నిజర్ ఖబ్బాని: ప్రపంచ కవిత్వానికి సిరియా దేశ కానుక

1923 లో సిరియాలో జన్మించిన నిజర్ ఖబ్బాని పూర్తి పేరు నిజర్ తౌఫిక్ ఖబ్బాని. అనేకమంది యువకవుల లాగా, నిజర్ తొలిరోజులలో ఎక్కువగా ప్రేమ కవిత్వం రాశాడు. అయితే, అతని ప్రేమ కవిత్వంలో స్త్రీవాద ఛాయలు వుండడం వలన కొంత భిన్నంగా వుండేది. దానికి కారణం, నిజర్ కు పదిహేనేళ్ళ వయసు వున్నపుడు, ఇష్టం లేని పెళ్లి ఖాయం చేశారన్న బాధతో అతని అక్క ఆత్మహత్య చేసుకుంది. చిన్న వయసులో ఆ సంఘటన ప్రభావం నిజర్ రాతల మీద గాడంగా పడింది.

ఎంతో కొంత కలిగిన కుటుంబంలో పుట్టడంతో, నిజర్ మంచి చదువులకు నోచుకున్నాడు. తాను పుట్టిన డమాస్కస్ నగరం లోనే న్యాయ శాస్త్ర పట్టా అందుకున్నాడు. తొలి నాళ్ళ కవిత్వం అంతా కాలేజీ రోజులలో రాసిందే! ‘ద బ్రన్నెట్ టోల్డ్ మి’ పేరున పుస్తకం తీసుకు రావాలనుకున్నపుడు, నిజర్ రచించిన అటువంటి కవిత్వానికి డమాస్కస్ నగరంలో ఆదరణ వుండదనిపించి, తండ్రి స్నేహితుడైన విద్యా శాఖ మంత్రితో ముందు మాట రాయించాడు. సాహిత్యం చదువుకున్న ఆ మంత్రి గారికి యువకుడైన నిజర్ రాసిన కవిత్వం కొత్తగా అనిపించి మంచి ముందు మాట రాశాడు. దానితో, నిజర్ తొలి పుస్తకానికి మంచి ఆదరణ లభించింది. అయితే, 1954 లో వెలువడిన నిజర్ తొలి కవితల పుస్తకం ‘చైల్డ్ హుడ్ ఆఫ్ బ్రెస్ట్’, అతడిని దేనికీ వెరవని కవిగా నిలబెట్టింది.

ఉన్నత చదువులు పూర్తయిన తరువాత, రాయబార కార్యాలయాలలో వృత్తిని ఎన్నుకోవడంతో, అనేక సంవత్సరాల పాటు నిజర్ తాను పుట్టిన డమాస్కస్ నగరానికి దూరంగా మ్యాడ్రిడ్, లండన్ వంటి నగరాల లోనే ఎక్కువగా నివసించాడు. అయినప్పటికీ, డమాస్కస్ నగరం మీద ప్రేమతో ‘జాస్మిన్ సెంట్ ఆఫ్ డమాస్కస్’ అన్న గొప్ప స్మృతి కవిత రచించాడు.

అప్పటిదాగా ప్రేమ కవిత్వమే ఎక్కువగా రాసిన నిజర్, 1967 లో జరిగిన ఇజ్రాయిల్ – అరబ్ యుద్ధం తరువాత రాజకీయ కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. రష్యాకు బ్యాలే లాగ, ఇంగ్లాండ్ కు ఫుట్ బాల్ లాగ, అరబ్బు దేశాలకు కవిత్వం అన్నది ప్రజల ఆస్తి వంటిది అంటారు. అందుకే, ఆ యుద్ధం తరువాత, అరబ్బు దేశాల శక్తిని, పరిమితులనీ విమర్శిస్తూ నిజర్ రాసిన ‘మార్జినల్ నోట్స్ ఆన్ ది బుక్ ఆఫ్ డిఫీట్’ అన్న కవిత అనేక విమర్శలకు గురయ్యింది. నిజానికి ఆ కవిత అరబ్బు దేశాల నియంతృత్వ పోకడల మీద ఎక్కుపెట్టిన విమర్శ. అరబ్బు యువతను ఆ నియంతృత్వ సంకెళ్ళను ఛేదించుకుని విజయం సాధించమని ఇచ్చిన పిలుపు. కవిత వెలువడినపుడు నిషేధానికి గురయినా తరువాత కాలంలో అరబ్బు కవిత్వ లోకంలో ఒక మాస్టర్ పీస్ గా పేరు తెచ్చుకున్నది. ఇట్లా మొదలవుతుంది కవిత –

“మిత్రులారా!
పాత పదం మరణించింది
పాత పుస్తకాలు మరణించాయి
చీకిపోయిన పాత చెప్పుల వలె
బొక్కలతో వున్న మన ఉపన్యాసం మరణించింది
చచ్చిన మెదడు వల్లనే ఓటమి సంభవించింది”

అరబ్ –ఇజ్రాయిల్ యుద్ధం తరువాత, చాలా కాలంపాటు లండన్ ను తన నివాస కేంద్రం చేసుకున్న నిజర్, అక్కడే తన సొంత ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. 1980 లలో బీరుట్ లో జరిగిన ‘లేబనీస్ సివిల్ వార్’ గెరిల్లా యుద్ధంలో నిజర్ రెండవ భార్య బాంబు దాడిలో చనిపోయినపుడు ‘ఓ నా ప్రిన్సెస్! ఇది నీ సమాధియేనా? లేక, అరబ్ జాతీయత సమాధియా?’ అని విలపిస్తూ అతడు రాసిన కవిత ప్రపంచ వ్యాప్తంగా అనేక హృదయాలను కదిలించింది.

1998 లో లండన్ లో మరణించిన నిజర్, తనకు ‘కవిత్వం నేర్పించిన అమ్మ గర్భం, డమాస్కస్ నగరం’ లోనే తన పార్థివ దేహాన్ని సమాధి చేయమని తన ఆఖరు కోరికగా రాసుకున్నాడు.

జెరూసలేం

కన్నీళ్లు ఇంకిపోయేంత వరకు ఏడ్చాను
కొవ్వొత్తులు ఆరిపోయే వరకు ప్రార్థించాను
నేల కిందకు కుంగి పోయేంతగా మోకరిల్లాను

మహమ్మద్ గురించి అడిగాను, క్రీస్తు గురించి అడిగాను
ప్రవక్తల సుగంధం నిండిన ఓ జెరూసలేం
భూమి నుండి ఆకాశానికి దగ్గరి దారి వంటి జెరూసలేం
చేతివేళ్లు కాలిపోయి, కళ్ళు వాలిపోయిన
అందమైన పిల్ల వంటి జెరూసలేం

ప్రవక్త ఆమోదించిన నీడనిచ్చే ఒయాసిస్సువు నువ్వు
కానీ నీ వీధులు విచారంగా కనిపిస్తున్నాయి
నీ మీనార్లు దు:ఖంతో దర్శనమిస్తున్నాయి
నలుపు రంగు దుస్తులు ధరించిన అందమైన యువతివి నీవు
శనివారం ఉదయం నీ సమక్షంలో గంటలు మోగించేది ఎవరు?
క్రిస్మస్ పండుగనాడు పిల్లలకు బొమ్మలు ఎవరు తీసుకొస్తారు?

ఓ జెరూసలేం! నా దు:ఖ నగరమా!
కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి
మతాల ముత్యమా!
నీపై దాడిని అడ్డుకునేది ఎవరు?
నీ రక్తపు మరకల గోడలను శుభ్రం చేసేది ఎవరు?
బైబిల్‌ను ఎవరు కాపాడుతారు?
ఖురాన్‌ను రక్షించేది ఎవరు?
క్రీస్తును ఎవరు రక్షిస్తారు?
ఇంతకూ, మనిషిని ఎవరు రక్షిస్తారు?

ఓ నా ప్రియ పట్టణమా!
నా ప్రేయసి వంటి జెరూసలేం!
రేపు నిమ్మచెట్లు వికసిస్తాయి
ఆలివ్ చెట్లు సంతోషంతో ఊగుతాయి
నీ కళ్ళు నాట్యం చేస్తాయి
వలస వెళ్ళిన పావురాలు పవిత్రమైన నీ నీడకు చేరతాయి
ఈ ప్రాంగణం తిరిగి నీ పిల్లల ఆటపాటలతో నిండిపోతుంది
తల్లిదండ్రులూ పిల్లలూ తిరిగి కలుసుకుంటారు

ప్రేమను పోల్చినపుడు

నీ పాత ప్రేమికులతో పోల్చకు నన్ను
ప్రేయసీ!
అతడు నీకు మేఘాలను ఇచ్చి వుండొచ్చు
నేను నీకు వర్షాన్ని బహూకరిస్తాను
అతడు నీకు లాంతరు అందించి వుండొచ్చు
నేను నీకు చంద్రుడిని ఇస్తాను
అతడు నీకోక కొమ్మను ఇచ్చి వుండొచ్చు
నేను నీకు ఒక చెట్టుని ఇవ్వగలను
అతడు నీకోక పడవను ఇచ్చి వుంటే
నేను నీకు ఒక తీపి ప్రయాణాన్ని కానుకగా ఇస్తాను

భాష

ప్రేమలో ఉన్నప్పుడు ఎవడైనా
పాత పదాలను ఎలా ఉపయోగించగలడు?
ఏ స్త్రీ ఐనా తను ప్రేమించినవాడు
వ్యాకరణవేత్తల కింద భాషావేత్తల కింద
సొమ్మసిల్లి పడి వుండాలని కోరుకుంటుందా?

అందుకే, నేను ప్రేమించిన స్త్రీకి ఏమీ చెప్పలేదు
సేకరించిన ప్రేమ విశేషణాలు అన్నింటినీ
ఒక పెద్ద పెట్టెలో పేర్చి
అన్ని భాషల నుండి పారిపోయాను

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply