నైరూప్య

ఆ… రూపం… కనీ కనిపించని ఆకారం… నీ భుజం మీద చెయ్యివేసి నిమురుతున్నట్లు.

ఎక్కడి నుంచో … సన్నగా వినిపిస్తున్న పాట…

హృదయాన్ని మెలిపెడుతూ… గుండెలో ఏదో సన్నని వేదన… ఏదో వెతుకులాట… ఎక్కడికి ఈ ప్రయాణం… ఇదీ అని నిర్ధారించుకోలేని స్థితి.

సన్నని దారుల గుండా. షిల్లాంగ్ లోని కొండల మధ్యలో… ఒక చిన్న హోటల్ ముందు తాగిన టీ, పైన ఆకాశాన్ని అల్లేసిన మేఘమాలికలు. ఒక పక్కగా జలపాతాల హోరు .. మళ్లీ ఎవరిదో అస్పష్ట రూపం.

ఫోన్ లో అలారం .. ఆరు గంటలయింది.

టీవీ చూద్దామని ఆన్ చెయ్యంగానే …. రియల్లీ హెల్ …

మనిషికి మనిషికి ఫిజికల్ దూరం… కొన్ని రోజులు జాగ్రత్త గా ఉండాలి.

ఈ వైరస్ భయంతో ఒంటరిగా ఉండే వాళ్ళు మెంటల్ గ ఫీల్ అవుతున్నారు… అంటూ ఏంకర్ ఉవాచ. ప్రతి ఛానల్ వాళ్ళు సర్వేలుచేసి కోల్పోయిన బంధాలు, దగ్గరతనం మళ్లీ వచ్చాయి అని చెప్పడం ఈ లాక్డౌన్ మూలంగా.. మర్చిపోయిన ఆటలు, పాటలతో పాటు వంటల గురించి టీవీ చానెళ్ళ వాళ్లతో జూమ్ లో నో, గూగుల్ మీట్ లోనో మాట్లాడే జనాలు.

ఎంత అబ్సర్డ్ గా ఉంది.

lockdown బంధాలు అన్న పేరు చూసి పగలబడి నవ్వావు కదా!

నిజమా! ఇంతకు ముందు లేవా ఈ బంధాలు, ఆమాట వింటూనే నీకు ఎంత కోపం వచ్చింది. అంటే ఇంతకుముందు ఇంట్లో వాళ్ళ మధ్య బలమైన బంధమే లేదా! ఇంట్లో కూర్చొని ముఖాముఖాలు చూసుకుంటేనే రిలేషన్స్ పెరుగుతాయా…

ఏమిటీ ఈ థియరీ? ఎవరు కనిపెట్టారు? అనుకున్నావు చిరాకు పడుతూ. కాఫ్కా అన్నది “Isolation is a way to know ourselves.” నీ గురుంచి తెలుసుకునే ఒక అవకాశం దొరకుతుందని. అది చెప్పాలి తప్ప ఇలా మాట్లాడేదంతా… అంతా వట్టి .. ట్రాష్ నీ దృష్టిలో.

నీ చూపు శూన్యంలోకి .. అదే ఆకాశంలోకి చూసింది… మళ్ళీ.. అదే చూపు నీ లోపలికి చూసుకుంది.

కాలంలో శూన్యం..

కిటికీలోంచి అరుణకిరణాలతో పాటు ఫ్లేమ్‌ ఆఫ్‌ ఫారెస్టు ఎర్రటి మోదుగుపూల సౌందర్యం ఎంత వివశత్వాన్ని కలిగిస్తోందో.

అయితే ఆ ముచ్చట ఏంతో సేపు ఉండదుగా.

ఇదివరకు అయితే కనీసం మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు పచ్చని చెట్ల మధ్య తిరగడం ఉండేది. ఇప్పుడు బాల్కనీలో నించుని మురిసి పోవడమే…

లేవడం, కాఫీ తాగడం, బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, లాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అవడం, అప్పుడు కూర్చుంటే మళ్ళీ లంచ్ కే లేవడం. తొందరగా స్నానం ముగించుకుని ఫ్రిజ్ లో ఏదైనా ఉంటే తీసుకుని తినడం, లేకపోతె ఏ పాస్తానో లేదా నూడుల్స్ తినేసి మళ్లీ ఆఫీస్ పనిలో పడటం.

సాయంత్రం మటుకు ఆరు గంటల కల్లా పని ముగించుకుని లాగ్ అవుట్ అవడం మార్చి నుంచి జరుగుతున్న తతంగం. ఇదేగా ఆఫీస్, కలీగ్స్ .. టీం లంచ్ , వీక్ ఎండ్ పార్టీస్ అన్నీ గత జన్మ తాలూకు స్మృతులు …

ఏదైనా కావాలంటే ఆన్లైన్లో తెప్పించుకోవడమే. కూరలు ఎలాగూ ప్రతి వారం కాంప్లెక్స్ లో పెడతారు. అందరం ఒకే సారి వెళ్ళకుండా సొసైటీ వాళ్ళు ఒక్కొక్క్ ఫ్లోర్ కి ఇంటర్ కం లో రమ్మని చెప్పినప్పుడు వెళ్లి తెచ్చుకోవడం ..

ఆషాడం… పోయే హడావుడిలో … శ్రావణం … వచ్చే సందడిలో నల్లటి మబ్బులు. కుంభ వృష్టి వానలు.

రోజులాగే ఈ రోజూ… నీ షెడ్యూల్ మామూలే. తేడా ఏమి లేదు. ఇంతలో నీకు మెసేజ్ అలెర్ట్ వచ్చింది.

ఐదేళ్ళ క్రితం ఫోటో శీతల్ షేర్ చేసింది.

అది చూడగానే నీలో .. అప్పుడు జరిగిన ఓ సంఘటన కళ్ళముందు కదలాడింది.

అ రోజు నిన్ను మేనేజర్ పిలిచి మీరు ఉమెన్స్ ఉమెన్స్ గ్రీవీయన్స్ సెల్ మెంబెర్స్ కదా (మన లొకేషన్ నుంచి) ఒక ఇష్యూ గురించి స్వప్నా రాయ్ (గ్లోబల్ హెడ్) ఫోన్ చేసారు పర్సనల్ గ. ఎందుకంటే మిమ్మల్ని రేపటి కల్లా కార్పొరేట్ ఆఫీసుకు రమ్మనమని. సో బుక్ యువర్ టికెట్స్అని చెప్పాడు.

సరే అని వెంటనే నీ కేబిన్ కి వెళ్లి సిస్టం ఓపెన్ చేసి ట్రావెల్ పోర్టల్ కి వెళ్లి ఫ్లైట్, గెస్ట్ హౌస్, ఎయిర్పోర్ట్ పికప్, డ్రాపింగ్ బుక్ చేసుకున్నావు. మరునాడు అక్కడకి చేరుకొని ఆఫీస్ కి వెళ్లి స్వప్నా రాయ్ ని కలిసావు.

జరిగిన ఇష్యూ చెప్పింది. అది చాలా కాన్ఫ్డేడెన్షియల్ మేటర్ “హేండిల్ ఇట్ కేర్ ఫుల్లీ అని కూడా చెప్పింది.

అసలు జరిగిన విషయము ఏమిటంటే మేనేజర్ లెవెల్ ఉన్న ప్రీతి, తనని seduce చేసిందని అదే పొజిషన్ లో ఉన్న సురేష్ కంప్లైంట్ చేసాడు. అయితే మేనేజ్మెంట్ కి ఇంకో కంప్లైంట్ ప్రీతి నుంచి వచ్చింది సురేష్ తనని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడని.

ఇద్దరూ బెస్ట్ వర్కర్స్ అని టాప్ మేనేజ్మెంట్ కి మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇలా… of course చాలా మందికి తెలియదు. మిగతా లొకేషన్స్ నుంచి మెంబర్స్ కూడా వచ్చారు.

ఇద్దరినీ విడి విడిగా పిలిచి మాట్లాడారు. ఎవరూ తగ్గలేదు. ఇక చేసేది లేక అప్పటికప్పుడు వాళ్ళిద్దరినీ చెరో లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేసేసారు..

ఆ రోజు సాయంత్రం నీ రిటర్న్ ఫ్లైట్ శీతల్, చైతాలీ, నువ్వు సైట్ సీయింగ్ కోసమని గేటు వే అఫ్ ఇండియా కి వెళ్లారు. అక్కడ కాసేపు ఫెర్రీ రైడ్ చేసారు. అప్పుడు శీతల్ నీతో చెప్పిన విషయం విని….

మనుష్యుల స్వభావాలు, ఆ సంకీర్ణ భావాలూ, మాటలకు, చేతలకు మధ్య ఉండే వైరుధ్యాలు నీకు ఆశ్చర్యాన్నీ, విస్మయాన్ని కలిగించాయి.

ఇదిగో మళ్లీ ఈ రోజు ఇలా ఆ జ్ఞాపకాల దొంతరలు తేనె తుట్టలోని ఈగల్లాగా ముసురుకున్నాయి. చాలా రోజులు ప్రీతి మీద సురేష్ ఇచ్చిన కంప్లైంట్ గురించి నీ ఆలోచనలు వదల లేదు. నమ్మ బుద్ధి కాలేదు ..

సర్లే … ఆలోచనలలో పడి మూడయింది. లంచ్ చేసిన తరువాత అదో సుషుప్తావస్థ. టైం మూడయింది.

చాయి కోసం వంటిట్లోకి వెళుతున్నప్పుడు. మెసేజ్ బీప్ వినిపించింది. అది కొత్త నెంబర్ నుంచి టీ కి రండి సాయంకాలం నేను మాధవ్ ని మీ పక్క ఫ్లాట్ ఓనర్ అని ఒక స్మైలీ ఎమోకాన్ పెట్టాడు.

సొసైటీ whatsapp గ్రూప్ లో డీటెయిల్స్ ఉంటాయి.

ఒహ్! అతను వచ్చాడా, ఆర్మీలో, కల్నల్ …. సెలవు మీద ఉన్నాడుట

మొదటి సారి కలవడం. అతని గురించి వినడం తప్ప చూడలేదు ఈ రెండేళ్ళ కాలంలో. ఈ ఊరు అంటే ఉండే ఇష్టం వల్ల ఈ ఫ్లాట్ కొనుక్కుని అప్పుడప్పుడు సెలవుల్లో వస్తాడని తెలిసింది.

వెళ్ళాలా… వద్దా .. మీమాంస.. పక్కనే .. కదా

వెళ్ళాలనే కుతూహులం….. అది సహజాతమే …

కుతూహలం మే కదా మనిషిని అన్వేషణకు పురికొలిపినది.

సరే వస్తాను అని సమాధానం ఇచ్చావు.

సాయంత్రం ఆరు గంటలకి వెళ్లావు. తెల్లటి కుర్తా, చుడిదార్ వేసుకున్నాడు. అతని చూపు సూదంటు రాయిలా గుచ్చుతోంది.

ఏదో వింత పరిమళం. మరేదో పురాతన జ్ఞాపకాలు …

వెళ్ళంగానే శానిటైజేర్ ఇచ్చాడు. ఫిజికల్ డిస్టెన్స్ ఉంది. ఒక్క మాస్క్ మటుకు తీసేద్దాం అని నవ్వాడు. నీకు అతని మాటలకి నవ్వు వచ్చింది. ఆ సరదా మాట తీరు నచ్చింది.

చాలాసేపు లాక్ డౌన్ , కరోనా వైరస్ గురించే మాటలు…

అతను వక్త … నువ్వు శ్రోత.

ఒక గంట అనుకున్నది రెండు గంటలయింది.

అప్పుడు లేచి ఇంటికి వచ్చేశావు, ఇంటికి వచ్చాకా కూడా అతని గొంతు సంపెంగ పరిమళంలా నిన్ను చుట్టుముట్టేసి ఉంది. అతను నీకు చాలా దగ్గరివాడు అనే భావం కలిగింది.

ఇంట్లోకి, అడుగుపెట్టిన వెంటనే అలెక్సా resume అన్నావు.

“ఆజ్ జానేకి జిద్ నా కరో యుహీ పెహలూ మే బై ఠే రహో, హాయ్ మర్ జాయేంగే, హం తో లుఠ జాయేంగే..” అంటూ ఫరీదా కనూమ్ గొంతు లోంచి…. జారుతున్న ఆ గజల్ .. ఏదో గతం తాలూకు విషాదాన్ని మోస్తున్న భావన. పొద్దున్న వచ్చిన ఆ అస్పష్ట కల.

రక రకాల వర్ణాలుగా… చెదిరిపోతూ… ఏవేవో రూపాలు … స్వప్నాలు.

అలెక్సా స్టాప్ ..

ఎందుకో ప్రీతి గుర్తుకు వచ్చింది.

అంతలో…

ఆత్మని తాకే ఆ ఫ్లూట్ .. ఈ నీరవ నిశిధిలో ఎవరు వాయిస్తున్నారో..

యేవో గత జన్మ తాలూకు గొలుసులు ఇంకా తెగకుండా పట్టుకుని ఉన్నాయా? అంతా అస్పష్టం. వివిధ రూపాలతో .. అర్ధం కానీ నైరూప్యం.

అతన్ని వదిలి ఇంటికి వచ్చేసాక కూడా ఆ ఫీలింగ్.. ఏదో కొత్తగా… ఫ్రెష్ గా ఉన్న అనుభూతి.

జీవితం చాలా గొప్పది. అనుభూతులను ఏవో హద్దుల పరిధిలో బంధించే ప్రయత్నం చేయకూడదు.

ఒకప్పుడు రాత్రుళ్ళు నిద్ర పోని నగరం.. ఇప్పుడు మౌనంగా .. నిశబ్ధం గా ఉంది.

ఆ నిశబ్దం .. అర్ధం కాని శూన్యం… ఏవో… ఏవేవో స్వప్నాల పరిమళాలు గుబాళిస్తూ…

నీ కనిపించే భౌతిక రూపం వెనుక, నీలోని అంతర్గత సంఘర్షణలు నీ ఆత్మవేదనలు ఇవన్నీకలగలిపి తే నువ్వు అవుతావు. నిన్ను నువ్వు స్వీకరించుకుంటూ నిన్ను నువ్వు అర్ధం చేసుకుంటూ, నీకు నువ్వు సమాధానపడుతూ…

ఎందుకో… అకస్మాత్తుగా హంసల దీవి సముద్రపు జ్ఞాపకం… మనసంతా చెప్పలేని ఆనందం. ఆ హోరు. అలల నురగల మీద నుంచి ప్రయాణం కృష్ణమ్మ… ఆ పక్కనుంచి వచ్చి సముద్రుడిలో కలిసే అపురూప సంగమం.

ఆ సముద్రపు ఘోష. ఇంకా నీ చెవులలో…

అదేంటో సముద్రాన్ని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు నీకు, రెండు సార్లు లోపలి లాగేసినా, నీ మోహం, ఆకర్షణ రెండూ తగ్గ లేదు. సరికదా ఇంకాస్త పెరిగింది.

ఆ స్వప్న ఏకాంతం లో ఉండగా మెసేజ్ బీప్ వచ్చింది.

ఒక్క సారి గా స్వప్నం లోంచి చైతన్యంలోకి వచ్చావు. ఫోన్ అందుకుని చూసావు. ఇంద్రనీల్ పంపాడు… అందులో .. ఇలా… ”డియర్ నైరూ…

నువ్వో abstract వి. ఒక్కో సారి ఒక్కోలా. అన్ని రంగులు తెలుపు నుంచి వచ్చినట్లు, నీలో ఎన్ని నీలి సంద్రాలు పొంగినా, ఎన్ని అగ్ని కణాలు చిందినా, నువ్వు పచ్చటి ఆకు మీద కురిసిన మంచు బిందువంత స్వచ్ఛంగా… ఎప్పటికీ నా నువ్వుగా…” అని లవ్ ఏమోజి పెట్టి ఉంది.

కథా రచయిత్రి. 2010లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. చదవడమంటే ఇష్టం. కథలు రాయాలనే అభిలాషతో రాసిన తొలి కథ “కృష్ణం వందే జగద్గురుం” కౌముదిలో ప్రచురిచతమైంది. ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా డెబ్బై ఐదు. తొలి కథ కౌముది అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమైంది. నవ్య, ఆంధ్రభూమి, స్వాతి, తెలుగు వెలుగు, విపుల, రచన, జాగృతి వంటి వార, మాస పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, ప్రజాశక్తి, వెలుగు వంటి దినపత్రికల్లోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ కథలు ప్రచురితమయ్యాయి. చతుర మాస పత్రికలో తొలి నవల “జీవితం ఓ ప్రవాహం” ప్రచురణ అయింది. రెండవ నవల 'కాశీపట్నం చూడరబాబూ' జాగృతి వారపత్రికలో సీరియల్ గా వచ్చి , పుస్తకంగా వెలువడింది. మూడవ నవల ‘ప్రయాణం’ ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురిచతమయింది.

6 thoughts on “నైరూప్య

  1. మీ శైలి చాలా బావుంది మణిగారూ. చాలాకాలమైంది ఇలాంటి కథలు చదివి. థాంక్స్.

  2. చాలా గొప్పగా ఉంది మీ రచన… ఆ భావ ప్రకటన… thank you andi..

  3. బావుంది. కొత్త శైలి. మీరు మనుషులను బాగా అధ్యయనం చేశారు. నిజానికి కథ ఎక్కడ కూడ నేను ఊహించినట్టు సాగలేదు. చాలా మలుపులు తీసుకున్నారు. అందువల్ల గమనం ఏమైనా మారిందా అన్న ఆలోచన కూడా కలిగింది.కానీ వస్తువు కన్నా మీరు నడిపించిన టెక్నీక్ కథని చాలా వరకు పాఠకుడి లోపలకి తీసుకెళ్లింది.మీది ఇది మొదటి కథ నేను చదవడం. బహుశా మీ శైలి కి నేను అలవాటు పడాలేమో అనిపించింది.

  4. ధన్యవాదాలు అనిల్ గారు.నిజానికి ఈ కథను ఒక ప్రయోగం గా , విభిన్నంగా వ్రాసాను.

Leave a Reply