంటే ఆసమాచారం అన్నలకు తెలిసే అవకాశం ఉంది అని ఆలోచన చేసిన స్పెషల్ ఆఫీసరు తన బలగాలను తీసుకొని ఊరికి పదికిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపి జనం కంట పడకుండా అడివిలో అడ్డదారిన బయలుదేరిండు.
సూర్యుడు కుంకిండు. సంధ్య వెలుగులు కమ్ముకుంటున్నవి. అంత వరదాక ఊరు చుట్టు ఉన్న అడివిలో దాగున్న పోలీసులు ఒక్కసారిగా బయిటికి వచ్చి ఊరును చుట్టు ముట్టిండ్లు…
ఊరిలోకి అడుగు పెట్టిన బలగాలకు దహన సంస్కారాలకు తీసుకపోతున్న శవం ఎదురైంది. మాదిగ డప్పులమోత, బంధువుల ఎడ్పుల అర్పులతో వస్తున్న శవాన్ని చూసి గంగాధర్ మొఖం చిట్టించుకొని ముహూర్తం బాగాలేనట్టుంది అని తనలో తను గొణుక్కొని “ఎవడ్రా చనిపోయింది” అన్నాడు అసహనంగా…
“సారు ఎవరో ముసలోడు ఉన్నట్టుంది” అన్నాడు ప్రక్కనే ఉన్న జవాన్ ఒకడు.
తేరుకున్న గంగాధర్ “ఇల్లిల్లు వెతకండి.. ఏ ఒక్కన్ని వదిలిపెట్టవద్దు” అంటూ అరిచిండు.
***
గొర్రెల మంద మీద తోడేళ్ళ గుంపు పడ్డట్టుగా ఒక్కసారిగా ఊరిమీద వందలాది పోలీసులు చుట్టుముట్టేసరికి జనం బెదిరిపోయిండ్లు…
ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థంకాలేదు. చీకటితోని పొలం కాడికి పోయిన రైతు ఒకరు పొద్దంత పని చేసి అలసిపోయి బురద కొట్టుకపోయిన బట్టలతో ఇంటికి వస్తున్న వాన్ని పట్టుకున్న పోలీసులు అతన్ని స్కూల్ గ్రౌండ్‍కు తోలుక పోయిండ్లు.
“ఎందయ్యా ఎందుకు పట్టుకున్నారు” అంటూ ఆరైతు తనని పట్టుకున్న పోలీసాయన్ని నిలదీసిండు.
“కాసేపు అగుండ్లీ అంత మీకే తెలుస్తది” అంటూ పోలీసాయన లాటీ అడిస్తూ తోసుకుంటు పోయిండు.
“పొద్దున అనంగ పొలంకాడికి పోతీ”, ఇంటికాడ పొల్లగాండ్లు ఇద్దరే ఉన్నారు… ఆకలితోని చూస్తాండ్లు కావచ్చు, తొందరగా పోదామంటే ఇదేందయ్యా మముల్ని అపుతాండ్లు” అంటూ ఒక నడీడు స్త్రీ గయ్యిమంటూ లేచింది.
ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాని పోలీసువాడొకడు “ఏ ఉకో అమ్మ ఉకో.. ఊకోకుంటే నోరు మూయించాల్సివస్తది” అంటూ కసురుకున్నాడు.
“ఎందయ్యా కొడ్తవా కొట్టు ఏం పాపం చేసినమని కొడ్తవు మరీ చెలాయించుకుంటాండ్లు” అంటూ ఎదురు తిరిగింది. దాంతో ఆపోలీసువాడు ఎందుకొచ్చిన తంటా అనుకొని అక్కడి నుంచి కదిలి ముందుకు పోయిండు.
స్కూల్‍గ్రౌండ్‍లో అప్పటికే కుప్పేసి జనం తలో మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకు కాపాలా ఉన్న పోలీసులకు వారిని కంట్రోల్ చెయ్యటం కష్టమైపోతున్నది. “కాసేపు ఆగుండ్లీ అందరిని వదిలిపెడ్తం” అంటూ కంట్రోల్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు… అయినా జనం గోలగోలగా అరుస్తూనే ఉన్నారు.
“మళ్ళీ ఎనకటి రోజులు వచ్చినట్టే” ఉంది అంటూ ఒక పెద్దాయన వెనుకటి రోజులు తలచుకొన్నాడు.
ఎనకట గిట్లనే పారెష్టు వాళ్ళు అడివిలో పుట్టి పెరిగిన ఆదివాసులను అడవిలో ఆకు తెంపిన కొమ్మ తెంపిన, పశువులను మేపినా కొట్టడం తిట్టడం చేసేవాళ్ళు దండుగుల వసూలు చేసేవాళ్ళు. కేసులు పెట్టి జైళ్ళకు పంపేవాళ్ళు.. ఊళ్ళపొంటే వచ్చి కాళ్ళు గొర్లు మాయం మాయం చేసేవాళ్ళు. నజరుగా కనిపించిన స్త్రీల మీద అత్యాచారం చేసేవాళ్ళు… నరరూప రాక్షసులుగా మారి గిరిజనుల మాల్గుల్ని పీల్చేవాళ్ళు అట్లా భయం భయంగా బ్రతికే గిరిజన గూడాలకు అన్నలు వచ్చి పారెష్టు వాళ్ళ జులుం నిలువరించి తన్ని తరిమేసి అడివి మీద ఆదివాసులదే హక్కు అంటూ ఒక్కటి చేసిండ్లు దాంతో పాలక వర్గాలు తమ దోపిడి సాగక పొయ్యేసరికి సాయుధ బలగాలను దించి, అడివిలో నెత్తుటేర్లు పారించిండ్లు, ఉద్యమాన్ని అణిచివేసి మళ్ళీ దోపిడికి తెరలేపిండ్లు…
అంత నెల రోజులక్రింద పారెస్టు వాళ్ళు, పోలీసులు కలిసి వచ్చి అడివిలో అక్రమంగా గుడిసెలు వేసుకున్నారని, ఆడ మగ పిల్లాపితుకా అని తేడా లేకుండా ఊరిమీద పడి అందిన వారిని అందినట్టుగా చితకబాదీ గుడిసెలను తగులబెట్టిండ్లు..
“ఎనకటి నుంచి ఇక్కడ ఉంటానం, ఇవ్వాళ సర్కారోడు వచ్చి భూములు కాళీచేయ్యమంటే ఎక్కడికిపోతం… ఎట్లా పోతం” అంటూ జనం ఎదురు తిరిగిండ్లు… గలాట పెద్దది కావటంతో పారెస్టు వాళ్ళు పోలీసులు తోకముడిసిండ్లు…
మళ్ళీ పోలీసులు వచ్చే సరికి అటు వంటిది ఏదైనా జరుగుతుందోనని జనం అందోళన చెందిండ్లు.. కాని వచ్చిన పోలీసులు ఇండ్లు కూల్చకుండా ఇల్లిల్లు తిరిగి గాలింపు చర్యలు చెపట్టడం చూసి “మళ్ళీ ఎదో ముంచుకొచ్చినట్టుంది” అన్నారొకరు.
“అన్నలు గిల్లా వచ్చిండ్లని కావచ్చు” అన్నాడు మరొకరు.
“అన్నలు వస్తే మీటింగ్ పెట్టేవాళ్ళుకదా! నిన్న మొన్న ఏ మీటింగ్ జరుగలేదు.”
“ఏదో అనుమానం మీద వచ్చినట్టుంది.”
“చూడబోతే గట్లనే ఉన్నది” అన్నారు మరొకరు.
అప్పటికే బ్యాచీలు బ్యాచీలుగా విడిపోయిన పోలీసులు తమ చేతిలో ఉన్న ఆధునిక ఆయుధాలను ఎక్కుబెట్టి భయం భయంగా అడుగులు వేస్తూ ఊరిలో ఒక్కొక్క ఇంటినే వెతకసాగిండ్లు…. అనుమానం వచ్చిన వారిని స్కూలుగ్రౌండుకు తరలిస్తున్నారు.
నిప్పుతొక్కిన కోతిలా స్పెషల్ ఆఫీసర్ గంగాధర్ ఆడికి ఈడికి తిరుక్కుంటూ అక్కడ ఇక్కడ అంటూ హుకుం జారి చేస్తున్నాడు… ఇంత చేసినా అనుకున్న ఫలితం రాకపోయ్యే సరికి అసహనం చెందసాగిండు.
“మనకు వచ్చిన ఇన్‍ఫర్మేషన్ కరెక్టెనా” అంటూ సర్కిల్ మీద అరిచిండు.
“కరెక్టే సార్”
“అయితే వచ్చివాడు ఎటుపోయిండు” అన్నాడు గయ్య్మని.
సర్కిల్ మౌనం వహించిండు.
దాదాపు రెండు గంటలసేపు పోలీసులు హడావిడి కొనసాగింది. అప్పటికే చికటి కమ్ముకున్నది. కాస్త దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించనంత చీకటిని చూసే సరికి గంగాధర్‍కు ఎంతకైనా తెగించినోళ్ళు అని భయం పట్టుకున్నది. దాంతో ఆయనకు ఏదైనా జరుగకూడదని జరిగితే ఎట్లా అన్న ఆందోళన మొదలైంది. దాంతో ఆయన గాలింపు చర్యలు నిలిపి వెయ్యాలని ఆదేశించి ఎక్కువ ఆలస్యం చేయ్యకుండానే తన బలగాలతో వెనక్కి మళ్ళిండు.
***
ఊరి చివరన ఉన్న శ్మశాన వాటికకు చేరుకున్న వాళ్ళు, దింపుడు కళ్ళం కాడ శవాన్ని దింపిండ్లు… మాదిగ డప్పు చప్పుళ్ళు ఆగినవి… అంతవరదాక ఏడుస్తున్న వాళ్ళు కూడా ఏడుపు అపి చుట్టు మూగిండ్లు.. చిక్కటి చీకటి అవరించింది. ఊరి అంచున ఉన్న అడివి మరింత చీకటిగా ఉంది. దింపుడు కళ్ళంకాడ దించిన శవం కట్లు విప్పిండ్లు. శవం లేచి కూచున్నది.
“అన్న ఇప్పుడిక ఏం భయంలేదు… నాల్గు అడుగులు వేస్తే అడివిలో పడుతరు. ఇదిగో సాయిలు, మల్లయ్య నీ వెంట వస్తరు” అన్నాడు సంఘ పెద్ద బక్కయ్య మొఖం విప్పారంగా.
నిర్భందం తీవ్రమైన తరువాత ఊరిలో సంఘం బహిరంగంగా పనిచేయలేని పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో ఊరి సంఘం బాధ్యతలు తీసుకున్న బక్కయ్య నీటిలో చాపలాగ ప్రజల్లో కలిసిపోయి నిర్భంద పరిస్థితిలోను శత్రువు కంటపడకుండా సంఘాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు.
పాడె నుంచి లేచిన “లక్మా” బక్కయ్య రెండు చేతులు పట్టుకొని చిర్నవ్వులు చిందిస్తూ “మొత్తానికైతే మంచి ఉపాయం చేసినవు” అన్నాడు కృతజ్ఞతపూర్వకంగా…
“దాందేమన్న పార్టీ లేకుంటే మా బ్రతుకు ఎక్కడిది. పార్టీ బ్రతికి ఉంటేనే మేం బ్రతికి ఉంటం… లేకుంటే ఈ దొంగ నా కొడుకులు మమ్ముల్ని బ్రతకనిస్తారా” అన్నాడు నిండుగా నవ్వుతూ…
ఎక్కువ ఆలస్యం చేయ్యకుండానే “లక్మా” సాయిలు, మల్లయ్య వెంటరాగా అడివి దారి పట్టిండ్లు.
చీకట్లో వాళ్ళు కనుమరుగు అయ్యే దాక చూసి సంతృప్తిగా వెనక్కి మళ్ళిండ్లు…
“బక్కన్న మొత్తానికైతే మంచి ఉపాయం చేసిండు లేకుంటే ఇవ్వాళ పెద్ద ప్రమాదం జరిగేది” అన్నారొకరు ఉండబట్టలేక…
“నాదేం లేదు.. అంత చింతకింది సారయ్య కొడుకు కిరణ్ మహిమ” అంటూ బక్కయ్య బోలగా నవ్విండు…
“అ పొరడా వాడేమి చేసిండే” అన్నారొకరు ఆశ్చర్యంగా…
“వాడు అడివిలో పశువులను మేపుతాంటే పోలీసులు దొంగ దొంగతనంగా ఊరి దిక్కు రావటం చూసిండు.”
“చూస్తే”
“ఇదేదో ప్రమాదంగా ఉందని – పశువులను వదిలేసి పరుగున ఉరికి వచ్చి నాకు విషయం చెప్పిండు. అప్పటికీ అన్నవచ్చి ఉండే ఏం చేసుడా అని ఆలోచన చేసిన” అన్నాడు నిండుగా నవ్వుతు…
“అయితే ఈ ఉపాయం చేసినవన్న మాట.”
“మరి ఏం చేసుడు అప్పటికే పోలీసులు ఊరును చుట్టుముట్టిండ్లు… వాళ్ళ కండ్లు కప్పి అన్నను బయటికి పంపించాలంటే ఇంతకంటే మార్గం కనిపించలే” అన్నాడు నిండుగా నవ్వుతు…