నడిరాతిరి పత్తికాయ పగిలిన ధ్వని

“అమ్మా నీ పేరేమిటి?”
‘నాకు తెలీదు’
“నీ వయస్సెంత? యెక్కడి నుంచి వచ్చావు?”
‘నాకు తెలీదు’
“యీ కందకం యెందుకు తవ్వుతున్నావు?’’
‘నాకు తెలీదు’
“యెన్నాళ్ళ నుంచి యిక్కడ దాగున్నావు?”
‘నాకు తెలీదు’
“నా వేలు యెందుకు కొరికావు?’’
‘నాకు తెలీదు’
“నువ్వు యెవరి వైపు వున్నావు”
‘నాకు తెలీదు’
“యిది యుద్ధం, నువ్వు యేదోకటి తేల్చుకోవాలి”
‘నాకు తెలీదు’
“నీ వూరు యింకా వుందా?’’
‘నాకు తెలియదు’
“వాళ్ళంతా నీ పిల్లలేనా?”
‘అవును’
‘అవును’
‘అవును’

యిది పోలెండ్ కి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత ’విస్లావా సింబోర్స్కా’ రాసిన ప్రసిద్ధ కవిత ‘వియత్నాం’కి అనువాదం. ‘మనుష్యుల్ని యిష్టపడితే చాలు అది అన్నింటిని ప్రేమించేలా చేస్తుంది. మనం యే వైపు నిలబడాలో నేర్పుతుంది’ అంటారు సింబోర్స్కా. ఆమె కవిత్వం నిండా పిల్లల్ని అమితంగా ప్రేమించే, పిల్లల రాజకీయాల్ని ప్రేమించే తల్లుల వేదన, యెదురుచూపు, నిబ్బరం, విశ్వాసం నిండి వుంటాయి. సింబోర్స్కా తన కవిత్వంలో యెలాoటి తల్లుల అంతర్లోకాల్నయితే వొడిచి పట్టుకున్నారో అచ్చం అలాంటి తల్లి “కాకరాల సూర్యకాంతి’’ అమ్మగారు.

అంతే, కొన్ని నిష్క్రమణలు మనల్ని కుదురుగా వుండనివ్వవు. యెందుకలా? అనే ప్రశ్నల తుట్టెని కదిలించి మన మనసుల్ని కలక బారుస్తాయి. యెక్కడో రాజమండ్రి దగ్గర వో చిన్ని గ్రామంలో జన్మించి. చెన్నైలో సుదీర్ఘ కాలం పాటు సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, కళాకార్య కలాపాలతో జీవితాన్ని పెనవేసుకొని, జీవితం పడమరకు వాలే వేళకు హైదరాబాద్ సి.ఆర్. ఫౌండేషన్ లో తలదాచుకోవల్సి రావడం – యింత ఆదర్శవంతమైన జీవితం, యింత దుఖభరితమైన వీడ్కోలు యే వెలుగుల కోసం? యే రేపటి అరుణిమల కోసం? ఆఖరి క్షణంలో ఆ తల్లి యేమి పలవరించి వుంటుంది? మసక బారిపోతున్న ఆమె ఆఖరి చూపులు యెవరి కోసం వెదుక్కొని వుంటాయి? ఆగిపోతున్న ఆమె గుండె చప్పుడు చివరిగా యెవరి కోసం శబ్దించి వుంటుంది? నిశ్చలమైపోయిన ఆ పెదవులు యే పేర్లని వుచ్చరించి వుంటాయి? యీ ప్రశ్నలు నిద్రపోనీయడం లేదు. నిలవనీయడం లేదు. పొరలుపొరలుగా దుఖం కెరలుతూనే వుంది. యెవరైతేనేం – ఆమె వో తల్లి. తల్లుల్ని బిడ్డలకు, బిడ్డల్ని తల్లులకు దూరం చేస్తున్న యీ కరుకు సమాజంలో బిడ్డల విశ్వాసాల వెనుక అత్యంత నిబ్బరంగా నిలబడి వున్న వో కన్నతల్లి.

యీ తల్లి నిష్క్రమణ, ఆఖరి క్షణంలో ఆ తల్లి యెంత వేదన పడివుంటుoదోననే తలంపు యెంతో ప్రపంచ సాహిత్యాన్ని కళ్ళ ముందు నిలబెట్టింది. యిలాంటి సందర్భాల్లో గుర్తుకొచ్చే సాహిత్యంకి జీవలక్షణం వుంటుంది. విస్వజననీనత వుంటుంది. రష్యన్ సాహిత్యం కావచ్చు, చైనా సాహిత్యం కావొచ్చు, వియత్నాం సాహిత్యం కావచ్చు, రెండో ప్రపంచ యుద్ధ సాహిత్యం కావచ్చు – ప్రస్తుతం మనలో మొలుస్తోన్న ప్రశ్నలకు ప్రత్యామ్నాయంగా నిలిచే యే సాహిత్యమైనా యెప్పటికీ సజీవంగానే నిలిచి వుంటుంది. యుద్ధరంగంలో వున్న పిల్లల కోసం తల్లులు అనుక్షణం పడే వేదనని యెదురు చూపునీ, ఆచూకీ తెలియని పిల్లల కోసం తల్లుల వెదుకులాటని యెంత సాహిత్యం రికార్డ్ చేసిందో లెక్కే లేదు. అదో సముద్రం. గ్రీక్, రోమన్ సాహిత్యం కాలాన్నుండీ ప్రస్తుత సాహిత్యం దాకా యీ యెదురుచూపునీ, వేదననీ యెత్తి పడుతూనే వున్నాయి.

“నాగేటి చాలులో మీరు వొక విత్తువేయండి. వేయి విత్తులు యిస్తాను మీకు. వొక పుడక పాతండి మహా వృక్షంగా మొలిపిస్తాను. వొక తోట వేయండి. ఫలాలు కురిపిస్తాను. మీ అందరి కోసం నేనే చక్కటి యిల్లవుతాను. నేను అనంతం, నేను అపారం, నేను అవశేషం… మరి నువ్వు అడుగుతున్నావు… యుద్ధం లేకుండా మనుష్యులు బతకలేరా అని. అది నా మీద కాదు- మీ మీదే ఆధారపడి వుంది. మీ సంకల్పం మీదనూ, మీ జ్ఞానం మీదనూ ఆధారపడి వుంది. కాకరాల సూర్య కాంతి అమ్మగారు వెళ్ళిపోయారు అని తెలియగానే నా మదిలో మెదిలిన మాట “తల్లీ భూదేవి”, కర్గిస్తాన్ కి చెందిన చింగీజ్ ఐతో మాతోవ్ రచించిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి గొప్ప నవల తల్లి భూదేవి. మన భారతీయ సంప్రదాయాల్లో సైతం తల్లిని సృష్టికీ, తొలి గుర్తింపుకూ మూలంగా, ప్రతీకగా భావిస్తారు. మన అస్తిత్వానికీ, మన పురోభివృద్ధికీ, మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికీ కీలకమైన ఆధారంగా నిలిచేది తల్లి… భూదేవే! అందికే ఐతమాతోవ్ “తల్లిభూదేవి” లో వ్యవసాయక కుటుంబానికి చెందిన వృద్ధ మహిళ ‘తొల్గొనాయ్’ తన కళ్ళ ముందే యెంతో మంది తమ అస్తిత్వాలన్ని కోల్పోవటాన్నీ, ఆ వరస విషాదాలనూ ఆమెకు మిగిలింది మర్చిపోలేదు. యుద్ధంలో భర్తనూ, ముగ్గురు కొడుకులనూ పోగొట్టుకున్న ఆమెకు మిగిలింది వొకే వొక్క వ్యక్తి… గర్భంతో వున్న కోడలు! ఆమె కూడా కాన్పు కష్టమై మరణించడంతో కొత్తగా యీ లోకంలోకి వచ్చిన బిడ్డకు జీవితాన్నీ, యీ లోకాన్నీ పరిచయం చేసే భాధ్యత ‘తొల్గొనాయ్’ మీదే పడుతుంది. దాన్ని ఆమె స్వీకరించిన తీరు, నిర్వహించిన తీరు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

“జరిగిందంతా వాడు సరిగా అర్ధం చేసుకొని పూర్వాపరాలు సరిగా గ్రహించుకోవాలంటే నేను వాడితో చెప్పాల్సింది వొక్క తన గురించే కాదు… కేవలం తన జీవితం గురించే కాదు… యింకా అనేకనేక యితరుల గురించి వాళ్ళ జీవితాల గురించి… నా గురించి, నేను బతికిన రోజుల గురించి… అన్నిటి గురించీ చెప్పాలి. దేన్నీ వదిలి పెట్టేసేందుకు, దేన్నీ కొత్తగా చేర్చేందుకు వీల్లేదు. జీవితం మనందరినీ కలిపి వొక తాడు కింద పేనింది. మనందరినీ కలిపి వొక ముప్పేట ముడి వేసింది’’ అంటారామె.

వ్యక్తులుగా మన గతాన్నీ, మన చరిత్రనూ, దాని విలువనూ యెన్నటికీ విస్మరించలేమనీ, మనం యీ లోకంలో సంబంధాలను విస్మరించుకోగలమేమోగానీ తెంచుకోవడం మాత్రం అసాధ్యమని బలంగా నొక్కే చెబుతుందీ నవల. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిణామాలను ఆమె చర్చించే తీరు చూస్తూ… మనకు దేన్నైనా భరించే, దేన్నైనా కడుపులో పెట్టుకునే చల్లటి తల్లి భూదేవి గుర్తుకొస్తుంది. అందుకే ఐతమాతోవ్ ఆ తల్లి భూదేవినే యీ తల్లికి ప్రతీకగా నిలబెడతారు. తల్లి తన బిడ్డకు తొలిగా యీ లోకాన్ని, యీ లోకంతో వారికుండే సంబంధాన్నీ, యిక్కడి అనుభూతులనూ పరిచయం చెయ్యిడమే కాదు… బిడ్డలకు తమ గతమేమిటో కూడా తెలియజెబుతుంది. తమ ముందున్న భవిష్యత్ వర్తమాన అస్తిత్వాలకు ఆ గతం ఆధార భూతమని అర్ధమయ్యేలా చెప్పేదీ, అర్ధం చేసేదీ అమ్మే. యీ భూమే. యీ నవలలోని తొల్గనాయ్, తల్లి భూదేవి.. యిద్దరూ రెండో ప్రపంచ యుద్ధం వంటి వో విధ్వంసకర భయానక ఘటన తాలూకూ ఆనవాళ్ళకు, అవశేషాలకు నిరంతరం మన మస్తిష్కాల్లో వో సజీవమైన కొనసాగింపునిస్తూ… సార్వజనీనమైన నైతిక, మానవ విలువలు చేజారిపోకుండా పరిరక్షిస్తుంటారు. బిడ్డల మనుగడకు, భవిష్యత్తరాల అస్తిత్వానికి నారూ నీరూ పోస్తుంటారు.

“వో సూర్యుడా! నువ్వు ఆకాశానికి వెలుగునిస్తూన్నావు, భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు. అందరితోనూ చెప్పు నువ్వు!

వో వర్షమేఘమా! యీ భూప్రపంచం పైన మెరుపు జల్లు కురిపించు. ప్రతీ చినుకునీ వాళ్ళతో చెప్పమను!’’

వో తల్లీ, భూదేవీ! మమ్మలందరినీ నీ వక్షస్థలం మీద హత్తుకొని పెంచుతున్నావు. ప్రపంచం నలుమూలలా వున్న ప్రజలనూ నువ్వు బువ్వ పెట్టి పోషిస్తున్నావు. కన్నతల్లీ, భూదేవీ, నువ్వు చెప్పు ప్రజలతో చెప్పు నువ్వు! ”

‘తల్లి భూదేవి’ గుండె కోతను యీ ప్రపంచానికి చెప్పేదెవరు?

‘వృత్తీ! దీర్ఘ ఆర్తనాదం. గుండెల్ని చీల్చుకు వచ్చిన ఆర్తనాదం, విస్ఫోటనం ఫెళ్ళున పగిలినట్టు, గాలిలో, ఆకాశంలో లోకాన్ని ప్రశ్నిస్తున్నట్టు కలకత్తాలో వీధివీధినా, యింటింటా, హృదయాల్లో ప్రతిధ్వనిoచిన ఆర్తనాదం. ఆ ఆర్తనాదం మహానగరంలో ఆకాశం కంటే వువ్వెత్తున్న లేచి తరువాత కిందికి దిగివచ్చి అంతటా వ్యాపించింది. యింటింటినీ చుట్టబెట్టి, దేవాలయాలు, గోపురాలు, స్తూపాలు, స్తంభాలు తాకి నలుదిక్కులా వ్యాపించి, యితిహాసాల పురాణాల వ్యాఖల్లో వాటా పునాదుల్లోకంతా వ్యాపించి కుదిపేసింది. ఆ ఆర్తిలో భూత భవిష్యద్వర్తమానాలు కంపించిపోయాయి. సుఖాలనుభావించే వారి సుఖాలలోని అస్తిత్వాన్ని చీల్చివేసింది. ఆ ఆర్తనాదంలో నెత్తురు వాసన. ప్రశ్న. నిష్ఠూరం. శోకం’.

‘కాకరాల సూర్యకాంతి’ అమ్మగారు చివరిగా యేమి మాట్లాడాలని అనుకొని వుంటారు అనే ప్రశ్న నా మదిలో మెదిలినప్పుడు నాకు గుర్తొచ్చిన మరో నవల ‘ఒక తల్లి’. మరందాయి మహా శ్వేతాదేవి రాసిన యీ చిన్ని నవల కోపోద్రిక్త నక్సల్బరీ యువతరాన్నీ, అమానుషంగా వేటాడి చంపబడిన ఆ పిల్లల తల్లుల వేదననీ చిత్రించే గొప్ప నవల యిది. వో అనాధ శవంగా మారిపోయిన కొడుకు ‘వృత్తీ’ జ్ఞాపకాలనూ, అతడి ఆనవాళ్లనూ వెదుక్కుంటూ అతడు పుట్టిన రోజు జనవరి -17 వ తేదీన అతడి తల్లి – ’సుజాత’ చేసే ప్రయాణం యిందులో కథ. వో వున్నత సంపన్న వర్గం నుంచి వచ్చిన ‘వృత్తి’ అందరిలాగా వుండకుండా యెందుకు పేదల పక్షాన పోరాడి మరణించాల్సిన అవసరం వచ్చింది? కేవలం 1084 నెంబర్ శవంలాగా యెందుకు మిగిలిపోవాల్సి వచ్చింది? అనే ప్రశ్నలతో పేగు కదిలి అతడు పుట్టిన రోజూ చనిపోయిన రోజూ వొక్కటే అయిన జనవరి 17 వ తేదీన పురిటి నాటి జ్ఞాపకాలతో ఆరంభమై, ఆ కొడుకు దుర్మరణానికి దారి తీసిన కారణాలను వెతుక్కుంటూ వో తల్లి చేసిన చిట్టచివరి ఆర్తనాదం యీ నవల. కలకత్తా నగరంలోని గోడల మధ్య ప్రతి ధ్వనించిన యిలాంటి వేలాది ఆర్తనాదాల్నే మృణాల్ సేన్ తన ‘కలకత్తా71’ సినిమాలో బలంగా పట్టుకున్నారు.

కాకరాల సూర్యకాంతి అమ్మగారి చూపులు చివరి సారిగా యెవరి కోసం, యెంత ఆత్రుతగా వెదుక్కొని వుంటాయి? అని ప్రశ్నించుకున్నప్పుడు ‘ఓ తండ్రి కథ’ గుర్తుకొచ్చింది. కేరళాలోని కాలికట్ ఆర్.ఇ.సి. విద్యార్ధి రాజన్ న్ని నక్సలైట్లకి ఆశ్రయమిచ్చాడనే సాకుతో అప్పటి పోలీసులు మాయం చేశారు. తన కొడుకు కోసం ఆ తండ్రి యెక్కని గుమ్మం లేదు. తట్టని కోర్టు తలుపుల్లేవు. కనీసం మృతదేహాన్ని యేమి చేసారోనైనా చెప్పండంటూ ఆ తండ్రి పడిన ఆక్రోశం యీ దేశంలో చరిత్రయింది.

ఆ చరిత్రనే షాజి, ఎస్.కరుణ్ ‘పిరవి’ పేరుతో హృద్యంగా తెరకెక్కించారు. అప్పుడు మొదలైన కన్నబిడ్డల మిస్సింగ్ యిప్పుడు సర్వ సాధారణమైపోయింది. కాశ్మీర్ ని రెండు ముక్కలుగా చీల్చిన యీ 20 నెలల్లోనే వేలాది మంది యువకులూ, పిల్లలు అదృశ్యమైపోతున్న కథలు ప్రభుత్వ ఆంక్షల కళ్ళుగప్పి మనముందుకు వస్తూనే వున్నాయి. అక్కడి కన్న తల్లుల శోకం మన కాళ్ళ ముందు సెలయేళ్ళయి ప్రవహిస్తూనే వున్నాయి. సామ్రాజ్యవాద దేశాలు వొక అణచివేత అస్త్రంగా ప్రయోగించిన మిస్సింగ్ మర్డర్ గురించి శక్తివంతంగా వర్ణించిన నవల ‘విడోస్’ (మిస్సింగ్) కూడా యీ సందర్భంగా గుర్తుకొస్తుంది. ఉన్నట్టుండీ, రాత్రి మాయం చేయబడిన తమ పిల్లల కోసం, వాళ్ళ మృతదేహాలు కొట్టుకు వచ్చే వాగు వడ్డున కూర్చొని గుండెలుగ్గబట్టుకొని వుద్వేగంగా నిరీక్షించే భర్తల్ని పోగొట్టుకున్న ఆ తల్లుల పేగుకోతని ఆ నవల వివరిస్తుంది. స్వేచ్ఛ కోసం యింకా యెందరు తల్లులు యీ కోతని భరించాలి? అనే ప్రశ్న యెప్పటికీ వెంటాడుతూనే వుంటుంది.

యిక పిల్లల కోసం కన్నవాళ్ళ ఆక్రోశాన్ని చిత్రించిన సాహిత్యంలో యెప్పటికీ లాటిన్ అమెరికా సాహిత్యమే ముందుంటుంది. అక్కడ అన్ని సాహిత్య రూపాల్లోనూ ఆ యెదురు చూపు, ఆక్రోశాన్నీ రచయితలు బలంగా యెత్తి పట్టడం కనిపిస్తుంది. ఆ ఆక్రోశానికి గళమిచ్చినందుకు విక్టర్ జారా లాంటి గాయకుల కంఠాలు తెగిపడ్డాయి. లోర్కాలాంటి కవులు కాల్చిచంపబడ్డారు. మధ్య ప్రాచ్య దేశాల్లో కూడా సాహిత్యం యీ అమానుషాన్ని రికార్డ్ చేస్తూనే వుంది. మహమూద్ దార్వీష్ లాంటి కవులు ప్రపంచం అంతా మార్మోగేలా ఆ ఆక్రోశాన్ని బలంగా వినిపించగలిగారు. ‘ఇక్కడ బాల్యం మాయమైపోతుందంటూ’ తమిళ ఈలం కవులు ప్రపంచం వులిక్కిపడేలా తమ కలాల్ని నెత్తుటితో, కన్నీటితో నింపి రాసిన కవితలు, కథలు, జ్ఞాపకాలు యింకా తాజాగా నెత్తురోడుస్తూనే వున్నాయి. కన్నతల్లుల శోకం గురించి గళమెత్తడం యే దేశంలోనైనా నేరమేననే విషయం గత కొన్నేళ్లుగా యీ గడ్డ మీదా చూస్తున్నాం. మున్ముందు యింకా చూస్తాం అనేది వర్తమాన చరిత్ర గుచ్చి చెప్తోంది.

కాకరాల సూర్యకాంతి అమ్మగారి యెదురుచూపు, వేదన, నిరీక్షణ యిటువంటివి కాకపోయినా, వీటి నుంచి వేరుచేయలేనివి. ‘నడిరాతిరి నిద్దురలో పత్తికాయ పగిలిన ధ్వని’ విని వులిక్కిపడి లేచే గర్భశోకం యీ అమ్మది. యే చిన్న చప్పుడు విన్నా, యెక్కడ నెత్తురు చిందిన వార్త విన్నా తల్లిపేగు కలుక్కుమనే తీవ్ర ఆక్రోశం యీ అమ్మది.

షహీద గారు రాసిన ‘జాజిపూల పరిమళం’ కథలో ‘అమ్మవాళ్ళకు యేమైనా మనకు యెప్పటికి తెలుస్తుందో’ నని రాసిన కలత బెంగల చెమ్మ ఆ అమ్మ మూసుకున్న కళ్ళ వెనుక చూసిన ప్రతీ వొక్కరికీ కనిపించింది. బిడ్డల భుజాల మీదుగా రేపటిని చూసేందుకు ఆరాటపడిన ఆ అమ్మ విశ్వాసం వెచ్చని చెమ్మగా ప్రతి వొక్కరి కళ్ళల్లో సుడులు తిరుగుతూనే వుంది నిశ్శబ్దoగా…

“తల్లులు నిశ్శబ్దానికి చాలా భయపడతారు
వారు యెల్లప్పుడూ తమ పిల్లలతో సంభాషించాలని తలపోస్తూనే వుంటారు

కానీ వారు నిరంతరం మౌనంగానే వుంటారు
పొరపాటున తప్పుగా మాట్లాడుతా మేమోనని
ధూమపానం చేస్తూ కొడుకులు మగ ప్రపంచానికి సంబంధించిన విషయాలపై యోచిస్తుంటారు
వారి నుదుళ్ళ పై హావ భావాలు తల్లులకు వింతగా వుంటాయి
చిన్నతనం లోంచి యవ్వనంలోకి యెదిగినప్పుడు
వాళ్ళు కొత్త దృశ్యాలను చూస్తున్నప్పుడు యెప్పటిలా
అమ్మా అని పిలవలేదు
దీర్ఘంగా సాగదీయ బడ్డ రాత్రులలో
కాంతివంతమైన వెన్నెల మౌనంగా ఉంది
లైట్ హౌస్ మీద మెరుస్తున్న దీపం నిశ్శబ్దంగా వుంది

మట్టిలో కలిసి పోయింది: మొత్తం జీవితం పునరాలోచన
వుమ్మడి భూమిలా ప్రశాంతం గా వుంది
జీవితంలో ప్రతి సెకను
ప్రత్యేకమైన రమణీయతతో వుంది
ప్రయాణం శాశ్వతత్వం కంటే తియ్యగా వుంటుంది

తల్లులు తమ కొడుకుల దగ్గర కూర్చున్నప్పుడు
యెప్పుడు అల్లికలో కుట్టుపనో చేస్తుంటారు.
మౌనం అనేది తల్లి అల్లిక
అది కొడుకులను రక్షిస్తుంది
ఆహ్, మౌనానికి భయపడే తల్లులు యెప్పుడూ మౌనంగా వుంటారు’’

అవును.. ‘యా యన్ బిన్’ అన్నట్టు “తల్లులు నిశ్శబ్దానికి చాలా భయపడతారు
వారు యెల్లప్పుడూ తమ పిల్లలతో సంభాషించాలని తలపోస్తునే వుంటారు’’.

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

14 thoughts on “నడిరాతిరి పత్తికాయ పగిలిన ధ్వని

  1. యుద్ధంలో వున్న పిల్లల కన్న తల్లిదండ్రుల మనసును హృదయాన్ని పట్టుకున్న ఈ వ్యాసంలోని ప్రతి వాక్యం వెంట కళ్ళు నీటితో తొణికిసలాడుతూ పయనించాయి. కాంతి అమ్మ మూతపడిన కళ్ళలోని వేదనను ఆవిష్కరించారు. ఉద్యమాభివందనాలతో.

    1. హృదయ పూర్వక కృతజ్ఞతలు కెక్యూబ్ గారు.

  2. కుప్పిలి పద్మ ఏది రాసిన బాగా రాస్తారు . కాకర్ల సూర్యకాంతి గారి గురించి కూడా చాలా హృద్యంగా రాశారు. ముఖ్యంగా మహా స్వేతదేవి గారు రాసిన అద్భుత నవల “హాజర్ చౌరాసి కా మా” (1084 తల్లి) మరచి పోలేని తలపు లోకి తీసుకొచ్చారు. ఒక నక్సలైటు కుర్రాడిని పోలీసులు దుర్మార్గంగా చంపి వేసి ఆ ముత్యాదేహానికి 1084 అనే సంఖ్య ఇస్తారు . ఈ నవల ని చాలా బాగా నాటకీకరణ చేసి ఢిల్లీ లో హింది లో ప్రదర్శించినప్పుడు చాలా సార్లు చూశాను.

    పద్మగారు సూర్య కాంతి గారి గురించి రాసినప్పుడు మహాశ్వేత దేవి గారి తల్లే జ్జ్ఞాపకమొచ్చారు. చాలా బాగారాశారు. (నాకు కాకర్ల గారితో నాటాక స్నేహముంది. ఢిల్లీ లో మొదటి ఏ‌ఐ‌ఎల్‌ఆర్‌సి సభలు 1984 లో జరిగినప్పుడు వారు, గద్దర్, వంగపండు చెర గారి భార్య పిల్లలు మా ఇంట్లో 2 రోజులు ఉన్నారు. జననాట్యమండలి వారి కార్యక్రమం ఢిల్లీ లోని జనక్పురి లో ఏర్పాటు చేశాము)

  3. పద్మగారు…అభినందనలు వ్యాసం కదిలించింది

  4. పద్మ గారు బాగా రాశారు అనడం కన్నా ఆ తల్లుల వేదనని మా హృదయాలలో తడి మేలా పలికించిన తీరు అద్భుతం.
    అలాగే గత సాహిత్య చరిత్రని స్మరించుకోవాల్సిన అవసరాన్ని ఆవిష్కరించిన విధానం బాగుంది.

  5. వ్యవస్ధ ఒక యుద్ధరంగం అయినప్పుడు అందులో ముందుండి పోరాడుతున్న ఒక పరంపర దానిమూలంగా అత్యంత వ్యధాభరితంగా కష్టపడుతున్నది వాళ్ళ తల్లులు. ఇవ్వాళ సూర్య కాంత లాంటి తల్లులt వాళ్ళ త్యాగాల గురించి మాట్లాడుకోవడం అంటే ఒక.మహోన్నతమైన. రాజకీయాలకు ఒక మన్నన మద్దతు వాక్యం అవడం. మీ వ్యాసం లో భిన్న స్థల కాలాలు అందులో త్యాగాలు చేసిన ఒక పరంపర ఉంది. ఇద్దరు బిడ్డలను ఒక లక్ష్యం కోసం పంపిన త్యాగమయ జీవితానికి ఆ జీవితం అనుభవించిన కల్లోలాలనూ సరిగ్గా చిత్రిక పట్టారు ఆమెకు జోహార్లు మీకు నమస్సులు.. పద్మ గారూ

  6. సింబోర్స్కా ని గుర్తు చేశారు..
    చాలా వాటిని మళ్లీ మళ్లీ గుర్తొచ్చేలా చేశారు
    కాకర్ల సూర్యకాంత గారి గురించి ఇంతగొప్పగా చెప్పడం చాలా మంచి విషయం…
    బహుశా ఈ ప్రపంచంలో తల్లి వేదన ను మించిన వేదన మరేదైనా ఉంటుందా..
    అంతటి నిజాయితీ నిండిన ఎమోషన్ మనకు ఇంకెక్కడైనా తారసపడుతుందా…
    అయితే ఆ ఎమోషన్ ని కాగితం మీద పెట్టడానికి ఎంత శక్తి కావలి.. అంతకు మించి ఎంత ప్రేమ ఆ రాసే చేతుల్లో నిండి ఉండాలి..
    ఆ శక్తి ఒక్క కుప్పిలి పద్మ గారికి మాత్రమే ఉందని నాకు తెలుసు..
    ఆమె కాలం నుంచి ఇంకెన్నో ఎలాంటి అద్భుతాలు రాలిపడతాయని ఎదురుచూసే వారిలో మొదటివాడిని నేను.
    జీవితానికి సరిపడా కృతజ్ఞతలు పద్మ గారు…

    మీ
    క్రాంతి

Leave a Reply