చరిత్రలో చాలా సార్లు రుజువైన సత్యమే! కవిత్వం చాలా శక్తివంతమైన సాహితీ రూపం!! చరిత్ర పెట్టిన షరతును అంగీకరించడంలో కవులు గొప్ప ధైర్యం ప్రదర్శిస్తారు. ఆ ధైర్యం రాసి తీరాలనే ఉద్వేగం లోంచి, కనులెదుట దృశ్యమానమౌతున్న దుంఖంతోనో, విషాదంతోనో, ప్రపంచం మొత్తం కళ్ళు మూసుకొన్న సందర్భాల్లో జనం వినిపించే ఆక్రందనల తోనో, రాజకీయ మార్పులు డిమాండ్ చేసినప్పుడో, యుధ్ధాల విధ్వంసం లో మానవ జీవితం కకావికలమౌతున్నప్పుడో, ఇలాంటి అనేకకానేక సందర్భాల్లో సామాన్య జనం పడుతున్న బాధలను చూస్తూ ఉండలేక, చింతనా పరులైన కవులు అచంచలమైన ఆత్మవిశ్వాసంతో “మీతో మేమున్నాం” అనే భరోసాను మనుషులకు కలిగించేందుకు కలలాను పదును పెడతారు. ఇలాంటి ప్రతిసందర్భాన్ని తనదిగా భావించి దూర సమీపాలతో సంబంధం లేకుండా స్పందించే కవుల్లో అగ్రగణ్యుడు అఫ్సర్. అలాంటి అఫ్సర్ ఒక వైపు తన ఇంట్లో ఉన్న సమస్యలపై కవిత్వం రాస్తూనే తన ఇంటి అభిముఖంగా ఉన్న పాలస్తినా గురించీ, ముఖ్యం గా గాజా నగరం పై ఇజ్రాయెల్ సాగిస్తున్న ఏకపక్ష దాడిలో ప్రాణాలు కోల్పోతున్న అమాయకుల గురించీ అత్యంత సున్నితమైన కవిత్వం రాశారు. fasting hymns అని దానికి నామకరణం చేశారు. ఇవి తెలుగులో కూడా అనువదించబడాయి.
“ఇవాళ ఫజరు నమాజు ముగిసింది
రొట్టె తినబోతే ముక్క ముక్కలో ఒక గాజా”
ఇఫ్తార్ సమయంలో గాజాలో రొట్టెలు తింటారో లేదో తెలియదు కానీ, ఇక్కడ ఎక్కువ రొట్టెలు తింటారు. గాజా కీ మనకీ మధ్య దూరాన్ని ఇలా చెరిపేశారు అఫ్సర్. ఇది సంఘీభావ ప్రకటన ఒక్కటే కాదు. నువ్వూ మేమూ వేరు వేరు కాదు అని గాజా నగరానికి భరోసానివ్వడం. నిజానికి ప్రపంచం ఇప్పటికీ ఇజ్రాయెల్ పక్షమే వహిస్తోంది. గాజా నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. స్పందించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళందరూ మౌనం వహిస్తున్నారు. కానీ ఈ కవి ఈ మౌనాన్ని బద్దలు కొడుతున్నాడు.
కాలంతో పాటు కదలడం తెలిసిన కవి కాబట్టి విశ్వాసాన్ని రెటినా చేసుకున్న తన కలాన్ని “రంజాన్ నెలవంక” ను ప్రతీక చేసుకొని, కన్నీటిని సిరా చేసుకొని పలికించిన ఆంగ్ల కవిత్వమే fasting hymns. Hymns అనేవి ఆంగ్లంలో భక్తి కవిత్వ ప్రక్రియ. దాన్ని ఆధారంగా చేసుకొని రాయబడ్డకవిత్వమే ఇది. భక్తిరస కవిత్వ ప్రక్రియ నియమాన్ని రాజకీయ స్వరం వినిపించడానికి అఫ్సర్ వినియోగించుకున్నారు. ఇందుకు కవి అభినందనీయుడు.
ముస్లీంలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో సైతం దేహాలు ఛిన్నాభిన్నం అయిపోతున్న బాంబుల మోతల మధ్య రంజాన్ పండుగ గడిచిపోయింది. మిగతా ప్రపంచం ముఖ్యంగా పాలస్తీనా పరిసర ముస్లిం దేశాలన్నీ పండుగని ఘనంగా జరుపుకున్నాయి. పాలస్తినా తో సంఘీభావం లో ఉన్న కొందరు తప్ప.
కవిత్వం పరిస్థితులను మార్చలేదు. అలాగని దాని ప్రభావం తక్కువేమీ కాదు. కవిత్వం చదివేవాళ్ళలో గొప్ప అనుభూతినీ, ఆర్తినీ నింపుతుంది. చుట్టూ ప్రపంచం సున్నితత్వాన్ని కోల్పుతూ ఇతరుల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు, ఈ దౌర్జన్యనానికి న్యాయాన్యాయాల, ధర్మాధర్మాల మానవీయ విలువల విచక్షణను ఒదిలేసినప్పుడు, కనీసం యుధ్ధ నియమాలు పాటించనప్పుడు వ్యక్తులు చారిత్రక పరిణామ క్రమంలో తమపాత్ర ఏమిటో నిర్ధారించుకోడానికి కూడా కారణమౌతుంది. ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం ఆధిపత్యం చలాయిస్తున్నపుడు, మెజారిటీ మతం మౌఢ్యం మైనారిటీల ను అభద్రతల ఓటుకి పెడుతున్నప్పుడు పరిస్థితి ఎంతలా దిగజారగలదూ? ఎంత హింసని ఎదుర్కోగలదూ? పశుబలంతో మీద పడుతున్నా శత్రువును రొమ్మిరిచి మరీ ఎంతలా ఎదుర్కోడానికి సిధ్దపడగలదూ? ఆత్మగౌరవం ప్రాణం కంటే గొప్పదని యాభై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో పాలస్తీనా ఒక చారిత్రక నెత్తుటి సత్యం! ఆ నెత్తుటి సత్యాన్ని ప్రపంచం ముందు వినిపించడానికి అఫ్సర్ ఎంచుకున్న మార్గం ఈ కవిత్వం.
” అయితే కన్నీటి లో లేదా రక్తపు మడుగులో నిండా మునిగి ఒకరి భుజంపై ఒకరు తలవాల్చి మేం తెల్లవార్లూ చేసే దువాకు అంతే లేదు”
ఇటీవల రంజాన్ మాసం ముగిసింది. ప్రపంచం అంతా గొప్పగా పండుగ జరుపుకుంది. కానీ చాలా మంది ముఖ్యంగా ఆఫ్రికాలో పేద ముస్లీం దేశాలు అక్కడి ప్రజలూ, ఇజ్రాయెల్ దాడిలో తల్లడిల్లుతూనే మొక్కోవని దీక్షతో ఆ దాడిని శాయశక్తులా ఎదుర్కొంటున్న పాలస్తీనీయులలో చాలా మంది ఆ భూభాగం ఒదిలి పోతే ఇక ఆ భూమి మాకు దక్కదూ అనే అభద్రతలో పోరాటం కొనసాగిస్తున్నారు. పెట్టుబడి దారీ ప్రపంచదేశాలలో చాలా దేశాల. అండదండలున్న ఇజ్రాయెల్ తో ఇన్ని రోజులు తట్టుకొని నిలబడడమే మిగతా ప్రపంచానికి ఒక పాఠం..
ఈ ప్రతిఘటన మలుపుల్లోంచే బాంబుదాడులతో పొగలు కమ్ముకున్న ఆ నింగి లోనే రమదాన్ నెలవంక పొడిచింది. వాళ్శకు ఒక్కపొద్దుల్లేవు,సెహ్రీ-ల్లేవు శిధిలాలుగా మిగిలిన మసీదులలో ఐదుపూటల నమాజు లేవు,అలాయిబలాయీ లేదు, దువాలోక్కటే విధ్వంసం మధ్య సీతాకోకచిలుకలా ఎగురుతున్నాయి?
యుధ్ధం లో తెగబడి నిలబడడమే ఒక నమాజు కదా? ఈ యుధ్ధం ముగిసిపోవాలి,మళ్ళీ గజా నగరం శిధిలాల్లొంచే పునర్వైభవం పొందాలి. తను మళ్ళీ తలెత్తుకొని నిలబడాలి అనే విశ్వాసం లోంచి పుట్టిన కవిత్వాన్ని ఆలింగనం చేసుకోకుండా ఉండగలమా?
“చావు నుంచి తప్పించుకోబోయి శిధిలాలను చిక్కి పోయారు పిల్లలు అయితే మూతపడిన ఆ పసి రెప్పలు
అడుగుతున్నది ఒక్కటే : ఇంతకీ ఈ ఆట ఎవరిదీ అని”
యుధ్ధ బీభత్సాన్ని ఇంతకంటే గొప్ప వాక్యాల్లో ఇమడ్చలేం. ఈ ఆట ఎవరిది అని ప్రకటించడం లోనే అమెరికా సామ్రాజ్యవాదం ధ్వనిస్తోంది.
అఫ్సర్ రాసిన ఉపవాసం పద్యాలు మొక్కవోని పాలస్తీనీయుల యుధ్ధ దీక్షకు మద్దతు పలకడమే కాదు భారత ముస్లింల పేదరికాన్ని వాళ్ళల్లో అభద్రతను ఈ ఒడిసిపట్టుకుందని ఈ వాక్యాలు చెబుతాయి
“రొట్టె ముక్క కోసం దువా చేసుకున్న ఖాళీపొట్టగా
తోచింది కుంగే నెలవంక”
*
“ఒకప్పుడు రంజాన్ నెల అంటే ఎటు చూసినా ప్రేమ నిండిన కరుణ పెంచిన కథలే కనిపించేవి. ఇప్పుడు లోకం పీకల్లోతు
కూరుకుపోయింది విద్వేషంలో రక్తంలో’ మతోన్మాదుల మూకదాడులలో మరణిస్తున్న అనేక మంది ముస్లీం ల నెత్తుటి స్పర్శ అంటని దినం లేదు ఈ దశాబ్దంలో…ఈ నెత్తుటి దాహం సామరస్యం పంటను పండించే పండుగలనూ ఒదలడం లేదు. ద్వేషంతో దేశంలో ఎక్కడో ఒక చోట ఒక అఖ్లాక్ అకారణంగా నెత్తుటి ముద్దై మిగులుతున్నాడు. పైగా ఇఫ్తార్ పేరుతో రాజకీయాలు నడిపే సగటు రాజకీయాలు అక్కడితో ఆగిపోతాయి కానీ ముస్లీం ల జీవితాన్ని ఆలాయిబలాయి చేసుకోలేవు.అదంతా ఒట్టి నటన. ఈ అంశాలను కూడా ఉపవాసం పద్యాల్లో కనబడతాయి.
నిజానికి ఇలాంటి కవిత్వం రాయడం కత్తిమీద సాము చేయడమే! ఈ కవిత్వంలో మొహమాటానికి తావివ్వలేదు కవి. కాబట్టి చాలా మంది మిత్రులు, అభిమానులు కినుక వహించే అవకాశం కూడా ఉంది. కానీ కవి వీటన్నింటి అధిగమించి సత్యాన్ని ఉన్నదున్నట్టుగా పాఠకుల ముందు పరిచాడు. ఇంకా మనం తేల్చుకోవలసినది శాంతి వైపా యుధ్దం వైపా అని!
బావుంది