తమిళ మూలం – అశోక మిత్రన్
(అశోక మిత్రన్, తెలంగాణ లోని సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన తమిళ రచయిత. 1931 నుండి 1952 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో జరిగిన రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా రచనలు చేశారు. పాలకుల విద్వేష రాజకీయాలకు అతీతంగా ఈ నగరం లోని హిందూ _ ముస్లిం ప్రజలు నిలుపుకున్న స్నేహానికి సున్నితమైన వ్యకీకరణను ఇచ్చిన ఈ కథను, మనుషుల నడుమ విభజన రేఖలు బలపడుతున్న ఇవాల్టి సందర్భంలో గుర్తు చేసుకోవడం అవసరం.)
“నువ్వు శంకరన్ కొడుకువు కాదూ? మద్రాసుకు ఎప్పుడొచ్చావ్?”
సయ్యద్ మామయ్య! నిశ్చేష్టుడయ్యాడు నారాయణ. నాలుగు నెలల కిందట ఆయనతో తను ఏమన్నాడో గుర్తొచ్చింది.
“మీరు మమ్మల్ని దగా చేశారు. మిమ్మల్ని నమ్ముకుని వేరే ఇల్లు చూసుకోకుండా, వున్నది ఖాళీ చేశాం.మీ మాటలు వుత్తి అబద్ధాలు. మమ్మల్ని ఇంత మోసం చేసి మీరేం బాగుపడతారు?” అన్నాడు తను కన్నీళ్ళతో ఆ రోజున. సయ్యద్ జవాబు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.
దిక్కు తోచని దానిలా కూచునివుంది అమ్మ.” ఈ వూరంతా మోసగాళ్లు. మనం ఇక్కడ ఉండలేం. వెళ్ళిపోదామమ్మా” అన్నాడు. పనికిరావని అనిపించిన సామాన్లన్నీ వచ్చిన ధరకు అమ్మి పారేశాడు. అమ్మనూ, తమ్ముడినీ తీసుకుని మద్రాసుకు వచ్చాడు. మాంబళం లో ఒక చిన్న పెంకుటిల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. నాన్నను పోగొట్టుకున్న ఆ ఊరినుండి ఐదు వందల మైళ్ళు పారిపోయి వచ్చినా మళ్లీ ఆ సయ్యద్ ఇక్కడా దాపురించాడు. ఒకప్పుడు నాన్నకు మంచి మిత్రుడిలా నటించి, ఆయన కుటుంబాన్ని మోసం చేసిన ఆ సయ్యద్ మళ్లీ ఎదురవుతాడని వూహించలేదు.
సయ్యద్, నారాయణను దగ్గరకు తీసుకుని కావిలించుకున్నాడు.
“ఒరేయ్ నారాయణా! ఆ రోజున నువ్వు అన్ని మాటలు తిట్టేసి వెళ్లి పోయావు. నేను ఎంత ఏడిచానో తెలుసా? నిన్ను నేను మోసం చేస్తానని ఎట్లా అనుకున్నావురా? నేనూ, మీ నాన్నా మామూలు దోస్తులం కాదురా! వాడితోబాటు పెళ్లిళ్లకు, కార్యాలకు తీసుకుపోయినప్పుడు ఏం చేసేవాడో తెలుసా? నా మెళ్లో ఓ జంధ్యం వేసి బ్రాహ్మడినని చెప్పి భోజనాలకు కూర్చోబెట్టే వాడు. మేమిద్దరం ప్రాణానికి ప్రాణమైన దోస్తులమని నీకు తెలుసా? వాడి భార్యా బిడ్డలను కాపాడుకోలేక పోయానని అల్లాడి పోయానురా నాయనా! ఇంతకూ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు బాబూ! అమ్మ, తమ్ముడు, అంతా బాగున్నారా? మీ ఇంటికి పోదాం పద. అందరినీ చూడాలనుంది నాకు.”
అతని చేతుల్లోంచి విడిపించుకుంటూ, “మీరేమిటి ఈ వూళ్లో వున్నారు?”, అన్నాడు నారాయణ.
“మా బావ ఖురేషి ఈ వూళ్లోనే ఉంటాడు. మమ్మల్ని ఇక్కడికే వచ్చెయ్యమని నాలుగేళ్లుగా చెప్తున్నాడు. నేనే ఆ సికింద్రాబాదు వదిలి రాకుండా నానా పాట్లూ పడ్డాను.ఆ మిలిటరీ వాళ్లు వచ్చాక మా ఇంటి మీద ఎన్నిసార్లు పడ్డారో, ఎన్నిసార్లు రాళ్ళు రువ్వారో చెప్పలేను.నా అరవయ్యేళ్ళ బతుకులో ఎన్నడూ పడని కష్టాలు ఈ నాలుగేళ్లలో పడ్డానురా” అంటూ చిన్న పిల్లాడిలా వలవలా ఏడ్చాడు సయ్యద్. ఆజానుబాహుడయిన ఆయన, కుదించుకు పోయినట్టు కనబడ్డాడు ఆ క్షణంలో.
నిజానికి ఆయన లోలోపల కుంగిపోయి చాలా కాలమైంది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఆయన కుటుంబం సికిందరాబాదు వచ్చి స్థిరపడ్డారు. బతుకుదెరువు ప్రయత్నాల్లో భాగంగా మిలిటరీ కాంట్రాక్టర్ అయ్యాడు. వూళ్లో పండే ఉల్లి గడ్డలు, ఆలు గడ్డలు, కూరగాయలు, కోడి గుడ్లు వంటివన్నీ జమచేసి, మిలటరీ వాళ్లకు పంపేవాడు.ఆ పనిలో బాగా సంపాదన ఉండేది. సయ్యద్ కోటు జేబులోంచి డబ్బు కట్టలు తీసి పడెయ్యటం తప్ప, అది ఎంత ఉందో కూడా చూసుకునే వాడే కాదనీ, పనిమనుషులే లెక్క పెట్టే వాళ్ళనీ , నారాయణ తండ్రి చెప్పేవాడు.
ఆ తర్వాత కొన్నాళ్లకు సయ్యద్ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే నవాబు ఆదేశం ప్రకారం ఒక సైన్యంలో చేరాల్సి వచ్చింది. నవాబుకు సైనికులను తయారు చేసే పని చెయ్యాల్సి వచ్చింది. మిలిటరీ యూనిఫామ్ తొడుక్కుని, కర్రలు పట్టుకున్న మనుషులతో కవాతు చేయించేవాడు. “లెఫ్ట్, రైట్, అబౌట్ టర్న్” అని అరుస్తూ శిక్షణ ఇచ్చేవాడు.ఆ రోజుల్లో సయ్యద్ వ్యవహారం చూసి నారాయణా వాళ్ల నాన్న కూడా భయపడి పోతుండే వాడని తల్లి చెప్పటం గుర్తుంది నారాయణకు.
ఒక్కోసారి సయ్యద్ నారాయణా వాళ్ల ఇంటికి వస్తుండే వాడు. అప్పుడు కూడా అదే ధోరణి. నిజాం నవాబుకు ఎదురు నిలిచే వాళ్ళే లేరనే వాడు. “నవాబు రాజ్యంలోకి ఎవడు కాలు మోపినా నరికి పారేస్తా” అంటూ ప్రగల్భాలు పలికేవాడు . చివరికి భారత సైన్యం, నైజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్నది. ఫలితంగా సయ్యద్ వంటి వాళ్ల అధికారాలు ముగిసి పోయి, బికారులుగా మిగిలారు. “మీ ఇంటికి పోదాం పద” అనే సయ్యద్ మాటతో ఆలోచనల లోంచి తేరుకున్నాడు నారాయణ.
“మామా”, అన్నాడు ఇబ్బందిగా.
“అదేం రా!”
“నీ మీద అమ్మకు మంచి అభిప్రాయం లేదులే మామా…!”
“నువ్వేదో చెప్పగానే ఏమయింది లేరా. కుర్రకుంక మాటలు … మంచీ చెడూ నీకేం తెలుసనీ!”
“రేపు చూద్దాంలే మామా, ఇప్పుడొద్దు”
“అట్లా వెళ్లి పోతున్నావేం రా, నారాయణా! ఈ సయ్యద్ గాడితో నీకేం పనిలేరా! నా స్నేహం మీ నాన్నతోనే పోయింది కదరా”, అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుపు మొదలెట్టాడు.
అతడు గతంలో ఒకసారి కూడా ఇలాగే తనముందు గుండెలు బాదుకున్న సంగతి నారాయణకు గుర్తొచ్చింది. అప్పుడు తను చలించలేదు. కానీ ఇప్పుడు ఆగలేక పోయాడు. సైకిల్ స్టాండు వేసి వచ్చి,సయ్యద్ చేతులను గట్టిగా పట్టుకున్నాడు.
బాగా బతికిన రోజుల్లో సయ్యద్ చేతులు ఎంత దృఢంగా ఉండేవో! ఇప్పుడు చిక్కిపోయి ఎముకలు తేలాయి. అతని కళ్లల్లోంచి కన్నీరు ధారగా కారుతోంది. వీధిన పోయే మనుషులంతా వింతగా చూస్తున్నారు.
ఇక తప్పేట్టు లేదని, “రండి ఇంటికి పోదాం”, అంటూ దారి తీశాడు.
తిండీ తిప్పలు లేక శోష వచ్చిన వాడిలా నడుస్తున్న సయ్యద్ ను చూస్తుంటే ఒక వైపు జాలిగా, మరో వైపు కోపంగా కూడా ఉంది నారాయణకు. నిజాం సైన్యంలో వున్న రోజుల్లో ఎంత అహంకారంగా ఉండేవాడు? స్నేహితుడని కూడా చూడక,తన తండ్రితో సైతం ఎంత పొగరుగా మాట్లాడేవాడు? ఇప్పటికీ ఆ పద్ధతి పోయినట్టు లేదు. ఇంత పెద్ద గొంతుతో గోల పెడుతున్నాడు.
“ఇంతకూ మద్రాసు ఎప్పుడొచ్చారు మామా?”
“వారమయింది”
“అత్తమ్మ, అన్వర్ కూడా వచ్చారా?”
“మీ అత్తమ్మ ఒక్కతే వచ్చింది”.
“మరి అత్తమ్మకు రేషన్ కార్డు తీసుకున్నారా?”
సయ్యద్ వాళ్లు సికింద్రాబాద్ లో వున్న రోజుల్లో ఇంట్లో ప్రతి మనిషికీ ఒక రేషన్ కార్డు చొప్పున ఉండేది. యుధ్దం రోజుల్లో అందరూ చక్కెరకు, బియ్యానికీ నానా అగచాట్లు పడుతూ ఉంటే, వీళ్ళ ఇంట్లో బస్తాలకొద్దీ చక్కెర పడి ఉండేది. నారాయణా వాళ్లు ఎన్నో సార్లు చక్కెర అడిగి తెచ్చుకునే వాళ్లు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, అందరి లాగానే సయ్యద్ కుటుంబం కూడా రేషన్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిసింది. అప్పుడు రేషన్ ఆఫీసుకు వెళ్లి అడిగితే, “ఇన్నాళ్లూ ఎట్లా చేశారో, అట్లాగే చెయ్యండి”, అని తిప్పి పంపారు. నిజాం రాజ్యం వున్న రోజుల్లో సయ్యద్ సైన్యం లోని మనుషులు చితక కొట్టిన అంజయ్య అనే వ్యక్తి ఇప్పుడు ఆ రేషన్ ఆఫీసు సుపర్నెంటు. ఇప్పుడు ఆయన అధికారం ఉంది మరి!
“అప్పుడు మాకు రేషన్ కార్డు దొరకనే లేదు.ఈ వూళ్లో తీసుకుందామని పోతే, ఆ వూరి కార్డు తెమ్మంటున్నారు. ఇంట్లో అందరం చక్కెర లేని చాయ్ తాగుతున్నాం”
రైల్వే క్రాసింగ్ దాటి పాత మాంబళం గుండా నడుస్తున్నారు. నారాయణ ఉద్యోగంలో చేరి నెల రోజులే అయింది. ఇప్పటికే మూడు సార్లు లేటుగా వెళ్ళాడు.ఈ ఉద్యోగం ఎన్నాళ్ళో నిలిచేలాగా లేదు.
ఎప్పుడో నాన్నతో కలిసి చదువుకున్న మనిషట ఈయన.తమ బాధ్యత తీసుకుంటానని మాటిచ్చి, నట్టేట్లో ముంచాడు. ఇతన్ని వెంటపెట్టుకుని వెళ్ళితే అమ్మకు ఎంత కోపం వస్తుందో. ఎన్ని తిట్లు తినాలో తను!
సయ్యద్ చేసిన పని తలుచుకుంటే ఇప్పటికీ పట్టరాని కోపంగా ఉంది నారాయణకు. తండ్రి చనిపోయాక తాము ఉంటున్న క్వార్టర్ ఖాళీ చెయ్యమన్నారు. అప్పుడు సయ్యద్ తమకు ఇల్లు చూసి పెడతానని మాటిచ్చాడు.” ఒక ఇల్లు వచ్చే నెలలో ఖాళీ అవుతోంది. నేను అంతా మాట్లాడి ఉంచాను.” అని నమ్మకంగా చెప్పాడు. తీరా ఆ నెల గడిచి, క్వార్టర్ ఖాళీ చెయ్యాల్సిన సమయంలో పత్తా లేకుండా పోయాడు. తమకు ఏ ఇల్లూ దొరక లేదు. ఆ తర్వాత సయ్యద్ ను వెదికి పట్టుకుని అతని మోసాన్ని కసిదీరా తిట్టాడు నారాయణ. విషయం తెలిశాక అమ్మ కూడా, సయ్యద్ నమ్మక ద్రోహానికి శాపనార్థాలు పెట్టింది.
ఇన్నాళ్ళ తర్వాత మళ్లీ శని లాగా దాపురించాడు ఈ మనిషి.
నడుస్తున్న సయ్యద్ కాలి చెప్పు తెగిపోయింది. దాన్ని చేత పట్టుకుని నడవ సాగాడు. ఇవాళ అతని జాతకం బాగా లేదు.కాసేపట్లో చచ్చేన్ని చీవాట్లు తినబోతున్నాడు.
“ఇదే మా ఇల్లు”, అన్నాడు నారాయణ గుమ్మం ముందు ఆగి.
“ఇల్లు చాలా పెద్దది రా”, అన్నాడు సయ్యద్.
“అంతా కాదులే, రెండు గదుల్లో ఉంటున్నాం.”
మెల్లిగా తలుపు తట్టాడు. ఇంటి యజమాని తలుపు తీశాడు.
ఇద్దరూ చెప్పులు వదిలి, లోపలకి వచ్చారు. అమ్మ వంట గదిలో ఉంది. “నేను లోపలికి రావచ్చా?”, అడిగాడు సయ్యద్.
“రండి”, అన్నాడు నారాయణ. అలా అనటం సరైంది కాదని కూడా అనిపించింది. ఇంటి యజమానికి సయ్యద్ ముస్లిం అని కచ్చితంగా తెలిసి పోతుంది. ఎంత గొడవ అవుతుందో!
సరిగ్గా అప్పుడే నారాయణా వాళ్ల అమ్మ ముందు గదిలోకి వచ్చింది. నీడలో వున్న సయ్యద్ ను వెంటనే గమనించలేదు. నారాయణ అటు చూడటంతో ఆమె కూడా అటు తిరిగి, “ఎవరూ?”, అంది.
నారాయణ బిక్కచచ్చి పోయాడు.
సయ్యద్ ముందుకొచ్చి, “నేనమ్మా సయ్యద్ ను”, అన్నాడు.
క్షణం సేపు నివ్వెరపోయింది ఆమె. ఏం జరగబోతోందో అని వణికి పోతున్నాడు నారాయణ.
“అయ్యో, మీవంటి వాళ్ళను అందరినీ వదిలి పోవటానికి మీ స్నేహితుడికి ఎట్లా మనసొప్పిందయ్యా!”, అంటూ రోదించటం మొదలెట్టింది ఆమె.
(తెలుగు అనువాదం : కాత్యాయని)
చాలా బాగుంది కథ. Lively అనువాదం చేశారు కాత్యాయనీ
థాంక్యూ రమ గారూ
బాగా చదివించేలా రాశారు కాత్యాయని గారు. అనువాద కధ అనిపించలేదు
థాంక్సండీ
ఏడ్చినట్టుంది ఈ కధానిక. చివరికి ఏమైయ్యిందో రచయిత్రి మింగేసి పాఠకులమీదికి వదలటం అస్సలుబాగాలేదు.