నాదేశ ప్రజలే నా కవితా వస్తువులు.
దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించి వెన్నెముక ఇచ్చి నిలబెట్టింది.
మార్క్సియమైన శాస్త్రీయ అవగాహన నా కవితా ధ్యేయానికి స్పష్టతను ప్రసాదించింది.
నా అయిదుగురి మిత్రులతో కలిసి అహోరాత్రులు ప్రపంచాన్ని చుట్టి వచ్చిన క్షణాలు ఎంత విలువైనవో – వచ్చిన విమర్శలూ, పొగడ్తలూ నా దృష్టిని పటిష్టం చేశాయి, చేస్తున్నాయి. సమాజం ఇంజక్టు చేసే కొత్త రక్తాన్ని ఎప్పటికప్పుడు మనసా, వాచా ఆహ్వానించి గ్రహిస్తూనే వున్నాను.
“చెరబండరాజు” వయస్సు అయిదున్నర సంవత్సరాలే. కవితా వయస్సు అనూహ్యం.
ఏం రాశాను అనేదానికన్నా, ఏం రాయాలి అనే, ఎవరి కోసం రాయాలి అనే, ఎందుకు రాయాలి అనే సమస్య నాకీనాడు లేదు.
నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికే కలం పట్టాను. అనేక పుంతలు తొక్కి, బాటలు గడిచి ఇవాళ మీముందు ఇలా వుంది.
ఎవరేని ఈ కవితల్లో రసాస్వాదన కోసం పుస్తకం విప్పితే ఎండమావులే. పుండును అందమైన ఎర్ర గులాబీ పువ్వులా చిత్రించే – ఆకలి మంటల ఆర్తనాదాల్ని ‘జీవుని వేదన’గా వర్ణించే – ప్రణయైక జీవితంతో మేళవించే దశను తెలుగు సాహిత్యం దాటిపోయింది.
మంటను మంటగానే చిత్రించి, తృప్తిపడే, పరిష్కారం చూపని రచనా ధోరణిని నేటి తెలుగు కవిత్వం వెనక్కి తరిమేసింది.
అందుకే విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించి ఊపిరి పీల్చుకుంటోంది.
సాహిత్వం వేరు, రాజకీయాలు వేరు అనే పలాయనవాదం ఉమ్మిలా ఆరిపోతుంది.
రాజకీయాల్ని జీవితం నుంచి, సాహిత్యం నుంచి వేరుచేసి చూసే భూతద్దాల కళ్ల వాళ్లు ఎండుటాకుల్లా రాలిపోవడం చూస్తున్నాం. అయితే దేని విలువలు దానికి తప్పకుండా వుంటాయి.
వర్తమాన సామాజిక పరిస్థితుల్ని, నిర్మొహమాటంగా నిర్ద్వందంగా చిత్రించి, ప్రజల త్యాగాల్ని కీర్తించి, భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించడం కన్నా కవి ఏం కోరుకుంటాడు?
అందుకే నా చుట్టూ వున్న పీడిత జన జీవన్మరణ సమస్యలే నా కవితా ప్రేరణలు.
అక్టోబరు 2, 1970
(‘దిక్ సూచి’కి ముందుమాట)