కవిత్వం కొన్నిసార్లు ధిక్కారస్వరంతో సమాధానమిస్తుంది. అరవై సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1959, పాకిస్తాన్ లో నియంత అయూబ్ ఖాన్ సైనిక పాలన నెలకొల్పిన ఏడాది తర్వాత రేడియోలో ఒక కవిసమ్మేళనం జరిగింది. వివాదాలవైపు మళ్ళని కవులు ప్రకృతి గురించీ, ప్రేమ గురించీ కవిత్వం రాసి చదువుతున్నారు. అప్పుడు వినిపించిందొక యువ కంఠం…
సుడులు తిరుగుతున్న టియర్ గ్యాస్ పొగలు ఒకవైపు
కురుస్తున్న తుపాకీ తూటాల వాన ఇంకొకవైపు
కనిపించని ఈ కాళ రాత్రిలో
ఏమని పొగడాలి నీ గురించి?
అంతే, అంతటితో ఆ కవి సమ్మేళనం ప్రసారాన్ని అప్పటికప్పుడు ఆపేశారు.
1962లో జనరల్ అయూబ్ ఖాన్ పాకిస్తాన్ లో కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు హబీబ్ జాలిబ్ రాసిన దస్తూర్ కవితలో కొన్ని పంక్తులివి…
మరణ శిక్షలకి భయపడేవాడిని కాను
నేను సిద్ధంగానే వున్నాను, వాళ్లకు చెప్పండి
జైలు గోడలని చూపి భయపెడతావెందుకు
జులుం చెలాయించే మాటలనీ
మూఢత్వం ఆవరించిన రాత్రినీ
నేను ఒప్పుకోను, లోబడి లొంగిపోను
కొమ్మలపై పూలు పూస్తున్నాయని చెబుతావు నువ్వు
మధుపాత్రలు నిండిపోయాయని చెబుతావు నువ్వు
గాయాలు మానిపోయాయని చెబుతావు నువ్వు
సిగ్గుమాలిన అబద్ధాలనీ, తెలివిమాలిన కబుర్లనీ
నేను ఒప్పుకోను, లోబడి లొంగిపోను
శతాబ్దాలపాటు మా శాంతిని కొల్లగొట్టావు
ఇంకా నీ పెత్తనమిక మాపై చెల్లదు
నొప్పిని మాయం చేసే వైద్యుడివలే నటిస్తావెందుకు?
నువ్వు నయం చేసేవాడివేమీ కాదు
ఎవరు ఎంతగా నిన్ను నమ్మినా
నేను ఒప్పుకోను, లోబడి లొంగిపోను
అయూబ్ ఖాన్ పాలన ముగిసిపోయి, జనరల్ యాహ్యా ఖాన్ అధికారంలోకి వచ్చాక, దాదాపు పదేళ్ల విరామం తర్వాత హబీబ్ జాలిబ్ ని మరోసారి కవి సమ్మేళనానికి పిలిచారు. ఈ సారి తనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగూడదని, హాస్య కవిసమ్రాట్ గా పేరుపొందిన విదూషక కవి దిలావర్ ఫిగార్ తన కవిత్వం చదివిన తర్వాత హాబీబ్ జాలిబ్ ని పిలిచారు. అప్పుడు అందుకున్నాడు…
నీకన్నా ముందు ఒకడు
ఇంతే అధికార మదంతో కైపెక్కి
తానే దేవుణ్ణనే భ్రమలో ఉండేవాడు
గర్వంతో, అధికారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఎలా కూలిపోయారో
జనం వైపు నిలబడ్డవాళ్లనడిగితే చెబుతారు.
హబీబ్ జాలిబ్ రాసిన ఇంకో కవిత బలమైనది…
హత్యకి ఎందుకుగురయ్యావని మాపైనే నేరారోపణ
హతుడే ముద్దాయి ఇక్కడ
ఇప్పుడిక న్యాయవాదుల మధ్య చర్చ
పాపం హంతకునికి చిన్నపాటి గాయం
కత్తికి కొంచెం నెత్తుటి గాటు
ఎవరు దీనికి మూల్యం చెల్లించాలా…
అని తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) సైనిక చర్య సందర్భంగా తాను రాసిన కవితలు ఎప్పటికీ గుర్తు చేసుకోవాల్సిన కవితలు.
తుపాకీ తూటాలతో ప్రేమని నాటాలని చూస్తున్నావు నువ్వు
నెత్తుటి నదులతో భూమి ముఖాన్ని కడగాలనుకుంటున్నావు నువ్వు
పరిష్కారానికి దారి దొరుకుంటుందని నువ్వనుకుంటున్నావు
గమ్యాన్ని కోల్పోతున్నావని నేననుకుంటున్నాను
***
సూర్యుడి కిరణాలు గాయపరుస్తున్నాయి
చంద్రుడి వెన్నెల దగ్ధం చేస్తున్నాయి
అడుగడుగునా పరుచుకుంటున్న మృత్యువు నీడలు
జీవితం మృత్యువు రూపంలో నడయాడుతున్నది
నాలుగు వైపులా వీచే గాలి విల్లంబులతో తిరుగుతున్నది
పూలతోట తోటంతా రక్తసిక్తమైంది
చితికిపోయిన పూల మొగ్గలు, నెత్తుటిలో తడిసిపోయిన చిగురుటాకులు
ఎన్నాళ్ళు కురిసేను ఈ అశ్రు ధారల వర్షం
ఎప్పుడు ముగిసేను ఈ దుఃఖపు దివారాత్రాలు
బలవంతులు నెత్తురుతో హోలీలాడుకుంటున్నారు
పూలతోట తోటంతా రక్తసిక్తమైంది
నియంతల పాలనలో అనేక సంవత్సరాలు జైలు నిర్బంధాలలోనే గడిపిన నిఖార్సైన ప్రజా కవి హబీబ్ జాలిబ్. నేపథ్యాలు, వ్యక్తులు, పాలకులు ఒక్కోసారి వేరు, వేరుగా అనిపించవచ్చు. సామ్యం ఒక్కటే, గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది.
బాగుంది ధిక్కార కవిత్వం. అచ్చం అట్లనే ఉన్న మరొకడిని గుర్తుకు తెచ్చుకుంటూ చదువుకుంటే మరింత బాగుంది.
విమల
పాలకులు వేరు కానీ సామ్యం ఒక్కటే.ఖచ్చితంగా గుర్తుచేసుకోవాల్సిన సందర్భం.
Niyanthanu prashniche kavi Eppudu untadu. Nice poem
Excellent Kiran! Very contemporary and timely relevant. Excellent translation too. I too got inspired by your article and introduced some of his poems in Kavisangamam. Thank you for being my inspiration.
Thank you Swamy!