దేశ విదేశాల్లో, స్థానిక ప్రభుత్వాల్లో, మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఏమి జరుగుతుందో కఠిన వాస్తవాలను ప్రజల ముందు సాక్షాత్యరింపజేయడమే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల విధి. ప్రభుత్వ పనితీరును ప్రజాకోణంలో ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేయడం, వ్యవస్థాపరమైన లోపాలను ఎండగట్టడం, ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక… ఇతరత్రా అనేక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకరావడమే మీడియా కనీస బాధ్యత. ఏ దేశంలోనైనా మీడియా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేయగలగడమే ప్రజాస్వామ్య వ్యవస్థకు గీటురాయి. గత ఏప్రిల్ నెలలో భారత అత్యున్నత న్యాయస్థానం మళయాళ వార్త ఛానల్ ‘మీడియా ఓన్’పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కొట్టివేసింది. తగిన సాక్షాధారాలు ఏమీ లేకుండా జాతీయ భద్రతా ముసుగులో మీడియా హక్కులను, ప్రజల మానవ హక్కులను హరించడం తగదని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హితవు చెప్పింది.
సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా మీడియా స్వేచ్ఛపై తీర్పు ఇచ్చినా, ఫాసిస్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్టోబర్ 3న ఆన్లైన్ న్యూస్‌క్లిక్ పత్రికా స్వేచ్ఛపై మరోసారి పంజా విసిరింది. భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసింది. ప్రజాస్వామ్య హక్కులపై మరోసారి దాడి చేసింది. ఈసారి దేశానికి వ్యతిరేకంగా చైనా నుంచి నిధులు పొందుతోందన్న ఆరోపణ మోపి ఆన్లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. అందులో పనిచేస్తున్న పలువురు పాత్రికేయులు, ఉద్యోగుల నివాసాలపై ఢిల్లీ పోలీసులు ఉదయం నుంచి రాత్రివరకు లక్ష్యం చేసుకొని దాడులు జరిపారు. కొందరు పాత్రికేయులను నిర్బంధించి వారి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపక సంపాదకుడు పబీర్ పురకాయస్థను, దివ్యాంగుడైన ఆ సంస్థ మానవవనరుల విభాగాధిపతి అమిత్ చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేసి వారిరువురిపై ఉపా కేసు బనాయించారు. ‘న్యూస్‌క్లిక్’ పై చేపట్టిన ఈ అనూహ్యమైన దాడి మొత్తంగా స్వతంత్ర మీడియాకు చేసిన హెచ్చరికగా ఉంది. స్వతంత్ర మీడియా గొంతు నొక్కివేయడానికి ఫాసిస్టు మోడీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
పురకాయస్థ భాగస్వామి గీతా హరిహరన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడ తీసుకున్నారు. పోలీసులు తీసుకున్న వస్తువులకు రశీదు కూడ ఇవ్వలేదు. ఢిల్లీ సైన్స్ ఫోరమ్‌కు చెందిన శాస్త్రవేత్త, రచయిత డి. రఘునందన్ కూడ పోలీసులు నిర్బంధించి తీసుకెళ్లారు. అలాగే న్యూస్‌క్లిక్ పోర్టల్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న, గతంలో పనిచేసిన పాత్రికేయులు, విలేకరులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిపారు. వీరిలో హిందూ దినపత్రిక మాజీ పాత్రికేయులు, న్యూస్‌క్లిక్ కంట్రిబ్యూటర్ అనురాధా రామన్, సత్య తివారీ, అదిత్య నిగమ్, సుమేధా పాల్ ఉన్నారు. సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్, ప్రముఖ పాత్రికేయుడు పరంజోయ్ గుహా ఠాకూర్తా నివాసాలపై కూడా దాడులు జరిగాయి. ముంబయిలో నివసిస్తున్న తీస్తాను ఢిల్లీ పోలీసు అధికారులు ప్రశ్నించారు. తీస్తా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సామాజిక పరిశోధనా సంస్థ ‘ట్రెక్ అండ్ సెంటెల్లా’ న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు వ్యాసాలు అందిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో గతంలో పనిచేసి ప్రస్తుతం న్యూస్‌క్లిక్‌తో అనుబంధం కొనసాగిస్తున్న పాత్రికేయుడు సుబోధ్ వర్మ ఇంటిపై కూడా దాడి జరిగింది.
నిజానికి ఇదేమీ ఇప్పటికిప్పుడు కొత్తగా జరిగిన దాడి కాదు. మోడీ ప్రభుత్వం రెండవసారి(2019) అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘న్యూస్ క్లిక్’పై దేశద్రోహ ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి), ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం రెండేళ్లు క్రితమే ఆ వెబ్ పోర్టల్ కార్యాలయాలం పైన, సిబ్బంది నివాసాలపైన సోదాలు చేశాయి. ఆఫీసులో ఉన్న అన్ని వస్తువులను జప్తు చేశాయి. ఆ సంస్థకు సంబంధించిన అన్ని అకౌంట్ లావాదేవీలను నిశితంగా పరిశీలించాయి కూడా. అయినా న్యూస్‌క్లిక్ నేరాలకు పాల్పడినట్లు నిరూపణకు తగిన సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థలు ఇంతవరకు చూపించలేకపోయాయి. చైనా నిధులంటూ చేస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం వీసమంత కూడా నిరూపించలేకపోయింది. తాజాగా ఆగస్టు 5న ‘న్యూయార్క్ టైమ్స్’ అదే ఆరోపణ చేస్తూ ప్రచురించిన బూటకపు కథనాన్ని అడ్డు పెట్టుకుని ఆగస్టు 17న ఉపా చట్టం కింద కేసును బనాయించింది. తనకు వచ్చే నిధులన్నీ భారతీయ చట్టాలకు లోబడి, రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకు అకౌంట్ల ద్వారానే వస్తాయని ‘న్యూస్‌క్లిక్’ స్పష్టం చేసింది.
నిష్పక్షపాత జర్నలిజం ప్రజాస్వామ్యానికి ప్రాణం :
‘న్యూస్‌క్లిక్’ వార్తా ఛానల్ 2009లో ప్రారంభమైంది. నిష్పాక్షిక విమర్శనాత్మక జర్నలిజానికి ప్రాధాన్యత ఇచ్చిన వార్తా వేదికగా ప్రజా హృదయాల్లో గురింపును, గౌరవాన్ని పొందింది. అయితే ప్రభుత్వ అధికారులు, పార్టీ నేతలు, సంపన్న వర్గాలకు మింగుడుపడని పలు అంశాలపై అది విరివిగా వార్తా కథనాలను ప్రజలకు అందించింది. అధికార బిజెపికి, దానికి దర్శకత్వం వహిస్తున్న సంఘ్ పరివార్‌కు ఈ వార్తా కథనాలు కొరుకుడు పడలేదు. దీంతో న్యూస్‌క్లిక్ యాజమాన్యం పైనా, సిబ్బంది పైనా పోలీసులు పలుమార్లు దాడి చేశారు, వెంటాడారు. మీడియాపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి పత్రిక స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అవుతుంది. న్యూస్‌క్లిక్ చేస్తోన్న విమర్శను ప్రభుత్వం రాజద్రోహంగా, జాతి ద్రోహంగా భావించి మీడియా చానెల్ పైన ఉద్దేశపూర్వకంగానే కక్ష కట్టింది. ఆగష్టు 17న ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్ పైనా కేసు నమోదు చేశారు. ఇది అప్రజాస్వామికమంటూ జర్నలిజాన్ని తీవ్రవాదంతో జతకట్టే చర్యను నిరసిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్‌కు పలు పాత్రికేయ సంఘాలు అక్టోబర్ 4న రాసిన లేఖ మనదేశంలో మోడీ ప్రభుత్వ అప్రజాస్వామ్య పోకడల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ పలువురు జర్నలిస్టులపై ప్రతికారం తీర్చుకొనేలా తప్పుడు కేసులు పెట్టడాన్ని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి జర్నలిస్టు సంఘాలు తీసుకెళ్లాయి.
ఢిల్లీలో 2019లో సిఎఎ వ్యతిరేక షహీన్ బాగ్ (15-12-2019 నుంచి 24-03-2020) మహిళల నిరసన ఉద్యమం, ఢిల్లీలో ఈశాన్య ఢిల్లీ అల్లర్లు, మతోన్మాదానికి సంబంధించిన వార్తలు, 2020-2021లో 3 క్రూరమైన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనల సందర్భంగా ‘న్యూస్‌క్లిక్’ ఇచ్చిన విస్తృతమైన కథనాలు మోడీ సర్కారుకు కంటగింపుగా మారాయి. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తీరును కూడ మోడీ ప్రభుత్వం భరించలేక అసహనానికి గురైంది. అన్ని మీడియా సంస్థలు తన ఎజెండాను మాత్రమే వినిపించాలన్నది మోడీ ప్రభుత్వ భావన. దానికి భిన్నంగా ప్రజల గొంతు వినిపించినందుకు గతంలో ‘న్యూస్ లాండ్రీ, దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్, ది కశ్మీర్ వాలా, ద వైర్, బిబిసి’ వంటి మీడియా సంస్థలపైనా కేంద్రం ఇ.డి, ఐ.టిల చేత దాడులు చేయించింది. బీమా కొరెగావ్ కేసు దీనికో ఉదాహరణ. దేశవ్యాప్తంగా ఉన్న మేధావులను, ప్రజాతంత్ర వాదులను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి, నాలుగేళ్లుగా నిర్బంధంలో ఉంచినప్పటికీ ఇప్పటివరకు ఒక్క ఆధారాన్ని కూడా మోడీ సర్కారు చూపలేకపోయింది. అటువంటి కుట్రే ‘న్యూస్‌క్లిక్’పై కూడా కేంద్రం చేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌ను యు.పిలో బిజెపి ప్రభుత్వం అక్టోబర్ 2020లో నిర్బంధించి ఉపా, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. రెండు సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 2020లో విడుదలయ్యారు. రోజుల తరబడి జైలులో పెట్టడం గిట్టని మీడియా సంస్థల మీద మోడీ ప్రభుత్వం దాడులు చేయడం మోడీ పాలనలో అనవాయితీగా మారింది. 2017 లోనే ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ నడుపుతున్న ఎన్డిటిని మీద దాడులు చేశారు. అప్పుడు వారి మీద ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్లు ఆరోపించారు. ఆ తరువాత ఎన్‌డిటివిని అదానీ కొనేశారు. 2021 ఏప్రిల్‌లో దైనిక్ భాస్కర్ పత్రిక మీద దాడి చేశారు. అలాగే అనేకమంది భారతీయ జర్నలిస్టుల మీద పెగాసస్ మాల్వేర్ ఉపయోగించింది. గత ఫిబ్రవరిలో బిబిసి వార్తా సంస్థ కార్యాలయంపై కూడ దాడులకు మోడీ ప్రభుత్వం తెగబడింది. మణిపూర్ హింసాకాండపై నిజ నిర్ధారణ నివేదికను ప్రచురించినందుకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలోని నలుగురు సభ్యులపై కేసు పెట్టింది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేవారిలో భయోత్పాతాన్ని సృష్టించడమే ఈ వేధింపుల లక్ష్యం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా ఈ తరహా దాడులు ఎన్నో జరిగాయి.
‘న్యూస్‌క్లిక్’పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు :
ఆగష్టు 5న ‘న్యూయార్క్ టైమ్స్’లో ప్రచురించిన ఒక కథనం ఆధారంగా ప్రస్తుత చర్యలు న్యూస్‌క్లిక్‌పై చేపట్టారు. ‘న్యూస్‌క్లిక్’లో ఒక అమెరికా పౌరుడు, టెక్ కంపెనీ మాజీ యజమాని అయిన సెవిల్లె రార్ సింగమ్ చర్యలను, ఉద్దేశ్యాలను ఆ వ్యాసం ప్రశ్నించింది. ఆ వ్యక్తికి చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించబడింది. కానీ భారత్‌కు వ్యతిరేకంగా అక్రమ ప్రచారాన్ని చేపట్టేలా ఆ వార్తా వెబ్సైట్లో ఎలాంటి నిర్దిష్ట కథనాన్ని పేర్కొనలేదు. కేవలం ‘న్యూయార్క్ టైమ్స్’ వార్తా కథనం ఆధారంగానే ప్రభుత్వ ప్రతినిధులు ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఒక పద్ధతి ప్రకారం దూషణలకు దిగడం వంటివి చేశారు. మీడియా సంస్థను బలిపశువును చేయడానికి విమర్శనాత్మక జర్నలిజంపై ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో చర్యలు చేపట్టడానికే అక్టోబర్ 3 నాటి చర్యలు ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. కేవలం సంస్థకు అందుతున్న నిధులపై అనుమానంతో ఏ ప్రభుత్వమైనా ఇంతలా జర్నలిస్టులను దారుణంగా లక్ష్యం చేసుకోరాదు. తద్వారా రాజ్యాంగంలో హామీ కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా దెబ్బతీయరాదు. నిరంకుశమైన అంతర్గత భద్రతా చట్టం కింద 1975లో ఎమర్జెన్సీ సమయంలో మోసపూరితమైన ఆరోపణలపై పురకాయస్థను అరెస్టు చేశారు. అప్పుడు ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా ఉన్నారు. ఈనాడు, అటువంటి ఎమర్జెన్సీ ఏదీ ప్రకటించకపోయినా అప్రకటిత ఎమర్జెన్సీ పునరావృతమైనట్లు కనిపిస్తోంది.
ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ సర్వత్ర నిరసనలు :
న్యూస్‌క్లిక్ పోర్టల్ పాత్రికేయులపై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపాయి. విచారణ జరుపదలచుకుంటే తగిన ప్రక్రియను అనుసరించాలని ప్రభుత్వానికి ఎడిటర్స్ గిల్డ్ సూచించింది. ఈ దాడి మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమని వ్యాఖ్యానించింది. ‘ప్రత్యేక నేరాలకు సంబంధించి జరిపే దర్యాప్తు క్రూరమైన చట్టాల నీడలో భయభ్రాంతులకు గురిచేసే వాతావరణాన్ని కల్పించకూడదు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేదిగా, విమర్శకుల గొంతు నొక్కేదిగా ఉండకూడదు’ అని ఎడిటర్స్ గిల్డ్ ప్రకటన తెలిపింది. మరోవైపు దాడులపై తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని ప్రెస్ క్లబ్ వ్యాఖ్యానించింది. పాత్రికేయులకు సంఘీభావం తెలిపింది. కేసుకు సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. డిజిటల్ వార్తలు అందించే 11 సంస్థలకు చెందిన డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్, ముంబయి ప్రెస్ క్లబ్ వంటివి న్యూస్‌క్లిక్‌పై దాడులను ఖండించాయి. ఇది ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి, భయపెట్టే చర్యకు మరో నిదర్శనమని, ఈ పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని సామాజిక మాధ్యమాలలో డిజిపబ్ పోస్ట్ చేసింది. నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ముంబయి ప్రెస్ క్లబ్ కోరింది. ఇది పత్రికా స్వేచ్ఛను అణచివేయడమేనని మీడియా నిపుణుల ఫౌండేషన్ జాతీయ కూటమి, ఢిల్లీ పాత్రికేయుల సంఘం, కేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఢిల్లీ శాఖ) ఓ ప్రకటనలో ఖండించాయి.
న్యూస్‌క్లిక్ జర్నలిస్టులపై దాడి, అరెస్టును, అణచివేతను ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కళాకారులు, విద్యావేత్తలు న్యూస్‌క్లిక్‌కు మద్దతు తెలిపారు. ఈ మేరకు సంతకాలు చేసి ప్రకటన విడుదల చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అరెస్టుపై, పోలీసు కస్టడీలో ఉన్న న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, నిర్వాహకుడు అమిత్ చక్రవర్తిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 3న న్యూస్‌క్లిక్ వేధింపులకు, నిర్బంధానికి గురైన వారికి మద్దతు, సంఘీభావం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మద్దతు రావడం గమనార్హం. న్యూస్‌క్లిక్ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే మీడియా ఔట్లెట్, ఇది వెలుగును ప్రకాశిస్తుందని పేర్కొన్నారు. గౌరవం, మార్పు కోసం నినదిస్తుందని, సమాజంలోని అట్టడుగు, అణచివేతకు గురవుతున్న రంగాలవారి వాణిని వినిపిస్తున్నదని తెలిపారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ జర్నలిస్టులు 230 మంది న్యూస్‌క్లిక్ వెంట మేమున్నామని ప్రకటన చేశారు.
భారతదేశంలో మీడియా స్వేచ్ఛపై జరుగుత్ను దాడి, జర్నలిస్టుల నిర్బంధం పట్ల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమీషనర్ కార్యాలయం బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ”దాడులు, అరెస్టులు, నిర్బంధాలు, జప్తులు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలు మమ్మల్ని ఎంతగానో బాధించాయని ఐరాస మానవ హక్కుల కమీషనర్ పేర్కొన్నారు. అక్టోబర్ 3న న్యూస్‌క్లిక్‌పై జరిగిన దాడులపై స్పందిస్తూ జర్నలిస్టుల భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, వైర్‌తో ఆయన అన్నారు. న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తున్న అనేక మంది వ్యక్తులను నిర్బంధించడం దిగ్భ్రాంతిని కలిగించిందని జెనీవాలోని మీడియా విశ్లేషకులొకరు తెలిపారు. ఈ సమయంలో పోలీసులు డజన్ల కొద్దీ జర్నలిస్టుల ఇ- ఎలక్ట్రానిక్ పరికరాలను – ల్యాప్‌టాప్‌లు, టెలిఫోన్లను స్వాధీనం చేసుకోవడం భారతదేశంలో సర్వసాధారణంగా అనిపించింది. పైగా, జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పరిగణించడం, క్రూరమైన ఉపా చట్టం కింద వారిపై అభియోగాలు మోపడం, శ్రేయస్కరం కాదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
న్యూయార్క్ టైమ్స్ కార్యాలయం ముందు నిరసనలు :
భారత్‌లోని మీడియా సంస్థ న్యూస్‌క్లిక్‌పై దాడిని నిరసిస్తూ న్యూయార్క్‌లో జర్నలిస్టులు, కార్యకర్తలు. న్యూయార్క్ టైమ్స్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. న్యూస్‌క్లిక్‌పై దాడుల వెనుక న్యూయార్క్ టైమ్స్ అబద్దాలు ఉన్నాయని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆగస్టు 5న న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన పరిశోధనాత్మక నివేదికలో న్యూస్‌క్లిక్ చైనా నుండి నిధులు పొందిందని ఆరోపించింది. దీంతో ఢిల్లీ పోలీసులు గత కొద్ది రోజులుగా న్యూస్‌క్లిక్ కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేశారు. న్యూస్‌క్లిక్‌తో సంబంధాలున్నాయనే కారణంతో ఇతర సామాజిక కార్యకర్తల ఇళ్లపై కూడా దాడులు చేశారు. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన అబద్ధాలనే మోడీ, అమిత్ షాలు ప్రామాణికంగా చూపిస్తున్నారని ఆందోళనకారులు ఎత్తిచూపారు. నిజాలు చెప్పినందుకు మీడియాను వేటాడే మోడీ ప్రభుత్వ ఫాసిస్ట్ వైఖరికి వ్యతిరేకంగా నిరసనకారులు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వెలుగులోకి తెచ్చినందుకు, నిజాలను నిర్భయంగా బయటపెట్టినందుకు న్యూస్‌క్లిక్‌పైన, అందులో పనిచేస్తున్న, గతంలో పనిచేసిన జర్నలిస్టులపై మోడీ ప్రభుత్వం నిరంకుశంగా దాడులు చేస్తోందని నిరసనకారులు పేర్కొన్నారు.
న్యూస్‌క్లిక్ జర్నలిజంపై తీవ్రవాద చట్టం :
న్యూస్‌క్లిక్ ఆన్లైన్ పోర్టల్‌పై మోడీ సర్కారు ఉక్కుపాదం మోపింది. వాస్తవాలు బయటికి రాకుండా చేయడానికి బెదిరింపులకు పాల్పడుతోంది. మీడియా సంస్థలు, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై కఠినచట్టాలు ప్రయోగిస్తోంది. ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాలు వ్యతిరేకిస్తున్నా… మోడీ సర్కారు మాత్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని అణచివేతకు పాల్పడుతోంది. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ, న్యూస్ పోర్టల్ హెచ్ఆర్ అధినేత అమిత్ చక్రవర్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 37 మంది పురుషులు, 9 మంది మహిళలను ప్రశ్నించామని పోలీసు అధికారులు తెలిపారు. జర్నలిస్టుల నివాసాలపై ఉదయం 6 గంటలకు మొదలైన ఈ దాడులు రాత్రి వరకు కొనసాగాయి. స్థానిక న్యూస్‌క్లిక్ కార్యాలయంతో పాటు ఆ సంస్థలో పనిచేసే సీనియర్ జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. న్యూస్‌క్లిక్‌కు సంబంధించి ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్, ముంబైలోని 100కు పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగాయి. ఈ సోదాల్లో భారీ ఎత్తున సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
న్యూస్‌క్లిక్‌పై (యూఎపిఎ) కింద ఆగష్టు 17న కేసు నమోదైంది. ప్రబీర్ పురకాయస్థ తదితరులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ఎట్టకేలకు అరెస్టు చేసిన నిందితులకు అందచేశారు. అది కూడా పోలీసులను కోర్టు ఆదేశించిన తర్వాతనే జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ అంతా ఆరోపణలతో నిండిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి, అసంతృప్తులను సృష్టించాలనే, దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను దెబ్బ తీయాలనే లక్ష్యంతో శత్రు శక్తులు ఏ విధంగా విదేశీ నిధులను భారత్‌లోకి అక్రమంగా చొప్పించారో సాధారణ వర్ణనలు ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, కశ్మీర్‌లను భారత్‌లో అంతర్భాగం కాదని చూపించేందుకు కుట్ర జరిగిందని కూడా ఆ ఎఫ్ఐఆర్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణల్లో వేటినీ నిరూపించే సాక్ష్యాధారాలను అందచేయలేదు. యూఎపిఎలో ఉన్న ఐదు సెక్షన్ల కింద న్యూస్‌క్లిక్ సంస్థపై కేసు నమోదు చేశారు. దీంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్‌లోని మరో రెండు సెక్షన్లను జోడించారు. ఐపిసిలోని 153ఎ (రెండు మతాలు, గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 120బి (నేరారోపణ కుట్ర) కింద కేసులు పెట్టారు. ఇక యూఎపిఎలో సెక్షన్ 13 (తీవ్రవాద చట్టం కింద శిక్ష), సెక్షన్ 16 (టెర్రరిస్టు యాక్టు), సెక్షన్ 17 (తీవ్ర చర్యల కోసం నిధులు సమీకరించడం), సెక్షన్ 18 (కుట్ర), సెక్షన్ 22సి (కంపెనీ నేరాలు) కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్‌పై ఈడీ కూడ కేసు నమోదు చేసింది.
ముగింపు :
భారత సామాజిక వ్యవస్థ చాలా సంక్లిష్టమైంది. సామాజిక వ్యవస్థలో భిన్న అభిప్రాయాలు ఉండడం సహజం. వాటిని గౌరవించటం ప్రజాస్వామిక ప్రాథమిక లక్షణం. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మీడియా స్వేచ్ఛను విధిగా గౌరవించాలి. ఇది ప్రజలకు, మీడియాకు వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించిందనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. మోడీ పాలనలో గత 9 ఏళ్లలో 200 మంది జర్నలిస్టులపై పాశవిక దాడులు చేశారు. వారిలో 40 మందిని హత్య చేశారు. (ఇంతవరకు హంతకుల అచూకీ పోలీసులు చూపలేదు). న్యూస్‌క్లిక్‌పై దాడి పత్రిక స్వేచ్ఛపై జరిగిన అతి దారుణమైన దాడి. అంతేకాదు, ప్రజాస్వామ్యం, పౌర ప్రజాతంత్ర హక్కులపై, రాజ్యాంగ విలువలపై జరుగుతున్న ఫాసిస్టు దాడుల్లో భాగంగా అర్థం చేసుకోవాలి. ప్రపంచ వేదికల మీద ప్రజాస్వామ్య ప్రవచనాలు వల్లించే విశ్వగురు మోడీ మాటలు దేశంలో చేపట్టే చర్యల వల్ల అపహాస్యం పాలవుతోంది.
మనువాద ఫాసిస్టు పాలనలో విధ్వంసమవుతున్న ఫెడరల్ వ్యవస్థ, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను విచ్ఛిన్నం చేస్తున్న తీరును ప్రజలకు నిర్భయంగా తెలియజేసే పత్రికలపై వేధింపులకు ఒడిగట్టడం, దేశ ద్రోహం కేసులు బనాయించడం ఫాసిస్టు విధానాలలో భాగమే. ఇప్పటికే అంతర్జాతీయ సూచీలలో మానవ హక్కులు, పౌర హక్కుల పరిరక్షణ విషయంలో, ఆకలి సూచీలో, పేదరిక నిర్మూలన విషయంలో భారతదేశ ప్రతిష్ఠ గణనీయంగా దిగజారింది. దీనికి తోడు ప్రపంచ పాత్రికేయ స్వేచ్ఛ సూచీలో భారత ర్యాంకు అట్టడుగుకు దిగజారిపోయింది. పాత్రికేయమంటే సమస్యల వైఫల్యాలను, వ్యక్తుల ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టడమేనని జస్టిస్ ఎన్.వి. రమణ పేర్కొన్నారు. నిజాలు మాట్లాడకుండా మీడియాను నియంత్రిస్తే ప్రజాస్వామ్యం నియంతృత్వంగా పరిణమిస్తుందని ప్రస్తుత సిజేఐ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు.