ఈ ఆగస్టు 8వ తేదీన జైపూర్ లోని హయత్ హోటల్లో జరిగిన భారీ పెళ్ళి వేడుకల్లో దొంగతనం జరిగింది. ఒకటిన్నర కోట్ల విలువ చేసే నగలు, లక్ష రూపాయల కరెన్సీ ఉన్న బ్యాగ్ ను దొంగతనం చేశారు. కేసు విచారణలో పాల్గొన్న పోలీసులు, ఒక మైనర్ పిల్లవాడు అంత పెద్ద చోరీ చేశాడని తెలుసుకుని ఆశ్చర్యపడ్డారు. వాడు చెప్పిన వివరాలు మీడియాలో ప్రముఖంగా రావటంతో సమాజం దిగ్భ్రాంతి చెంది, చర్చించింది. మధ్యప్రదేశ్ లోని కాడియా, గుల్ఖేడీ, గుల్ఖేడీ అనే మూడు గ్రామాల్లో బాలలకు నేరస్థ కార్యకలాపాల్లో శిక్షణనిచ్చే స్కూళ్ళు నడుస్తున్నాయట. ఈ గ్రామాలు రాష్ట్ర రాజధాని భోపాల్ కు 117కి.మీ.ల దూరంలో ఉన్నాయి.
12, 13 ఏళ్ళ పిల్లలను పేరెంట్స్ ఈ స్కూళ్ళకు పంపుతున్నారు. అప్పులు చేసి, పిల్లలను లీజుకు యిచ్చి, ఏడాదికి 2 లక్షల పైగా ఫీజు చెల్లిస్తున్నారు. జేబులు కొట్టటం, చెయిన్ స్నాచింగ్, రద్దీప్రదేశాల్లో బ్యాగులు దొంగిలించి పారిపోవటం, పట్టుబడితే జనమో, పోలీసులో కొట్టే దెబ్బలను తట్టుకోవటం లాంటి ప్రాథమిక విద్యల నుంచి, భారీ ఫంక్షన్లలో ప్రవేశించి పెద్ద స్థాయి దొంగతనాలు చెయ్యటం వంటి ప్రత్యేక విద్యల దాకా ఇక్కడి అనుభవజ్ఞులైన గురువులు బోధిస్తారు. కొన్నాళ్ళకు ఈ పిల్లలే పూర్తిస్థాయి వృత్తి నిపుణులుగా ఎదుగుతారు. కేవలం ఈ మూడు గ్రామాల మైనర్ పిల్లలపై దేశవ్యాప్తంగా 8000 కు పైగా కేసులున్నాయట. ఇదంతా వినటానికి చాలా వికృతంగా, అనాగరికంగా ఉంది కదూ! బాలల సంక్షేమం గురించి, వికాసం గురించి ఆలోచించే, పనిచేసే వారికి మరింత ఆందోళనకరంగా ఉంటుంది.
ఒక సమాజం భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఊహించటానికి ఇవాల్టి కొత్త తరం ఎలా రూపొందుతున్నదో అనేదే కొలమానం. ఆ బాల్యాన్ని ఎంత సున్నితంగా, జాగ్రత్తగా చూసుకోవాలో; ఎంత స్వేచ్ఛగా, సృజనాత్మకంగా వికసించనివ్వాలో తాత్వికులు, విద్యావేత్తలూ, రచయితలూ ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. ఆ ఆలోచనలను సమాజాలు ఎంత పట్టించుకుంటున్నాయి?
పైన చెప్పుకున్న సందర్భంలో ఉద్దేశ్యపూర్వకంగా పిల్లలను నేరస్తులుగా మార్చుతున్న తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. తరాలుగా పేదరికంలో మగ్గుతూ నేరాలను వృత్తిగా చేసుకున్నవాళ్ళు. ప్రధానస్రవంతి సమాజంలోని నీతినియమాలకు, సంస్కారానికి ఆవలి వైపున బతుకుతున్నవాళ్ళు. వీటన్నిటికీమించి నేరాన్ని వ్యవస్థీకరించిన ఘరానా యజమానుల చేతుల్లో పావులుగా ఉన్న కిరాయి మనుషులు కూడా. బిడ్డల శిక్షణ గురించి వాళ్ళకు పాఠాలు చెప్పి లాభంలేదు, వాళ్ళకు బతుకుదెరువు గురించిన భరోసా కావాలి.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో, నాగరికతలో ఎంతో ముందుకు నడిచిందని చెప్పుకుంటున్న ప్రధానస్రవంతి సమాజంలో బాల్యం భద్రంగానే ఉందా? ఆరోగ్యకరంగా ఎదుగుతోందా? జవాబు నిరాశాజనకం! కుటుంబాలు, విద్యాసంస్థలు, మార్కెట్, రాజకీయ వ్యవస్థలు కలిసి ఎందరు బాలనేరస్థులను తయారు చేస్తున్నాయో ఒక్కసారి చూసుకుంటే భయమేస్తుంది. నేరమనే అంశాన్ని చట్టపరంగా మాత్రమే నిర్వచిస్తే దీని తీవ్రత అందదు. సమాజంలో అసమానతలను, అమానవీయతనూ పెంచే చర్యలన్నీసంఘవ్యతిరేకమే అన్న అవగాహనతో చూసినప్పుడే నేరస్థ స్వభావంలోకి బలవంతంగా నెట్టబడుతున్నబాల్యం కనబడుతుంది.
పేరులోనే కులమతాల చిహ్నాలను తగిలించి సామాజిక విభజననూ, పరస్పర ద్వేషాన్నీ నేర్పే సాంస్కృతిక వాతావరణం, పసితనం నుంచే జెండర్ అసమానతలను నూరిపోసే కుటుంబాలు,పోటీ ప్రపంచంలో గెలవటమే జీవిత పరమార్థమని బోధించే విద్యావిధానం, వినియోగదారులు తప్ప మనుషులు అవసరమే లేని వ్యాపార సంస్క్రుతి, అధికారమే అంతిమమని చెప్పే రాజకీయ వ్యవస్థ వీటి నడుమ పెరుగుతున్న పిల్లల్లో ఏర్పడుతున్న నేరప్రవృత్తిని ఏ ప్రమాణాలతో అంచనా వేస్తాం? బాల్యంలోనే మాదక ద్రవ్యాలకు, ఆర్థిక నేరాలకు, అత్యాచారాలకూ అలవాటు పడుతున్న పసివాళ్ళు అట్టడుగు వర్గాలనుంచే కాదు, సంప్రదాయ కుటుంబాల నుండి , సంపన్న వర్గాల నుండి కూడా తయారవుతున్నారు.
మధ్యప్రదేశ్ లోని ఆ నేరస్థ కేంద్రాలే కాదు, అత్యాధునికమైన విద్యాసంస్థలు కూడా బోలెడన్ని అవలక్షణాలను నేర్పుతున్నాయి. ఈ సాంఘిక కాలుష్యాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం అన్ని రంగాల నుండి, అన్ని స్థాయిలనుండి జరగకుండా భవిష్యత్ సమాజంలో మెరుగుదలను ఆశించలేం.