నిర్మలక్క

తినడం కోసం, రాత్రి ఓ నాలుగైదు గంటల నిద్ర కోసం మాత్రమే ఆగుతున్నారు. వారితో పాటు బరువులూ బాగానే వున్నాయి. జనాన్ని కలవకుండా పోతున్నారు కాబట్టి తిండి సరుకులు కూడా వాళ్లే మోస్తున్నారు. అప్పటికి మూడు రోజులు అవుతుంది అట్లా నడవబట్టి. వెంట ఉన్న సరుకులు అయిపోయాయి. తిండి తినాలంటే ఏదో ఒక ఊరిలో జనాన్ని కలవాల్సిందే.
ఆ దళానికి తోడు మంగ్డూ దళం వాళ్లు పది మంది మొత్తం ఇరవై మూడు మంది అయ్యారు. వీరుకాక జిల్లాకమిటీ మెంబర్‌ దస్రూ, స్టేట్‌కమిటీ మెంబర్‌ దేవేందర్‌ కూడా వున్నారు.
డిప్యూటీ కమాండర్‌ మంగ్డు దారిలో వచ్చే ఊర్లో ఆగుదామన్నాడు.
‘‘ఆ ఊరి వాళ్ళని కలవక ఆరేండ్లవుతుంది కదా. అక్కడ ఆగడం మంచిదేనా? అదీగాక చివరిసారి ఆ ఊరి పూజారిని కొట్టాం. ప్రజలను కలవలేదు. టౌన్‌తో వారికి దగ్గరి సంబంధాలుంటాయి కదా’’ కమాండర్‌ కేశాల్‌ సందేహం వెలిబుచ్చాడు.
‘‘ఇప్పటికే చాలా అలసిపోయాం. పొద్దుటి నుండి టిఫిన్‌ కూడా తినలేదు. పది కావస్తుంది. బియ్యం తెప్పించుకుని, తిని వెంటనే వెళ్లిపోదాం’’ డిప్యూటీ మంగ్డూ.
మంగ్డూ వేరే దళం డిప్యూటీ. గతంలో ఈ దళంలో పనిచేసాడు. స్థానికుడు. జనం మీద పట్టున్నవాడు. కాబట్టి అతని సలహా తీసుకుంటున్నాడు కమాండర్‌ కేశాల్‌.
అన్యమనస్కంగానే ‘సరే’ అన్నాడు కేశాల్‌. కేశాల్‌కు అంతకుమించి వేరే దారి కూడా లేదు. కేశాల్‌ దళం డిప్యూటీ నిర్మలక్కకు ఈ ఊర్లు అంతగా తెలియవు మరి.
ఊరి అంచునున్న అడవిలో మకాం వేసారు. ఊరికి, దళానికి మధ్య అడవి నరికి ప్లెయిన్‌గా వుంది.
మంగ్డూ వెళ్లి సెంట్రీ పోస్టు చూపించి వచ్చాడు. ఒకరు సెంట్రీ, మరొకరు సపోర్టు సెంట్రీ.
ఊర్లోకి ముగ్గురు వెళ్లి కలిసి వచ్చారు.
ఆ రోజు కిచెన్‌ డ్యూటీ పడ్డ మహేశ్‌ టీ పెట్టాడు. అందరూ టీ తాగారు. టెంట్లలో దూరారు.
ఆకాశమంతా మబ్బులు కమ్మి సన్నటి వాన జల్లు కూడా పడుతోంది.
మధ్యాహ్నం ఒంటిగంటయినా బియ్యం తీసుకుని రాలేదు ఊరివాళ్లు. ఎందుకైనా మంచిదని ఉంచిన కొంచెం బియ్యాన్ని జావ చేసిండు మహేశ్‌. అందరూ తాగారు.
జావ గ్లాసు పట్టుకుని నిర్మలక్క ‘‘ఇంతసేపయినా ఇంకా బియ్యం తేలేదు. ఎందుకని?’’ సందేహిస్తూ వచ్చి రాజీతో అంది.
నిర్మలక్క ఈ దళంలో డిప్యూటీ కమాండరే కాదు, డాక్టర్‌ కూడా. దళంలోనూ, జనం అనారోగ్యంపాలైతే సెలైన్స్‌ ఎక్కియ్యడం దగ్గర నుంచి మందులు, ఇంజక్షన్స్‌ ఇవ్వడం డాక్టర్‌ బాధ్యత. దళంలో కామ్రేడ్స్‌ ఎవరైనా జబ్బు పడితే ఫుడ్‌ బాధ్యత డాక్టరే చూసుకుంటారు. మెడికల్‌ కిట్టు కూడా నిర్మలక్క దగ్గరే వుంటుంది. పేషంట్లను పిల్లల్లాగా చూసుకుంటుంది. అంతేకాదు, తోటి కామ్రేడ్స్‌తో బాగా కలిసిపోయింది. అక్కది తల్లి మనసు.
నిర్మలక్కకు సుమారు ముప్పై ఎనిమిది ఏండ్లు వుండవచ్చు. మొదట్లో రాజకీయాలేమీ తెలియదు. పెద్దగా చదువుకున్నదీ లేదు. దళంలోకి వచ్చాకే చాలా నేర్చుకుంది. ఇంటి దగ్గరే పెళ్లయింది. ఒక పాప. వ్యవసాయ కుటుంబం. కష్టాలేమీ లేవు. పై సామాజికవర్గం. సంతోషంగా వుండేది. భర్త అప్పటికే ఉద్యమంలో తిరుగుతున్నాడు. నిర్బంధం పెరగడంతో భర్త పూర్తికాలం విప్లవోద్యమంలోకి వచ్చాడు. ఐదేండ్ల పాపను వదిలి తనూ దళంలోకి వచ్చింది. డిప్యూటీ కమాండర్‌గా ఎదిగింది. భర్త పైస్థాయి నాయకుడు.
భార్యాభర్తలు ఎవరు, ఏ స్థాయి అయినా ఎవరి జీవితం వారిదే, ఎవరి బాధ్యతలు వారివే. కలిసినప్పుడు మాత్రమే సహచరులు.
రాజీ కూడా బయటి నుంచి వచ్చిన కామ్రేడే. ఇరవై ఏడేండ్ల వయస్సు. పీజీ చదువు వదిలేసి పార్టీలోకి వచ్చింది. అడిగి మరీ అడవిలోకి వచ్చింది. రాజీ కూడా సాక్‌ (స్కాడ్‌ ఏరియా కమిటీ) మెంబర్‌.
దళానికి ముగ్గురి నుంచి ఐదుగురు వరకు ఈ సాక్‌ మెంబర్స్‌ ఉంటారు. కమాండర్‌, డిప్యూటీ కమాండర్‌ ఇందులోని వారే. దళం ఏదీ చేయాలన్న వీరు కూచుని మాట్లాడుకుంటారు.
నిర్మలక్కకు, రాజీల మధ్య తెలియని ఆప్యాయత వుండేది. అట్లని ఎక్కువ మాట్లాడుకునేవారు కాదు. బయటి కామ్రేడ్స్‌ కాబట్టి క్లోజ్‌గా వుంటున్నారనే విమర్శ వస్తదనే బెరుకు ఇద్దరిలో ఉండి ఉంటది.
‘‘నాక్కూడా కొంచెం డౌట్‌గా వుందక్కా. ఒకసారి ఊర్లోకి పంపి పరిస్థితి తెలుసుకొని వస్తే బాగుంటదేమో’’ రాజీ అంది.
‘‘ఇంగో పది నిమిషాల్లో రాకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిదనిపిస్తుంది నాకు’’ అంది నిర్మలక్క.
‘‘మరి కమాండర్‌కి చెప్దామా’’ రాజీ అడిగింది.
మాట్లాడుతూ ఊరివైపే చూస్తూ వున్న నిర్మలక్క ‘‘అదిగో దాదలొస్తున్నరు’’ అన్నది.
ఊరి దాదలు బియ్యం తేగానే కడిగి అప్పటికే మరుగుతూ వున్న నీళ్లలో వేసాడు మహేశ్‌. గంటలో వంట చేయడమూ, తినడమూ అయిపోయాయి.
‘‘ఎందుకని ఊరివాళ్లు ఇండ్ల చివర నిలబడి చూసి వెళుతున్నారు?’’ కేశాల్‌ దగ్గరికి వెళ్లి అడిగింది రాజీ.
పొద్దున కేశాల్‌, మంగ్డూ మాట్లాడుకునేటప్పుడు రాజీ కూడా అక్కడే ఉన్నది. అదీగాక నిర్మలక్క డౌట్‌ వ్యక్తం చేయడం వల్ల రాజీ ప్రతిదాన్ని గమనించడం మొదలుపెట్టింది. రాజీకి అంతా అనుమానస్పదంగా తోస్తున్నది.
కామ్రేడ్స్‌ అందరూ అన్నం తిన్నారు. కిట్లు సర్దుకున్నారు.
వచ్చిన ఊరి దాదాలతో మంగ్డూ మాట్లాడుతు కూచున్నాడు. మిగిలిన అన్నాన్ని ఒకరిద్దరు మాత్రమే కూచుని తింటున్నారు ఊరివాళ్లు. వాళ్లయిపోయిన తర్వాత మరొకరు తింటున్నారు. అందరూ కూచొని ఒక్కసారే తినకుండా ఇట్లా తింటున్నారేంది? కావాలనే వాళ్లట్లా ఆలస్యం చేస్తున్నారా? మనసు మీదికి వచ్చీ రానట్టుగా ఉంది రాజీకి.
వెళ్లి సెంట్రీ పోస్టును చూసి వచ్చి, దాదాలతో మాట్లాడుతున్న మంగ్డూని అడిగింది ‘‘సెంట్రీ పోస్టును బయట పెట్టినవు?’’ తెలుగులోనే అడిగింది.
‘‘అది ఎండిపోయినా చాలా లావు మాను. అందుకని అక్కడ పెట్టిన’’ మంగ్డూ.
దళంలో ఉన్న ఆదివాసీ కామ్రేడ్స్‌కు కమ్‌ సే కమ్‌ నాలుగు భాషలు తప్పక వస్తాయి. అంతకంటే ఎక్కువ కూడా వస్తాయి. గోండీ, తెలుగు, హిందీ, హల్బీ, ఛత్తీస్‌గడీ. తెలుగునైతే రెండు, మూడు నెలల్లోనే నేర్చేసుకుంటారు చాలామంది.
‘‘సెంట్రీ పోస్టు బయటికే కనిపిస్తుంది. చెట్ల అంచున పెడితే బాగుంటది కదా’’ రాజీ మళ్లీ అడిగింది.
‘‘ఏం కాదు. కాసేపయితే వెళ్లిపోయేదే కద’’ మంగ్డూ సమాధానం.
డిప్యూటీ కమాండర్‌ పెట్టిన సెంట్రీ పోస్టును మార్చాల్సి వస్తే అతను లేదా కమాండర్‌ మాత్రమే మార్చాల్సి వుంటుంది. లేదంటే అలాగే కొనసాగుతుంది.
నిర్మలక్క కోసం వెతికింది కానీ, కనిపించలేదు.
మిగతా కామ్రేడ్స్‌ టెంట్లలో కునుకు తీసారు. ఎక్కువ నడకవల్ల కూడా అందరూ అలిసిపోయి వున్నారు. రెగ్యులర్‌ దళంవాళ్లు మధ్యాహ్నం నిద్రకు అసలు టైమే వుండదు. ఇప్పుడు ఏదో ప్రత్యేకమైన పని మీద పోతుండడం వల్ల జనాన్ని కలవడం లేదు కాబట్టి టైముంది వాళ్లకు. అందుకే ఇలా కునుకు తీస్తున్నారు.
రాజీ అక్కడి నుంచి వెళ్లిపోయి పడుకుంది. తనకు పీరియడ్స్‌ కూడా. నిర్మలక్క మూడు గంటల టైమ్‌లో వచ్చి రాజీని లేపింది.
‘‘సెంట్రీ వెళ్తావా రాజీ’’
‘‘ఆ… వెళ్తానక్కా’’ అని లేచి కూర్చుంది రాజీ. విపరీతమైన బాడీ పెయిన్స్‌ వున్నాయి.
రాజీ కదలికలను గమనించిన నిర్మలక్క ‘‘సరేలే. ఇప్పుడు నేను వెళ్తా. సాయంత్రం వేరే ఊరికి వెళ్లగానే నువ్వే సెంట్రీకి పోదువుగానీ’’ అన్నది నిర్మలక్క.
‘‘పర్వాలేదక్కా. వెళ్తాను’’ రాజీ.
‘‘వద్దులే. నేను వెళ్తున్నా’’ నిర్మలక్క.
‘‘సపోర్టు సెంట్రీ ఎవరున్నరక్కా’’ రాజీ అడిగింది.
‘‘రాంబాయి’’ అంది నిర్మలక్క.
రాంబాయి… మంగ్డూ సహచరి.
‘‘సెంట్రీ పోస్టు అందరికీ కనిపించేలా బయట పెట్టిండ్రేందక్కా’’ రాజీ గుర్తుచేసింది నిర్మలక్కకు. తను కూడా డిప్యూటీ కాబట్టి మార్చితే మార్చవచ్చు.
‘‘ఆ… ఇంకాసేపట్లో వెళ్లేదే కదా’’ నిర్మలక్క. తను కూడా బాగా అలసిపోయింది.
ఏందో అంత అనీజీగా వుంది. టైమ్‌ చూసింది. మూడుంపావు. ఎట్లాగూ ఇంకో పావుగంటలో విజిల్‌ వేస్తారు, సర్దుకొమ్మని. నిద్రపోలేదు కానీ కిట్టు మీద తలవాల్చింది కాసేపు రాజీ.
ఊరివాళ్లు వెళ్లిపోయారా అని టెంట్‌ బయటికి తలపెట్టి చూసింది. అందరూ వెళ్లిపోయారు. మంగ్డూ కూడా నిద్రపొయినట్టున్నాడు. కనిపించడం లేదు.
రాజీ లేచి తన పాలిథిన్‌ మడతపెట్టి కిట్టులో పెట్టుకుంది, కిట్టుని తీసుకెళ్లి ఓ రాయి మీద పెట్టుకుంది. ఓ పుస్తకం మాత్రం తీసి బయట పెట్టుకుంది, వెళ్లేవరకు చదువుకోవచ్చు కదా.
ఒంటికి, రెంటికి… మహిళా కామ్రేడ్స్‌, పురుష కామ్రేడ్స్‌ ఎవరెవరు ఎటువైపు వెళ్లాలనేది దళం వచ్చీరాగానే వేసే రోల్‌కాల్‌లో కమాండర్‌ చెప్తాడు.
రాజీ లేచి, ఒంటికి వెళ్లి వచ్చింది. చెట్ల కొమ్మలు కదిలాయి. గబగబా ప్యాంటు వేసుకుని వచ్చేసింది.
కమాండర్‌ కేశాల్‌ దగ్గరికి వచ్చి ‘‘ఏం కామ్రేడ్‌! ఈ రోజు కామ్రేడ్స్‌ కన్‌ఫ్యూజ్‌ అయిండ్రా ఏంది?’’ అన్నది.
‘‘ఏమైందక్కా’’ కేశాల్‌ అడిగిండు.
‘‘మహిళా కామ్రేడ్స్‌ వెళ్లినవైపు వస్తున్నరు?’’ చెప్పింది రాజీ.
‘‘అవునా. అదేం లేదే. వచ్చినప్పటి నుంచి కరెక్టుగనే పోతున్నరు గదా. మీరు పొరబడ్డరేమో’’ కేశాల్‌ అన్నడు.
‘‘సరేలే దాదా. ఈసారి గట్టిగ చెప్పు’’ అంది రాజీ.
‘అట్ల ఎప్పుడు జరగలేదే’ అని రాజీ కూడా మనసులో అనుకుంది. అందుకే దాన్ని పొడిగించదలుచుకోలేదు. మరి, తనను చూసి వెళ్లిపోయినదెవరు? జంతువేమో లే అనుకుంది.
కిట్లు సర్దుకోండి అన్నట్టుగా కమాండర్‌ కేశాల్‌ విజిల్‌ వేసాడు. అందరు కిట్లు సర్దుకున్నారు. టెంట్లు కూడా సర్దారు. ఒకరిద్దరు ఒంటికి వెళ్లి వస్తున్నారు.
రాజీ రాయి మీద కూచుని పుస్తకం చదువుకుంటోంది.
విజిల్‌ శబ్దం రావడమూ, వెను వెంటనే ఒక తూటా పేలడమూ జరిగిపోయాయి. అందరూ అలర్ట్‌ అయ్యారు. ఎక్కడి వాళ్లక్కడ తుపాకుల మీద చేయ్యి వేసి చెట్లకు దగ్గరికి జరిగి నిలబడ్డారు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
దళం కామ్రేడ్సే ఒంటికి పోయిన దగ్గర మిస్‌ఫైర్‌ చేసినారేమో కొందరు అనుకున్నారు. కమాండరే వెళ్లడానికి ఫైనల్‌ విజిల్‌ వేసాడేమో అని మరికొందరు అనుకున్నారు. పెద్దగా ఆలోచించడానికి, సంప్రదించడానికి అవకాశమూ లేకపోయింది.
అంతే, అరనిమిషంలో ఒంటికి వెళ్లినవైపు నుంచి తూటాల వర్షం మొదలైంది.
కిట్టుకు కొద్దిదూరంలోని చెట్టు కొమ్మపై కూచుని చదువుకుంటున్న రాజీ…. వెంటనే పరుగెత్తికెళ్లి కిట్టుని, వాటర్‌ బాటిల్‌ని అందుకుని చెట్టు దగ్గరికి ఉరికింది.
‘‘కవర్‌లోకి వెళ్లు. కవర్‌లోకి వెళ్లు’’ అప్పటికే చెట్టు కవర్‌లో వున్న స్టేట్‌ కమిటీ సభ్యుడు కామ్రేడ్‌ దేవేందర్‌ అరుస్తున్నాడు.
కిట్టు తీసుకుని, తనకు చూపించిన కవర్‌ దగ్గరికి వెళ్దామనుకున్న రాజీ దేవేందర్‌ మాటలతో తనకు దగ్గర్లో వున్న చెట్టును కవర్‌ చేసుకుంది. దళం రాగానే ఎవరెవరి ‘కవర్స్‌’ ఎక్కడెక్కడో చెప్తది. రాజీకి కొత్తగాబట్టి పరిస్థితిని బట్టి కాకుండా కమాండర్‌ చూపించిన కవర్‌లోకి వెళ్దామనుకున్నది.
రెండు వైపుల నుంచి విపరీతమైన ఫైరింగ్‌.
సెంట్రీ పోస్టు మైదానంలో వుండటం వల్ల పది మంది కమెండోలు అటువైపు రాపిడ్‌ ఫైరింగ్‌తో దూసుకెళ్తున్నారు.
మొదటి తూటా పేల్చినప్పుడే నిర్మలక్క అలర్డ్‌ అయ్యి కొద్దిదూరంలో పడుకుని వున్న సపోర్టు సెంట్రీ రాంబాయి దగ్గరికి వెళ్లి లేపింది. తూటా సౌండ్‌కు కూడా మెలకువ రానంతగా అలసిపోయి నిద్రపోయింది రాంబాయి. రాంబాయికి ఇరవై ఏండ్లుంటాయి కావచ్చు.
రాంబాయి లేచే లోగా ఫుల్‌ ఫైరింగ్‌ జరుగుతుండటంతో పక్కనే వున్న చెట్లల్లోకి వెళ్లిపోయింది. నిజానికి సెంట్రీకి సపోర్టుగా నిలబడి తానూ ఫైరింగ్‌ చెయ్యాలి. కానీ ఆలోచించే టైమ్‌ లేదు. అప్పటికే రాంబాయి నడుమును చీల్చుతూ తూటా వెళ్లిపోయింది.
కమెండోలు సెంట్రీ పోస్టు మీద బాగా కాన్‌సన్‌ట్రేట్‌ చేసారు. ఒక్క టార్గెట్‌నైనా కొట్టవచ్చు. బహిరంగ ప్రదేశంలో వుండటం వల్ల టార్గెట్‌ స్పష్టంగా కనిపిస్తున్నది. ఓ ఇరవై ముప్పై అడుగుల దూరంలోనే అడవి వున్నది. నిజానికి సెంట్రీ పోస్టును అక్కడ పెడితే ఏ మాత్రం ఫరక్‌ పడేది కాదు. అడవి రక్షణగా వుండేది. ఫైరింగ్‌ నుంచి తప్పుకోవడానికి అనువుగా వుండేది.
రాంబాయిని లేపిన నిర్మలక్క మళ్లీ వెళ్లి అదే ఎండిన మానుకు నిలబడి ఫైరింగ్‌ ఓపెన్‌ చేసింది. ఊరివైపు నుంచి ఒక బ్యాచ్‌, దళం పక్క నుంచి మరో బ్యాచ్‌ ఫైరింగ్‌ చేస్తూ సెంట్రీ దగ్గర్లోకి వచ్చాయి.
దళం మీద కాల్పులు జరిపేవాళ్లు జరుపుతూనే వున్నారు.
నిర్మలక్క తన త్రీనాట్‌త్రీలో లోడ్‌ చేసి వున్న ఒక్క తూటాను మాత్రమే పేల్చగలిగింది. ఇంకో తూటా కోసం రీలోడ్‌ చేసేలోగా నేలకూలిపోయింది. తూటాలతో ఒళ్లంతా జల్లెడ అయిపోయింది.
చావుకీ, బతుక్కీ మూడొందల యాభై అడుగుల దూరం మాత్రమే. మూడు, నాలుగు వందల అడుగుల దూరం దాటితే తూటా తగిలినా పెద్దగా ప్రమాదం ఉండదు. అంటే రెండు మూడు నిమిషాల్లో చావు, బతుకులు తేలిపోతాయి.
దళం మూడు గ్రూపులుగా విడిపోయింది.
సాయంత్రం వార్తల్లో ఒక మహిళా నక్సలైట్‌ చనిపోయిందని విన్నారు. ఎవరనేది తెలియలేదు.
రాజీ, జిల్లా కమిటీ సభ్యుడు దస్రు, రాష్ట్రకమిటీ సభ్యుడు దేవేందర్‌, ఓ ఇరవై ఇరవైఒక్క ఏండ్ల వయసున్న కవిత, మరో ముగ్గురు కొత్త కామ్రేడ్స్‌ ఒకవైపు విడిపోయారు. దస్రు ఫైరింగ్‌ షాక్‌లో నుంచి తేరుకోలేదు. రాష్ట్రకమిటీ సభ్యుడికి అడవి కొత్త, కానీ అతని గైడెన్స్‌లో రాజీ, కవిత పని చేసారు.
ఫైరింగ్‌ రేంజ్‌ నుంచి కొంత దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూస్తే దస్రు, మరో ఇద్దరు కొత్త కామ్రేడ్స్‌ వస్తూ కనిపించారు రాజీవాళ్లకు. వారి కోసం ఆగి, కలుపుకుని మొత్తం ఏడుగురు ప్రయాణం సాగించారు. ఆ దారి ఎటు పోతుందో కూడా తెలియదు. అడవి మీద పట్టు లేదు. అది తూర్పా, పడమర, దక్షిణమా, ఉత్తరమా ఏమీ తెలియదు. అందుకే ఫైరింగ్‌ జరిగినప్పుడు విడిపోవద్దని పదేపదే చెప్తుంటారు. దీనికి రెండు కారణాలు… ఒకటి, విడిపోవడం వల్ల సంఖ్యతగ్గి బలం తగ్గుతుందని. రెండవది, విడిపోతే ఎదురయ్యే ప్రమాదాలు, బయటి నుంచి వెళ్లిన కామ్రేడ్స్‌కు అయితే మరింత ప్రమాదం. అసలు వారికే దారులు తెలియవు, జనమూ గుర్తుపట్టరు వారిని.
రాజీ గోండీ మాట్లాడుతుంది కానీ, ‘పాయికా’ (బయటివ్యక్తి) అని స్థానికులు గుర్తుపడతారు. ఆదివాసీ కామ్రేడ్‌ కవిత పూర్తి సాయం చేసింది. కవిత లేకపోతే దారి, తిండీ చాలా చాలా కష్టమయ్యేది. దళం ఆ ఊరికి ఎప్పుడూ పోలేదట.
కవిత ఆదివాసీ కాబట్టి, వాళ్లతో మాట్లాడి బియ్యం తెప్పిచ్చింది. ఓ వైపు సెంట్రీలు చూసుకుంటూనే రాజీ, కవిత కలిసి వంట చేసారు. ఆఖరికి రాష్ట్రకమిటీ సభ్యుడిని కూడా సెంట్రీకి పెట్టారు. దస్రు కూచున్న దగ్గరి నుంచి కదల్లేకపోయాడు. బహుశా ఫైరింగ్‌ షాక్‌లో వున్నట్టున్నాడు.
మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ‘ఆర్‌వి’ ప్లేస్‌లో అందరూ కలుసుకున్నారు. రాజీవాళ్లు వెళ్లేసరికే ఒక టీమ్‌ అక్కడికి చేరుకుని వుంది. అప్పుడు తెలిసింది రాంబాయికి తూటా తగిలిందని, సెంట్రీలో వున్న నిర్మలక్క చనిపోయిందని.
నిర్మలక్కకు జోహార్లు అర్పించారు. రాజీకి దుఃఖం పొంగుకొచ్చింది. ఏడుస్తూ అయినా పనులు చెయ్యాల్సిందే. కూచునే సమయం కాదు.
నిర్మలక్క కూతురు ఇప్పుడు ఏమి చేస్తూ వుందో. తన తల్లి మరణం కూతురు మనసుకు చేరి ఉంటుందా.
ప్రస్తుతం మూడు సెంట్రీలు పెట్టారు. మళ్లీ ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. ఓ అరగంటలో ఖాళీ చేసి మరో సేఫ్‌ ప్లేస్‌కి వెళ్లాల్సి వుంది.
రాంబాయిని డోలీలో మోసుకొచ్చారేమో… గాయాలతో అందులోనే వుంది. గాయానికి కట్టుకట్టారు కానీ పైనుంచి రక్తం కనిపిస్తోంది. మంగ్డూ సమన్వయం చేస్తూ, దాదాలతో మాట్లాడుతూ వంటకు ఏర్పాట్లు చూస్తున్నాడు. ఏది జరిగినా ఏ ఊరికి వెళ్లినా ఆ ఊరి దాదాలు దళం వెంట వుంటారు. ఫైరింగ్‌ జరిగితే ఎట్లా అని తప్పించుకోవం చాలా అరుదు.
జావ తాగడానికి విజిల్‌ వేసారు. అందరూ వెళ్లి తాగివచ్చారు. రాంబాయి కోసం జావ తీసుకుని వచ్చింది రాజీ. కానీ రాంబాయి మొఖం కడిగినట్టు లేదు. నీళ్ల కోసం మళ్లీ చిన్న కొండ దిగి, ఇంకో కొండ ఎక్కాలి. సెంట్రీల మీద సెంట్రీలతో నిద్రలేమి, విపరీతమైన నడకతో రాజీ పూర్తిగా అలసిపోయి వుంది.
మొఖం కడుక్కోడానికి నీళ్లు తెమ్మని అడిగే సాహసమూ రాంబాయీ చెయ్యలేక పోయింది.
రాంబాయిని నెమ్మదిగా లేపి తన భుజానికి ఆనించుకుని జావ తాపించింది రాజీ.
రాజీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
బహుశా నిర్మలక్క వుంటే రాంబాయికి మొఖం కడిగించి ఉండేది.

(దండకారణ్యంలో అమరురాలైన కామ్రేడ్ నిర్మలక్క స్మృతిలో…)

జ‌న‌నం: న‌ల్ల‌గొండ జిల్లా. అస‌లు పేరు ప‌ద్మ మిర్యాల‌. బీఎస్సీ(B.Z.C), PG Diploma in Journalism. వృత్తి: జ‌ర్న‌లిస్టు. మొద‌ట్లో 'క‌రుణ' పేరుతో క‌థ‌లు రాశారు. 23ఏండ్ల వ‌య‌సులో 'తాయ‌మ్మ' క‌థ రాశారు. ఇది క‌రుణ‌ మొట్ట‌మొద‌టి క‌థ . రాసిన మూడేండ్ల త‌ర్వాత 1996లో 'మ‌హిళా మార్గం'లో అచ్చ‌యింది. ఈ క‌థ పేరుతో 'కరుణ' '- 'తాయ‌మ్మ క‌రుణ‌'గా మారింది. ఆంధ్రప్రభ, సాక్షి, ప్రస్తుతం 'నవతెలంగాణ'లో.  మొదటి కథల సంపుటి 'తాయమ్మ మరికొన్ని కథలు' 2009లో, 2వ కథల సంపుటి 'జీవితం' 2018లో ప్రచురితమయ్యాయి. కవితలు, వ్యాసాలు అచ్చయ్యాయి. 13 ఏండ్లు విప్లవోద్యమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేశారు.

2 thoughts on “నిర్మలక్క

Leave a Reply