“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్నది గురజాడ కాలం నాటి మాటగా మిగిలిపోయింది. “దేశమంటే మతమేనోయ్, అందునా దేశ మంటే హిందూ మతమేనోయ్” అని కొందరు, “దేశమంటే మా కులమేనోయ్” అని మరికొందరు గొంతు చించుకుంటున్న కాలమిది. చిన్నప్పుడు స్కూల్లో “భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత” అని విన్నప్పుడు మన హృదయాలు గర్వంతో పొంగిపోయేవి. హైదరాబాద్ సంస్కృతి అంటే “గంగా యమునా తహజీబ్” అని భాష్యం చెపుతుంటే గొప్పగా ఫీలయ్యే వాళ్ళం. ఇప్పుడు భిన్నత్వం పట్ల అసహనం. ఇతర మతాల పట్ల ద్వేషం. ఇతర కులాల పట్ల చిన్నచూపు. మరీ ముఖ్యంగా దళితుల పట్ల, ఆదివాసీల పట్ల భరించరాని నిరాదరణ. ముస్లింలను ‘తురక’ అని గేలి చెయ్యకపోతే నీవు దేశ ద్రోహివే! కుల మత భావ జాఢ్యం ఆక్టోపస్ లా వ్యాప్తి చెందుతూ దేశం, ప్రజ, జాతీయత అన్న పదాలకు అర్థాన్నే మార్చేస్తున్న రోజులివి.
ఇటీవల వాణిజ్య సంస్థ ఒకటి, ఒక వ్యాపార ప్రకటనను విడుదల చేసింది. ఆ సంస్థ విడుదల చేసే వాణిజ్య ప్రకటనలు కొన్ని ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటాయని, అవి క్లిష్టమయిన సామాజిక సమస్యల నేపథ్యం తడుముతాయని పలువురి అభిప్రాయం. ఇటీవల విడుదల అయిన ప్రకటన కూడా అందుకు భిన్నమయినది కాదు. భిన్న మతాలకు, వివిధ ఆలోచనలకు, ప్రాథమిక వైరుధ్యాలు కలిగిన సిద్ధాంతాలకు నెలవైన సమాజంలో నివసిస్తున్న మనుషులుగా మనం ఎలా జీవించాలో ఆ ప్రకటనలో అంతర్లీనంగా ఒక సూచన ఉంది. అది నగలకు సంబంధించిన ఒక ప్రకటనే కావచ్చు. ధనిక సమాజంలో స్త్రీల ఆడంబరాలు, సంపద, అలంకరణలపై ఉండే మోజును వ్యక్త పరచే అంశాలు అందులో ఉండవచ్చు. కాని, ఒక హిందూ మహిళ మానవత్వం పెల్లుబికే ఒక ముస్లిం కుటుంబానికి కోడలిగా వెళ్లడం అనే ఒక సెక్యులర్ భావన పునాదిగా ఆ ప్రకటన రూపొందించబడ్డది. ముస్లిం మతస్తురాలయిన అత్త గారు తన హిందూ కోడలు గర్భవతి అయినప్పుడు, హిందూ ఆచారం ప్రకారం సీమంతం చేయడం చుట్టూ ఆ నగల ప్రదర్శన అల్లబడి ఉంటుంది. ముస్లిం సాంప్రదాయంలో ఈ సీమంతాలు, ఇలా చేయడాలు లేవు కదా అని కోడలు అడిగితే ఆచారాలకన్నా, సాంప్రదాయాలకన్నా కూతుళ్ళ సంతోషాలే ముఖ్యం కదా అని సమాధాన మిస్తుంది ఆ ముస్లిం స్త్రీ.
ఇందులో ఒక మానవతా సందేశం ఉంది. అది మాత్రమే కాదు, మతాంతర వివాహం అంటే ఖచ్చితంగా పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. స్త్రీ, పురుషులిద్దరూ ఇష్టపడి ఏర్పరచుకొన్నబంధం. అందులో స్త్రీ తన జీవితాన్ని గురించి తన ఆలోచన, తన ఇష్టము, తన నిర్ణయం ఉంటుంది. ఇట్లా తన ఇష్టా అయిష్టాలను తన వివాహం విషయంలో తన నిర్ణయాన్ని అమలు పరుచుకునే స్వాతంత్రం హిందూ సమాజంలో గాని, ముస్లిం సమాజంలో గాని చాలా అరుదుగా ఉంటుంది. స్త్రీ ల విషయంలో అది గగనమే. ఆ సమున్నత నాగరిక భావాన్ని ఎత్తి చూపుతోంది ఆ వాణిజ్య ప్రకటన.
ఇక్కడే , హిందూ చాందస వాదుల అరాచకత్వం రెక్క విప్పుకుంది. ఈ వాణిజ్య ప్రకటన “లవ్ జిహాద్”ను ప్రోత్సహించేట్టుగా ఉందని విరుచుకు పడ్డారు. ఒక హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ముస్లిం కుటుంబం వారిని సాదరంగా ఆహ్వానించడం, వివాహం అయి అత్తారింటికి వచ్చినా తమ కోడలు తన మత స్వేచ్ఛను అనుభవించే లౌకిక సాంప్రదాయం ఆ ముస్లిం కుటుంబం లో ఉండడం… ఈ విషయాలను హిందూ మత వాదులు జీర్ణించుకోలేకపోయారు. సామాజిక మాధ్యమాలలో ఆ వ్యాపార ప్రకటన పై, ఆ వ్యాపార సంస్థ పై విరుచుకు పడ్డారు. గుజరాత్, మధ్యప్రదేశ్ లలో ఆ సంస్థ కార్యాలయాలలోకి, షో రూమ్ లలోకి దూసుకు వచ్చారు. ఆ సంస్థ ప్రకటనా విభాగం లో ఒక ముస్లిం పనిచేస్తున్నాడని, అతని నివాస ప్రదేశం ఫలానా అని, ఆయన కుటుంబ వివరాలు ఇవీ అని, ఆయన్ను ఏం చేస్తారో మీ ఇష్టం అనీ సోషల్ మీడియా లో విస్తృతంగా విరుచుకు పడ్డారు. ఆ సంస్థ హిందువులందరికి క్షమాపణ చెప్పాలని షో రూమ్ ల ముందు పోస్టర్ లు అతికించారు. ఆ వాణిజ్య సంస్థకు, ఆ మాటకొస్తే ఏ వాణిజ్యసంస్థ కైనా, వ్యాపారం ముఖ్యం కాబట్టి , అందులో పనిచేసే సిబ్బంది భద్రత దృష్ట్యా ఆ వ్యాపార ప్రకటనను ఉపసంహరించుకొంది. ఐదువందల మంది ఎనిమిది వందల దాకా ఉన్న చిన్న సమూహం ఒకటి 1200 నుండి 1800 ట్వీట్ లు సామాజిక మాధ్యమంలో ప్రచారం లో పెడితే, అది ఒక సంస్థ లో ‘భయానక వాతావరణం’ ఏర్పడడానికి కారణం అయితే, భారత సమాజం లో మనిషికి మనిషికీ మధ్య సంబంధాలు ఎంత బహీనంగా ఉన్నాయో, సామాజిక వ్యవస్థ ఎంత శక్తిహీనంగా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
కొన్ని సంవత్సరాలక్రితం, “తన భోజనాన్ని ముస్లిం ల ద్వారా పంపవద్దు” అని ఓ ఖాతాదారుడు ఫిర్యాదు చేస్తే ఇళ్లకు భోజనాలు, తిండి పదార్థాలు బయటి హోటళ్ళనుండి సరఫరా చేసే ఓ ప్రయివేటు సంస్థ జుమాటో (zumato) “ఆహారానికి మతం ఉండదు” అని ఖరాఖండి గా సమాధానమిచ్చింది. ఆనాటి పరిస్థితులు ఈనాడు లేవు. జుమాటో సంస్థ ఆనాడు అంత ఘాటుగా సమాధానం చెప్పగలిగింది కాని, కోవిడ్ బాధితులకు 1500 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన టాటా సంస్థలు కూడా హిందూ ముస్లిం ల మధ్య వైవాహిక సంబంధాలను ప్రదర్శించిన తనిష్క్ నగల వ్యాపార ప్రకటనను ఉపసంహరించుకోక తప్ప లేదు. అవీ ఈనాడు ఉనికి లో ఉన్న సామాజిక స్థితి గతులు. దీనికి కారణం నేడు భారత ప్రజలను పాలిస్తున్న పాలక పార్టీ కి లౌకికవాదం పట్ల ఉన్న అనాదరణ యే కారణం. అమెరికా దేశం లోని ‘అంతర్జాతీయ సంయుక్త రాష్ట్రాల మత స్వేచ్ఛా స్వాతంత్రాల పరిరక్షణా సంఘం’ 2019 వ సంవత్సరం భారతదేశం లో మతసామరస్యం అత్యల్ప స్థాయికి దిగజారిపోయిందని తమ 2020 వ సంవత్సరపు నివేదిక లో పేర్కొంది (https://bit.ly/3dPcK86 ; https://bit.ly/34psrju). ఆ నివేదిక భారతదేశం లో మతసామరస్యాన్ని గురించి ఇలా వ్యాఖ్యానించింది: ” 2019 లో ఇండియా లో మతస్వేచ్ఛ తిరోగమన దిశలో పడిపోయింది. పార్లమెంటరీ మెజారిటీ ని ఆసరా చేసుకొని జాతీయ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మత స్వేచ్ఛ ను, మరీ ముఖ్యం గా ముస్లింల విషయం లో, హరించే చర్యలకు పూనుకుంది”.
మైనారిటీ ముస్లిం మతాన్ని ఆచరిస్తున్న వారి పట్ల హిందూ మత పెద్దల వైఖరి ఈ రకంగా ఉంటే, మరొక ప్రక్క నిచ్చనమెట్ల రీతిలో ఉన్న హిందూ కుల వ్యవస్థ భయంకరంగా జడలు విప్పుకొని నృత్యం చేస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీకి 200 కి.మీ. దూర లో ఉన్న హథ్రాస్ జిల్లా (ఉత్తరప్రదేశ్) లోని బుల్ ఘడ్ గ్రామంలో సెప్టెంబర్ 14 న దళిత వాల్మీకి కులానికి చెందిన 19 ఏళ్ళ మానీషాను పట్టపగలు పంటచేలలో నాలుక తెగ్గోసి, నడుం విరిచేసి ఠాకూర్ అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అయిదు రోజులు గ్రామంలో బలాదూర్ గా తిరిగారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ అమ్మాయి చావు బతుకుల్లో ఉందని బయటికి విషయం పొక్కి నిరసన పొగలు తీవ్రమయ్యేసరికి ఆ నలుగురిని అరెస్ట్ చెయ్యక తప్పలేదు పోలీసులకు. చివరకు ఆ అమ్మాయి పక్షం రోజులు యాతన అనుభవించి సెప్టెంబర్ 29 న కన్నుమూసింది. ఊహకందని దారుణ హింస కు గురైన ఆ బాలిక తనను ఆ నలుగురు అత్యాచారం చేశారని, ప్రతిఘటించబోతే నాలుక తెగ్గొసారని, తీవ్రమైన శారీరక హింసకు గురిచేశారని మరణ వాగ్మూలం లో పేర్కొన్నా, సంఘటన జరిగిన వారం రోజులకు వైద్య పరీక్షలు చేయించి ఆమె పై అత్యాచారం జరగలేదని పోలీసులు ప్రకటించారంటే ఈ వ్యవస్థలో ఆధిపత్య శక్తులు మనువాదాన్ని అమలు పరచటానికి ఎంత నిబద్దులై ఉన్నారో అర్థమవుతున్నది. మనువాదంలో అంతే కదా, ఒక తప్పు ను దళితుడు చేస్తే శిరచ్చేదం దాకా శిక్ష ఉంటుంది. అదే తప్పును అగ్రకులస్తుడు చేస్తే అభిశంసన తో సరిపెడతారు. అసలు అత్యాచారమే జరగలేదంటే సమస్యనే లేదుకదా! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల, ఆ రాష్ట్రపు పోలీసు యంత్రాంగం పట్ల దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన చల్లారకముందే మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక అత్యాచారం వ్యాజ్యంలో నిందితుడికి, బాధితురాలు భయం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా, బెయిలు మంజూరు చేసింది. బెయిలు ఇస్తూ ఆ అగ్రవర్ణ నిందుతుడికి న్యాయమూర్తి ఓ షరతు విధించాడు. రేప్ కు గురి అయిన ఆ అమ్మాయి ఇంటికి ఆయన తన భార్యతో పాటు వెళ్లి ఆమె తో రాఖీ కట్టించుకోవాలట. ఈ విచిత్రమయిన బెయిలు తీర్పు ను నిరసిస్తూ తొమ్మిదిమంది మహిళా అడ్వకేట్లు సుప్రీం కోర్టులో కేసు వేస్తే ఈ సంఘటన వెలుగు చూసింది.
మహిళల పై అత్యాచారాలకు సంభందించి కళ్ళు చెదిరిపోయే గణాంకాలు దర్శనమిస్తాయి. ప్రతిరోజూ సగటున దేశంలో ఎనిమిది మంది ఎస్సీ మహిళల పైనా, ముగ్గురు ఎస్టీ స్త్రీ ల పైన అత్యాచారం జరుగుతున్నదని ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. ఇవి పోలీసు లకు రిపోర్ట్ కాబడినవి. పోలీసుల దాకా వెళ్లని సంగతులు ఎన్నో లెక్క తెలియదు. ఈ సంవత్సరం (2020) అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 15 వరకు వారం రోజులలో ఉత్తరప్రదేశ్ లో 13 మంది మహిళలు మానభంగానికి గురయ్యారట. అందులో కొంతమంది అత్యాచారం తర్వాత హత్య చేయబడితే, మరికొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కులరక్కసి మరో వికృత రూపం “పరువు హత్యల” ముసుగున కరాళనృత్యం చేస్తున్నది. హంతకులకు సమాజం లో ఓ స్థాయి కలిపించే హీనచతురత తో మీడియా వీటికి “పరువు హత్యలు” అని నామకరణం చేసింది కాని, అవి అత్యాచారం చేసి స్త్రీ లను హత్యచేసినంత దారుణమయినవే. రెండేళ్ల క్రితం తెలంగాణాలోని మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్ అన్న దళిత యువకుడు నడి రోడ్డు మీద అందరు చూస్తుండగానే ఓ ఆసుపత్రి ఎదురుగా దారుణ హత్యకు గురయ్యాడు. అమృత, ప్రణయ్ లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అది వైశ్య కులానికి చెందిన మారుతీరావు కు నచ్చలేదు. కిరాయి హంతకులను పురమాయించి ప్రణయ్ ను గొడ్డలితో నరికించి చంపించాడు. ఈ సంఘటనలో మరింత దారుణమయిన సామాజిక వికృత కోణం బయట పడ్డది. ఆ హత్య ను సమర్థిస్తూ, తన కూతురి భర్తనే దారుణంగా హత్య చేయించిన మారుతీరావు ను హీరో ను చేస్తూ “మారుతీరావు అభిమాన సేన” అన్న ఒక సంస్థ ఏర్పడ్డది. ఇది సమాజ గమనానికి ఒక క్వశ్చన్ మార్క్. ఈ రెండేళ్లలో ఇలాంటి సంఘటనలు మరికొన్ని జరిగి ఉండవచ్చు. కాని రెండేళ్ల తర్వాత పత్రికలు, మీడియా పతాక శీర్షికలతో ప్రజల దృష్టి కి తెచ్చినది హైదరాబాద్ లో హేమంత్ హత్య. పాత్రలు వేరు. కాని కథనం ఒక్కటే. అవంతి, హేమంత్ ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకున్నారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, ఆయన బంధువులు కలిసి హేమంత్ ను హింసించి చంపేశారు. కారణం కులాలు వేరు వేరని.
ఇదీ ఈనాటి విషాద భారతం. దీనికి నానాటికీ పెచ్చరిల్లి పోతున్న హిందూత్వమే కారణమా? ప్రచ్ఛన్నంగా విస్తరిస్తున్న మనువాద ఫలితమేనా? అణగారిన వర్గాలపై ఈ దారుణ మారణ కాండ, కులాల మాటున దురాగతాలు ఆగేదెట్లా?
సామాజిక అస్తవ్యస్తతలపై నిరంతరం స్పందిస్తూ చైతన్య వంతమైన వ్యాఖ్యలను బలంగా వినిపిస్తున్న మిత్రులు అర్విణి రాజేంద్ర బాబు గారికి అభినందన వందనాలు….
In English translated version, pl