మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకించే వారిని కనిపించని కళ్ళేవో గమనిస్తున్నాయి. తెలియకుండానే మాటల్నీ, కదలికల్నీ కనిపెడుతున్నాయి. మన చేతిలోని మొబైల్‌ఫోన్ కొంతకాలంగా నిఘావాళ్ళ చేతిలో సాధనంగా మారింది. ఈ మాట ఎవరన్నా అంటే, ఉలిక్కి పడతాం. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌తో దేశంలో ప్రముఖుల ఫోన్లు సుదూరం నుంచే హ్యాంకింగ్‌కు గురయ్యాయంటూ జూలై 18న వెలువడ్డ ది వైర్ కథనం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఇజ్రాయిలీ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఎన్ఎస్ఓ గ్రూపు’ నిఘా టెక్నాలజీని విక్రయిస్తుంటుంది. ఆ సంస్థకు చెందిన నిఘా స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకొని దేశంలో 300 మంది మొబైల్ ఫోన్లపైనా నిఘా పెట్టారనేది తాజా వార్త. స్పైవేర్ జొరబడిన 45 దేశాలలోని 50 వేల ఫోన్ నంబర్లపై నిఘా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఫర్బిడెన్ స్టోరీసు అనే స్వచ్చంధ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కలిసి చేపట్టిన పరిశోధనలో తేలింది. ఆ ఫోన్ నంబర్లను విశ్లేషించేందుకు ఈ రెండు సంస్థలు అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన 10 దేశాలలోని 15 వార్తా సంస్థల సహాకారంతో సంచలనాత్మక కథనాలను ప్రకటిస్తున్నాయి.
వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, లె మోండె, సుద్దూయిష్ జీతుంగ్, ది వైర్ లాంటి పత్రికల వార్తా సంస్థల కన్సార్టియమ్ నలభై దేశాలకు సంబంధించిన పరిశోధనాత్మక కథనాలను వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలు వాస్తవ విరుద్ధమనీ, పెగాసస్ స్పైవేర్‌ను ఆయా దేశాల ప్రభుత్వాలకు అమ్ముతామే తప్ప, దాన్ని నిర్వహించట్లేదనీ, డేటా వివరాలు తమకు తెలియవనీ ఇజ్రాయెలీ సంస్థ చెప్పుకొస్తోంది. ఫర్బిడెన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మటుకు ‘పెగాసస్’ స్పైవేర్ నిఘా సాయంతో పెద్దయెత్తున సాంకేతిక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు తమ డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడినట్లు పేర్కొన్నాయి. పరస్పర విరుద్ధ వాదనలతో ఈ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్త డిజిటల్ నిఘాపై సంచలనం రేపుతోంది. స్పైవేర్ వ్యక్తుల ఎలక్ట్రానిక్ (స్మార్ట్‌ఫోన్, లాప్టాప్) పరికరాల్లోకి వారికి తెలియకుండా దొంగచాటుగా జొరబడి వారి సమాచారన్నంతా సేకరించే, నిరంతరం నిఘా వేసి ఉంచే సాంకేతిక పరిజ్ఞానం. అంటే సిఐడి వాళ్లు చేసే పని ఈ సాంకేతిక పరిజ్ఞానం చడి చప్పుడు లేకుండా నిఘా వేస్తుంది.
మన దేశంలో ప్రజల మీద ప్రజా ఉద్యమకారుల మీద ప్రభుత్వాల నిఘా, అక్రమ గూడఛార కార్యకలాపాలు కొత్తవేమీ కాదు. బ్రిటీష్ వలస పాలనాకాలంలో ఇటువంటి నిఘా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉద్యమకారుల జీవితాల మీద, వారి కార్యాచరణల మీద, వారు వ్యక్తులతో సమాజంతో పెట్టుకుంటున్న సంబంధాల మీద, వారి ఉత్తర ప్రత్యుత్తరాల మీద, టెలిఫోన్ సంభాషణల మీద నిరంతర నిఘా పెట్టి, విరివిగా సమాచారం సేకరించడమే ఆనాటి హోంశాఖ పనిగా ఉండేది. 1947 ఆగష్టులో అధికార బదిలీ జరిగిన తర్వాత మన ప్రభుత్వాలన్నీ చట్టబద్ధంగానూ, చట్టవ్యతిరేకంగానూ కూడా ఆ అక్రమ గూఢచార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తోన్నాయి. బ్రిటీష్ వలస పాలకులు ఇండియన్ టెలిగ్రాఫ్ ఆక్ట్ 1885 తెచ్చి గూఢచారానికి చట్టబద్ధత కల్పించుకున్న దానికి తోడుగా ఆధునిక సమాచార వినిమయ సాధనాల కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్ 2000 నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ప్రొసీజర్ ఫర్ సేఫ్ గార్డస్ ఫర్ ఇంటర్సెప్షన్, మానిటరింగ్ అండ్ డిక్రిప్షన్ ఆఫ్ ఇన్ఫరేష్మన్) రూల్స్ 2009 దాకా ప్రభుత్వాలు ప్రజల వ్యక్తిగత గోప్యత సమాచారాన్ని రాబట్టడానికి, దొంగిలించడానికి, చొరబడడానికి చట్టబద్ధ మార్గాలు తెరిచిపెట్టుకున్నాయి.
ప్రభుత్వం- ప్రతిపక్షం మధ్య చోటు చేసుకుంటున్న సవాళ్లు, పాలకులు-పాలితల మధ్య గల వర్గ విబేధాలు, ఘర్షణల పట్ల అధికార పార్టీకి గల అనుమానం, భయం మాత్రమే ఈ గూడచార్యానికి భూమికగా ఉండేది. 2014 మే లో బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఏర్పడిన తర్వాత గత పాలకుల కంటే మరింత ముందుకు వెళ్లి హిందూత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు భావజాలాన్ని అంగీకరించని, వ్యతిరేకించే వారిపై నిఘా పెట్టింది. అలాగే ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించే వారిపై నిర్బంధం, నిఘా, అక్రమ కేసులు, హత్యలు, దాడులు పెరిగాయి. వీరికి వీరిలాగానే ఆలోచించే ముస్లిం వ్యతిరేక ఇజ్రాయిల్ తోడయింది. నిజానికి హిట్లర్ ముస్సోలినీల నాజీజాన్ని, ఫాసిజాన్ని అభిమానించే సంఘ పరివార్‌కు, నాజీజం దుర్మార్గాలకు లక్షలాది మంది బలి అయిన యూదుల ఇజ్రాయిల్ మధ్య సైద్ధాంతిక విబేధాలు ఉండాలి. కాని అమెరికా సామ్రాజ్యవాదం, ముస్లిం జాతినే తీవ్రవాదంగా భావించే మనస్థత్వం వీరిరువుని ఒకటి చేసింది. ఇజ్రాయిల్ దేశాన్ని 2017లో పర్యటించిన మొదటి భారత ప్రధాని మోడీ గావడం యాధృచ్ఛికం కాదు. మోడీకి, నెతన్యాహుకు మధ్య ప్రపంచీకరణ విధానాల పట్ల విశ్వాసం, మితవాద జాత్యహంకార ధోరణులు ఒకే విధంగా ఉన్నాయి. అందువల్లనే ఇజ్రాయిలీ పాలకవర్గాల ప్రయోజనాలు కాపాడుతూ వారి కనుసన్నలలో నడిచే ఎన్ఎస్ఓ గ్రూప్ అనే కార్పొరేట్ సంస్థ తయారుచేసిన పెగాసస్ అనే అక్రమ గూఢచర్యపు సాఫ్ట్వేర్ సంపాదించడానికి బహుశా మోడీ అప్పుడే ఒప్పందం కుదుర్చుకుని ఉంటారు.
2010లో ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ ‘పెగాసస్’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. తొలిసారిగా 2016లో వెలుగులోకి వచ్చిన ఈ స్పైవేర్‌ను ప్రాథమికంగా తీవ్రవాదులను పట్టుకోవడం, శత్రుదేశాల నిఘా కార్యకలాపాల కోసం అభివృద్ధి చేశారు. దీనిపై పలు దేశాల ప్రభుత్వాలు ఆసక్తి కనబర్చడంతో ఎన్ఎస్వో ఆయా సంస్థలకు విక్రయించడం ప్రారంభించింది. అయితే, 2019లో ఈ స్పైవేర్‌పై మన దేశంలో తొలిసారిగా వివాదం తలెత్తింది. వాట్సాప్ ద్వారా కొన్ని అజ్ఞాత సందేశాలు వచ్చాయని, వాటితో తమ ఫోన్లలోకి పెగాసస్ స్పైవేర్‌ను జొప్పించారని కొందరు జర్నలిస్టులు ఆరోపించారు. నకిలీ లింక్‌ల ద్వారా హ్యాకర్లు ఈ స్పైవేర్‌ను ఫోన్లలోకి పంపిస్తారు. ఈ లింక్‌ను క్లిక్ చేయడంతో పెగాసస్ స్పైవేర్ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. మిస్డ్కాల్స్ ద్వారా కూడా ఈ స్పైవేర్‌ను ఫోన్లో చొప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాట్సాప్ లాంటి ఎన్క్రిప్టెడ్ యాప్‌లను సైతం ఈ స్పైవేర్ సాయంతో స్వాధీన పరచుకోవచ్చు.
ఇజ్రాయిల్‌లోని ఎన్ఎస్వో గ్రూప్‌నకు చెందిన ‘పెగాసెస్’ అనే స్పైవేర్ సాయంతో 300 మంది భారతీయ ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారని జూలై 18న ‘దివైర్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయనిపుణులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తలు, పలువురు రాజకీయ ప్రముఖులు తదితరుల ఫోన్ నంబర్లు ఈ జాబితాలో ఉన్నట్టు వెల్లడించింది. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు… అంటే 2018-19 సంవత్సరాల మధ్య ఈ ఫోన్లను హ్యాక్ చేసినట్టు వివరించింది. నిజంగా ప్రముఖుల ఫోన్లు హ్యాంకింగ్‌కి గురయ్యాయా? లేదా? అని తెలుసుకునేందుకు డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులతో విశ్లేషణలు జరిపించామని, ఆ నివేదికలో హ్యాంకింగ్ జరిగినట్టు తేలిందని ఆ వార్తా సంస్థ వెల్లడించింది. సెల్‌ఫోన్ అనేది దైనందిన జీవితానికి ఒక డైరీలాగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో.. ఆ సెల్‌ఫోన్‌పై ఓ సాఫ్ట్వేర్ నిఘా పెట్టిందనే వార్తలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే సంచలనం రేపుతున్నాయి.
మన దేశానికి సంబంధించి 1000 ఫోన్ నెంబర్లు హ్యాకింగ్ టార్గెట్‌లో ఉన్నాయి. మీడియా సంస్థల కూటమి 300 ఫోన్ నెంబర్లు మాత్రమే తనిఖీ చేసింది. 22 స్మార్ట్ఫోన్లపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరిపించింది. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ఎన్నికల కమీషనర్ అశోక్ లావాసా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, వైర్ ఎడిటర్ సిద్దార్థ వరదరాజన్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ వీక్లీ మాజీ ఎడిటర్ పరంజయ్ గుహ థాకూర్తా తదితరుల ఫోన్‌నెంబర్లు అందులో ఉన్నాయి. కొత్త కేంద్ర మంత్రులు అశ్వని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ నెంబర్లు కూడా ఉండటం విశేషం. పారిస్ నుండి పనిచేసే లాభరహిత మీడియా సంస్థ ఫోర్బిడెన్ స్టోరీస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తొలుత లీకు అయిన సమాచారాన్ని సేకరించాయి. రిపోర్టింగ్ కన్సార్టియం ‘పెగాసెస్ ప్రాజెక్టు’లో భాగస్వాములైన మీడియా భాగస్వాములకు దాన్ని అందజేశాయి.
నిజానికి 2019లోనే భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేయబడిన వారి తరపు లాయర్లు, హక్కుల కార్యకర్తలపై పెగాసెస్‌ను ఉపయోగించి గూఢచర్యం జరిపినట్లు వెల్లడైంది. నిఘా నిమిత్తం తమ ప్లాట్‌ఫాంలో చొరబడ్డారని ఆరోపిస్తూ వాట్సప్ ఎన్ఎస్ఓ గ్రూపుపై న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. 37 ఫోన్లపై పెగాసస్ గూఢచారి సాధనం గురిపెట్టిందని, అందులో 10 భారతీయులవని ది వైర్ తాజాగా వెల్లడించింది. ఈ జాబితాను వెల్లడించడం వెనుక అంతర్జాతీయ మీడియా సంస్థల నెట్వర్క్, స్వచ్చంధ సంస్థలు ఉన్నందున, భారతదేశంలో భాగస్వామిగా ఉన్న ‘ది వైర్’ మీద బిజెపి నాయకుల విమర్శలకు విలువ చేకూరదు. జాబితాలో చోటుచేసుకున్నాయంటున్న పేర్లు సైతం ఆశ్చర్యం కలిగించేవి కావు. పాత్రికేయుల్లో అత్యధికులు ప్రభుత్వ వ్యతిరేక కథనాలకు ప్రసిద్దులే. పేర్లతో పాటు వారు చేసిన పరిశోధనలు, రాసిన రాజకీయ కథనాలను వైర్ గుర్తుచేసింది. ఇక, రాహుల్‌గాంధీ, ప్రశాంత్‌కిశోర్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మస్ (ఏడీఆర్) వ్యవస్థాపకుడు జగ్దీప్ చోఖర్ వంటి పేర్లు అనుమానించడానికి వీల్లేని రీతిలోనే ఉన్నాయి.
మోడీ ప్రభుత్వం భిన్న రంగాల వారిపై విస్తృత స్థాయిలో నిఘా వేయడం రాజకీయ వర్గాలతో ఆందోళన సృష్టించింది. పార్లమెంటు సమావేశాలకు ఆటంకం కలిగించడానికే ఇప్పుడు ఈ నిఘా ఆరోపణలు చేస్తున్నట్టుగా హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సాగిన ఈ నిఘా ఉదంతాన్ని పరిశీలిస్తే, హ్యాకింగ్ అబద్ధమని తేలిగ్గా కొట్టిపారేయలేం. ఈ నిఘా జరిగిందా లేదా అనే విషయమై దర్యాప్తు జరిపి వాస్తవాలను బయట పెట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. సాధారణంగా అధికారంలో ఉన్న వారు ఇటువంటి నిఘా ఏర్పాటు చేస్తుంటారు. ఈ నిఘాతో ప్రభుత్వానికి సంబంధం ఉంటే అందుకు సంబంధించిన వారు బాధ్యత వహించవలసి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం నిఘా వేయడమైనా, వ్యక్తుల గోపత్యకు భంగం కలిగించడమైనా ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రభుత్వానికి ఈ నిఘా వ్యవహారంతో సంబంధం లేదంటే, మరెవరు జరిపారనేది కూడా ప్రభుత్వమే తేల్చవలసి ఉన్నది. ప్రజలకు వాస్తవాలు వెల్లడించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైననే ఉంటుంది.
ప్రధానంగా భూస్వామ్య, పెట్టుబడిదారీ విధానాలతో పోరాడుతున్న వారిపై, కాలం చెల్లిన అశాస్త్రీయ భూస్వామ్య, సనాతన మనువాద భావజాలాన్ని (కులము, మతము, పురుషాధిక్యత) వ్యతిరేకిస్తున్న శ్రేణులను అణచివేసి సామ్రాజ్యవాద, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, భూస్వామ్య వర్గాలకు ఊడిగం చేస్తూ తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి మోడీ-షాలు పన్నిన కుతంత్రం ఇది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకూ, వ్యక్తిగత గోప్యతా హక్కుకూ, ప్రజాస్వామిక పాలనా సంప్రదాయాలకు గొడ్డలిపెట్టు వంటి రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక, అనైతిక చర్య ఇది. ఇవాళ ఇది ఏ మూడు వందల మంది మీదనో ప్రయోగించారని, అక్కడితో ఆగిపోతుందని భావించడానికి వీలులేదు. కేవలం దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి విచ్ఛిన్నకరంగా ఉన్న వారి మీద మాత్రమే, చట్టబద్ధంగా మాత్రమే నిఘా పెడుతున్నామని ప్రభుత్వం ఎంత చెప్పినా విశ్వసించడానికి వీలు లేదు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పత్రికా సంస్థల మీద మాత్రమే కాదు, అమిత్ షా కొడుకు అక్రమ వ్యాపార లావాదేవీల మీద వార్త రాసిన జర్నలిస్టు మీద నిఘా ఉంది. ప్రధాన పత్రికలైన హిందూస్తాన్ టైమ్స్, ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది వైర్, ఇండియాటుడే, న్యూస్ 18, పయనీర్, ఫ్రీలాన్సర్లు, కాలమిస్టులు మొత్తం 40 మందిపై నిఘా ఉంది. వీరేగాక ప్రతిపక్ష నేతలు, మంత్రులు, ఉద్యమకారులు, రచయితలు, భీమా కోరేగావ్ కేసు నిందితులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన మహిళ మీద, ఆమె కుటుంబ సభ్యుల మీద అది ఉపయోగించారంటే, ఇప్పటికి అది ఎంత చట్టవ్యతిరేక, అనైతిక, అప్రజాస్వామికతను సంతరించుకుందో విదితమవుతుంది.
భారత రాజ్యాంగం దేశ పౌరులకు హామీ ఇచ్చిన వ్యక్తిగత గోప్యత హక్కు గాలికి పోయినట్టే! సదరు స్వేచ్ఛ ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం, భావ వ్యక్తీకరణ, పాలనలో పాల్గొనడం మొదలు… గౌరవప్రదంగా జీవించడం వరకుండే ప్రజాస్వామ్య మౌలిక హక్కులన్నీ భంగపోయినట్టే! పరిమితి లేకుండా, ఎంపిక చేసిన అందరి కదలికల్ని, భావాల్ని, ఆలోచనల్ని, సంభాషణల్ని, ఫోటోలని, డాక్యుమెంట్లనూ చడీచప్పుడు లేకుండా ‘నిరంతర నిఘా’తో లాక్కుంటే ఇక ఏమి మిగులుతుంది? ప్రత్యక్షంగా ఇది ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి. మొత్తం పౌర సమాజమే ఓ అనధికారిక నిఘా నేత్రం కింద, నిరంతరం నలుగుతున్నట్టు లెక్క! తాజా ‘పెగాసెస్’ స్పైవేర్ అలజడి ఈ ఉల్లంఘనే! ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందెవరు? ఎవరు చేయించారు? విస్తృతి ఎంత? అన్నది తేలితే కాని, ప్రమాద తీవ్రత బోధపడదు. విపక్షాలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నట్టు రాజ్యమే ఈ చర్యకు పాల్పడితే ఇంతకంటే దుర్నితీ ఏముంటుంది? ఇక పౌరులకు భరోసా ఎక్కడ ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టు తనకు ప్రమేయం లేకుంటే, మరెవరు చేసినట్టు? దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, వ్యక్తుల గోప్య సమాచారంపైన, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఏ విదేశీ ఎజెన్సీలదో నిఘా ఉంటే, ఆ కుట్రను విచారించి నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? నేర, తీవ్రవాద కార్యకలాపాల కట్టడికి ప్రభుత్వాలకు మాత్రమే ఆ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తున్నామని పెగాసెస్ ఇజ్రాయెలీ మాతృసంస్థ ఎన్ఎస్ఓ ఒకవైపు సృష్టీకరిస్తోంది. స్పైవేర్ నిఘా నూటికి నూరుపాళ్లు నిజమేనంటున్న పరిశోధకుల ఫోరెన్సిక్ సాక్ష్యాలు కొట్టిపారేయలేనివి! నాలుగేళ్ల క్రితం ఇజ్రాయెల్‌లో ప్రధాని మోడీ పర్యటించి వచ్చిన కొద్దిరోజుల్లోనే పెగాసెస్ గూఢచర్యం ప్రారంభమైందంటున్న ఫ్రాన్స్ పత్రిక లీ మాండె విశ్లేషణ విస్మయపరుస్తోంది! వాట్సాప్ ద్వారా ఫోన్లలో సులువుగా చొరబడుతోందంటూ రెండేళ్ల కిందటే పెగాసెస్‌పై గగ్గోలు రేగింది.
ఆ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఏమైనా ఉపయోగిస్తోందా అన్న ఎంపీ దయానిధి మారన్ సూటిప్రశ్నకు అప్పట్లో లోక్‌సభలో స్పష్టమైన సమాచారమివ్వని కేంద్రం అత్యవసర సందర్భాల్లో అధీకృత సంస్థలు దేనిపైనైనా నిఘా పెట్టవచ్చని బదులిచ్చింది! ఆ తరువాత అదే పెగాసెస్‌పై మరో ప్రశ్నకు సమాధానంగా భారతీయలు వ్యక్తిగత గోప్యతా హక్కును సంరక్షించి తీరతామంది. పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు నిర్వచించిన వ్యక్తిగత గోప్యతకు విలువదక్కని విపరీత పరిణామాలతో దేశం తరచూ నివ్వెరపాటుకు గురవుతూనే ఉంది. నెలకు సగటున తొమ్మిది వేల వరకు ఫోన్ల ట్యాపింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తోందని ఏడేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. మన్నోహన్ ఏలుబడిలో జాతీయ నేతల ఫోన్లకు దొంగ చెవులు మొలిచిన విషయం బయటికొచ్చినప్పుడు సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష హోదాలో భాజపా పట్టుపట్టింది. అంతకు పదింతలు తీవ్రమైన ప్రస్తుత వివాదంపై అత్యున్నత స్థాయి విచారణకు అధికార పక్షం స్వచ్చంధంగా ఆదేశిస్తేనే నిజానిజాలేమిటో లోకానికి వెల్లడవుతాయి.
తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి ఎవరికైనా అభ్యంతరం ఉండనక్కర లేదు. అందులోనూ అధికారంలో ఉన్నవారు చేయాల్సింది అదే కదా! ప్రతిపక్షాలు కోరుతున్నదీ అదే! నిజానిజాల నిగ్గు తేల్చడానికైనా సరే ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే రంగంలోకి దిగాలి. ఒకవేళ ఆరోపణలే గనక నిజమైతే, దేశ పౌరుల ప్రైవేట్ డేటాపై ఇలా విదేశీ నిఘాను ఉపయోగించడం దిగ్భ్రాంతికరం. మరీ ముఖ్యంగా మంత్రులతో సహా పలువురు ప్రముఖుల సంభాషణలు, కాంటాక్ట్ వివరాలు, ఇ-మెయిన్స్, నెట్లో ఏవేం వెతికారనే చరిత్ర, ఫోటోలు, కెమెరా, మైక్రోఫోన్లతో సహా అన్నీ విదేశీ నిఘా నేత్రం కింద ఉన్నాయంటే అది దేశభద్రతకే పెనుముప్పు. అణుమాత్రమైనా అనుమానం రాకుండా, కనీసం అనవాళ్ళయినా లేకుండా తన పని కానిచ్చే ‘పెగాసెస్’ నిఘా నేత్రం విషయంలో వెంటనే అప్రమత్తం కావాల్సింది కూడా అందుకే! తాజా ఆరోపణలన్నీ నిజమని తేలితే…. ఈ దుర్మార్గపు నిఘా ఏ ప్రజాస్వామ్యానికైనా మాయని మచ్చగా మిగిలిపోతుంది.
వలస పాలనాకాల అవశేషనైన టెలీగ్రాఫ్ చట్టంలో తగిన సవరణలు చేస్తామన్న మూడు దశాబ్దాల నాటి కేంద్రం మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. పౌరుల వ్యక్తిగత గోప్యతా హక్కుకు మన్నన దక్కాలంటే సమాచార సంరక్షణ వ్యవస్థకు సర్కారు ప్రజాస్వామిక దృక్పథంతో రూపకల్పన చేయాల్సి ఉందన్న జస్టిస్ శ్రీకృష్ణ సంఘం మేలిమి సూచనలూ ఆచరణలోకి రాలేదు. వ్యక్తిగత సమాచార సంరక్షణే లక్ష్యంగా 2019లో మోడీ సర్కారు తెచ్చిన బిల్లు ఇంకా చట్టరూపం దాల్చలేదు. ఆ బిల్లులోనూ లోపాలున్నాయంటున్న నిపుణులు, నిబంధనల నుంచి ప్రభుత్వ సంస్థలకు గంపగుత్తగా మినహాయింపులు దఖలుపరచడం దేశ ప్రజలకు శ్రేయస్కరం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతులిచ్చే పక్రియను మొత్తంగా రద్దుచేస్తే తప్ప పౌరుల అంతరంగిక స్వేచ్ఛకు రక్షణ లభించదని ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఈ సందర్భంలోనే గోప్యతా హక్కును హరించే గూఢచర్య ఉపకరణాల వినియోగాన్ని తక్షణం అరికట్టాలని ఐరాస మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ (ఎఇ) హైకమీషనర్ తాజాగా పిలుపునిచ్చింది.
జర్నలిస్టులు, రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ కార్పొరేట్ సంస్థ సరఫరా చేసిన ఫోన్ మాల్వేర్లను పలు దేశాల ప్రభుత్వాలు ఉపయోగించాయమన్న ఆరోపణలు ప్రపంచ మానవ హక్కుల సంక్షోభాన్ని బహిర్గతం చేశాయని ఆమ్నెస్టీ ప్రధాన కార్యదర్శి ఆగ్నెస్ కల్లమార్డ్ జూలై 23న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియంత్రణలేని స్పైవేర్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులపై వినాశకర ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధమైన ఈ నిఘా వల్ల వ్యక్తులకు కలిగే హానిని బహిర్గతం చేయడమే కాకుండా, ప్రపంచ మానవ హక్కులతో పాటు డిజిటల్ పర్యావరణ భద్రతను అస్థిరపరిచే పరిణామాలను కూడా బయట పెట్టిందని తెలిపారు. సైబర్ నిఘా పరిశ్రమపై అత్యవసరంగా గట్టి నియంత్రణ, మానవ హక్కుల ఉల్లంఘన, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే జవాబుదారీతనంతో పాటు ఇటువంటి షాడో పరిశ్రమపై పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
అతి సున్నితమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాలకుల ప్రత్యర్థులపై నిఘా పెట్టడం ఈ కాలంలో సులభమైపోయింది. ఎన్నికల కమీషన్ వంటి కీలక రంగాలపై వార్తలు సేకరించే విలేకరులపై నిఘా పెట్టారు. ఈ ఉదంతం నిగ్గు తేల్చడమే కాకుండా, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జరిపే నిఘాను ఎలా అడ్డుకోవాలనేది అంతర్జాతీయ సమాజం ఆలోచించాలి. మరోవైపు ఇటువంటి నేరాలకు పాల్పడేవారిని చట్టం ముందు నిలబెట్టడం ఎలా అనేది కూడా చర్చించాలి. ప్రజల ప్రైవసీకి రాజ్యాంగ రక్షణ ఉండాలి. ప్రభుత్వమే దానిలోకి చొరబడితే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ప్రజలకు తెలుసుకునే హక్కు కూడా ఉంది. అందువల్ల వాస్తవాలు వెలుగులోకి రావాలంటే జాయింటే పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తుకు ఉత్తర్వు చేయాలి. లేకుంటే ప్రభుత్వంపై నిందారోపణ మిగిలే ఉంటుంది. నిస్సందేహాంగా ఇది ఇండియా ‘వాటర్ గేట్’గా పరిణమించవచ్చు.
ఇండియాలో అక్రమ నిఘాకు అవకాశమే లేదంటున్న కేంద్రం-‘ప్రాజెక్టు పెగాసెస్’ లేవనెత్తుతోన్న ప్రశ్నలన్నింటికీ సూటిగా, స్పష్టంగా బదులివ్వాల్సి ఉంటుంది. పౌర హక్కులను మంట పెట్టే పెడపోకడలు సమసిపోయేలా పటిష్ఠమైన చట్టాన్ని సత్వరం తీసుకురావాలి. పాలకుల నిరంకుశ చర్యలను ప్రజలు ఎక్కువకాలం సహించరు. పెగాసస్ స్పైవేర్‌పై కేంద్రం నమ్మదగిన దర్యాప్తు జరిపించాలి. అలా చేయకుండా దబాయింపులతో, శుష్క ఖండనలతో సరిపుచ్చడానికి కేంద్రం పూనుకుంటే వారిపై అనుమానం మరింత ధృవపడుతుంది. కేవలం పరాయి పాలనలో, నియంతల పాలనలో ఉహించగల ఇటువంటి దారుణాలకు వ్యక్తి గోప్యతపై ఇంత విస్తృత దాడికి పాలకులు పాల్పడడం సిగ్గు పడాల్సిన విషయం. హిందూత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు నిరంకుశ విధానాలను అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వం మారుతుందని ఆశించడం భ్రమే అవుతుంది. కాబట్టి పౌర సమాజం ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమాలు చేపట్టాల్సిన సందర్భం ఇది.