పోలిష్ కవి అనా స్వర్ 1909 లో వార్సా లో జన్మించింది. తన తండ్రి ఒక పెయింటర్. అతని స్టూడియో లోనే తన బాల్యం గడిచింది. తన నగరాన్ని నాజీలు ఆక్రమించినప్పుడు, జరిగిన ప్రముఖ 63 రోజుల వార్సా తిరుగుబాటు లో పాల్గొన్నది. అప్పుడు ఏర్పాటు చేయబడ్డ అనేక ఆసుపత్రుల ఒక దానిలో తానూ సైనిక నర్స్ గా పనిచేసింది. ఎలాగోలా తనపై విధించిన మరణశిక్షను తప్పించుకుంది. క్రూరమైన యుద్ధ మృత్యువు పడగనీడలనుండీ తప్పించుకోగలిగింది. కానీ తన అనుభవాలను 1974 దాకా రాయలేకపోయింది. అనా ఒక గొప్ప కవి, రచయితా, స్త్రీవాది కూడా. చిన్న పిల్లల కోసం అనేక పుస్తకాలూ రాసింది. అనా 1984 లో కాన్సర్ తో మరణించింది. చిన్న చిన్న పదాలతో సంక్లిష్టత కు ఏమాత్రం తావులేకుండా తన జీవితానుభవాలను ప్రతిబింబించిన అనా కవిత్వం చాలా పదునైంది. శక్తివంతమైనది.
నాకు అగ్ని అంటే భయం
ఎందుకో నాకు చాలా భయం
మండుతున్న ఈ వీధిలో పరిగెత్తడం
నిజానికి ఇక్కడ మనుషులెవరూ లేరు
నింగికెగుస్తున్న మంటలు తప్ప
పోనీ పెద్ద బాంబు మీద పడిందా అంటే
అదీ కాదు
మూడు అంతస్తులు కుప్ప కూలిపోయాయంతే
సంకెళ్లు తెంచుకున్న నగ్నమైన మంటలు నాట్యం చేస్తున్నాయి
కిటికీ రంధ్రాల నుండి చేతులు చాస్తూ
నగ్నజ్వాలలమీద నిఘావేయడం పాపం
స్వేచ్ఛజ్వాలల సంభాషణ ను రహస్యంగా వినడం పాపం
నేనా సంభాషణ నుండి దూరంగా పారిపోతాను
అది ఈ భూమ్మీద మనుషుల మాటల కంటే
చాలా ముందే
ప్రతిధ్వనించింది
తలుపుల గుండా సంభాషణ
ఉదయం ఐదు గంటలకు
నేను అతని తలుపు తట్టాను
తెరవని తలుపుల ముందు నుండే
నేనన్నాను:
‘స్లిస్కా వీధి దవాఖాన లో
నీ కొడుకు, సైనికుడు
మరణశయ్యపై ఉన్నాడు.’
అతను తలుపుకున్న గొలుసు తీయకుండానే
సగం తెరిచాడు
వెనక వణికిపోతూ
అతని భార్య
‘నీ కొడుకు వాళ్ళ అమ్మ కోసం పలవరిస్తున్నాడు
రమ్మంటున్నాడు ‘
అన్నాన్నేను.
అమ్మ రాదు అన్నాడతను
అతని వెనక భార్య వణికిపోతోంది
‘అతనికి వైన్ ఇవ్వొచ్చ న్నాడు డాక్టర్ ‘
అన్నాన్నేను
ఒక నిమిషం ఆగు అన్నాడతను
తెరిచీ తెరవని తలుపు గుండా
ఒక వైన్ సీసా నాకందించాడు
తలుపుకు తాళం వేసాడు
రెండు సార్లు
తలుపు వెనక అతని భార్య
అరుస్తోంది పెద్దగా
ప్రసవ వేదన పడుతున్నట్టు
మేము బతికిపోయాం
పోస్ట్ మార్టం ఐన
శరీరపు గాయాల కుట్ల నుండి
అతను బయలు దేరి వచ్చి
నా పక్కన నిలబడతాడు
తన బూడిద రంగు స్వెటర్ లో
వినమ్రంగా వంగి,
బలంగా.
అతనెవరికీ కనబడడు
నేనే తనవంక చూస్తాను.
అప్పుడంటాడు నెమ్మదిగా:
మేము బతికిపోయాము
పెళ్లినాటి తెల్లటి చెప్పులు
రాత్రి పూట
మా అమ్మ అల్మారా తెరిచి
తన పెళ్ళినాటి తెల్లటి సిల్క్ చెప్పుల్ని
బయటకు తీస్తుంది.
వాటిపై చాలా సేపు ఇంకు పూస్తుంది
నిదానంగా.
పొద్దున్నే వాటినేసుకుని
వీధిలోకి నడుచుకుంటూ వెళ్ళింది
రొట్టె కోసం లైన్ లో నిలబడడానికి .
బయట ఎముకలు కొరికే మైనస్ 12 డిగ్రీల చలిలో
మూడు గంటలు నిలబడింది
వీధిలో, లైన్ లో.
వాళ్ళు ఒక్కొక్కరికి
పావు బ్రెడ్డు ముక్కలందిస్తున్నారు.
నా తలను గోడకేసి బాదుకున్నా
చిన్నతనం లో
నా వేలు నిప్పుల్లో పెట్టా
ఒక యోగి కావడానికి
టీనేజర్ లా
ప్రతిరోజూ
నా తలను గోడకేసి బాదుకున్నా
నవయవ్వనం లో
మా ఇంటి అటక కిటికీ లోంచి
పైకప్పు మీదికెక్కా
దూకడానికి
నేను స్త్రీ గా ఉన్నప్పుడు
నా శరీరం నిండా పేలు.
నా స్వెటర్ ని ఇస్త్రీ చేసేటప్పుడు
కరకర లాడుతూ చిట్లిపోయేవవి
నేను ఉరితీయబడడానికి
అరవై నిమిషాలెదిరి చూసాను.
ఆరేళ్ళు ఆకలితో నకనకలాడాను.
తర్వాత నన్నో పిడుగు చంపేసింది
మూడుసార్లు
నేనెవరి సాయం లేకుండా చావులోంచి పైకి లేచాను
మూడు సార్లూ
మూడు పునరుద్ధానాల తర్వాత
నేనిప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నా.
Great poetry.. great translation
poems chala touching vunnayi
Nice poems
Thank you so much
lovely translation.. though i dint read the original, i feel the beauty in these translations.
Thank you Srinath garu