పొక్కిలి పొక్కిలైన మట్టిలోంచి లేచిన ఉద్వేగ కవితాస్వరం సుద్దాల అశోక్ తేజ. తండ్రి నుండి భౌతిక సంపదలను అందుకొనే వారసత్వానికి భిన్నంగా సుద్దాల హనుమంతులోని మౌఖిక గేయ నైపుణ్యాల్ని, ఉద్యమ చైతన్యాన్ని ఒక బాధ్యతగా అందుకున్న ఈ కాలపు ప్రజాకవి సుద్దాల అశోక్ తేజ. నల్గొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో 1954 మే 16 న పుట్టిన ఈ కవి బాల్యమంతా అనారోగ్యం, పేదరికంతో నిండిపోయింది. బతుకు దారులన్నీ కన్నీళ్ళతో తడిసినా ఇంట్లోని వాతావరణం, చుట్టూ పరిసరాలన్నీ తెలియని సృజనోత్సాహాన్ని అందించాయి. జానపదుల పని పాటల మధ్య పెనవేసుకున్న శ్రామిక సౌందర్య బంధాన్ని, స్వేద పరిమళాన్ని తనివితీరా ఆస్వాదించాడు. టప టప టపమని జారిపడే చెమటబొట్టును సిరాచుక్కగా మలుచుకొని కొత్తపాటకు ఓనమాలు దిద్దుకున్నాడు. తన చుట్టూ అలముకున్న పల్లె జనుల సామాజిక సమస్యలను చూసి గాయపడి, గేయమై వారికి ఓదార్పును, చైతన్యాన్ని అందించాడు. ప్రజా పోరాటాలు, సామాజిక ఉద్యమాలకు అండగా తన పాటను పదునైన ఆయుధంగా సంధించాడు. తల్లిపాల ఋణం తీర్చుకోవడానికి తన కవితా పాదాలతో ప్రజల ఎదలను కదిలించాడు. విస్తృతమైన లోకానుభవం, నిశితమైన పరిశీలనతో అనంత వస్తు వైవిధ్యాన్ని పాటలోకి ప్రవహింపజేసాడు. మానవాళి శ్రమలోని విభిన్న పార్శ్వాలను, ప్రకృతి పరిణామాలను స్పృశిస్తూ శ్రమకళాపూర్ణోదయాన్ని సృజించాడు.
సందర్భానికీ, సన్నివేశానికి ప్రాణంపోసేలా వెండితెర మీద పాటను రాసి సినిమా పాటకు వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పాడు. తను నడయాడిన నేలనే కాదు అనంత విశ్వంలో నిర్విరామంగా పరిభ్రమించే భూగోళం మీద తనకున్న ప్రేమను, గౌరవాన్ని ప్రకటిస్తూ “నేలమ్మా, నేలమ్మా, నేలమ్మా” అనే గేయంతో భూమాతకు కవితాత్మకంగా ప్రణమిల్లాడు. ఆ ప్రణామ ప్రార్థనా గీతాన్ని మరోసారి ఆలపిద్దాం.
“నేలమ్మా, నేలమ్మా, నేలమ్మా-నీకు
వేల వేల వందనాలమ్మా.
సాలేటి వానకే తుళ్ళింత-ఇంక
సాలు సాలుకి నువు బాలెంత
గాలినే ఉయ్యాలగా
నీటినే చనుబాలుగా
పక్కల్ల డొక్కల్ల రెక్కల్ల –నువు
సక్కంగా మోసేవు మొక్కల్ల
పరువమొచ్చి చేను వంగె
పైరు కాపు మేను పొంగె
పంట బిడ్డను రైతు బండికెత్తినంక
పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక”
నేల మీద పాట రాయాలనే ఆలోచన రావడమే ఒక అద్భుతం. మన కాళ్ళకింది నేల పొరల కింద ఎన్నో విలువైన ఖనిజాలు, ధాతువులు, సంపదలు దాగున్నాయి. అంతకుమించి విలువైన మానవాళి చరిత్ర, సంస్కృతి, భావోద్వేగాలు సైతం ఆ మట్టిపొరల క్రింద కదులుతూనే వుంటాయి. సుద్దాల అశోక్ తేజ ఆ స్పృహతోనే నేలకు వందనాలు చెపుతున్నాడు. ప్రకృతిలో తాదాత్మ్యం చెందుతూ పర్యావరణ చైతన్యంతో నేల ఎదలోని స్పందనల్ని దృశ్యమానం చేస్తున్నాడు కవి. మేఘాల నుంచి రాలే వాన చినుకు నేల బుగ్గల్ని ఎంత సుతారంగా ముద్దిడుతుందనే విషయాన్ని”సాలేటి వానకు తుళ్ళింత”అనే ఒక్క పదంతో అనుభూతిమయం చేశాడు. నేలను అమ్మగా, బాలింతగా, చూడటం ఒక అపురూపమైన సంబోధనగా నిఘంటువులో నిలిచిపోతుంది. కవిలోని మాతృహృదయానికి, స్త్రీలపై కవికి గల అపారమైన గౌరవాభిమానాలకు నిదర్శనం ఈ సంబోధనలు. తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చే అమ్మకున్న గొప్పదనాన్ని నేలకు ఆపాదిస్తూ బాలెంతగా చూడటం ఉదాత్తమైన భావనగా గుర్తుండిపోతుంది.
తన సారవంతమైన నేలలోని సారాన్ని ధాన్యంగా మార్చి లోకం ఆకలి తీర్చే అమ్మ నేలమ్మ త్యాగం వెలకట్టలేనిది. “గాలినే ఉయ్యాలగా/నీళ్లనే చనుబాలుగా” చేసుకుంటుందనే ఊహ వాస్తవంగా అనిపిస్తుంది. పంచభూతాలలోని గాలి, నీరు నేలతో సమన్వయం చేసుకుంటూ జరిగే ప్రకృతి గమనాన్ని కవి ఆర్ద్రంగా అభివ్యక్తీకరిస్తాడు. కొడవలితో పంట కోసాక ఎండిపోయి నెర్రెలిచ్చిన నేల గర్భశోకాన్ని వినిపిస్తాడు కవి.
కోవెల సంపత్కుమారాచార్య గారు ఈ పాటను ప్రస్తావిస్తూ “కేవలం మట్టి అనుకోబడుతున్న ఈ నేలను నేలమ్మా(నేల+అమ్మ) అనడమే ఒక ఆత్మీయమైన చమత్కారం”గా ప్రశంసించారు. ఈ విధమైన ఆత్మీయ చమత్కారాలే కాదు, అనేక సామాజిక విశేషాలను, స్థానిక చరిత్రను వ్యాఖ్యానిస్తుంది ఈ గేయం.
“తల్లి నువ్వు నవ్వితే మాగాణి-ఎద
తలుపు తీశావంటే సింగరేణి
తనువునే తవ్వి తీసినా
మనసునే తొలిచేసినా
పొట్టతిప్పలకు బిడ్డలూ- నీ
పొట్టలో పడుతున్న తిప్పలు
ఏ రోజుకారోజు తీరి
నూరేళ్ళ వయస్సు కోరి
కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు
తిరుగుతున్నావేమో సూర్యుని గుడిచుట్టు”
తెలంగాణ నల్ల బంగారపు గని సింగరేణి. తెలంగాణ ప్రాంతంలోని బొగ్గుగనుల విశిష్టత, ఆ గనుల్లో పనిచేసే కార్మికుల సాహస బతుకు చిత్రాన్ని చిత్రీకరిస్తూ కవి విభ్రాoతికి గురిచేస్తాడు. నేలతల్లి నవ్వడమంటే పొలంలో విస్తారంగా పంటలు పండటమే. ఎటూ చూసినా సస్యశ్యామల దృశ్యాలే. అటువంటి పచ్చదనాన్ని అందించే రైతును ‘ఆకుపచ్చని చందమామ’గా ఒకచోట వర్ణిస్తాడు. ఈ పాటలో సింగరేణి గని కార్మికుల కష్టాలను గుండె కరిగిపోయేటట్లుగా గానం చేస్తాడు. నేలను తవ్వుకుంటూ విలువైన బొగ్గును తవ్వితీస్తూ దేశాభివృద్ధిలోనూ, విద్యుత్ వెలుగుల్లోనూ కీలకమైన కార్మికుడి దురవస్థను కనులారా చూసి, చెవులారా విన్న మనిషి ఈ కవి.
బొగ్గు బాయిలోకి వెళ్లిన తనవారి గురించి ఒక తల్లి చెప్పిన మాటలే ఈ కవితా పాదాలకు పునాదులు. “ఏముంది నాయనా! భూమిలోకి పోయి పైకి వచ్చుడంటే బొందలకు పోయి పైకొచ్చినట్లే కాదా బిడ్డా!. పొద్దున పోతే మళ్ళీ వాడు సరిగ్గా బయటికి వచ్చేదాకా నమ్మకమే లేకపాయె”అనే మాటల్లోని వేదననంతా గర్భీకరించుకున్న భావాలతో నేలమ్మ పాట మనసులను తొలచివేస్తుంది. ఆ తల్లికి వున్నట్లే ఈ నేలకు కూడా ఆ బాధ, భయం వుంటాయంటాడు కవి.
గర్భవతులైన వారు కడుపులోని బిడ్డడి క్షేమం కోసం గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అట్లనే ఈ భూమాత కూడా తన కడుపులో చేరి కడుపు నింపుకునే పని చేసుకుంటున్న కార్మిక బిడ్డల క్షేమం కోసం సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా అశోక్ తేజ ఊహించడం ఖగోళ శాస్త్రజ్ఞులను సైతం విస్మయానికి గురిచేస్తుంది. సహజమైన పరిణామాలను భిన్నకోణంలో దర్శిస్తూ మానవీయ స్పర్శను అందించడం ఈ పాటలోని ప్రత్యేకత.
“తైలాలు పూసింది నైలూనది-నీకు
తలస్నానమయ్యింది గంగానది
గంధమే పూసిందహో
పొందుగా హోయాంగ్ హో
ఖండాలలో రంగు రంగు పూలు
గండు కోయిలల నైటింగేళ్ళు
కొలువైనదా వెండికొండ
నీ జాలి గుండెలజెండ
ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్ళు రక్తాలు
కన్నుల గనలేక కంపించిపోతావు”
ఈ భూమిమీద మూడొంతుల నీళ్లున్నా దీన్ని జలగోళమని అనకుండా భూగోళమని ముద్దుగా పిలుచుకుంటున్నాం. ఈ నేల మీద ప్రవహించే నదులు కూడా నేలను ఎంతగా అభిమానిస్తాయో చూపుతాడు కవి. నదులు ప్రవహించే తీర ప్రాంతాలలోనే మానవ నాగరికత వెల్లివిరిసింది. సామాన్య మానవుని జీవన గమనపు ఆనవాళ్లని నిక్షిప్తం చేసుకున్న నదీ తీర ప్రాంతాల పవిత్రతను స్మరిస్తుందీ పాట.
నేలతల్లికి నైలు నది నూనె రాస్తే గంగా నది తలస్నానం చేయించి ప్రక్షాళణం కావించింది. మరో నది గంధం పూయగా, పూసిన రంగు రంగుల పూలు, పచ్చని ఉద్యానవనాల్లోని కోయిలలు, నెమళ్లు నేలకు సౌందర్యాన్ని అందించాయని, నేలతల్లి దయార్ద్ర హృదయంలా తెల్లని హిమాలయాలు మెరుస్తున్నాయంటూ అవని మీద పరచుకున్న ప్రాకృతిక మనోహర దృశ్యాలను వర్ణిస్తాడు కవి.
ఒక్కోసారి ఈ భూమి కంపించి వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇంత నిర్దయగా నేలతల్లి ప్రవర్తించదు కదా! అందుకని కవి తెలివిగా ఈ భూమిమీద జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు చూడలేక నేలమ్మ హృదయం కంపించిపోతే ఆ ప్రకంపనల్లో పడి ప్రజలు చనిపోతున్నారంటాడు. ఈ నేల అహింసకు, ధర్మానికి, శాంతికి నిలయమైనదని, ఈ నేలమీద ఏ తప్పు లేదనే మౌలిక తత్వాన్ని చెప్పకనే చెబుతాడు అశోక్ తేజ.
“మాతల్లి నీ మట్టి బంగారం-అది
మానవాళికి నుదుట సిందూరం
అమ్మా నీ అనురాగము
కమ్మనీ సమభావము
గొప్పలు తప్పులు సూడక-నువు
ఎప్పుడు మమ్మెడబాయక
జన్మించినా రారాజులై
పేరొందినా నిరుపేదలై
నీ ఒంటిపై సుతుల చితులు కాల్చుకున్న
నీవంటి తల్లింక దేవుళ్ళకే లేదు”
నడక వచ్చిన దశనుండి మన పాదాలు ఈ నేలను స్పర్శిస్తూనే వుంటాయి. మనం పుట్టిన నేలను చూస్తే మనసు పులకరిస్తుంది. దాన్ని బంగారంలా భావిస్తాం. ఆ మట్టి రేణువులను నుదుట తిలకంలా దిద్దుకుంటాం. ఈ భూమికి తలవంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ నేలకున్నంత సమతా మమతా భావాలు మరెవరికీ వుండవు. స్థాయి భేదాలు లేకుండా ఆదరిస్తుంది. అనురాగం చూపిస్తుంది. క్షమిస్తుంది. మనకు దూరంగా వుండలేదు. చివరకు ప్రాణం పోయినా తన ఎదను తొలుచుకొని తనలో దాచుకుంటుంది. అవసరమైతే తన ఎదమీద చితిని పేర్చుకొని తనలో కలిపేసుకుంటుంది. నేలతల్లి వంటి తల్లి దేవుళ్ళకు కూడా లేదనే ఇతిహాస సత్యాన్ని గుర్తుచేస్తూ నేలతల్లి మహోన్నత త్యాగాన్ని కీర్తిస్తాడు కవి.
భూమిని వ్యాపార వస్తువుగా చూస్తున్న ఈ కలికాల వ్యాపార యుగంలో ఈ నేలమ్మ పాట ఆత్మ విమర్శకు పురిగొల్పుతుంది. “ఈ నేల నాది యన్న భూమి ఫక్కున నవ్వు” అన్న వేమన మాటల్లోని భావ తీవ్రత, జీవన సత్యం ఈ పాటలోనూ ఉంది.
భూమికీ మనిషికి మధ్యనున్న బంధం రక్త సంబంధమంత గాఢమైంది. అంతటి గాఢమైన అనుబంధాన్ని ఈ నేలతో ముడివేసుకున్నాడు గనకే ఇంతటి అర్థ గాంభీర్యంతో తాత్త్వికంగా రాయగలిగాదు కవి. అశోక్ తేజ ఏ వస్తువును తీసుకున్నా సరళమైన పదాలతో, స్పష్టమైన ఉపమానాలతో గానయోగ్యత గల పాటను అందిస్తాడు. అందుకు నిదర్శనం ఈ పాట. కవిని గన్న ధరణి ఋణం తీర్చుకోవడానికి ఈ పాట రాసాడనుకుంటా. ఈ నేలలాగే ఈ పాట కూడా శాశ్వతం.
పూర్తి పాట:
నేలమ్మా, నేలమ్మా, నేలమ్మా-నీకు
వేల వేల వందనాలమ్మా.
సాలేటి వానకే తుళ్ళింత-ఇంక
సాలు సాలుకి నువు బాలెంత
గాలినే ఉయ్యాలగా
నీటినే చనుబాలుగా
పక్కల్ల డొక్కల్ల రెక్కల్ల –నువు
సక్కంగా మోసేవు మొక్కల్ల
పరువమొచ్చి చేను వంగె
పైరు కాపు మేను పొంగె
పంట బిడ్డను రైతు బండికెత్తినంక
పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక
తల్లి నువ్వు నవ్వితే మాగాణి-ఎద
తలుపు తీశావంటే సింగరేణి
తనువునే తవ్వి తీసినా
మనసునే తొలిచేసినా
పొట్టతిప్పలకు బిడ్డలూ- నీ
పొట్టలో పడుతున్న తిప్పలు
ఏ రోజుకారోజు తీరి
నూరేళ్ళ వయస్సు కోరి
కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు
తిరుగుతున్నావేమో సూర్యుని గుడిచుట్టు
తైలాలు పూసింది నైలూనది-నీకు
తలస్నానమయ్యింది గంగానది
గంధమే పూసిందహో
పొందుగా హోయాంగ్ హో
ఖండాలలో రంగు రంగు పూలు
గండు కోయిలల నైటింగేళ్ళు
కొలువైనదా వెండికొండ
నీ జాలి గుండెలజెండ
ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్ళు రక్తాలు
కన్నుల గనలేక కంపించిపోతావు
మాతల్లి నీ మట్టి బంగారం-అది
మానవాళికి నుదుట సిందూరం
అమ్మా నీ అనురాగము
కమ్మనీ సమభావము
గొప్పలు తప్పులు సూడక-నువు
ఎప్పుడు మమ్మెడబాయక
జన్మించినా రారాజులై
పేరొందినా నిరుపేదలై
నీ ఒంటిపై సుతుల చితులు కాల్చుకున్న
నీవంటి తల్లింక దేవుళ్ళకే లేదు
(1993)
నేలపై జన్మించి,ఈ మట్టిని ఆధారంగా చేసుకొని జీవిస్తూ తరతరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మానవుని తరపున నేలతల్లికి కృతజ్ఞతా పూర్వకంగా అశోక్ తేజ గారు భక్తిప్రపత్తులతో అల్లిన కవితామాలనే నేలమ్మ నేలమ్మా పాట. పంచభూతాలతో సహజీవనం చేస్తూ తన మట్టి కడుపులో పుట్టిన పేగుబంధాలని సాదుకునే క్రమంలో తన చెమటచుక్కల కాసారంలో తడిసి ముద్దైన శ్రమతత్వాన్ని విశ్వజనీనం చేస్తున్న మట్టి హృదయమే ఈ పాట. ఇంతగొప్ప పాటకు డా.ఎస్.రఘు గారు తనదైన తాత్విక దృష్టితో చేసిన ఈ గొప్ప సమీక్ష పాఠకుల మదిలో చెరగని ముద్రను వేస్తుంది. తెలుగు సాహిత్య వినీలాకాశంలో జయకేతనం ఎగురవేస్తున్న ఈ వెంటాడేపాటకు ఎప్పటిలాగే నా హృదయ స్పందనను తెలియజేసుకుంటూ డా.ఎస్.రఘు గారికి మరొకసారి ధన్యవాదాలు.. 👍🙏👍