పశ్చిమాసియాను యుద్ధంలోకి లాగుతున్న ఇజ్రాయెల్‌

హమస్‌ మిలిటెంట్లను అంతమొందించే సాకుతో పాలస్తీనా పౌరులను లక్ష్యంగా చేసుకొని గాజా స్ట్రిప్‌లో యుద్ధోన్మాదంతో ఇజ్రాయెల్‌ దాడులను ప్రారంభించి అక్టోబర్‌ 7 నాటికి ఏడాది పూర్తయింది. పాలస్తీనా ప్రజలపై అమానవీయ ఇజ్రాయెల్‌ దాడులను ప్రతిఘటించేందుకు హమస్‌కు చెందిన సాయుధులు గతేడాది అక్టోబర్‌ 7న దాడులకు పాల్పడ్డాయి. రెండు వందల మంది పైగా ఇజ్రాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇజ్రాయెల్‌ గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. చిన్నారులు, మహిళలు, శరణార్థులతో సహా అమాయక పాలస్తీనా ప్రజలను లక్ష్యంగా చేసుకొని వైమానిక, భూతల దాడులు చేస్తూ వస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ అక్కడి ప్రజలు తలదాచుకున్న పాఠశాలలపైనా, ఆసుపత్రులపైనా, మసీదులపైనా ఇజ్రాయెల్‌ బలగాలు దాడులను చేస్తున్నాయి. ఫలితంగా ఇప్పటి వరకు గాజాలో 42 వేల మంది చనిపోయారు. హింసాత్మక దాడుల్లో చిక్కుకుపోయిన గాజా ప్రజానీకం అంతులేని పెను విషాదాన్ని చవిచూస్తోంది.

గాజాలోని అతిపెద్ద పట్టణ ప్రాంత శరణార్థ శిబిరమైన జాబాలియాలోకి ఇజ్రాయెల్‌ బలగాలు చొచ్చుకు వెళ్లాయి. వరుసగా వైమానిక, భూతల దాడుల అనంతరం అక్కడి ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా ఆర్మీ ఆ దేశాలు జారీ చేసింది. . గాజాలోని 21 లక్షల మందిలో 90 శాతం మంది నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా.

అమెరికా అండతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ :

అమెరికా అండ చూసుకుని ఇష్టానుసారంగా చెలరేగుతున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌ నేడు పశ్చిమాసియాకు పెను విపత్తుగా మారింది. ఇతరుల కొంపలు తగులబెట్టి… ఆ మంటల్లో చలికాచుకునే దుర్మార్గ వైఖరి అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికాది. పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ జ్వాలను మరింత ఎగదోసి, ఆ ప్రాంతం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న వ్యూహంతో ఇజ్రాయెల్‌కు ఏడున్నర థాబ్దాలుగా మద్దతు ఇస్తోంది. పశ్చిమాసియా అగ్నిగుండంలా మారడానికి నెతన్యాహు అనుసరిస్తున్న విధానాలే కారణమని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాలస్తీనా విమోచన కోసం పోరాడుతున్న హమస్‌ యోధులకు లెబనాన్‌లోని హిజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు మొదటి నుంచి మద్ధతిస్తూ ఇజ్రాయెల్‌, అమెరికా దాష్టికానికి వ్యతిరేకంగా పోరాడుతొన్నాయి. సంవత్సర కాలంగా గాజాను వల్లకాడు చేసిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. అక్టోబర్‌ 1 నుంచి లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ భూతల దాడుల్లో దాదాపు రెండు వేల మంది లెబనాన్‌ జాతీయులు మరణించారు. 14 లక్షల మంది నిర్వాసితులయ్యారని అధికార గణాంకాలు తెలిపాయి. మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీ సాయుధుల దాడుల, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, అమెరికా నీచపు సైనిక ఎత్తుగడలతో మధ్యప్రాచ్య ప్రాంతం రణభూమిగా మారిపోయింది.

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్‌ వచ్చిన నెతన్యాహు, సెప్టెంబర్‌ 27న ఐరాస వేదిక నుంచి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యూహు సభ్య దేశాల సమక్షంలోనే తాము తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ప్రకటించారు. పైగా హిజ్బొల్లాకు సహకరిస్తోన్న ఇరాన్‌కు ఘాటైన హెచ్చరికలు వెలువరించారు. ఇరాన్‌లోని సుదూర ప్రాంతాలు కూడా తమ సైనిక శక్తుల రాడార్‌ పరిధిలో ఉన్నాయని, తమ టార్గెట్‌ను తప్పించుకుని ఇరాన్‌లోని ఏ ప్రాంతం సురక్షితంగా ఉండలేదని ఆయన హెచ్చరించారు. పనిలో పనిగా ఆయన ఐరాస తీరు తెన్నులను, శాంతివచనాలకు దిగుతున్న దేశాలను కూడా దునుమాడాడు. ఐరాసలో ఆయన ఘాటైన ప్రసంగం ముగిసిన వెంటనే అంతకు ముందే అంతా సిద్ధం చేసుకుని ఉంచిన దాడుల ప్లాన్‌ మేరకు ఇజ్రాయెల్‌ అత్యంత భీకర స్థాయిలో బీరూట్‌లోని హిజ్బొల్లా కంచుకోటను దెబ్బతీసింది. ఇక్కడ జరిపిన దాడులు అత్యంత శక్తివంతమైనవి. టన్నుల కొద్ది బరువు ఉండే బాంబులను వందలాది ప్రయోగించడంతో హిజ్బొల్లా కీలక స్థావరం కుప్పకూలింది. శిథిలాలలో హిజ్బొల్లా అధినేత, వారికి ఆయువుపట్టు హసన్‌ నస్రల్లా, ఆయన కూతురు మృతి చెందారు.

గాజా, వెస్ట్‌బ్యాంక్‌లపై క్రూరమైన దాడులు చేస్తూ అమాయక పౌరులను పెద్దయెత్తున ఊచకోత కోస్తున్న యుద్ధోన్మాది జియోనిస్టు నెతన్యాహు ఇప్పుడు లెబనాన్‌పై వైమానిక దాడిలో ఇరాన్‌కు చెందిన పారా మిలిటరీ బలగాల అధినేత జనరల్‌ ఒకరు హతులయ్యారు. హిజ్బొల్లా స్థావరంలో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తూ ఉండగా, ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహాలు పన్నుతుండగా ఇజ్రాయెల్‌కు సమాచారం అందింది. అదీ కూడా ఇరాన్‌కు చెందిన మనిషి గూఢచర్యం నుండి దక్కిన వార్తతోనే గురి చూసి ఈ స్థావరాన్ని పేల్చేసింది. దీనితో ఇరాన్‌ నుంచి తీవ్ర స్పందన వెలువడింది. తాము కూడా ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగుతామని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడులలో హిజ్బొల్లాకు చెందిన మరో కీలక నేత నబిల్‌ కౌక్‌ హతుడు అయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. హిజ్బొల్లా సెంట్రల్‌ కమాండ్‌లో ఆయన ఉపదళపతి. తాజాగా ఇజ్రాయెల్‌ సేనలు యెమన్‌లోని హౌతీ రెబెల్స్‌ స్థావరాలను కూడా తుదముట్టించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అమెరికా పత్రికలు పేర్కొన్నాయి.

ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యమైన అమెరికా, బ్రిటన్లు మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. గాజాను పూర్తిగా నేలమట్టం చేసి, లెబనాన్ ను పావు వంతు ఆక్రమించి ఇరాన్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి సిద్ధం అవుతున్న ఇజ్రాయెల్‌ను అగ్రరాజ్యాలు నిలువరించలేకపోతున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్‌కు మిత్రులుగా ఉన్న హిజ్బొల్లాలు, హౌతీలపైన ఏకపక్షంగా దాడులు చేయడం ద్వారా ఆ దేశాన్ని యుద్ధంలోకి లాగాలని, తద్వారా దీనిని ప్రాంతీయ యుద్ధంగా మార్చాలని అమెరికా, దాని తైనాతీల పన్నాగం. చిలికి చిలికి గాలి వానలా మారిన చందంగా చిన్న చిన్న దాడులతో, మాటల తూటాలతో ప్రారంభమైన ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల మధ్య సంఘర్షణ పెనుయుద్ధానికి దారి తీసే విధంగా క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. పాలస్తీనా భూభాగాలను చాలావరకు కబళించిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు పశ్చిమాసియాలోని ఇతర దేశాల భూభాగాలను కూడా ఆక్రమించుకోవాలని చూస్తోంది. గాజా నుంచి లెబనాన్‌కు, అటు నుంచి ఇరాన్‌కు యుద్ధాన్ని విస్తరింపజేయడం ద్వారా గ్రేటర్‌ ఇజ్రాయెల్‌తో బాటు ఈ ప్రాంతంలో తన భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని నెరవేర్చుకోవచ్చన్నది అమెరికా పన్నాగం.

ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు, ఖండనలు :

గాజాపై ఇజ్రాయెల్‌ దమనకాండను నిరసిస్తూ సంవత్సర కాలంగా యుద్ధాన్ని ఆపాలని, ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఇవ్వకూడదని, ఇజ్రాయెల్‌లో వాణిజ్య సంబంధాలు నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ అమెరికాలో, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలలో విద్యార్థులు, పౌరసంస్థలు, కళాకారులు, యుద్ధ వ్యతిరేక సంఘాలు తీవ్రంగా నిరసన ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధానికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అక్టోబర్‌ 7న గాజా, లెబనాన్‌లో కాల్పుల విరమణకు పిలుపునిస్తూ అంతర్జాతీయంగా వేలాదిమంది ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. హమస్‌ జెండాలు ఊపుతూ హతమైన హిజ్బొల్లా నాయకుడు హసన్‌ నస్రల్లా చిత్రపటాలతో వేలాది మంది ప్రజలు ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రమల్లాలో ర్యాలీ చేశారు. పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు, సంస్మరణ సభలు, నిరసన ప్రదర్శనలు, పలు కార్యక్రమాలు జరిగాయి. టెల్‌ అవీవ్‌ నుండి లాహోర్‌, టోక్యో, ఇండోనేషియా, స్పెయిన్‌లోని బార్సిలోనాలో, మొరాకో, టర్కీ, లండన్‌, ప్యారిస్‌, బెర్లిన్‌ తదితర దేశాల్లో పలు నగరాల్లో ప్రజలు పాలస్తీనియన్లకు తమ మద్దతు ప్రకటించారు.

పోప్‌ ఫ్రాన్సిస్‌ పశ్చిమాసియాలో యుద్ధాన్ని, ఘర్షణలను పరిష్కరించడంలో ప్రపంచ దేశాలు విఫలమవడం సిగ్గుచేటైన వ్యవహారమని ఆయన విమర్శించారు. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఏడాది క్రితం, విద్వేషాగ్ని రగిలింది. సిగ్గుపడే రీతిలో అంతర్జాతీయ సమాజం వైఫల్యం కారణంగా అది హింసను చిమ్ముతోంది. ఈ విషాదానికి స్వస్తి పలకడంలో ప్రపంచ అగ్ర దేశాలు విఫలమయ్యాయి” అని ఆయన కేథలిక్కులకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఏడాదిగా రగులుతున్న పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ తక్షణావసరమని అమెరికా అధ్యకక్షుడు జో బైడెన్‌, అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ సన్నాయి నొక్కులు నొక్కారు. ఏడాది పొడవునా సాగిన ఈ దాడుల్లో అనేకమంది సామాన్యులు ఇబ్బందులు పడ్డారని బైడెన్‌ ఒక ప్రకటనలో మొసలి కన్నీరు కార్చారు.

యుద్ధ విస్తృతికి అమెరికా ప్రోత్సాహం :

హమస్‌ అధినేత యాహ్య సిన్వర్‌ను అక్టోబర్‌ 17న ఇజ్రాయెల్‌ హత్య చేసింది. ఈ హత్యలో హమస్‌ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని ఇజ్రాయెల్‌ భావించింది, కాని వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది. గాజాలో కాల్పుల విరమణ సాధించే వరకు తాము పోరాటాన్ని విరమించబోమని హమస్‌ ప్రతినిధులు స్పష్టంగా చెప్పారు. మరోవైపు గత ఏడాది కాలంగా సాగించిన నరమేధానికి ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించక తప్పదని టర్కీ అధ్యకక్షుడు ఎర్డోగన్‌ హెచ్చరించారు. ఈ రోజు కాకపోతే రేపైనా తాను చేసిన దారుణాలకు, అక్రమాలకు తగిన మూల్యాన్ని చెల్లిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. శ్వేతసౌధం బయట నిప్పంటించుకున్న ఓ జర్నలిస్ట్‌ తొలుత ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినవారు కూడా, ప్రస్తుతం పశ్చాత్తాపపడుతున్నారన్నారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న నిరసనల్లో ఆయన పాల్గొన్నాడు. గాజాలో కాల్పుల విరమణకు డిమాండ్‌ చేస్తూ వాషింగ్టన్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్‌ వరకు సాగిన నిరసన మార్చ్‌లో వేలాది మందితో కలిసి ఆయన నడిచాడు. ఆ సమయంలో సదరు జర్నలిస్టు తనకు తాను నిప్పంటించుకున్నాడు. శ్వేత సౌధం బయట నిప్పంటించుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ.. ”నేను జర్నలిస్టును. మేము నిర్లక్ష్యంగా వ్యవహరించాం. మేము తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశాం” అని ఆవేదన వెలిబుచ్చాడు.

యుద్ధం ఒక విస్తృత దృశ్యం. దాన్ని అర్థం చేసుకునే ముందు, కొన్ని అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. సిరియాలో ఉండే ఇరాన్‌ ఎంబసీపై ఏప్రిల్‌ 1న బాంబులు వేసి, ముఖ్యులైన మిలటరీ, దౌత్య ప్రముఖులను చంపింది. సిరియాపై దాడి చేసిందీ ఇజ్రాయిలే. ఓస్లో ఒప్పందం పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా వాగ్దానం చేస్తే, దాన్ని తుంగలో తొక్కి, అత్యధిక భాగాన్ని ఆక్రమించిందీ ఇజ్రాయిలే. అయితే గాజా యుద్ధాన్ని, ఇజ్రాయెల్‌ ఎందుకని లెబనాన్‌లోకి విస్తరించింది? పేజర్‌, వాకీటాకీ పేలుళ్లు, హిజ్బొల్లా నాయకుడు హసన్‌ నస్రల్లా హత్య, లెబనాన్‌ దురాక్రమణ-ఇవేవీ తెలివైన సైనిక చర్యలుగా అనిపించవు. గాజా అనే చిన్న ముక్కలో ఉన్న, హమస్‌ను మట్టుబెట్టాలనే సైనిక లక్ష్యాన్ని ఒక సంవత్సరం అయినా ఇజ్రాయెల్‌ సాధించలేకపోయింది. పశ్చిమాసియాపై అమెరికా నియంత్రణ బలహీనపడటం (పాశ్చాత్య దేశాలు, అట్లాంటిక్‌ దేశాలు దీన్నే మధ్య ప్రాచ్యం అంటారు), ఇరాన్‌ బలపడటం, ఇరాక్‌ దురాక్రమణ తర్వాత అక్కడి ప్రజల నుండి దూరం కావడం, సిరియా పాలకున్ని తొలగించలేకపోవడం-ఇవన్నీ అమెరికా దృష్టిలో వైఫల్యాలు. గల్ఫ్‌ చమురును అమెరికా తన సొంత చమురు నిల్వల వ్యూహాత్మక పొడిగింపుగా భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అందువల్ల ఇజ్రాయెల్‌ను తమకు మిలిటరీ పొడిగింపుగా అమెరికా, నాటో, పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఇజ్రాయెల్‌కు ఈ దేశాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయి. ఇరాన్‌తో శత్రుత్వతం కొనసాగుతూ వస్తుందన్నా, ఇరాక్‌, సిరియా, లిబియా దేశాల ప్రభుత్వాలను కూల్చాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నా దానికి కారణం ఇవే.

ఇజ్రాయెల్‌కు దన్నుగా తాము సైతం రంగంలోకి దిగుతామని అమెరికా హెచ్చరించటం పరిస్థితులు వికటిస్తున్నాయన్న సంకేతాలిస్తున్నాయి. ఇరాన్‌ మద్ధతుగా రష్యా, చైనాలు రంగ ప్రవేశం చేసే అవకాశం లేకపోలేదు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ నేరుగా తలపడటం ఇక లాంఛనం. ఒకసారంటూ యుద్ధం మొదలైతే దాని గమనం, ముగింపు ఎవరి చేతుల్లోనూ ఉండవు. దాని తోవ అది వెదుక్కుంటుంది. రెండో ప్రపంచ యుద్ద పర్యవసానాలు చూశాక మళ్లీ ఆ ఉత్పాతం జరగనీయరాదని ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. ఎందుకంటే ఆ యుద్ధంలో అయిదున్నర కోట్ల మంది సాధారణ పౌరులు, మరో రెండున్నర కోట్ల మంది సైనికులు మరణించారు. కోట్లాదిమంది క్షతగాత్రులయ్యారు. ఒక్క సోవియెట్‌ యూనియన్‌లోనే దాదాపు రెండున్నర కోట్ల మంది మరణించారు. మరో 90 లక్షల మంది వరకూ వ్యాధుల బారినపడ్డారు. కానీ విస్తరణ కాంక్షతో తహతహలాడే సామ్రాజ్యవాద అగ్రరాజ్యాలు తమ నైజం వదులుకోలేదు. ఆ వెనువెంటనే తమకు అలవాటైన యుద్ధ క్రీడ ప్రారంభించాయి. వర్తమాన పరిణామాలు దాని పర్యవసానమే. న్యూయార్క్‌ టైమ్స్‌ పరిశోధక పాత్రికేయురాలు అని జాకబ్‌సన్‌ యుద్ధం వల్ల మానవాళికి కలగబోయే హాని గురించి చెప్పిన అంశాలైనా అగ్రరాజ్యాల కళ్లు తెరిపించాలి. అణ్వాయుధ యుద్ధం కేవలం 72 నిమిషాల్లో భూగోళంపై 60 శాతం జనాభాను తుడిచిపెడుతుందని హెచ్చరించారామె.

అగ్రదేశాల స్వార్థం, ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన అంతర్జాతీయ సంస్థల సంపూర్ణ వైఫల్యం ఈ దీర్ఘకాలిక సమస్యకూ, ఏడాదిగా ఆగని మారణహోమానికీ కారణం. పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వెంటనే ముగింపు పలకాలని ఐరాస తీర్మానించిన కొద్దిరోజులకే ఇలా జరిగిందంటచే ఏమనాలి! ఐరాసకు కోరలు లేని పరిస్థితుల్లో… ప్రపంచానికి సరికొత్త శాంతిసాధన వ్యవస్థ అవసరం కనిపిస్తోంది. నెతన్యాహూ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతుంది. లెబనాన్‌లో సైతం మరో గాజాను ఇజ్రాయెల్‌ సృష్టించక ముందే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. నిర్బంధంగానైనా కాల్పుల విరమణను సాధించాలి. లేదంటే, పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయి.

ఇజ్రాయెల్‌ పట్ల మారిన ఇండియా వైఖరి :

ప్రపంచ వేదికపైన శాంతి, సమానత్వం, న్యాయం నెలకొల్పాలని భారతదేశం ప్రముఖంగా ప్రతిపాదించింది. వలసవాద వ్యతిరేకత, స్వీయ రక్షణ, ప్రపంచ వ్యవస్థలో మరింత సమానత్వం కావాలని చేసిన పోరాటంలో అలీన ఉద్యమం కీలకపాత్ర వహించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సార్వభౌమత్వం, పరస్పరశాంతి, సంఘీభావం కోరుతూ అనేక థాబ్దాలు భారతదేశం విదేశాంగ విధానాన్ని పాటించింది. విశిష్ట హోదాను కలిగిన భారతదేశం ప్రపంచంలో దక్షిణ ప్రాంతంలో స్వతంత్ర ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య నాయకత్వాన్ని సమర్థించింది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాలలో జాతివివక్ష వ్యతిరేక సూత్రీకరణ భావనకు కట్టుబడి ఉంది. విముక్తి ఉద్యమాలకు అండగా నిలిచింది. అయితే ఇప్పుడు పాలస్తీనాకు మాటమాత్రంగా మద్దతు తెలిపింది. గతంలో కాల్పుల విరమణకు ఆయుధాల ధ్వంసం వలసపాలనలో మగ్గుతున్న ప్రజల హక్కులకు మద్దతు అన్ని విధాలుగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకతను తెలుపుతూ భారతదేశం తమ విదేశాంగ విధానాన్ని పాటించింది. 2014లో బిజెపి నాయకులు నరేంద్ర మోడీ ప్రభుత్వతం ఏర్పడిన తర్వాత విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చింది. ప్రత్యేకించి అమెరికా, ఇజ్రాయెల్‌ పట్ల సంబంధం విషయంలో అంతకుముందు ఉన్న విధానంలో తీవ్రంగా మార్పులు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌ పట్ల మోడీ ప్రభుత్వం పూర్తి అనుకూలతను పాటిస్తున్నది. ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో తాము కీలకపాత్ర వహిస్తున్నామని నరేంద్రమోడీ, బిజెపిలు చెప్పుకుంటున్నాయి. అయితే ప్రపంచ దేశాలలో సంఘర్షణలను నిలువరించేందుకు ప్రయత్నించడంలో భారత్‌ ఘోరంగా విఫలమైంది.

ముగింపు :

1948కి ముందు అసలు లేనే లేని ఇజ్రాయెల్‌ సృష్టిని, యూదులకు ఒక దేశం ఉండాలన్న సూత్రంతో ఆమోదించి పాలస్తీనాను రెండుగా విభజించటం ఒక చారిత్రక విషాదమనుకుని అంగీకరించినా, కనీసం రెండు స్వతంత్ర దేశాల సూత్రానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కట్టుబడి ఉంటే సమస్య కాలక్రమంలో సమసిపోయేది. అట్లా జరగకపోవటం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. పశ్చిమ దేశాలు చిచ్చును సృష్టించాయి. దీన్ని ఇన్ని థాబ్ధాలుగా సాగిస్తున్నది వారు మాత్రమేనని మరొకసారి చెప్పనక్కర లేదు. ముఖ్యంగా గాజా మారణహోమం నుంచి జరుగుతున్నదేమిటో ఇజ్రాయెల్‌, అమెరికాలు గుర్తించక తప్పదు. వారు తమ ఆయుధ బలంతో పైచేయి సాధిస్తుండవచ్చుగాక. కానీ, ప్రపంచం దృష్టిలోనే గాక అంతర్జాతీయ సంస్థల ఎదుట గతంలో ఎన్నడూ లేనంతగా ఏకాకులయ్యారు. వియత్నాం యుద్ధం తర్వాత అంతటి వ్యతిరేకతను, ఏహ్యతను తిరిగి 50 ఏళ్ల తర్వాత చూస్తున్నాయి. దీనంతటి నుంచి ఇజ్రాయెల్‌, అమెరికాలు పాఠాలు నేర్చుకుంటే వారికే మంచిది.

”తన ప్రభావాన్ని, తన పెత్తనం కింద ఉండే భూభాగాన్ని సైతం విస్తరించుకోడానికి ద్రవ్య పెట్టుబడి అనివార్యంగా తీవ్రంగా పాటు పడుతుంది” అని లెనిన్‌ తన ప్రసిద్ధ గ్రంథం ”సామ్రాజ్యవాదం-పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత థ”లో పేర్కొన్నారు. సామ్రాజ్యవాద దేశాలు వాటిలో అవి తీవ్ర శత్రుత్వంతో తలపడుతున్న కాలంలో లెనిన్‌ ఈ గ్రంథాన్ని రాశారు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, సామ్రాజ్యవాదం తమ లక్ష్యాలను నెరవేర్చుకోడానికి రెండు మార్గాలను అనుసరిస్తున్నాయి. మొదటిది: ప్రపంచం మొత్తం మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలవంతంగా రుద్దడం. ఈ విధానాలు వలస విముక్తి అనంతరం ఆయా దేశాలు సాధించిన పురోగతిని దెబ్బ తీస్తాయి. రెండవది: ఈ మొదటి ప్రయత్నం పని చేయని చోట్ల యుద్ధాలను పురికొల్పడం జరుగుతోంది. ఆ విధంగా సామ్రాజ్యవాదం ఒక పక్క ప్రపంచీకరణ విధానాలను, రెండో పక్క యుద్ధాన్ని సాధనాలుగా చేసుకుని ప్రపంచ వ్యాప్త పెత్తనానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం ఒక పక్క నయా ఫాసిజానికి, రెండో పక్క మానవ జాతి వినాశనానికి దారి తీస్తుంది.

గాజాలోని హమస్‌ మిలిటెంట్లతో పాటు లెబనాన్‌లోని హిజ్బొల్లాలు, యెమెన్‌లోని హౌతీలను, ఇంకా సిరియా, ఇరాక్‌లోని పాలస్తీనా మిలిటెంట్లను హతమార్చే దురుద్దేశ్యంతో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ ఏకపక్ష యుద్ధాన్ని విస్తృతం చేస్తోంది. ఈ గ్రూపులకు ఇరాన్‌ అన్ని విధాల సహకరిస్తోంది. నిజానికి ఈ గ్రూపులన్నీ మాతృదేశం పాలస్తీనా నుండి తరిమి వేయబడి వివిధ దేశాలలో ఆశ్రయం పొందిన వారి నుండి పుట్టుకొచ్చినవే. పాలస్తీనా స్వరాజ్య సమస్య పరిష్కారమైతే ఈ గ్రూపుల ఉనికి అవసరం కోల్పోతుంది. ఈ మౌలిక సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయని సామ్రాజ్యవాద అమెరికా దాని తొత్తు రాజ్యాలు పశ్చిమాసియాలో స్వార్థ ప్రయోజనాలు, ఆధిపత్యం నిలుపుకునేందుకు ఇజ్రాయెల్‌ను పావుగా వాడుకుంటున్నాయి. అమెరికా ఆర్థిక, సైనిక, దౌత్య సహకారం లేకుండా ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని ఎక్కవ కాలం కొనసాగించలేదన్నది యదార్థం.కనుక పశ్చిమాసియాలో యుద్ధాలకు కారణం అమెరికా సామ్రాజ్యవాదమే. ఈ యుద్ధాన్ని ఆపకపోతే ఇప్పటికే మాంద్యం అంచున ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వీటన్నింటి పరిణామాలు విపత్తుగా మారుతాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పారిశ్రామిక సంక్షోభం పెరిగి అంతిమంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి చేరుకోక తప్పదు. అందువల్ల సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని ఉనికి లేకుండా చేయాలన్నా, ప్రపంచంలో శాంతి సుస్థిరతలు వెల్లివిరియాన్నా, కార్మిక వర్గ సోషలిస్టు విప్లవంతో మాత్రమే ప్రపంచ ప్రజలకు శాంతి సౌభాగ్యం లభిస్తుంది.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

One thought on “పశ్చిమాసియాను యుద్ధంలోకి లాగుతున్న ఇజ్రాయెల్‌

  1. USA play big politics —2 political parties scared for Jewish community -vote bank //99%countries hate Israel stand and politics

Leave a Reply