వాన సవ్వడి
వాన సవ్వడి వినడం
నాకూ శానా ఇష్టం
ఎంత ఇష్టమంటే
మాయమ్మ గుండెసప్పుడు విన్నంత ఇష్టం
వానంటే నెర్లు
వాన సినుకులంటే మర్లు
ఈ కరువుసీమ జనాలకు జాస్తి
ఎంత జాస్తి అంటే
పానమంత జాస్తి
మించిపోతే
పానం కన్నా జాస్తి!
*
ఈ ఆర్తి నిండిన అక్షరాల కరచాలనం మల్లెల నరసింహమూర్తి ది. ఈ కవితలో ప్రకృతి రమణీయత కనబడవచ్చు కొందరికి! వాన కురిస్తే కలిగే ఆనందం విశ్వజనీనమైంది! అది ప్రాంతీయ ఆకాంక్షలకు అతీతమైంది!! కానీ సాపేక్షంగా చూసినప్పుడు, వాన కురిసినప్పుడు సీమ వాసులకు కలిగే ఆనందం చాలా భిన్నమైంది. అది చావుపుటుకల మధ్య అంతరాన్ని గుర్తించేది. లేదా ఒకానొక ప్రాంతంలో నీటిలేమి ఎంతగా జీవితాన్ని శాసిస్తుందో చెప్పగలిగేది! ఈ కవితలో అంతర్లీంగా ప్రవహిస్తున్న దుఃఖాన్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు కానీ, నిజానికి ఈ దుఃఖం ఉపరితలానికి సంబంధించింది కాదు. మనిషి మనుగడను నిలబట్టే “పునాది”కి సంబంధించింది. బతకు ఏరోజుకారోజు కొత్త పరీక్షలను ఎదురునిలిపేది! మొత్తంగానే మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన పరిస్థితులకు సంబంధించింది.
ఆర్థికశక్తి ఆధారంగా సమాజపు ప్రగతిని తూచే దొపిడీ శక్తుల ఆధిపత్యం కొనసాగుతున్నంత కాలం రామలసీమ లాంటి వెనుకబడిన ( వెనుకకు నెట్టేసిన )ప్రాంతం తన జీవితాన్ని కేవలం ఉపరితల అంశాలతో తూచలేదు కదా!? వాటినే గొప్పగా చెప్పుకోలేదు కదా!? “రాయలేలిన రాయలసీమ” అన్న నానుడి కూడా పెనుగొండ,లేపాక్షి బజారులలో రాసులుగా పోసి అమ్మిన రతనాల మారకం అనే అర్థం లోనే వాడుతున్నాం. కానీ విషాదం ఏమిటంటే, రాయలసీమ ను సాంస్కృతికంగా శ్రీకృష్ణదేవరాయల చరిత తో, సామాజికంగా పాలెగాళ్ళ వ్యవస్థ తో ముడిపెట్టి అంచనా వేస్తున్నారు. వరుస కరువులనూ వాటి వల్ల దిగజారిన ఆర్థిక స్థితిగతులనూ, వలసలనూ చూడరు. బ్రిటీషు వాళ్ళు వచ్చి, ఇక్కడి క్షామ పరిస్థితులను చూసి, బెంబేలెత్తి, ఈ మాత్రం నీటి వసతిని కల్పించారు. వాళ్ళకున్నంత దాతృత్వం కూడా పాలకవర్గాలకూ, ఇతరప్రాంతాల వారికీ లేదు.
“అనంతపురం ఎడారిగా మారిపోతుంది” అనే పర్యావరణవేత్తల హెచ్చరికలు పాలకుల “పెడచెవి” దగ్గరకు కూడా చేరవు. అనంతపురం బతికిబట్టకట్టాలంటే కనీసం “వంద టిఏంసీల” నీటి సరఫరా అవసరం అనే భౌతిక వాస్తవం నినాదంగా మారినా రాయలసీమ పరిధి దాటి ఎవరికీ చేరనే చేరదు. సీరియస్ సీమ రచయితలూ, కవులూ తమ రచనా ప్రయాణం ఇక్కడ నుండే మొదలెడతారు. ఈ పునాది సమస్యకు పరిష్కారం వెదకడం దగ్గరే తమ కలాలను పదును పెడతారు. రాయలసీమ లాంటి కరువు ప్రాంతానికి పునాది ఉపరితలం మధ్య అంతరాన్ని ఎలా తగ్గించాలో తెలియక మధన పడతారు. ఆ దిగులు పడడం లోంచి “రెండు వాన చినుకుల పలకరింపు కోసం ఆరు గాలం ఎదురు చూపులే!” / కరువు పురిటి గదిలో కనువిప్పిన ప్రతిజీవికి కురిసే ప్రతి వాన చినుకూ ఒక సముద్రమంత పెద్దది” లాంటి వాక్యాలు పుట్టుకొస్తాయి. “మాకూ ఒక నది కావాలి” లాంటి కవిత్వం పుట్టుకొస్తుంది. మల్లెల నరసింహమూర్తి అనే ఈ “జల స్వప్నం” కవి రాయలసీమ మీద నుంచి పారే ఒక జీవనది కావాలని తన కవిత్వం ద్వారా డిమాండ్ చేస్తున్నాడు. నిత్య ప్రవాహం గల నది ప్రకృతి సిధ్ధంగా రాయలసీమకు అందుబాటులో లేదు. పెన్నా ఉన్నా ప్రవాహం సున్న! అటు కర్ణాటక ఇటు నెల్లూరు పెన్నా నదీ ఫలాలను పొందుతున్నాయి. కృష్ణ, తుంగభద్ర నదుల నీడ మాత్రమే తాకే ఈ నేల వర్షఛ్ఛాయ ప్రాంతం లో ఉంది కాబట్టి వర్షపాతంలో ఏటికేడు తగ్గుదల కనిపిస్తోంది. కాబట్టి ఒక ఖచ్చితమైన నీటి ప్రవాహం ఈ ప్రాంతపు తక్షణావసరం. దీనికి ఈ కవి నదుల అనుసంధానాన్ని ఒక భౌతికపరిష్కారంగా చూపుతున్నాడు. అది వాస్తవంగా అనంతపురం సమస్యలను తగ్గిస్తుందా? అనేది పక్కన పెడితే సమస్యల పరిష్కారానికి పాలకవర్గాలు ఏ వైపు నుండి ఆలోచన చేయాలో ఓ మార్గాన్ని చూపుతున్నాడు. పరిష్కారాల గురించిన ఆలోచనలు పాలక వర్గాలు చేయవు కాబట్టే రాయలసీమ లాంటి ప్రాంతం ఎదుగుదల లేకుండా ఉండిపోతుంది. అందుకే కవులు, రచయితలు వారికి తోచిన పరిష్కార మార్గాలు చూపుతారు. వాటిని ప్రభుత్వం సమాజం పట్టించుకొని తీరాలి.
“కేవలం నీటి గురించే” అనే మకుటంతో, ఒక విభిన్నమైన కవిత లో
“కొన్ని యుధ్ధాల్ని స్వప్నిస్తా
కేవలం నీళ్ళ గురించి,
కొన్ని ఉద్యమాల్ని నిర్మిస్తా
కేవలం నీళ్ళ గురించి”
అంటున్న మల్లెలకు నీళ్ళని పొందడం లోని రాజకీయ లక్ష్యం తెలుసు. బహుశా ఈవిషయం ప్రతి సీమ రచయితకి సంబంధించిన సామూహిక ఆకాంక్ష కూడా!
ఇక్కడే చాలా మంది పర ప్రాంతం వాళ్ళు ” ఎన్నాళ్ళు రాస్తారు నీళ్ళ మీద?కరువు మీద ? “అని ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు సీమ రచయితలు డిఫెన్స్ లో పడిపోయిన సందర్భాలున్నాయి. సాహిత్య సభలకు పిలిచి మరీ ఈ అపవాదు వేసి సీమ రచయితలనూ ఇబ్భంది పెడుతుంటారు. మీ సాహిత్యం బాగా వెనుకబడిపోయింది అనేవాళ్ళూ తక్కువేమీ కాదు. బానిససమాజంలో బానిసలు స్వేఛ్ఛ గురించే కలలు కని ఉంటారు. మాల్కంఎక్స్, మార్టిన్ లూథర్ కింగ్ కూడా జీవితాంతం జాత్యాహంకారానికి వ్యతిరేకంగానే రాశారు. మాట్లాడారు. దానికోసమే జీవితాన్ని అంకితం చేశారు. అక్కడి సాహిత్యానికి ఏ వస్తువు ప్రధానమై ఉంటుంది?
అలాంటి వారికి మల్లెల ‘ నీళ్ళ నెమళ్ళు ‘ అనే కవితతో సమాధానం ఇస్తున్నారు ఇలా
“నీళ్ళు మా అనంతసీమ పొలాల్లో జలాశయాలై
నీటి నెమళ్ళై అలల పింఛాల్ని విప్పి నర్తించే వరకూ,
చెరువులై, చెంగలువలై
వికిసించేంత వరకూ
తళ తళ లాడే చెమ్కీదండలై
నీళ్ళు మెరిసేంత వరకూ,
నీళ్ళు సీమ కొగు బంగారమయ్యేంత వరకూ
కడాకు కరువు దిక్కు తెలియక నీళ్ళు నమిలేంత వరకూ”
నీళ్ళ గురించి రాస్తూనే ఉంటాం అని మల్లెల వినూత్నమైన కవిత్వ నిర్మాణంతో ప్రకటించారు. అనంతపురంలో పుట్టిన వారికి తెలుస్తుంది నీళ్ళు లేకపోవడం అంటే ఏమిటో! నీళ్ళు లేక ఏళ్ళకు ఏళ్ళు పొలాలు బీడుపడుతుంటే చూడడం అంటే ఏమిటో! ఈ పరిస్థితులను ఎంత ఆగ్రహంగానూ, కరుణరసాత్మకంగానూ, ఆర్ద్రంగానూ, చిత్రించాడో అంతే ఉద్యమ స్వభావాన్ని కూడా అనేక కవితల్లో వినిపించాడు. ఉదాహారణకు ఈ పాదాలు చూడండి
“సీమ జనాలకు జలం ఉషస్సు కనుక
ఆగదు సీమలో
నీళ్ళ కోసం ఆరాటం
నీళ్ళ కోసం పోరాటం” ( నీటి అడుగు )
పారలెత్తుదాం, పికాసులెత్తుదాం,
కొడవండ్లెత్తుదాం..కో..బలి అందాం..
యాడపారే గంగమ్మతల్లిని మన పల్లెల్లోకి తిప్పుదాం
నీళ్ళ తిర్నాల సేసుకుందాం ఊర్లు ఊర్లన్నీ గూగుడు
పీర్లై ఊగుదాం
నీళ్ళ కోసం రాత్రనక పగలనక
శాయ్ సోన్ తొక్కుదాం
సావో బతుకో తేల్చుకుందాం ( అనంతమ్మా) ఇది
రాయలసీమ ఆధునిక కవిత్వం వినిపిస్తున్న ఉద్యమస్వరానికి ఉదాహరణ!
ఇలా మల్లెల కవిత్వంలో ప్రాంతీయ అస్తిత్వం కలగలిసిపోయింది. ప్రాంతీయ అస్తిత్వం ఒక ఇప్పుడొక రాజకీయ అవసరంగా మారిపోయిన ప్రాంతం రాయలసీమ!
ఈయన కలం ఎత్తుకుంటే కవిత్వం పారేది రాయలసీమ కోసమే!
ఇది పైకి పరిమితి గా అనిపించినా ఆయన కవిత్వం లోతును స్పర్శించినప్పుడు అదెంత నిబధ్ధతకు సంబంధించిన అంశమో తెలుస్తుంది. తల్లి పై బిడ్డకు ఉండే ప్రేమకు నకలుగా ఈ కవిత్వం ఉంటుంది. ఇంతలా తన ప్రాంతం గురించి మదన పడడం ఆ కోవలోకే కవిత్వాన్ని రాయడం ఇంకే విషయాల జోలికి పోకపోవడం చాలా మంది దృష్టిలో మొనాటోనస్ కావొచ్చు. కానీ తన ప్రాంతంలో ఎన్ని సమస్యులున్నాయో? ఎంత తీవ్రంగా జనజీవనాన్ని అటు కరువు ఇటు పాలకుల కుట్రలూ ప్రభావం చూపుతున్నాయో తెలిసినవాడు కాబట్టి కేవలం ఆలోచనలన్నీ నీళ్ళ మీద ఈ కవి పెట్టేశాడు. అతని వస్తువు నీళ్ళు, కరువు మాత్రమే! కానీ ప్రతి కవితా దేనికదే భిన్నంగా పలుకుతుంది. ఇందులో రాయలసీమ మాండలీక పలుకు కూడా సవ్వడి చేస్తుంది. రాయలసీమ సంస్కృతిలో భాగమైన కళలు మనుషుల మధ్య బలమైన మానవ సంబంధాలని ఏర్పరచాయో ఈయన కవిత్వం చదివితే అర్థమౌతుంది. అది గుర్తు పెట్టుకున్న కవి కాబట్టి ఈ వస్తువుకి తగ్గభాష ఎంచుకొని “కొడకా! కొండమింద రాయడా!”( ఎంత ముచ్చటైన శీర్షికో!) అనే కవిత రాశాడు. ఈ కవితలో రాయలసీమ ఆహారపుటలవాట్లు, సంప్రదాయ కళలు, భక్తి పారవశ్యం, మత సామరస్యం, మొత్తం సీమ జనజీవిత సింహావలోకనం గా ఉంది. అట్లాగే రాయలసీమ భౌతిక పరిస్థితుల స్పృహ ఉండడం గమనించవచ్చు. ముఖ్యం అనంతపురానికి మల్లెల స్థానికుడు. ఆ స్థానికత సువాసనగా పుస్తకం నిండా అల్లుకుంది. అనంతపురం జిల్లా కు చెందిన భౌతిక, ప్రాకృతిక, సామాజిక అంశాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ కవిత్వం చదివాక ప్రతి పాఠకుడికీ అవును ఈ ప్రాంతానికో నది కావాలి అనిపిస్తుంది. అనంతపురం నుండి కరువు మాయమవ్వాలి అని అనిపిస్తుంది.