నీలీరాగం

2017 లో నంబూరి పరిపూర్ణగారి స్వీయచరిత్ర చదువుతుంటే ఆ ‘వెలుగుదారులలో’ తటస్థ పడిన రచయితలు నంబూరి సోదరులు. ఆమెకు స్వయానా అన్నలు. నంబూరి లక్ష్మయ్య లక్ష్మమ్మ ల అయిదవ బిడ్డ పరిపూర్ణ కు పెద్దన్న నంబూరి శ్రీనివాసరావు, చిన్నన్న దుర్వాసమహర్షి. వాళ్లిద్దరూ తమకుటుంబంలో తమ తరం కవులు, నాటక రచయితలు అని పేర్కొన్నారు ఆమె. పరిపూర్ణగారి పెద్ద కొడుకు దాసరి అమరేంద్ర నాకు మంచి సాహిత్య మిత్రుడు. మేనమామల రచనల ఆచూకీ ఏమైనా చెప్పగలడేమోనని అప్పుడే ఆయనను అడిగా. ప్రయత్నించారు కానీ ఫలితం లేక పోయింది. అయితే ఆ సోదర కవులగురించి అమరేంద్రగారు, నంబూరి శ్రీనివాసరావు గారి కూతురు ఝాన్సీ అందచేసిన సమాచారం విలువైనది. ఈ వ్యాసం ముగించి పంపించవలసిన ఈ చివరి రోజున కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు (1995) వంగాల సంపత్ రెడ్డి లైబ్రరీ నుండి తెచ్చి చదువుకొన్న దుర్వాస మహర్షి వ్రాసిన లోకాలకనం కావ్యం పై ఆనాడు వ్రాసుకొన్న నోట్స్(1995) సంగతి చెప్పి సంభ్రమాశ్ఛర్యాలకు గురి చేసాడు. ఆ నోట్స్ వెతికి తెచ్చి ఇచ్చి ఉన్నంతలో ఈ వ్యాసం సమగ్రం కావటానికి తోడ్పడ్డాడు.
1
నంబూరి సోదరులది కృష్ణా జిల్లా బొమ్ములూరు. పెద్దవాడు శ్రీనివాసరావు. 1917 లో మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి జయంతి నాడు పుట్టాడు. తండ్రి లక్ష్మయ్య దాసు నటుడు. తండ్రి దగ్గర బాల్యంలోనే నటనలో శిక్షణ పొందాడు. లోహితాసుడుగా నటించాడు. ఏలూరులో ఫిఫ్త్ ఫారం చదువుతూ గాంధీజీ పిలుపును అందుకొని చదువు వదిలి 1930 నాటి కాకినాడ ఉప్పు సత్యాగ్రహంలో వాలంటీరుగా పాల్గొన్నాడు. కళా వెంకట్రావు ప్రేరణతో తూర్పు గోదావరి జిల్లా రాజోలు ఏరియాలో కాంగ్రెస్ కోసం పనిచేశాడు. కాంగ్రెస్ నుండి సోషలిస్టు పార్టీ ఏర్పడప్పుడు దానిలోకి మారాడు. ఆ తరువాత అందులో నుండి కొందరు కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడ్డప్పుడు శ్రీనివాసరావు అందులో చేరాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా మలికి పల్లి గ్రామం లో కమ్యూనిస్టు పార్టీ తాలూకా బాధ్యుడుగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలోను, కృష్ణా జిల్లాలోనూ పార్టీని పటిష్టం చేయాటానికి ఊరూరా తిరుగుతూ పని చేసాడు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకువెళ్ళటానికి బుర్రకథ వంటి ప్రజా కళా రూపాలను ఎంచుకున్నాడు. అల్లు రామలింగయ్య, చదలవాడ కుటుంబరావు లతో కలిసి తాను ప్రధాన కథకుడుగా విశేషంగా కృషి చేసాడు. బుర్రకథలు చెప్పటమే కాక పాటలు పాడటం, ప్రసంగించటం ఆయనకు చక్కగా అలవడిన కళలు. ఆ క్రమం లోనే మహీధర రామ్మోహనరావుతో శ్రీనివాసరావుకు మైత్రి బలపడింది.

ప్రభుత్వ నిషేధం వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో పార్టీ పత్రిక స్వతంత్ర భారత్ ను రహస్యంగా అచ్చువేసి పంపిణీ చేస్తుండేవాళ్లు. అమలాపురం లో అలా పత్రికను పంపిణీ చేస్తూనే శ్రీనివాసరావు పోలీసులకు పట్టుబడ్డాడు. అరెస్టు చేసి ఆయనను రాయవెల్లూరు జైలుకు పంపారు. అక్కడినుంచి కడలూరు, రాజమండ్రి సెంట్రల్ జైళ్లకు మార్చారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేవరకు ఏడేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. రెండవ ప్రపంచయుద్ధం 1939లో మొదలై 1945 లో ముగిసింది. ఏడేళ్లు జైలులో ఉన్నాడంటే 1938 నాటికే అరెస్ట్ అయి ఉంటాడు. అంటే అప్పటికి ఆయనకు 20 ఏళ్ళు. జైలు జీవితంలో దర్శి చెంచయ్యగారితో పరిచయం కలిగి అది గాఢ స్నేహంగా పెరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య , చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి , డాంగే వంటివాళ్ళు జైల్ మేట్స్. జైలు నుండి విడుదలైన తరువాత పార్టీ హోల్ టైమర్ గా పని చేసాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కమ్యూనిస్టు పార్టీ సాయుధపోరాట మార్గాన్ని వదిలి పార్లమెంటరీ ప్రాతినిధ్య విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. దేశానికి స్వతంత్రం వచ్చాక 1955 లో జరిగిన శాసన సభ ఎన్నికలలో శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎంఎల్ఏ అయినాడు. అయ్యదేవర కాళేశ్వరరావు సభాపతిగా, నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా (1956 నవంబర్ 1 – 1960 జనవరి 11) ఉన్న ఆ శాసన సభలో దామోదరం సంజీవయ్యతో కలిసి పనిచేశాడు శ్రీనివాసరావు. హాస్యపూరిత చమత్కార సంభాషణలకు ఆయన పెట్టింది పేరు.

అప్పటి శాసన సభలో హరిజనులను పూజారులుగా నియమించాలనే ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాకాని వెంకటరత్నం వ్యతిరేకించాడు. వేముల కూర్మయ్య , ఈశ్వరీబాయి, జగన్నాధరావు మొదలైన వాళ్ళతో కలిసి శ్రీనివాసరావు భగవద్గీత శ్లోకాలు రాగయుక్తంగా చదివి దళితులు ఎందుకు అర్హులు కారు అన్న సవాల్ విసిరాడు. కాకాని భగవద్గీత శ్లోకం చదవలేక మౌనం వహిస్తే శ్రీనివాసరావు వారికి హరిజనోద్ధరణపై శోకమే గానీ శ్లోకం పలకదని చమత్కరించారుట. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ( 1960 జనవరి11- 1962 మార్చ్ 12) నిరుపేదలకు దళితులకు భూమి పంపకం కోసం వేసిన త్రిసభ్య కమిటీలో సభ్యుడుగా చురుకైన పాత్ర నిర్వహించాడు. అంబేద్కర్ ను కొవ్వలి తీసుకువచ్చి సన్మానించటంలో కూడా ఆయన పాత్ర ఉంది. హరిజనోద్ధరణ జరగాలంటే అగ్రకుల ఆభిజాత్య అహంకార దౌష్ట్యాలకు స్వస్తి పలకాలంటే మన జన బలం కావాలని మాలమాదిగ శాసన సభ్యులతో, మంత్రులతో కలిసి విజయవాడలో సభపెట్టి సంఘీ భావం ప్రకటించాడు శ్రీనివాసరావు.

పివి నరసింహారావు, నూకల రామచంద్రారెడ్డి, జి. వెంకటస్వామి, కోదాటి రాజమల్లు, అల్లూరి సత్యనారాయణ రాజు, పివిజి రాజు, రాజమానీదేవి, మోతే వేదకుమారి, చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్, నూజివీడు రాజా ఎం ఆర్ అప్పారావు వంటి వాళ్ళు ఆయనకు సమకాలికులు, సన్నిహితులు. కొంగర జగ్గయ్య, చదలవాడ, నాగభూషణం ఆయన భార్య సీత, రేలంగి, సూరిబాబు ఆయన భార్య రాజరాజేశ్వరి, ఈలపాట రఘురామయ్య వంటి సినిమా నాటక కళా బంధు బృందంతో ఆయన సంబంధాలు దృఢమైనవి. ఏలూరులో నాటకాలు వేయించేవాడు.

శ్రీనివాసరావు అలలు అనే గేయ సంపుటిని , శ్రీనివాస పద్యమంజరి అనే శతకాన్ని రచించాడు. శ్రీనివాస పద్యమంజరి అస్పృశ్యతా నివారణ ప్రబోధ శతకం. జై పతాక్ , ప్రజావిజయం అనే రెండు నాటకాలు రచించాడు. వీటి ప్రచురణ వివరాలు తెలియరావడం లేదు. జయభేరి బుర్రకథ అముద్రితం. బుర్రకథను హరికథను అనుసంధానం చేసి సిరికథ అనే కొత్త ప్రక్రియను రూపొందించిన ప్రయోగశీలి. అది లభిస్తే గానీ దాని స్వరూప స్వభావాలు అవగతం కావు. కొంగర జగ్గయ్య, ముక్తి , తాను పాత్రధారులుగా , వివిధ ప్రాంతాలలో తాను రచించిన జై పతాక్ నాటకాన్ని అనేక సార్లు ప్రదర్శించాడు. ఈ కళా దృష్టి కారణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగంలోకి ప్రముఖ నృత్య కళాకారులు కోరాడ నరసింహారావుగారి నృత్య ప్రదర్శనలను భాగం చేసాడు.

అత్తోటి రత్నకవి, గుర్రం జాషువా, బోయి భీమన్న ఆయనకు సన్నిహితులు. గోరా, తాపీ ధర్మారావు, దాశరధి , కాళోజి, సి. నారాయణరెడ్డి, మల్లెమాల, రావూరి భరద్వాజ , జ్ఞానానంద కవి మొదలైన వాళ్ళతో కవిత గోష్టులు చేసేవాడు.
చివరి రోజులలో ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాడు. ఎమ్మెల్సీ కూడా. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి (1964- 1971) యాభై రెండేళ్ల వయసులోనే 1969 లో శ్రీనివాసరావు మరణించాడు.
2
నంబూరి దుర్వాస మహర్షి 1920 లో పుట్టాడు. అన్న గారు కమ్యూనిస్టు రాజకీయాలలో తలమునకలుగా ఉన్నందున ఎనిమిదవ తరగతితో చదువు ఆపేసి ఇంటి వ్యవసాయపు పనుల బాధ్యత తీసుకోవలసి వచ్చింది. కవిత్వం పట్ల అభిరుచి ఆయనను పద్య రచనకు ప్రేరేపించింది. కందపద్యాలు , ఆటవెలదులతో ప్రారంభించి చంపక మాల, ఉత్పలమాల వంటి వృత్తాలు సీసపద్యాలు వ్రాయటం వరకు ఎదిగాడు. తాను వ్రాసిన పద్యాలు ఇంట్లో వాళ్లకు చదివి వినిపిస్తుండే వాడు. అన్నగారి ప్రభావమో , కాల ప్రభావమో 1940 నాటికి ఆయన కూడా కాంగ్రెస్ లో పనిచేయటం మొదలు పెట్టాడు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆగస్టు విప్లవం లో పాల్గొన్నాడు. అరెస్ట్ అయి రెండేళ్లు బళ్లారి జైలులో గడిపాడు. తిరిగి వచ్చిన తరువాత ఆయన రచనా వ్యాసంగంపై దృష్టి పెట్టాడు. జాషువాకు ఏకలవ్య శిష్యుడు అయినాడు. అన్నగారి వలె కవి, గాయకుడు, ఉపన్యాసకుడు.

సమాజపు అట్టడుగున మెసిలేవారి కష్టనష్టాలు చిత్రిస్తూ నిరుపేద, లోకాలోకనం, అంబేద్క రీయం మొదలైన కావ్యాలు వ్రాసాడు. నిరుపేద తొలి ప్రచురణ ఎప్పుడో తెలియదు. 1969 నాటి అయిదవముద్రణ వెనక అట్ట మీది సమాచారాన్ని బట్టి పిల్లి శాంసన్ ఇది 50 వ దశకంలో ప్రచురించబడి అస్పృశ్యతా నివారణ ప్రచార సాధనంగా ప్రసిద్ధికి ఎక్కిందని నిర్ధారించాడు. నేటి సమాజంలో గల హెచ్చుతగ్గులు , జాతి కుల భేదాలు కృత్రిమాలు,అనర్ధక పూర్వక అన్యాయాలు అని నమ్మి వాటిని నిరసిస్తూ ఈ కావ్యం వ్రాసాడు. నిరుపేద పైగా దళితుడు. శ్రమదోపిడీకి అస్పృశ్యతకు ఏక కాలంలో గురి అవుతూ గడిపిన దుర్భర జీవితాన్ని వర్ణించాడు. అందరిలాగే పుట్టి కటిక పస్తుల బతుకు తనకెలా దాపురించింది అన్న ప్రశ్న కారణాలను తెలుసుకొనేట్లు చేసింది. అన్నీ ఉన్నవాడు తన ఏమీ లేనితనానికి కారణమని అర్ద మైంది. ఉన్నవాడిని సంబోధించి నీ భోగినీ మహల్ కోసం నాయిల్లు, నీభార్య మెడలోని నీలాల హారాలకోసం నాభార్య మెడలోని నల్లపూసలు నాశనమయ్యాయని చెప్తాడు. నీ బొజ్జ నిండటం కోసం నా డొక్కలు మాడుతున్నాయని, నీ బిడ్డల అభివృద్ధి కోసం నా బిడ్డలు ఎండలో మాడి చస్తున్నారని చెప్పుకొన్నాడు. ఇలాంటి పద్యాల రచనలో జాషువా ప్రభావం బలంగా కనబడుతుంది. దోపిడీ దార్లను ఎదుర్కొనటానికి కష్టజీవుల ఐక్యతను కాంక్షించాడు కవి. స్వేచ్ఛకోసం ఆందోళనకు పిలుపు ఇచ్చిన నిరుపేద మరణం తో కావ్యాన్ని ముగించటం సముచితంగా అనిపించదు. ఈ నిరుపేద కావ్యాన్ని జాషువా ఇష్టపడ్డాడు.

“ఏబది మూడు వత్సరములిప్పుడమిన్ దిరుగాడి యుండినే
రేబవలున్ విలోకన పరిశ్రమ జేసితి ; జూచితిన్ గటా !
రాఁ బులుగుం గమిం బలె ; నిరంతరమును నిరుపేద మాంసమున్
గాబులఁ ద్రొక్కి మెక్కెడు బకాసుర సన్నిభులౌ మనుష్యులన్ “ ఇది లోకాలోకనం కావ్యంలోని పద్యం. 1920 లో పుట్టిన వాడు ఏబది మూడు సంవత్సరాలు లోకాన్ని చూసి తెలుసుకొన్న విషయాన్ని కవిత్వంగా వ్రాస్తున్నానని అంటే 1973 లో ఈ కావ్యం వచ్చిందనుకోవాలి. ( 1971 అని పిల్లి శాంసన్) లోకాలోకనం అంటే లోకాన్ని ఆలోకనం చెయ్యటం. లోకాన్ని లోతుగా చూడటం, నిశితంగా చూడటం అన్నమాట. లోకాన్ని పరిశీలిస్తే ఆయనకు ఏమి కనిపించింది? హింస, పగ, అశాంతి, అన్యాయం, అక్రమం, అవినీతి. లోకం నాగరికత నుండి అనాగరికం వైపు తిరోగమించటం కనబడింది. జ్ఞానం నుండి అజ్ఞానానికి , ధర్మం నుండి అధర్మానికి న్యాయం నుండి అన్యాయానికి పరుగులు పెడుతున్న మానవలోకం చూస్తూ వేదన పడిన కవి ఈ సమాజంలో కుళ్ళు ఏ స్థాయిలో, ఏవిధంగా ఉందో వివరిస్తూ దానిని కూకటి వ్రేళ్ళతో పెళ్లగించి శ్రమించి పంటలు తీసేవాడి జీవితాన్ని సుఖమయం చెయ్యాలన్న ఆకాంక్షతో వ్రాసిన కావ్యం లోకాలోకనం.

కరుణాలేశము కానుపించదని బాధపడ్డాడు. నిరంకుశ ప్రభుతలేకంబౌచు ప్రజలను మరణావస్థల పాలు చేస్తున్నాయని నొచ్చుకొన్నాడు. వంచన చేయకుండా, తలవంచి పరుని కొనియాడకుండా కూడుగడించే మార్గం లేకుండాపోయిందని వేదన పడ్డాడు.
“మతమొక మత్తుమందు , తలమాసిన పాడు కులాలు నెత్తురుల్
గుతిక లకంట గ్రోలుకొను క్రొవ్విన పెద్దపులుల్ ,ప్రభుత్వముల్
ముతక కసాయి కత్తు; లవి మూడును గూడిన చోట” సజ్జనులు బ్రతకుటెట్లు అని ఆందోళన ప్రకటించాడు. మతం , కులం , రాజ్యం మూడింటినీ ప్రమాదకర శక్తులుగా దుర్వాస మహర్షి గుర్తించటం చూస్తాం. ఎన్నో రాజ్యాలు అంతరించటం, రాజేంద్రులు , వారి సింహాసనాలు కాలగర్భంలో కలిసి పోవటం చరిత్ర పొడుగునా కనిపిస్తుంది. కానీ ‘లోకానర్ధక వ్యర్ధ సంపన్నులు’ కళ్ళుండీ ఈ నిజాన్ని గ్రహించక ప్రవర్తించటాన్ని గర్హించాడు.

చలి చీమలను గూడ ( జంప జేతులు రాని సత్యస్వరూపులీ స్వాములంట అని ప్రారంభమయ్యే సీస పద్యంలో అంత జ్ఞానులు అయిన స్వాములు కర్మ సిద్ధాంతం పేరు చెప్పి పేదల విషయంలో కన్నెత్తి చూడక, పెదవి విప్పి మాటాడక తప్పించుకొనటం ఏమిటని నిరసించాడు. అంటరాని వారిని ఆదరించి భక్తి మార్గంలో కలుపుకొని గౌరవించిన ఆదిశంకరుడు రామానుజుడు వంటి మహనీయ మూర్తులు మసిలిన చోటు అంధకారంలో చిక్కుకుపోవటం ఏమిటని బాధపడ్డాడు.

స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న కవి పాతికేళ్ల స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్న కవి ఆ నాటి లక్ష్యాలకు ఈ నాటి ఆచరణకు మధ్య ఉన్న లోయను చూస్తూ పడిన వేదన కూడా పద్య రూపం దాల్చింది. ‘సామ్రాజ్యవాదుల చండాగ్ని కీలల బడి’ భారతదేశం ఆర్ధికంగా , సాంస్కృతికంగా ఎంత పీడనను అనుభవించిందో చెప్పాడు. ఘనమైన చరిత్ర , సిరిసంపదలు ఉన్న దేశం పారతంత్య్రంలో పడిపోతే దానిని విముక్తం చేసుకొనటానికి ప్రజలు ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి స్వాతంత్య్ర సమరం కావించారో వర్ణించాడు. భారతదేశం , పాకిస్థాన్ విడిపోవటం గురించి బాధపడ్డాడు. విడిపోతే విడిపోనీ కానీ ‘సంతత మదోద్రేకాలతో’ శాంతి లేకుండా చేసుకొనటమేమిటని వాపోయాడు. రెండుదేశాల మధ్య కార్పణ్యం ఆరిపోవటం ఎట్లా అని దిగులు పడ్డాడు.

స్వాతంత్య్ర సమర సమయాన అనుకున్నవి ఏవీ ఆచరణలోకి రాకపోవటాన్ని గురించిన ప్రత్యక్ష సాక్షి కథనం వంటి పద్యాలు లోకాలోకనంలో ఉన్నాయి. తెల్ల దొరల బూట్లు నల్లగా తుడిచిన వాళ్ళే షావుకార్లు కావటం, ఆంగ్లేయులకు మిత్రులై జాతినమ్మిన వాండ్లు రాజదూతలు కావటం ఆయన గుర్తించాడు కనుకనే “ తెల్లదొరలు మారి నల్ల దొరల పాలబడియె నీ స్వాతంత్య్ర భారతము” అని చెప్పగలిగాడు. ‘పేరు మార్పు కు మాత్రమే పోరినామా’ అని నిర్వేదానికి గురి అయ్యాడు. స్వాతంత్య్రం నిరాశ్రయులకు అండగా ఉంటుందన్న గాంధీమాట , సోషలిజం లక్ష్యంగా సమానత సాధన అన్న నెహ్రు మాట, కులతత్వం కూలిపోతుందన్న పెద్దలమాట, అంటుదోషనివృత్తి ఆవశ్యకమన్న సంస్కర్తల మాట, సర్వోదయ బాట అన్నీ స్వతంత్ర భారతంలో గాలిలో కలిసి , నీటమునిగి అభావం అయిపోవటాన్ని గుర్తించి చెప్పాడు. ఆదర్శాన్ని ఆచరణగా మలచని స్వతంత్రం అధికార మార్పిడి కాక మరేమవుతుంది!?
“ స్వాతంత్య్ర సాధనాఖ్యాతమౌ కాంగ్రెస్
స్వార్ధపరులకు ఛత్ర ఛాయ యయ్యె !
విప్లవంబని యార్చి విర్రవీగిన సామ్య
వాద పక్షము పక్షవాతమొందె !
సోషలిజమ్మంచు ఘోషిల్లి , ఘోషిల్లి
సోషలిస్టు నేల సోలి కూలె !
కార్మిక కర్షకాఖ్యను రూపు దాల్చిన
రైతు కూటమి రూపరహితమయ్యె !
జనతనుద్దీపనం చేసి ఘనములైన
కార్యముల (జేయ ముందుకు ( గదల ( జేయు
నాయకులు లేరు నేడు వినాయకాళి
పాల బడియెను తల్లి మా బ్రతుకులిచట “
అని కవి కొత్తనాయకత్వం కోసం ఎదురు చూపులు చూస్తున్న ఆ తరుణానికి నక్సల్బరి వెలుగులో ప్రత్యామ్నాయ నాయకత్వం రూపొందు తున్న దృశ్యం గమనించే ఉండాలి.

రాజకీయంగా వేరుపక్షానికి చెందిన ఎమ్ ఆర్ అప్పారావు తోను భావజాలపరంగా విభేదించే విశ్వనాధ సత్యనారాయణతో కూడా దుర్వాస మహర్షికి మంచి సంబంధాలు ఉండేవి. బోయి భీమన్నతో స్నేహం కొనసాగింది. సాక్షత్కారం, స్వయంవరం ఆయన అసంపూర్ణ రచనలు. సారళ్యం, సూటిదనం ఆయన కవితా గుణాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్వాస మహర్షికి కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చి గౌరవించింది. 1985 లో ఆయన మరణించాడు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply