“నేను నిత్యం
కలవరించి
పలవరించి
కలతచెంది
కవిత రాస్త,
ఎవలు రాసిన
ఏది రాసిన
కవిత కష్టజీవికి
ఇరువైపులుండాలె
భవిత పునాదికి
బాసటై పోవాలె
కాలగమనానికి
దిక్సూచి కావాలె” (2018, ఏప్రిల్ )
తానెందుకు కవిత రాస్తాడో, ఎవరైనా కవిత రాయటానికి ప్రయోజనం ఏదై ఉండాలో ఈ చిన్న కవితలో చెప్పాడు నల్లెల్ల రాజయ్య. కలత చెందితే కవిత్వం అవుతాడు రాజన్న.ప్రజల క్షేమం, భద్రత మనిషిగా అతని నిత్య ఆకాంక్ష. నిద్ర లోనూ అదే ధ్యాస. కలవరింతలు, పలవరింతలు దానినే సూచిస్తాయి. ప్రజల క్షేమా నికి,భద్రతకు భంగం కలిగించే పరిస్థితులు, హామీ ఇయ్యని ప్రభుత్వాలు అతనిని నిరంతరం కలత పెడుతుంటాయి. ఆ కలతకు వ్యక్తీకరణే అతని కవిత్వం అంతా. కవిత్వ ప్రయోజనం కష్టజీవికి మద్దతుగా నిలబడటం. కవిత కాలగమన సూచిక కావాలి అన్న ముక్తాయింపు గమనించదగినది. కాలం నడవవలసిన దిక్కును సూచించేదిగా ఉండాలి కవిత్వం అని కవి ఉద్దేశిస్తున్నాడన్నమాట. నడవ వలసిన దిక్కు తెలియటం అంటే చేరవలసిన గమ్యం తెలిసి ఉండటం. అది భవిష్యత్తు. వర్తమాన కాలగమన లక్షణం తెలిసినవాళ్ళు దానిని కవిత్వంలో ప్రతిఫలింప చేయటం ద్వారా గమ్యాన్ని గురించి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తుంటారు. ఆ రకంగా చూసినప్పుడు రాజయ్య కాళోజి వలె తనకాలపు సామాజిక రాజకీయ ఉద్య మాల చరిత్రను వ్యక్తుల పేర్లతో సహా, సందర్భాలతో సహా విమర్శనాత్మకంగా నమోదు చేసిన కవి.
నల్లెల్ల రాజయ్య 1990 నుండి 2024 ఫిబ్రవరిలో మరణించే వరకు క్రియాశీల కవిగానే జీవించాడు.1990 నుండి 2006 వరకు వ్రాసిన కవితలు 35 కలిపి 2007 లో ‘ఆశయాల పందిరి’ కవితాసంపుటి ప్రచురించాడు. చాలా కవితలు ఎప్పుడు ఎక్కడ ప్రచురించబడ్డాయో వివరాలు లేవు. కొన్నిటికి రచనా సందర్భాలు మాత్రం చెప్పుకొన్నాడు. 2007 నాటికే ఆయన వరంగల్ రచయితల సంఘంబాధ్యుడు. ఆ సంఘం ప్రచురణగానే ఈ కవితల సంపుటి వచ్చింది. ఆ తరువాత ఆయన వేసుకొన్న స్వీయ కవితా సంపుటాలు మరి లేవు. వేసినవన్నీ కవితా సంకలనాలే. కవిగా తాను వ్యక్తం కావాలన్నదాని మీద కన్నా కవిత్వాన్ని సామాజిక సాధనంగా సామూహిక ప్రయోజనాలకోసం సంధించటం మీదనే అతని గురి.దానిఫలితమే వివిధ సంకలనాల కూర్పు.వాటిలో తనకవితలు కూడా ఉండటం కాకతాళీయం. ఏ సంకలనానికీ ఎక్కకక ఫేస్ బుక్ లో పోస్ట్ చేయబడి మిగిలిన కవితలు మరికొన్ని. కవి సమ్మేళనాలలో చదివి వదిలేసిన కవితలు యు ట్యూబ్ లో నమోదై దొరికినవి రెండు. ఇంకెన్ని అజ్ఞాతంలో ఉండిపోయాయో తెలియదు. రాజయ్య మిత్రులు పూనుకొని ఈ మేరకైనా సేకరించి ఇలా కూర్చటం వలన కవిగా రాజయ్య బలం తెలుసుకొనటానికి వీలవుతున్నది. అందుకు ముందుగా వాళ్ళను అభినందించాలి.
1
కవిత్వం భావాంబర వీధీ విహారమో , ఊహలను అల్లుకొంటూ పోవటమో కాదు నల్లెల్ల రాజయ్యకు.ఒక సామాజిక రాజకీయ చర్యకు, సందర్భానికి ప్రతి చర్య. అందువల్లనే రాజయ్య కవిత్వం కాలక్రమ వరుసలోనే చదవాలి. అప్పుడది ఒక సామాజిక రాజకీయ కార్యకర్త రాసుకున్న డైరీ లాగా ఒక చరిత్రను చెబుతుంది. రాజయ్య కవిత్వంలో నన్ను ఆకర్షించిన మొదటి అంశం అదే. కవి చేసిన కవిత్వ సందర్భ సూచనలు, కవితలో అంతర్గతంగా కనబడే సాక్ష్యాలు, ఆయా కవితలు ప్రచురించబడిన సంకలనాల సందర్భాలు, ప్రచురణ సంవత్సరాలు, పేస్ బుక్ లో కవితలు పోస్ట్ చేయబడిన తేదీలు మొదలైన వాటిని బట్టి రాజయ్య కవితల కాలక్రమ వరుసను నిర్ధారించటం జరిగింది. పేస్ బుక్ కవితలు ఏయే రోజులలో పోస్ట్ చేయ బడినవో శ్రమపడి సేకరించిన మిత్రుడు బిల్లా మహేందర్.
1990లో హక్కుల చైతన్యం, హక్కులను హరించే రాజ్యస్వభావాన్ని గురించిన స్పృహ,హక్కులకై పోరాటంలోకి ప్రజలను సమీకరించే ఉత్సాహం రాజయ్యని కవిని చేశాయి అనటానికి అతని మొదటి కవిత ‘హక్కులు – బాధ్యతలు’ నిదర్శనం. 1991 లో పివి నరసింహారావు ప్రభుత్వం నూతన ఆర్ధిక సంస్కరణల పేరిట ఎల్ పి జి (లిబరలైజేషన్,ప్రయివేటైజేషన్,గ్లోబలైజేషన్)విధానాన్నిప్రవేశపెట్టింది.ఆర్ధిక వ్యవస్థ లో ప్రభుత్వాల పాత్రను కుదించి ప్రయివేటు సంస్థలకు ఆర్ధిక రంగాన్ని అప్పగిం చటం,ఫైనాన్స్ మార్కెట్ లోనూ,పెట్టుబడుల మార్కెట్ లోనూ వాణిజ్యానికి గల అవ రోధాలను, ప్రభుత్వ జోక్యాన్ని తొలగించటం దేశాల స్వయంప్రతిపత్తికి స్వయం వికాసానికి భంగకరమని, దేశాలమధ్య అసమానతలకు అవి కారణం అవుతాయని, అలాగే దేశంలో కూడా వ్యత్యాసాలు మరింత పెరగటానికి కారణమవుతాయాని తీవ్ర విమర్శ ఆనాడే వచ్చింది. ఆ అవగాహనతో 1992 లోనే రాజయ్య ‘మారటోరియం మారణ హోమం’ అనే కవిత వ్రాసాడు.
“వాడు నలభయి ఐదేళ్ల నాడు స్వతంత్రం వచ్చిందని చెబుతూనే / జన స్వతంత్ర జీవనానికి సంకెళ్ళేస్తానని బెదిరిస్తున్నాడు” అని ప్రారంభమయ్యే ఈ కవితలో వాడు అని రాజయ్య సంబోధించింది ఆ నాటి ప్రధానమంత్రి పి. వి. నరసింహారావు నే. “ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దానని చంకలు గుద్దుకుంటూనే / హర్షద్ మెహతాలకు అంకితం చేస్తున్నాడు” 1992 లో స్టాక్ మార్కెట్ లో 30 కోట్ల ఇండియన్ సెక్యూరిటీ స్కామ్ కు కారకుడైనవాడు హర్షద్ మెహతా. దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉన్న స్థితిలో పివి 1991ఏప్రిల్ 4 న స్టాక్ మార్కెట్ బ్రోకర్, వ్యాపారవేత్త అయిన హర్షద్ మెహతాను పిలిచి స్టొక్ మార్కెట్ లో సానుకూల సెంటిమెంటు సృష్టించే విషయంలో సంప్రదింపులు జరిపాడన్న వార్త తెలిసి వ్రాసినట్లుగా ఉన్నాయి ఈ కవితాపాదాలు.మూడవ అంశంగా బోఫోర్స్ కుంభకోణాన్ని ప్రస్తావించి “ మారటో రియం విధిస్తామని మంత్రోచ్ఛారణ చేస్తూ / మారణహోమం జరిపేందుకు సిద్ధమవుతున్నాడు” అని ఈ కవితలో ప్రస్తావించిన నాలుగవ అంశం కీలకమైనది. 1992 ఆగస్టు 15 న ప్రధాని మారటోరియం విధింపు గూర్చి చేసిన పత్రికా ప్రకటనకు స్పందించి రాసిన కవిత ఇది అని కవి చెప్పుకొన్నాడు కనుక ఇది కీలకమైనది. ఇంతకూ మారటోరియం అంటే ఏమిటి? విరామం. ప్రస్తుత సందర్భంలో ఆ విరామం బ్యాంకుల వద్ద ఋణం తీసుకొని ఒప్పందం ప్రకారం తిరిగి చెల్లించవలసిన విధానం పై విరామం. ఋణం తీసుకొన్నవాళ్ళు మధ్యలో ఏదైనా ఆర్ధిక సమస్యలో చిక్కుకున్నప్పుడు కొంతకాలం ఋణం చెల్లింపులు ఆపుకొనటానికి ఉన్న సౌకర్యం ఇది. నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టిన మరుసంవత్సరమే ప్రభుత్వమే పూనుకొని రుణచెల్లింపులకు విరామం కల్పిస్తూ ప్రకటన చేసింది. దీనిని గర్హిస్తున్నాడు రాజయ్య. రుణ చెల్లింపుల విరామం అంతిమంగా ఉపయోగపడేది లక్షలు కోట్ల అప్పులు చేసి రకరకాల వ్యాపారాలలో పెట్టుబడి పెట్టిన వర్గాలకే అన్నది స్పష్టం. ఇవన్నీ “ప్రజాస్వామ్య భారతంలో ప్రజల ఆశలను ఆశయాలను వమ్ము చేసే”కుట్రలుగానే చూసాడు రాజయ్య. ఈ కుట్రలను, కుతంత్రాలను కనిపెట్టి జనవాహిని ఒకనాటికి జయిస్తుంది అన్న నమ్మకాన్ని ప్రకటించటం ఈ కవితకు ముగింపు.
1992 లో ప్రధానమంత్రిని సంబోధిస్తూ ఆ రకంగా తన నిరసనను నిష్కర్షగా వెల్లడిస్తూ కవిత రాసిన రాజయ్య 2014 తరువాత ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని సంబోధిస్తూ వ్రాసిన కవితలు మూడు ఉన్నాయి.“చెదలు”, ‘నమ్మిన బంటు’ కవితలు రెండూ పెద్దనోట్లు రద్దు సందర్భంగా వ్రాసినవి. అంటే 2016 లో రాసినవి. “ చీకటి నుండి వచ్చినోనికి / వెలుతురసలే నచ్చదు వాడు కాంతిని భ్రాంతిగా భ్రమించి / తిమిరాన్ని అమితంగా ప్రేమించిండు” అనే ప్రారంభమయ్యే చెదలు కవితలో పెద్దనోట్ల రద్దు ‘నిర్దయ నిర్ణయం’ అంటాడు. సామాన్యులందర్నీ ఇక్కట్ల పాల్జేసి చిల్లర కోసం దేబరించేట్లు చేసిందని నిరసన వ్యక్తం చేసాడు. నల్ల ధనానికి చెల్లు చీటీ అని మోడీ చెప్పిన తెల్లనోట్ల రద్దు విధానం అంతిమంగా మోడీ ని “నల్లకుబేరులకే నాయకుడి’ ని చేసింది అని కవితను ముగిస్తాడు. ఎంతైనా ‘వాన్ని గద్దెనెక్కించినోళ్లు’ వాళ్ళే కదా అని ముక్తాయింపు పార్లమెంటు రాజకీయాల పట్ల కవి అవగాహనను సూచిస్తుంది. నమ్మినబంటు కవితను “ అతడు స్విస్ బ్యాంకుల్ల / మూల్గుతున్న నల్ల ధనాన్ని / మోసుకొస్తానని మాటిచ్చి ముఖం చాటేసిన మోసకారి” అని నిర్ధారించటంతో ప్రారంభించి “ ఆదానీ అంబానీల / ఆత్మబంధువు ఎందరవునన్నా కాదన్నా/ అతడు /నల్లకుబేరుల నమ్మినబంటు” అన్న అసలు వాస్తవాన్ని చెప్పి ముగించాడు.
మోడీ ని సంబోధిస్తూ వ్రాసిన మూడో కవిత “మా ఇంటింటా తిరంగ్ జెండాలెం దుకెగిరియాలే?” కవిత “మిస్టర్ మోడీజీ!/ జరా సున్లో/” అని పిలిచి నిలిపి నిగ్గు దీసినట్లుగా మొదలవుతుంది. ప్రజలను ఉద్దేశించి ఏదో ఒక కార్యక్రమం ఇయ్యటం మోడీ విధానం. కరోనా కాలంలో దానిని వెళ్లగొట్టటానికి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించమని, పళ్ళాలు చేతబట్టి గరిటలతో మోగించమని ఒక కార్యక్రమం ఇచ్చాడు. కరోనా ను ఎదుర్కొనటానికి ఆ ఉపద్రవం వల్ల వచ్చే కష్టాన్ని, నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ చేయటానికి ప్రభుత్వం రూపొందించిన విధానాలు ఏమిటో అవి చెప్పకుండా బాధిత ప్రజలనే విదూషకులను చేసి వినోదం చూసాడు మోడీ. భారతదేశ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంలో 2021 నుండి 2022 వరకు ఆజాదీకా అమృతోత్సవ్ పేరిట ఉత్సవాలు జరుపుతూ ఆయనే అందులో భాగంగా 2022 ఆగస్టు 13 నుండి 17 వరకు ప్రతి ఇంటా మూడురంగుల జెండా ఎగరెయ్యమని ట్వీటర్ ద్వారా ప్రజలకు పిలుపు ఇచ్చాడు. మరోమాట లేకుండా అందరూ ఇళ్ళమీద జెండాలు ఎగరవేస్తుంటే రాజయ్య మాత్రం మౌనం గా ఉండలేకపోయాడు. మా ఇంటింటా తిరంగ్ జెండాలెం దుకెగిరియాలే? అని ధిక్కార స్వరం ఎత్తాడు. “ ప్రతిసారి నువ్ / చెప్పినట్టు చేయాడానికి/ మేము కోతులం గాము/ కొండముచ్చులసలే గాము/ మేధస్సుగల మనుషులం”అంటూ మొదలుపెట్టి వ్రాసిన దీర్ఘకవితలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ వచ్చాడు. 1. దేశ బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినవాళ్లను దేశం దాటించి నందుకా? 2.విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తెచ్చి దేశ పౌరులకు పంచుతానని ఇచ్చిన మాటా తప్పినందుకా?3. రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ ని తుంగలో తొక్కినందుకా?4.జాతీయ సంపదలను బహుళ జాతి సంస్థలకు అప్పగిస్తున్నం దుకా? 5.పెద్దనోట్ల రద్దు పేర పేద మధ్యతరగతి జనం గోసబుచ్చు కున్నందుకా? 6.నీ పనితనాన్ని ప్రశ్నించిన మేధావులు, అధ్యాపకులు, న్యాయ వాదులు, పాత్రి కేయులను జైళ్ల పాల్జేసి నిండు ప్రాణాలు హరింప జేస్తున్నందుకా? ఇలా ఆరు అంశాలలో మోడీ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ప్రతి వైఫల్యానికి కి సంబంధించిన నిలదీత వెనువెంటనే “నువ్ చెప్పినట్లు / మేమెందుకు చేయాలి !ఇంటింటా తిరంగ్ / జెండాలెం దుకేగిరియాలే” అని ధిక్కారం ప్రకటిస్తాడు. చెప్పింది ఎందుకు చేయాలి? తిరంగ్ జెండాలు ఎందుకు ఎగరెయ్యాలి అన్నవి మామూలుగా ప్రశ్నలే కానీ మోడీ విధానాలను నిలదీసిన ప్రతిసారి ఈ పాదాలను పునరావృత్తి చేయటం ద్వారా కవి దేశప్రజలకు అపకారం తప్ప ఉపయోగించేది ఏదీ చెయ్యని నువ్వు చెప్పినట్లు మేము వినం. నువ్వు చెప్పినట్లు జెండాలు ఎగరవేయ్యము అని చెప్పినట్లయింది. కవితా నిర్మాణమంటే ఇది. ధిక్కారాన్ని, తిరస్కారాన్ని ధ్వనింప చేసిన కవిత ఇది.
2.
ముఖ్యమంత్రులను ఉద్దేశించి కూడా రాజయ్య కవితలు వ్రాసాడు. జాతీయ స్థాయి విషయాలపైన పౌర ప్రజాభిప్రాయానికి స్వరం ఇయ్యకుండా ఉండలేని రాజ య్య రాష్ట్ర ప్రభుత్వ విధానాలను గమనించకుండా, ప్రశ్నించకుండా ఉంటాడా? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏజన్సీ ఎలవెన్స్ ఆపేసారు. దానిని నిరసిస్తూ ఏజన్సీ ప్రాంత ఉద్యోగులు ఉద్యమించారు. ఆ ఉద్యమానికి మద్దతుగా రాజయ్య రెండు పాటలు వ్రాసాడు. విద్య వైద్యరవాణా సౌకర్యాలకు దూరంగా కొండకోనల్లో సేవలు అందించే ఉద్యోగులకు ఇయ్యవలసిన ప్రత్యేక ఎలవెన్సులు నిలిపి వేయ టం అన్యాయం అని రాజయ్య భావించాడు. రాష్ట్రం మొత్తం మీద రంప చోడవరం, ఉట్నూరు, పాడేరు, ఖమ్మం, సీతంపేట, వరంగల్లు మొదలైన ఏజన్సీ ప్రాంతాలలో జరుగుతున్న పోరాట చిత్రాలను ‘పోరుదారిలో ఏజన్సీ ఉద్యోగులు’ అనే పాటలో చూస్తాం. ఉద్యమంలో భాగంగా జరిగే ర్యాలీలో పాల్గొనటమే కాదు అప్పటికప్పుడు పాట కట్టి పాడినవాడు రాజయ్య.
‘ప్రజాపథం’ 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకొన్న పెద్ద కార్యక్రమం. ప్రజాప్రతినిధులు, మంత్రులు , అధికారులు ప్రజలవద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించటానికి ఉద్దేశించబడిన కార్యక్రమం ఇది.ఏడాది తిరిగేసరికి దానితత్వం తెలుసుకొన్నవాడై రాజయ్య “ప్రజాపథం పేర ప్రజల సమస్యల పాతర” అనే కవిత వ్రాసాడు. “ మనుధర్మాన్ని మన్ననగా పాటిస్తున్న / మన నేతల పాలనలో నీతి ఏమున్నది?” అని మొదలు పెట్టి గద్దెనెక్కటానికి ముందు చేసే వాగ్దానాలకు గద్దెనెక్కినతరువాత ఆచరణకు మధ్య ఉండే యెడాన్ని రైతు సమస్య కేంద్రంగా ఎత్తి చూపాడు. “రైతన్నలే రాజులని, రైతురాజ్యం తెస్తానని / రాగాలు తీసినోళ్లే రైతన్నల చావులు చూస్తూ…” పల్లకీలలో వూరేగటాన్ని ఏవగించుకొన్నాడు. అప్పుల ఊబిలో దిగబడి పోయి తమ సమస్యలతో తామొకవైపు విలవిలలాడుతున్న రైతుల ముందుకు ప్రజాపథం అంటూ పల్లకీలలో ఊరేగుతూ వచ్చే ప్రభుత్వ పాలక వ్యవస్థపై ధర్మాగ్రహ వ్యక్తీకరణ ఈ కవిత. పనిలో పనిగా ప్రజాపథంతో కలిపి జన్మభూమి కార్యక్రమం పై కూడా రాజయ్య నిరసన ప్రకటించాడు. రాజశేఖరరెడ్డి ప్రజాపథం ప్రకటించటానికి దాదాపు పదేళ్లకు ముందే చంద్రబాబు నాయుడు ‘ప్రజలవద్దకు పాలన’ అన్ననినాదంతో అమలుచేసిన కార్యక్రమం అది. ప్రజల జీవితంలో ఏ మార్పు తీసుకురాలేనిఇలాంటి కార్యక్రమాలు పదేపదే తీసుకొంటూ ప్రజలముందుకు వచ్చే ప్రభుత్వాలను “ఎవరిని వంచన చేయటానికిరా మీరూరేగేది” అని నిలదీయాలని ప్రజలను హెచ్చరిస్తాడు కవి.
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని సంబోధిస్తూ రాజయ్య వ్రాసిన “పాపాలభైరవుడు” పాట ప్రత్యేకం పేర్కొనవలసినది. “ఇందిరమ్మ రాజ్యమంటే – రందీ లేని రాజ్యమని / ఇంటింటా సౌభగ్యం వెల్లి విరుస్తుందనీ / మీడియాతో చెప్పిస్తున్నాడో మన ముఖ్యమంత్రి / మిడిసిపాట్లు పడుతున్నడో మన ముఖ్యమంత్రి” పల్లవిగా అయిదుచరణాల పాట ఇది. ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీ జీవితాన్ని ఆగం చెయ్యటం మీద , సాగు నీరియ్యకుండా మద్యం పారిస్తున్న విధానం మీద, ప్రయివేటీకరణకు పట్టం కట్టే విధానాల మీద, జనజీవితంలో కల్లోలాన్నీ సృష్టించే విధాన నిర్ణయాల మీద, చర్యల మీద నాలుగు చరణాలలో వరుస ఫిర్యాదులు చేసి అయిదవ చరణంలో ఏ పుణ్య తీర్ధాలలో మునిగినా, ఏ దైవ ప్రార్ధనలు జరిపినా పోని పాపాలు మూటగట్టుకున్న ముఖ్యమంత్రికి ప్రజలే గుణపాఠం చెప్తారని తీర్పు ఇస్తాడు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం తన క్రియాశీలతను, సృజన శీలతను సంపూర్ణంగా వినియోగించిన నల్లెల్ల రాజయ్య నిబద్ధత దాని నాయకుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్ల బేషరతు మద్దతు కాకపోవటం గమనించవలసిన అంశం. ముఖ్యమంత్రిగా ఆయన పని విధానాన్ని ఒక పౌర బాధ్యతతో విమర్శకు పెట్టటానికి ఆయన ఎప్పుడూ జంకలేదు. కెసిఆర్ ను, అతని విధానాలను ఉద్దేశించి రాజయ్య వ్రాసిన కవితలు ఏడు ఇక్కడ చెప్పుకోవలసినవి.
ఒకటి ప్రగతిభవన్ సందర్భం నుండి. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారం చేపట్టాక కెసిఆర్ ముఖ్యమంత్రి నివాసానికి తగిన భవనం లేదని విశాల మైన స్థలంలో ముఖ్యమంత్రి ఆవాసం, ఆఫీసు, మీటింగ్ హాల్ మొదలైన వాటితో నిర్మించిన కాంప్లెక్స్ కే ప్రగతిభవన్ అని పేరు. అది సామాన్యులకు ప్రవేశం లేని కోటగా మారిపోయిందని చాలా విమర్శలు వచ్చాయి. ఆ నేపథ్యంలో వచ్చిన కవిత ‘దగా’ “ఆవ్ మరి/ నువ్వు దాన్ని / ప్రగతి భవన్ అంటున్నవ్ / నిజంగా మేం దాన్ని/ పాముల పుట్ట అంటున్నం” అని ప్రారంభంలోనే ప్రజల సంపదను పోగేసి కట్టిన ఆ భవనాన్ని పాముల పుట్ట అని తేల్చేసాడు. పాములు పుట్టలు పెట్టవు. చీమలు పెట్టిన పుట్టలను ఆక్రమిస్తాయి. శ్రమజీవులను దోచుకొని భోగాలు అనుభవించే పామువంటి పాలకవర్గాల స్వభావాన్ని మొహం మీద కొట్టినట్లు చెప్పేసాడు. “ అభాగ్యులకు/ అన్నార్తులకు/ అడుగుపెట్టె /అనుమతే లేనప్పుడు/దాన్ని మేం / దొరలగడీ / దోపిడీ అడ్డా అంటున్నాం” అనటానికి గానీ “ దీన్ని మేము /నిర్భయంగ నియంత /నిరంకుశ పాలనని / నినదిస్తున్నం” అని గానీ చెప్పటానికి గానీ ఏమాత్రం ముందువెనుకలు కాక పోవటం రాజయ్య వ్యక్తిత్వ ప్రత్యేకత.
‘వాడెప్పుడంతే’, ‘ఎట్లా నమ్మాలే’ రెండు కవితలు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 2017 డిసెంబర్ 15 నుండి 19 వరకు వరకు జరిపిన తెలుగు ప్రపంచసభల సందర్భంలో వ్రాసినవి. వాడెప్పుడంతే అనే కవితలో వాడు , వాడు అంటూ అతని విధానాలను ఒక వరుసలో విమర్శకు పెడతాడు “ఏదో ‘హారమం’టడు /పైసల్ని ఫలహారం చేస్తడు/ మిషనో మిష నంటాడు/ మింగి పారేస్తడు”అని ఒక భాగంలో కేసీఆర్ లంచగొండి తనాన్ని ఎత్తి చూపుతాడు. “చిక్కులెన్నో విడిచిపెట్టి / మొక్కుల్దీరించుకుంటడు” అని భద్రకాళి మొదలైన గుళ్లకు తిరిగి ఖరీదైన ఆభర ణాలు మొక్కులు గా చెల్లించిన వైఖరిని ప్రజా వ్యతిరేకమైనదిగా గుర్తించి చెప్పాడు. “ సరే!వాడేవాడనుకున్నవ్ / వాడు మా ఎన్కటి సోపతి/ ఏతులెంకటిగాడు” అని తీసిపారేసినట్లు చెప్పగలిగిన తెగువగల కవి నల్లెల్ల రాజయ్య. ఎట్లా నమ్మాలే కవితలో “ రాష్ట్రమొచ్చిన మాటేమో గాని/ బతుకంతా కల్లం కల్లమ్మైపాయె” అని నిష్టూరం పోయాడు. “తెర్లు తెర్లయిన రైతన్న ఊపిరి తీసుకున్నా / ఉప్పోసకన్నవచ్చి చూసి పొడాయే” అని “కార్పొరేటు కంపిన్లకు కార్పెట్లు పరిచి” నాడని ‘కొలువుల జాతర లుంటయని ఆశపెట్టి మాటదప్పి ఎవని సావు వాడే సావమని, వదిలేశాడని చెప్తూ అలాంటి “బతుకుల్నే పట్టించుకొనోడు/ తల్లి భాషను బతికిస్తనని/ బాతలు కొడుతుంటే యెట్లా నమ్మాలే” అని నిగ్గదీస్తాడు.
‘సవాల్’ అనే కవిత ప్రపంచ తెలుగు సభల సన్మాన ప్రలోభాలను సవాల్ చే స్తూ ఆహ్వాన పత్రాన్ని అగ్నికి ఆహుతి చెయ్యాలన్న కవి ఆత్మాభిమాన ప్రకటన. కప్పం కట్టని ఆదివాసీ సామంతుల మీద యుద్ధం ప్రకటించిన కాకతీయ రాజులది కండకావరమని చెప్పి ఆయుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన సమక్క సారక్క లను,పగిడిద్దరాజు జంపన్నలను‘సాహససంజీవులు’గా సంబోధిస్తూ 2010 లోకవిత వ్రాసిన రాజయ్య పన్నేనేడ్ల తరువాత కూడా అదే ఆదివాసీ అమరుల కోణం నుండే వరంగల్ లో 1922 జులై లో జరిగిన కాకతీయ ఉత్సవాలను నిరసిస్తూ “రాజరికాన్ని పునరుద్ధరించటమే” అనే కవిత వ్రాసాడు. శిస్తుల వసూళ్ల పేరు మీద ఆదివాసీలను – సమ్మక్క సారమ్మల- ను పొట్టన పెట్టుకొన్న కాకతీయ సామ్రాజ్య సంకీర్తనం ప్రజాస్వామ్యంలో పొసగని విషయంగా భావించిన కవి రాజయ్య.
వరంగల్ లో కాకతీయుల కాలం నాటి శిల్ప నిర్మాణాల సముదాయం రామప్ప. 2021 జూన్ 25 న UNESCO రామప్పను వరల్డ్ హెరిటేజ్ సైట్ ( ప్రపంచ వారసత్వ సంపద స్థానం) గా ప్రకటించింది. ప్రపంచ వారసత్వ స్థావరంగా రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చి రెండునెలలు గడిచినా రామప్ప రక్షణకు అభివృద్ధికి ప్రభుత్వం తొందర పడటం లేదన్న వేదన నుండి “సారూ! నా గుర్తును కాపాడారా !” అని అభ్యర్ధనా పూర్వకమైన కవిత వ్రాసాడు. కేసీఆర్ ను ఉద్దేశించి రామప్ప గుడి స్వయంగా తన ఆవేదన వేళ్ళ బోసుకొంటున్నట్లుగా కవితను నడిపి స్తాడు రాజయ్య. పురావస్తు శాఖ మందకొడి వ్యవహారాన్నిఇందులో ఎండగట్టాడు. ఫిరదౌసి కావ్యంలో కవిని, కవిత్వాన్ని వంచించే రాజులు కాలగర్భంలో కలిసిపోతారు కానీ కవిత్వం ప్రజల నాలుకలమీద చిరకాలం జీవించేవుంటుందని చెప్పిన జాషువాకు వారసుడుగా ఈ కవితను రాజయ్య “ కళగా, సంస్కృతిగా నేను జనం గుండెల్లో నిలిచిపోతా… నారక్షణకు , గౌరవానికి ముందు పడని నీవు మాత్రం రాళ్ళలో కలిసి పోతావు అని రామప్ప దేవాలయం రాజ్యాన్ని హెచ్చరించినట్లుగా ముగించాడు.
‘అంతిమ సంస్కారం’ 17 ఏప్రిల్ 2023న ఖమ్మ జిల్లా చీమలపాడు లో జరిగిన అగ్నిప్రమాద ఘటన సందర్భం నుండి వ్రాసినది. ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరిట జరిగే ప్రభుత్వ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు బాణాసంచాపేల్చటంతో నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలు, అందులోని గ్యాస్ సిలిండర్లతో సహా పేలిపోయిన ఆ ఘటన ఆస్తి నష్టానికి ప్రాణ నష్టానికి కూడా కారణమైంది. సమస్యల పరిష్కారం పక్కన పెట్టి ఆత్మీయ సమ్మేళనాలు, అంబరాన్ని అంటే సంబరాలు జరుపుకొంటూ కాలం గడుపుతున్న కేసీఆర్ ను ‘వారీ’ అని సంబోధిస్తూ నిలదీసిన, నిరసన కవిత ఇది. ఈ సందర్భంలో రైతుబంధు, దళిత బంధు మొదలైన పథకాలతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న హంగామా అంతా బహుజనులను బానిసలను జేసేటివి అని హెచ్చరిస్తూ రాజయ్య వ్రాసిన రాబందుల బంధులు కవిత కూడా చెప్పుకోవలసినదే.
3.
నల్లెల్ల రాజయ్య ప్రధానంగా ప్రజలమనిషి. బాధిత పీడిత ప్రజల మనిషి. అన్యాయం, హక్కుల భంగం ఎక్కడ జరిగినా తాను అక్కడ వాళ్ళ స్వరమై నిల దీస్తాడు. వాళ్ళ కోసం నిలబడతాడు. ఆ తత్వమే అతని కవిత్వం. అందువల్లనే రాజయ్య కవిత్వంలో ఎక్కువభాగం సమస్యాత్మకాలు,సంఘ్తటనాత్మకాలు. పరిణా మంలో ఉద్యమకవిత్వం అది. సమస్యలను పరిష్కరించటానికి, న్యాయ సాధన కోసం, మంచికి మార్పుకోసం జరిగే సమష్టి పూనికలో భాగం అయిన క్రమంలో వచ్చిన కవిత్వం అది.
జనం కోసం తపించి, జనం కోసం తిరిగి జనజీవితమే తన జీవితంగా తిరిగిన రాజయ్యకు ఉగాదులు, ఉషస్సులు, పండుగ సంబరాలు లేవు. ఉగాది కవితలు వ్రాయని కవులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉగాది కవితలంటే మావి చిగుర్లు, వేప పూతలు, చెరుకుగడలు, కోకిలకూతలు కావు రాజయ్యకు. చేదు అంతా పోగేయబడిన జీవితం అయిన మనుషుల కోసం ఆయన ఉగాది కవితలు వ్రాసాడు. “ కష్టాలూ దుఃఖాలు ఎచ్చోటా లేకుండా / మార్పుచేసే దిశలో మనమంతా సాగాలన్న” ది ఆయన ఆకాంక్ష ( నూతన సంవత్సరానికి స్వాగత గీతిక 2006 ) శీర్షిక లేని మరొక కవితకు కూడా వస్తువు కొత్త సంవత్సరమే. “ పాతబడిన గుడిసెలపై /పిచ్చి మొక్కలు మొలవటం / ఆగలేదు” “సూర్యుడు రాకముందు రోడ్లపై / చెత్తయేరి కడుపు నింపుకోవడం మానలేదు”, పసిబిడ్డల నోట్లో కళ్లుబోసి / కూలిబాట పట్టె తల్లుల బాధ తీరటం లేదు” …. అంటూ అంచలంచెలుగా దేశంలోని దరిద్రాన్ని, హింస ను పేర్కొంటూ “ నెత్తురు లేని మనుషులంతా రోడ్లపై కొత్త సంవత్సరం కోసం గగ్గోలు పడుతున్న” దృశ్యాన్ని చూపి నూతన సంవత్సర సంబరాల్తో మారదు ఏదీ … నూతన సమాజ పోరాటాలతోనే మార్పు అంతా” అని స్పష్టం చేస్తాడు ఈ కవితలో. రాజయ్య అంటే అది. పోరాడి నిర్మించుకోవలసిన నూతన సమాజం కోసం అందివచ్చిన ఉద్యమాలన్నిటినీ అక్కున చేర్చుకొన్న వ్యక్తిత్వం.
పంథొమ్మిదివందల తొంభయ్యవ దశకపు ప్రారంభంలో వచ్చిన మహిళల సారా వ్యతిరేక ఉద్యమం నుండి సాయిబాబా నిర్బంధ వ్యతిరేక ఉద్యమం వరకు అదే మార్గంలో నడుస్తున్న కవి రాజయ్య. “ బైలెల్లిన అక్క సెల్లెల్లు” పాటతో మొద లైంది ఆ ప్రస్థానం. “కోకిల్లారా చిలకల్లారా తెల్లారోచ్చిందీ- బలబల తెల్లారోచ్చిందీ / సూర్యుని జూసిన చుక్కలుచంద్రులు చాటుకు బొయిండ్లూ – వాళ్ళు చాటుకు ఎల్లిండ్లు ..” అనే పల్లవితో మొదలైన ఈ పాట సూర్యోదయ సమయాన జనజీవిత చలనాలను చూపిస్తూ నిదురలేచిన పిల్లల పాల కొరకు ఏడుపులను , పాలు లేని తల్లుల కన్నీళ్లను చూపించి కూలీ నాలీ స్త్రీల దైన్యాన్ని చూపాడు. దైనిక అవసరమైన నీళ్లు ఇయ్యని సర్కారును తిట్టటమే కాకుండా తిరస్కరించే చైతన్య స్థాయికి వాళ్ళు ఎదగటాన్ని సూచిస్తూ “ఏరై పారే బ్రాందీ , విస్కీ బందు చెయ్యంటూ/ వాళ్ళు పోరుకు బైలెల్లిన సంగతి చెప్తాడు. సారా బందు చెయ్యాలని ఒక్కటై పోరాడుతున్న మహిళలకు మద్దతు ఇయ్యాలంటూ పిలుపునిచ్చాడు ఈ పాటలో.
నూతన సహస్రాబ్ది గమనం అంతా ప్రపంచీకరణ పరిణామాల మధ్య దేశీయ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టటం లక్ష్యంగా సాగింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఖనిజ వనరుల ఆక్రమణకు అవరోధంగా ఉన్న ఆదివాసీల ప్రతిఘటన చైతన్యాన్ని అణచి వేయటానికి అవలంబించిన దమనకాండ లో తొలిఘట్టం పేరు సాల్వా జుడుం. 2005 జూన్ 5 న రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొన్న తక్షణం ఇది బీజాపూర్ జిల్లాలో మొదలైంది. దంతెవాడ , సుక్మా నారాయణ పూర్ జిల్లాలలో ఆదివాసీ జీవితం మీద హింసాత్మక ప్రయోగంగా నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది,ఊళ్లకు ఊళ్లను, పంటపొలాలను తగలబెట్టి ధ్వంసం చేయబడ్డాయి. ఆదివాసీలు పాశవిక హత్యలకు గురయ్యారు. స్త్రీల మీద అత్యాచారాలు జరిగాయి. ప్రజాసంఘాలు, హక్కుల కార్యకర్తలు , పత్రికా రచయితలు , పరిశోధకులు ఈ దారుణాలకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసి జరిపిన న్యాయపోరాటం ఫలితంగా 2011 లో సుప్రీం కోర్టు ఇది తప్పుడు విధానం అని తీర్పు ఇచ్చింది.అయినా గ్రీన్ హంట్ పేరుతో, ఆ తరువాత సమాధాన్ పేరుతో కొనసాగిన ఈ విధమైన ‘ప్రజలపై ప్రభుత్వ యుద్ధం’ కగార్ పేరుతో మరింత తీవ్రస్థాయికి చేరిన వర్తమానంలో మనం ఉన్నాం. ఈ మొత్తం క్రమంలో కవిగా రాజయ్య సాల్వాజుడుం తొలి దశలోనే (2005 ) “సాల్వా జుడుం , సర్కారు జులుమే” అని తీర్పు ఇస్తూ కవిత వ్రాయటం విశేషం.
అదే సమయంలో(2007) అయన ‘సాగిపోనేస్తమా’ అనే కవిత వ్రాసాడు. విప్లవోద్యమంలోకి ఒక మిత్రుడిని సాగనంపటం అందులో విషయం. చిరు చీకట్లు కమ్ముతున్న వేళ ఇంటిదగ్గర ఎదురు చూస్తున్న అమ్మ దగ్గరకు వెళ్లటమా సమర రంగానికి సాగిపోవటమా అని సదసత్సంశయంలో ఉన్న మిత్రుడితో కవి చేసిన సంభాషణ ఇది. ఈ సంభాషణవల్ల మిత్రుడు గొప్పోళ్ళ గోత్రాలు తెలిసినవాడు. ఎలీనోడి మాటలను ఏవగించుకొన్నవాడు. దళితుల ఆదివాసీల, మహిళల కష్టాలకు కరిగి కన్నీరవుతున్నవాడు. దోపిడీ దురాగతాలను దూరం చెయ్యాలన్న సంకల్పం ధృడపడుతున్నవాడు. సంఘంలో చేరి సమరం చేయ ఉత్సహిస్తున్నవాడు. అటువంటి వాడికి అమ్మ ఒక్కతే ఈ ప్రపంచ బంధం. బాధ్యత. “ అమ్మకు నువ్ లేని లోటు నేనుండీ తీరుస్తా /అందరిలో అమ్మను నువ్వు చూడు నేస్తమా/ వేగుచుక్క పొడిచింది వేగిరమే మిత్రమా / నువ్ సాగిపో నేస్తమా” అని కవి ఈ కవితను ముగించాడు.
సమానత్వం కోసం సమరం పెత్తందారులకు, అధికారవర్గాలకు ఎప్పుడూ గిట్టనిదే. అందుకోసం ఉద్యమాలను అణచివేయటానికి ప్రభుత్వ పోలీసు వ్యవస్థ రూపొందించుకున్న విధానం ఎంకౌంటర్లు. అలాంటి ఎంకౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రుల కోణం నుండి ఆ సమస్యను వస్తువుగా చేసి రాజయ్య ‘ఒక నమ్మకం’ (2012) అనే కవిత వ్రాసాడు. “ తమ బిడ్డల్ని / సమసమాజపు బడికి / పంపిన అయ్యవ్వలకు/ ఎల్లవేళలా ఎదిరి చూపులే” అని మొదలవుతుంది ఈ కవిత. ఎంకౌంటర్ వార్తలు విన్నప్పుడల్లా ‘కన్నపేగు కదిలిన బాధ’ అందరిదీ అవుతుంది. చిత్రవధల మరణాలతరువాత శవాల గుర్తింపు వరకు ఒక గుండె కొత. పిల్లలు నక్షత్రాల వలే రాలిపోతున్నా అంత భీభత్సం మధ్యకూడా ఆ అయ్యవ్వల్ని నిలబెడుతున్నది ఏమిటి? అంటే నమ్మకమే. ఆశించిన సమసమాజం ఏర్పడుతుందనే నమ్మకమే అంటాడు కవి.
రాజయ్య నిజమైన దేశభక్తుడు. భారతదేశ రాజ్యాంగ పీఠిక లో చెప్పబడిన ‘సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య’ భావనకు నిబద్ధుడు. “సాల్వా జుడుం , సర్కారు జులుమే” కవితలోనైనా, ‘సామ్రాజ్యవాదంపై సమరభేరి’ (2006) కవితలోనైనా దేశ వ్యవహారాలను ప్రపంచబ్యాంక్ వంటి బయటి సంస్థల ఆదేశాలకు, బయటివారి ప్రయోజనాలకు అనుగుణంగా నడుపుతూ దేశీయుల మానప్రాణాలను,ఆత్మగౌరవాన్ని హరించటాన్ని ఏవగించుకొన్నాడు. ‘సామ్రాజ్య వాదం పై సమరభేరి’ కవితలో అగ్ర రాజ్య అమెరికా పెద్దన్న పాత్రకు సాగిలపడిన దేశపాలక వర్గపు బానిస తత్వాన్ని నిరసించాడు. అమెరికా ప్రెసిడెంటు బుష్ భారతదేశ రాక సందర్భంగా వెల్లువెత్తిన ప్రజానిరసన స్వరమై ఆయన ఈ కవిత వ్రాసాడు. ఈ సందర్భంలోనే చెప్పుకోవలసిన మరొక కవిత ధీరుని ధిక్కారం.(2007)
ఎవరీ ధీరుడు? సద్దాంహుసేన్ ఇరాక్ అధ్యక్షుడు. గల్ఫ్ దేశాల మధ్య యుద్ధాలలో అధికారాన్ని స్థిరం చేసుకొంటూ బలపడుతున్న సద్దాం హుసేన్ చమురుదేశాల మీద తన ఆధిపత్యానికి ప్రమాదకర శక్తిగా ఎదుగుతున్నందువల్లనే అమెరికా ఇరాక్, ఇరాన్ యుద్ధాలలో ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేయటమే కాకా ఒక దశలో ప్రాణాంతక ఆయుధాలను ఉత్పత్తి చేస్తూ జాతి హననానికి పాల్పడు తున్న నియంతగా సద్దాం హుసేన్ ను చూపిస్తూ అగ్రరాజ్య అహంకారంతో అతనిని సర్దిదిద్దే పెద్దన్న పాత్ర తీసుకొని ఇరాక్ మీద 2003 లో దాడి చేసి ఆక్రమించింది. అజ్ఞాతంలో ఉన్న అతనిని వెతికి పట్టి బంధించి, విచారణ జరిపి 2006 డిసెంబర్ లో ఉరితీసింది. సద్దాం నియంత, నరహంతకుడు కావచ్చు. ఆ విషయంలో అతనిని నిరసించాల్సిందీ, అభిశంసించాల్సింది ఆ దేశపు ప్రజలు. కానీ దేశాల స్వయం ప్రతిపత్తిని నిరాకరించే తీరులో అమెరికా ఆ నిర్ణయాధికారాన్ని తాను తీసుకొనటం వివాదాస్పదమైంది. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యానికి చెక్ పెట్టగలిగిన సద్దాం వీరుడు కాగలిగాడు. “తలెత్తి సామ్రాజ్యవాదాన్నే సవాలు చేసి / తన్నినంత పనిచేసావ్’ అని ఈ కవితలో సద్దాం ను ప్రశంసించాడు. “వర్ధమానదేశాల వనరుల్ని దోచుకునే/ సామ్రాజ్యవాదానికది ధిక్కారమే” అతని మరణాన్ని వీరమరణంగా పేర్కొన్నాడు.
4.
ఈ క్రమంలోనే రాజయ్య రాజ్యం ఎంత ఫాసిస్టు శక్తిగా బలపడిందో గుర్తించి నిరసించ గలిగాడు. ఫాసిజం భిన్న ప్రజాసమూహాల ప్రత్యేకతలను, అవసరాలను గుర్తించ నిరాకరిస్తుంది. భిన్నాభిప్రాయాలపట్ల అసహనం దాని లక్షణం. పెట్టుబడి శక్తులకు మద్దతుగా ఆర్ధిక రాజకీయ ఆధిపత్య స్థాపన దాని లక్ష్యం. ఆ క్రమంలోనే హేతువు ను తిరస్కరించటం, విమర్శించే వాళ్ళపై అణచివేత, నిర్బంధం 2014 లో బీజేపీ పాలనలోకి వచ్చినప్పటి నుండి క్రమంగా పెరిగాయి.
1997 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వారుబోసిన వరంగల్ డిక్లరేషన్ మహాసభను తానై నడిపిన సాయిబాబా ఆ తరువాత రెండు దశాబ్దాల కాలంలో ప్రజా సమస్యల మీద ఐక్య వేదికలు నిర్మించి పనిచేయటమే కాక అంత ర్జాతీయ స్థాయిలో వాటికి మద్దతు కూడగట్టాడు. ఢిల్లీలో యూనివర్సిటీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేస్తూ ప్రజాఉద్యమాల కేంద్రంగా ఉన్న సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధా లున్నాయి అని ఆరోపిస్తూ 2014 లో అరెస్టు చేసి 2017లో యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది ప్రభుత్వం. నాగపూర్ జైలు అండా సెల్ లో నిర్బంధంలో ఉన్న సాయిబాబా విడుదలను కోరుతూ దేశ విదేశాలలో ఉద్యమాలు నడిచాయి. వరగంగల్ లో ఈ ఉద్యమానికి ముందున్నవాడు నల్లెల్ల రాజయ్య. ఆ సందర్భంనుండే జి. యెన్ సాయిబాబా స్వేచ్ఛకోసం ‘పొద్దు తిరుగుడు మనిషి’ అనే పేరుతో ఒక కవితా సంకలనం(2018) ప్రచురించాడు. అందులో ఆయనవి రెండు కవితలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం, దేశభక్తి అని పదేపదే వల్లించబడే మాటలు అసలు సారంలో మిగిలిఉన్నాయా అన్న ప్రశ్నను సంధించిన కవితలు ఇవి. హక్కుల్నిహరించటం,కొట్లాడేటోళ్లను కుళ్లబొడవటం, ప్రశ్నించెటోళ్లను మట్టుబెట్టటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల స్వభావంగా మారిన స్థితిని నిలదీస్తూ ఆ నేపథ్యంలో “అంగవైకల్యం లెక్క చేయక/ అభాగ్యులకు అండగా నిలిచి / ప్రభుత్వ పన్నాగాలను ప్రపంచానికి / తెలిపినందుకే అక్రమంగా / ‘అండాసెల్’ లో బంధించి / జీవించే హక్కును హరించడమేనా/ ప్రజాస్వామ్యమంటే ..?”అన్న ముగింపులో ఇక ఇదెంత మాత్రమూ ప్రజాస్వామ్యం కాదని ధ్వనింపచేసాడు. ‘జైల్లోకి దేశభక్తి’ కవిత మరీ చెప్పుకోవలసినది. “మాతృదేశభక్తిని మనసు నిండా/ నింపుకొని మనిషిగా నిల్చినోడు” సాయిబాబా అని కవిత ప్రారంభంలోనే స్థాపిస్తాడు. విదేశీ భావాలను వీళ్ళు తీసుకురావటం లేదు .. ప్రభుత్వాలే విదేశీ తొత్తులై ఖనిజ వనరుల కట్టబెట్టటానికి దేశీయుల మీద యుద్ధం ప్రకటిస్తే సాయిబాబా ఇదేమిటని ప్రశ్నించాడు. వాళ్ళ పక్షాన నిలబడి న్యాయం కోసం అడిగాడు. అలాంటి వాడిని నిర్బంధించటం అంటే దేశభక్తిని జైల్లో వేయటమే. “దేశభక్తిని జైల్లోకి తోసి/ విదేశీ తొత్తుల్ని విపణిలోకి వదిలింది” అన్న కవిత ముగింపు లో రాజయ్య ప్రభుత్వాలు వల్లించే దేశభక్తి అసలు తత్వాన్ని బట్టబయలు చేసాడు.
కార్పొరేటీకరణ ప్రయోజనాలకు కాషాయీకరణ తోడైన వర్తమాన సందర్భంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు ఎన్నో. దానిని ఖండించటం కర్తవ్యంగా రాజయ్య వ్రాసిన కవితలు రెండింటిని ఇక్కడ పేర్కొనాలి. ఒకటి ‘అధైర్యపడకు తల్లీ’ ఇది బిల్కిస్ బానో ను ఉద్దేశించిన కవిత. బిల్కిస్ బానో 2002 గుజరాత్ మారణ కాండలో అత్యాచారానికి గురైన మహిళ.హిందూత్వ మూకలు దాడి చేసి కళ్ళముందే కుటుంబంలో అందరినీ ఊచకోత కొస్తుంటే నిస్సహాయంగా నిలిచిపోయిన మహిళ. ఆ తరువాత ఆమె జరిపిన న్యాయపోరాటంలో అత్యాచార హంతక దోషులకు జైలు శిక్ష పడింది. అయితే స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ వాళ్ళను విడుదల చేయటం దేశం మొత్తాన్ని దిగ్బ్రాంతి కి గురిచేసింది. ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆ సందర్భంలో రాజయ్య ‘అధైర్యపడకు తల్లీ నీకండగా మేమున్నాం’ అనే కవిత వ్రాసాడు( 2023) “స్వాతత్య్ర వజ్రోత్సవాల వేళ/ ఇంటింటి పై జెండాలెగరయ్యండని / పిలుపిచ్చినప్పుడే జరుగరానిదేదోజరగబోతోందని”ఊహించాడు కవి. జరిగిం దేమిటి?”జీవితఖైదుననుభవిస్తున్న/ అస్మదీయులకు / అత్యాచార హంతకులను” విడుదల చేసి స్వీట్లు తినిపించి మెడలో పూలదండలేసి సన్మానించటం. దీనిని గర్హిస్తూ అత్యాచార హంతకులను తిరిగి జైలుకు పంపాలంటూ యావత్ భారత సమాజం గొంతెత్తి నినదించిన దృశ్యానికి సాక్షి ఈ కవిత.
పాఠశాలలు అంటే చైతన్య కేంద్రాలు. అధ్యయనం బోధన మనుషులను వెలుగువైపుకు మేల్కొల్పే శక్తులు. విద్యార్థి వ్యక్తిత్వం , ఆలోచనా వైఖరి రూపొందే స్థావరం తరగతి గది. అధ్యాపకులు అందుకు మార్గదర్శకులు. ఈ క్రమాన్ని భగ్నం చేస్తూ మత ఫాసిజం దేశవ్యాపితం అవుతున్న సందర్భంలో పాఠశాలలు పాఠశాలలుగా ఉండటం లేదు. టీచర్ బోధన పై, చెప్పే విషయాలపై తీర్పులు ఇచ్చే బయటి శక్తుల ప్రాబల్యం పెరిగింది. దాని ఫలితమే తరగతి గదిలో టీచర్ హేతు పద్ధతిలో పాఠం చెప్పటం నేరమైంది. ఈ నేర ఆరోపణ పాటశాల వ్యవస్థలో జరిగిందికాదు. బయటి హిందూత్వ మూకల ఆరోపణ అది. విచారణ లేకుండానే బయటకు లాగి దేవాలయాలయానికి తీసుకువెళ్లి క్షమాపణలు చెప్పించిన్నఘటన తెలంగాణలో జరిగింది. ప్రజాస్వామిక లౌకిక భావనలకు తావులేకుండా విద్యా రంగం నిర్బంధంలో సనాతన సాంప్రదాయ నిఘాలో పనిచేయవలసి రావటంలోని విషాదాన్ని గురించిన రాజయ్య ఆందోళన ‘జీవచ్చవాల పాఠ్యశాల’ అనే కవితా రూపం (2023) తీసుకొన్నది.
5.
భారీ నీటిప్రాజెక్టుల నిర్మాణంలో ప్రయోజనాలు ఎవరివో, నీరు ఎవ్వరికో , నిర్వాసితత్వం ఎందరికో తెలిసిన వివేకం నుండి ప్రజాఉద్యమాలు అనివార్యమైన కాలంలో ప్రయాణించిన పౌరుడిగా నల్లెల్ల రాజయ్య కలం వాటితో కలిసి కదం తొక్కింది. ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2014 లో ఊపందుకొంది. 2.91లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు, 540 గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ 300 గ్రామాలను ముంపుకు గురిచేయటమే కాదు మూడు లక్షల ప్రజలను నిర్వాసితులను చేస్తుంది. వారిలో 1, 50,000 మంది ఆదివాసీలు, 50, 000 మంది దళితులు. ప్రాజెక్ట్ నిర్మాణానికి అప్పటికే పదివేల ఎకరాల అటవీ భూమి, 1,21,975 ఎకరాల అటవీయేతర భూమి సేకరించబడి ఉన్నాయి. ఆ సమయంలో తెలంగాణలోని పోలవరం ముంపుమండలాలకు వెళ్లి వచ్చిన రాజయ్య ఆ నాటి ఆవేదనను వినిపించిన కవిత చట్టుబండలు (2014) “కండ్లనిండా / కాలగర్భంలో కలుస్తున్న/ బతుకు చిత్రం / పేగుబంధం తెగిన శోకం/” దగ్గర ఆగక అదేసమయంలో “ఆదిమ మానవుడి/ అణువణువూ ఆక్రందనై .. / దిక్కులు పిక్కటిల్లే/ నినాదమైన/ పోరాట దృశ్యం” కలగనగల దిటవుగుండె మనిషి ఆవిష్కారం చూస్తాం ఈ కవితలో. ఈ సందర్భం నుండే వ్రాసిన పాట ‘పొతం బెడతాం’.
పోలవరం ప్రాజెక్టు లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలను కలుపుకొని సాగే పాపికొండల శ్రేణి ని ఒరుసుకొంటూ ప్రవహించే గోదావరి నీటిమట్టం పెరిగి సమీప గ్రామాలు, అనేక పక్షులకు, భిన్న జీవరాశులకు నిలయమైన చెట్లూ , పొదలు ముంపుకు గురి అయి జరిగే ప్రకృతి విధ్వంసం గురించి రాజయ్య ఆందోళన ‘కన్నీటివేదన’ (2017) కవితలో వినబడుతుంది. “ఇనప కొండల్నే మింగేటోడికి / పాపికొండల్ని ముంచటం ఒక లెక్కా/” అని ఖనిజ వనరుల దోపిడీలో అప్పటికే పండిపోయిన ప్రభుత్వాల వైఖరి మీద చురుక పెట్టటం ఈ కవితకు ముక్తాయింపు.
ఈ వరుసలో సిద్దిపేట జిల్లాలోని తొగుట కొండపాక మధ్య మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం 2016 లో మొదలైంది. 12లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించగల ఈ ప్రాజెక్ట్ వల్ల 8 గ్రామాలు పూర్తిగానూ, 6 గ్రామాలూ పాక్షికంగానూ మునిగిపోతాయి. అందువల్ల ఈ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ వేముల ఘాట్ రైతులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. నష్టపరిహారం మార్కెట్ రేట్ల ప్రకారం ఉండాలని మరొక ఐదుగ్రామాలు ఈ ఉద్యమంలో చేరాయి. ఈ ప్రజలను చెదరగొట్టటానికి బెదరగొట్టటానికి కెసిఆర్ ప్రభుత్వం పోలీసులను పురికొల్పింది. హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక ఆలోచనాపరులు ఆ గ్రామాలలోకి రాకుండా 144 వ సెక్షన్ కూడా విధించింది. ఈ నేపథ్యంలో రాజయ్య వ్రాసిన కవిత ‘లడాయికి సిద్ధం’(2017) “ఏ ఏడు కరువన్నది ఎరుగని/ చుట్టూరా చెరువుల హారంతో పచ్చని పంటల నెలవైన పల్లెటూరు … ఏటిగడ్డ కిష్టాపూర్”ను ‘ఎక్కిళ్ళతో ఊపిరి బిగబట్టి” న స్థితికి తెచ్చిన ‘అభివృద్ధి’ మాయను అసహ్యించుకొన్నాడు. “చదివిన బడి , మొక్కిన గుడి / బుక్కెడు బువ్వనిచ్చిన భూమాతను / వదిలిపోయేదే లేదని” దీక్ష పట్టిన బాధిత గ్రామాల ప్రజలకు మద్దతునిచ్చాడు.
అట్లాగే రాజయ్య 2010 నుండి సింగరేణి కంపెనీలో ఉపరితల గనుల తవ్వకపు పద్ధతి తెలంగాణ ప్రజల జీవితంలో తెస్తున్న విధ్వంసాన్ని నిరసిస్తూనే ఉన్నాడు. ‘బతుకు చింపిన సింగరేణి’ పాట దానినుండే పుట్టింది. ఊళ్ళు ఊడ్చుకుపోతూ , వ్యవసాయం నుండి గ్రామాలను ఆశ్రయించిన సకల వృత్తుల జనం జీవనోపాధి మార్గాలను నిర్దాక్షిణ్యంగా మూసేసుకుపోతున్న పెట్టుబడి వైఖరిపై యుద్ధం ప్రకటిం చాడు. ఈ ఆర్తి నే ఒక బాధిత ముసలమ్మ స్వరం నుండి వ్యక్తీకరించిన కవిత ‘జరసొంచాయించుండ్లి.’ (2018)
6.
తెలంగాణ రాజయ్య జీవనాడి. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలం నాటికి ఏడెనిమిదేళ్ల పిల్లగాడు, 1997 లో ప్రజాస్వామిక ఆకాంక్షగా తెలంగాణ సమస్య రంగం మీదికి వచ్చేవరకు ‘ఆశయాల పందిరులు’ వేస్తున్న నవయౌవనుడు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షకు పరిష్కారం తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ఉన్నదని కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీని వదిలి 2001లో తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పరచాడు. దానికార్యకలాపాలను గమనిస్తూ ఉన్న రాజయ్య తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసే సంభాషణాత్మక గేయం ఒకటి వ్రాసాడు.(2007) ఒక పిల్లవాడు “ తెలంగాణ వస్తది మెల్లమెల్లగొస్తది / కుంటుకుంటూ వస్తది… /../ ఏడ్చుకుంటు వస్తది తుడుచుకుంటు వస్తది …” అని పాడుకొంటూ వస్తుంటే ఒక ముసలవ్వ ఆగబట్టి ఆ పాటేంది అని నిలదీస్తుంది. అవును అది నిజం అంటూ ఆ మాటలే మళ్ళీ అంటూ “సోనియాగాంధిస్తది కేసీయారు తెస్తడు” అని కొత్త మాటలు కలుపుతాడు. ముసలమ్మ ఇన్ని రోజులు తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన వాళ్ళు వాళ్ళే అని తెలియ చేస్తూ “జనమంతా అడిగితే తెలంగాణ వస్తది / మనమంతా కదిలితే తెలంగాణ వస్తది” అని చెప్తుంది. తెలంగాణ ఏ ఒక్కరో ఇచ్చేది , తెచ్చేదీ కాదని చెప్పగలగడం, ప్రజాఉద్యమాలవల్లే ఏవైనా సాధ్యమని నొక్కి చెప్పటం రాజయ్య రాజకీయ అవగాహన లోని పరిణితికి నిదర్శనం. ప్రాంతీయ భాషను, సంస్కృతిని, విశ్వాసాలను వలస పాలకుల నుండి రక్షించుకొనటానికి స్థానికంగా చేసే చిన్నచిన్న పోరాటాలు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయనకు చాలా అపురూపమైనవి. సింగరేణి ఏరియాలో బాలమ్మ దేవతను కనకదుర్గగా మార్చే ప్రయత్నం చేస్తే కార్మికులు ఎదిరించిన తీరుకు స్పందించి “చూపరా! తెలంగాణ తెగువ”(2007) అని కవితతో భుజం తట్టాడు.
“మనసు మనసు గల్సి మాటలాడుకోని
గుండె గుండె గల్సి ఊసులాడుకోని
ఊపిర్లు కలబోసి ఉద్యమాలుగా మారి
పోరూ బైలెల్లిందిర తమ్ముడా
తెలంగాణ హోరెత్తి పోతుందే చెల్లెలా” (పోరుబాటలో తెలంగాణ 2008) వంటి ఉత్తేజకర గీతాలను ఎన్నింటినో ప్రజాసమీకరణకోసం వ్రాసి పాడాడు రాజయ్య. ‘రణభేరి’(2009) వంటి కవితలు పోరాట గర్జనలే.
తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఘటన చారిత్రాత్మకమైన మలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణానంతరం అతని కొడుకు జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర మానుకోట నుండి ప్రారంభించ తలపెట్టినప్పుడు – అతని తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక లక్షణం వలన మానుకోటలో అడుగుపెట్టనీయరాదని ప్రజలు ప్రతిఘటించిన ఘటన 2010 మే 28 నాటిది.ఆ మానుకోట స్ఫూర్తిని చాటుతూ రాజయ్య 2011లో ‘మానుకోటలై మండిపడాలే’ అనే పాట వ్రాసాడు. “లేలేలే చెల్లే – రారా తమ్మీ/ జాగుచేయక నువ్వు జంగు చెయ్యరా జల్దీ/” అనే పల్లవితో ప్రారంభ మయ్యే ఈపాటలో ‘విభజనవద్దని పార్లమెంటులో/ ప్లకార్డు జూపిన పాగల్గాడు’ అని జగన్మోహన్ రెడ్డిని నిందించి నిరసించాడు. ఆ ఘటనలోరాళ్ళ వర్షం కురిపిస్తూ పోరునడిపిన క్రియాశీలురైన హతీరాం, ఎంకటేశు, హాచ్యా, రంజిత్, ఇమామ్, శోభన్, వీరేందర్, బిచ్చా, రావోజ్ మొదలైన వారిని కీర్తిస్తూ ఈ పాటను ఒక వీరగాధగా చేసాడు రాజయ్య.
ఆంధ్రవలసవాదులను సంబోధిస్తూ ‘నువ్వెవలో నాకు తెల్వదు’ అని మొదలు పెట్టి వ్రాసిన కవిత ‘ఎనుగు నాటుకొందాం’ (2010). తన జాగాలో ఉండి తన వేషభాషలను విలన్ల భాష చేసి వెక్కిరిస్తూ, తన సొమ్ము తింటూ బలవంతగా తనను కలుపుకొని, తీరా తననే దేశద్రోహిగా చెప్తున్న వలసవాదుల ఇసపు కౌగిలి వెకిలి చేష్టలే ఇద్దరిమధ్యా విభేదం ముదిరి పోవటానికి కారణం అని చెప్పి ‘ఏగిరాంగా యేరుబడటమే’ తక్షణ కర్తవ్యం అని ఖుల్లమ్ ఖుల్లమ్ గా చెప్పేసాడు. సవాల్ కవితలో “నా సంస్కృతిని అవహేళన జెసి/ నా నిధులను నీళ్లను నిలువూతా మింగి” తీరని ద్రోహాన్నిజేసి ఒడువని దుఃఖానికి కారణమైన ఆంధ్ర వలస పాలన, విధానాలు ఖండనకు గురయ్యాయి. ‘తొండి తన మని తెలుసుకో’ కవిత కూడా ఆంధ్రులను సంబోధించినదే. ప్రాంతీయ రాజకీయాలపట్ల వాళ్ళ అసహనంలోని స్వప్రయోజనాపేక్షను వ్యంగ్యం చేసాడు ఈ కవితలో. “ కళలకి కూడా / ప్రాంతీయం అద్దకండంటూ/ ప్రాధేయపడ్డట్లు నటించటం / అబద్ధాన్ని ఉటంకించటం / ఎంత మాయాదారితనమో/” అని నిరసిస్తాడు. తెలంగాణ పాటల చెలిమ బెల్లి లలితను అంతం చేయించిన పాలకుల దౌర్జ్యాన్ని ఖండించని ఆంధ్ర సాహిత్యకారులను దోచేటోళ్లకు వత్తాసుగా తోచింది రాసిపారేసి తోకలూపుకొంటూ తిరిగే వాళ్ళుగా పేర్కొన్నాడు.
తెలంగాణ ఉద్యమం మీద జరుగుతున్న దాడులను , శ్రీ కృష్ణ కమిటీ పేరుమీద చేస్తున్న కాలయాపనను, తెలంగాణా ప్రజాప్రతినిధులై ఉండి ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించకుండా అధిష్టానం అడుగులకు మడుగు లొత్తు తున్న నాయకులను నిరసిస్తూ రాజయ్య వ్రాసిన పాట ‘తాట వలుద్దాం’ (2011) “తెలంగాణ సోయితో ఒక్కటవుదము/ మాటదప్పిన నేతల తాట ఒలుద్దుము/ గల్లీలున్న ఢిల్లీలున్న గల్లబడదము/ తెగించైన తెలంగాణ సాధించెదము” అన్న ప్రతిజ్ఞతో ముగుస్తుంది ఆ పాట.
తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించటం అంటే తెలంగాణ లోని ఉత్పత్తి విధానాలను,సంబంధాలను గురించి ఆలోచించటం.ఈ క్రమంలో వ్యవసాయం ప్రధాన జీవన రంగం అయిన దేశంలో ప్రభుత్వాలు వ్యవసాయం పట్ల, రైతుల పట్ల అనుసరిస్తున్న పద్ధతి తప్పక చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణాలో 2010 లో సహకార సేద్యం గురించిన ప్రయోగాలు జరిగాయి.చిన్నకమతాలు పెద్దఎత్తున ఉత్పత్తికి అనుకూలం కాదు కనుక చిన్నరైతులంతా కలిసి తమ వనరులను పంచుకొంటూ సహకార పద్ధతిలో వ్యవసాయం చేయటానికి అప్పులు ఇచ్చి, పంటకు మార్కెట్ చూపించే సహకార సంస్థలు వచ్చాయి. ముఖ్యంగా ఈ పద్ధతిలో పూల తోటలు, పండ్లతోటల పెంపకం ప్రోత్సహించబడింది.అయితే ఈ క్రమంలో బహుళజాతి కంపెనీల, దళారుల పాత్రను గుర్తించిన రాజయ్య. ఆహారపంటలు మాని వ్యాపారపంటలు వేయటం వలన తెలంగాణ రైతు జీవితం పెనం మీదినుండి పొయ్యిలోకి పడ్డట్లు అవుతుందని పసిగట్టి హెచ్చరిస్తూ ‘స్వాహాకార సేద్యం’. (2010) కవిత వ్రాసాడు. అది సహకార సేద్యం కాదు, రైతు బతుకును స్వాహా చేసే సేద్యం అని నిరసించాడు.
రాజయ్య భౌగోళిక తెలంగాణ ఏర్పాటుకు తన భౌతిక సృజనాత్మక శక్తిని ఎంతగా వెచ్చించాడో అదే సమయంలో భౌగోళిక తెలంగాణతో సమస్తం సాధించబడ్డట్లు కాదు అన్న వివేకం తో కూడా ఉన్నాడు. “బతుకునిచ్చే తెలంగాణ” (2014) కవితలో “కోరుకున్న రాష్ట్రం ఆవిర్భవించిందని / నాకిప్పుడు ఎక్కడ లేని సంబురమే” అంటూనే “ నా మదిలో మెదిలే సందేహాలెన్నో/ నా కిప్పుడు … తీరని సంశయాలు మరెన్నో” అంటాడు. నా వాళ్ళకిపుడు కడుపు నిండ తిండి / కట్టుబట్ట , కంటినిండా నిద్ర / భద్రతకోసం ఇల్లైనా, ఇంత జాగైనా / ఒక మానంగా దొరుకుతుందా లేదా” అన్న సంశయంతో కలత పడ్డాడు. ‘కార్పొరేట్ చదువులు పోయి కామన్ స్కూల్ చదువులు , ప్రయివేటు వైద్యం పోయి సర్కారు వైద్యం’ అందుబాటులోకి రావాలన్న కామన నెరవేరుతుందా అని దిగులు పడ్డాడు. ప్రయివేటీకరణ , కార్పొరేటీ కరణలను తెలంగాణ అడ్డుకోగలదా? ఆదివాసులకు హానికరమైన అభివృద్ధి నమూనా అంతం కాగలదా ? ఇలాంటివన్నీ అతనిని వేధించే ప్రశ్నలు. సమస్త ప్రజలకు ‘బతుకునిచ్చే తెలంగాణా , బతకనిచ్చే తెలంగాణ’ గా ప్రత్యేక రాష్ట్రం రూపొందక పోతే తెలంగాణ రాష్ట్ర సాధనకు అర్ధం లేదని రాజయ్య భావించటం ఇందులో చూస్తాం.
అందుకనే రాజయ్య తెలంగాణరాష్ట్రం ఏర్పడింది .. ఇక అన్నీ వాటంతట అవే వస్తాయని ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూనో, ప్రభుత్వంలో చేరిపోయో ప్రశాంతంగా ఉండలేకపోయాడు. కాలానికి కాపలాదారై ప్రభుత్వానికి ప్రతిపక్షమై అవసరమైనప్పుడల్లా ప్రజాప్రయోజనాలకోసం నినాదం అవుతూనే ఉన్నాడు. అమరులకు స్మారక స్తూపాలు కట్టమని ఒత్తిడి చేయటమే కాదు ‘బతికిన జనావళికి జీవన సార్ధకత చూపమని / దండుగట్టి నిలదీయాలే’ అని అమరుల ఆత్మఘోష (2015-16) కవితలో చెప్తాడు. దగాకోరుల గల్ల బట్టి గద్దె దించటానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రబోధిస్తాడు. తెలంగాణ రాష్ట్రమైయితే వచ్చింది కానీ అది ‘వనరులపై వలసాధిపత్యం/ తొలగని తెలంగాణ’ నే అంటాడు రాజయ్య. ఓపెన్ కాస్టులు, రియల్ ఎస్టేట్లు, ఇసక తరలింపులు, ఆదివాసీల విస్థాపన ఇలా అనేక సమస్యలతో తెలంగాణ విధ్వంసం అవుతున్న దృశ్యానికి పటం కట్టిన కవిత విధ్వంసాల తెలంగాణ (2018). ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతుల సమస్య పట్ల మనదైన ప్రభుత్వ స్పందన కూడా స్నేహపూర్వకంగా లేకపోవటం రాజయ్య కు ఆగ్రహం కలిగించింది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొని రైతుకు భరోసాగా ఉంటామని వాగ్దానాలు చేసి మాట తప్పిన పాలక వర్గాన్ని ఆయన ‘ఏబ్రాసి వెధవల్లారా’ ‘దోపిడి దొంగల్లారా’ అని సంబోధించటానికి సందేహించలేదు.(రైతునేడిపించి రాజ్యమేలలేరు 2018) ఆరుగాలం శ్రమించి పంట తీసిన రైతులు అమ్ముకొనటానికి రోడ్డున పడిన వాస్తవం ఒక వైపు ఉండగా ప్రగతి భవన్ లో కూర్చొని ‘తెలంగాణ రైతన్నలు తెగబలిసి పోయిండ్లని’ అబద్ధాలు ప్రచారం చేస్తూ మాయలేడి వంటి బంగారు తెలంగాణా గురించి గొప్పలు పోతున్న కెసిఆర్ ను రాజయ్య సహించలేకపోయాడు.( రైతు రోడ్డున పడ్డడు 2021) అన్నదాత కు అండగా లేకపోతే “ పుట్టగతులుండవని / మీ పుట్టి ముంచుతరని గ్రహించుండ్లి” అని హెచ్చరిస్తాడు.
ఇలా తెలంగాణ వచ్చాక రాజయ్య కవిగా నిర్వహించిన పాత్ర అంతా ప్రజాస్వామ్యంలో నిజమైన అర్ధంలో ప్రతిపక్షం నిర్వహించే పాత్ర. “మేమే ప్రధాన ప్రతిపక్షం” అనే శీర్షికతో ఆయన చదివిన కవిత ఒకటి యూట్యూబ్ లో ఉంది. “ సామాన్య కవులం / కళా కారులం / రచయితలం / క్షేత్ర పర్యటన చేసే సామాజికవేత్తలం” అని ప్రకటిస్తూ తాము చేసిన క్షేత్ర స్థాయి కార్యకలాపాల నివేదికగా సాగిన ఈ కవిత ద్వారా కవులు సామాజిక చింతనాపరులు అయి వుండాలని రాజయ్య నొక్కి చెప్పాడు. బహుశా అది ఆతని జీవిత సందేశం.
రాజయ్య కవిత్వం లో భాష, యాస , నిర్మాణ శిల్పం మొదలైన వాటి మాటేమిటి అని ఎవరైనా అడగవచ్చు. ఇది కవిత్వం అవునా కాదా? పదాలు , పదబంధాలు, భావానుగుణమైన వాక్య నిర్మాణం చక్కగా పొసగుతున్నాయా? అని ఆలోచించి కవిత్వం చెక్కటం ఆయన లక్ష్యం కానేకాదు. తనకళ్ల ముందు వేగంగా సంభవిస్తున్న సామాజిక పరిణామాలను గమనిస్తూ ఆ సమయంలో తనకు అనిపించేది పైకనటమే ఆయన కవిత్వం. అది ప్రపంచపు బాధను తనబాధగా చేసుకొన్న క్రమానికి వ్యక్తీకరణ. “కవిత్వం నా గొడవ – దాంట్లో కవిత్వం వుంటే మంచిదే” అని కాళోజి కవిత్వాన్ని ద్వితీయాంశంగా, సామాజిక సంవేదనకు అనుబంధాంశంగా చేసి చెప్పిన సూత్రాన్నే నల్లెల్ల రాజయ్య కవిత్వానికి అన్వయించుకోవలసి ఉంటుంది.
నల్లెల్ల రాజయ్య అమరుడై 2025 ఫిబ్రవరికి ఏడాది. సామాన్యంగా జీవించి సహజ మానవ స్వభావాన్ని సదా సజీవం చేసుకొంటూ రచన ఆచరణగా విలువల కోసం జీవించిన అసాధారణ మానవుడు నల్లెల్ల రాజయ్య అని అతని జీవితం కవిత్వం చెప్తాయి. చెవి ఒగ్గుదాం రండి.