”మన జిల్లా కమిటీ ఏరియాలో ఐదుగురు అమ్మాయిలు పెళ్లికాని వారున్నారు. అందులో ఎవరినైనా ‘పెళ్లి చేసుకునే ఉద్దేశముందా’ అని అడగ్గలం కానీ, ఉర్మిళను మాత్రం అడగలేం.” స్క్వాడ్ ఏరియా కమిటీ (సాక్) సభ్యుల మీటింగ్‌లో బలరాం అన్నాడు.
బలరాం జిల్లా కమిటీ సభ్యుడు. మీటింగ్‌లో సంపత్ పెళ్లి గురించిన అంశం చర్చకు వచ్చింది. అందుకే బలరాం ఆ మాట అన్నాడు.
ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటామని చెప్తే ఫర్వాలేదు. అట్లా చెప్పలేని వారి గురించి పై కమిటీ సభ్యులు పట్టించుకుని అతడి/ఆమె మనస్తత్వానికి తగిన వారిని చూస్తారు. జిల్లా కమిటీ సభ్యులు జిల్లాలోని దళాలన్నిటిల్లోనూ తిరుగుతారు కాబట్టి అందరి గురించి తెలిసి ఉంటుంది. పైకమిటీ వారు సూచించిన సందర్భాల్లో ఇద్దరికీ ఇష్టమైతే పెళ్లి జరుగుతది. లేదంటే లేదు.
ప్రేమిస్తున్నామని అమ్మాయిలతో అబ్బాయిలు డైరెక్టుగా చెప్పొద్దనే తీర్మానం ఉన్నదని విన్నప్పుడు దీపకు ఎంత ఆశ్చర్యమేసిందో. ఇదో రకమైన ‘కట్టుబాటు’గానే అనిపించింది. ‘కట్టుబాట్లు’ బయటే అనుకుంటే లోపల కూడానా?
పంతొమ్మి వందల తొంబైలలో దళాల్లో అమ్మాయిల సంఖ్య తక్కువ. అబ్బాయిలు ఎక్కువ. పెళ్లి చేసుకోవాలనుకునే ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది అబ్బాయిలు వెళ్లి సదరు అమ్మాయితో ”నిన్ను ప్రేమిస్తున్నా”నని చెప్తే ఆమె పరిస్థితి ఏమిటి? ఎంత కాదనుకున్నా ఆమెపై వీరి ప్రభావం పడుతుంది. తను దళంలో చురుగ్గా పనిచేయలేని పరిస్థితి, ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతది. అరదుకే ఈ ‘కట్టుబాటు’ అని తర్వాత అర్థమైంది. ఈ విధానం వల్ల సమస్యంతా పరిష్కారమవుతుందని చెప్పలేం. అమ్మాయిలు ధైర్యంగా తమ అభిప్రాయాలను చెప్పగలిగినప్పుడు, అలాంటి పరిస్థితులను ఎదుర్కోగలిగినప్పుడు ఈ ‘కట్టుబాటు’ అవసరమే ఉండకపోవచ్చు. అంతవరకు కొంతమేరకైనా ఇది అమ్మాయిలకు ‘రక్షణే’ అనిపించింది. మహిళా కామ్రేడ్స్ ఎదుగుదల సాఫీగా ఉండటానికి ఇది ఉపయోగకరంగా ఉంది అనిపించింది. ఈ ‘కట్టుబాటు’ అబ్బాయిలకు మాత్రమే.
అమ్మాయి కనుక ఒకబ్బాయిని ఇష్టపడితే చెప్పే స్వేచ్ఛ ఉంది. అంతేకాదు, దళంలోకి వచ్చిన ఏడాది తర్వాతే పెళ్లి ముచ్చట ఎత్తాలి – అది అమ్మాయి అయినా సరే.
పురుష కామ్రేడ్ అమ్మాయిని ఇష్టపడితే కమాండర్‌కు లేదా జిల్లా కమిటీ సభ్యుడికి చెప్పాలి. అలాగే సంపత్ కూడా చెప్పాడు జిల్లా కమిటీ సభ్యుడికి – పక్క దళం నుంచి క్యాంపుకు వచ్చిన సోనీతో ప్రేమలో పడ్డానని.
సోనీ దళంలోకి వచ్చి రెండేండ్లు దాటుతోంది. సంపత్ వచ్చి దాదాపు మూడేండ్లు అవుతుంది. సంపత్ చురుకైన యువకుడు. క్రమశిక్షణతో ఉంటాడు. ఏ పని చెప్పినా ‘చెయ్యను, చెయ్యలేను’ అని ఏ కారణమూ ఎన్నడూ చెప్పి ఎరుగడు. ఎంత కష్టమైన పని అయినాసరే చేసుకురావడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. ఎన్ని సెంట్రీలు వేసినా చేస్తాడు. అతడి పట్ల మా దళానికంతటికీ అభిమానం. అనారోగ్యంగా ఉన్నా కూడా చెయ్యలేను అనే మాట అతని నోటి నుంచి రాదు. ఎదుటివాళ్లు అతని పరిస్థితి అర్థం చేసుకుని పని ఒప్పజెప్పకుండా ఉండాల్సిందే. ఒక్క క్రమశిక్షణే కాదు, రాజకీయంగా తనను తాను మెరుగు పర్చుకోవడానికి సమయం చిక్కినప్పుడల్లా పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. తనకు వచ్చిన సందేహాలను రాసుకుని అడుగుతాడు.
సంపత్ దళంలోకి వచ్చే నాటికే ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. సోనీ ఏమీ చదువుకోలేదు. దళంలోకి వచ్చి చదువు నేర్చుకున్నది.
అభూజ్మాడ్లో రామకృష్ణ మిషన్ వాళ్లు అక్కడక్కడ స్కూళ్లు పెట్టడం వల్ల ఆ మాత్రమైనా చదువుకోగల్గుతున్నారు. సంపత్ కూడా రామకృష్ణ మిషన్ స్కూళ్లోనే చదువుకున్నాడు.
జిల్లా కమిటీ సమావేశం మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి జరుగుతుంది.
సంపత్ తన మనసులోని మాట చెప్పాక బలరామ్ జిల్లా కమిటీ సమావేశానికి వెళ్లేసరికి రెండు నెలలు దాటింది. ఈలోగా సోనీ… కమాండర్ ప్రభాకర్‌తో తన ఇష్టాన్ని ప్రకటించింది. కమాండర్ మనసులో ఉన్నది కూడా అదే. ఒకే దళంలో ఉండటం వల్ల ఒకరినొకరు పరిశీలించుకోవడానికి అవకాశాలు ఎక్కువ.
తన దళ సభ్యుల బాగోగులను, వాళ్ల అవసరాలను, అనారోగ్యాలను, రోజువారీ పని విభజన… కమాండర్ చూసుకోవాలి. సహజంగా సోనీ, ప్రభాకర్‌లు మాట్లాడుకునే సందర్భాలు ఎక్కువ. ప్రభాకర్ నోటితో తన ఇష్టాన్ని చెప్పకపోయినా ఆమె పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. బహుశా అది సోనీకి అర్థమై ఉంటుంది. అందుకే ఆమె తన మనసులోని మాటను బయటపెట్టగలిగింది.
జిల్లా కమిటీ మీటింగ్‌లో సంపత్ విషయం చెప్పాలనుకున్నాడు బలరామ్ . అంతకంటె ముందే ప్రభాకర్, సోనీల పెళ్లి గురించి మరో జిల్లా కమిటీ సభ్యుడు కేశన్న చెప్పాడు. సంపత్ ప్రేమ విషయం చెప్పినా ప్రయోజనం లేదు కాబట్టి బలరామ్ గమ్మున ఉండిపొయ్యాడు.
జిల్లా కమిటీ మీటింగ్ నుంచి వచ్చిన బలరామ్… తనకు ఏమైనా చెప్తాడని ఆశగా ఎదురుచూశాడు సంపత్. ఏం చెప్తాడో అని చాలా టెన్షన్ కూడా పడ్డాడు. జరిగిన విషయం చెప్పాలంటే బలరామ్కూ ఇబ్బందిగానే ఉన్నది. కానీ చెప్పక తప్పదు. మీటింగ్ నుంచి వచ్చిన మూడు రోజులకు సంపత్‌ని పిలిచి సోనీ, ప్రభాకర్‌ల పెళ్లి విషయం చెప్పాడు. ”మీరు వెంటనే తెలియజేసి ఉంటే సోని నన్నే చేసుకుని ఉండేది.” అని చాలా బాధ పడ్డాడు సంపత్. నిజమే అయ్యి ఉండవచ్చు. కానీ వెంటనే తెలియజేసే మార్గం లేకపోయింది.
ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తుంది. ఇక పెళ్లి ఊసెత్తలేదు సంపత్. కానీ, సాక్ మెంబర్స్ సంపత్ పెళ్లి గురించి మీటింగ్‌లో ప్రతిపాదన చేశారు. అందువల్లనే సంపత్‌కు తగిన అమ్మాయిలు ఎవరెవరున్నారో చెపుతూ ”ఉర్మిళను మాత్రం అడగలేము” అని అన్నాడు బలరామ్.
వీరిద్దరి జంట చాలా బాగుంటుంది. వీరు అనుకోగానే కాదు కదా, ఇద్దరికీ నచ్చాలి.
ఉర్మిళ మహిళా సంఘంలో పని చేసి వచ్చింది. దళంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు దాటుతోంది. తనూ, కష్టం చేయడంలో, క్రమశిక్షణలో సంపత్‌కు తీసిపోదు.
దక్షిణ బస్తర్ నుంచి ఉత్తర బస్తర్‌కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. అక్కడి ఆచార వ్యవహారాలకు, ఉత్తర బస్తర్‌కు తేడా ఉంటుంది. దక్షిణ బస్తర్ కొంత డెవలప్డ్ ప్రాంతం.
చిన్నప్పటి నుంచి కూడా వాళ్ల ఊరికి దళం వస్తే అక్కడి నుంచి కదిలేది కాదు ఉర్మిళ. రానురాను మహిళా సంఘంలో చాలా యాక్టివ్ మెంబర్ అయింది. రేంజ్ కమిటీ అధ్యక్షురాలుగా ఎదిగింది. దళం అప్పజెప్పిన పనులను మహిళా సంఘం తరఫున నిర్వహించడానికి రోజుల తరబడి ఇంటికి కూడా వెళ్లేది కాదు. తల్లిదండ్రులు గొడవ చేసినా పట్టించుకునేది కాదు.
ఇంటి దగ్గర ఉండకుండా ఊర్లు పట్టుకుని తిరగడానికి మరో కారణం కూడా ఉంది. తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేద్దామని చూశారు. ఉర్మిళ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా చేసేవారే కానీ, పార్టీ ప్రభావం బలంగా ఉండటం వల్ల, అదీగాక ఉర్మిళ మహిళా సంఘం సభ్యురాలుగా ఉండటం వల్ల ‘దాదా’లు ఏమన్న అంటరని భయంతో ఊరుకున్నారు. అయినప్పటికీ పెళ్లి ప్రయత్నాలు మానుకోలేదు వాళ్లు. అమ్మాయి అందమైనది. ఎంత అంతమైనది అంటే పిక్కలు గట్టిగా ఉంటాయి. దండచెయ్యి కండరాలు ఇనుప కడ్డీల్లా ఉంటాయి. చూడగానే కష్టబోతు అని అర్థమవుతది. ఇంత కంటే అందమేముంటుంది. పెళ్లి చేస్తే కన్యాశుల్కం కూడా ఎక్కువే వస్తది. ఇంట్లో వాళ్ల పెళ్లి ప్రయత్నాలు ఉర్మిళకు తెలుస్తూనే ఉన్నాయి. దళాన్ని కలిసిన ప్రతీసారి ”ఇంకా ఎన్ని రోజులు సంఘంలో తిరగాలి? దళంలోకి ఎప్పుడు తీసుకుంటారు” అని అడిగేది. తను యాక్టివ్ మెంబర్ కాబట్టి సంఘంలో ఉంచి పని చేయిస్తేనే ఎక్కువ ఉపయోగమని దళం భావించింది. కానీ చివరికి దళంలోకి రిక్రూట్ చేసుకోకతప్పలేదు.
”ఉర్మిళను ఎందుకు అడగలేరు?” అడిగారు – సాక్ సభ్యులు సునీత, మంగ్డులు. దీప ఆలోచనల్లో బయటికి వచ్చింది.
కమాండర్ భీమాల్, సాక్ సభ్యులు దీప, సుభాష్ కూడా ‘బలరాం ఏం చెప్తాడా’ అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
”ఎందుకు అడగలేము అంటే… దానికో పెద్ద కథ ఉన్నది.” అని ”లంచ్ టైం అవుతున్నది. వెళ్దామా” అన్నాడు బలరామ్. ఎవరైనా తొందర పడుతున్నారంటే దానిని నాన్చడం బలరామ్‌కు సరదా.
”అభ్యంతరం లేకపోతే చెప్పండి. మాకైతే ఆకలిగా లేదు” అన్నది తోటి సభ్యులను చూస్తూ దీప.
”ఆకలి అవడం లేదా మీకు?” మిగతా సభ్యులను అడిగాడు బలరాం.
అందరికీ ఆసక్తిగా ఉండటంతో ”ఓ అరగంట ఆగి తిందాము” అన్నారు.
ఇక తప్పేట్టు లేదని మొదలుపెట్టాడు బలరామ్.
”మహేశ్ మీకు తెలుసు కదా. అదే గఢ్చిరోలి నుంచి వచ్చిన కామ్రేడ్”
”ఆ తెలుసు.” అన్నారందరూ ఒక్కసారే.
మహేశ్ కూడా జిల్లా కమిటీ సభ్యుడు. అతని సహచరి ఎన్కౌంటర్లో చనిపోయింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఉత్తర బస్తర్‌కు వచ్చాడు.
”అతను ఉర్మిళను పెళ్లి చేసుకుంటానని మూడు నెలల కింద నాతో చెప్పాడు” అని కొద్దిసేపు ఆగాడు బలరామ్.
బలరాం బాటిల్ ఎత్తి గటగటా నీళ్లు తాగి ”ఉర్మిళను దగ్గర కూచోబెట్టుకుని ‘పెళ్లెప్పుడు చేసుకుంటావు ఉర్మిళా’ అని అడిగాను. ‘ఏం దాదా, ఎవరినైనా చూశారా’ అన్నది. చేసుకునే ఉద్దేశం ఉన్నదేమో అని మహేశ్ గురించి చెప్పాను.”
”ఏమన్నది?” బలరామ్ మాట పూర్తయ్యేలోగా దీప అడిగింది.
దీప ఆసక్తిగా అడగటానికి కారణం లేకపోలేదు. ఉర్మిళను పెళ్లి చేసుకుంటాననే ప్రస్తావన పండ్రు తెచ్చినప్పుడు ఆమె ఎట్లా రియాక్ట్ అయ్యిందో దీపకు తెలుసు. అప్పుడు దీప కూడా అదే దళంలో ఉన్నది.
పండ్రు ఉత్తర తెలంగాణ నుంచి వచ్చిన యువకుడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇంటర్ చదువుతుండగానే స్టూడెంట్ యూనియన్‌తో సంబంధాల్లోకి వచ్చాడు. డిగ్రీ ఫైనలియర్లో పార్టీలో ఫుల్‌టైమ్ సభ్యుడిగా రిక్రూట్ అయ్యాడు. అక్కడి నుంచి బస్తర్‌కు వచ్చాడు. కష్టపడతాడు. ఎవరైనా జబ్బు పడితే మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటాడు. కానీ, మాటల్లో దుడుకుతనం ఎక్కువ.
దళం నడిచీ నడిచీ వచ్చింది. ఎవరి కవర్లలో వాళ్లు కిట్లు దింపుకుని జిల్లీలు పరుచుకున్నారు. మసక చీకట్లు అలుముకుంటున్నాయి. తన జిల్లీలో కూర్చుని చెమటతో తడిచిన తలవెంట్రుకలను ఆరబెట్టుకుంటోంది ఉర్మిళ.
పండ్రు… ఉర్మిళ దగ్గరికి వెళ్లాడు. కొద్దిసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడి మనసులోని విషయాన్ని బయటపెట్టాడు.
”పెండ్లి చేసుకోవడానికి వచ్చినవా దళంలకు?” నెమ్మదిగానే కానీ సూటిగానే అన్నది. భయపడిపోయిన పండ్రు మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
పక్క జిల్లీలోనే కూర్చున్న దీప విన్నది. కానీ ఏమీ తెలియనట్టే ఉండిపోయింది. కమాండర్‌కు చెప్దామా అనుకున్నది. ఇంత ధైర్యంగా మాట్లాడిన ఉర్మిళనే చెప్తదిలే అనుకుంది దీప.
”ఆ చెంపా ఈ చెంపా వాయించినంత పని చేసింది” బలరామ్ అన్నాడు.
”ఏమి వాయించిందీ?” పాతది గుర్తుచేసుకుంటూ ఉన్న దీప సరిగా వినక మళ్లీ అడిగింది.
”ఏమన్నది. ఆ చెంపా ఈ చెంపా వాయిస్తన్నట్టుగా మాట్లాడింది.” మంగ్డు చెప్పి నవ్విండు.
ఉర్మిళ అంటే వీళ్లందరికీ కూడా అందరికీ అభిమానం. నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే స్వభావం అంటే దీపకు మరీ ఇష్టం.
అయినా మహేశ్‌కు ఉర్మిళను చేసుకోవాలన్న ఆలోచన రావడం చిత్రంగా అనిపించింది. ఉర్మిళకు ఇరవై ఏండ్లకు మించి లేవు. మహేశ్‌కు ముప్పై ఐయిదుకు ఎక్కువే గానీ తక్కువ ఉండవు. పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు కనీసం అమ్మాయి తరఫున ఆలోచించకూడదా? ఎంతో మంది యువకులు దళాల్లో ఉన్నారు. ఈడు జోడైన వారిని ఎంచుకుంటది కదా. తననెందుకు చేసుకుంటది? జిల్లా కమిటీ సభ్యుడు, బయటి నుంచి వచ్చిన వాడు కాబట్టి ఒప్పుకుంటది అనుకున్నాడా? కొన్ని సందర్భాల్లో ఇది అమ్మాయిలపై ప్రభావం చూపిన విషయం కాదనలేనిదే దీప ఆలోచిస్తోంది.
”ఎందుకంత కోపం. చేసుకోవాలనుకుంటే చేసుకుంటా అని చెప్పాలి. వద్దనుకుంటే వద్దని చెప్పాలి. పొగరు కాకపోతే” సునీత అన్నది.
ఉర్మిళ ఇప్పుడిలా మాట్లాడడానికి కారణం లేకపోలేదన్నట్టుగా ”అతకు ముందు పండ్రు కూడా ఉర్మిళను ఇష్టపడుతున్నానని నాతో చెప్పాడు.” బలరామ్ అన్నాడు.
తను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు ఉర్మిళ చెప్పిన సమాధానాన్ని దాచిపెట్టి, ‘కట్టుబాటు’కు లోబడి ఉర్మిళపై తన ఇష్టాన్ని బలరామ్ ఎదుట వ్యక్తం చేసాడన్నమాట! పండ్రు ‘కన్నింగ్’ అనుకుంది దీప..
”అడిగారా మరి” సుభాష్ అడిగాడు.
”ఆ…! అడిగిన. ఇప్పుడే చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది.”
”అవునా!” అన్నది దీప. దీన్నిబట్టి తన దగ్గర పండ్రు పెళ్లి ప్రస్తావన తెచ్చిన విషయాన్ని ఉర్మిళ కూడా బలరామ్‌తో చెప్పలేదన్నమాట. తనను ఇబ్బంది పెడితే చెప్దామనుకున్నదేమో.
ఈ విషయం జరిగేనాటికి దీప దళం మారింది. అరదుకని తెలియదు.
”ఇది జరిగి కూడా దాదాపు ఏడాది కావస్తుంది. కాబట్టి ఇప్పుడు మహేశ్ గురించి అడుగొచ్చులే అనుకుని అడిగిన.” బలరామ్.
”అడిగితే…” ఏదో తిట్టే ఉంటది అని మనసులో అనుకుంటూ అన్నాడు కమాండర్.
”అడిగితే ఏముంది… ‘ఊకూకె పెళ్లి మాట నా దగ్గర ఎందుకు తెస్తున్నరు? మొన్నా మధ్య పండ్రు గురించి అడిగిండ్రు. ఇప్పుడు మళ్లీ అడుగుతున్నరు.(బాత మైదె బారి బారి నావ యగ మర్మి పొల్లు తెత్తింతోర్్? అసాల్ వెన్నె పండ్రు బారి తాల్కితిరి. ఒసో ఇంజె వెన్నె)’ అన్నది. దాంతోటి ‘అప్పుడు అడిగితే ఇప్పుడే చేసుకోను అన్నవు కదా. అందుకని మళ్లీ అడిగిన’ నేను అన్నా” బలరామ్ చెప్పాడు.
”దానికి ఉర్మిళేమన్నది?” అందరిలోనూ ఉత్సుకత.
”ఏమన్నది… ‘నాకు శరీరం లేదా? నాకు కోరికలు ఉండవా? పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు రాదా? మీరు అడగాల్నా? ఇంటి దగ్గరా పెళ్లి పెళ్లి అని గోల. అక్కడి నుంచి తప్పించుకొని వస్తే మీరూ అదే గోల. నాకు ఇష్టమైతే నేనే వెళ్లి ఆ వ్యక్తికి చెప్తాను. ఇంకోసారి పెళ్లి గురించి నా దగ్గర ఎత్తితే బాగుండదు. (నాకిన్ మేండుల్ హిల్లే? నాకిన్ వెన్నె విచార్ మంతబో. మర్మి బారె నన్న ఆల్స పర్వోన్? మిమ్మటు తాల్కనా బాహె? లోత్తె వెన్నె మర్మి మర్మి ఇంజి కొల్లార్ కీంతోర్. అగ్గ తించి మిర్రి వాత్తేకె ఇగ్గ వెన్నె అదే హిసాబ్. నాకిన్ విచార్ వాత్తేకే నన్నే పూచేమాయికన్. నావ యగ మర్మి పొల్లు తెత్తేకే నల్లా ఆయో)’ అని దుమ్ముదులిపింది.” చెప్పాడు బలరాం.
”నిజమే కదా మరి.” అంది దీప.
ఒక్కసారే అందరూ దీప వైపు చూశారు.
ఉర్మిళ పట్ల ఇంకా అభిమానం పెరిగిపోయింది దీపకు. ఆదివాసీ సమాజంలో పుట్టిపెరిగిన అమ్మాయి ఇంత ధైర్యంగా తన మనసులోని మాటను చెప్పడం చాలా అబ్బురమనిపించింది. నీటిలో కొట్టుకుపోయే వారికి గడ్డిపోచ దొరికినా చాలు కదా. ఓ పడవనే దొరికితే!
లోపల ఉండే జీవితాల్ని, అక్కడి మహిళల ధృఢ సంకల్పం, స్వతంత్ర నిర్ణయం, స్వేచ్చ, ఆత్మవిశ్వాసం, ఆత్మసౌందర్యం వంటివాటిని తెలుపుతున్నాయి మీ కథలు.
అక్కడి మహిళల జీవనంపై బయట సమాజంలో ఉన్న అపోహలన్నీ పటాపంచలు చేస్తున్నాయి మీ కథలు