ప్రపంచం చీకటిగా వున్నప్పుడు, పిల్లల్ని పుస్తకాలకు దూరంగా వుంచాలా?

పిల్లలకు కృతజ్ఞతలు. పిల్లలకు జేజేలు.

మీరు ముద్దుముద్దు మాటలతో బుడిబుడి అడుగులతో యీ లోకంలో తిరుగాడుతుండడం వల్ల కదా పూలు పూస్తుందీ. గాలి వీస్తున్నదీ. యింకా రుతువులు నిలిచినదీ, ఆకాశం యింద్ర ధనస్సులు చిత్రిస్తున్నదీ! సెలయేరుల్లాంటి నవ్వులతో లోకంలోని పెనుచీకటిని ప్రమిదల్లా తొలగిస్తుంది మీరు. మీరు మా కడుపున పుడతారన్నది అబద్ధం. మీతో ఆడీ పాడీ మేమే కోట్ల సార్లు కొత్తగా పుడుతుంటాం. పిల్లల్లారా మీరు యీ ప్రపంచపు జీవశక్తి, ప్రాణవాయువు.

పిల్లలకు కృతజ్ఞతలు. పిల్లలకు జేజేలు. పిల్లలకు బోలెడన్ని ముద్దులు.

*

అనగనగా రాజు, ఆ రాజుకి యేడుగురు కొడుకులు – యీ కథని నేనెప్పుడు విన్నానో నాకు గుర్తు లేదు. యెవరు చెప్పారో కూడా గుర్తు లేదు. బహుశా చాల మంది పిల్లలకి యీ కథని యెప్పుడు విన్నారో గుర్తుండి వుండక పోవొచ్చు. పెద్దగా జ్ఞాపకశక్తి యేర్పడని కాలంలో మనం విన్న కథల్లో యీ కథ గుర్తుండి పోతుంది. అలానే యీ కథని మనమూ బోలెడంత మందికి కథగా చెపుతాం. యీ కథ తరతరాలుగా చిరంజీవి. కథలున్నంత కాలం నిలిచిపోయే కథ. అలా మొదలైన మన బాల్యకథా జీవితంలో యెన్నెన్ని కథలు పోగుపడ్డాయో. యెన్నెన్ని కథలు కట్టుకున్న యిసుక గూళ్ళలా కాలపు అలలకో కెరటాలకో కొట్టుకుపోయాయో కదా.

చాల సార్లు అనుకుంటాను. కథలు లేని బాల్యం యెలా వుంటుంది?! తెలీదు. అనుభవం లేని ఆ అనుభవం వూహకు అందటం లేదు. అసలు కథలు లేని మన బాల్యాల్ని వూహించుకోగలమా? చందమామ లోని బేతాళ కథలు, పరోపకారి పాపన్న, తోక చుక్క లాంటి వూహా శక్తిని పెంచిన ఆ బాల సాహిత్వం లేని రోజుల్ని మనం అసలు వూహించగలమా?! కాశీమజిలీలతో మనల్ని నడిపించిన మధిర సుబ్బన్న దీక్షితులుని మనం మర్చిపోగలమా?! రష్యన్ సాహిత్యం మన బాల్యాన్ని యెంతలా వెలిగించిందో కదా. ఆ పుస్తుకాలు అందుకోగానే తెరిచి వాసన చూస్తే వెదురుపసరు ప్రింటింగ్ యింకో యేమిటో తెలియదు కానీ భలే గమ్మతైన పరిమళం… యిప్పటికీ గుర్తే.

బాలరామునికి అద్దంలో చందమామని చూపించటం, అర్జనుడు గురితప్పకుండా బాణం వెయ్యటం… శకుంతల వనంలో పూవ్వులతో చేసే చెలిమి… జ్ఞానులు శిశువుని చూడటాని నక్షత్రపు దారిలో రావటం… కృష్ణుడు శమంతక మణి కోసం వెళ్ళటం… యిలా యింట్లో వాళ్ళు చెప్పే కథలూ బోలెడంత ఆసక్తిని పెంచిన కథలని వింటూ పెరుగుతున్నప్పుడు మనకి మనమే చదువుకునే జ్ఞానం వచ్చాక అలాగే Enid Blyton పుస్తకాలు బాల్యపు వూహల్ని తూనిగల్లా గిరికీలు తిప్పాయి. దెయ్యాలంటే భయం లేకపోవటం చందమామలని చదవటం వల్లే. బావిలో పడిపోయిన సూదిని తీయ్యటం యెలా కథ మన సహనానికి పరీక్ష కదా?!

యిప్పటికీ నేను యేదైనా పత్రిక గానీ, సండే సప్లిమెంట్ కానీ చేతిలోకి తీసుకోగానే మొదట చూసే, చదివే పేజీ బాలల పేజీనే. అంత చిన్నతనంలో నాకు పెద్దపెద్ద కలల్ని కలిగించింది, ప్రకృతి మీద అపరిమితమైన ఆసక్తిని, పర్యటన పట్ల అభిరుచిని పెంపొందించింది. బాల్యంలో చదువుకొన్న సాహిత్యమే. పాకెట్ బుక్స్ నుంచి పత్రికల వరకు యెంతో జ్ఞానాన్ని, వూహా శక్తిని యిచ్చాయి.

ప్రతి తరానికీ టెక్నాలజీ కొంత న్యాయం కొంత అన్యాయం చేస్తుంది. కొన్నిటిని యిస్తుంది. కొన్నింటిని చేరిపివేస్తుంది. పిల్లలగా మనం రాసే వుత్తరాలు మనలో expression కి చేసే మేలు అంతా యింతా కాదు. కొన్నేళ్ళుగా అంతా చెవిలో యిల్లు కట్టుకొని చెపుతోన్న communication Skills కి పునాదిని పిల్లలుగా మనం రాసే వుత్తారాలు వేస్తాయనేది నా అనుభవం. బాల్యంలో బంధువులకి, స్నేహితులకి, వూరెళ్ళినప్పుడు పేరెంట్స్ కి, సెలవల్లో కొన్నిసార్లు టీచర్స్ కి వుత్తరాలు రాయటం అలవాటుండేది. అప్పుడు యెవరికి యేమి రాయాలి… యెంత రాయాలి అన్న ఆలోచన చెయ్యటం… అలా రాయటం… జవాబుగా వచ్చిన వుత్తరాల్ని చదువుతున్నప్పుడు వాళ్ళు యేమి రాసారు?! యే పదాలు వాడేరన్నది యేమంత పట్టిపట్టి చూడకుండానే అప్రయత్నంగా మనలోకి యింకుతాయి. సాహిత్యంలో అటువంటి వుత్తరాలని చదువుకున్నప్పుడు పిల్లలకి యేమి రాయాలి వుత్తరాల్లో అన్నది తెలుస్తుంది.

యిప్పటి తరానికి కథలు వున్నాయా?! కథా పఠనమే మాయమైపోతూ ఆ స్థానంలోకి కథల్ని మించిన ఆసక్తికరమైన వర్చువల్ మీడియా వచ్చేసింది. గొప్ప చదువరులైన తల్లిదండ్రులు రీడింగ్ హాబిట్ ని తమ పిల్లల్లో పెంచాలని యెంత ప్రయత్నిస్తున్నా…. పిల్లల అరచేతుల్ని ఆక్రమించిన రకరకాల గాడ్జెట్స్ వాళ్ళ దృష్టిని పుస్తకాల వైపు మళ్ళనివ్వడంలేదు. తమ జీవితాల్లో కథలు అనేవే లేని యీ బాల్యం, యీ తరం యెక్కడ తేలుతుంది? యిది ఆలోచించే తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ప్రశ్న. అసలు యే వయస్సుకి యే పుస్తకాలు యివ్వాలి అన్నది మరో ప్రశ్న తల్లితండ్రుల్లో, వుపాధ్యాయుల్లో, పెద్దల్లో.

అలానే పిల్లలకి తల్లిదండ్రులు యేమి పుస్తకాల్ని యిచ్చి చదివించాలి అనే ప్రశ్న ముందుకొస్తోంది. చదవడం అలవాటు అయిపోయిన పిల్లలు హారీపోటర్ సిరీస్, డ్రాగన్ సిరీస్ లని చదవడం పూర్తి చేసేశారు. ఆ పుస్తకాలని బాల్యం దాటిన పెద్దలం యిష్టంగా చదివేసాం. యికపై వాళ్లకి యే కథల్ని యిచ్చి చదివించాలి అనేది ప్రముఖంగా వేధించే ప్రశ్న. పిల్లలు గూగుల్ ఆపరేట్ చేస్తూ పెద్ద వాళ్ళ కంటే దాదాపు రెండు తరాలు ముందున్నారు. అయితే యెల్లెడలా యీ చీకటి విస్తరిస్తున్న కాలంలో ఆ చీకటి నిండిన, నెత్తురోడే, అత్యంత కఠిన వాస్తవ ఘటనలతో నిండిన కథా సంపుటాలను, నవలల్ని పిల్లలకు యివ్వొచ్చా? అనే ప్రశ్నా వుంది. ముఖ్యంగా ప్రొటెక్టెడ్ గా పిల్లల్ని పెంచే వాళ్ళకి వాస్తవ పరిస్థితిల నుంచి దూరంగా పెంచటం సాధ్యమా?!

ఆశ అనేది, జీవితం మీద నమ్మకం అనేది వున్నంత కాలం మనం పిల్లల్ని పుస్తకాలలోని వాస్తవికతకు దూరంగా వుంచాల్సిన అవసరం యేమాత్రం లేదు. జీవితాన్ని యీ పసి మనసులు అర్ధం చేసుకున్నంతగా మనం కూడా అర్ధం చేసుకోలేము. ఆ పఠనం వల్ల ముందుకొచ్చే అనేక విధాల ప్రశ్నలకు మనం సమాధానాలు యివ్వడానికి సిద్ధం అవ్వాలి. యిటీవల వచ్చిన కొన్ని పుస్తకాలు వొక్కదానితో వొకటి మాట్లాడుతున్నట్లు అనిపించాయి.

మొదటిది షిబల్ భారతీయ రచించిన ‘బీనా స్ సమ్మర్’. బీనా స్ సమ్మర్ అనేది యెనభైలు తొంభైలలో పెరిగిన చాల మంది జ్ఞాపకాల్లో మెరుపుల పూదండ. యే అలజడులూ లేని సమయాలు, ప్రతిరోజూ పలకరించే సంతోషకరమైన సమయాలు బహుశా బాల్యంలో పోగేసుకునేవి మనల్ని జీవితమంతా చిన్ని ఆనందపు తూగుటుయ్యాల్లో వూపుతుంటాయి అలసిపోయినప్పుడంతా. బీనా అని పిలిచే బెనజీర్ కథని ‘బీనా స్ సమ్మర్’ లో చూస్తాం. చిన్న పట్టణాలైన గయా, సుల్తాన్‌పూర్‌లో చెప్పే యీ కథ మరో చోట కూడా జరగొచ్చు.

తాతామామ లను, మిగిలిన కుటుంబ సభ్యులకు చూడటానికి బీనా గయాకి వస్తుంది. ఆ వుమ్మడి కుటుంబంలో తన కజిన్స్ జరీన, సఫియతో గడిపిన నాలుగు వారాల కథ యిది. బీనా ఫాల్గు నది వొడ్డున ఆడుకుంటున్న బీనాని పాఠకునికి చేసిన పరిచయంతో మనం బీనాకి దగ్గరైపోతాం. చీకటితో నిండిన బాల్యపు ఆశల కథను చెబుతుంది. చిన్నపట్టణంలో యీ కథ నడుస్తుంది. యిది మతపరమైన వుద్రిక్తత నేపథ్యంలో జరిగే కథ. ఆ అల్లర్లకు వ్యతిరేకంగా విభిన్న మతాలకు చెందిన రెండు సన్నిహిత కుటుంబాల నేపథ్యాన్ని చిత్రీకరిస్తుంది. బాల్యంలోని అమాయకత్వాన్ని వొక అరక్షితమైన సంఘటన తారుమారు చేసే సంఘటనలు యీ కథలో చాలా వున్నాయి. “యివి యింతకు ముందు అనేక అల్లర్లను చూసిన, వాటి నుంచి అనేక అల్లకల్లోలాల్ని చూసి బయటపడిన వారి కుటుంబాల కథ. వారు ప్రేమించిన వారిని కోల్పోయారు, వారు తమ సొంతం అనుకున్న వాటిని యెన్నింటినో కోల్పోయారు” అని యువ బీనా పెద్ద కుటుంబాన్ని వివరిస్తూ రాశారు.

రెండవది, పారో ఆనంద్ రచించిన “నోమాడ్స్ ల్యాండ్” యిద్దరు అమ్మాయిలు – షాన్నా కాశ్మీరి పండిట్. పెమా టిబెటన్ కి చెందిన అమ్మాయి. యిద్దరూ తాముండే ప్రదేశం నుంచి రాజకీయా సంక్షోభ కారణాల వల్ల వారివారి ప్రాంతాలని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళిద్దరూ స్కూల్ ల్లో కలిసినప్పుడు వారివారి జీవితాల్ని కలబోసుకుంటారు. రాజకీయ అనిశ్చింత అల్లర్ల మధ్యే వారిలో స్నేహం, ఆశా దృక్పథం కలగటం యీ “నోమాడ్స్ ల్యాండ్” లో చూస్తాం.

పిల్లలుగా వో భద్రమైన జీవితంలో వున్న తమ పిల్లలకు అదే కాలంలో మరో చోట పిల్లల జీవితంలో యేమి జరుగుతుందో యే ఆశా దృక్పథంతో వారు దైనొందిన జీవితంలో యే కలల్ని యే చిరునవ్వులని పోగేసుకుంటున్నారో తెలియచేసే పుస్తకాలని పిల్లలకు అందుబాటులో వుంచటం లేదా చదవటానికి ఆసక్తి చూపించే పిల్లల్ని అడ్డుకోకుండా వుండటం అనేది వారీ సమాజాన్ని చూస్తోన్న చూపు మీదే ఆధారపడి వుంటుంది.

యీ పుస్తకాల లోని గొప్ప పుస్తకం. “ది బుక్ ఆఫ్ హోప్స్: వర్డ్స్ అండ్ పిక్చర్స్ టు కంఫర్ట్, యిన్‌స్పైర్ అండ్ యెంటర్‌టైన్” కేథరీన్ రుండెల్ యీ పుస్తకానికి సంపాదకత్వం వహించారు. యీ పుస్తకంలో అనేకమంది పేరున్న రచయితలు పాండమిక్ పరిస్థితుల్లో పిల్లలకు సంబంధించిన కథల్ని, 100 పైగా చిత్రాల్ని చిత్రకారులు సృష్టించారు. యెంతో ఆహ్లాదకరమైన కథలు యీ పుస్తకంలో వున్నాయి. పుస్తకం నిండా ప్రతిబింబించే అంతులేని విశ్వాసం, శాశ్వతమైన ఆశని దర్శనమిస్తాయి.

2020లో యుకె లో పాండమిక్ పరిస్థితులు ప్రారంభమైనప్పుడు అత్యవసరంగా ఆశ అనేది నింపుకోవల్సిన అవసరమైయింది. ఆశనైనా, ప్రేమనైనా, ద్వేషాన్నాయినా పుస్తకాలతోనే పంచుకోవడం అలవాటు కాబట్టి, వాటిని పుస్తకాలలోనే వెతుక్కున్నాను: పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు, లాటిన్‌ ఫుట్‌నోట్‌లతో కూడిన భయంకరమైన సీరియస్ పుస్తకాలు, యిక్కడ పునరావృతం చేయడానికి చాలా మొరటుగా జోక్స్‌ తో కూడిన భయంకరమైన సీరియస్ పుస్తకాలు యెన్నో చదివాను.

అర్థం చేసుకున్న అనుభూతి యేమిటంటే మనలో చాలా మంది యీ గందరగోళ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, స్నేహం, వోదార్పు కోసం ముఖ్యంగా అల్లకల్లోలం, సంఘర్షణలు, అసహనం వంటి సమయాల్లో వోదార్పు కోసం ఆశ్రయించ దగినవి కేవలం పుస్తకాలే! ఆ పుస్తకం యేమి అంటుందో చూద్దాం.

చీకటి జ్ఞాపకాలు:

రాత్రి చీకటి పడింది. అగ్నిని పీల్చేసే గొప్ప రాక్షసులు నగరం మైదానాల్లో వున్న నక్షత్రాలను మింగేశాయి. నేను మా యింటి కారిడార్‌లో నిల్చున్నాను, నా శాలువా ని పట్టుకొని నిలుచున్నాను. దగ్గరగా, బిగ్గరగా, కోపంతో కూడిన శబ్దాలు పొగ నిండిన గాలిని గుచ్చుతున్నాయి. మా అమ్మ, నేను బాల్కనీలో నిలబడి, భయంతో వణికిపోయాం.

ఎతిపొంసే మూమెంట్:

యిది 1984 నుండి నన్ను విడిచిపెట్టడానికి నిరాకరించిన జ్ఞాపకం. యిది ఢిల్లీలో జరిగిన ఘటన. అప్పుడు నాకు ఐదేళ్ళు. యేమి జరిగుతుందో తెలియని చాలా చిన్నపిల్లని. పెద్దల ద్వారా యేమి జరుగుతుంది అని తెలుసుకోగల వయస్సు నాకు లేదు. నాకు గుర్తున్నదల్లా మరుసటి రోజు వుదయం నేను నిద్ర లేచాను, మా పొరుగు వారు యికలేరు. వారి కారు యికపై కారు కాదు – అది కాలిపోయిన వొట్టి లోహపు కుప్ప.

ముప్పై అయిదేళ్ల తర్వాత ఆ జ్ఞాపకాన్ని అర్థం చేసుకోవడం కోసం సాహిత్యం వైపు మళ్లాను. కానీ ఆ కథ రాత్రికి రాత్రే మారిపోయింది. వొక పుస్తకంలో సృజనా శ్రీధర్ ఆ రాత్రిని వివరించారు. అది ఆ రాత్రికి సంబంధించిన వో కల్పిత కథనం, వొక తల్లి బిడ్డ ఆ ఘర్షణ లో బిగ్గరగా వినిపించే స్వరాలకు మూలం గురించి మాట్లాడటానికి ప్రయత్నించి, వారి తండ్రి ఘర్షణ లోకి లాగపడినప్పుడు భయంతో పోరాడారు.

వాస్తవం – చీకటి:

పిల్లల పుస్తకాల్లో చీకటి కొత్త కాదు. పౌరాణిక కథల మాదిరిగానే అద్భుత కథలు వాటిలో నిండుంటాయి. పిల్లల కోసం రాసే పుస్తకాల్లో రాసేవారికి ఆయా కాలాల ప్రాంతాల పిల్లల మనస్తత్వం పై గమనింపు వుండాలి. యెటువంటి జోక్స్ రాయాలి యెలాంటి యిన్ఫోర్మేష్ యివ్వాలి, యెలాంటి ఫాంటసీ అంశాలతో రాయాలి. వొకప్పుడు బాల్యంలో మనలన్ని మెరిపించి కలలు పూయించిన అనేక Fairy Tales

పెద్దలు యేమనుకుంటున్నారో దానికి విరుద్ధంగా, పిల్లలు తమ చుట్టూ యేదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు పెద్దల కన్నా యెక్కువగా తరచుగా తెలుసుకోవాలని వుబలాట పడతారు. పిల్లలు పెద్దల కన్నా యెక్కువ తెలుసుకుంటారు కూడా. వారి చుట్టూ వున్న వాటి నుండి తరచుగా వివరాలు తీసుకుంటారు. యెల్లప్పుడూ స్విచ్ ఆన్ చేయబడే టెలివిజన్ నుండి వార్తలు, స్నిప్పెట్‌లు, డైనింగ్ టేబుల్‌పై వుంచిన వార్తాపత్రిక, రాజకీయాల రహస్య చర్చలు యిలా మరెన్నింటినో తెలుసుకుంటారు.

కాశ్మీర్ కు చెందిన మాజిద్ మక్బూల్ తన పసికుమార్తె “గుళికలు”,”టియర్ గ్యాస్” వంటి పదాలను యెలా అర్థం చేసుకుంటుందో చెప్తారు. ఆమె యెలా అర్ధం చేసుకుందంటే ఆమె రోజూ తొక్కే సైకిల్, కర్ఫ్యూ లో చిక్కుకుపోయింది యిక ఆమె సైకిల్ యెలా తొక్కుతుంది? సైకిల్ తొక్కకూడదని యెవరి వల్ల యెలా నిర్ణయించబడుతుంది? యిది వొక చిన్న అమ్మాయి కథ.

మనం కలహాలు, మతోన్మాదం, అల్లర్లు, మతం ఆధారంగా వ్యక్తులపై హింసకు పాల్పడే కాలంలో జీవిస్తున్నామని పిల్లలకు గ్రహిస్తున్నారు. కానీ పిల్లల కోసం మత హింస, సంఘర్షణల గురించి కథలు యెలా రాయాలి? వాటిని సులభంగా యెలా అర్ధం చేయించాలి? కథలు, నవలలు రాయడం యిన్నాళ్ల నుంచి సాగుతున్నా దీనికి యిప్పటికీ సమాధానాలు లేవు.

హింస – చీకటి:

యీ వాక్యాన్ని విశ్వశిస్తున్నాను. మీకు తెలిసినది, నమ్మింది రాయండి. సత్యాలను ప్రతిబింబించే కథలు, అంతరాయాలు, భావోద్వేగాలు, భయాలు, ఆనందాల గురించి రాయండి. మీకు పూర్తిగా తెలియకపోతే, కనుక్కొని రాయండీ. మీ మెదడు అచ్చమైన వాస్తవాల తో నిండిపోయే వరకు పరిశోధన చేయండి. పరిశోధకులను, వ్యక్తులను కలవండి, వారితో మాట్లాడండి, మనస్సు పెట్టి వినండి. యెందుకంటే మీరు వొకరి వాస్తవమైన కథని చెప్తున్నారు, అంతకన్నా పెద్ద బాధ్యత మరొకటి వుండదు. వేరొకరి గొంతుని మీరు కథల్లో యెట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దు. నిజంగా, వద్దు. పిల్లలు స్వయంగా మనం సూటిగా చెప్పే కథల్నే వినడానికి, చదవడానికి యిష్టపడతారు.

వొక దశాబ్దం క్రితం, రంజిత్ లాల్ రాసిన “బ్యాటిల్ ఫర్నంబర్ 19” ఇందిరా గాంధీ హత్య రోజు ఢిల్లీలో చిక్కుకుపోయిన యెనిమిది మంది పాఠశాల విద్యార్థుల కథ. అలాగే పారో ఆనంద్ “కలుపు” చిత్రం కూడా అదే దృశ్యాన్ని చూపిస్తుంది. ఆమె కథనం యువ ఉమెర్ దృష్టిలో కాశ్మీర్‌ను చూస్తుంది. ఉమెర్ కు తన కుటుంబం పట్ల వున్న ప్రేమ, వారి విరుద్ధమైన ఆదర్శాల ద్వారా విడిపోయిన తల్లిదండ్రుల మధ్య పెనుగులాడే బాలుడి కథ. యీ రెండు పుస్తకాలు పిల్లలు దురదృష్టకర, వాస్తవ పరిస్థితులతో యెలా వ్యవహరిస్తారో, వారి ప్రపంచం యెలా వుంటుందో, వారి మానసిక పరిస్థితి యెలా వుంటుందో వివరిస్తాను.

90వ దశకం ప్రారంభంలో అంతరా గంగూలీ రాసిన “తాన్యా తానియా” అనే స్టోరీని చదివాను. తాన్యా కరాచీలో, తానియా బొంబాయిలో యిప్పటి ముంబై లో వుంటారు. వారిద్దరి మధ్య గాఢమైన కలం స్నేహం వుంటుంది. వాటిలో తమ రెండు దేశాల రాజకీయాలు, సామాజిక వుద్రిక్తతల వారు రాసుకునే వుత్తరాల్లో స్పష్టంగా తెలుస్తాయి.

యీ కథ బొంబాయిలో జరిగిన అల్లర్ల తర్వాత జరిగిన క్షణాలను గుర్తుచేసుకోవడానికి వో ట్రిగర్. అలాగే కరాచీ పట్టణంలో నిండిన వుద్విగ్నత, కనీసం పాఠశాల కి వెళ్లలేని పరిస్థితులను హృద్యంగా వివరిస్తుంది.

చీకటిపై గీయడం:

కల్పన మా కథనాలను మళ్లీ ప్రసారం చేయడానికి తిరిగి చెప్పడానికి ఖాళీలను అందిస్తుంది – మొదట రాయడం ప్రారంభించినప్పుడు చాలా కష్టపడ్డాను. జర్నలిస్ట్‌ గా, వాస్తవాలను కనుగొనడం, మూలాలను కనుగొనడం, యథాతథంగా చెప్పడానికి శిక్షణ పొందాను. పుస్తకాలు రాయడం ప్రారంభించినప్పుడు యీ అభ్యాసం సహాయపడింది, కానీ యిది తరచుగా యీ బాధించే నక్షత్రం లా కనిపించింది, నా వూహ దూకడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఖచ్చితంగా నక్షత్రం మసకబారుతుందని గ్రహించాక మీరు దానిని కథనంలో జోడించాలనుకుంటున్నారా? కేవలం వూహల మీద ఆధారపడటం వల్ల అది యేమాత్రం సాధ్యం కాదు. లేదా నిజంగా, నిజ జీవితం అంటే కచ్చితంగా వాస్తవాల మీదే ఆధారపడి తీరాలి. పిల్లల కోసం కథలు కదా అని మసిపూసి మారేడు కాయ చేయకూడదు.

కానీ చాలా కాలం పాటు నక్షత్రాన్ని విస్మరించండి. సిద్ధార్థ శర్మ రాసిన “యువ వయోజన పుస్తకం” కలుపు సంవత్సరాలని వివరిస్తుంది. తమ పవిత్రమైన కొండలను తవ్వకుండా వొక కార్పొరేషన్‌ను ప్రతిఘటించిన గోండ్ స్థానిక సమాజపు శక్తివంతమైన కథలో వాస్తవికత కల్పనతో కలిసి సాగే కథనాన్ని యీ పుస్తకం కళ్ళకు కడుతుంది. మళ్ళీ, యిది యిద్దరు యువ కథానాయకుల స్వరాలు – కోరోక్, అంచిత – యిది సమస్యలను విస్తృతం చేస్తుంది.

చిన్న పిల్లల కోసం రాసే పుస్తకాలలో, దృష్టంతాలు కథనం వివరణకు సహాయం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి, అదే సమయంలో, పిల్లల వూహను రేకెత్తిస్తాయి. సబ్నానీ రాసిన “ముకంద్” కథ. గాలిపటం యెగరవేసే రియాజ్లో వొక నియమము కథనం. యిది విభజన నేపథ్యంలో చెప్పిన, యెప్పటికీ చేరిపేయలేని జ్ఞాపకాల చిత్రణల కథల పుస్తకం. యిది సరిహద్దులను దాటి కదిలే స్నేహం కథను చెబుతుంది. పాకిస్తాన్, భారతదేశం రెండింటిలోనూ నెలకొన్న సాధారణం పరిస్థితులను చెబుతుంది.

యింకో వుదాహరణ ‘హోమ్’ అనే నవల. రచయిత ఆర్య డి శాంటిస్, చిత్రకారుడు వొగిన్ నయం శరణార్థుల సంక్షోభాన్ని వివరించడానికి నీటిని వొక పదునైన ప్రధానాంశంగా యెంచుకున్నారు. యిందులో కథనాయిక హసీనా వర్షపు చినుకులతో ఆడుకోవడం, చీకటి మేఘాలతో నిండిన రోజులో ఆహ్లాదకరంగా వున్నప్పుడు, హఠాత్తుగా హింస ఆమెను, ఆమె తల్లిని చుట్టుముట్టినప్పుడు, వారు సురక్షితమైన నౌకాశ్రయాన్ని కనుగొనే తపనతో సరిహద్దులు దాటి ప్రజల నదిలో చేరడం స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రియా సెబాస్టియన్, నేహా సింగ్ చిత్రాల పుస్తకం “యిది మీకు వొకేలా వుందా?” – కాశ్మీర్‌లోని అల్లకల్లోలం మధ్య వొక యుక్తవయస్సులో వున్న అమ్మాయి తన శరీరాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. రచయితలు రాసేటప్పుడు అత్యంత ముఖ్యమైనది పిల్లల విషయాలు. వారి పిల్లల స్వరాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, అర్థం చేసుకోవడం అనుకరించడం. రచయితలందరూ చిన్నపిల్లలవడం. మీరు వ్యోమగామి, బ్యాంకర్ లేదా యింద్రజాలికుడు కాకపోవచ్చు కానీ మనం చిన్నపిల్లలుగా వున్న రోజులూ వున్నాయి కదా. చిన్నదిగానూ, ప్రపంచం చాలా పెద్దదిగా, మెరుస్తూ, భయానకంగా వుత్తేజకరమైనదిగా వుండే అనుభూతిని తిరిగి పొందండి.

ప్రతి కొత్త విషయం ఆశ్చర్యం లేదా భయాన్ని రేకెత్తిస్తుంది. యెక్కడ బిగ్గరగా, కోపంగా వున్న స్వరాలు యెందుకు అలా బిగ్గరగా కోపంగా వున్నాయి? కానీ వాటి వెనుక వున్న దుర్మార్గపు వుద్దేశం తరచుగా వివరించబడదు. వార్తల చుట్టూ మూసుకుపోయిన గొంతులు అయోమయంగా భయానకంగా వుంటాయి. కానీ మీరు కథని రాసేటప్పుడు మీ పాఠకుడి చేయి పట్టుకుని వాటిని మళ్లీ సందర్శించాలి.

యెంత చీకటి?

యీ పుస్తకాల్లోని కథానాయకులందరూ పిల్లలు లేదా యువకులే వున్నారు. పాఠకులు తమ పాత్రల్లా వుండాలని కలలు కనాలని కోరుకునే రచయితలు చాలమంది వుంటారు. పిల్లల పుస్తకాలలో పిల్లల కథానాయకులు వుండడానికి ప్రధానమైన కారణం పిల్లల్లో వున్న వూహలే. చీకటి యెంత చీకటిగా వుంటుంది? అని తరచుగా అడగటం యెందుకంటే కథలు వారి భయాన్ని చక్కిలిగింతలు పెట్టినప్పుడు పిల్లలు దానిని యిష్టపడతారు.

వొక కథ పిల్లల్ని వెంటాడుతుంది, కానీ పిల్లలు దానిని అర్థం చేసుకొని, దాన్ని డైజిస్ట్ చేసుకోడానికి పిల్లలకి వొక్కో సారి టైం పడుతుంది.

చీకటి తరచుగా మన చుట్టూ వున్న వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. కథనాలు, పాత్రలు, యీ వాస్తవికత సృష్టికర్తల బాధ్యతాయుతమైన వివరణను ప్రతిబింబిస్తుంది. బహుశా అందుకే మనం ఆశతో పుస్తకాలను అల్లాలి. రుండెల్ చెప్పినట్లుగా, పిల్లల రచయితలు, చిత్రకారులు “ఆశతో కూడిన వృత్తిపరమైన వేటగాళ్ళు” – “మేము దానిని వెతుకుతాము, దానిని మా వలలలో పట్టుకుంటాము, దానిని వొక పుస్తకం పేజీల మధ్య వుంచుతాం, దానిని ప్రపంచానికి పంపుతాము.”

చీకటి చుట్టుముట్టినప్పుడు ఆ చీకటి గురించిన పుస్తకాలనే పిల్లలతో మనం చదివించాలి. అప్పుడే తాము నడిచివచ్చిన గతం వారికి శాశ్వతంగా గుర్తుండిపోతుంది.

*

పలు విషయాలపై మారుతోన్న అవగాహనతో కొంత కాలంగా Enid Blyton పిల్లలకి అందించిన సాహిత్యంపై అనేక విమర్శలూ వస్తున్నాయి. సిండ్రిల్లా యిప్పటి కాలపు ఆకాంక్షలతో సినిమాగా రావటమూ చూసామూ. యిప్పటికి యెందరో రైలు బడి లాంటి పాఠశాలని పెట్టాలని కల కంటుంటారు.

కొత్త ఆవిష్కరణలతో కాలానుగుణంగా పిల్లల సాహిత్యం అందించాల్సిన బాధ్యత రచయితలది. వాటిని పిల్లలకి అందుబాటులో వుంచాల్సిన బాధ్యత తల్లితండ్రులది. పాఠశాలలది. ప్రభుత్వాలది. గ్రంథాలయ వారోత్సవాల సమయమిది. పిల్లలకి గ్రంథాలయాల్ని విరివిగా అందుబాటులోకి తీసుకొని వొస్తే పిల్లల జీవితాల్లో అనేక కలల్ని వూహల్ని భాధ్యతని విరబూయించే పుస్తకాల్ని అందించగలుగుతాం.

అవును… పిల్లలకు కృతజ్ఞతలు. పిల్లలకు జేజేలు.

మీరు ముద్దుముద్దు మాటలతో బుడిబుడి అడుగులతో యీ లోకంలో తిరుగాడుతుండడం వల్ల కదా పూలు పూస్తుందీ. గాలి వీస్తున్నదీ. యింకా రుతువులు నిలిచినదీ, ఆకాశం యింద్ర ధనస్సులు చిత్రిస్తున్నదీ! సెలయేరుల్లాంటి నవ్వులతో లోకంలో ని పెనుచీకటిని ప్రమిదల్లా తొలగిస్తుంది మీరు. మీరు మా కడుపున పుడతారన్నది అబద్ధం. మీతో ఆడీ పాడీ మేమే కోట్ల సార్లు కొత్తగా పుడుతుంటాం. పిల్లల్లారా మీరు యీ ప్రపంచపు జీవశక్తి , ప్రాణవాయువు.

పిల్లలకు కృతజ్ఞతలు. పిల్లలకు జేజేలు. పిల్లలకు బోలెడన్ని ముద్దులు.

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

8 thoughts on “ప్రపంచం చీకటిగా వున్నప్పుడు, పిల్లల్ని పుస్తకాలకు దూరంగా వుంచాలా?

  1. విలువైన వ్యాసం. ప్రింట్ తీసి మా పాపతో చదివించాను. ఆ పుస్తకాలు కూడా తీసుకోవాలి.

    1. Very nice Sir. Hope she likes this. Best wishes to her. Happy reading.
      Thank you very much Venkata Krishna Ettyala garu.

  2. పిల్లలతో ఆడిపాడీ కోట్ల సార్లు కొత్తగా పుడుతుంటాం. ఎంత బాగా చెప్పారు.
    చాలా విలువైన వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు

  3. పిల్లలు పుస్తకాలకు దూరమై పోతున్నారు అనేది కటినమైన వాస్తవం…పూర్తిగా ఇంటర్నెట్ కి అంకితమై పోయిన కాలం …ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు పుస్తకాలను దగ్గర చేయటం యొక్క అవశ్యకతను అధ్బుతంగా చెప్పారు… తల్లితండ్రులు పుస్తకాభిలాషులు అయినా కూడా పిల్లలకు వాటిని అలవాటు చేయటం లో విఫలమే అవుతున్నారు….బాలల దినోత్సవం రోజున చిన్నారులకు చక్కటి బహుమతి మీ వ్యాసం…. 🙏

  4. చాలా మంచి వ్యాసం . పిల్లలకి కధలు చెప్పాలి . అవి వాళ్ళకు అర్ధమయ్యే భాషలో చెప్పాలి.

Leave a Reply