ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 05.02.1983 సంచికలో ప్రచురితమయ్యింది. కథాకాలం 1970 నుండి 1979 దాకా. కథా స్థలం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలుకాలోని కుక్కలగూడూరు ఊరు.
ఈ కథ నేను రాసేనాటికి మౌఖికంగా చాలా ప్రచారంలో ఉండేది. 1979 నాటికి కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాలోని అనేక గ్రామాలల్లో రైతుకూలీ సంఘాలు ఏర్పడి దొరలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో అనేక పోరాటాలు చేశాయి. ముఖ్యంగా దున్నేవారికే భూమి ప్రాతిపదికగా గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు, షికం, బంజరు, అటవీ భూములు, దొరలు రకరకాలుగా అప్పుల పేరున, దండుగల పేరున ఆక్రమించిన పేద రైతుల భూములు రైతుకూలి సంఘాలు ఎర్ర జండాలు నాగండ్లకు కట్టి దున్ని ఆక్రమించాయి.
1977 ఏప్రిల్ నుండి ఆరంభమైన రైతాంగ పోరాటాలు 08 సెప్టెంబర్ 1978 నాటికి జగిత్యాల జైత్రయాత్రగా ప్రసిద్దికెక్కిన రైతుకూలి సమావేశం. వేలాది మంది రైతులు రైతుకూలీలల్లోకి విస్తరించాయి. ఈ పోరాటాలు క్రమంగా 1979 నాటికి రాష్ట్రమంతా విస్తరించాయి. కూలి రేట్ల పెంపు వృత్తి కులాల వెట్టి బందు పెట్టుబడులు పెంపులాంటివి సాధించాయి. గ్రామం మీద రైతుకూలి ఆధిపత్యం కొత్తగా నెలకొన్నది. రైతుకూలీ పోరాటాలు మొదటి దశలో అనేక ఎదురు దెబ్బలు తిన్నాయి. కార్యకర్తల హత్యలు, దాడులు కిడ్నాపులు లాంటి నిర్భందం మొదట దొరలు వారి గుండాలు నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున గడీల మీద దాడులు చేశారు. చాలామంది దుర్మార్గులైన దొరలు ఆ దాడుల్లో చనిపోయారు. దొరలు పోలీసులను తెచ్చుకున్నారు. ప్రజలు సమ్మెలు దొరలను సాంఘిక బహిష్కారం చేశారు. చివరకు అక్టోబర్ 20, 1980 నాడు సిరిసిల్లా జగిత్యాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి గ్రామాల నిండా పోలీసు క్యాంపులు పెట్టారు. ప్రజల మీద వందలాది కేసులు బనాయించారు. వందలాది మందిని అరెస్టు చేసి జైళ్లు నింపారు. విప్లవోద్యమ కార్యకలాపాలన్నీ”ప్రజలే చరిత్ర నిర్మాతలు”, ”వ్యవసాయ విప్లవం జయప్రదం చేయండి” అదే అవగాహనతో విప్లవోద్యమాలు నడిపాయి. జన నాట్యమండలి (1972), రాడికల్స్ విద్యార్థి సంఘం(1974), రాడికల్ యువజన సంఘం (1978), రైతుకూలి సంఘం (1975) లాంటి ప్రజా సంఘాలు వీటన్నింటికి దన్నుగా నిలబడి నడిపించే పీపుల్స్ వార్ పార్టీ ఏప్రిల్ 20, 1980 లో ఏర్పడి పనిచేశాయి.
తెలంగాణలో గ్రామాలు వాటిని ఆనుకొని ఉన్న సింగరేణి గనులు ఇతర పారిశ్రామిక ప్రాంతాలు ఉద్యమంతో ఎరుపెక్కాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాలల్లో నివసించే ప్రజలు, యువకులు, విద్యార్థులు, ఆటగాళ్లు, పాటగాళ్లు, మేధావులు, ఉపాధ్యాయులు దాదాపు ప్రజలు అందరు మునుపెన్నడు లేనివిధంగా తమ వ్యక్తిగత జీవితం అనుభవం సామాజిక అనుభవంగా మారసాగింది. తమ చుట్టూ జరుగుతున్న సామాజిక పోరాటాల్లో వాళ్ల యిష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా భాగమయ్యారు. ఏ గ్రామానికి ఆ గ్రామంగా ఉండే ప్రజలు క్రమంగా ఉద్యమాలల్లోకి వచ్చి అనేక గ్రామాల రైతుకూలి సంఘాల అనుభవాలు తెలుసుకుంటున్నారు. అంటే ఏమిటి ? ప్రజల స్వీయాత్మక ఆలోచన, అనుభవం విశ్లేషణకు లోనైంది. తార్కిక జ్నంగా మారుతోంది. తార్కిక
జ్నానం అంటే అన్ని పనులకు మనం దొరయేందిరో ….. గూడ అంజన్న పాట తార్కిక జ్ఞానానికి ఉదాహరణ.
తమ చుట్టూ జరుగుతున్న పోరాటాల పట్ల గ్రామంలో ఉండే ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల ఎరుక అన్నమాట. అంటే కూలిపోక తప్పని పాత సమాజం తన రూపురేకలు మార్చుకుంటోంది. దొరలు ఊళ్లనుండి పట్నాలల్లో చేరి సురక్షిత ప్రాంతాలల్లో విస్తరిస్తున్నారు. వాళ్ల తరుపున వచ్చిన పోలీసులు ఇతర ప్రభుత్వ యంత్రాంగం, చట్టాలు, కోర్టులు వీటి స్వభావం తెలుస్తోంది.
అప్పటికే మావో యేనాన్ రిపోర్టు చదువుతున్నారు. వ్యవసాయ విప్లవంలో రాసినట్లుగా గ్రామాలల్లో వర్గ సంబంధాల గురించి ఉత్పత్తి వనరులైన భూమి, పశువులు, పంటభూములు, నీటివనరులు, కూలిరేట్లు ఇతర వృత్తులు మొత్తంగా ప్రతిగ్రామం తమ గ్రామంలోకి ఉత్పత్తి వనరుల అధ్యయనం చేసింది. కొన్ని ఉత్పత్తి శక్తులైన ప్రజలు, రైతులు, రైతుకూలీలు ఈ వృత్తిపనివారు కులాల వారిగా ఉత్పత్తి శక్తులు ఎట్లా ఉన్నాయి? మొత్తంగా విప్లవోద్యమంలో వాళ్లు ఎట్లా పాల్గొంటున్నారు? అంటే ఉత్పత్తి సంబంధాల అధ్యయనం అన్నమాట.
ఇది విప్లవోద్యమానికి కొత్త పోరాటాలల్లో నుండి అనేక వాస్తవాలు విప్లవోద్యమాలకు ఇదివరకు తెలియని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. స్థూలంగా అర్థం చేసుకున్న వైరుధ్యాల లోతు ఎక్కడో ఉన్నది.
అనేక కథలు రిపోర్టులు, అధ్యయన తరగతులు, ఉపన్యాసాలు, మీటింగులు అనేక పంచాయతులు మా తరపు యువకుల్లాగే వీటన్నింటిలో నేను తిరుగుతూ ఉండేవాన్ని. లోలోపల రూపుదిద్దుకోని ఎన్నో విషయాలు ఇప్పటికి రాయరాని అనేక విషయాలు అందరిలాగే నా వ్యక్తిగత జీవితం ఇలాంటి కల్లోలంలో దారులు వెతకడంలో ఉండేది.
సహచరులు చాలా మంది అమరులౌవుతుండేవాళ్లు. ఆ నొప్పి లోలోపల కదులుతూ ఉండేది. అప్పటికి వెంటనే ఏం చేయాజాలని తనం. వెంటనే తలెత్తే భావోద్వేగాలు. రోజుల తరబడి నిద్రలేకుండా తిరుగుతుండేవాళ్లం.
20.09.1982లో ఖిలా వనపర్తిలో చెయ్యెత్తు మనిషి ప్రజల ప్రియతమ నాయకుడు బయ్యపు దేవేందర్ రెడ్డి ఎన్ కౌంటర్ లో చనిపోయారు. పోలీసులు తమకందిన సమాచారంతో చుట్టుముట్టి చంపేశారు. నా సాహిత్యంలో ముఖ్యంగా కథల్లో నవలల్లో దేవేందర్ రెడ్డి తను భాగమైన విప్లవోద్యమాలు రైతాంగ పోరాటాలలోని అనుభవాలే తిక్కతిక్కగా ఉండేది. ఆయన మా తమ్ములు నారాయణ, వీరన్న క్లాస్ మేట్, రూంమేట్. ఒకరకంగా మా కుటుంబ సభ్యుడే. దాదాపు మా కాలపు, మా తరపు యువకులమంతా ఒకే కుటుంబంలాగా ఉండేవాళ్లం.
ఇసంపేట, పాలెం, కుక్కల గూడూరు నుండి అనేక గ్రామాలు ప్రజలు హోరెత్తేవారు. దేవన్న నాయకత్వంలో అక్కడ జరిగిన అనేక పోరాటాలు పంచాయతులు పోటెత్తాయి.
విప్లవోద్యమంలో ఈ ఒత్తిడి నిరంతరం నిత్యం ఉంటుంది. ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల నేఫద్యంలో మార్క్స్, లెనిన్, మావోలే కాక పోరాటాల నుండి వచ్చిన అనుభవాలు అందరికి తెలుస్తూనే ఉన్నాయి.
మా తరంలో మార్క్సిజం ముఖ్యంగా చరిత్ర, తత్వశాస్త్రం ఆ కాలంలో ఎక్కవగా అధ్యయనం చేస్తుండేవాళ్లు. ఇక్కడ జరిగేదానికి పుస్తకాలల్లో చదివిన దానికి రాజకీయ తరగతులల్లో ప్రజాసంఘాలల్లో చెప్పేదానికి మధ్య లంకె కుదిరేది కాదు. అంటే పోరాటాలల్లో నుండి ప్రజలు లేవనెత్తిన అనేక వైరుధ్యాలను అర్థం చేసుకోవడం అన్నమాట. ఆర్థిక విషయాలల్లో గ్రామాల మీద దొరల పట్టు సడలిన తరువాత రైతుకూలి సంఘాలు ఎదిగి ఎదిగిన ప్రజలను మరింత ముందుకు తీసుకపోవడం ఎట్లా ? అనే దానిమీద అందరు ఆలోచించే వాళ్ళు. ఈ అధ్యయనం, ఆచరణలోనే భాగంగా 1981 జూన్ లో నెల్లూరులో రైతుకూలి మహాసభ జరిగింది. రైతాంగ పోరాటాల అనుభవాలను క్రోడీకరించింది. అప్పటి సమస్యలు వేరు. 1981 నుండి ఈ కథ రాసేనాటికి 1983 జనవరి నాటికి అనేక ప్రాంతాలల్లో రైతాంగ పోరాటాలు అనేక అనుభవాలు గడిచాయి. శత్రువును ఎదుర్కోవడంలో నిలబడ్డాయి. మేలో కరీంనగర్ లో రెండో రైతుకూలి మహాసభలు పెద్ద ఎత్తున జరుపాలని విప్లవోద్యమం నిర్ణయించుకున్నది. రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం విస్తరించింది. ముఖ్యంగా గ్రామాలల్లో పోలీసు క్యాంపులున్నా కూడా రైతుకూలీ సంఘాలే నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నాయి. అన్ని గ్రామాలల్లో వారికి అండగా సాయుధ దళాలు పనిచేస్తున్నాయి. అటవీ ఉద్యమం ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్లు అటవీ ప్రాంతాల నుండి పొరుగు రాష్ట్రాలైనన మహారాష్ట్ర, అప్పటి మధ్యప్రదేశ్, ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం విస్తరించింది.
ఈ గడబిడంతా వస్తుగతమైంది. కళ్లకు కన్పించేది. కాని దీని వెనుక మనకు కళ్లకు కనబడని, దృగ్గోచరం కాని పాత, కొత్త సమాజాల నిరంతర పోరాటం వర్గ పోరాటమున్నది. మన నిరంతర ఆచరణ సాహిత్యం ప్రతిబింబించాలి అంటుండేవాళ్లు. అదేమిటో? తెలిసేదికాదు.
ఈ వెతుకులాటలో ఇదివరకు విప్లవోద్యమాలు నడిచిన రష్యా, చైనా సాహిత్యం ఎక్కువగా చదివేవాళ్లం. ముఖ్యంగా గోర్కి, లూహన్ లాంటి రచయితల రచనలు స్థలకాలాల నేఫధ్యం అర్థం జౌతే తప్ప ఇలాంటి సాహిత్యం అర్థం కాదు. విప్లవోద్యమ సాహిత్యం ఆచరణ నుండి వచ్చిన సాహిత్యం ఈ సందర్భంలోనే లూహన్ నవలిక AhQ నవలిక చదివాను. ఈ నవలలో అస్తవస్తమైన, దుర్మార్గమైన, భూస్వామిక చైనా సమాజంలో రైతుల మానసిక స్థితికి పేరులేని AhQ ఈ నవలోని రైతు ప్రతినిధి ఈ నవలిక 1922లో వెలువడింది. చైనాలో జూలై 1, 1921లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. అప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీకీ రష్యన్ మార్గమే తెలుసు. అంటే విప్లవోద్యమానికి తప్పనిసరిగా కార్మికవర్గం ఏర్పడాలి అప్పుడే విప్లవం సాధ్యం అనే అవగాహన చైనా మనలాగే వ్వవసాయిక దేశం అక్కడ వలస పెట్టుబడి మూలకంగా రకరకాల కారణాలతో కార్మికవర్గం రష్యాలోలాగా ఎదుగలేదు. మరి అయితే కోట్లాది రైతాంగం పరిస్థితేమిటి ?
మే 4 ఉద్యమంగా పిలువడే విద్యార్థి ఉద్యమం 1919లో చైనాలో జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి జర్మన్ ఖాళీ చేసిన వలసలు జపాన్ ను ఆక్రమించడానికి వ్యతిరేకంగా విద్యార్థులు నడిపి లక్షలాది మంది ప్రజలు పాల్గోన్న సామ్రాజ్య వ్యతిరేక పోరాటమది. ఈ నేపథ్యలో లూసన్ చైనా రైతాంగం యొక్క సామూహిక వ్యక్తరూపం యొక్క సారాంశంగా ఈ ఉద్యమాన్ని గుర్తించారు. అంటే కలలుగానే చరిత్ర నిర్మించే చోదక శక్తి చైనా రైతాంగంలో ఉన్నదన్నమాట.
ఆ అవగాహనే చైనా విముక్తి కీలకమైంది. ఇది మార్క్సిజానికి మావో అందించిన కొత్త చేర్పు. అయితే మరి అనేక పోరాటాలు చేసి నిలబడి తెలంగాణ రైతాంగమో ? వాళ్లు రాజకీయంగా ఎదిగి కార్మిక, కర్షక రాజ్యాధికారం చేపట్టే దిశగా సుదీర్ఘ ప్రయాణం. ఇట్లా అనేక ఆలోచనలతో విజయవాడ, రాజమండ్రి, తిరుపతిలాంటి పట్టణాలు తిరిగాను ఉపన్యాసాల కోసం అన్నిచోట్ల కరీంనగర్, ఆదిలాబాదు రైతాంగం గురించి అడిగేవారు. అంటే గంటల తరబడి ఆ పోరాటాలు ఊళ్లు చెప్పాలి. చెప్పేవాన్ని. ఎంత చెప్పినా కొన్ని వివరాలు మాత్రమే చెప్పేవాన్ని. నాకే అసంతృప్తి. వాళ్ళ అడుగుతున్నది సారాంశం అని నాకు అర్థమయ్యింది. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంద్రలో భూస్వామిక సంబంధాలు వేరు. వ్యక్త రూపాలు వేరు. తెలంగాణలో వేరు వ్యక్త రూపాలల్లో వేరువేరుగా ఉన్నా సారాంశంలో దాదాపు భూస్వామ్యం ఒకటే. దాని భాష వేరు కావచ్చు.
ఇంతకూ భూస్వామ్యం అంటే ఏమిటి? వ్యవసాయ విప్లవం లో చెప్పిన విధంగా ఉన్నదా? నా బతుకు పొడుగూతా చూసిన విధానంగా ఉన్నదా? ఉంటే గింటే విప్లవో్ద్యమాలు భూస్వామ్యంతో ఎట్టా తలపడ్డాయి. చాలా కథలు రాశాను. ‘కొలిమంటుకున్నది’, ‘ఊరు’ నవలలు రాశాను. అంటే దృగ్గోచరం కాని భారతీయ భాస్వామ్యం రూపురేఖలు చిత్రించాలన్నమాట.
అంటే మారిపోతుంది పోరాటంలో అనేక దశలులాగే సాహిత్యంలో ఈ మార్పు, ఈ స్పర్శ తెలియాలి ఎట్లా? సాహిత్యమే కాదు అందరూ ఈ దిశగా ఆలోచిస్తున్నారు. ప్రజలనుండి ఈ దిశగా పోరాట అనుభవాలను సమీక్షిస్తున్నారు. ఎప్పుడు భారతదేశలో జరుగని విప్లవోద్యమాలు సుమారు పది సంవత్పారాలు నిలదొక్కుకున్నాయి. చాలా కష్టమైన పని అయినా ఇది రూపొందాల్సిన సాహిత్యం. కాని ఇదివరకటి కంటే భిన్నంగా అలవాటులేనిది రాయాలి. కకావికలైంది. అనేక పంచాయతులు రైతులు, మహిళలు వాళ్లు అనుభవించిన దుర్భర జీవితం భరించరానంత ఒత్తిడి రూపొందని కథకు సంబంధించిన ఒత్తిడి మొత్తం పోగుపడి ఆగిపోయిన స్థితిలో ప్రయాణం చేయాల్సిన స్థితి. ఇది ఎవరు చెప్పేదికాదు. మనకు అర్థమయ్యేది కాదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు అనేమాట మొదట్లో సుళ్లు తిరిగేది. ఇంతమందిలో ఎవరితో కలిసేది ఇన్నిరకాలుగా వ్యక్తమవుతున్న భూసామ్యం దాన్ని బద్ధలు కొడుతున్న రైతాంగం.
ఇక్కడ ఏదో దొరికింది. భూస్వామ్యం ఎన్ని రకాలుగా వ్యక్తమౌతోంది? దాన్ని ఎన్ని రూపాలల్లో ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఘటనలు రాసుకుంటూ పోయాను. వ్యక్తమవడం అంటే ఏమిటి? అదీ ఉత్పత్తి వనరులు ఉత్పత్తి సంబంధాల వెలుగులో రాసుకోవాలి. అవ్వన్ని అనేక పంచాయతులల్లో వ్యక్తమైనది. అర్థమయ్యిందేమంటే భూస్వామ్యం, ఉత్పత్తి వనరులైన భూమి, పశువులు, సంపద ఎంతో కుట్రపూరితంగా, హింసాత్మకంగా జిక్కించుకోవడం గురించి వేల ఉదాహరణలు. సంపద పోగుపడడమే కొండగుర్తు. కొండపల్లి సీతారామయ్యగారు వ్యవసాయ విప్లవంలో రాసిన మాట ప్రతి రూపాయికి ఎవరిదో ఒకరి శ్రామికుడి నెత్తురంటి ఉంటుంది. ఇది కనిపించేది. విప్లవోద్యమం ఈ దురాగతాలను వెలికి తీసింది. లెక్కలు తీసింది.
అంతేనా? కాదు. ఉత్పత్తి శక్తుల సృజనాత్మకతను అత్యంత పాశవికంగా మొరటుగా అణచివేయడం ఇది కనపడనిది. అట్లాంటి జీవన్మరణ పోరాటాలుగా తల్లడిల్లుతున్న ఉత్పత్తి శక్తుల సృజనాత్మకత వ్యక్తీకరణ ఎట్లా ఉంటుంది? అది విప్లవోద్యమానికి చోధకశక్తి. ప్రజల సృజనాత్మకత విప్లవానికి ఊపిరి. ఈ అధ్యయనం, అన్వేషణ మాకు కొత్తది. నిరంతర గతితార్కిక ఆచరణలో ప్రజలు విప్లవోద్యమాలు నడుపుతారు. చాలా చోట్ల ప్రజల పంచాదుల్లో, మీటింగుల్లో నేను ప్రజల గుంపులో కూర్చండి అక్కడ ఏడ్పులు, పెబబొబ్బలు, కొట్టుకోవడాలు జరుగుతుండగానే వర్గపోరాటపు విశ్వరూపాన్ని, దాని పతాకస్థాయి ఉద్వేగాలను చూశాను.
చాలా చోట్ల విప్లవోద్యమ నాయకులు పంచాదుల్లో బయట పడిన కొత్త విషయాలను తమతమ పద్ధతిలో కథలాగా చెప్పి చివరకు అలాంటి స్థితి మారాలి, మార్చుదాం అనేవాళ్లు. ప్రజలు సంతోషం, కేరింతలు కొట్టేవాళ్లు. నినాదాలు చేసేవాళ్లు. కొందరు ఆ స్థితులను భరించలేక అక్కడే వెక్కివెక్కి ఏడ్చేవాళ్లు.
అలాంటి కథే బర్లగాచే ఎర్రయ్యకథ దాదాపుగా ప్రతి గ్రామాల్లో గొడ్లు, మేకలు, గొర్రెలు, బర్లుగాసే వాళ్లుంటారు. వీళ్లంతా రైతాంగం రైతుకూలీల నుండి వచ్చినవాళ్లే. వీరందరి అనుభవం ఒకటికాదు. నాచిన్నప్పుడు నేను ఎడ్లకాసేవాన్ని. వీళ్లందరి ఒక్కొక్కరిది ఒక్కోక్క చరిత్ర. విప్లవోద్యమంలో ఇలాంటి వాళ్లు నాయకులుగా ఎదిగారు. వీళ్లందరికి దాదాపుగా తమ వ్యక్తిగత జీవన దృక్పథంతో పాటు సామాజిక సమిష్టి జీవిత చలనానికి సంబంధించిన ప్రకృతి తోటివాళ్ల గురించిన పశువుల కాయడం మిగతా పనులకనన్నా కష్టమైన పని.
నేను వెతుకుతున్న కనుక కథానాయకుడు భారతీయ AhQ దొరికాడు. ఇది వరకే రాసిన సృష్టికర్తలు కథలో బర్ల ఓదన్నే మేం వినాశనకారులం, మేం సకలం పట్టించేటోల్లం, మేం మా సృష్టిని పాడచేసుకోలేం, ఒకవేళ అట్లాంటిది మాకుంటే మీరందరు ఉండేవాళ్లు కాదు. అని సుల్తానాబాదు కోర్టులో జడ్జి ముందు ప్రకటించాడు. కాని ఈ కథానాయకుడు మరింత లోతుకు వెళ్లి ఉత్పత్తి శక్తుల విధ్వంసపు చరిత్ర వికాసానికి సంబంధించిన డిమాండు లేవనెత్తుతున్నాడు. అంటే విప్లవోద్యమాలు గతితార్కికంగా, చారిత్రకంగా ఎదిగిన దశ విప్లవోద్యమాలు పోగోట్టుకున్న భూమి, వస్తువుల గురించి అంటే ఆర్థిక దొపిడి, హింసల గురించి పోరాటాలు చేస్తున్నది నిజమే. కాని ఉత్పత్తి సంబంధాలు మారాలి. అందరిని సమానంగా ఆదరించే వికసింపజేసే ఉత్పత్తి సంబంధాలుగా ఎదగాలనే డిమాండు ప్రజల నుండి రకరకాలుగా వ్యక్తమౌతోంది. అంటే ఆర్థిక పోరాటాలు, పరిణామాత్మక పోరాటాలు, గుణాత్మక పోరాటాలుగా ఎదగాలనే డిమాండు కరీంనగర్, అదిలాబాదు రైతాంగంలో దృగ్గోచరం గాని లోలోపలి పరిణామ క్రమం.
అంటే ఈ కథ పరిధి పెద్దది. నవలంత పెద్దది ఆ తరువాత రాసిన ఊరేగింపు నవల కొంతభాగం నూతనలో సీరియల్ గా వచ్చింది. ఆ తరువాత ఒక మిత్రుని దగ్గర పెడితే కాలిపోయింది. కాని నవల రాయాలంటే చాలా సమయం కావాలి. బహుశా మే 1983లో జరుగబోయే రైతుకూలీ మహాసభల లోగా పూర్తి చేయడం కుదరని పని. ఈ లోగా రైతుకూలి మహాసభలకు మూడుగంటల నిడివి గల నాటకం గడిచిన విప్లవోద్యమ నేపథ్యంలో కావాలనే డిమాండు… దానికోసం నటులు డైరెక్టర్ గద్దర్, బి.నర్సింగరావు లాంటి మొత్తం నలబై యాబై మంది రడీగా ఉన్నారు. ఏప్రిల్ మొదటి వారానికల్లా నాటకం రడీ అయితే ఒక నెల రోజులు రిహార్సల్స్. అదీ ప్లాను. నాటకం ఇంట్ల కూసోని రాసేది కాదు. బి.నర్సింగన్న, గద్దర్, వంగపండు లాంటి ఒక టీము తయారు చేయాలి. అందులో నేనొకన్ని. నాగేటి చాళ్లల్లో నాటకం ఆ సభల్లో ప్రదర్శించారు.
అదింకా మొదలు కాలేదు. కాని ఈలోగ ఈ డిమాండు. భూస్వామ్యం మమ్మల్ని అన్ని రకాలుగా పశువులుగా మార్చింది. ఇప్పుడు మేం మనుషులుగా మారదల్చుకున్నాం ఎట్లా. లోలోపల తోలుస్తోంది. అంతకన్నా ముందు ఈ మాట కావాల్సిన వాళ్లందరికి చేరాలి. తప్పకుండా రాయాలి. ఏది ఏమైనా రాయాలనుకున్నాను. అప్పుడు కథా కాలాన్ని 1983 కు తీసుకుంటే నిడివి పెరుగుతుంది. 1979 సమయంలో గ్రామరాజ్య కమిటీల నిర్మాణం చెయ్యాలనే ఆలోచన అందుకు తగిన ఆచరణ విప్లవోద్యమం సిద్దంచేసుకున్నది. ఆ డిమాండు మూలకంగానే ఈ నిర్మాణ రూపం ఎంచుకున్నారు. అంటే ఏమిటి? గ్రామాలల్లో వ్యక్తమౌతున్న ఇలాంటి అన్ని రకాల వైరుధ్యాలను పూర్తిగా అధ్యయనం చేసి, ఆచరణ రూపొందించే కింది నిర్మాణ కమిటీలన్నమాట. అవి పనిచేయడం మొదలైతే అలాంటి ఆచరణ నుండి గుణపాఠాలు తీసుకొని పోరాటం ఉన్నత రూపంలోకి వెళ్లడమన్నమాట. కొంచెం వివరంగా చెప్పాలంటే గ్రామాలల్లో జరిగిన విప్లవోద్యమ పోరాటాలన్ని స్వీయాత్మకమైనవి. కులాలుగా, వర్గాలుగా, స్ర్తీ పురుషులుగా రకరకాల చైతన్యం అనుభవంగల వాళ్లందరిలోంచి గతితార్కికంగా ఎదిగిన శక్తులను ప్రజారాజ్య కమిటీలల్లో సమీకరించ గలుగుతే ఉత్పత్తి వనరుల, ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాలల్లో వర్గపోరాటం ద్వారా కమిటీల చైతన్యాన్ని గతితార్కికంగా, చారిత్రకంగా అభివృద్ది చేయవచ్చు. గతంలో 1946-51 లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రజారాజ్య కమిటీలను నడుపడంలో విఫలమైన అనుభవం ఉంది. ఆందోళనలు చెయ్యడంలో, పాతదాన్ని కూలగొట్టడం ఒక వీరోచిత చర్య. అది భూస్వామ్య ఒత్తిడి నుండి పుట్టిన భూస్వామిక భావజాలం. నిర్మాణం కూలిపోయిన విషాదకరమైన పాత నిరాసక్తల శకలాలను నిర్మించడం. ఇది ఒక ప్రజాస్వామిక చర్య. ఈ చర్య జీవధాతువు అయినప్పుడు కమ్యూనిస్టులు బలపడుతారు. అంటే ఏమిటి? అంతిమంగా కార్మిక, కర్షక రాజ్యాధికారం దిశగా అన్నిరకాలుగా ఈ కమిటీలు దీర్ఘకాలికంగా రాజకీయంగా నిలబడగలుగుతాయి.
ఈ అవగాహన, ఆచరణ రకరకాల వైరుధ్యాలు, నిర్భంధం మూలకంగా అనుకున్న స్థాయిలో నిర్మాణం జరుగలేదు. కమిటీల ప్రాధాన్యతను పోరాడే ప్రజలకు అర్థం చేయించడంలో కనిష్ట స్థాయిలో ఉండిపోయాయి. అతివాదానికి, మితవాదానికి లోనై నిర్భంధాన్ని సాకుగా చూపాయి. అది ఆ తర్వాతి వేరేకథ. అందుకే 1979 కాలాన్నే నా కథలో తీసుకున్నాను. ఈ కథలో పేర్లు ముఖ్యంగా ఎర్రయ్య పేరు ఎంచుకున్నా. తాత్విక నేపథ్యంలో నడిచే కథ కనుక దొర రామచంద్రం. ఈ కథలో విప్లవోద్యమం కన్నా ముందు జరిగే పంచాదులు రెండున్నాయి. విప్లవోద్యమం గడిచిన తరువాత అనేక ఆర్థిక సమస్యలు పరిష్కరించే క్రమంలో జరిగే పంచాయితీ మూడో పంచాయితీ. ఉత్పత్తి సంబంధాల సమస్య, సామాజికమైంది. కనుక అందరిలో చర్చించవల్సింది. కనుక పంచాయితే సరైన స్థలం.
అటు భూస్వామ్యశక్తులైన దొర రామంచంద్రం అతని సహచరి కాంతమ్మ భూస్వామిక సమాజానికి ప్రతినిధులే. అయినా వాళ్లు వాళ్ల సృజనాత్మకత కోల్పోయి విధ్వంసమైనవాళ్లు కనుక ప్రకృతిని, సంపదను హింసాత్మకంగా తప్ప అనుభవించలేరు. వాళ్లను విముక్తం చేయాల్సింది విప్లవోద్యమే. ఇటు ఎర్రయ్య సర్వ సంపూర్ణంగా అతని సృజనాత్మక శక్తిని హింసాత్మకంగా అణచివేతను అనుభవించాడు. అయినా అతను తననుతాను కాపాడుకున్నాడు. విధ్వంసం కాలేదు విశాదశకలమే అయిన కూలిపోలేదు. తననను తాను నిలబెట్టుకున్నాడు. అంతేకాదు స్వార్థమే మూలం కాగల భూస్వామిక సమాజంలో మానవ సంబంధాలను సృజనాత్మకంగా, ప్రజాస్వామికంగా నిలబెట్టుకున్నాడు. అతనిది సృజనాత్మక దారి.
ప్రజలే చరిత్ర నిర్మాతలంటే ఇలాంటి వాళ్లే చరిత్ర నిర్మిస్తారు. చైనా రైతాంగానికి ప్రతినిధి అయిన AhQ లాగే ఎర్రయ్య భారతదేశ రైతాంగానికి ప్రతినిధి. ఇది కల్పిత పాత్ర కాదు. విప్లవోద్యమాలు నడిచిన కుక్కల గూడూరులోని పాత్ర. అందుకే విప్లవోద్యమం నిరంకుశ దుర్మార్గపు దొరలను పంచాదులో పెట్టి నిలదీస్తన్న కాలంలో పంచాదులో అతని దగ్గరకి వెళ్లి ఓ సర్పంజీ నేను మనిషినేనా? పసురాన్నా? నాకు సీమునెత్తురున్నదా? లేదా? అని నిలదీశీండు ఎర్రయ్య. సంఘం ఎర్రయ్య కోల్పోయింది. తన బర్రె దుడ్డే అనుకున్నారు. అది రాంచంద్రం దగ్గరి నుండి తిరిగి ఇప్పించాలనుకున్నారు. పైగా తను గొడ్డు బర్రతో సంభోగం చేసినట్లు ఆరోపించి తన బతుకు నాశనం చేసిన రాంచంద్రం ఆ రోజు ఆ ఊళ్లోని మరో ఆడపడుచుతో ఉన్నాడు. అది ఎర్రయ్య చూశాడనే ఎర్రయ్య మీద హింసాకాండ. ఆ ఘటన గురించి చెప్పిన ఎర్రయ్య ఆడపడుచు గురించి అడిగినపుడు నేను పసురాన్నా…. మన అక్కో సెల్లో అంటడు.. తన జీవితం పూర్తిగా నాశనమైనా తనతోటి ఆడపిల్ల గురించి చెప్పలేదు. ఆడవాళ్లు పశువులు గాదని వాళ్లకు యిష్టాయిష్టాలుంటయని తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.
అందుకే తనకు రైతుకూలి సంఘం ఇప్పించపోయే దుడ్డె, బర్రె సరే…. ఈ ఊళ్లే తను పడ్డయాతనో? పసురంగా బతికిన బతుకో? అంటాడు. శరీరం మనసు ముద్దై పోగా అంటే తన సమస్త సృజనాత్మక వికాసం కోల్పోయాడు. అది అంచెలంచెలుగా విప్లవోద్యమం నిర్మించవల్సింది. అదీ భూస్వామిక సమాజపు నిర్మూలన కోసం జరుగుతున్న రైతాంగ పోరాటంలో వ్యక్తంగాని దృగ్గోచరంగాని సారాంశం. దాన్ని నిర్మించడం కోసం అలాంటి శక్తుల రాజ్యాధికారాన్ని చేపట్టి భూస్వామ్యాన్ని నిర్మూలించాలి. ఈ కథ రాసింది నేనే అయినా ఎందరో సహచరులతో పంచుకోగా రూపొందినది. అనేక రకాల తీవ్ర నిర్భంధం మధ్య విప్లవ శక్తుల మభ్యపెట్టు, అణచివేసే పద్ధతిలో ఇంకా అనేకానేక కారణాలతో ప్రజారాజ్య కమిటీలు సరిగా పనిచేయలేకపోయాయి. అయినా ప్రజలు మాత్రం పోరాటాలను వదిలిపెట్టలేదు. అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా వచ్చింది. మరే రూపం తీసుకుంటాయో? కాని ప్రజా రాజ్య కమిటీలు ఆదివాసీ ప్రాంతాలల్లో జనతన సర్కారుగా రూపాంతరం చెందాయని చదువుకున్నాం. ఉత్పత్తి సంబంధాల ప్రజాస్వామీకరణ కోసం ఎందరో ఎర్రయ్యలు అమరులయ్యారు. మరెందరో సాయుధులై పోరాడుతున్నారు.