2008 లో హాలీవుడ్ నుంచి వచ్చిన అమెరికన్ మిస్టరీ క్రైమ్ డ్రామా చిత్రం చేంజ్లింగ్. దీనికి క్లింట్ ఈస్ట్‌వుడ్ (Clint Eastwood) దర్శకత్వం వహించి, నిర్మించారు. ఈ చిత్ర వ్యవధి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలు.
తప్పిపోయిన తన చిన్నారి బాలుడి గురించి ఆరాటపడుతున్న ఒక తల్లి తన కొడుకు ఆచూకీ కోసం ఫిర్యాదు చేస్తుంది. ఆమె కుమారుడికి బదులుగా పోలీసులు ఇంకొక బాలుణ్ణి చూపిస్తారు. ఆ బాలుడిని నా కొడుకు కాదు అని చెప్పి నందుకు, ఆమెను ఒక తల్లిగా ఉండడానికి అనర్హురాలిగా ముద్ర వేస్తారు. బాలురకు జరిగే ప్రమాదాలు, స్త్రీల సాధికారతను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు, రాజకీయ అవినీతి, మానసిక ఆరోగ్య రోగుల పట్ల పోలీసులు, అధికారులు చూపే కౄరత్వం, హింసల పర్యవసానాలను అన్వేషిస్తుందీ సినిమా!
1928 లో లాస్ ఏంజెలస్ లో నివశిస్తున్న, క్రిస్టిన్ కాలిన్స్ (Christine Collins) అనే ఒక ఒంటరి తల్లి టెలిఫోన్ సూపర్ వైజర్‌గా పనిచేస్తూ, తన అదనపు షిఫ్ట్ ముగించుకుని ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. తన తొమ్మిదేళ్ల కుమారుడు వాల్టర్ (Walter) ఇంట్లో లేడని తెలుసుకుని, చాలా ఆందోళనతో ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళను అడిగి లాస్ ఏంజెలస్ పోలీస్ డిపార్ట్ మెంట్ (Los Angeles Police Department – ఎల్ ఎ పి డి) కి రిపోర్ట్ చేస్తుంది.
రెవరెండ్ గుస్తావ్ బ్రీగ్లెబ్ అనే చర్చ్ ఫాదర్ ఎల్ ఎ పి డి చీఫ్ జేమ్స్ ఇ. డేవిస్ నాయకత్వం లోని “గన్ స్క్వాడ్” చట్ట విరుద్ధంగా పని చేస్తుందని, అసమర్థత, అవినీతులతో నిండిపోయి, నిర్ధోషులకు అక్రమమైన శిక్షలు అమలు చేస్తుందనే విషయాన్ని చర్చ్ వేదిక నుండి రేడియో ద్వారా ప్రచారం చేస్తుంటారు. క్రిస్టీన్ దయనీయమైన దుస్థితిని గమనిస్తుంటారు. క్రిస్టీన్ కేసును సోదాహరణంగా తీసుకుని ఆయన తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు.
వాల్టర్ అదృశ్యమైన చాలా నెలల తరువాత, బాలుడు సజీవంగా ఉన్నట్లు క్రిస్టీన్ కు ఎల్ ఎ పి డి పోలీసుల నుంచి కబురొస్తుంది. రెవరెండ్ గుస్తావ్ బ్రీగ్లెబ్ ఎల్ ఎ పి డి విభాగం మీద చేస్తున్న పోలీసుల ప్రతిష్ట ను దిగజార్చే ప్రచారానికి వ్యతిరేకంగా, విమర్శలను రూపుమాపి క్రిస్టీన్ కేస్ సానుకూల ప్రభావం చూపిస్తుందని పోలీసులు నమ్ముతారు. తల్లీ-కొడుకుల కలయికను ఎల్ ఎ పి డి మీడియా ముందు బహిరంగంగా ఆర్భాటంగా ఏర్పాటు చేస్తుంది. బాలుడు “మమ్మా” అని పిల్చినప్పటికీ క్రిస్టీన్ బాలుడిని చూసినప్పుడు ఆమె ఆరాటమంతా ఆవిరై పోతుంది. అద్భుతంగా ఊహించుకుని పడిగాపులు పడ్డ క్షణం కాస్తా తక్షణమే ఒక పీడకలగా మారుతుంది. ఎందుకంటే ఆ బాలుడు “వాల్టర్” కాదు. అదే విషయం ఆమె నిక్కచ్చిగా చెప్పినప్పటికీ “మీరు పొరబడ్డారని నాకు ఖచ్చితంగా తెలుసు,” అని జువెనైల్ డివిజన్ అధిపతి అయిన కెప్టెన్ జె.జె. జోన్స్ ఆ బాలుడు వాల్టరే అని నొక్కి చెప్తూ మీడియా ముందు తన పరువు పోయేలా ఉందని క్రిస్టీన్‌ను “ట్రయల్ ప్రాతిపదికన” ఇంటికి తీసుకెళ్లమని అదేపనిగా బలవంతం చేస్తాడు. అతడు ఒత్తిడి చేయడం వల్ల విధి లేక ఆమె అంగీకరిస్తుంది. కానీ ఆమె, ఆ బాలుడు తన కొడుకు కాదని నొక్కి చెప్తూ తన కుమారుడి కోసం అన్వేషణను కొనసాగించమని చాలా దుఃఖంతో పోలిసు అధికారులను ప్రాధేయ పడుతుంది!
తన కుమారుడికి మారుగా ఎల్ ఎ పి డి పోలీసులు చూపించిన బాలుడు నిజమైన వాల్టర్ కంటే మూడు అంగుళాలు తక్కువగా ఉన్నాడని, అతని దంతాల పలువరసలు కూడా వేరుగా ఉన్నాయని, ఆశ్చర్యకరంగా అతనికి సున్తీ కూడా చేయించి ఉందని ఈ మార్పులు గమనించమని కెప్టెన్ జోన్స్ ను ఆవేదనతో దుఃఖంతో వేడుకుంటుంది క్రిస్టీన్.
కెప్టెన్ జోన్స్ క్రిస్టీన్ ను సందర్శించమని ఒక వైద్యుడిని పంపిస్తాడు. ఆ వైద్యుడు పిల్లవాడికి అకస్మాత్తుగా తగిలిన బెదురు, షాక్ ల వల్ల అతని వెన్నెముక కుచించుకు పోయిందని, అందువల్ల”వాల్టర్” అదృశ్యమయ్యే ముందు కంటే మూడు అంగుళాలు తగ్గిపోయాడని చెప్తాడు. వాల్టర్ ని ఇన్నాళ్ళూ పెంచినతను అతనికి సున్తీ చేయించాడని కూడా వైద్యుడు క్రిస్టీన్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమెకు వైద్యుడి మాట మీద కించిత్తు కూడా నమ్మకం కుదరదు. ససేమిరా ఒప్పుకోదు. చెప్పలేనంత అసహనానికి గురైన కెప్టెన్ జోన్స్ మాత్రం ఒక తల్లిగా పనికిరాదని ఆమెపై మోస పూరితమైన అబద్ధపు నిందారోపణలు చేస్తుంటాడు. ఇదిలా ఉంటే ఒక వార్తాపత్రిక క్రిస్టీన్ కు తల్లిగా ఉండడానికి ఏమాత్రం అర్హత లేదని సూచించే ఒక కథను చిలవలు పలవలుగా కల్పించి ముద్రిస్తుంది! బాధపడవద్దని మిమ్మల్నికించపరచడానికి పోలీసులు దీనిని సృష్టించారని రెవరెండ్ గుస్తావ్ బ్రీగ్లెబ్ క్రిస్టిన్ కు దుఃఖోపశమనపు మాటలు చెప్పి ఊరడించే ప్రయత్న చేస్తారు!
వాల్టర్ క్లాస్ టీచర్, అతని దంతవైద్యుడు – ఇద్దరూ వాల్టర్ స్థానంలో వచ్చిన బాలుడు వాల్టర్ గా నటిస్తున్న ఒక మోసగాడని నొక్కి చెప్తూ సంతకాలు చేసి రాసిన లేఖలను క్రిస్టీన్ కిస్తారు. క్రిస్టీన్ తన కథను పత్రికలకు చెబుతుంది. ఫలితంగా, కెప్టెన్ జోన్స్ ఆమెను లాస్ ఏంజిల్స్ కౌంటీ హాస్పిటల్ కి చెందిన “మానసిక రోగుల వార్డ్” లో బంధించి ఉంచుతాడు! క్రిస్టీన్ అక్కడున్న మరో మహిళా ఖైదీ కరోల్ డెక్స్టర్ (Carol Dexter) తో స్నేహం చేస్తుంది. పోలీసు అధికారాన్ని ప్రశ్నించి, సవాలు చేసినందుకు అక్కడికి పంపబడిన అనేక మంది మహిళలలో తాను కూడా ఒకదాన్నని క్రిస్టిన్ తెలుసుకుంటుంది!
సైకియాట్రిక్ వార్డ్ లో ఉన్న డాక్టర్ స్టీల్, క్రిస్టీన్ తరచుగా భ్రమల్లోకి వెళుతుందని చెప్పి, మానసిక అవస్థలను క్రమబద్దీ కరించడానికి మాత్రలు తీసుకోమని క్రిస్టీన్ ను బలవంతం చేస్తాడు. ఆమె ఆ మందులు వేసుకోనని తిరస్కరిస్తుంది. ఆమె గనుక వాల్టర్ విషయంలో పొరపాటు పడ్డానని, తప్పై పోయిందని ఒప్పుకుంటే తాను ఆమె విడుదలకు ఏర్పాటు చేస్తానని డాక్టర్ స్టీల్ చెప్తాడు. కానీ ఆమె నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. క్రిస్టీన్ ను సైకియాట్రిక్ వార్డులో చెప్పరాని హింసకు గురి చేస్తారు.
సీన్ కట్ చేస్తే రివర్ సైడ్ కౌంటీలోని వైన్విల్లే నుంచి ‘శాన్ఫోర్డ్ క్లార్క్’ అనే 15 ఏళ్ల బాలుడిని అమెరికా నుంచి కెనడాకి పంపడానికి డిటెక్టివ్ లెస్టర్ యబర్రా ఏర్పాట్లు చేస్తాడు. బాలుడి మామ గోర్డాన్ నార్త్ కాట్ కలిసి, బాల నేరస్థుల బాగోగులను, వారికి సంబంధించిన వ్యాపార విశేషాలు చూసుకోవడమే తన ఉద్యోగమని యబర్రాతో జరిగిన ఎన్కౌంటర్ లో చెప్తాడు. ఆ తర్వాత అంతు లేకుండా పారిపోతాడు. నార్త్ కాట్ ఇరవై మంది పిల్లలను అపహరించడానికి, హత్య చేయడానికి తనను బలవంతం చేశాడని క్లార్క్, డిటెక్టివ్ యబర్రాకు చెబుతాడు. ఇరవై మంది పిల్లల్లో వాల్టర్ ను ఒకరిగా గుర్తిస్తాడు క్లార్క్. దేశం నుంచి తప్పించి క్లార్క్ ను వెంటనే కెనడాకి పంపమని జోన్స్ ఆదేశిస్తాడు, కాని డిటెక్టివ్ యబర్రా, క్లార్క్ ను బాలుర హత్యాస్థలానికి తీసుకెళ్ళి, వారి మృతదేహాలను ఎక్కడ ఖననం చేశారో అక్కడ తవ్వి తియ్యమని చెబుతాడు. క్లార్క్ మొదట సందేహిస్తాడు, కాని అతను త్వరలోనే పిల్లల శరీర భాగాలను వెలికితీస్తాడు!
మానసికంగా దెబ్బతిని కుంగుబాటులోఉన్న క్రిస్టీన్ పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉందని కెప్టెన్ జోన్స్ ద్వారా తెలుసు కుంటారు రెవరెండ్ గుస్తావ్ బ్రీగ్లెబ్. వైన్విల్లే హత్యల గురించి ఒక వార్తాపత్రిక కథనాన్ని డాక్టర్ స్టీల్ కు, చూపించి ఆ హత్యల్లో వాల్టర్ కూడా ఒక బాధితుడిగా పేర్కొని క్రిస్టీన్ ను విడుదల చేయిస్తాడు రెవరెండ్ గుస్తావ్ బ్రీగ్లెబ్.
డిటెక్టివ్ యబార్రా విచారించినప్పుడు వాల్టర్ కి బదులుగా వచ్చిన పిల్లవాడికి తన అభిమాన నటుడు టామ్ మిక్స్ ను చూడటానికి లాస్ ఏంజిల్స్ కు రావడమే తన ఉద్దేశ్యమని, కానీ పోలీసులు క్రిస్టీన్ కొడుకు అని అబద్ధం చెప్పమని చెప్పారనీ, బలవంతం చేశారనీ చెప్తాడు!
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా లోని వాంకోవర్‌లో పోలీసులు నార్త్ కాట్ ను పట్టుకుని, బంధించి తీసుకువస్తారు. రెవరెండ్ గుస్తావ్ బ్రీగ్లెబ్, తర్వాత క్రిస్టీన్ కేసును ప్రఖ్యాత ప్రజా న్యాయవాది ఎస్. ఎస్. హాన్ కు అప్పజెబుతాడు. ఆయన అన్యాయంగా జైలు శిక్ష ననుభవిస్తున్న ఇతర మహిళలను కూడా విడుదల చేయిస్తాడు.
క్రిస్టీన్, హాన్, బ్రీగ్లెబ్ లు ఈ కేసు విచారణ జరిగిన రోజున లాస్ ఏంజిల్స్ సిటీ హాల్ కు చేరుకుంటారు. అక్కడ వారు లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ పనితీరుపై ఆగ్రహంగా ఉన్న వేలాది మంది ప్రజలు తమ నిరసన వ్యక్తం చెయ్యడం చూస్తారు! లాస్ ఏంజిల్స్ కౌన్సిల్ కెప్టెన్ జోన్స్, చీఫ్ డేవిస్ లను విధుల నుండి తొలగించాలని, పోలీసులు చట్టవిరుద్ధమైన కార్య కలాపాలకు పాల్పడరాదని ఆదేశిస్తుంది!
ఇక్కడ నార్త్ కోట్ విచారణలోని సన్నివేశాలతో సీన్ ఇంటర్ కట్ అవుతుంది. నార్త్ కోట్ బాలుర హత్యలకు పాల్పడినట్లు జ్యూరీ ధృవీకరిస్తుంది. న్యాయమూర్తి అతనికి మరణశిక్ష విధిస్తారు! రెండు సంవత్సరాల తర్వాత కూడా క్రిస్టీన్ వాల్టర్ కోసం తన అన్వేషణను కొనసాగిస్తూనే ఉంటుంది. ఉరిశిక్షకు ముందు క్రిస్టీన్ తనను కలుసుకోవాలని వాల్టర్ గురించిన సమాచారం చెబుతానని నార్త్ కాట్ ఆమెకు ఒక సందేశాన్ని పంపుతాడు. ఆమె వెంటనే నార్త్ కాట్ ను సందర్శిస్తుంది, కాని అతను ఆమె కొడుకును చంపాడో లేదో చెప్పడానికి నిరాకరిస్తాడు. ఆ మరుసటి రోజే నార్త్ కాట్ ను ఉరితీస్తారు.
1935 లో అంటే వాల్టర్ మాయమైన ఏడేళ్ళ తర్వాత, కాలిఫోర్నియాలోని హెస్పెరియా అనే చోట చంపబడ్డాడని భావించిన అబ్బాయిలలో ఒకరైన డేవిడ్ క్లే సజీవంగా ఉన్నాడని తెలుస్తుంది. డేవిడ్ క్లే జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్బాయిలలో ఒకరు వాల్టర్ అనీ, వాల్టర్, ఇంకొక అబ్బాయి, అతనూ కలిసి జైలు నుంచి తప్పించుకున్నారనీ తర్వాత వాల్టర్ విడిపోయాడనీ వెల్లడిస్తాడు! వాల్టర్ ని తిరిగి జైలు అధికారులు పట్టుకున్నారో లేదో డేవిడ్‌కు తెలియదు. కాని అతను తప్పించు కోవడానికి వాల్టర్ సహాయం చేశాడనీ, అతను జీవించే ఉన్నాడనీ క్రిస్టిన్ కు, ప్రేక్షకులకు కూడా గొప్ప ఆశలు కలిగిస్తాడు డేవిడ్ క్లే!
సినిమా ముగింపులో కెప్టెన్ జోన్స్ ను సస్పెండ్ చేశారని, చీఫ్ డేవిస్ ని తన హోదా నుంచి నుంచి కింది పదవికి డిమోట్ చేశారని, కాలిఫోర్నియా రాష్ట్ర శాసనసభ కేవలం అధికారుల మాటల ఆధారంగా ప్రజలను బలవంతంగా మానసిక రోగుల వార్డులకు పంపడాన్ని లాస్ ఏంజిల్స్ కౌన్సిల్ చట్టవిరుద్ధం చేసిందని వినిపిస్తుంది. పోలీసు దుష్ప్రవర్తన, రాజకీయ అవినీతిని బహిర్గతం చేయడానికి రెవరెండ్ గుస్తావ్ బ్రీగ్లెబ్ తన రేడియో ప్రదర్శనను కొనసాగిస్తున్నాడని; హత్యల కళంకం నుండి తప్పించుకోవడానికి వైన్విల్లే దాని పేరును మీరా లోమా గా మార్చిందని, క్రిస్టీన్ కాలిన్స్ తన కొడుకు కోసం శోధించడం ఎప్పుడూ ఆపలేదని వినిపించడంతో సినిమా ముగుస్తుంది. ప్రేక్షకులకు కూడా తల్లీ-కొడుకులు కలుసుకుంటారనే అద్భుతమైన ఆశలు కలిగిస్తూ ముగుస్తుందీ సినిమా!
1920 లలో అమెరికన్ సమాజం – మహిళల పట్ల పోలీసుల చిన్నచూపు. ఒక నిజం చెప్తున్నందుకు మగ పోలీసులు, మానసిక రోగ వైద్యులు అహంకారంతో ఒక మహిళ అని కూడా చూడ కుండా దౌర్జన్యంగా నానా దుర్భాషలాడి అవమానిస్తారు. బలవంతంగా కొత్త పిల్లవాడిని తన కొడుకుగా అంగీకరిస్తే విడుదల చేస్తామని బెదిరిస్తారు. కానీ ఆమె తన కుమారుడి కోసం పరితపించే ఒక తల్లిగా తల్లులెప్పుడూ తమ బిడ్డల విషయంలో పొరపడరనే దృఢ నిశ్చయంతో నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. ఇక ఆమెను రకరకాల చిత్రహింసలకు గురి చేస్తారు. అత్యంత కౄరంగా ఎలక్టిక్ షాక్స్ ఇస్తారు. ఆమె కష్టాలు తీవ్ర తరమవుతున్నకొద్దీ వీక్షిస్తున్న ప్రేక్షకుల ఆగ్రహం రెండింతలు రెట్టింపవుతుంది!
దీనికి నిజమైన కథ ఆధారమని చెప్పడానికి 1928, మార్చి10 శనివారం నాడు జరిగిన సంఘటన అని తేదీలతో సహా స్క్రిప్ట్ రచయిత మైఖేల్ స్ట్రాజిన్స్కీ (Michael Straczynski) వివరాలిస్తాడు. ఈ కథ యదార్ధ జీవిత గాధ అని నిరూపించడానికి రచయిత మైఖేల్ స్ట్రాజిన్స్కీ యూనివర్సల్ స్టూడియో న్యాయ విభాగంతో పని చేశానని చెప్పారు. కొన్ని వేల పేజీల స్క్రిప్ట్ నుండి రూపొందించిన సంభాషణలు, సినిమాటోగ్రఫీ, నటన, కథాంశం – అన్నిటికీ వాస్తవ ఘటనలే ఆధారం!
క్లింట్ ఈస్ట్‌వుడ్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాల్లాగా థ్రిల్లర్‌గా నిర్మించలేదు. అనవసరమైన శైలీ విన్యాసాలు లేవు. కల్పిత నాటకీయాలు లేవు. షాకింగ్ స్టంట్స్ లేవు. పోలీసుల అబద్ధాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, హింసించడం వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడడాన్ని ముఖ్యంగా చూపదల్చుకున్నారు డైరెక్టర్ క్లింట్. ఎల్ ఎ పి డి 50 మంది వ్యక్తుల “గన్ స్క్వాడ్” ను, సృష్టించడం, ఇది నేరస్థులను చంపడం, అధికారులు లంచం తీసుకోవడం, నోరెత్తి నిరసన తెల్పడమే భరించరాని నేరమైనట్లు మానసిక వార్డుల్లో బంధించి కౄరంగా హింసించడం మొ.న విషయాలను రెవరెండ్ గుస్తావ్ బ్రీగ్లెబ్ గమనించి తన రేడియో ప్రసంగాల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు ప్రతిభావంతంగా దృశ్యీకరంచారు క్లింట్!
పోలీసుల దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా పాస్టర్ అయిన రెవరెండ్ గుస్తావ్ బ్రీగ్లెబ్, తన చర్చ్ ప్రధాన వేదిక నుంచి మానవ హక్కుల కోసం, కొన్ని ఆదర్శాల కోసం నిజాయితీగా నిలబడతారు. ఆయన క్రిస్టీన్ పేగుబంధాన్ని అర్ధం చేసుకుంటారు. ఆమె యాతన పట్ల నిజాయితీగా స్పందించి ఒక మిత్రుడుగా వ్యవహరిస్తారు. తన మద్దతును అందిస్తారు. క్రిస్టీన్ కథ పోలీసు డిపార్ట్మెంట్లో సంస్కరణలు తీసుకు రావడానికి సహాయపడుతుందని నమ్మి, బలమైన నిరసనలను నిర్వహిస్తారు. శక్తివంతమైన న్యాయవాదితో ఆమెను అనుసంధానిస్తారు. క్లింట్ ఈస్ట్‌వుడ్ ఈ పాత్రను చిత్రంలో అమర్చిన తీరు అద్వితీయం!
19వ శతాబ్ధంలో చర్చ్ ఫాదర్లు ఇంత మానవీయంగా ఉండడం చాలా ఆశ్చర్య పరిచే విషయం. “రోం ఓపెన్ సిటీ”(Rome Open City) చిత్రంలో కూడా చర్చ్ ఫాదర్ గొప్ప విప్లవాత్మకంగా ప్రవర్తిస్తారు. ఆ రోజుల్లో ప్రతి అన్యాయాన్నీ ఎదిరించి పోరాడడానికి చర్చ్ వేదికల నుపయోగించారని ప్రేక్షకులకు తెలుస్తుంది!
నకిలీ వాల్టర్ “మా అమ్మా- నాన్నల్ని మిస్సవుతున్నాను. మా ఇంటికి వెళ్ళాలి” అని చెప్పినప్పుడు ఆ చిన్నారి ముద్దొచ్చి, పోలీసుల మీద ప్రేక్షకులకు పట్టరాని ఆగ్రహం కలుగుతుంది. ఒక శతాబ్దం తర్వాత కూడా అమెరికా పోలీసుల మనస్తత్వాలలో ఏమాత్రం మార్పు రాలేదనడానికి నిన్నమొన్నటి జార్జ్ ఫ్లాయిడ్ వృత్తాంతం ఒక తిరుగులేని నిదర్శనం!
క్రిస్టిన్ తన కొడుకు అదృశ్యంపై ఒక తల్లడిల్లుతున్న తల్లిలాగే స్పందిస్తుంది. “నా కొడుకు నాకు జీవిత సర్వస్వం, నాకు ఈ జీవితంలో మిగిలింది వాడొక్కడే. దీన్నిమీరు అర్ధం చేసుకోవాలి” అని కెప్టెన్ జోన్స్ ముందు మొత్తుకుంటుంది. కానీ అతని కఠినమైన వైఖరిమారదు. ఆ నిరీక్షణ వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా కొనసాగడంతో, నకిలీ “కొడుకు” ను పంపి, తమకర్తవ్యాన్నీ, బాధ్యతనూ మర్చిపోయిన పోలీసువ్యవస్థ కృత్రిమ కల్పనని కూల్చివేసే వరకూ ఆమె ఆగ్రహం పెరుగుతూ పోతుంది! ఈ ఆరాట, పోరాటాలను క్రిస్టిన్ పాత్రలో ఏంజెలీనా జోలీ సాటిలేని విధంగా అభినయించింది!
సైకో వార్డులో, క్రిస్టీన్ ను పిచ్చి దాని కింద జమ చేస్తారు. పోలిసుల్ని ప్రశ్నించిన ప్రతి మహిళనూ పిచ్చి వాళ్ళ కిందే జమ చేసి అత్యంత కఠినమైన కోడ్ 12 ను నమోదు చేసి హింసిస్తుంటారు. “మనం పిచ్చివాళ్లమైతే ఎవరూ మన మాట వినాల్సిన అవసరం లేదు కదా, మరి వాళ్ళ మాట వినమని ఒత్తిడి చెయ్యడ మెందుకు” అని మరో ఖైదీ కరోల్ డెక్స్టర్ ఆమెకు చెప్తుంది. ఎలెక్ట్రో-షాక్ థెరపీని పంటి బిగువున భరిస్తుందే తప్ప ఆమె స్థిర సంకల్పం మాత్రం చెదిరిపోదు. ఎంత దాష్టీకంగా బలవంతపెట్టినప్పటికీ అంటగట్టిన బాలుణ్ణి తన కొడుకుగా ఆమోదించలేదు. కొడుకుకోసం పిచ్చెక్కి పోతున్నట్లు అద్భుతంగా నటించింది ఏంజెలీనా జోలీ. ఆమెను ఎంతో గొప్ప పాత్రలు వరించినప్పటికీ నటించడానికి గొప్పవే కానక్కర లేదని జీవితాన్ని ప్రతిబింబించే ‘అతి సాధారణ’ పాత్రలో నైనా రాణించవచ్చని ఆస్కార్‌ని గెల్చుకుని నిరూపించింది! తల్లి ప్రేమ అత్యంత శక్తివంతమైనదనీ, అది ఏ తర్కానికీ లొంగదనీ, కొన్నిసార్లు శాస్త్రీయ జ్ఞానాన్ని కూడా అధిగమిస్తుందనీ దుఃఖంతో తల్లడిల్లిపోతున్న తల్లిగా క్రిస్టిన్ కాలిన్స్ పాత్రలో జీవించింది ఏంజిలినా జోలీ!
ఏంజెలీనా జోలీ ఈ చిత్రంలో చాలా ప్రత్యేకంగా అసాధారణంగా ఉంది. చాలా అందంగా ఉండడంతో పాటు, ఆమె చూపులు, హావభావాలు, సందర్భానుసారంగా చేసిన అభినయ రీతులు అనితర సాధ్యంగా ఉన్నాయి. ఆమె పాత్రల పరిధి చాలా విలక్షణంగా ఉంటుందని ప్రేక్షకుల కర్ధమవుతుంది. ఈ పాత్ర కొసం ఎంతోమందిని పరిక్షించిన క్లింట్ ఆమె కళ్ళు 1920-30 ల నాటి గ్రామీణ స్త్రీలను పోలి ఉన్నాయని ఏంజెలీనా జోలీని ఎంచుకున్నారు!
మానవజాతి తలదించుకోవలసిన బాధాకరమైన వికృత చేష్ట లెన్నో ఉన్నాయీ చిత్రంలో! గోర్డాన్ నార్త్ కాట్ పిల్లల్ని లైంగికంగా వేధించి చంపుతాడు. నిజం చెప్పాలంటే దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ కథలోని కొన్ని భయానక భాగాలను ఫ్రేమ్ వెలుపలే ఉంచేశారు. తల్లుల అంకితభావాన్నీ, తన నగరాన్ని నేరాలు లేని మంచి నగరంగా తీర్చిదిద్దాలనుకున్న ఫాదర్ ఆదర్శాన్నీ హైలైట్ చేయడానికి అతను చాలా కృషి చేశారు. కొన్ని అందమైన చిత్రీకరణలతో ఘోరమైన కౄరకృత్యాలను మర్చిపోయేలా చేశారు!
క్రిస్టిన్ కాలిన్స్ ఒక టెలిఫోన్ సూపర్ వైజర్ గా పనిచేస్తూ ఒంటరిగా తన తొమ్మిదేళ్ల కుమారుడు వాల్టర్ ని పెంచుకుంటూ ఉంటుంది. ఆమెకు కొడుకంటే అమితమైన ప్రేమ. వాల్టర్ ఒకసారి “క్లాస్ లో ఒకబ్బాయి తనను కొట్టాడని క్రిస్టీన్ తో చెప్తాడు. “నువ్వు తిరిగి కొట్టావా” అని క్రిస్టీన్ అడుగుతుంది. కొట్టానని వాల్టర్ చెప్తే మంచిదని మెచ్చుకుంటుంది! ఎటువంటి గోడవలూ,ఎవరితోనూ పెట్టుకోకూడదు. అలాగని నీజోలికి వస్తే తగిన బుద్ధి చెప్పాలని నేర్పిస్తుంది. డ్యూటీ కెళ్ళే ముందు అన్నీ సమకూర్చి పెట్టి వాల్టర్ ని అడుగుతుంది, “జాగ్రత్తగా ఉండగలవు కదా” అని, ఉంటానని చిన్నారి ఒద్దికగా సమాధానం చెప్తాడు. ప్రారంభ సీన్లో వాళ్ళిద్దరి అనుబంధాన్ని మనోహరంగా దృశ్యీకరించారు! అందమైన ఫ్లాట్ లో, సకలసౌకర్యాలతో మంచి హోదా ననుభవిస్తూ ఆనందంగా ఉన్నట్లు తల్లీ-కొడుకులిద్దరూ కనిపిస్తారు. టెలిఫోన్ సూపర్ వైజర్ డ్యూటీలు రకరకాల ఆడ్ షిఫ్ట్ లతో ప్రత్యేకంగా ఉంటాయి. కొన్నిముఖ్యమైన బోర్డులలో ఉన్నవారికి రిలీవర్ రాకపోతే అసలు రిలీవ్ చెయ్యరు. ఆ సమయంలో అదనపు డ్యూటీ పడుతుంది. అలా క్రిస్టిన్ కి ఎక్స్ఛేంజ్ లో ఓవర్ డ్యూటీ పడుతుంది. వచ్చి చూస్తే వాల్టర్ మయమవుతాడు. వాల్టర్ చనిపోయాడని ఎంత మంది, చివరికి బ్రిగ్లెబ్ చెప్పినా ఆమె కన్నతల్లి హృదయం ఏదో ఆశతో ఎదురు చూస్తుందే తప్ప నమ్మదు. ఆమె తన ఆఫీస్ విరామ సమయాల్ని వెచ్చించి, దేశంలోని అన్ని బ్యూరోలకీ వాల్టర్ కోసం ఫోన్లు చేస్తూనే ఉంటుంది. బయటి ప్రపంచానికి తెలియని మహిళలతో సమ్మోహనంగా ఉండే టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ని ఈ చిత్రంలో చూపించారు. అదే ఉద్యోగం చేయడం వల్ల నేను ఈ చిత్రంతో బాగా కనెక్ట్ అయ్యాను. ఇందులో వినియోగదారులకు కావలసిన సమాచారం సేకరించడానికి స్కేటింగ్ చేస్తూ కనిపిస్తుంది ఏంజెలీనా జోలీ. మేమైతే టెలిఫోన్ భవన్ 6 వ అంతస్తులో ఆ చివరి నుంచి ఈ చివరికి సమాచారం కోసం పరుగులు పెట్టేవాళ్ళం. విదేశాల్లో ఈ ఉద్యోగం చాలా మంచి వేతనాలతో, సౌకర్యాలతో బాగుంటుందని విన్నాం. ఆవైభవమంతా ఈ సినిమాలో కనిపించింది!
క్రిస్టీన్ కాలిన్స్గా ఏంజెలీనా జోలీ (Angelina Jolie), గుస్తావ్ బ్రిగ్లెబ్ గా జాన్ మల్కోవిచ్ (John Malkovich), లెస్టర్ యబర్రా గా మైఖేల్ కెల్లీ (MichaelKelly), వాల్టర్ కాలిన్స్ గా గాట్లిన్ గ్రిఫిత్ (Gattlin Griffith) కెప్టెన్ జెజె జోన్స్ గా జెఫ్రీ డోనోవన్ ( Jeffrey Donovan) అద్భుతంగా నటించారు. మిగిలిన నటీ-నటులందరూ తమ తమపాత్రల్లోఒదిగిపోయారు.
సాధించిన అవార్డులు:
2008 లో ప్రతిష్టాత్మక 61 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ( 61st Cannes Film Festival) లో చేంజెలింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడు ఆస్కార్ (Oscar), ఎనిమిది బాఫ్టా (BAFTA – British Academy of Film & Television Arts) అవార్డు విభాగాలలో నామినేషన్లు అందుకున్నాయి.
చాలా మంచి విశ్లేషణ శివ. నాకు మన వద్ద అదృశ్యమైన మనుషులు, ఎన్కౌంటర్ హత్యల్లో పోలీసులు వ్యవహరించే తీరు గుర్తుకు వచ్చాయి. మంచి సినిమా పరిచయం చేసావు