సాహిత్యంలో ఆలోచింపజేసే ప్రకియ నాటిక. సమాజంలో సజీవ పాత్రలను ఎంచుకోవడం, వాటి ద్వారా పాతుకుపోయిన దురాచారాలను ఎండగట్టడం ఎంతో మంది రచయితలు చేశారు. సంఘ సంస్కరణ ప్రధాన ఇతివృత్తంగా చాలా రచనలే వచ్చాయి. సమాజ పోకడలను ఆధారంగా చేసుకుని రచనలు చేసిన వారిలో పినిశెట్టి శ్రీరామమూర్తి ఒకరు. అందుకే ఆయన రాసిన నాటికలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. దాదాపు డెబ్భై ఏళ్ల కిందట దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో.. అంటే 1951లో పినిశెట్టి రచన రిక్షావాడు నాటిక ప్రదర్శితమైంది. నాటి సమాజంలో పేదల దుర్గతి ఎంత దయనీయంగా ఉందో ఈ నాటిక తెలియజేస్తుంది.
బతుకు పాఠాలు చదివిన రచయితగా పేరునొంది, రంగస్థలంపై సంచలనాత్మక నాటికలు, నాటకాలను రచించి, నటించి ప్రదర్శించిన ఆధునిక తెలుగు నాటక రంగంపై ప్రత్యేక ముద్ర వేసుకుని అందరి ప్రశంసలు పొందిన బహుకళా కోవిదుడు పినిశెట్టి శ్రీరామమూర్తి. ఆయన కళా నైపుణ్యానికి ఆనాటి సినిమా పత్రికలు ఆయనను స్వతంత్ర చిత్ర రచనా చక్రవర్తిగా అభివర్ణించాయి. తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో 1920లో అమ్మనమ్మ, వెంకటరత్నం దంపతులకు పినిశెట్టి జన్మించారు. తన రెండేళ్ల వయసులోనే తల్లి మరణించడం విషాదం. ఆధునిక నాటక రచనలలో పినిశెట్టి ముద్ర ప్రత్యేకం. ఆయన రచనలన్నీ గ్రామీణ నేపథ్యం, ఆత్మీయత, అనుబంధాల మధ్య సాగేవే. ఆదర్శమండలి అనే నాటక సమాజం ద్వారా ఎన్నో నాటకాలను ప్రదర్శించి ఎందరికో ఆదర్శంగా నిలిచి ప్రశంసలు పొందారు. సమాజ లోతుల్లోకి తొంగి చూసే ఆయన రచనలు బడుగుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. ఆయన రాసిన నాటికలు కులం లేని పిల్ల, అన్నాచెల్లెళ్లు, రిక్షావాడు, చలిజ్వరం, కన్నకొడుకు, పల్లె పడుచు వంటివి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. స్త్రీల పాత్ర లేకుండా రాసిన ఆడది నాటిక దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇవ్వబడి చరిత్ర సృష్టించింది. 1954లో పల్లెపడుచు నాటకాన్ని సినిమాగా చిత్రీకరించడంతో ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 60 పైగా చిత్రాలకు మాటలు రాశారు. రెండు మూడు చిత్రాల్లో హాస్య పాతల్రు కూడా పోషించారు.
పినిశెట్టి రాసిన నాటికల్లో రిక్షావాడు ఒకటి. ఇందులో పాత్రలు ప్లీడర్ సోమసుందరం, అతని కుమారుడు భాను, ప్లీడరు గుమస్తా భాగవతారు, ధనవంతుడైన శంభన్న, రిక్షవాడు, అతని కుమారుడు, శృంగార పురుషుడైన వెంకటేశ్వర్లు, డాక్టర్, పోలీస్. ఇందులో రిక్షావాడి పాత్రను స్టేజిపై స్వయంగా పినిశెట్టి పోషించారు. ఈ నాటిక 1951లో తెనాలిలో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్‌లో ప్రదర్శించారు. రిక్షావాడి పాత్రను ధరించిన పినిశెట్టి గారికి రజత బహుమతి లభించింది. ఇది ఓ రిక్షావాడి కథ అయినా అంతర్లీనంగా సమాజంలో బలహీనులు, బలవంతుల జీవితాల మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తుంది. అజీర్తి రోగానికి, ఆకలి రోగానికి మధ్య తేడాను తెలియజేస్తుంది. ఇది ఓ రిక్షావాడి కథ. కడు పేదరికంతో సరైన ఆహారం లేక రోగిష్టిదైన భార్యను కాపాడుకోవాలని అతడు రెక్కలు ముక్కలు రిక్షా తొక్కుతుంటాడు. అతని కొడుకు కూలిగా పనిచేస్తుంటాడు. వారి పట్ల సమాజం ఎలా వ్యవహరించిందనేదే ఈ నాటికలోని కథాంశం.
రిక్షా తొక్కినా తన శ్రమకు తగిన బాడుగ ఇవ్వాలని ప్లీడరు సోమసుందరాన్ని రిక్షావాడు బతిమిలాడుకోవడంతో నాటిక మొదలవుతుంది. ఆ వచ్చిన రూపాయితో ఇంటివద్ద అనారోగ్యంతో ఉన్న భార్యకు కాస్త గంజి నీళ్లు తాపించాలని ఆ రిక్షావాడి తాపత్రయం. దర్జాగా రిక్షా ఎక్కి వచ్చి ఆ రిక్షావాడి కష్టానికి విలువలేనట్లు ప్లీడరు, అతని గుమస్తా బేరాలాడతారు. అతని కష్టాన్ని చాలా చిన్నచూపు చూస్తారు. రిక్షా యజమాని శంభన్న వీరి తరహానే రిక్షాకు అద్దె కట్టాల్సిందేనంటూ లేదంటే జైలు పాలు చేస్తానని బెదిరిస్తుంటాడు. ఇదే క్రమంలో పోలీసుకు రిక్షావాడు ఓ శృంగార పురుషుడిని ఎక్కించుకుని వెళ్లడం కనిపిస్తుంది. పైగా తన రిక్షా అద్దె కట్ట లేదంటూ యజమాని శంభన్న కూడా ఫిర్యాదు చేస్తాడు. రిక్షావాడిని పోలీసులు ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో చితకకొడతారు. ఇంటివద్ద భార్యకు ఆరోగ్యం ఏమీ బాగో లేదంటూ ఎంత మొరపెట్టుకున్నా కనికరం చూపలేదు.
ప్లీడరు కుమారుడు భాను ఆదర్శ భావాలు కలిగిన యువకుడు. తన భావజాలంలో ఇక్కడ గొడవలు తెస్తున్నాడని తండ్రి అతనిని బొంబాయి పంపిస్తాడు. అతను ఇంటికి వచ్చిన సందర్భంలోనే రిక్షావాడితో బాడుగ విషయంలో గొడవ జరుగుతుంది. మరోవైపు ఇంట్లో భాను తల్లి అజీర్తితో బాధ పడుతుంటుంది. ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్‌ను తీసుకువస్తారు. ఇంకోవైపు రిక్షావాడి భార్య కూడా ఓ పూరి గుడిసెలో చావు బతుకుల్లో ఉంటుంది. మానవత్వం ఉన్న భాను, డాక్టర్‌ను రిక్షావాడి భార్యను చూసి రమ్మని పంపుతాడు. అప్పటికే సమయం మించిపోతుంది. చివరికి ఆమె చనిపోతుంది. నిన్నే తలచుకుంటూ చనిపోయిందని కొడుకు ఏడుస్తూ వచ్చి రిక్షావాడితో చెబుతాడు. ఒంటిపై పోలీసులు కొట్టిన గాయాలు, మనసుపై ప్లీడరు, శంభన్న వంటివారు చేసిన గాయాలతో రిక్షావాడు ఇంటిదారి పడతారు. మరోవైపు ప్లీడరు కుమారుడు భానును కూడా పోలీసులు తీసుకెళ్లడంతో నాటిక ముగుస్తుంది. దానికి కారణం సమాజంలో అశాంతిని సృష్టిస్తున్నాడని పోలీసులు చెబుతారు. ఇదీ స్థూలంగా రిక్షావాడు నాటిక కథాంశం.
పినిశెట్టి సరళమైన, పదునైన మాటలు ఈ నాటికను వీక్షించిన ప్రేక్షకుల మనసులను వెంటాడుతుంటాయి. సంభాషణలు ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయాయి. పాత్రలను మలచిన తీరు కూడా అబ్బురపరుస్తుంది. రిక్షావాడికి, అతని కుమారుడికి పేర్లుండవు. అదే విధంగా పోలీసు, డాక్టరుకు కూడా నామవాచకం లేకుండా సర్వనామాలు వాడడం పినిశెట్టి రచనా శైలిలోని ప్రత్యేకత. ఈ శైలి నాటికలో ప్రేక్షకులు లీనమై తమను ఆ పాత్రలలో ప్రతిబింబించుకునేలా చేస్తుంది.
నాటికలోని రెండు సందర్భాల్లో రిక్షావాడు తన బతుకును గురించి వివరిస్తాడు. ఏ రిక్షా ఆగు.. అదే అందరి పిలుపు. అసలు మనిషి ఓ రిక్షా లాగుతున్నాడనేదే వారికి అక్కర్లేదు. మనిషో, జంతువో కూడా అని అవసరం లేదు. వాళ్లకి రిక్షాయే కావాలి. రిక్షా అనే పిలుస్తారు.. అంటూ రిక్షా తోలే అభాగ్యుడంటే కొందరిలో ఎంత తక్కువ భావన ఉందో తెలియ జేస్తాడు.
ఇంకో సందర్భంలో రిక్షావాడు డాక్టర్‌కు తన గోడును వినిపిస్తాడు. నేను మడిసిలాగే పుట్టాను. మడిసిలాగే బతకాలనుకుంటున్నాను. కానీ మడిసిలా బతకట్లేదు. వంచిన నడుము ఎత్తకుండా ఎంత లాగినా మా కడుపులే నిండవు. మమ్మల్ని మడిసిలాగా ఎవరూ చూడరు బాబూ.. మేము మడిసిగా ఉన్నామనే సంగతి రిచ్చా కమ్ములు పట్టుకున్న నాడే మరిచిపోయినం… డబ్బుకోసం బతుకుతున్నం.. ఆ డబ్బు నిలవేసుకునేందుకు కాదు బాబూ.. కాలే కడుపుకు గంజి కోసం.. ఇలా ఇంకా తాము తినే తిండి గురించి, తాముండే గుడిసెల గురించి, పోలీసులు తమపై ప్రదర్శించే దాష్టీకం గురించి.. వివరిస్తాడు.
ఇంకో సందర్భంలో.. పోలీసోరు మాకు దేవుళ్లు.. పెబుత్వం ఏదైనా ఉందంటే మాకు పోలీసోరిలోని కనిపిస్తారు.. అందుకే వారికి మొక్కుకుంటాం.. అని రిక్షావాడు చెబుతాడు. కానీ ఆ రిక్షావాని పట్ల పోలీసు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. ఆ పోలీసు మాత్రం.. వీళ్ల సంగతి నీకేం తెలుసు దొంగతనాలు చేస్తారు.. ముండలను తార్చి కమిషన్లు కొడతారు.. రాంగు రైటు లేకుండా గర్నమెంటు రూల్సుకు వ్యతిరేకంగా నడుపుతారు.. రాత్రుళ్లు రిక్షాలకు లైట్లు ఉండవు. ఇద్దరిని ముగ్గురిని ఎక్కించుకుని వారి ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు.. అని అంటాడు. అది ఆ పోలీసువాని అహంకారం. రిక్షా తోలే వారి పట్ల వారికున్న దురభిప్రాయం.
పినిశెట్టి రచనల్లో సామాజిక స్పృహ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మానవీయ విలువలు గోచరిస్తాయి.. రిక్షావాడు నాటికలో కూడా అవే కనిపిస్తాయి. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే రిక్షావాడు, ఆదర్శవంతమైన సమాజాన్ని చూడాలనుకునే భాను, మంచి చెడులను బేరీజు వేసుకుని మంచివైపు మొగ్గు చూపే డాక్టర్ ఈ ముగ్గురు ఒక వైపు అయితే లాభాపేక్ష, దుర్నీతి, దోపిడీకి ప్రతీకలుగా ప్లీడరు, శంభన్న, పోలీసు కనిపిస్తారు. న్యాయం ఓ వైపు, అన్యాయం మరోవైపు. రిక్షావాడి భార్య దుర్భర జీవితం గడిపి చనిపోతుంది. ఆమెను బతికించుకోవాలనే రిక్షావాడి ఆశ ఫలించలేదు. ఆదర్శ భావాలున్న భాను జైలు పాలవుతాడు. ఈ నాటికలో పినిశెట్టి అంతిమ తీర్పును ప్రేక్షకులకే వదిలేశారు.
ఇందులో సందేశాత్మకమైన భాను పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతిదానికి హేతువాదం, భౌతికవాదం అంటుంటాడు. వాడో తిక్కరకం అంటూ అతని తండ్రి సోమసుందరమే కొడుకును వెటకరిస్తుంటాడు. రిక్షావాడిని పోలీసు స్టేషన్‌కు లాక్కెళుతుంటే భాను అడ్డుకుంటాడు. రిక్షావాడి భార్యకు తీవ్ర అనారోగ్యంగా ఉందని తెలిసి తన తల్లికి చికిత్స చేయించడానికి వచ్చిన డాక్టర్‌ను కూడా ఆ మురికివాడకు పంపిస్తాడు. అందరినీ ప్రశ్నిస్తుంటాడు. చివరకు అంతరినీ ఎదిరించి జైలుకు వెళతాడు. అదే విధంగా డాక్టర్ పాత్ర కూడా ప్లీడరు భార్యకు అజీర్తి చేసిందని వచ్చిన ఆయన ఆమె కొడుకు సూచన మేరకు రిక్షావాడి ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. మానవత్వాన్ని బతికించాలనే తపన ఆ ఇద్దరిలోనూ కనిపిస్తుంది.
రెక్కల కష్టాన్ని నమ్ముకని జీవించే అభాగ్యుల జీవితాలకు దర్పణంగా ఈ నాటిక నిలుస్తుంది. అటువంటి అభాగ్యులు ఇప్పటికీ ఉన్నారు. ఏళ్లు గతించినా వారి జీవన స్థితిగతులు మారలేదు. మనిషిని మనిషిగా చూడలేని పెత్తందార్లు కూడా ఉన్నారు. అయితే నేటి సమాజంలో వీరందరి రూపాలు మారాయి అంతే.
చివరిగా ఈ నాటికలో భాను పాత్రధారి అన్న మాటలు గుర్తు చేసుకుందాం.. “దేశం నలుమూలలా దరిద్రం తాండవిస్తూ ప్రజలనే బలిగా తీసుకుంటుంటే.. ఆ డబ్బు దాచి.. శ్మశానాన్ని సృష్టించి నీచమైన కృత్రిమ సంతోషాన్ని సృష్టించడం జాతికి, దేశానికి అనారోగ్యం కాదా..? ఒక లక్షాధికారి స్వార్ధం కోసం వేలకువేల పేదలు బలైపోవడం ఎంత నీచమో ఆలోచించండి.” ఈ సంభాషణ నాటి, నేటి సమాజానికి వర్తిస్తుంది. అంటే పినిశెట్టి శ్రీరామమూర్తి రచన.. కాలాన్ని దాటి ప్రజలను మేలుకొలుపు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.