కాంతమ్మ ఇంటిముందటి సిమెంటు గద్దెమీద కూర్చున్నది. ఖర్మగాలి ఆ దారంట ఆసమయంలో ఎవరూ రాలేదు. కాంతమ్మగారికి యమచిరాకుగా వుంది. ఎవరిని తిట్టక నోరు తీపునం బెడుతోంది. కసికొద్ది నోట్లోని భాగం వక్కలు కసపిస నమిలేసింది… లోపలికి ఓమారు చూసి కోడలును కేకలేసింది.
ఎటూ పాలుపోక “ఏడసచ్చిండో! కూడనేడా! కుమ్మనేడా! ఊళ్ళమీద బడి జన్నె కిడిచినట్టు (దేవుని పేరుమీద విడిచినట్టు) తిరగటం – వానింట్ల పీనెల్ల మా నాయన నా గొంతు కోసిండు. తిరిగే కాలు ఆగదట. తిరుగుబోతు కిచ్చి పెండ్లి జేసిండు. అయిపాయె… గిప్పుడు నా అవుసరమేమున్నది?” కాసేపు భర్తను తిట్టిపోసింది.
పొద్దు కుంకింది. దూరంగా కనిపించే గుట్టబోరుమీద పశువుల మంద కనిపించింది. మసకమసగ్గా గుడ్డ సరిగాలేని పిల్లలు పెండేరుతున్నారు… చింత చెట్లమీద గొర్రెంకలు రొద పెడుతున్నాయి… ఊరిబయట వాగొడ్డుకు గొర్లమందలో గొర్రెలు – అదే పనిగా అరుస్తున్నాయి. ఇంటి వెనుక భాగంలోని తాడిచెట్లలో గాలి మోత పెడుతూ కదులుతోంది.
ఆ దారంట పశువులమంద రావడం చూసి కాంతమ్మ ముఖం వికసించింది. మొదట మెడలోని బొనుగలు, గంటల నూపుతూ తమ లేగలకోసం తెగ అరుస్తూ, దుమ్ము రేపుతూ గొడ్లమంద వచ్చింది. వేడి-దుమ్ము నిండిన పశువుల వాసన కమ్ము కున్నది. కర్ర భుజం మీద పెట్టుకొని జుట్టుపోస గాలికి చిత్రంగా నాట్యం చేస్తుండగా ఆనెకాళ్ళు ఎగరేస్తూ గొడ్ల బానయ్య వాటి వెనుక వచ్చిండు.
“ఏందిరా బానిగ జుట్టిరబోసుకొని తిర్గుతున్నవ్ – మీ ఆగి నీళ్ళు పోసుకున్నాదిరా!” కాంతమ్మ.
“డిర్యో నిన్ దొంగల్ బొడువ మర్రు మర్రు మంటుంటే” కాంతమ్మ మాటను ఖాతరు చేయకుండా బానయ్య.
“నీ పెండ్లాం ముండమొయ్య – నేనేం అడుగుతన్నరా!”
“హి… హి… నాకేం దెలుత్తది దొర్సానీ” కందు పండ్రెల్లబెట్టి వొగలుపోతూ నవ్విండు.
“ఆఁలం… కొడక – నవ్వుత నవ్వుతనే కడుపుజేసినవ్…” అన్నది కాంతమ్మ.
“గొడ్లు బోతన్నయ్ బాంచెన్…” కాళ్ళు ఎగరేసుకుంటూ బానయ్య గొడ్లవెంట వెళ్ళిపోయాడు.
దొరికిన ఆ వొక్క అవకాశం అట్లా జారిపోయినందుకు విచారపడుతుండగా – షావుకారి బర్ల గొట్టుకొని ఓ మాదిగవాళ్ళ పిల్ల వచ్చింది. “అవునే పోరీ! రామేశ్వరేనా నీ పేరు- ఎప్పుడూ సమర్తాడ్తవే?” కాంతమ్మ.
“ఏంది దొర్సాని గట్లంటవు- నాకే తిక్కరేగిందంటే…” పిల్ల.
“ఓసోసి మాదిగముండ – ఏంజేత్తవే?”
“మాదిగ ముండ గీదిగముండంటే” పిల్ల గుర్రుగా చూసి బర్ల వెంట పరుగెత్తింది.
“ఓసి లం…ఎంత కావురమే” ఎవరన్నా విన్నారేమోనని చుట్టూ చూసింది.
ఆఖర్న ఎర్రయ్య వంతు వచ్చింది. మేక తాడు చేతిలో బట్టుకొని పేనిన జనపతాళ్ళు చంకనేసుకొని, చిన్న గొడ్డలి చిప్ప భుజాలమీద పెట్టుకొని, ఆగాగి ముందు నడుస్తున్న బర్రెను అదిలిస్తూ, ఆగకుండా పరుగులు పెడుతున్న మేకతో సతమతమైతూ ఎర్రయ్య ఆదారంట వస్తున్నాడు. అప్పటికి చీకటి తొంగి చూస్తోంది.
“ఎవలూ? శాయికొడుకు ఎర్రడేనా? వారీ పెండ్లెప్పుడు సేసుకుంటవ్రా! బర్రెతో నేనా బతుకు! భార్యను దెచ్చుకునేదున్నదా?” కాంతమ్మ.
“నాకెవలిత్తరు దొర్సాని పిల్లను?” ఎర్రయ్య.
“ఔగని బర్రేందిరో ఆగాగి నడుత్తంది?”
“తీగెలు సాగుతన్నయి దొర్సాని రేపో మాపో ఈనేటట్టున్నది.”
బజారులో కరంటు బుగ్గలు వెలిగినయ్… కాంతమ్మ కళ్లు బైర్లు కమ్మినయ్… బర్రె కడవంత పొదుగుతోని- గుమ్మంత పొట్టతోని నున్నగా, నల్లగా, జల్లితోక, కాంతమ్మ కళ్ళకు బర్రె పర్వతంలాగా కనిపించింది. ‘సంకల బిడ్డను బెట్టుకొని ఊరంత దిగ్గినట్టు కానక పోతినే…’ అనుకున్నది.
“వోరీ ఎర్రోడా! బర్రెను అమ్మరాదుర… కొట్టమసొంటి పెండ్లా మత్తది.”
“వావ్వో! నీ బాంచెన్. ఇంక మా అమ్మనమ్ము మనలేదు.”
“నువ్వు గట్లనే మురుసుకుంటుండు మురిగిపోతవ్.”
“నీ బాంచెన్…గ మాటలనకుండ్లి…” ఎర్రయ్య భయంభయంగా అని, మేకను లాక్కుంటూ వెళ్ళిపోయాడు. వాకిట్లోకే తల్లి యెదురొచ్చింది. ఎర్రయ్య తల్లికీమాట చెప్పిండు.
“దానింట్ల పీనుగెల్ల అది సూడనే సూసిందా? బట్టుకండ్ల ముండ బట్టుకండ్ల ముండ” అని కాసేపు తిట్టి ఎండు మిరపకాయలు, జీడిగింజలు, దొడ్డుప్పు బర్రె మీదినుంచి తిప్పి దిస్టితీసి పొయ్యిలేసింది శాయమ్మ.
కాంతమ్మకు ఆ రాత్రి యెంతకూ నిదురబట్టలేదు. ఇంట్లో అందరు నిద్రపోతున్నా, కాంతమ్మగారు ప్రహరీగోడ లోపల పచార్లు చేస్తూనే ఉంది. ఆమెకు బర్రె ఈనినట్లు, నురుగులు కక్కేపాలు సర్వెడు పాలేరు తెచ్చి ముందు బెట్టినట్లు భ్రమ. పాలు ఆఖరు బొట్టుదాకా పిండి, పాలేర్లు సరిగా మేత చూడక బొక్కలు తేలిన తమ బర్లతో, ఎర్రయ్య బర్రెను పోల్చుకున్నది.
పాలనుంచి నెయ్యిదాకా, నెయ్యి నుంచి నేతిబూరెల దాకా ఎడతెరిపి లేని ఆలోచనలు. “ఏడ సచ్చిండో ఇంకా రాడేంది?” భర్తమీద విసుక్కొని కూడా ఎదురు చూసింది.
కాంతమ్మగారిది భారీ కాయం. దానికి తోడు మంది విషయాలమీద, మంది మంచి చెడ్డల మీద గొణగడానికే ఆమెకు సమయం సరిపోదు. కాంతమ్మగారి భర్త రామచంద్రం ఆ ఊరి సర్పంచ్. సర్పంచ్ గారికి కాంతమ్మగారి చింతకన్నా మిగతా చింతలే ఎక్కువ. పైగా అంత సర్పంచను “మొగడాట మొగడు – ముదినట్టపు మొగడు” అనేయగలదు. నిజానికి రాంచంద్రం భార్య మంచి చెడ్డలు కనుక్కోవాల్సిన సమయంలో మాంచి నిషాలో ఉంటారు. కాంతమ్మగారు గుర్రు పెడుతూ ఉంటారు. అందుకే కాంతమ్మకు కసి- రాంచంద్రంకు నిషా అలవాటయిపోయాయి.
నడిఝాము రాత్రి రాంచంద్రం పూటుగా తాగి వచ్చిండు… ఒంటి గుడ్డలు మార్చుకోకుండానే మంచంలో పడిపోయాడు.
కాంతమ్మకు కోపం బుసబుస పొంగింది. ఎట్లాగో అనిచి పెట్టుకొని ఏ ఉపోద్ఘాతం లేకుండా “నిన్నే! మన బర్లు పాలిత్తలేవు. మనకో పాలిచ్చే బర్రె గావాలె” అన్నది.
“అద్దుమరాత్రి అంకమ్మ శివాలతీర్గ బర్రేందే? బ్రాండన్నా కాదు?” రాంచంద్రం కులాసాగా నవ్విండు.
“నీ మొకముతుక! బరండి గొంతికెలదాకా తాగినవని తెలుస్తనే ఉన్నది. శాయి ముండ దగ్గర రేపో, మాపో ఈనే బర్రున్నది. రేపొద్దున మాట్లాడు” అర్డరేసింది.
“సరే! సరే! ఇట్లారా!” అన్నాడు రాంచంద్రం ఏ మూడ్ లో నోవుండి.
“సాలు సంబుడం! నీ సోకు మండ! ఓ మంచి మాటలేదు, మన్నులేదు. నేనేమన్న బర్రెనా?” కాంతమ్మ దబాలున తలుపేసి ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది.
ఆ రాత్రంతా రాంచంద్రంకు ఆడకలలొస్తె – కాంతమ్మకు బర్రె కలలొచ్చాయి.
కాంతమ్మ తెల్లారి కోళ్ళు గూయకముందే లేచింది. పాలెర్ల కోసం ఎదురుచూస్తూ ఇంటిముందటి సిమెంటు గద్దెమీదనే కాపలా కూర్చున్నది. కాని ఆమె ధ్యాస ఇవాళ్ళ వచ్చిపోయే వాళ్ళ మీద లేదు. ఎర్రయ్య బర్రె మీదనే ఉన్నది. ఎర్రయ్య రాలేదు. బర్రె రాలేదు. బర్రె ఈనిన కబురు మోసుకొని పాలసర్వ బట్టుకొని పాలేరు నారిగాడచ్చిండు.
“నీ తాడుదెంప పొద్దు బారెడెక్కినంకనారా పాలుదెచ్చేది. నీ పెండ్లాం పొద్గాల లేవనియ్యలేదారా?”
“కాదు దొర్సాని ఎర్రోని బర్రె ఈన్తంటె దుడ్డెగెటందుకు బోయిన.” కాంతమ్మ చల్లబడి “పెయ్యదుడ్డెను బెట్టిందా! పోతు దుడ్డెను బెట్టిందిరా!”
“దుడ్డె కగ్గిదల్ల సేతెడున్నది దొర్సాని. కూసంతయితే అసలు పానానికే ముప్పచ్చు.”
“ఇంతకూ ఏం దుడ్డెరా?”
“పెయ్య దుడ్డె దొర్సాని.”
“అమ్మయ్య?” అనుకున్నది కాంతమ్మ. నారిగాడు లోపలికి వెళ్ళిపోయాడు.
“మాయిల్లమే మునిగి ముతమాయమై పోతవేందిరా! నారిగా ఇగరా” కాంతమ్మ గావుకేక బెట్టింది.
పాలు ఇంట్లో ఇచ్చేసి నారిగాడొచ్చిండు. “ఇగో శాయి ముండను రమ్మనుపో…”
నారిగాడురికిండు. శాయమ్మ రానేలేదు. కాంతమ్మ ఛాయ ముట్టకుండా ఇంట్లోకొచ్చి కుర్సీ మీద కూర్చుండి, శాయమ్మ కోసం ఎదురు చూస్తోంది.
దాదాపు ఉదయం ఎనిమిదింటికి చిరాకుగా నెత్తి గోక్కుంటూ శాయమ్మ వచ్చింది. నల్లగా, ఎముకలుదేలి, కంపలాటి నెత్తి, చిరిగిన గుడ్డ పేగులు కట్టుకొన్న శాయమ్మను కాంతమ్మ ఎగాదిగా చూసింది.
“శాయిముండ – ఓ సీరె పేగన్న కొనుక్కుంటేందే?”
“కొత్త (డబ్బు) లేడియి దొర్సాని! గుంటెడు జాగలేకపాయె. ఎర్రన్ని కయికిలి – (కూలి) జెయ్యమంటె చెయ్యడాయె.”
“అదేనే పాలమ్ముతలేవా!”
“గిప్పుడే ఈనిందిగాదు బాంచెన్.”
“ఎన్ని పాలిత్తదే?”
‘ముండకు కన్ను బడనే పడ్డది బర్రె ఎండుకపోద్దో ఏమో?’ మనుసులో అనుకొని “ఎన్నేడియి బాంచెన్?”
“సరెసరే! దాసుకో! ఔనే మా గొడ్లల్ల కొల్లాగె తీర్గ నీ కొడుకును జన్నెకిడిసినావే! పెండ్లి పెటాకులు సేత్తలేవు.”
“మా ఇద్దరికే కడుపుకు సాలలేదు. మరింక పెండ్లేడ బాంచెన్?”
“అవ్వ! గదేం చోద్యమే! కావలిత్తె నేం దొరకు చెప్పుత – నూరో ఇన్నూరో అప్పు కొంటబొయి పిడికెడు తలువాలెయ్యరాదూ!”
శాయమ్మ నెత్తి గోక్కున్నది.
“పోనీ బర్రె నమ్మరాదే…” కాంతమ్మ మాట పూర్తికాకముందే శాయమ్మ గయ్యిన లేచింది. “సాలు సెప్పు ధరమరాజా అంటే దుడ్డెబర్రె నాదేనన్నడట – సాలు సాలమ్మో మీ దగ్గెర భాగ్గెముంటే సందుగుల బెట్టుకోండ్లి. ఇప్పుడు గాంకన్నవ్.” ఊరంత నోరు చేసుకొని తిట్టుకుంటూ శాయమ్మ వెళ్ళిపోయింది.
ఆ గడబిడకు అప్పుడే నిద్ర లేచిన రాంచంద్రం బయటకొచ్చిండు. “అర్జెంటుగ ఏందే లొల్లి” అన్నాడు. అర్జంటు రామచంద్రం ఊతపదం.
“నాబొంద లొల్లి- సెయ్యయి సేతులు – కురువదినోరు – దిక్కుమల్లె పేగులాల ఎందు కొర్రుతరు అన్నట్టు పెరుగుగావాలె! చాయ్ గావాలె!” కాంతమ్మ పెద్దగా అన్నది.
“శాయమ్మను బర్రె నమ్మమంటే అది తిట్టుకుంట బోయింది బాపు” పెద్ద కొడుకు తల్లిని చూసి నవ్వాలో, లేదో తేల్చుకోక చెప్పిండు.
“అంతేనా! శాయి బర్రె అర్జెంటుగ కావాలంటవ్! అంతేగదా?” రాంచంద్రం ఆవుళిస్తూ.
“ఆ ముండకు ఎంత పొగరో! పేరుకు పెద్ద మనిషి సర్పంచ్ పెండ్లాం. పేరు పెద్దది. బారు సిన్నది. తు…” కాంతమ్మ కాండ్రకిచ్చి ఉమ్మేసింది.
‘శాయిబర్రెకు కాళ్లచ్చినయ్. ఈ ముండ ఊకునేటట్టులేదు’ అనుకున్నడు రాంచంద్రం. అందు గురించిన ఆలోచనలు చేస్తూ ఆవుళించిండు.
** **
(పాలు పితకడానికి దుడ్డెను విడుచుకొని సర్వ చేతబట్టుకొని శాయమ్మ బర్రె మట్టు దగ్గెరికొచ్చింది. ఇంకా చీకటి చీకటిగానే ఉన్నది. బర్రె మట్టు దగ్గెర బర్రె లేదు. బర్రె తలుగు మాత్రమే వున్నది.)
“ఎర్రయ్యా! లేలేరా! బర్రె తలుగు తెంపుకపోయింది లేలేరా!” శాయమ్మ గాబరగా మొత్తుకున్నది.
ఎర్రయ్య కళ్ళు నులుపుకుంటూ లేచి బర్రెకోసం పరుగుతీశాడు. పొద్దెక్కే దాకా చేలు, చెలుకలు, వాగులు – వంకలు, పెరండ్లు గాలించాడు. బర్రె కనిపించ లేదు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటి కొచ్చేసరికి ఇంటి ముందు పెద్ద గుంపు చేరిపోయింది. శాయమ్మ వెంట్రుక లిరబోసుకొని ఆడికీడికురుక్కుంటూ – “మందినోట్లె మన్నుబడ నా బర్రెమీదనే కన్ను – గీ ఊళ్ళె బర్లులెవ్వా! గొడ్లు లెవ్వా! సచ్చినయా!” తిట్టసాగింది.
దుడ్డె పాలకోసం మట్టు దగ్గర గింజుకుంటూ తెగ అరుస్తోంది. పొట్టి వైకుంఠం ఆడికీడికి తిరుగుతూ పెద్దగా నోరు తెరిచి “నీ బర్రయితే కట్టేసుకోవాలె లాపోతే మాదిగోల్లకు కోత కిచ్చుకోవాలె. గిద్దెడుకు తిన్నది అనపతీగేలు” అంటున్నాడు. ఎర్రయ్యను చూడగానే అంతెత్తు ఎగిరి “ఓరి ముండకొడుక కాళ్ళు బారజాపుకొని పండి మందారువాలు (మంది పంటలు) ముంచేటందుకు బర్రెను బెంచినావురా? లం…కొడక” మీదిమీది కొచ్చిండు.
అసలే బర్రె దొరుకక తిరిగి తిరిగి వచ్చిన ఎర్రయ్యకు అట్ల కోపం వచ్చింది. దున్నపోతులాగా గసకొడుతూ వైకుంఠం మీది కురికి కింద పడేసి మీద కూర్చున్నాడు.
“నీ ఇంట్ల పీనుగెల్లగదరో! నీ కాడుగాలగదరో! సంపినావురో!” వైకుంఠం భార్య శోకాలు మొదలేసింది.
అక్కడ చేరిన జనం కాసేపు చోద్యం చూసి సంబురపడ్డరు. వైకుంఠం మిడి గుడ్లేసిండు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎల్లయ్య మందిని తిట్టి ఎర్రయ్యను పక్కకు పడతోసిండు.
** **
మధ్యాహ్నం అయ్యేసరికి ఆంజనేయుని గుడి దగ్గర ఊరి పెద్దలంతా జమై పోయారు. పంచాయతి మొదలయ్యింది. సర్పంచ్ రాంచంద్రం రావడమే ఆలిశ్యంగా వచ్చాడు. ఆ సమయంలో ఎర్రయ్య బర్రె బందిలదొడ్డిలో పాలుచేపి అరుస్తోంది… దుడ్డెకోసం పెనుగులాడుతోంది. దాని దగ్గర కావలున్న మాలతను దాని అరుపులను, ఆరాటాన్ని పట్టించుకోకుండా బందెల దొడ్డి దగ్గర దుమ్ములోపడి నిదురపోతున్నాడు. శాయమ్మ ఇంటి దగ్గర గుడిసె దద్దరిల్లేటట్టు దుడ్డె అరుస్తోంది.
పంచాయితి పెద్దలకు పశువుల ఆరాటం పట్టేదికాదు. పంచాయితిలో కాసేపు రాజకీయాలు, కాసేపు పరామర్శలు, కాసేపు పనిపాటలేని కబుర్లు. ఆమాట, ఈమాట అయిపోయిన తరువాత “వారీ! వైకుంఠా…” రాం చంద్రం పిలిచిండు.
“అయ్య బాంచెన్…” “ఎర్రోడా! వచ్చినావురా?” అన్నాడు రాంచంద్రం. దుమ్ములో కూర్చున్న ఎర్రోడు ‘అయ్య బాంచె’నన లేదు. శాయమ్మ కూడా వచ్చింది. ఆమెకూడా యేమనలేదు.
“దడావతులు (పంచాయతులో అడ్వాన్సుగా వాది ప్రతివాదులు పెట్టేసొమ్ము) దెచ్చినార్రా?” కిష్టయ్య అనే మోతెపరి రైతు అడిగిండు.
“నీ బాంచెన్ పెయ్యంత గొట్టిన పెరుక్కు పెద్ద కొత్తలేదు.” వైకుంఠం లేచి మొక్కిండు.
“గిదేందిరో సల్లకచ్చి ముంత దాసినట్టు – పంచాతుకచ్చి దడావతు లేదంటే ఎట్లరా!”
“తమరొప్పుకోండ్లి బాంచెన్.”
“సరే వైకుంఠని తరఫున నేను జమానతు పడ్తన్న” అన్నాడు కిష్టయ్య. శాయమ్మ కొండయ్యను, షావుకారి రాజీరును బతిమిలాడింది.
“నాకాడ చిల్లిగవ్వ సుతలేదు. కొత్త పాతసందు (పాత ధాన్యం అయిపోయి కొత్త పంట చేతికొచ్చే సమయం) అంత బేరంల బెట్టిన” రాజీరు.
“మారే మిమ్ముల నమ్మవశంగాదు. అక్కెర దీరినంక జక్కిని సెప్పుతో గొట్టా లంటరు” అన్నాడు కొండయ్య.
“నువ్వొప్పుకోరాదు రాంచంద్రం పాపం ముసల్ది గీమాలుతంది” కిష్టయ్య అన్నాడు.
రాంచంద్రం ‘ఊ’ అనలేదు. కాని అన్నట్టే అనుకున్నారంతా.
పంచాయతి ఎప్పటిలాగే తిట్లు, దీవెనలు, కథలు కాకరకాయలు, కోపతాపాలు, ఏడుపులు, మొత్తుకోల్లతోని ముగిసింది.
ఎర్రయ్యది తప్పని తేలింది. నలుగురు పెద్దలు వైకుంఠం అనప పెరడి చూసొచ్చారు.
తీర్పు, వైకుంఠం అనప పెరిడికి నష్టపరిహారం వంద రూపాయలు. దడావతు డబ్బు ఆనవాయితిగా పెట్టే వంద రూపాయలు తప్పు దండుగ కింద చెల్లు… అందులో 50 రూపాయలు పోలీసు పటేల్ కు మిగతావి ఒక భాగం రాంచంద్రం – మిగతా 25 అందరికి ఆనవాయితి ప్రకారం పంచారు. బర్రెను బందెల దొడ్డిలనుంచి విడిపించడానికి యాభై అందులో పంచాయతు పేర జమ చేసేంది ఎంతో ఎవరికి తెలియదు… ఎర్రయ్యకు మొత్తం 250 రూపాయలు ఖర్చు.
“నా ఇల్లు ముంచిండ్లురో దేవుడా! దొంగలు దొంగలు ఊళ్ళు పంచు కున్నర్రో దేవుడా! నేనెవలకు సెప్పుకుందురో దేవుడా!” శాయమ్మ లబలబ మొత్తుకుంట దుమ్ము కెలుకుతూ, ఛాతీమీద చరుచుకుంటూ ఏడ్వసాగింది.
“ఓ శాయిముండ… పెద్ద మనుషుల తిడున్నవ్…దండుగ పెరుగుతది జేగర్త” కిష్టయ్య అన్నాడు.
“లం…ను గుంజెకు గట్టరా సఫాయోడ!” అన్నాడు రాంచంద్రం లేస్తూ.
ఎర్రయ్యకు తిక్కతిక్కగా ఉన్నది. ఎటూ చాతకాక ముసల్దాని వీపుల గుద్దిండు.
“ఓరి నీ కాడుగాలగదరో! నీకే దమ్ముంటే నన్నుగాదురా! నీ కడుపుమీన గొట్టినోళ్లు…” ముసల్ది మొత్తుకున్నది.
పంచాయతు ముగిసింది. ఎర్రయ్య మేకమరకను నూరు రూపాయలకు అమ్మిండు. నూట యాభయికి రాంచంద్రంకు అప్పుకాయిదం రాసిచ్చిండు.
బందెల దొడ్లె నుంచి బర్రె విడుదలైంది…ఎర్రయ్య మెడకు ఒకతాడు చుట్టుకున్నది.
** **
మధ్యాహ్నపు ఎండ చిటపటలాడిస్తోంది. బర్రె, దుడ్డె వాగు మడుగులో పడి ఈదులాడుతున్నాయి. ఎర్రయ్య మోకాళ్ల మీద తలబెట్టుకొని వాగులో ఇసుక పర్రమీద కూర్చున్నాడు. ఇసుక కాలుతున్నా అతనికా ధ్యాసే లేదు. మనసంతా కోళ్ళు తవ్విన పెంట లాగున్నది. మనసు పెండ్లిమీదికి పోతోంది.
వాగొడ్డు కందిచేలో పచ్చిగడ్డి కోసుకొని మోపు కట్టుకొని, ఎంత ప్రయత్నించినా మోపు నెత్తిమీదికి యెత్తుకోలేక సుక్కమ్మ కందిచేను బయటకొచ్చి చుట్టూ చూసింది. దూరంగా ఎండలో ఎర్రయ్య కనిపించాడు.
“ఎర్రయ్య ఓ ఎర్రయ్యా! గీంత మోపెత్తుదువురా!” కేకేసింది. ఎర్రయ్య సుక్కమ్మ దగ్గరికొచ్చిండు. “ఎండల కూకున్నవ్ – పెయ్యి తీపునమా!” సుక్కమ్మ అడిగింది.
సక్కనైన సుక్కమ్మను తేరిపార చూసేసరికి ఎర్రయ్యకు మైకం కమ్మింది. మోపెత్తిండు. చెయ్యి పట్టుకున్నడు. “వత్తవా!” అన్నడు అదేదో మామూలు సంగతన్నట్టు.
సుక్కమ్మ ఎర్రయ్య మండుతున్న కండ్లు చూసింది.
“ఓరి నీ మొకముతకా! అంత లావు మొగోనివైతే పెండ్లి జేసుకోరాదు” గయ్యిన లేచింది. ఎర్రయ్యకు అప్పుడు కాళ్ళు వనికినయ్. వెనక్కు తిరిగి చూడకుండా వాగుల కురికిండు.
‘త్రువ్వలెల్లె… గిది తప్పేనోంట’ అనుకున్నడు. సుక్కమ్మ అంగడి చేస్తదేమో నని భయపడ్డడు. పంచాయతి తలుచుకునేసరికి ఒళ్ళంతా చెమటపట్టింది. సుక్కమ్మ గడ్డి ఇంటి దగ్గర పడేసి శాయమ్మ దగ్గరి కురికింది. శాయమ్మ చాతకాక మంచంలో పండుకున్నది.
“నీ కొడుకును సూసినా అత్తా! నా సెయ్యి పట్టిండు” అన్నది…
శాయమ్మ గుండెల బండపడ్డది. “నీ బాంచెన్ కోడలా! గీమాటెక్కడనకు…” బతిమిలాడింది.
“ఎంతకాలమత్తా! అంతకు తగ్గ బొంతని ఏన్నన్న పెండ్లి చెయ్యరాదు” అని సలహా యిచ్చి సుక్కమ్మ వెల్లిపోయింది.
శాయమ్మ అప్పు బాధతోని ఎండి ఎర్రగప్పయ్యింది. కూడు తినదు. తినక కుప్పజేసి అప్పుదీర్చాలని ఆమె ఆరాటం…ఆమెకు భర్త యాదికొచ్చిండు… అతని పెనుగులాట, పంచాయతులు, దండుగులు, అప్పులు, పంటలు – వానలు, ఎండలు అన్నీ గుర్తు కొచ్చినయ్…పదెకరాల భూమి సగం రామచంద్రంకు, సగం రాజీరుకు అమ్మి ఆరాత్రి ఉరిబెట్టుక సావడం యాదికి రావద్దనుకున్నది… రానే వచ్చింది. కొడుకు ఎడ్డి బావులోడు. పెండ్లి చెయ్యటం? ఏన్నన్న పాలేరుంచుతె కలో గంజో తాగి బతుకుతడు. తనకు ఊరు దూరమై కాడు దగ్గరైతంది…ఇట్లా సాయంత్రందాకా శాయమ్మ ఆలోచిస్తూనే ఉన్నది.
దీపాలు ముట్టిచ్చిన వేళ శక్తినంతా కూడదీసుకొని శాయమ్మ రాంచంద్రం ఇంటికి పోయింది. శాయమ్మ వచ్చేసరికి కాంతమ్మ సిమెంటు గద్దెమీదనే ఇంకా కొలువుదీరి కూర్చున్నది. శాయమ్మను కళ్లకింది నుంచి పరిశీలనగా చూసి “ఏందే శాయిముండ గిటు తొవ్వబడ్డది” అన్నది.
“ఏం లేదు బాంచెన్ – దొరున్నడా!” శాయమ్మ నిట్టూర్చింది.
“ఏం దెచ్చినవే దొరకు…” శాయమ్మ బర్రె ఇంకా కాంతమ్మ మనసులో మెరమెర లాడుతూనే ఉన్నది.
శాయమ్మ చప్పుడు చెయ్యలేదు. రాంచంద్రం రాత్రికి వస్తాడని తెలుసుకొని మళ్ళీ గుడిసెకొచ్చింది. ఎర్రయ్య చీకటి పడ్డ తర్వాత బెదురు బెదురుగా గుడిసెలో కొచ్చిండు. శాయమ్మ కొడుకును దీసుకొని రాంచంద్రం దగ్గరికి పోయింది. రాంచంద్రం కుర్చీలో కూర్చున్నాడు.
“ముంచినా తేల్సినా ఊరోల్లందరికీ తమరే దిక్కు బాంచెన్. మా ఎర్రోడు ఎడ్డోడు బాంచెన్. గీనికి ఏదన్న దారి సూపుండ్లి దొరా!” శాయమ్మ రాంచంద్రం కాళ్ళు మొక్కింది.
“నిరుడు (కిందటేడు) ఇచ్చిన పైకమే అడ్డి బెరుగుతోంది. ఏం జెయ్య మంటవే!”
“తమరి కొలువుల బెట్టుకోండ్లి.”
“కొలువా? యేల్లగానేల్ల గోపాలం బాడినట్టు గిప్పుడెట్ల కుదురుతది? ఉగాది నాడంటె ఏదో సెయ్యచ్చు. అయినా బర్లెంట దిర్గినోడు నాగలి దుంతడా? నాకైతె నమ్మకం లేదు.”
“బాంచెన్ గట్లనకుండ్లి. కుంటోడా! గుడ్డోడా!” రాంచంద్రం మాట్లాడలేదు.
“నాకా ఒంట్లే జిగి (శక్తి) సచ్చింది. గీల్లయ్యే బతికుంటే ఎట్లుండునో! నడడివిల మమ్ములిడిసి తనదారి తను సూసుకున్నడు మారాజు – నోరోటి అనుకుంటే నొసలోటి దల్సింది. బాంచెన్ గీన్ని మీ సేతుల బెడ్తన్న. పిడికెడిత్తులు తలువాలు (తలంబ్రాలు) ఏసి వాన్నో ఇంటోన్ని జెయ్యిండ్లి.”
“ఔరా ఎర్రోడా! బర్లగాత్తావుర! లసుమనికి కండ్లు గన్పడ్తలేవట.”
శాయమ్మకు నోట మాట రాలేదు. బర్ల కాయడం ముసులోడో ముడిగోడో చేస్తడు. బర్లాయి (బర్ల వేడి) గొట్టిందని బర్లగాసినోనికి పిల్ల నెవరియ్యరు.
“ఉగాది దాకనే…అయింక నాగలికి బెట్టుకుంట.” అన్నాడు.
నాలుగు కుంచాల జీతం. గొంగడి చెప్పులు. రెండు బస్తాల ధాన్యం. సంవత్సరాంతంలో పెట్టుబడికి ఎర్రయ్య రాంచంద్రం దగ్గర పాలేరుగా కుదిరాడు. ఇంకో రాయితీ యేమంటే ఎర్రయ్య తన బర్రెను కూడా రామచంద్రం బర్లతో పాటు కాసుకోవచ్చు.
రెండు ఉగాదులొచ్చి పోయినయ్…ఎర్రయ్యకు పెళ్ళి కాలేదు. బర్లనుంచి నాగలికి మారలేదు… రాంచంద్రం మాత్రం “పిల్లను జూత్తన్నరా! పిల్ల దొరికినంక నాగలి కుంచుకుంట” అంటూనే ఉన్నాడు.
నెగడు చి ట పొ ట మండుతోంది… నెగడుముందు పాలేర్లంతా కాళ్ళు బారజాపి కూర్చున్నారు…ఎర్రయ్య పండ్లు బిగబట్టి కాళ్ళు గోక్కున్నాడు. కాళ్ళు తెల్లగా అసహ్యంగా చారికలు బడ్డాయి. చిమ్మెట్లు ఉండి ఉండి పలుకుతున్నాయి. నెగడుకు కొద్ది దూరంలో మట్టుకాడ గొడ్డు బర్రె లొటలొట చెవులు గొడుతోంది.
“దాన్నేందుకు కొట్టం ఈతల గట్టేసినవ్ రా?” ఎంకడు పొగకు కళ్ళు మండుతుండగా అన్నాడు.
“దానికగ్గిదల్గ కోతకియ్యాలె – నాత్రి తలుగు దెంపుకొని పాడిబర్ల పొడుత్తంది” ఎర్రయ్య.
“వారీ ఎర్రయ్య పెండ్లేమాయెర పెండ్లి?” పొట్టోడు కిసకిస నవ్విండు. “ఆని మొకానికి పెండ్లా? ఇంకెక్కడి పెండ్లి ముసలితనానికి దసిలి (పట్టు) రయికె అన్నట్టు, బర్లాయి గొట్టింది. బొత్తుబ్బుతన్నది ఆనికెవడిత్తడు పిల్లను. పాలీకెక్కేందుకు (పాడె ఎక్కేందుకు) ఆడు తయారైతంటె” – ఎంకడు బరువుగా బాధగా అన్నాడు.
“నీయక్క సూడుండ్లి రామసక్కదనాల పిల్లను జేసుకుంట” ఎర్రయ్య. “బర్ల లసుమడు గిట్లనే అన్నడు ఎనకట” పొట్టోడు. పొట్టోని మాటెవడు పట్టించుకోకుండ నవ్విండ్లు. నడి ఝాము రాత్రిదాకా ఎంకడు ఏదో కొన మొదలులేని కథ చెప్పిండు.
ఎర్రయ్య ఆవుళించి బర్ల కొట్టంలకొచ్చి పండుకున్నాడు… పాలేర్లంతా లేచి పోయి ఎవరి జాగాల్ల వాళ్లు ముడుచుక పడుకున్నారు. పొట్టోడు కాసేపు రానిది పోనిది ఏదో పాట పాడిండు –
దోమలు యమరొద చేస్తున్నాయి. రొద చేయడమే కాదు – ఎక్కడికక్కడ పీకి పెడుతున్నాయి. ఎర్రయ్యకు నిదురపట్టలేదు. ఎంతాలోచించినా పెండ్లయ్యే మార్గం కనిపించలేదు… అట్లా ఆలోచిస్తూ కన్ను మూసిండు. ఎప్పుడో కన్నంటుకున్నది. నిదురలో తనకు పెళ్ళయినట్టు కలగన్నాడు. పెళ్ళాం తన పక్కలో పడుకున్నది… “నువ్వటు జరుగు” ఎర్రయ్య కలువరించి కాలుదీసి కొంచెం దూరమేసిండు. బర్రెకాలు తొక్కింది. ఎర్రయ్య దిగ్గున లేచి కూర్చున్నాడు. కాలునొప్పి, కడుపుబ్బు కొచ్చింది. కొట్టం బయట వెన్నెల పిండారబోసినట్లుగా ఉన్నది. ఎర్రయ్య లేచి కొట్టం బయటకొచ్చిండు.
పదారి గోడపక్క చప్పుడయ్యింది. అటు చూసిండు. రెండు నీడలు లేచి ఆదరాబాదరగా బట్టలు సదురుకున్నాయి. ఒకనీడ గాబర గాబరగా అక్కడినుండి పరుగెత్తింది. నీడ లెవరియో ఎర్రయ్య గుర్తుపట్టిండు. కాసేపు గుండె కొట్టుకోలేదు.
“ఓర్నియవ్వ పాపం పని సూడనే సూత్తి. పసురాన్నయిపోతి. ఎట్ల? ఇప్పుడెట్ల? అనుకొని తనేమి చూడనట్లుగానే ఇంకో దిక్కు తిరిగి సరాంచి గొడ్డు బర్రె మట్టు దగ్గర మూత్రానికి కూర్చున్నాడు.
ఎర్రయ్య మూత్రం పోస్తూనే వున్నాడు. హఠాత్తుగా ఎర్రయ్య వీపుమీద చెప్పుదెబ్బ. టార్చిలైటు వెలుతురు పడ్డాయి. ఎర్రయ్య వెల్లకిలా పడిపోయిండు.
“వావ్వో సత్తినే” మొత్తుకున్నాడు.
“లంజకొడుకా! పసురపు లం… కొడుకా! నీ యవ్వన్…” రాంచంద్రం ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. ఈ గడబిడ కు మిగతా పాలేర్లు లేచి పరుగెత్తుకొచ్చారు.
“నేను సూసెపటికే సరిపోయింది. అరే! ఎంకా ఈన్ని కట్టేయిండ్లి. ఎన్నేండ్ల బట్టి సాగుతన్నదో. బంగారమసొంటి నా బర్రె పెయ్య గందుకనే గొడ్డుబోయింది. (గొడ్రాలయ్యింది)” రాంచంద్రం చెప్పు కిందబడేశాడు.
పాలేర్లు బిత్తిరిపోయిన ఎర్రయ్య వాలకంచూసి ఎర్రయ్యను కట్టేశారు.
** **
సూర్యోదయం కాకముందే – వెలుగు రేక లెల్లకముందే చింతలమీది పక్షులు రెక్కలిప్పకముందే – పశువుల తలుగులు విప్పకముందే ఆంజనేయుని గుడి దగ్గర ఊరి జనం కుప్పకూడి తలోమాట అనసాగారు. ఎర్రయ్యను హనుమంతుని కెదురుగా గుంజకు కట్టేశారు.
శాయమ్మ గుండెలు బాదుకుంటూ పరుగెత్తుకొచ్చింది. “కొడుకో కొడుకా! ఏం కాలమచ్చిందిరా కొడుకా! బట్టగాల్సి మీదేసే పాపిట్టికాలమచ్చిందిరా కొడుకా” శాయమ్మ ఏడుస్తోంది.
ఎర్రయ్య తలవాల్చుకొని కూర్చున్నాడు. దండ చేతులకు కట్టిన జనుపపగ్గాలు నొప్పికన్నా మనుసులెక్కడో పెద్ద నొప్పిగున్నది.
రాంచంద్రం, కిష్టయ్య, షావుకారి రాజీరు, కొండయ్య రావాల్సిన వాళ్ళంతా వచ్చారు.
ఈసారి వేరే మాటలు లేవు. రాజకీయాలు లేవు- పరామర్శలు లేవు. పలకరింపులు లేవు – ముఖ్యంగా దడావతులు కూడా లేకుండా ఊరు చరిత్రలో మొదటిసారిగా పంచాయతి మొదలయ్యింది.
రాంచంద్రం అసహ్యంగా ముఖం పెట్టి అది చాలదన్నట్టు కాండ్రకిచ్చి ఉమ్మేసి “గిటువంటి పంచాతులు కలీంగల జర్గుతయని నేను సుత అనుకోలేదు. పాపం పెరిగిపోతున్నది. గందుకనే కరువులత్తన్నయి. మనుషులు పసురాలయి పోతండ్లు. గీడనే గీ ఆంజనేయుల వారి ముంగట్నే నేను లంజ పంచాతులు, లంగ పంచాతులు నా ఎంటికలన్ని దెంపిన కని గిసొంటి బహు పాతకపు పంచాతు నేను సూడలేదు” చిన్నగా పొడిదగ్గు దగ్గి జనం దిక్కు చూశాడు. జనం మాటలు లేని కొయ్య బొమ్మల్లాగా నిలుచున్నారు.
“పెండ్లిలున్నయి. పెటాకులున్నయి. సీ… సీ…” మళ్ళీ ఉమ్మేసి గొంతుమార్చి “రాత్రి నిదురబట్టక పశువుల దొడ్డికాడికి బోయిన గీ ఎర్ర లం… కొడుకు” పండ్లు పటపట కొరికి ఎర్రయ్యను తన్నిండు. శాయమ్మ అడ్డమురికొచ్చింది.
“లే ముండా! లే…” రాంచంద్రం ఎర్రయ్య తల్లి ముసలిదాన్ని పక్కకు తోసిండు.
“నీ అంశం నిర్వంశంగానురో దొరోడా!” శాయమ్మ నోరు మూసి యెవరో పక్కకు తీసుకపోయారు.
“నా బర్రె పెయ్యతోని ఎర్రడు కలువంగ (సంభోగం చేయంగా) జూసిన.” రాంచంద్రం మాట పూర్తి చేయకముందే అమ్మలక్కలంతా ముక్కుల మీద వేలేసుకొని ‘దిక్కుమల్లె ముండా కొడుక్కు గిదేం బుద్ధి, అవ్వ…” నోళ్ళు నొక్కుకున్నారు.
రాంచంద్రంకు ఆయాసమొచ్చింది. కుర్చీలో కూలబడ్డాడు.
తలోమాట, తలో తిట్టు – ఎర్రయ్య తలెత్తనే లేదు. నోరిప్పనే లేదు. చెవుల మీద కంటా పెరిగిన జుట్టు, అప్పుడప్పుడే అసహ్యంగా పెరుగుతున్న బొత్త, సన్న బడుతున్న చారికలుబడ్డ కాళ్ళు. కమిలిపోయిన ముఖంలో కాంతి విహీనమైన కళ్ళు – ఎర్రయ్య పశువులాగే అసహ్యంగా ఉన్నాడు.
జనానికి ఆ రూపం కన్నా అతను చేసినాడని చెప్పబడుతున్న పని మరింత అసహ్యంగా అనిపించి అందరు ఉమ్ములేశారు. “పసురం” అన్నారు…
అప్పుడు కిష్టయ్య కలుగజేసుకొని “సరే! ఎర్రోడు చేసింది మనిషి చేసే పని గాదు. పసురం జేసే పని – అందునా దున్నపోతు జేసే పని” – అని చమత్కరించి “ఇది ఎన్నేండ్లుబట్టి నడుత్తందో?” అన్నాడు.
అప్పుడు రాంచంద్రం కలుగజేసుకొని “రామసక్కదనాల బర్రె పెయ్య గొడ్డు బోయింది. రెండేండ్లాయె ఈనుడు లేదు కట్టుడులేదు. గీ లం… కొడుకు జెయ్యబట్టే గొడ్డు బోయింది” అని మళ్ళా లేచి నిలబడి “గబర్రె పెయ్య మరింక నాకద్దు” అన్నాడు.
కిష్టయ్య సంగతి గ్రహించి “ఏమర్రా పెద్దలు విన్నరుగదా! బంగారమసొంటి బర్రె పెయ్య గొడ్డుబోయింది. సేసిండు కూకున్నడు ఎర్రడు. దీనికేం జేయాల్నో మీరే చెప్పుండి” అన్నాడు.
మందిలో నుంచి ఏ మాట రాలేదు. ‘నిజమా! కాదా?’ అని వాళ్లండ్ల వాళ్లే పిసపిసలాడిండ్లు.
రాంచంద్రం, శంకరయ్య అనబడే రైతుకు కన్ను గీటిండు. శంకరయ్య మందిలో నుంచే “యేమున్నది. ఎర్రని బర్రెను సర్పంచ్ దీసుకొని గొడ్డు బర్రెను ఎర్రయ్య కిచ్చుడే” అన్నాడు.
శాయమ్మ గొల్లుమన్నది. “మీ మొల్ దారాలు దెంప మీ అందరి సుతి ఒక్కటే. నా బర్రెను యెత్తుకపోదామని ఎత్తులేసిండ్లు…” మొత్తుకున్నది. జుట్టు పీక్కున్నది ఆ రాత్రంతా.
ఆ రాత్రి కాంతమ్మ రాంచంద్రం పక్కలో కన్నార నిదురబోయింది.
** **
అయిదేండ్లు గడిచిపోయినయ్. శాయమ్మా చచ్చిపోయి నాలుగేండ్లయ్యింది. గుడిసె కూలిపోయింది. ఎర్రయ్య గడ్డం మీసం బెంచేసి “దునియంత పసురాలె బంచత్…” తనండ్ల తనే గొనుక్కుంటూ తిరుగుతాడు. కాంతమ్మ పెట్టిన చలిదో బులిదో తింటాడు. రాంచంద్రం బర్ల కాస్తుంటాడు. ఎర్రయ్య బర్రె సచ్చింది. దుడ్డె బర్రె అయ్యింది. ఇప్పుడు రాంచంద్రంకు ఇరవై బర్లున్నాయి.
కాంతమ్మ ముసలిదైనా పడుచుమాటలే మాట్లాడుతుంది. రాంచంద్రం రానూ రానూ పడుచువాడవుతున్నాడు.
ఎర్రయ్య పేరు ఊరోల్లంత మరిచిపోయారు. ఇప్పుడు ఎర్రయ్య పేరు బొత్తోడు. పసురం. కామిండ్లోడు. ఎర్రయ్య కిప్పుడు నలుభై ఏండ్లు.
గత ఏడాది నుంచే ఊళ్ళో కలకలం రేగింది. పాటలు పాడి రైతు-కూలి సంఘమన్నరు. కూల్లు బెరుగాలన్నరు. పనులు బందు బెట్టిండ్లు – వీటన్నిటికన్నా ముఖ్యంగా ‘పంచాయతి’ ఊరి పెద్దల చేతుల్లో నుంచి జనం గుంజుకున్నారు.
అట్లాంటి ఓ సాయంత్రం పూట – ఊరు ఊరంత ఉరుకులు పరుగులు మీదున్నరు. ఎవరినోట విన్నా పంచాయతనే మాటే – పంచాయతి చేసేది సంఘం – విచారణ రాంచంద్రం మీద – స్థలం ఊరవతల గుట్టబోరు పక్క విప్పచెట్టుకింద – జనం తొక్కులాడుతున్నారు. ఇంకా బారెడు పొద్దే ఉన్నది. గడ్డం పెరిగి ధోవతి, లాల్చీ మాసిపోయి రాంచంద్రం వచ్చాడు.
జనంలో గుసగుసలు – “అగో అచ్చిండచ్చిండు – మందిని ముంచెటో డచ్చిండు” కుమ్మరి అయిలయ్య పంచాయతి పెద్ద. “ఒకలొకరు చెప్పుండ్లి” అన్నాడు పంచాయతు పెద్ద.
“ఇగో నేను, నా పెండ్లాం కొట్లాట బెట్టుకుంటె యాభై రూపాలు దండుగేసిండు” ఓ బక్క పలుచటోడు.
“నా నోరు మంచిదిగాదు నిచ్చమే. మాట మాటకు పది రూపాల దండుగేసి బోళ్ళు బొక్క లమ్మిచ్చిండు.”
“మా రుక్కి మంచాల బడ్డప్పుడు నాకు ఇన్నూరప్పిచ్చి అయిదేండ్లకు రొండెకు రాల సేను గుంజుకున్నడు.”
“ఇంకేమన్న ఉన్నయా?” కుమ్మరాయన.
రాంచంద్రం ముఖం వాల్చేసిండు. అచ్ఛం అయిదేండ్ల నాడు బర్రె పంచాయదులో ఎర్రయ్యలాగే.
ఎర్రయ్య గద్దువ కింద గుతుప కర్ర బెట్టుకొని చాలా సేపటి నుంచి చూస్తున్న వాడల్లా పూనకం వచ్చిన వానిలాగా మందిని జరుపుకుంటూ వచ్చి రాంచంద్రం ఎదురుగా నిలబడి “ఓ సర్పంజీ! నేను మనిషినేనా? పసురాన్నా? నాకు సీము నెత్తురున్నదా లేదా?” అడిగాడు.
“నువ్వుగాదు ఆడే పసురం…ఆడే-ఆడే…” అన్నారెవరో గుంపులోనుంచి. “అట్లయితే మరి నాకు పెండ్లెందుకు గాలే?” మందికేసి తిరిగి ఎర్రయ్య. “సంఘం జేత్తదిలేరా!” అన్నరెవరో, అందరు నవ్విండ్లు.
“త్రువ్వలెల్లె నవుతాండ్లు – నేను పసురాన్నే అనా? దెహెఁ మీరంత పసురాలు రొరే! ఇగో గీ సర్పంజీ అందరు పసురాలే బంచత్.”
“గయ్యేం మాటలు లే….” కుమ్మరాయన.
“ఎందుకు లేత్త నేను పసురాన్నా, మనిషినా?”
“నువ్వేడ దొర్కినవురా? అడ్డల బుడ్డాలె” కొందరు.
“ఇగో ఎర్రయ్య! అందరు సర్పంజి తీసుకున్న దండుగులు చెప్పుతండ్లు. నీకేమన్న ఉంటే చెప్పు” కుమ్మరాయన.
“గట్లను. ఏమన్ననా? అంతా బోయింది ఆఖరుకు నన్ను పసురం జేసిండు గీసర్పంజి ఇనుండ్లి. మా అవ్వ శాయవ్వ మతికున్నదా? గది బతికుండంగ మాకు పొద్దు మూడు సోల్లు, మాపు తవ్వెడు పాలిచ్చే బర్రుండే. గీ సర్పంచి పెండ్లాం కాంతమ్మ కన్ను మా బర్రె మీద బడ్డది. గదంతెందుకు నేను గీనికి పాలేరున్న పెండ్లి జేత్తడని – ఈడు నన్ను బర్లను కాయ బెట్టిండు. బర్ల గాయంగ ఓనాడు అద్దుమరాత్రి ఉచ్ఛకు లేసిన.”
“అల్లుకుబోతె పిల్లెదురైనట్టు ఉచ్చేందిరా!” కుమ్మరాయినె నెత్తి గోక్కున్నడు.
రాంచంద్రంకు గుండె ఝల్లుమన్నది. రాంచంద్రం ముఖం చూసి ఎర్రయ్య చిత్రంగా నవ్విండు. నవ్వి “ఏమున్నది రెండు నీడలు గన్పిచ్చినయ్. అందట్ల ఓటి ఆడామెది రెండోది గీ సర్పంజిగాడు.”
“రొండో నీడెవలురా?” ఎవడో అరిచిండు.
“ద్దుతారి నేను పసురాన్నా! గట్ల సెప్పుతనా? ఏ నీడయినా కడుపుకు జాలని మన అక్కో సెల్లో! గది సరే! పాతకపు పని సూడనే సూత్తినని అటు దిరిగి గొడ్డు బర్రె దగ్గర ఉచ్ఛకు ఏమెరుగనట్లు గూకున్న. నేను సూత్తినని ఎవలకన్న సెప్పుతనేమోనని గీడు సెప్పూడబీకి ఇయ్యరమయ్యర దంచి ‘ఈని బర్రెతోని నేను బోతన్ననట. అది గందుకనే గొడ్డుబోయిందనిజెప్పి పంచాతిబెట్టి నా బంగారమసుంటి బర్రెను గుంజుకున్నడు. నన్నో పసురాన్ని జేసిండు. మా అవ్వ గా రంధిల సచ్చింది. నా బతుకు గిట్లయ్యింది.” ఎర్రయ్య గొంతు వణికింది.
జనంలో కలకలం “తన్నుండ్లి – తన్నుండై హె, రామచెంద్రంగాన్ని తన్నుండ్లీ!”
“నాలెముచ్చు బాడ్ కావ్” మరి కొందరు. “నిచ్ఛమే నిచ్ఛమే. గా పంచాతుల నేనున్న” అన్నడు ఒక రైతు. “ఎర్రయ్యది బర్రెదుడ్డె రాయిండ్లి” అన్నడు పంచాయతు పెద్ద.
ఎర్రయ్య “పసురాలు బంచత్ – పసురాలు బంచత్” గొణుక్కుంటూ మందిలో కలిసిపోయాడు.
“ఒరే ఎర్రన్నా! బయపడకు. దొరలు మనల పసురాలే జేత్తే సంఘం మల్ల మనుషుల జేత్తంది. నీ బర్రె దుడ్డె నీకు గొనిపిత్తరు…” అన్నాడు తోటి పాలేరు పొట్టాయన.
“ఓ ఊళ్లె నేను పడ్డయాతనో? పసురంగ బతికిన బతుకో” ఎర్రయ్య కళ్లల్లో గుబగుబ నీళ్ళు.
(1979లో కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి తాలూకాలోని రైతుకూలీ సంఘం పరిష్కరించిన ఒక కేసు ఆధారంగా)
(ఆంధ్రజ్యోతి వారపత్రిక – 05. 02. 1983లో ప్రచురితం)