ఆచరించని ఐక్యత రాగం నీకో రోగమయింది
విభజించొద్దనే వితండవాదం నీకు విష జ్వరమై పట్టుకుంది
కలిసి ఉందామనే కపటం ఎత్తేసుకొస్తుంది
తవుడు తడిసిందనీ ఏడుస్తుంటే తమలపాకు తెలిసిందే మొత్తుకుంటావు
మాది తవుడు బతుకు మీది తమలపాకు విలాసం
బ్రతుక నేర్చిన రంగస్థలం మీది అబద్ధాలు
కొండంత రాగమెత్తి విడిపోవద్దనే బాంచ పాటలు పాడుతున్నాయి
మనమ్మనము ఒక్కటంటావా?
మనము కలిసున్నది ఎప్పుడు?
జూట మాటలొద్దు
చేతుల చెయ్యేసి జోటపాటలు పాడినమా ?
మరుగున పెట్టకు
మనసార అలై బలై తీసుకున్నామా?
నా నరాలు తెగేలా నిన్ను ఆలపించినా ప్రలాపించినా
వాకిట్లోకి రానివ్వనొనివి వంటింట్లో వడ్డిస్తావా?
వట్టి మాటలు వద్దు
కంచం నీది మట్టి చిప్ప నాది
కాగిన గంజి కలిసి తాగనివ్వనోడివి కడుపునిండా తిననిస్తావా?
నోటి బుక్క ఎత్తగొట్టి నొసిటితో ఎక్కిరిస్తూ
హక్కుల జోలె నింపుకొంటివి
కడుపు నిండి నీవు, ఆకలి మండే కడుపుతో నేనూ
కలిసుందాం అంటే ఎట్లా కలుస్తది
వీపును నిమిరినంత అలుకగా
ఏర్పడకుండా కడుపులో గుద్దుతున్నావ్
కులాలు, మూలాలు వేరువేరు
వృత్తులు, ప్రవృత్తులు వేరు వేరు
పొత్తుల ముల్లగట్టిన హక్కుల సద్ది మెక్కు కుంట
దళితులంతా ఒక్కటంటే దబాయింపులుగావా ?
కనీసం నీవు నేను ఏనాడైనా పొత్తులున్నమా?
నీ తండ్రి ఆస్తిని మీ అన్నదమ్ములతో కలిసి పంచుకోలేదా ?
ఇంట్లో వాటాల పంపకం సరే
మనమధ్యల వర్గీకరణ వద్దనే వాదనెందుకు ?
సామాజిక వికాసంలో ఇది తరాల తండ్లాట
నీ వాదానికి
మనువాదాన్ని పెన్నుపోటుతో మన్నుగప్పిన సామాజిక న్యాయం
చెరి సగం పంచలేక అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది
తీరని దుఃఖం న్యాయం దొరకని నడి సముద్రంలో
తీరం దొరక్క తీర్ తీరుగా వలపోస్తుంది
సభ్యసమాజంలో
ఉత్త చేతులతో ఉపకులాలున్నాయి చూడు
సంక లేపితే కార్జాలు కనబడుతున్నయి
ఉగ్గ పట్టిన ఊపిరి దినదిన ప్రాణగండంగా
మొండి ఆయుష్షుతో మొరాయిస్తున్నాయి
దగా పడిన గోసలు గొంతెత్తుతున్నాయి
న్యాయం కోసం మండుతున్నాయి
విడి కళ్ళ చూపు ఒకటే
పాసంగం తూచే కొసల ధర్మం
కావడిబద్దలా కలిసి ఉండడం ఉత్కృష్టం
పంచుకుందాం ముసుకుని తెంచుకుందాం
నీది నీకే నాది నాకే
మనది మనకే కాపాడదాం
ఉనికికి ఊచ కోత కోసే మనువాది మీద మన్ను పోద్దాం
కుట్రల కుంపట్లు రగిలించే అగ్ని జ్వాలల్ని ఆర్పేద్దాం
జోట బాటలు పట్టి అధికారాన్ని అందుకుందాం పద
Excellent one sir
True one