పాలస్తీనా ప్రతిఘటనా పద్యాలు

ప్రవాసం
సలీం జబ్రాన్

సూర్యుడు సరిహద్దుల్లో ప్రయాణిస్తుంటాడు
తుపాకులు మౌనం పాటిస్తాయి
ఆకాశవిహంగం తుల్కరేం లో ప్రభాత గీతాల్ని పాడుతూ
కిబ్బుట్జ్ లో పక్షుల్ని కలవడానికి ఎగిరిపోతుంది

ఒంటరి గాడిదొకటి కాల్పుల రేఖల్ని దాటి నడుస్తుంటుంది భారంగా
కాపలా దళాలను పట్టించుకోకుండా
ఓ నా మాతృదేశమా
బహిష్కరించబడ్డ నీ ప్రియపుత్రుడిని నేను

నాకు మాత్రం
నీ ఆకాశాలకూ నా కళ్ళకూ మధ్య

ఎటుచూసినా
విస్తారంగా, అనంతంగా విస్తరించిన
సరిహద్దు గోడలే
నా చూపుల్ని నల్లగా కప్పేస్తూ
నన్ను గుడ్డివాన్ని చేస్తున్నై

అసాధ్యం
తఫీక్ జయ్యద్

ఒరే బడుద్దాయ్
సూది రంధ్రం నుండి ఏనుగుని తోసెయ్యడం
విశ్వాంతరాళాల్లో వేయించిన చేపల్ని పట్టుకోవడం
మండే సూర్యుణ్ణి ఆర్పెయ్యడం
వీచే గాలిని బంధించి ఖైదు చెయ్యడం
మొసళ్ళతో మాట్లాడించడం

మమ్మల్ని హింసించి, పీడించి, ధ్వంసం చెయ్యడం కన్నా,
దిక్కుల్ని వెలిగించే మా విశ్వాసాల వెలుగుల్నీ ఆర్పేడయ్యం కన్నా,
ఒక్కొక్క అడుగే మా అంతిమ లక్ష్యం కోసే వేసే
మా కవాతుని ఆపడం కన్నా
నీకు చాలా తేలికరా

నిరంతరం జీవించే ఉంటాం
ఫద్వా తఫీక్

ప్రియమైన మాతృదేశమా

అంతుతెలియని
క్రూరత్వపు యెడారుల్లో,
నొప్పీ, వేదనల విసుర్రాయిలతో
నిన్నెంత నజ్జు నజ్జు చేసినా,
ఆశల్నీ, కలల్నీ పొదుగుకున్న
నీ కనుపాపల్ని
వాళ్లెన్నడూ పెరకలేరు
నింగికెగసే నీ కోరికల రెక్కల్ని శిలువ వెయ్యలేరు
నీ చిన్నారుల చిరునవ్వులని దొంగిలించనూ లేరు
కాల్చి ధ్వంసం చేయలేరెన్నడూ
నీ అనంతాకాశ ఆకాంక్షల్ని
మన లోతైన విషాదాల్నుండి
చిందిన మన తాజా కొన్నెత్తురు నుండి
వణుకుతూ పోరాడుతున్న మన జీవన్మృత్యు క్షణాల నుండి

జీవితం మళ్ళీ కొత్తగా పునర్జీవిస్తుంది

నా రోజువారీ తిండి కోల్పోవచ్చు
సమీహ్ అల్ ఖాసీం

నేను నా రోజువారీ తిండిని కోల్పోవచ్చు
నా బట్టల్నీ, పడక మంచాల్నీ తాకట్టు పెట్టవచ్చు
నేను రాళ్ళు కొట్టే వాణ్ణౌతానో,
కూలీ వాణ్ణౌతానో
వీధుల్నూడ్చే వాణ్ణౌతానో
నా తిండి కోసం పశువుల పెంటలో వెతుక్కుంటానో
కూలిపోతానో నగ్నంగా ఆకలితో
ఒరే వెలుతురు విధ్వంసకుడా
శత్రువా
నీచుడా
భ్రష్టుడా

నేను రాజీ పడే ప్రసక్తే లేదు
చివరి దాకా కొట్లాడుతూనే ఉంటాను
నా భూమి చివరి చెక్కనూ దొంగిలిస్తావో
నా యవ్వనాల్ని మొత్తం ధ్వంసం చేసి జైలు రంధ్రాల్లో కుక్కుతావో
మా తాత ముత్తాతలిచ్చిన నా కొద్దిపాటి ఆస్తిని కొల్లగొడతావో
నా సామానులని, బట్టలని, పచ్చడి మర్తాబాన్ లని కూడా కక్కుర్తిగా దొంగిలిస్తావో
నా కవిత్వాన్ని పుస్తకాలనీ తగలబెడతావో
నా మాంసాన్ని నీ కుక్కలకు ఆహారంగా వేస్తావో
నీ విధ్వంస పీడకలల్ని మా మీద, మా గ్రామాల మీదా రుద్దుతావో
ఒరే భ్రష్టుడా
వెలుతురు ద్వేషీ
ఆగర్భ శత్రువా

నేను రాజీ పడే ప్రసక్తే లేదు
చివరిదాకా కొట్లాడుతాన్నేను
ఒరే వెలుతురు శత్రువా
మా ఆనందాల కేరింతల కెరటాల చప్పుళ్ళు
మా జాతీయ గీతాల కవాతులు
ప్రతిధ్వనిస్తున్నాయి దిగంతాల్లో

సుదూర తీరాల్లో
సుడిగాలుల్ని సుడిగుండాల్ని ఎదుర్కొంటూ
మా పడవ సాగుతోంది మునుముందుకు
అన్నీ అడ్డంకుల్ని అధిగమిస్తూ

యూలిస్సెస్ వాపస్ వస్తున్నాడు మా విజయానికి సంకేతంగా
మేము కోల్పోయిన సముద్రాలనుండి
బహిష్కృతులంతా తిరిగొస్తున్నారు
తమ మాతృభూమికి
వాళ్ళ కోసం
మా అమ్మ మీద ఒట్టు

నేను రాజీ పడే ప్రసక్తే లేదు
చివరి దాకా కొట్లాడుతూనే ఉంటా!

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

One thought on “పాలస్తీనా ప్రతిఘటనా పద్యాలు

  1. స్పష్టమైన దృక్ఫధం తో రాసే కవత్వం ఎంత ఉద్వేగానకి లోను చేస్తుందో కదా. ఇది పోరాట కవిత్వం. స్పష్టమైన చూపున్న కవిత్వం. శిల్పం గురించి యావ ఇబ్బంది కలిగించే మార్మికత సంబంధం లేకుండా నేరుగా హృదయానికి తాకే కవిత్వం. గొప్ప అనువాదం అన్న.

Leave a Reply