“With adequate profit, capital is very bold. A certain 10 percent will ensure its employment anywhere; 20 percent will produce eagerness; 50 percent positive audacity; 100 percent will make it ready to trample on all human laws; 300 percent, and there is not a crime which it will not scruple, nor a risk it will not run, even to the chance of its owner being hanged.” Thomas Dunning’s quote in Karl Marx’s Capital.
డబ్బు, పెట్టుబడి స్వభావాన్ని చాలా ఏళ్ళ క్రితమే తన కాపిటల్ లో కార్ల్ మార్క్స్ వివరించారు. పెట్టుబడి మనుషుల కోసం వస్తువులు తాయారు చెయ్యదు. వస్తువులను వాడుకోవటానికి మనుషులను తాయారు చేస్తుంది. ఎదురులేకుండా చేసుకోవటానికి అది అన్నింటినీ విడదీస్తుంది, ముక్కలు చేస్తుంది. డబ్బులు వుండటం, ఆ డబ్బు తెచ్చే సౌకర్యాలు వుండటం మాత్రమే విలువగా చేస్తుంది. వుమ్మడితనాన్ని, సామూహిక స్వభావాన్ని నాశనం చేస్తుంది. ప్రశ్నించే గొంతులు దానికి ప్రమాదం. అందుకే వాటిని నొక్కేస్తుంది.
“గతం లో వ్యక్తికి కావలసిన చదువు, వైద్యం లాంటివి కుటుంబం లేదా గుంపు సమకూర్చేది. కుటుంబం లేదా గుంపు లో ఎంత హింస వున్నా ఒక భద్రత వుంటుంది, పెట్టుబడి వాటిని విచ్ఛిన్నం చేసింది. పెట్టుబడి కుటుంబం అందించే అన్నిటిని అందించి సమూహాలను విడగొట్టింది, భద్రత మాత్రం ఇవ్వలేకపోయింది” అంటారు సేపియన్ రచయిత హరారి.
పెట్టుబడి ఏంచేస్తుందో తొంబై తొమ్మిది పేజీల ఈ చిన్న పుస్తకం “ఘాచర్ ఘోచర్” లో అత్యంత ప్రతిభావంతంగా చూపించారు ప్రసిద్ధ కన్నడ సమకాలీన రచయిత వివేక్ శానబాగ. రచయితకు తను పెట్టుబడి గురించి రాస్తున్నానన్న ఎరుకతో రాసారో లేదో తెలియదు. ఈ పుస్తకం గురించి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లలో ఎక్కడా దానిగురించి చెప్పలేదు. అయనకు ఏంతో పేరు తెచ్చిన ఈ పుస్తకం పై చాలా పత్రికలు ఇచ్చిన విశ్లేషణ లలో కూడా పెట్టుబడి ప్రస్తావన లేదు, ఒక్క న్యూ యార్క్ టైమ్స్ తప్ప. “A classic tale of wealth and moral ruin and a parable about capitalism and Indian society” అని విశ్లేషించింది న్యూ యార్క్ టైమ్స్.
“ఈ పుస్తకం రాయటానికి కారణం ఒక సంఘటన కాదు, చాలా సంఘటనలు ముడిపడి వున్నాయి, 25 ఏళ్ళ క్రిందటే దీనికి నాంది పడింది” అన్నారు రచయిత. ఈ పుస్తకం కన్నడ లో 2013 లో మొదట ప్రచురించబడింది. 90 లో మొదలైన గ్లోబలైజేషన్ ఫలితాలు 2013కు తేటతెల్లంగా కనబడి ఈ పుస్తక రూపంలో బయటికి వచ్చివుంటాయి. సమాజంలో గ్లోబలైజేషన్ చేసిన విధ్వంసం, విలువల నాశనం ఒక కుటుంబాన్ని వుదాహరణగా తీసుకుని అత్యంత శక్తివంతంగా చూపించారు ఈ పుస్తకంలో.
ఘాచర్ ఘోచర్ ఒక అర్ధం లేని మాట. చిక్కుబడిపోయి విప్పటానికి వీలులేని (పీటముడి) సందర్భంలో అనుకోకుండా వాడిన మాట. డబ్బు అది తెచ్చే సౌకర్యాలు, దానికోసం చేసే అన్యాయాలు, అక్రమాలు వీటి లో నిండా మునిగిపోయి బయటికి రాలేని తనాన్ని ఈ పదం సూచిస్తుందని అనుకోవచ్చు.
కాఫీ హౌస్ లో మొదలైన కథ మనలని బెంగుళురులోని ఇరుకు ఇళ్ళలోని వుమ్మడితనం నుంచి డబ్బుతో నిండిన ఒంటరితనం లోకి చాల సులువుగా నడిపిస్తుంది. చిన్న లోయర్ మిడిల్ క్లాసు కుటుంబం తమ పేదరికాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవటంతో ఈ కథ మొదలవుతుంది.
పేరు లేని కథకుడు ఈ కథ మనకు చెబుతుంటాడు. అమ్మ, నాన్న, అక్క, చిన్నాన్న లతో వున్న లోయర్ మిడిల్ క్లాసు కుటుంబం అతడిది. తండ్రి సేల్స్ మాన్ వుద్యోగం చేస్తుంటాడు. అతనికి వచ్చే జీతం తోనే ఆ కుటుంబం అవసరాలు తీరాలి. గ్యాసు అయిపోయిన తరువాత సిలిండర్ తిరగతిప్పి ఒక టీ పెట్టుకునేంత జాగ్రత్తగా గడుపుతుంటారు. తండ్రి ఉద్యోగానికి సంబంధించిన ప్రతి వివరం ఇంట్లో అందరికి తెలుసు. అందరూ కలిసి చాయ్ తాగడం, ఎప్పుడైనా హోటల్ కి వెళ్లి సమోసా తినటం, అమ్మ, నాన్న మాత్రం వన్ బై టూ కాఫీ తాగటం లాంటి చిరు ఆనందాలు వుంటాయి వాళ్ళకు. వారికి అతి పెద్ద ప్రమాదం చీమల నుంచి వస్తుంది. ఎక్కడనుంచి వస్తున్నాయో తెలియని చీమలు బారులు బారులుగా వీరి ఆహారంపై దాడికి దిగేవి. ఆ కాలం అంతా వీరి దృష్టి ఆ చీమలని ఎదుర్కోవటం మీదే వుండేది. చీమలు వారికి ప్రధాన శత్రువులు అయ్యాయి. అప్పుడు మొదలైన చీమలు చంపే అలవాటు తరువాత కాలంలో అవి ఎక్కడ కనబడినా అనాలోచితంగా, వాటివలన ఎలాంటి నష్టం లేకపోయినా చంపుతున్నానని అనిత చెప్పిన దాకా తెలియలేదు అనుకుంటాడు కథకుడు ఒక సందర్భంలో.
కంపెనీ తీసుకున్న కొత్త పాలసీల వల్ల తండ్రి వుద్యోగం నుంచి ఎనిమిది ఏళ్ళ సర్వీస్ ఉండగానే రిటైర్ అవవలసి వస్తుంది. తరువాత రాబోయే కష్ట కాలం గురించి అందరూ బెంగ పడుతున్నప్పుడు పెన్షన్ డబ్బులు పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం చేద్దాం అని బాబాయి ప్రపోసల్ పెడతాడు. అందరూ ఒప్పుకోవటం తో కంపెనీ మొదలు పెడతారు. అప్పటిదాకా వారి అవసరాలు తీర్చిన డబ్బు మీద నియంత్రణ వీరిదే.
ఎప్పుడైతే డబ్బు పెట్టుబడిగా మారిందో కుటుంబం డైనమిక్స్ అన్నీ మారిపోతాయి. అందరిమీదా పెత్తనం పెట్టుబడి చేతుల్లోకి వెళుతుంది. “డబ్బు మనలని ఆడిస్తుందనే మాట అబద్దం కాదు. దానికీ ఒక స్వభావం వుంటుంది, శక్తి వుంటుంది. డబ్బు తక్కువ వున్నప్పుడు అది మన ఆధీనం లో వుంటుంది. ఎక్కువైనప్పుడు దాని బలం పెరిగి మనల్నే ఆక్రమిస్తుంది” అనుకుంటాడు కథకుడు ఒక చోట. పెట్టుబడిగా మారిన డబ్బు అన్ని విలువలను వదిలేస్తుంది. డబ్బు తక్కువగా వున్నప్పుడు ఆహారాన్ని కాపాడుకోవటానికి చీమల్ని చంపినట్టు, పెట్టుబడిగా మారిన తరువాత తన దారికి అడ్డు వచ్చిన ప్రమాదకరమైన వారిని చీమల్ని నలిపినట్టు నలిపి చంపేస్తుంది అన్న దాన్ని చాలా స్పష్టంగా రచయిత చెబుతాడు. తప్పుల్ని ఎత్తి చూపుతున్నా గానీ, ప్రమాదకరం కాని వారిని వెర్రి బాగుల వాడికింద విలువ లేకుండా చేస్తుంది.
ఈ పుస్తకంలో రెండు శక్తివంతమైన స్త్రీ పాత్రలు వున్నాయి. డబ్బు తక్కువగా వున్నప్పుడు ఆహారాన్ని కాపాడుకోవటానికి అర్దరాత్రి లేచి చీమల్ని చంపి, తరువాత పెట్టుబడి చేతిలో చిక్కుకుపోయి, ఆస్తి కొడుకుకు చెందటం కోసం జిత్తులమారితనాన్ని, క్రూరత్వాన్ని నింపుకున్న అమ్మ ఒక పాత్ర. రెండవ పాత్ర, అన్యాయాన్ని ఎత్తిచూపుతూ కుటుంబానికి ప్రమాదకరం గా మారిన భార్య.
పెట్టుబడి స్వభావాన్ని, ఆధునిక నగర జీవితాన్ని ఉదాహరణ గా తీసుకుని స్పష్టం గా, అత్యంత శక్తి వంతంగా చెప్పిన పుస్తకం ఇది. కన్నడలో గత పది పదిహేనేళ్ళలో ప్రచురించబడిన గొప్ప నవలలో ‘ఘాచర్ ఘోచర్’ ఒకటి అని గిరీష్ కర్నాడ్ మెచ్చుకున్న ఈ పుస్తకాన్ని రంగనాథ రామచంద్ర రావు గారు తెలుగులోకి అనువాదం చేసారు. అనువాదం లాగా కాకుండా తెలుగు పుస్తకం చదివినట్టుగానే వుంటుంది.