నిత్య జీవిత కవిత్వ దృశ్యం

చరిత్రలో నైనా సాహిత్య చరిత్రలో నైనా నిర్లక్ష్యానికి, విస్మృతికి గురై అంచులకు నెట్టివేయబడిన స్త్రీల కృషిని వెతికి పట్టుకొని సముచిత స్థానంలో స్థాపించాలి అన్న అవగాహనను 90 వ దశకపు ఉద్యమాల కాలం అభివృద్ధి చేసింది. ఆ నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో మహిళా రచయితల గురించిన అన్వేషణ మొదలైనా వాళ్ళ ఆచూకీ కనిపెట్టి, రచనలు సంపాదించటం అంత సులభం ఏమీ కాదని అనుభవం చెప్తున్నది. నిలకడగా వ్రాసే అవకాశాలు, వ్రాసినదానిని భద్రపరచుకొని ప్రచారంలో పెట్టుకొనే అవకాశాలు ఇంటి ప్రపంచానికే పరిమితం చేయబడిన స్త్రీల కు అందుబాటులో లేనివే. స్త్రీలకు సృజన మేధో శక్తులు ఉన్నాయనే విషయాన్ని సౌకర్యవంతంగా మరిచిన ఈ సమాజంలో స్త్రీల సాహిత్యం ఇతిహాసపు చీకటి కోణంలో పడి కనిపించనిదే అవుతుంది. అలా అట్టడుగున పడి కనిపించని స్త్రీల చరిత్రలను, సాహిత్యాన్ని తవ్వి పోసుకొనే పనిక్రమంలో విప్లవోద్యమ సాహిత్యంలో స్త్రీల కృషి గురించిన మదింపు ఎట్లా అన్న ఆలోచన బాగా వేధించింది.

విప్లవ సాహిత్య సాంస్కృతిక రంగాలలో బహిరంగంగా పనిచేస్తున్న రచయితల గురించి తెలిసినట్లు ఆచరణరంగంలో ప్రత్యామ్నాయ ప్రజా ప్రభుత్వ నిర్మాణంలో జీవితమే యుద్ధంగా జీవిస్తూ రచనలు చేస్తున్న వాళ్ళ గురించి తెలియదు. ఉద్యమావసరాల రీత్యా, ప్రయోజనాలరీత్యా, రచయిత కన్నా రచనకు ప్రాధాన్యతను ఇచ్చే యుద్ధ వ్యూహంలో భాగంగా రచనల ప్రచురణ మారుపేర్లతో జరుగుతుంటుంది. పేర్లను బట్టి స్త్రీపురుష నిర్ధారణ చేయలేం . ఒక రచయిత ఒకటి కంటే ఎక్కువ కలం పేర్లతో వ్రాసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందువల్ల విప్లవ రచయితలను ప్రత్యేకంగా ఒక పేరుతో గుర్తించటం, ఒక రచయిత వ్రాసిన రచనలు ఇవి, ఇన్ని అని నిర్ధారించి చెప్పటం కష్టం. ఈ పరిస్థితులలో విప్లవ సాహిత్య రంగంలో కృషి చేస్తున్న స్త్రీలను గుర్తించటం, రచనల సేకరణ మరింత కష్టం. అయితే ఎక్కడో ఒక చోట నడక మొదలు పెడితే తప్ప గమ్యం చేరుకోలేం కనుక వేరువేరు మూలాల నుండి విప్లవ రచయిత్రులను గుర్తిస్తూ వాళ్ళు చేసిన రచనలను సేకరించే పని ప్రారంభించటం జరిగింది. ఈ క్రమంలోనే 2015 లో విరసం ప్రచురించిన ‘సామాన్యుల సాహసం’ కథల పుస్తకం ద్వారా మైనా, సుజాత, నిత్య అనే ముగ్గురు విప్లవ రచయిత్రులను తెలుసుకొన్నాను. వీళ్ళు అంతకు ముందు తెలియదు అని కాదు. అరుణతార, మహిళామార్గం వంటి పత్రికలలో వాళ్ళు వ్రాసిన రచనలు చదువుతూనే ఉన్నా ఈ పుస్తకంతో స్త్రీలుగా వాళ్ళ అస్తిత్వం రూఢి అయింది.

నిత్య నర్మద అని ఏప్రిల్ 9 న ఆమె మరణించాక తెలిసింది. ఆ పేరుతో విప్లవ మార్గంలో మూడు దశాబ్దాలకు పై బడిన ఆమె నిబద్ధ ప్రయాణం, విప్లవ నిర్మాణంలో ఆమె క్రియాశీల భాగస్వామ్యం తెలిసే కొద్దీ వ్యక్తిగత పరిచయం అక్కర లేకుండానే ఆమెను ప్రేమిస్తాం. నర్మద కు తల్లిదండ్రులు పెట్టిన పేరు కృష్ణకుమారి. బడిలో చేర్పించినప్పుడు అది నిర్మల అయింది. 1960 ప్రారంభంలో కృష్ణాజిల్లా గన్నవరం దగ్గర కొండపావులూరులో జన్మించిన ఆమె కమ్యూనిస్టు రాజకీయాలను అభిమానించిన తండ్రి ప్రభావాలతో పెరిగింది. 1972లో ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుండే ఆమెలో సాహిత్య అభిరుచి ఏర్పడింది. తెలుగు సాహిత్యం తో పాటు దేశీయ భాషలనుండి అనువాదమైన నవలలు, ఇతర వచన రచనలతో పాటు బోల్షిక్ విప్లవ సాహిత్యం, చైనా విప్లవ సాహిత్యం విస్తృతంగా చదివింది. బాల్య స్నేహితులతో కలిసి శ్రీశ్రీని ఔపోసన పట్టింది. డాక్టర్ కావాలనుకొని యాక్టర్ ను అయ్యాను అని సినిమా తారలు చెప్పటం విన్నాం. నర్మద విషయంలో కాస్త మార్పుతో దాదాపు అదే జరిగింది. తండ్రి ఆమెను వ్యక్తుల జబ్బులు కుదర్చగల డాక్టర్ ను చేయాలనుకొంటే ఆమె వ్యవస్థకు పట్టిన దోపిడీ చీడను మూలం నుండి తవ్విపోసే శస్త్ర చికిత్స నిపుణురాలు అయింది.

ఇంటర్ మీడియేట్ తరువాత చదువు పేరుతో హైదరాబాద్ కు చేరటానికి ప్రేరణ విప్లవోద్యమమే. ఆ రకంగా 1978 నాటికి విప్లవ విద్యార్థి రాజకీయాల ఆచరణలోకి వచ్చింది. విప్లవోద్యమం ప్రభుత్వ అణచివేత చర్యలను ప్రతిఘటిస్తూ నిలదొక్కుకొనటానికి, వ్యాపించటానికి 1980 నాటికి దండకారణ్య మార్గం పట్టిన క్రమంలో ఎప్పటికప్పుడు ఉద్యమ అవసరాలకు అనుగుణంగా పనిచేయటానికి తనను తాను సంసిద్ధం చేసుకొంటూ వచ్చింది.కంపోజింగ్ , డిటిపి నేర్చుకొన్నా, హిందీ ఎమ్మే చేసినా గురి మాత్రం విప్లవ రాజకీయాలే. ఆలూరి భుజంగరావు, లలిత దంపతులతో కలిసి దండకారణ్య ఉద్యమ సందేశాన్ని ప్రజారాసులలోకి తీసుకుపోవటానికి హిందీలో ప్రభాత్ పత్రిక పనిలో, పంపిణీలో భాగం అయింది. విప్లవ విధుల నిర్వహణలో మధ్య భారతంలో అనేక చోట్లకు మారుతూ రహస్య జీవితం గడిపింది. ఆ కాలంలోనే మధ్యప్రదేశ్ జీవాధారమైన నర్మదా నది పేరును తన పేరుగా స్వీకరించింది. అప్పటికే విప్లవ రాజకీయాలలో పనిచేస్తున్న కిరణ్ ఆమె జీవిత సహచరుడు అయ్యాడు. అతనితో భావాలను పంచుకొంటూ, తాను వ్రాసినవి అతనితో చర్చిస్తూ నిర్మల అన్న తన పేరులోని మొదటి అక్షరాన్ని కిరణ్ అసలుపేరైన సత్యం లోని రెండవ అక్షరాన్ని కలిపి నిత్య అన్న పేరును కలం పేరుగా చేసుకొన్నది. దాదాపు 1985 లనాటికే ప్రారంభం అయిన ప్రభాత్ పత్రిక 1992 లో ఆగిపోయింది. 1994లో దండకారణ్యం నుండి తీసుకురావటానికి నిర్ణయం జరగటంతో పత్రికతో పాటు నర్మద కూడా దండకారణ్యం చేరుకొన్నది. అక్కడి నుండి ఆమె చిరునామా దండకారణ్యం. దండకారణ్య మహిళా ఉద్యమ అవసరాల రీత్యా 1996 నుండి పోరు మహిళ పత్రిక నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఆ రకంగా ఆమె పత్రికా రచయిత.

అదేవిధంగా ప్రజలలో పనిచేస్తూ విప్లవోద్యమ స్థావరాలను నిర్మించటంలో, బలపరచటంలో క్రియాశీల పాత్ర వహించింది. వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలలో ఆదివాసీల చొరవను పెంచటానికి సహనంతో పనిచేసింది. అటు ఆదివాసీ ప్రజలకు, ఇటు దళ సభ్యులకు ఉన్నంతలో రోగ నిరోధక శక్తిని పెంచగల ఆహారపు అలవాట్లు నేర్పించటానికి శక్తి వంచన లేకుండా కృషి చేసింది. దండకారణ్య మహిళా ఉద్యమానికి నాయకత్వాన్ని అందించింది. కాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకొంటున్న ఆమెను సహచరుడితో సహా 2019 జూన్ లో అరెస్ట్ చేశారు. మూడేళ్ళుగా సరైన వైద్యం అందక , కేసుల విచారణకు కోర్టుల చుట్టూ తిరుగుతూ జబ్బు వైద్యానికి లొంగని స్థితికి చేరటంతో 2022 ఏప్రిల్ 9న మరణించింది. చేసేపని ఎంతమంది చూస్తున్నారు … ఎంత గుర్తింపు,….ఎన్ని ప్రశంశలు, ఎన్ని పురస్కారాలు లభించాయి అన్న ప్రధాన స్రవంతి చింతలు, వంతలు లేని విప్లవ జీవన సంస్కృతిలో కష్టమైనను ఇష్టమేనని జీవించి మరణించిన అనేకానేక మందికి ప్రతినిధి నిత్య. “సాహిత్య పఠనాన్ని, రచనా వ్యాపకాన్ని విప్లవాచరణ నుండి విడిగా చూడలేనని” చెప్పిన నిత్య సాహిత్య అధ్యయన విశ్లేషణలే సాహిత్య విద్యార్ధులుగా మనం ఆమెకు ఇయ్యగలిగిన నిజమైన నివాళి అనుకొంటాను.
1
“1978 నుండి 1986 వరకు నన్ను కదిలించిన ఘటనలపై రాసుకున్న స్పందలన్నీ కాలగర్భంలో కలిసి పోయాయి”. కారణం ఏమైనా కావచ్చు… నిత్య చెప్పిన ఈ మాటలను బట్టి ఇప్పుడు లభిస్తున్న ఆమె రచనలన్నీ 1986 తరువాతవే అని నిర్ధారించుకోవచ్చు. 2009లో అప్పటివరకు వచ్చిన ఆమె రచనలను అచ్చువేసే ప్రయత్నం విరసం చేసింది కానీ అది ఫలవంతం కాలేదు. ఆ తరువాత ఆమె ఏమి వ్రాసిందో, ఎక్కడ అచ్చు అయ్యాయో శోధించవలసి ఉంది. 2022 ఏప్రిల్ వసంతమేఘం ఆన్ లైన్ సంచికలో మరణానంతరం నర్మద పేరుతో అచ్చయిన రాంకో అనే కథ ప్రస్తుతానికి చివరిది. నిత్య రచనలను కవిత్వం, కథలు, వ్యాసాలు అని మూడు విభాగాల కింద పరిశీలించవచ్చు. ప్రస్తుతానికి ఈ విశ్లేషణ కవిత్వానికి పరిమితం.
నిత్య వ్రాసిన కవితలు పద్దెనిమిది లభిస్తున్నాయి. మరో రెండు హిందీ కవితలు కూడా ఉన్నాయి. 1991లో నిత్య కవితా ప్రస్థానం ఒక వార్తకు స్పందనగా మొదలైంది. విప్లవోద్యమం పై నిర్బంధం పెరిగిన కాలంలో గడ్చిరోలి జిల్లాలోని భామ్రాఘడ్ లో స్కూల్ లో చదువు కొంటున్న విప్లవ కారుడి కొడుకులను ఒక పోలీసు అధికారి “తేరా బాప్ డాకూ హై . తుమ్ భీ డాకూ బనేగా” (మీ నాన్న బందిపోటు దొంగ, నీవు కూడా బందిపోటువి అవుతావా) అని బడి పిల్లల ముందు అవమానకరంగా మాట్లాడినట్లు వచ్చిన వార్తకు స్పందించి వ్రాసిన కవిత మొదటిది. ఆ కవిత పేరు ‘నేనూ డాకూనౌతా’. ఇందులో ఆరు దృశ్యాలు ఉన్నాయి.
“స్కూల్లో
చిన్నాడి కళ్ళు
అవమానంతో ఎర్రబడ్డాయి” అని మొదలయ్యే తొలి భాగం లో విన్న వార్తను బట్టి దృశ్యాన్ని ఊహించిన నిత్య చిన్నబోయిన చిన్నాడు దానికి ఎట్లా ప్రతిస్పందించాడో, ఏమేమి విన్నాడో, చూశాడో, ఏ నిర్ణయానికి వచ్చాడో చెప్పటంగా కవితను నాలుగు దృశ్యాలలో విస్తరించింది. రచ్చబండ మొదటి దృశ్యం. మీ నాన్న బందిపోటు దొంగ … నువ్వు కూడా బందిపోటువు అవుతావా అన్న పోలీసు అధికారి ప్రశ్న వాడి మనసును గాయపరిచింది. బడిలో ఉండలేక బయటపడాడ్డు. రచ్చబండ దగ్గర అన్నం తిన్నావా అన్న పలకరింపు విన్నాడు.
ఆ పలకరింపు తో పాటు…
“బంగారం లాంటి పొలం
పచ్చటి సంసారం
అన్నీ వదిలేసి
బువ్వలేనోళ్ళకి బువ్వ కావాలంటూ
అడవులు పట్టిపోయి
మిమ్మల్ని బువ్వకి మాడుత్తాండు “ అన్న సానుభూతి వాక్యం బువ్వలేనోళ్లకి బువ్వ కావాలనుకొని ఉన్నదే వదిలేసుకుపోయిన తండ్రి దోపిడీ దొంగ ఎట్లా అవుతాడు అన్న ప్రశ్నను ఇచ్చింది.

రచ్చబండ దగ్గర నుండి మంచినీళ్ల బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చిన్నాడిని పలకరించినవాళ్లు బావిలో నీళ్లు తోడుకొంటున్న దళితులు. దళితులను బావులలో నీళ్లు తోడుకోనీయని అన్యాయం నశించాలని తండ్రి ముందుండి పోరాటం నడిపించాడని వాళ్ళు అంటే విన్నాడు. సమాన న్యాయం కోసం నిలబడ్డవాడు బందిపోటు ఎట్లా అవుతాడో నమ్మలేకపోయాడు.

అక్కడ నుండి వెళ్ళింది ఒక గుడిసె దగ్గరకు. అక్కడివాళ్లు ఆదరంగా మాట్లాడిన మాటలను బట్టి మనసు పడిన వాడిని పెళ్లాడాలనుకొన్న యువతిని తిరుగుబోతు అని తీర్పు ఇచ్చి పెద్ద మనుషులు చంపాలని అన్నప్పుడు ఆ క్రూరత్వానికి అడ్డుపడి తండ్రి ఆ పెళ్లి జరిపించాడని ఇప్పుడామె పిల్లాపాపలతో పచ్చగా కాపురం చేసుకొంటున్నదని తెలిసివచ్చింది. ఆడవాళ్ళ పట్ల, అవసరంలో ఉన్న వాళ్ళ పట్ల అంత దయగా వున్న తండ్రి బందిపోటు కావటానికి వీల్లేదని నమ్మకం అక్కడ కుదిరి ఉంటుంది.

చెరువు వద్ద చచ్చి పడి వున్న మనిషి చుట్టూ విషణ్ణ వదనాలతో గుమికూడిన జనం మాటలనుండి చెరువులమీద , చెరువులోని నీళ్ల మీద చెరువు లోతట్టు భూముల మీద పెత్తనం తమదే అని విర్రవీగే భూకామందుల ఆగడాలను అడ్డుకొనే తండ్రి లేని లోటుకు చింతిస్తున్నారని తెలుసుకొన్నాడు. ఒక సారి వచ్చిపోతే బాగుండు అని అతని రాకడను ఆశించటం విని, చూసి తన తండ్రి ప్రజలమనిషే కానీ దోచుకొనే దొంగ కాదన్న నిర్ధారణకు వచ్చి ఉంటాడు. దాని పరిణామమే ఈ కవితలో తుది ఘట్టం.
ఇంటర్వెల్ లో స్కూల్ వదిలిన చిన్నాడు ఉద్విగ్నచేతస్కుడై చీకటి పడేవరకు ఊరంతా తిరుగుతూ ఇలా భిన్న దృశ్యాలలో భాగం ఆవుతూ పొందిన జ్ఞానంతో ‘నేను డాకూ నౌతా’ అన్న నిర్ణయానికి రావటం దగ్గర ఈ కవిత ముగుస్తుంది. పోలీసు అధికారి తండ్రిని బందిపోటు దొంగ అనటం వలన కలిగిన ఆవేదన, ఆందోళన, అవమానం తొలగిపోయి “నేనూ డాకూ నౌతా” అన్ననిర్ణయానికి రావటం తో కలిగిన చిత్తశాంతి ఆద్యంతాలుగా నిర్మించబడిన కవిత ఇది. మధ్యలోని నాలుగు దృశ్యాలు అంచలంచెలుగా బందిపోటు నిర్వచనాన్ని విప్లవీకరించటానికి ఉపయోగపడ్డాయి. “ప్రధాన స్రవంతి” అధికార సమాజం దోపిడీదారు అని ముద్రవేసి ఎవరిని వేటాడుతున్నదో ఆ తన తండ్రి సామాన్య జన హృదయాలలో, స్మరణలో దోపిడీ పీడనలను ప్రతిఘటించే మానవుడుగా గౌరవాన్ని అభిమానాన్ని పొందుతున్నాడు అని చిన్నాడికి అర్ధం చేయించిన దృశ్యాలు అవి. సిద్ధార్ధ గౌతముడు రథ యాత్రలో జబ్బు పడ్డవాడిని, వృద్ధుడిని, శవాన్ని చూసి దుఃఖ కారణాలు తెలుసుకున్నట్లు ఈ చిన్నాడు నాలుగు దృశ్యాల నుండి ప్రయాణిస్తూ తండ్రి దుఃఖ నివారణ మార్గంలో నడుస్తున్నట్లు అర్ధం చేసుకొన్నాడు. అసమానతలు, అన్యాయాలు, దోపిడీ పీడన దుఃఖ కారణాలు అయితే వాటిని నిర్మూలించే దశగా ఆచరణలో ఉన్నవాళ్లకు ప్రభుత్వం పెట్టిన పేరు బందిపోటు దొంగ అని అర్ధం అయ్యాక చిన్నాడికి బందిపోటు దొంగ కావటమే సముచితం అనిపించింది. ప్రారంభంలో నువ్వూ డాకూవు అవుతావా అన్న హేళనతో కూడిన అవమానకరమైన పోలీసు అధికారి ప్రశ్నను తిప్పి కొడుతూ “ నేనూ డాకూ నౌతా” అని సగర్వంగా ప్రకటించగల స్థాయికి చేరటం ఒక గెంతు లాంటి పరిణామాన్ని సూచిస్తుంది.

‘బాలలబాట విప్లవ బాట’ అని నిరూపించటం ‘ప్రయాణం’ (1991?) కవితలోనూ కనిపిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరూ విప్లవోద్యమంలో భాగస్వాములు కావటానికి అడవిదారి బడితే వాళ్ళ పిల్లలు బ్రతుకు పోరు అక్షరాల దిద్దుబాటలోనే సాగాలన్న ఆమె ఆకాంక్షకు వ్యక్తీకరణ ఈ చిన్నకవిత. హిందీ కవితలలో ‘ఆజ్ కే నహ్నే’ కవిత(2007) విప్లవోద్యమంలో బాల గెరిల్లాల పాత్రను ప్రశంసిస్తూ వ్రాసినది. భారత కమ్యూనిస్టు పార్టీ ( మావోయిస్టు ) ఐక్యతా కాంగ్రెస్ 9వ కాంగ్రెస్ రక్షణ బాధ్యతలలో వుండి అన్ని పనులు తమవే అన్నట్లు చాయ్ లు, వార్తలు అందిస్తూ, ఒకసారి డోలు వాయిస్తూ, మరొక సారి రొట్టెలు చేస్తూ అక్కడ తిరిగిన పిల్లలను ప్రస్తావిస్తూ వ్రాసిన ఈ కవితలో నేటి ఈ అంకిత స్వభావమే రేపటి యుద్ధవీరులను వాగ్దానం చేస్తుంది అంటుంది నిత్య. విప్లవాచరణలో భాగంగా వున్న ఆమె కవిత్వంగా నమోదు చేసిన కొన్ని సందర్భాలలో ఇది ఒకటి.

ఈ ఐక్యతా కాంగ్రెస్ (9 వ కాంగ్రెస్) జరిగింది 2007 జనవరి లో . WTO , IMF, ప్రపంచ బ్యాంకు నిర్దేశాలకు అనుగుణంగా రూపొందించబడిన వ్యవసాయ సంబంధ విధానాలు మధ్యతరగతి , కొన్ని సందర్భాలలో సంపన్న వర్గ రైతులను చావుదెబ్బ కొట్టాయని , ఆ రకంగా అణచివేయబడిన రైతాంగం ఈ విధానాలమీద తుఫాను లాగా విరుచుకు పది ఊడ్చి పారేయాలని పిలుపును ఇచ్చింది ఈ ఐక్యతా కాంగ్రెస్. సరళీ కరణ , ప్రయివేటీకరణ , ప్రపంచీకరణ తెచ్చిన విధ్వసం, పోలవరం , బాక్సయిట్ తవ్వకం, ప్రత్యేక ఆర్ధిక మండలులు మొదలైన భారీ ప్రాజెక్టులు, విధానాలు పెద్ద ఎత్తున విస్థాపనకు కారణం అయ్యాయి కనుక వీటికి వ్యతిరేకంగా పోరాటాలకు పిలుపును ఇచ్చింది. హిందూ ఫాసిజం, రైతుల ఆత్మహత్యలు, జాతుల పోరాటాలు, స్త్రీలపై రాజ్య హింస , దళితులపైహత్యలు మొదలైన వాటిని సంబోధిస్తూ ఈ కాంగ్రెస్ లో తీర్మానాలు జరిగాయి. ఈ 9 వ ఐక్యతా కాంగ్రెస్ ను ‘మరపురాని ఘట్టం’ గా అభివర్ణిస్తూ కవిత వ్రాసింది నిత్య.
“అది
పోటెత్తిన ప్రాణహిత
సుడులు తిరుగుతున్న సువర్ణ రేఖ
గలగలపారే గోదావరి
గంగా- కావేరి కాంటి లివర్” అని ప్రారంభం అవుతుంది ఈ కవిత. గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత మహారాష్ట్రలోని గడ్చిరోలి , తెలంగాణలోని కొమురం భీం ( ఆసిఫాబాద్ ) జిల్లాల సరిహద్దులను ఒరుసుకొంటూ ప్రవహిస్తుంది. సువర్ణ రేఖ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ , ఒడిషా రాష్ట్రాల గుండా ప్రవహించే నది. గోదావరి మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ ,ఆంధ్ర, ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. గంగ ప్రధానంగా ఉత్తరభారతంలోనూ కావేరి కర్ణాటక తమిళనాడు రాష్టాలలోనూ ప్రవహించే నదులు. ఈ నదులను ప్రస్తావించటం ద్వారా నిత్య మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా ,ఆంధ్ర , ఛత్తీస్ ఘడ్, ఉత్తరభారతం, కర్ణాటక, తమిళనాడు రాష్టాల విప్లవ కారుల ఐక్యతా కాంగ్రెస్ యొక్క విశాల చిత్ర పటాన్ని ఆవిష్కరించింది. ఇది ఒక ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ఉత్తేజాన్ని ప్రసరింపచేసే ముఖచిత్రం. “శివాలిక శీత గాలులు / మలయ మారుతపు వేడిగాలులు/ ఎర్రరాజ్యాధికారం కోసం / ఊసులాడుకొంటున్న” సన్నివేశాన్ని , “తూర్పు- పడమరలు / ఉత్తర- దక్షిణాలు/ అరమరికలు మరచి / అలయ్ బలాయ్ తీసుకుంటున్న” ఆనంద సందర్భాన్ని ఫ్రెమ్ కట్టిన ఫోటోలు గా మనముందు పెడుతుంది. విప్లవ ఆకాంక్ష , ఆదర్శం భౌగోళిక సరిహద్దులను అధిగమించిన అచ్చమైన మానవులను రూపొందించిన తీరును పాఠకుల అనుభవానికి తెస్తాయి ఈ కవితా భాగాలు.

అక్కడికి చేరినవాళ్లంతా, చెయ్యీ చెయ్యీ కలుపుతున్న వాళ్లంతా “సిద్దుకాను -గుండాదూర్ /కొమురం భీం – బీర్సా ముండా/ అల్లూరి సీతారామరాజు – లక్ష్మణ్ నాయక్ “ వారసులు అంటుంది నిత్య . అలా మంచి సమాజం కోసం పోరాటం చరిత్ర పొడుగునా నడుస్తున్నదే అని సూచిస్తుంది. అంతే కాదు “ వడగాల్పులలో వాడిన పంట / మంచుకొండల్లో ఎర్రమొలకను చూచి / పులకరించింది” వంటి అభివ్యక్తులు విప్లవోద్యమం ఒక చోట ప్రభుత్వ దమనానికి గురై కొంత వెనకబట్టినట్లు కనబడినా దిగులు పడవలసిందేమీ లేదని అది మరొక చోట, మరొక చోటా కొత్తమొలకలు వేస్తూ విస్తరిస్తూ ఉంటూనే ఉంటుందని ఒక భరోసాను ఇస్తాయి. ఉన్న స్థితిని సమీక్షించుకుని ఉన్నత స్థాయికి విప్లవోద్యమాన్ని తీసుకువెళ్ళటానికి అవసరమైన ఎత్తుగడల గురించి చర్చించిన ఆ కాంగ్రెస్ ను “భారత విప్లవ చరిత్రలో/ మరపురాని ఘట్టం”గా సంభావించింది. “భారత విప్లవరథానికి / ఇరుసైన విల్లు బాణం / రేపటి విజయం తనదేనంటూ/ తుడుం మోగించింది” అన్న పంక్తులలో ఆదివాసీల నాయకత్వాన్ని స్థాపించటం కూడా చూడవచ్చు. అనివార్యమైన ఒక యుద్ధ వాస్తవికతను ఆవిష్కరించిన గొప్ప కవిత ఇది.

యుద్ధం అన్నాక యుద్ధతంత్రం ఉంటుంది. పోలీసు సైన్యపు దాడులనుండి ఆత్మరక్షణకు వ్యూహాలు, ప్రతిదాడులకు పన్నుగడలు అన్నీ ఉంటాయి. చత్తిస్ ఘడ్ లో నక్సలైట్ల పురోగమనాన్ని అడ్డుకొనటానికి ప్రభుత్వం స్థానిక ఆదివాసీ యువతను చేరదీసి శిక్షణ ఇచ్చి 2005 లో సృష్టించిన సాయుధబలగం సల్వాజుడుం. శాంతి యాత్ర లేదా పవిత్ర వేట అని ఈ గోండీ భాషా పదానికి అర్ధం.ప్రభుత్వ శాంతి కోసం ఆదివాసీల చేత ఆదివాసీలపై సాగిస్తున్న వేట కు ప్రతీకార దాడులుగా ప్రభుత్వ పోలీసు సైనిక జవానుల వాహనాలను ల్యాండ్ మైన్స్ తో పేల్చేసే వ్యూహ రచన అనివార్యమైంది. అలాంటి ఒక సందర్భాన్ని మైన్ ప్రూఫ్ ముక్కలైన వేళ అన్న కవితలో నమోదు చేసింది నిత్య. ఈ కవితలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కారణం . రెండవది కార్యం . కారణం సల్వాజుడుం. ఆదివాసీల జీవితాలను ఛిద్రం చేసిందీ, కడుపులను కాల్చింది , పేగును తెంచిందీ రాబందుల ‘శాంతి’ రాజ్యం సృష్టించిన సల్వాజుడుం. “పల్లె వల్లకాడై/బతుకులు కకావికలై/యవ్వనం పగిలిపోయి / మాడిన పేగు / ఇంకిన కళ్ళు … “ ఇవన్నీ సల్వాజుడుం సృష్టించిన భీభత్స దృశ్యాలు. గుండె పగిలిన ఆక్రోశం ప్రతీకారాన్ని కోరితే అది ల్యాండ్ మైన్ అయింది. భూమిలో అమర్చే ఈ పేలుడు సాధనం పదేడ వద్ద 24 మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ను తీసుకువెళ్తున్న వాహనాన్ని పేల్చిన ఘటనను ఈ కవిత ప్రస్తావించింది. “పీడన”లో విస్ఫోటనమై / మైను ప్రూఫ్ ను ముక్కలు చేసింది అన్న కవిత ముగింపు వాక్యాలు గమనించదగినవి. ల్యాండ్ మైన్ లనుండి రక్షణకు తయారుచేయబడిన మైన్ ప్రూఫ్ వాహనం ముక్కలు చేయబడటం ఒక కార్యం ఒక విజయం. దానికి కారణం అయిన ల్యాండ్ మైన్ ను వాచ్యం చేయకుండానే సూచించే కవితా పాదం “పీడన” లో విస్ఫోటనమై అన్నది. భూమిలో అమర్చబడిన పేలుడు పదార్ధం పై నుండి వాహనాలు వెళ్ళినప్పుడు ఒత్తిడికి లోనై పేలుతాయి. పేలుడుకు ల్యాండ్ మైన్ తక్షణ కారణం కావచ్చు, కానీ ఆ చర్యకు మనిషిని ప్రేరేపించింది అనేకవైపులనుండి ఎదురవుతున్న పీడన, హింస అని, అంతిమంగా అదే మైన్ ప్రూఫ్ ముక్కలు కావటానికి కారణం అన్న ధ్వని ఉంది ఈ ముగింపు పాదాలలో.

ఈ వరుసలో మరొక కవిత వేటకుక్కలు.(2008) “ నోరు లేని జీవాలను/ పీక్కుతిన్న వేటకుక్కలు/ సీలేరు ప్రవాహంలో / చిత్రకొండ రిజర్వాయర్ లో / గుడ్లు మిటకరించిన రేచు కుక్కలు / నరమాంసం రుచి మరిగిన జానారెడ్డి పెంపుడు కుక్కలు” అని ప్రారంభమయ్యే ఈ కవిత 2008 జూన్ (28? 29?) లో చిత్రకొండ రిజర్వాయర్ లో గ్రేహౌండ్స్ బలగాలతో పోతున్న బోటు మావోయిస్టు ల ఆకస్మిక దాడిలో ముంచివేయబడిన ఘటనకు సంబంధించినది. గ్రే హౌండ్స్ ఆంధ్రా తెలంగాణలకు సంబంధించిన ప్రత్యేక పోలీసు బలగం. 1989లో మావోయిస్టు ఉద్యమ పురోగమనాన్ని అడ్డుకొనటానికి కె. ఎస్ వ్యాస్ రూపందించిన బలగం ఇది. అటవీ ప్రాంతాలపై అదుపు సంపాదించి మావోయిస్టు దళాల కదలికలను కనిపెట్టి మట్టుపెట్టటానికి, మావో యిస్టులపై దాడుల సమయంలో దార్లు చూపటానికి ఏర్పాటు చేయబడిన బలగం ఇది. ఈ బలగాన్నే”వేట కుక్కలు“ అన్నది నిత్య. ఒడిషా ప్రభుత్వంతో కలిసి మావోయిస్టుల వేటకు విఫలయత్నం ఒకటి చేసి సీలేరు నదిలో ఒడిషా ప్రభుత్వం వారి వ్యవసాయ శాఖకు చెందిన మరపడవలో చిత్రకొండ వైపు వస్తున్న గ్రేహౌండ్స్ పై బలిమెల రిజర్వాయర్ లో ఒక సన్నని మార్గం నుండి వస్తున్నసమయంలో మావోయిస్టులు ఆకస్మికంగా చుట్టుముట్టి చేసిన ఆ దాడిలో పడవ మునిగి 38 మంది మరణించారు. ఈ విజయానికి అడవి చేసుకొన్న సంబరాన్ని వర్ణించటం ఈ కవితలో రెండవ భాగం. “ అది ఎర్రచీమల ఎత్తుగడ / కోయదొరల ఉండేలు దెబ్బ” కవిత ముగింపు పాదాలు. చలి చీమల చేత చిక్కి పాములే చస్తుండగా ఎర్రచీమల చేత చిక్కిన వాటికి అంత్యకాలం దాపురించినట్లే నని వేరేగా చెప్పక్కరలేదు.

రాజకీయ పాఠశాల అనుభవానికి సంబంధించిన కవిత ఒకటి వ్రాసింది నిత్య. భిన్న స్థాయిలలో విప్లవాచరణలో భాగమై ఉన్నవాళ్ళ రాజకీయార్ధిక తత్వశాస్త్ర అవగాహనను మెరుగెక్కించటానికి ఎప్పటికప్పుడు ఈ రాజకీయ పాఠశాలలు నిర్వహిస్తుంటారు. యుద్ధరంగం నడుమ నడిచే అటువంటి పాఠశాలలో ఎన్ని సార్లు శిక్షణ పొందిందో కానీ 1998 లో ఒక తరగతి అనుభవాన్ని ‘ఉపాధ్యాయునికి ప్రోగ్రెస్ కార్డు’ అనే కవితగా వ్రాసింది. సాధారణంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ఉపాధ్యాయులు తరగతి గది విద్యార్థుల నైపుణ్యాలను అంచనావేస్తూ ఇచ్చేది. కానీ ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ పాఠం విన్న విద్యార్థి పాఠం చెప్పిన ఉపాధ్యాయునికి ఇయ్యటం విశేషం. విద్యార్ధినిగా నర్మద భారతీయ అర్ధశాస్త్ర పాఠం చెప్పినఉపాధ్యాయునికి ఏ గ్రేడ్ ఇచ్చింది. ఆయన ఎవరో కానీ “ఎండనూ వాననూ/ చలినీ ఆకలినీ / కాలాన్నీ జీవితాన్నీ జయించినవాడు” అంటుంది. “రెండు దశాబ్దాల/ కఠోర గెరిల్లా జీవితంలో రాటు దేలిన వాడు” అని కూడా చెప్పింది. “ సహజ ఆర్ధిక విధానం నుండి/ స్పెక్యులేషన్ వరకు/ వస్తు మార్పిడి నుండి ద్రవ్య పెట్టుబడి వరకు/ 160 తరాల మానవ వికాస క్రమాన్ని….” 60 నిమిషాల డాక్యుమెంటరీ గా / కళ్ళకు కట్టించాడని మెచ్చుకొన్నది. ఇలాంటి ఉపాధ్యాయుల ప్రభావం వల్లనే కావచ్చు ఆమెకు భారతీయ అర్ధశాస్త్ర అధ్యయనం లో అభిరుచి, ఆసక్తి కుదురుకొన్నాయి. కనుకనే ఇలాంటి రాజకీయ పాఠశాలలో అర్థశాస్త్ర పాఠాలు చెప్ప గల స్థాయికి ఎదిగింది.

2

యుద్ధం అంటే విజయాలే కాదు ఓటములు, ఆశాభంగాలు, కష్టాలు, విషాదాలు, కన్నీళ్లు కూడా ఉంటాయి. స్వంత ఆస్తులు, చదువులు , ఉద్యోగాలు, వృత్తులు, కుటుంబాలు వదిలి విప్లవోద్యమంలోకి నడిచారంటే ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధమైనట్లే. వర్గ సంబంధం, ఆదర్శ ఏకత , ఆచరణ బాట ఒక్కటై నడిచే విప్లవకారుల మధ్య రక్త సంబంధం , బంధుత్వ సంబంధం లేకపోయినా అంతకు మించి వర్గ దృక్పథ సంస్కృతి నుండి బలపడిన ఉన్నత మానవ సంబంధాలు ఉంటాయి. అందువల్లనే సహచరుల అమరత్వం జీవించి ఉన్నవాళ్లకు సలపరించే గాయమే. ఆ నొప్పి నుండి వచ్చేవే స్మృతి గీతాలు. దాదాపు మూడు దశాబ్దాల దండకారణ్య యుద్ధం మధ్య ఎందరు సహచరులను కోల్పోయిందో, ఎన్ని విషాదాలు మోసిందో కానీ నిత్య వ్రాసిన స్మృతి కవితలు ఏడు లభిస్తున్నాయి.

నేస్తమా ! ప్రభాకరా! కవిత 1998 ఏప్రిల్ 26 న జారవాడ ఎన్ కౌంటర్ లో అమరుడైన మిత్రుడిని తలచుకొంటూ వ్రాసినది. వియోగపు తలపులు దుఃఖాన్ని కలిగిస్థాయి. కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. కానీ విప్లవకారులకు కన్నీళ్లకు సమయం ఉండదు. కన్నీళ్లతో ధైర్యాన్నికోల్పోనీయకూడదు అన్న దృఢసంకల్పం ఉంటుంది. అందువల్ల మరణం మిగిల్చిన శూన్యాన్ని కాక చలనంలోని చైతన్యాన్నేకళ్ళతో సంభావించటం, హృదయంలో పదిలం చేసుకొనటం విప్లవకారుల లక్షణం అవుతుంది. అదే ఈ కవితలో కనబడుతుంది. “నిన్ను మింగేశానని రాహువు / రేడియోలో ప్రకటనలు చేస్తూ / పండుగ చేసుకొంటుండగానే/ పొడిచే పొద్దుకు కాంతిరేఖవై ఎదురువచ్చావు” కవిత ఎత్తుగడలోనే ‘ఒక వీరుడు మరణిస్తే వేనవేలు ప్రభవింత్రు’ అన్న ఆశావహ దృక్పథ ప్రతిధ్వని ఉంది. పదార్ధం నశించదు. మరొక రూపంలోకి మారుతుంది. ప్రభాకర్ మరణించడు. బహుళమై అనుక్షణం మనతోనే ఉంటాడు అన్నది కవితానిర్మాణ సూత్రం. గమ్యానికి మార్గం తెలియక తికమక పడుతున్నప్పుడు ధ్రువతారగా ఎదురువచ్చేది, పువ్వులతో శ్రద్దాంజలి ఘటించాలని పూలు తెంపబోతే వికసించిన పువ్వులో నవ్వు అయి ఎదురువచ్చేది, ప్రభాకర్ అమరత్వానికి కన్నీరు పెట్టిన, కలత చెందిన, దెబ్బకు దెబ్బ తీయాలని కదిలిన మిలిటెంట్లకు, చెల్లెళ్లకు, యువతకు మందుపాతరై ఎదురువచ్చేది, ఆదివాసీ పిల్లల కళ్ళల్లో ఆశాబింబమై ఎదురువచ్చేది ప్రభాకరే అయినప్పుడు ప్రభాకర్ లేడన్నది లేనేలేనట్లు. విప్లవ మార్గంలో సహచరులతో సజీవ సంబంధాన్ని ఆచరణ రూపంలో నిత్యం నిరంతరం చేసుకోనటమే స్మృతి కవిత పరమార్ధం.

మరొక స్మృతి కవిత ‘ఆమె ఒక సబిత’ గడ్చిరోలి జిలా ఏటపల్లి తాలూకా గొట్ట గ్రామంలో జన్మించి క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్ లో చురుకైన కార్యకర్తగా ఎదిగి పార్టీ నిర్మాణంలోకి వచ్చి కోటెనార్ ఎన్ కౌంటర్ లో మరణించిన సబిత గురించిన కవిత ఇది.(పోరుమహిళ , అక్టోబర్ 1999) ఈ కవితలో సబిత కళ్ళను స్మరించుకొంటుంది నిత్య. చైతన్యం , స్నేహం నిండిన నవ్వే కళ్ళు ఆమెవి. “ఆ నవ్వు అయస్కాంతమై / అయినవాళ్లను ఆకర్షిస్తుండ” గా “ అదే నవ్వు విస్ఫోటనమై శత్రువును మట్టు బడుతుంది” అని విరుద్ధశక్తుల కూడలిగా వాటి ప్రత్యేకతను ప్రతిపాదించింది. పాతను కడిగెయ్యటం, పితృస్వామ్యాన్ని సవాలు చేయటం, చరిత్రహీనుల్ని చెండాడటం, చీకట్లను వెలిగించటం అన్నీ ఆ నవ్వు బహురూపాలే. “ ఆ నవ్వు / సాహసమై/ మెషిన్ గన్నులకు గుండె నెదురొడ్డుతుంది” అంటూ ఆమె ఆచరణను ఆమె నవ్వును అభేదం చేస్తూ ఈ కవిత వ్రాసింది నిత్య.

2004 సెప్టెంబర్ 25 న పద్దూరు ఎన్ కౌంటర్ లో అమరుడైన పూసు ( నామదేవ్ పార్తేటి ) స్మృతిలో వ్రాసిన కవిత ‘మళ్ళీ కలుద్దాం’. విప్లవోద్యమంలో తల్లులైన స్త్రీల ఆరోగ్యం గురించి, వారి పిల్లల గురించి బాధ్యత పడేదని పిల్లలను తల్లిలా చేరదీసెదని, వాళ్ళకు పౌష్టికాహారం అందించాలని ఆరాటపడేదని చెపుతారు నర్మద గురించి. మళ్ళీ కలుద్దాం కవితలో నర్మదలోని ఆ తల్లి కనబడుతుంది. “కన్నా / నిను నవమాసాలు మోయలేదు / బొడ్డుకొయ్యలేదు / జోల పాడలేదు / గోరుముద్దలు తినిపించలేదు/ కానీ పద్దూర్ ఎన్ కౌంటర్ వార్తవిని / కన్ను అదిరింది/ పేగు కదిలింది/ చెమ్మగిల్లిన గుండె / కళ్ళల్లో ఊట అయింది” అన్న ప్రారంభ కవితా పంక్తులు విప్లవోద్యమంలో అమరుడైన కొడుకు గురించిన తల్లి వేదననే ప్రతిఫలిస్తాయి. ఉద్యమం పొత్తిళ్ళలో పురుడు పోసుకొని నర్మద ఆదరాన్ని , ఆప్యాయతను పొందిన ఏ శిశువో ఈ పూసు. మరణించటం వాస్తవమైనా తల్లులు బిడ్డల మరణాన్ని అంగీకరించటానికి ఇష్టపడరు. అందువల్లనే ఈ కవితలోని తల్లి కళ్ళల్లో వూటకు అడ్డుకట్ట వేసి ఆశను ఆవాహన చేసుకొన్నది. దళాలు గా బెటాలియన్ లుగా విడిపోయి పార్టీ కార్యక్రమంలో వేరువేరు బాధ్యతలను నిర్వహించే విప్లవకారులు ఏదైనా పని మీద కలుసుకున్నప్పుడు కరచాలనాలు చేసుకొని విడిపోయే ముందు మళ్ళీ కలుద్దాం అనుకొనే సంప్రదాయం ఒకటి ఉంది. దానిని ఆసరాగా చేసుకొని తల్లి దుఃఖంతో కూలిపోయే మనసుని కూడగట్టుకొనటానికి సిద్ధపడింది. “ గమ్యం ఒక్కటే / పోరు ఒక్కటే / బాట ఒక్కటే / అయినప్పుడు/ కలవకుండా ఎక్కడికి పోతాం / మళ్ళీ కలుద్దాం “ అంటూ పూసును తన భావనలో సజీవంగా నిలుపుకొంది.

2006 సెప్టెంబర్ 16 న మరణించిన వికాస్ స్మృతిలో వ్రాసిన ‘పోరాటాల శివన్న’, 2008 ఫిబ్రవరి 22 న దోబూరువద్ద జరిగిన ఫైరింగ్ లో శత్రువును ఎదుర్కొంటూ మరణించిన రాధ , రజిత, కుమ్మెల స్మృతిలో వ్రాసిన ‘చైతన్య దీపికలు’, 2008 ఏప్రిల్ 12 న ఫాల్సి ఫారం మలేరియాతో మరణించిన అనురాధా గాంధీ గురించి హిందీలో వ్రాసిన ‘జనకీ దీదీ’ అనే కవితలు ఈ వరుసలోవే. 28 జులై 2008 వీటిలో ప్రత్యేకమైనది. అది ఏ ఒక్కరి స్మృతిలోనో వ్రాసినది కాదు. “ అమరత్వం / వేదన భరితమైనది / అమరత్వం అందమయినది / జీవితాలను సార్ధకం చేసేది / జన్మజన్మలకు కోరుకొనేది. ఆ అమరత్వపు స్మరణ 28 జులై” అన్న ప్రారంభాన్ని బట్టి జులై 28 అమరులను ఉమ్మడిగా స్మరించుకొనటానికి నిర్దేశించబడిన రోజుగా అర్ధం చేసుకోవచ్చు. ఆరోజు అమరులను స్మరించుకొనటానికి భారతదేశపు అన్ని ప్రాంతాల విప్లవకారులు ఒక దగ్గరకు చేరినట్లు తరువాతి కవితాభాగాలను బట్టి ఊహించవచ్చు. “శబరీ, సీలేరు/ ఇంద్రావతి. ప్రాణహితలు / అమరులను స్మరించుకున్న / అపూర్వ సంగమం /28 జులై 2008” ఈ కవితా భాగంలో పేర్కొన బడిన నదులన్నీ ఒడిశా ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్ర తెలంగాణాలను కలుపుతూ దండకారణ్యంలో ప్రవహించేవే. ఆయా ప్రాంతాల మావోయిస్టు ఉద్యమకారులతో అమరుల సంస్మరణకై దండకారణ్యంలో జులై 28 సభ నిర్వహించబడి ఉండాలి. పశ్చిమ కనుమల నుండి తూర్పు కనుమలవరకు ప్రాంతాల హద్దులు చెరిపేసి అమరుల సంస్మరణకు అందరు ఒక్క చోట చేరిన ఆ రోజును కవయిత్రి “వర్గబంధాల వాత్సల్యం / జాలువారిన రోజు”,అని “మట్టిలో పుట్టిన మాణిక్యాల సాహసం/ వీరగాధయై ప్రవహించినరోజు” అని అభివర్ణిస్తుంది.

3

దండకారణ్య మహిళా ఉద్యమ నాయకురాలు, పోరు మహిళ పత్రిక నిర్వాహకురాలు అయిన నిత్య స్త్రీ సమస్య మీద వ్రాసిన కవిత్వం తక్కువే అయినా అవి స్త్రీగా ఆమె తన ఆర్తిని విప్లవ రాజకీయాలతో సమన్వయించుకొన్న తీరుకు ప్రాతినిధ్యం వహిస్తాయి. శీర్షిక లేని రెండు లఘు కవితలు 1998 నాటివి( అక్టోబర్ , పోరుమహిళ ) తెలుగు సమాజం స్త్రీవాద భావజాలం తో ప్రభావితమవుతూ జీవితంలో , సమాజంలో మార్పు కోసం సంఘర్షిస్తున్న కాలం అది. అయితే బతుకులో మార్పుకోసమైన ఆకాంక్ష స్త్రీలలో ఇప్పుడే మొదలైందని అర్ధం కాదు. పౌరాణిక కాలాలనుండి కూడా స్త్రీలు జీవితంలోని అసమానతలను గుర్తించారు. అసంతృప్తులు వ్యక్తం చేశారు. వ్యక్తిగత తిరుగుబాట్లు చేశారు. స్త్రీ సమస్య సామాజిక సమస్య అని సంస్కరణోద్యమం స్పష్టం చేసింది. చట్టపరమైన పరిష్కారాలను ఆశించింది. అక్కడినుండి బతుకులో మార్పుకోసం స్త్రీలు సన్నసన్నగా మాట్లాడటం మొదలు పెట్టారు.బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్య్రం లభించాక ఏర్పడిన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య ప్రభుత్వం స్త్రీ పురుష సమానత్వం, స్త్రీల అభివృద్ధి లక్ష్యంగా అనేక హామీలు ఇచ్చింది. అంతర్జాతీయ ఒప్పందాలలో భాగం అయింది. అంతర్జాతీయ మహిళా సంవత్సరం , దశాబ్దమూ గడిచి పోయాయి. అయినా స్త్రీల బతుకులు యథాతథ స్థితిలోనే ఉన్నాయి ఈ ఎరుక నుండే నిత్య మొదటి కవితలో “బతుకు మారుతుందని / ఎదురు చూసి ఎదురు చేసి/” మన్ను లో కలిసిన ముందటి తరం గురించి చెప్పి తమ తరం కాటికి కాళ్ళు చాచుకొని ఉందని చెప్పింది. ఒట్టి ఎదురుచూపులతో బతుకు మారదని , బతుకు మారాలంటే ఒక ఆచరణ ఉండాలని అర్ధమయ్యేసరికి తమ కాలం గడిచి పోయింది కనుక తన తరువాతి తరాన్ని” తల్లీ మీరన్నా చూడండి / తూర్పు దిక్కున క్రాంతిరేఖ!/ సారించండి విల్లంబులు” అని హెచ్చరించింది.

ఆర్ధిక అసమానతలు, పీడన , దోపిడీ ఉన్న సమాజంలో మార్పుకు అవసరమైన సాయుధ విప్లవ మార్గమే స్త్రీల బతుకులను కూడా మార్చగలదు అన్న నమ్మకం తో ఇచ్చిన పిలుపు ఈ కవిత అయితే అందులో మేము , మీరు అన్న విభజన ఉంది. ఆచరణ మధ్యమ పురుషను సంబోధిస్తుంది. కానీ “దంచుదాం రావే చెల్లీ” అనే పిలుపుతోనే మొదలయ్యే రెండవ కవితలో ఆచరణలో చెల్లి తో పాటు అక్క కూడా ఉంది. ‘దంచుదాం’ ఉమ్మడి క్రియావాచకం. చెమటలు కారేట్లు, నెత్తురు ఇంకేట్లు, చేతులు కాయలు కాసేవరకు , కసి పెరిగే దాకా దంచవలసినది ఎవరిని? అంటే “మన బతుకుల్ని చిదిమేసిన / దోపిడి పిశాచాలను / నాల్గు తలల విషపు నాగులను …” అన్నది సమాధానం. దోపిడి ఆర్ధిక ఆధిపత్యానికి సంబంధించింది అయితే నాల్గు తలల విషపు నాగు – జాషువా చెప్పిన నాలుగు వర్ణాల హిందూ మత సమాజం – సాంస్కృతిక ఆధిపత్యానికి సంబంధించింది. స్త్రీల పై పీడనకు కారణమైన వ్యవస్థ అది. పితృస్వామ్యం తో కూడిన వర్ణ సమాజం. స్త్రీల బాల్యాన్ని బతుకులను చిదిమేసిన ఈ దోపిడీ శక్తులను, పీడక నిర్మాణాలను చితక బాదవలసి వుంది. అది అంత సులభమైన పని ఏమీ కాదు. చెమటలు, నెత్తురు పారవలసినదే. అందుకు చెల్లెళ్లను సిద్ధం చేస్తున్న అక్కను ఈ కవితలో చూస్తాం.
ఆడపిండం అన్వేషణ ( పోరు మహిళ, నవంబర్ 2002- ఫిబ్రవరి 2003) దీర్ఘకవిత. ఆడపిల్ల పుట్టుక అవాంఛనీయం అయిన సమాజంలో ఈ నాడు గర్భస్థ శిశువు ఆడపిల్ల అని తెలుసుకొనే పరీక్షలకు , ఆడపిల్ల అయితే చేసే గర్భస్రావాలకు పెరిగిన డిమాండ్ దానిని ఒక లాభసాటి చీకటి వ్యాపారంగా మార్చింది. పుట్టకుండానే చంపేసే నిర్ణయాలు కుటుంబలో జరుగుతుంటే తల్లి కడుపు నుండే , తల్లి దుఃఖం నుండే ఆ విషయాన్ని గ్రహించి పుట్టాలనే వాంఛను, తండ్రి మీద కోపాన్ని , తల్లి ఆధారిత జీవనం పట్ల జాలిని చూపించి నశించే ఆడపిండాల అంతరంగాలను, లోకంలో ఆడపిల్లల మీద అమలవుతున్న వివక్షను, అణచివేతను, అత్యాచారాలను, హింసను తలచుకొని పుట్టటం కన్నా నశించటమే మంచిదనుకొనే ఆడపిండాల ఆలోచనలను వస్తువు చేసి వ్రాసిన కవితలు తెలుగులో ఎన్నో ఉన్నాయి కానీ నిత్య వ్రాసిన ఈ కవిత వాటన్నిటికంటే భిన్నమైనది. ఇదీ ఆడపిండం ఆలోచనల కథనమే. అయితే ఇది గర్భస్థ పిండం కాదు. గర్భాన్ని వెతుక్కొంటున్న పిండం. “ఓ చల్లని నీడను / ఓ వెచ్చని ఒడిని / వెతుక్కుంటూ/ బయలుదేరింది ఓ ఆడపిండం” అని మొదలవుతుంది ఈ కవిత.

అన్వేషణలో ఆడపిండానికి ఎదురైన దృశ్యాలు ఏమిటి? ఒక దృశ్యం సతీ సహగమనం. సతీ మాతకు జై అన్న అరుపులు ఒకవైపు , నిలువెల్లా మంటల్లో స్త్రీ పెడుతున్న బొబ్బొలు మరొక వైపు , మంటలు ఆర్పటం అపచారం అనే పురోహిత వర్గం.. సతీమాతగా పూజలందుకునే ఆమె భవిష్యత్ చరిత్రను చెప్పే జ్యోతిష్యులు. రెండవ దృశ్యం మళ్ళీ మళ్ళీ ఆడపిల్లలనే కంటున్నదని మరొక బిడ్డతో వచ్చిన భార్యను గుమ్మం దగ్గరే నిలబెట్టి అవమానకరంగా మాట్లాడుతున్న భర్త, ఆడపిల్లను దరిద్రం అని చీదరించుకొంటూ ఆ పిల్లను వదిలి వస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలన్న భర్త షరతును జవదాటలేని, అధికారాన్ని ధిక్కరించలేని అశక్తతో పొత్తిళ్ళలో బిడ్డను చెత్తకుండీలో వదిలేసిన భార్య… మూడవది కులంలేని పిల్లవాడితో ప్రేమ అంటున్నదని ఆడపిల్లను గుండు గీసి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తున్న దృశ్యం. నాలుగవది పుట్టింటి నుండి అదనపు కట్నాలు , కానుకలు తెమ్మన్న భర్త అత్తమామల వేధింపులు, సాధింపులు, తన్నులు, గుద్దులు భరించే సహనం చచ్చిన ఇల్లాలి ఆత్మహత్యా దృశ్యం. అయిదవది వధువు తండ్రి ఇస్తానన్న కట్నం ఇయ్యలేదని తాళి కట్టవలసిన వరుడు పీటలమీదనుండి లేచిపోయిన దృశ్యం. ఆరవ దృశ్యంలో గర్భస్థ శిశువు ఆడపిల్ల అయితే బలవంతపు అబార్షన్లను తప్పించుకొనటం సాధ్యమేనా అన్న ఆందోళనతో అమ్నియో సెంటిసిస్ పరీక్షా కేంద్రాలముందు బారులు తీరిన స్త్రీలు వున్నారు. ఈ దృశ్యాలు అన్నీ ఆడవాళ్లను అవమానించేవి, తిరస్కరించేవి కనుక ఆడపిండాన్ని భయపెట్టేవే.

భర్తతో మరణించవలసిందే కానీ భర్త లేకుండా బతకటానికి వీల్లేదనే సతి సంస్కృతి, ఆడపిల్లలను కనటం స్త్రీల నేరంగా చేసి శిక్షించటం, ఇష్టమైన వాడిని ప్రేమించటానికి స్వతంత్రంలేని ఆడపుట్టుక, కట్నకానుకల పేరుమీద పెళ్ళికి ముందో తరువాతో అవమానాలకు, తిరస్కారాలకు గురికావాల్సిన ఆడవాళ్ళ దౌర్భగ్యం, అసలు పుట్టటానికే అవరోధం అవుతున్న అధికారం – ఇవన్నీ ఆడపిండానికి కావలసిన చల్లని నీడను, వెచ్చని ఒడిని వాగ్దానం చేసేవి కావు. ఇవి జనజీవన స్రవంతిలోని దృశ్యాలు. అయితే ఇవేవీ ఆడపిండాన్ని ఆహ్వానించే అనుకూల దృశ్యాలు కావు కనుకనే ‘ఎటులైనా ఇచటనే ఆగిపోనా’ అని అనిపించేలా చేయలేదు. ఈ ఆరుదృశ్యాల అపసవ్య జీవితాన్ని చూపిన తరువాత సవ్యము, సుందరమూ అయిన జీవితం ఎలా ఉండాలో మచ్చుకైనా చూపకపోతే కవితకు ప్రయోజనం లేదు. ప్రయోజనం లేని కవిత నిత్య వ్రాయదు. ఈ కవిత ముగింపు దానినే చెప్తుంది.

ఏ రకంగానూ వేరూనటానికి అర్హం కాని జనజీవన స్రవంతి ని తప్పించుకొని వెళ్లిపోతున్న ఆడపిండాన్ని అడవికి సన్నిహితం చేయటంద్వారా కవయిత్రి ప్రత్యామ్నాయజీవన విధానాన్ని పరిచయం చేసినట్లయింది. పీడన, అధికారం, అణచివేత, దుఃఖం తప్ప జనజీవన స్రవంతిలో మరేమీ అనుభవానికి రాని ఆడపిండానికి అడవిలో సందడి, సంతోషం కనబడ్డాయి. కేరింతలు వినబడ్డాయి. ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో ఒకే తీరుగా ఉన్న ఆడవాళ్లు , మగవాళ్లు అడవిలో మొదటి బిడ్డ పుట్టిందని సమానంగా సంతోషపడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆడబిడ్డ అని ఏడుపులు , చీదరింపులు , తిరస్కారం లేకపోగా ఆడబిడ్డ పుట్టుకకు సంబర పడగల ఒక కొత్త ప్రజాస్వామిక జీవిత సంస్కృతి విప్లవోద్యమ ప్రాంతాలలో నిర్మించబడుతున్నదని ఈ భాగంలో చాలా నేర్పుతో సూచించింది కవయిత్రి.ఇక్కడే ఆగిపోవాలని ఆడపిండానికి అనిపించేట్లు చేసింది ఆ వాతావరణమే. జనజీవన సంస్కృతిలో తిరస్కృతులు, బహిష్కృతులు సాంత్వన పొందగల స్థావరం విప్లవ శిబిరమే అని నిర్ద్వంద్వంద్వం గా నిరూపించటం లో ఉంది ఈ కవిత గొప్పతనం.

‘అందం – ఆదర్శం’ మరొక విశిష్టమైన కవిత. అందం అనాది నుండి నేటివరకూ కవితావస్తువు అవుతూనే ఉంది. అది ప్రకృతి అందం కావచ్చు .. స్త్రీ అందం కావచ్చు…భూస్వామ్య రాచరికాలలో అనుభవయోగ్యమైన వస్తువు అయిన స్త్రీ అందం పెట్టుబడిదారీ సమాజంలో వ్యాపార వస్తువు అయింది. వస్తువినిమయ సంస్కృతి లో మార్కెట్లో వస్తువులను ప్రమోట్ చేయటానికి అందమైన ఆడవాళ్లు అవసరం అయినారు. అందాల పోటీలు ఆ క్రమంలోనే ప్రాముఖ్యానికి వచ్చాయి. 1996 లో భారతదేశంలో తొలిసారి బెంగుళూరులో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ కంపెనీ ఈ ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించింది. వీటిని వ్యతిరేకిస్తూ ఆనాడు దేశంలో మహిళలు ఉద్యమాలు చేశారు. అందానికి కొలతలు, మేకప్, అలంకరణ సామగ్రి ప్రమాణాలు కావటంలోని రాజకీయాల ను చర్చిస్తూ కరపత్రాలు, బుక్ లెట్స్ ప్రచురించారు. ఈ నేపథ్యంలో నిత్య కూడా ప్రపంచ సుందరి పోటీల చరిత్ర గురించి తెలుసుకొనటానికి, తెలియ చెప్పటానికి ప్రయత్నించినట్లు లభ్యమైన ఒక పేజీ అసంపూర్తి రచన వల్ల తెలుస్తున్నది. ఈ క్రమం లో నిత్య పెట్టుబడి సంస్కృతి అందానికి ఇస్తున్న నిర్వచనాన్ని రద్దు చేసి విప్లవ దృష్టినుండి కొత్త నిర్వచనం ఇయ్యటానికి వ్రాసిన కవిత ‘అందం – ఆదర్శం’( పోరు మహిళ మార్చ్ 5- ఫిబ్రవరి 6).

అందం గురించిన నిర్వచనం ఆదర్శాలు మారినప్పుడు మారుతుంటాయని మూడు సందర్భాలనుండి నిరూపించటం చూస్తాం ఈ కవితలో. మొదటి సందర్భం తల్లి ఒక ఐఏఎస్ అమ్మణి గురించి తన చిన్నతనాన చెప్పిన మాటలతో మొదలవుతుంది.
“నుదిటి మీద చిన్న బొట్టు
చెవులకు ఒంటి ముత్యపు టాప్స్
వేలికి పగడపు ఉంగరం
మెడలో సన్నని బంగారు గొలుసు
కుడి చేతికి రిస్టు వాచీ” ఈ మాటలు అందం అంటే నిరాడంబరత అన్న అవగాహనను ఇయ్యేటమే కాదు ఆ నాటికి దానిని తన ఆదర్శం చేశాయి. రెండవ సందర్భం విప్లవరాజకీయాల సంబంధంలోది. 1969 శ్రీకాకుళ ఉద్యమం గురించి వింటూ తెలుసుకొంటూ ఉన్న క్రమంలో అంతవరకు అందానికి నిర్వచనంగా తనలో ముద్రపడిన ‘నిరాడంబరం’గా ఉన్న ఐఏఎస్ అమ్మణి స్థానంలోకి పంచాది నిర్మల వచ్చి చేరింది.
“నుదిటి నిండుగా గుండ్రని సింధూరం
ఎడమపాపిడి
చెదరని జుట్టు
ముడిచిన కొప్పు
బోసిమెడ- చెవులు అందానికి నిర్వచనం అయినాయి. 1990 తరువాత సాయుధ విప్లవ దళాలలో “ పట్టింపుల్లేని చింపిరి జుట్టుతో భుజానికి కిట్టు , కుడి భుజానికి ఎస్ఎల్ ఆర్, ఎడమభుజానికి వేళ్ళాడే సంచి తలమీద ఇనుప క్లేమోర్ తో ఆచరణలో ఉండి డౌలా దాడిలో అమరత్వం పొందిన కరుణ (మోతి ) అందానికి నిర్వచనం అయింది. అందం శరీరపు ఒడ్డూ పొడుగును బట్టి కటి, నడుము, వక్షోజాల కొలతలను బట్టి నిర్ణయించే పెట్టుబడి దారీ విలువ సిద్ధాంతాన్ని త్రోసిరాజని పని సంబంధంలో, ప్రాధాన్యతలో పునర్నిర్వచించటం ఈ కవితలో జరిగింది. ఆదర్శమే అందం కానీ అందం సాధించవలసిన ఆదర్శం కాదు.

స్త్రీల ను పూజించే చోటుగా చెప్పబడే భారతదేశంలో నిత్యం స్త్రీల మీద జరిగే హింస గురించి చెప్పే కవిత “స్త్రీలను పూజించే చోట” స్త్రీలను పూజించే చోట దేవతలు కొలువు తీరుతారు అని చెప్పే మనుస్మృతి శిరోధార్యం అయిన దేశంలో “నిండు చూలాలి గర్భాన్ని బాయ్ నెట్లతో చీల్చి గర్భస్థ పిండాన్ని బాకులతో గుచ్చిన మూకవెల్లి ఘటనను, సురేఖ , ప్రియాంకల మీద జరిగిన జాతి అహంకార దాడిని నిరసన స్వరంతో పేర్కొన్నది కవయిత్రి. అడవిపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రభుత్వం పంపిన కేంద్ర రిజర్వు బలగాలు ఆదివాసీ పల్లెల మీద దాడులు చేసి కొట్టటం, హింసించటం, కాల్చి చంపటం, స్త్రీలపై అత్యాచారాలు చేయటం మామూలైంది. వెడింజె మల్లి, వెడింజె నంగి ఆ రకంగా కాల్చి చంపబడ్డవాళ్లు. నిండు చూలాలు నంగి గర్భాన్ని బాయినెట్ తో చీల్చి గర్భస్థ పిండాన్ని బాకులతో గుచ్చిన తీరు ‘మాతృదేవోభవ, అన్న సంస్కృతికి విరుద్ధం కాదా అన్నది ఆమె ప్రశ్న. వాళ్ళిద్దరినీ పేర్లతో ప్రస్తావించటం ద్వారా ఆదివాసీ స్త్రీల మీద జరుగుతున్న రాజ్య హింస వైపు మన చూపు తిప్పుతుంది కవయిత్రి. ఈ కవితలో పేర్కొనబడిన మరిద్దరు స్త్రీలు సురేఖ, ప్రియాంక. ఖైర్లాంజీ గ్రామానికి చెందినవాళ్లు. మహారాష్ట్రలో భండారా జిల్లాలో గ్రామం. ఆ వూళ్ళో భూ వివాదం కారణంగా అగ్రవర్ణపెత్తందారులు ఒక దళిత కుటుంబం మీద దాడి చేసి వూళ్ళో నగ్నంగా తిప్పి చచ్చేవరకు కొట్టిన ఘటన పెద్ద సంచలనం అయింది. సురేఖ, ప్రియాంకా ఆ కుటుంబంలోని స్త్రీలు. వాళ్ళిద్దరి పై జరిగిన హింసను ప్రస్తావించటం ద్వారా దళితులపై దేశంలో నిత్యకృత్యమైన హింసను సంబోధించింది. ఇలా ఏదో ఒక చోట దళిత ఆదివాసీ స్త్రీల మీద అత్యాచారాలు, గర్భవిచ్చేదాలు, హత్యలు చేసే దేశం స్త్రీలను పూజించే చోటుగా చెప్పబడటంలోని విరోధాభాసను ఫోకస్ లోకి తేవటం ఈ కవిత ప్రయోజనం.

“రాజ్య హింస రాకాసి కోరలకు బలయిన నా చెల్లెళ్ళు వెడింజె మల్లి, వెడింజె నంగి, కురసం లక్కీ, మొడియం సుక్కి, ఏమ్ల అయితెలు, దోపిడి రాజ్యాన్ని కూలదోయ సాయుధులైన కుమ్మే, రజిత, రాధ, స్వరూప, లిమామి లాంటి పోరుబిడ్డలు, కడితి సోమి, లక్కె నానో, మీనా ( మిచ్ఛ సరిత) , మాదవి సీతే లాంటి మహిళా నాయకులు మహిళావిముక్తికి బాటలు వేసిన వారి త్యాగాలను, గాధలను దేశం నలుమూలలకు అందించాల్సిన గురుతర కర్తవ్యం” తన మీద ఉన్నదనుకొన్న నిత్య వారి గాధలను మరెన్ని కవితలుగా మలచిందో.. కాలమే చెప్పాలి.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

2 thoughts on “నిత్య జీవిత కవిత్వ దృశ్యం

  1. కా. నిత్య నిర్మల నర్మదకు అరుణారుణ జోహార్లు. ఆమె కవిత్వం లోతుల్లోకి ప్రయాణం చేయించిన కాత్యాయనీ విద్మహే గారికి ధన్యవాదాలు.

  2. నలుగురి గుర్తింపు కోసమే రచనలు చేసేవాళ్ళకి భిన్నంగా నలుగురికోసం ప్రాణాలు పణంగా పెట్టి బతికే నిర్మల@ నర్మద లాంటి వాళ్ళ గురించిన ఈ నివాళి చదువుతుంటే 30 ఏళ్ల క్రితం నిర్మల మరోసారి కళ్ళముందు మెదిలింది. కాత్యాయని అపురూపమైన ఈ నివాళి తో కామ్రేడ్ నిర్మలకు జోహార్లు .

Leave a Reply