విరసం నన్ను ‘శ్వేత’ నుండి ‘శ్వేత ఆజాదీ’ గా మార్చిన సంస్థ అనడం కంటే నా అంతరంగం అంటే బాగుంటుంది. ఒక సాధారణ మనిషి నుంచి నన్ను తీర్చిదిద్దింది విరసం. నాకు ఇప్పటికీ గుర్తుకు ఉంది. మొదటిసారి వరవరరావును చూడాలని మా ఊరిలో జరిగిన 9,10 మార్చ్ 2017లో విరసం సాహిత్య పాఠశాల సభలలో గడిపిన ఆ రెండు రోజులు. ఏమీ తెలియని ఒక చిన్నపిల్లగా ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన నాకు ఎంతో మంది మంచి మనుషులు కనబడ్డారు. అప్పుడు అక్కడ నాకు ఒక అమ్మ కనిపించింది. ఆమె పేరు నాకు తెలియదు. తన చేతిలోని ఫోన్లో ఏవో ఫోటోలు చూసుకొని బాధ పడుతోంది. ”ఏమైందమ్మా…?” అని నేను అడిగాను. అప్పుడు ఆమె తన చేతిలోని ఫోన్ చూపిస్తూ… ”ఇది నా కుతురమ్మా. చనిపోయింది.” అన్నది. ఆ ఫొటోలో భుజానికి తుపాకీ తగిలించుకొని ధైర్యంగా నిలబడ్డ అమ్మాయి కనిపించింది. ఆ ఫోటో చూడగానే ఏదో తెలియని ధైర్యం, ఆశలు చిగురించాయి. ఎలా చనిపోయిందమ్మా… అని అడిగాను. అప్పుడు ఆమె నాతో ఇలా అన్నది – ”నా బిడ్డ ప్రజల కోసం, వాళ్ళ హక్కుల్ని కాపాడిన వాళ్ళ కోసం అమరులైన దాని బంధువుల కోసం చిన్నప్పటి నుండి పోరాడుతూ పోరాడుతూ తాను కూడా అమరుల బాటలోనే నడిచి వెళ్లింది బేటా…” అంటూ కన్నీటిని తుడుచుకుంది. ఆ మాట వినగానే ఒక్కక్షణం నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంకా తనని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో ఇంక నేనేమీ అడగలేదు ఆ అమ్మని.
ఇలా ఆ రెండు రోజుల ప్రయాణంలో ఎందరో తల్లులతో మాట్లాడాను. మళ్లీ వీళ్ళందరి కలవగలనా? అనుకుంటూ రెండు సంవత్సరాలు గడిపేసాను. ఏదోలా కష్టపడి ఇంట్లో ఒక చిన్నపాటి యుద్దమే చేసి 2019 ఫిబ్రవరిలో జరిగిన సాహిత్య పాఠశాల కోసం నల్గొండ వచ్చాను. ఈ రెండు సంవత్సరాల మధ్య కాలంలో నాస్తికవాదం, అంబేడ్కరిజం లాంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఇలా కొద్దిపాటి అవగాహనతో నేను అక్కడికి వెళ్లాను. కానీ ఈ సారి వీవీని కలవలేక పోయాను. ఆయన లేని లోటు తెలిసింది. ఈ సారి మాత్రం సాధారణ విద్యార్థిగా నల్గొండ వచ్చిన నేను ఊహించని పరిస్థితుల్లో విరసం సభ్యురాలినయ్యాను. ఇలా ఒకవైపు వీవీ లేరనే బాధ. మరో వైపు విరసం సభ్యురాలినయ్యానన్న సంతోషం. ముందు సాహిత్య పాఠశాల కంటే ఈ సాహిత్య పాఠశాల నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది.
మా అమ్మ చదువుకోలేదు. చదువంటే ఎంతో ఇష్టం. ఆమె ఆసక్తిని గమనించి లైబ్రరీకి తీసుకువెళ్ళే మా నాన్న. వీళ్ళే నా ఆదర్శాలు. వీళ్ళే నాకు పుస్తకాలు చదవడానికి, వాటిపై ఆసక్తి కలగడానికి కారణం. ఇలా చిన్న చిన్న పుస్తకాలు చదివే నాకు డిగ్రీలో ఉండగా నా చేతికి అందిన పుస్తకం ” ప్రవహించే ఉత్తేజం చే గువేరా ” ఈ పుస్తకం నాకు ఓ సంపూర్ణ మానవుడిని పరిచయం చేసింది. అది చదివిన తరువాత దానిని ఇవ్వాలనిపించక ఒక సంవత్సర కాలం నాతోనే ఉంచుకున్న. అది వేరే విషయం అనుకోండి. అప్పుడప్పుడే మనుషుల గురించి తెలుసుకోవడం ప్రారంభించిన నాకు తలెత్తే ఎన్నో ప్రశ్నలకు సమాధానం అయ్యింది ఆ పుస్తకం. అలాంటి సమయంలో నాకందిన మరో రెండు పుస్తకాలు “ఒక తల్లి”, “తల్లి భూదేవి”… ఈ రెండు పుస్తకాలు నాకు కమ్యూనిజంపై మరింత ఆసక్తిని పెంచాయి. ఒకటేమో బిడ్డ వదిలి వెళ్ళిన జ్ఞాపకాల్లో తన బిడ్డని వెతుక్కుంటే వెళ్లే తల్లి కథ. మరొకటేమో తన బిడ్డలతో సహా కుటుంబం మొత్తాన్ని యుద్ధానికి పంపిన మరో తల్లి కథ. ఇలా నేను చదివిన పుస్తకాలు తక్కువే. అయినా చదివిన ప్రతీ పుస్తకం నన్ను కమ్యూనిజానికి దగ్గర చేశాయి. ఇలా నేను చదివిన పుస్తకాలు తక్కువే అయినా చదివిన ప్రతి ఒక్క పుస్తకం నన్ను కమ్యునిజం కి నన్ను దగ్గర చేశాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి. నాకు కమ్యూనిజం పరిచయమైంది పుస్తకాల ద్వారానే అయినా ఆ పుస్తకాలను పరిచయం చేసినది మాత్రం మా మేడమ్ విరసం వరలక్ష్మి గారు.
విరసం సభ్యురాలిని అయ్యాక నాకు తెలియకుండానే సమాజంతో పాటు నన్ను నేను తెలుసుకోవడం మొదలు పెట్టాను. నా కళ్లముందే ఉండి ఇన్ని రోజులు నా కంటికి కనిపించని మరో కొత్త ప్రపంచాన్నిచూసాను. కొత్త ప్రపంచం అంటే సంతోషాలు నిండి ఉన్న స్వాప్నిక ప్రపంచం కాదు. శ్రామికుల కన్నీటితో తడిసి ముద్దైన వాస్తవ ప్రపంచం. చిన్ననాటి నుండి కొత్త విషయాలను అన్వేషించే నేను ప్రపంచ వాస్తవ రూపం తెలిసిన నాటి నుండి నాలో నేను లేను. కల్లోల ఆలోచనలతో నిండిన ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాను. కమ్యూనిజం పరిచయం అయిన నాటి నుండి ఆలోచనలు, అన్వేషణలు, భయాలు ఆందోళనల మధ్య విరసంతో నా ప్రయాణం మొదలైంది.
మంచి పరిచయం, కొత్త విరసం సభ్యురాలికి స్వాగతం. ఇలా ఎన్నో జ్ఞాపకాలు రచనలుగా మలచాలనీ, కొత్త రచనలు చేయాలనీ ఆకాంక్షశిస్తూ…