పుట్టని బిడ్డ అంతర్ముఖం

రోడ్డు రోలర్లా మందకోడిగా సాగుతున్న జీవితం మీద సర్కారు వారు మంజూరు చేసిన ఏవో దివ్య నిర్మాణాల గురించిన మధురోహలతో దశాబ్దాలుగా నిద్రపోతుంటే ఒక పసివాడు వచ్చి చిట్టి చిట్టి మునివేళ్లతో నిద్ర లేపాడు. చెవుల్లోంచి జారి వాడి లేలేత బుగ్గల మీదుగా ఎండిపోయిన నెత్తుటి చారికలు! పిడిగుద్దులకు చితికి వాచిపోయిన కనుగుడ్లను కప్పలేని రెప్పలతో నా ముఖం మీద ముఖం పెట్టి ఉన్నాడు. పగిలిన తలని, కమిలిన చర్మాన్ని చూపిస్తూ “మట్టికి లేని వివక్ష కుండకి ఎందుకుంటుంది? నీరు చూపని వ్యత్యాసం మనుషుల దాహాల్లో ఎందుకుంటుంది? భూమి చూపని హెచ్చుతగ్గులు ఊరు వాడలకెందుకుంటాయి? చెట్ల గాలి చూపని తేడాలు ఫలాలకెందుకుంటాయి? ప్రకృతి చూపని పక్షపాతం రాజ్యం ఎందుకు చూపిస్తుంది? గుక్కెడు నీళ్లతో దాహం తీర్చుకున్నందుకు నా ఉపాధ్యాయుడు నన్ను శిక్షించాడు. నేను చచ్చిపోతున్నాను. ఇదిగో నేత్రదానం చేస్తున్నాను. నా కళ్లు పెట్టుకొని తిరుగు. నా చూపులతో చూడు. ప్రాచీనత్వపు హీనత్వమేంటో అర్ధమవుతుంది. నీ డెబ్భై ఐదేళ్ల వార్ధక్యానికి ఇంకా బాలారిష్టాలే! నన్నెలాగూ బతికించుకోలేకపోయారు కానీ నాదో చివరి కోరికుంది. దేశంలో వున్న ప్రతి ఇంటిలో నాకో సమాధి తవ్వండి. కన్రెప్పలు కూడా కప్పలేని కన్నుమూత నాది. ఇలా మరణించేవాడి చిట్టచివరి సమాధి నాదే కావాలి.” అంటూ ఉండేలు దెబ్బ తగిలిన పిట్టలా తపతపా కొట్టుకుంటూ నా గుండెల మీద ప్రాణం విడిచాడు.

***

2.
గతంలో ఓ సారి వీధిలోకొచ్చాను. అలంకరించిన సింహాసనాలు, ఉరుకులెత్తే రథాల నుండి దూసుకొచ్చిన కత్తులు ఎదురైన ముఖాల్ని, దుస్తుల్ని చూసి కుత్తుకలు కోస్తునాయి. తెగిపోయిన చెప్పులు, తెగిపడ్డ అవయవాలతో బజార్లన్నీ హడావిడిగా వున్నాయి. జింకల వనం మీద సింహాల గుంపు విరుచుకు పడ్డట్లు నగరం మొత్తం రక్తసిక్తం! (“ఈ సింహాల నోర్లు చూశారా? ఎంత ప్రశాంతంగా దైవ స్మరణ చేస్తున్నాయో” అని ఎవరో బొంకుతుంటారు.) కత్తులు చీల్చిన కడుపు నుండి బైట పడుతున్న పిండాన్ని లోపలికి నెట్టుకుంటూ ఓ నిండు గర్భిణి హంతకుల కాళ్లు మొక్కుతున్నది. తన నగ్న దేహం చుట్టూ కుటుంబ సభ్యుల శవాలు చెల్లా చెదురుగా పడున్న ఓ అమ్మ నిస్సహాయంగా కాళ్లు వేలాడేసి స్పృహ తప్పి పడిపోతున్నది. ఒక్కొక్కడూ మీద పడుతున్నప్పుడు కాండం మీద గొడ్డలివేటు పడ్డ చెట్టై ఆమె తల్లడిల్లిపోతున్నది. సర్వసంగ పరిత్యాగులు బాలెట్ పెట్టెల్ని ఊరేగిస్తున్నారు. కొంతమంది పౌరులు వాటిల్లో నరికేసుకున్న తలని వేసి మొండేలతో బృంద నృత్యాలు చేస్తున్నారు. “నెత్తురు పారనిదే అభివృద్ధి ఎలా సాధ్యం?” అంటూ సూటూ బూట్ కార్పొరేట్స్ ఇరవయ్యో అంతస్తు నుండి లౌడ్ స్పీకర్లలో అరుస్తున్నారు.

3.
ధర్మం కోసం మానవహననం జరిగిన తరువాత సింహాలు ప్రశాంతంగా నవ్వాయి. కానీ వాటి పంజాలకు చిక్కని రక్తం తళతళా మెరుస్తూనే కనబడుతున్నది. ఎప్పుడో రాత్రి పూట ముసుగులేసుకొని వేటాడుతున్నట్లున్నాయి మరి. జంతువులకూ మతం వుందని సింహాసనాలు మృదువుగా మాట్లాడాయి. అన్యాయాల్ని, దుర్మార్గాల్ని ఎలుగెత్తి అరచి, ధర్మానికి సత్యానికి పొసగదన్న కంఠాలలోకి జైలు ఊచలు దిగుతున్నాయి. నాకు డెబ్భై ఐదేళ్లొచ్చాయన్న సంబరంతో జైళ్ల నుండి నెత్తుటి నాలికల హైనాలు విడుదలయ్యాయి. వాటి కాళ్లు కడిగి ధర్మం నెత్తిన నీళ్లు జల్లుకుంటున్నది. వీధులు భయపడుతున్నాయి. స్మశానాలు ముస్తాబవుతున్నాయి. భయానికి భద్రతకి, జీవితంకి జీవచ్ఛవంకి అభేదం ఏర్పడటంతో చావుకీ బతుక్కీ తేడా లేదని పౌరులందరూ రహస్యంగా సందేశాలు పంపుకుంటున్నారు.

4.
నేనింకా పుట్టనే లేదని వర్తమానం నిర్ధారించింది.

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

2 thoughts on “పుట్టని బిడ్డ అంతర్ముఖం

  1. డెబ్భై ఐదేళ్ల వార్ధక్యానికి ఇంకా బాలారిష్టాలే!

    గొప్పగా వ్రాసారండీ కృష్ణ గారు 🙏

  2. జైళ్ళనుండి నెత్తుటినాలుకల హైనాలు విడుదలయ్యాయి…ప్చ్

Leave a Reply