నింగీనేలను అల్లుకొనే పూల పరిమళం

జ్ఞాపకం గతం కాదు. సులుకుపోట్ల గాయాల వర్తమానం. కన్నీటి నదై పారే గుండె కోత. ఎన్నెన్ని మునిమాపు వేళల్లోనో తల్లడిల్లే గుండెకోత. ఇదొక వెతుకులాట. అలముకున్న చీకట్లలో. కమ్మిన కల్లోల కలల మేఘాల్లో. వెతుకులాట. హెూరెత్తే నినాదాల్లో. తుడుం మోతల యుద్ధగీతాల్లో. నింగీనేలను సింగిడై అల్లుకొనే రేరేలా పాటల్లో.

కోడం కుమారస్వామి నడిచివచ్చిన దారి… బందగి చిందిన నెత్తుటి దారి. దొడ్డి కొమరయ్య నేలకొరిగిన నేల. వేనవేల యుద్ధగీతాలు హెూరెత్తిన భూమి. దొరల గడీల్ని కూల్చిన వీరులు నడిచిన తొవ్వ దేశమంతటా విముక్తి ఆకాంక్షల్ని వెదజల్లిన కడివెండి వీరయోధుడు సంతోష్ నడిచిన తొవ్వ. ఆ గాలిలో హోరెత్తిన నినాదాలేవో కుమార్ ని కవిగా మలిచాయి. ఎగిసిన పిడికిళ్లలో రాజుకున్న అగ్గిపూలేవో అక్షరాల్ని ముద్దాడేలా చేశాయి. జనగామ నేలన ప్రభవించిన జనగానాలేవో విప్లవోద్యమాన్ని ప్రేమించేలా చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ అతనికి ప్రపంచాన్ని అర్థంచేయించింది. క్యాంపస్లో తొలిపొద్దై పొడిసిన విద్యార్థి ఉద్యమాలు అతడు నడవాల్సిన దారిని చూపాయి. రెండు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలతో కలసి నడుస్తున్నాడు. కరపత్రమై. కూలిన గోడలపై రాజుకున్న నినాదమై. అట్లా విప్లవ సాహిత్యోద్యమంలోకి వచ్చాడు.

ఇది కుమార్ మొదటి కవితా సంపుటి. ‘పూల పరిమళం’. అడవిని రాజేసే మోదుగు పూల పరిమళం. అడవి మల్లెల పరిమళం. ఇప్పవనాల్లో నిప్పుల పాటను కలగన్న పరిమళం. నడిరేయిన కలలకు నిప్పంటుకొని, దిగ్గున లేచి దిక్కులన్నీ కలెదిరిగిన కలవరింత ఇది. గాయాల జ్ఞాపకాల్లోంచి పోటెత్తిన పదాలివి. గాయమైపోయిన మనుషుల జాడల్లోంచి వెల్లువెత్తిన జ్ఞాపకాలివి. మనిషి కోసం తపనిది. నూతన మానవ ఆవిష్కారం కోసం సాగే వెన్నెల దారిది. ఆదిమ గానమై మన ఊపిరిలో నింపుతున్న పూలపరిమళం వెనక కన్నీళ్లున్నాయి. ఎడతెగని సంఘర్షణ ఉన్నది. మానని గాయాల సంఘర్షణ అది. నెత్తుటి నరాల్లో పోటెత్తే రక్తచలన సంగీతమది.

“మగ్గాలను పెట్టినం పోగుపోగు వడికినం
మా నరాలె దారాలుగ
గుడ్డలెన్నొ నేసినం ఉడుకెవడిదిరో
వణుకెవడిదిరో…” అని ప్రశ్నించిన ‘చెర’ దారిది. ప్రపంచానికి దుప్పటి కప్పి, జానెడు గుడ్డకు నోచుకోని కలనేత బతుకుల కల్లోలాన్ని విన్నాడు కుమార్. ఆ బతుకుల్లో అలముకున్న చీకట్లను చూశాడు. ఆకలి, అప్పులు, అవమానాల బాధల బతుకుల్ని చూశాడు. ఉరితాళ్లకు వేలాడిన నేతన్నల కనుపాపల్లో ముద్రితమైన చివరి దృశ్యాన్ని హృదయంతో చూశాడు. ఊరి చివరి వెలివాడ గుడిసెల్లో వికసించిన వెన్నెల్ని గుండెలకు హత్తుకున్నాడు. చరిత్ర నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల చెమటచిత్తడిని అక్షరాలై అల్లుకున్నాడు. మతోన్మాద దాడుల్లో నెత్తురోడుతున్న నెలవంకలతో హృదయచాలనం చేశాడు. దండకారణ్యంలో వికసించిన స్వప్నాల్ని గుండెల్లో నింపుకున్నాడు. అందుకే ఈ అక్షరాలకు ఇంత తడి. గుండె తడి. నెర్రెలువారిన నేలల్లోంచి మొలకలై నవ్వుతున్న తడి. అడవి అంతటా మోదుగుపూలైన జడి.

ఆ జడివానల్లో… కొంగు నడుముకు చుట్టిన చెల్లెళ్లు. కొడవళ్లు చేపట్టిన చెల్లెళ్లు. సిరిమల్లె చెట్టుకింది లచ్చుమమ్మలు. కొమిరెల్లి కొండల్లో కొలిమి రాజేసే కూలి తల్లులు. గంగదాటిన చెల్లీ చెంద్రమ్మలు. అట్లాంటి దారిన రాలిన పూలను దోసిళ్లకెత్తుకున్న కవి అక్షరాల నిండా పరిమళమే. అది భూమితో మాట్లాడిన మట్టిమనుషుల చెమట చిత్తడి పరిమళం.

ఈ పూలపరిమళమంతటా ఉత్తేజం, ఉత్సాహం, ఉద్వేగం, ఆవేదన, ఆందోళన కన్పిస్తాయి. అతనెంచుకున్న విముక్తి దారి కన్పిస్తుంది. ఆ దారంతా మోదుగుపూలై రాలిన ప్రజాయుద్ధ వీరుల పాదముద్రలున్నాయి. అడవి సిగన నెలవంకలై విరిసిన కనుపాపలున్నాయి. ఆ కనులలో ఉదయించే రేపటి స్వప్నాలున్నాయి. సామూహిక స్వప్నావిష్కరణలున్నాయి. ఎదురైన ప్రతీ దృశ్యాన్నీ గుండెను తాకేలా రాశాడు. దృశ్యకావ్యంలా మలిచాడు. నేను చెప్పడం కన్నా మీరు కుమార్ కవితల్లోకి వెళ్లండి. అక్కడ వెతకండి.

ఓ కన్ను నిద్రపోతూ సెంట్రీ చేస్తున్న మరో కన్ను కన్పిస్తుంది. పచ్చని అడవి ఒడికి చేరిన నెలబాలుడు ఎదురవుతాడు. భవిష్యత్ స్వప్నాలు చిత్రిస్తున్న నెలవంకలు ఎదురొస్తాయి. చీకటిని చీల్చే రేపటి కిరణాలు కళ్లనిండా పరుచుకుంటాయి.

వలస పక్షుల దు:ఖం మీ గుండెల్లోకి ప్రవహిస్తుంది. పారుతున్న జీవనదుల కన్నీళ్లు మీ కళ్లల్లో అలుక్కుపోతాయి. పాల తడారని లేత పెదవుల నవ్వులు పలకరిస్తాయి. గద్దర్ గర్జనలు, డోలక్ దయ దరువులు ఆజం అలీ, పురుషోత్తం హక్కుల పొలికేకలు విన్పిస్తాయి.

గుండె గూడు చెదిరినా చెదరని కలల మనుషులు మీతో కరచాలనం చేస్తారు. నిషేధ రాత్రుల్లో సామూహిక కలలు కల్లోలం రేపుతాయి. మట్టిని గురించి ప్రశ్నించే నేల, కర్రు కదిలితే కలల్ని పండించే నేల మీ కాళ్లకింద పరుచుకుంటుంది.

నూతన మానవ ఆవిష్కరణకు దండకారణ్యంలో త్యాగాల విత్తనాలు చల్లుతున్న విలుకాడు ఎదురొచ్చి మిమ్మల్ని గుండెలకు హత్తుకుంటాడు. పాటై మీలోకి ప్రవహిస్తాడు. మీలో అణువణువునూ రాజేస్తాడు. ఈ పూల పరిమళం నిండా వాడవాడలా సిర్రా సిటికెన పుల్లతో దరువేస్తున్న గుండెల దండోరా మోతలు. ‘నడుస్తున్న తెలంగాణ’ కలల పంట మాటల విస్ఫోటనాలు విన్పిస్తాయి. రండి. నింగీ నేలను సింగిడై అల్లుకొనే ఈ పూల పరిమళంలోకి.

సుందర స్వప్నాలను భుజం మార్చుకుంటూ కదులుతున్న కలల భూమి మీకు ఒడిని పరుచుతుంది. జంగల్ మహల్లో జంగ్ సైరనూదుతున్న అడవి పిట్టల పాటలు విన్పిస్తాయి. ఆదివాసీ గురిపెట్టిన నిప్పుల బాణాలు మీ కళ్లను వెలిగిస్తాయి.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ); సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు). ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

2 thoughts on “నింగీనేలను అల్లుకొనే పూల పరిమళం

  1. విప్లవ పరిమళం వెదజల్లే స్పూర్తిదాయకమైన సమీక్ష

Leave a Reply