ఆగస్టు 9 2014 నాడు, అమెరికా లో మిసిసిపి రాష్ట్రం లో ఫెర్గూసన్ నగరం లో మైఖేల్ బ్రౌన్ అనే పద్దెనిమెదేండ్ల నల్ల పిల్లగాన్ని, శ్వేతజాతీయుడైన డారెన్ విల్సన్ అనే పోలీసు ఆఫీసర్ అన్యాయంగా కాల్చి చంపాడు. ఫెర్గూసన్ నగరం వెంటనే భగ్గుమన్నది. ఆ నగరం లో మెజారిటీ గా ఉన్న నల్ల జాతీయులు వీధుల్లోకొచ్చి తీవ్ర నిరసన తెలియజేశారు. మళ్ళీ నవంబర్ 24, 2014 నాడు గ్రాండ్ జూరీ (మిస్సిసిపీ లోని అత్యున్నత న్యాయస్థానం) డారెన్ విల్సన్ ను నిర్దోషిగా ప్రకటించినప్పుడు మరో సారి ఫెర్గుసన్ నిరసన జ్వాలలుగా భగ్గుమన్నది. నగరం లోని మెజారిటీ నల్లజాతీయులు శ్వేతజాతి ప్రభుత్వాన్ని ధిక్కరించి నిరసనలు తెలియజేయడం తో అమెరికా వ్యాప్తంగా ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ ఉద్యమం ఊపందుకున్నది. అమెరికా ప్రతి నగరం లో నల్ల జాతీయులు వీధుల్లోకొచ్చారు. అమెరికా లో జాతుల మధ్య సమానత్వం అసలు ఉన్నదా అని, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళ నాయకత్వం లో పౌరహక్కుల ఉద్యమం జరిగి నాలుగు దశాబ్దాలు దాటినా, ఇంకా తమ పట్ల ప్రభుత్వం, రాజ్యం, పోలీసు వ్యవస్థ ల్లో బహిరంగంగా వ్యక్తమవుతున్న వివక్ష, హింసల పట్ల నల్ల జాతీయులు తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టారు. అదీ ఒక నల్ల జాతీయుడు మొదటి సారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అట్లా జరగుతుండడం వాళ్ళను ఇంకా తీవ్రంగా కలవరపెట్టింది. అంతకుముందు నెల రోజులకు ముందే న్యూయార్క్ లో ఎరిక్ గార్నర్ అనే నల్లజాతీయుడిని పోలీసులు క్రూరంగా గొంతు పిసికి చంపారు.
మార్చి 8, 2015 నాడు ఒక్లోహామ నగరం KFOR-TV, ‘సిగ్మా ఆల్ఫా, ఎప్సిలాన్’ అనే విద్యార్థి సంస్థ నల్లజాతీయులను అవమానిస్తూ ‘నిగ్గర్ లకు తమ సంస్థలో జాగా లేదనీ, ఒక వేళ చేరే ప్రయత్నం చేస్తే వాళ్ళను లించ్ చేస్తా’ మంటూ ఒక వీడియో లో జాత్యహంకార నినాదాలు ఇస్తూ కనబడిందని రిపోర్ట్ చేసింది.
‘ఎస్ యే ఈ’ సంస్థ తన వీడియో లో ప్రకటించిన జాత్యహంకార అభిప్రాయాలూ, దేశవ్యాప్తంగా నల్ల జాతీయులపై జరుగుతున్న దాడులూ, పోలీసుల హత్యలూ, ఒక్క సారి నల్ల జాతీయులను వాళ్ళ అస్తిత్వం గురించి అమెరికా సమాజం మారుమోగేలా ప్రశ్నించేటట్టు చేసింది.
సమకాలీన అమెరికా సంగీతం లో అనేక నల్ల జాతి గాయకులు, సంగీతకారులూ ఉన్నప్పటికీ, నల్ల జాతీయుల అస్తిత్వ సమస్యలనూ, వారిపై కొనసాగుతున్న వివక్షనూ, లోతైన వారి గాయాలనూ ప్రతిబింబించిన సంగీతం అంతగా లేదనే చెప్పుకోవాలి. నిజానికి ట్రెసీ చాప్మన్ తర్వాత మళ్ళీ అంతగా రాజకీయ స్పృహతో అద్భుత సంగీతం సృష్టించిన సంగీతకారులు లేరనే చెప్పుకోవాలి. ట్రినిడాడ్ జేమ్స్ ‘ఆల్ గోల్డ్ ఎవ్రీథింగ్’ లో గానీ, నికి మనాజ్ ‘అనకొండ’ లో గానీ, అషర్ ‘ఐ డోంట్ మైండ్’ లో గానీ నల్ల వాళ్ళ పై జరుగుతున్న వివక్ష ప్రస్తావన ఉన్నా అది పైపైన తడిమినవే కానీ లోతులకు పోయి అసలు కారణాలను ప్రశ్నించినవి కావు.
దీనికి కారణాలు స్పష్టమే. అమెరికా లో సంగీతం ఒక భారీ పరిశ్రమ. ఆ పరిశ్రమ ప్రధాన లక్ష్యం లాభాలు సంపాదించడం. దానికి నల్లజాతీయుల ‘నల్లదనమూ ’ , నల్లవాళ్లకే స్వంతమైన హిప్-హాప్ సంగీతం గొప్పదనమూ లాభాలు తెచ్చిపెట్టే అంశాలే తప్ప, వాటి లోని వివక్ష వ్యతిరేక అస్తిత్వ రాజకీయాలు ఎంతమాత్రమూ అవసరం లేదు. హిప్-హాప్ సంస్కృతిలో నిజాన్ని నిజంగా చెప్పడం, వాస్తవికతకు అతి దగ్గరగా ఉండడం ప్రధాన లక్షణాలు. అట్లా అంతకు ముందు రంగం మీదకు వచ్చిన ‘గాంగ్ స్టర్’ రాప్, కానీ ‘వెస్ట్ కోస్ట్’ రాప్ కానీ స్నూప్ డాగ్, అయిస్ క్యూబ్ లాంటి గాయకులను ప్రముఖంగా ముందుకు తెచ్చింది. ఐతే వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్ గాంగ్స్ తో , నేర ప్రపంచం తో సంబంధాలు కలిగిఉండి, పోలీసు కేసుల్లో ఇరుక్కుపోయారు. అంతకు ముందు నిజాయితీగా నల్ల వాళ్ళ జీవితాన్ని ప్రతిబింబించిన హిప్-హాప్ సంగీతాన్ని ‘గాంగ్ స్టర్’ రాప్ మింగేసింది. వినేవాళ్ళకు ‘గాంగ్ స్టర్’ రాప్ నిజంగానే నల్ల వాళ్ళ జీవితాలను ప్రతిబింబిస్తుందనే భ్రమ కలిగించింది. నిజమైన నల్ల జాతి జీవితాన్ని ప్రతిబింబించిన హిప్-హాప్ ను ఎక్కువ అమ్మకాలతో ‘గాంగ్ స్టర్’ రాప్ ఆక్రమించి వెనుకకు తోసేసింది. ఐతే ‘గాంగ్ స్టర్’ రాప్ నేర ప్రవర్తనలతో విసుగు చెందిన వాళ్ళకు, దాని స్థానే, మురికివాడల్లో, ఘెట్టొల్లో అత్యంత నిరుపేద జీవితం అనుభవించే నల్ల వాళ్ళ జీవితం తో సంబంధం లేని మెరుగైన జీవితాన్ని అనుభవించిన డ్రేక్ లాంటి వాళ్ళ ‘హిప్-హాప్’ , నిజమైన హిప్-హాప్ గా ముందుకొచ్చింది.
సరిగా ఈ సమయం లోనే కెండ్రిక్ లామార్ అమెరికా సంగీత రంగం మీదకు ఒక పెను తుపానులా వచ్చాడు. అతను విడుదల చేసిన ‘పింప్ ద బట్టర్ఫ్లై’ ఆల్బమ్ అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇతర హిప్-హాప్ గాయకులు అషర్, నికి మనాజ్, డ్రేక్ లా కాకుండా కెండ్రిక్ ఒక నిజాయితీ గల హిప్-హాప్ గాయకునిగా, కవిగా ముందుకొచ్చాడు. తన ఆల్బమ్ మొదటి పాట ‘ద బ్లాకర్ ద బెరీ’ (నలుపైతేనే నిజమైన పండు) ప్రారంభం లో తనను తాను 2015 సంవత్సరపు అతి పెద్ద హిపోక్రీట్ గా పరిచయం చేసుకుంటూ, ఆ పాట చివరికల్లా దాని అసలు అర్థమేమిటటో వివరిస్తాడు.
లామార్ దాదాపు తన పాటలన్నింటిలో, అమెరికా లో శ్వేతజాతీయులకు నిజానికెప్పుడూ నల్ల జాతివాళ్ళంటే ఇష్టం లేదనీ, ఇద్దరి మధ్యా స్నేహమూ శాంతీ కృత్రిమమైనవే అని స్పష్టం చేస్తూ పాడతాడు. ప్రతి యేటా ఫిబ్రవరి లో జరుపుకునే ‘నల్ల జాతీయుల నెల’ ఉత్తుత్తిదే అని, అది నల్లజాతీయులను మభ్యపెట్టడానికే అని లామార్ నిక్కచ్చిగా చెప్తాడు. అమెరికా చరిత్రలో నల్లవాళ్ళకు స్థానం లేదని, అమెరికాలో జాతుల సమానత్వం అసాధ్యమనీ, ఎందుకంటే శ్వేత జాతీయులచే యేర్పాటు చేయబడ్డ అమెరికాలో విలువలు, చరిత్ర అంతా ప్రధానంగా శ్వేతజాతీయులవే అని, అందుకనే అది జాత్యహంకార దేశమనీ లామార్ ప్రధాన అవగాహన.
లామార్ తాను నల్ల చంద్రున్నని, తనది ఆఫ్రికా లో ఒక చిన్న గ్రామమని తన చరిత్ర, వంశపరంపర, ఆఫ్రికావే అని స్పష్టంగా తన వేర్లను గుర్తించి, తన నల్ల అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటిస్తాడు. అమెరికన్ సంగీతం లో సినిమాల్లో నల్ల వాళ్ళ గురించి సృష్టించిన స్టీరియోటైప్ లను ప్రస్తావిస్తూ అవి నల్ల వాళ్ళ అసలైన అస్తిత్వాన్ని ధ్వంసం చేయడానికే అని, ఒక వైపు నల్లవాళ్ళ పేరు చెప్పుకుని కోటానుకోట్ల డాలర్ల లాభాలు సంపాదిస్తూ మరోవైపు వాళ్ళ సంస్కృతినే నామరూపాల్లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని లామార్ తన పాటల్లో ప్రకటిస్తాడు.
నిజానికి శ్వేతజాత అమెరికా తన ప్రయత్నాల్లో విజయవంతమౌతున్నదని చెప్పక తప్పదని ఆవేదన చెందుతాడు.
ఒకప్పుడు ఇనుప సంకెళ్లతో నల్ల జాతి వాళ్ళను బానిసలుగా మార్చిన శ్వేతజాతి అమెరికా, ఇప్పుడు వాళ్ళకు బంగారు సంకెళ్ళు వేస్తూ మానసిక బానిసలుగా మారుస్తున్నారు. పెద్ద పెద్ద బంగారు గొలుసులు వేసుకుని వీలైనంత అమ్మాయిలను తమ చుట్టూ తిప్పుకుంటూ విలాసవంతమైన జీవితం అనుభవించడమే నల్ల జాతి యువకులు విజయవంతమైన జీవితంగా చెప్పుకోవడం, దాన్ని అందుకోవడం కోసం వక్రమార్గాలు పట్టడం అత్యంత దురదృష్టకరమైన పరిస్తితి అనీ ఇవాళ్ళ ఎవరూ మార్టిన్ లూథర్ కింగ్ లా, మాల్కం ఎక్స్ లా నల్ల జాతీయుల విముక్తి కోసం కృషి చెయ్యడం లేదని, తమ అస్తిత్వాన్ని, సంస్కృతినీ, డబ్బుల కన్నా ఎక్కువగా పరిగణించడం లేదని లామార్ ఆవేదన వ్యక్తం చేస్తాడు.
మరో పాటలో, అమెరికా లో నల్ల జాతి యువకులు ఎట్లా సమాజానికి రెలవెంట్ గా ఉన్నారో చెప్తాడు. నగరాల్లో, మురికివాడల్లో, ఘెట్టోల్లో నివసించే నల్ల జాతి యువకులు తీవ్ర పేదరికం లో, వివక్షలో, హింసాత్మక, నేరపూరిత వాతావరణంలో సరిగా చదువుకోక, చిన్న చిన్న నేరాల్లో ఇరుక్కుపోయి జైళ్ల పాలయి, జైళ్ళలో ఉచితంగా బానిసల్లా పనిచేయడం చూస్తే, ఆధునిక అమెరికన్ సమాజం బానిసత్వాన్ని ఎట్లా నిగూఢంగా , లౌక్యంగా అమలు చేస్తోందో అద్భుతంగా చెప్తాడు. అందుకనే నల్లజాతి యువకులు అట్లా చదువుకోకుండా, మురికివాడల్లో, ఘెట్టోల్లో నేరాల మధ్య బతకడమే ఈ శ్వేతజాత్యహంకార అమెరికన్ సమాజానికి అవసరం అంటాడు.
కాలిఫోర్నియాలో ‘కాంప్టన్ ఘెట్టో లో ఒక రోజు’ గురించి లామార్ పాడిన పాటలో ఎట్లా హింస రాజ్యమేలుతుందో వర్ణిస్తాడు. రోజూ పొద్దున్నే డ్రగ్స్ కోసం గాంగులు, ఆధిపత్యం చలాయించడానికి పోలీసులూ ఆ ఘెట్టోను ఆక్రమించుకోవడం, వాళ్ళ జీవితాల్లో వేదనను, బాధలనూ, నొప్పినీ పాడుతూ వాళ్ళ బ్రతుకులు ఎట్లా గణాంక వివరాలుగా మారిపోతున్నాయో చెప్తాడు. ఐతే చివరికి ఇంకా తనకు ఆశ మిగిలి ఉందనీ, ఏదో ఒక రోజు పరిస్థితి మారుతుందనీ ఆశ వ్యక్తం చేస్తాడు.
లామార్ నల్లవాళ్ళకు సంబంధించిన భాషకు కూడా విప్లవాత్మకమైన మార్పు తెచ్చాడు. ఉదాహరణకు అమెరికా లో నల్ల జాతీయుల ఆత్మ గౌరవ పోరాటాల తర్వాత పౌరహక్కుల ఉద్యమం తర్వాత నీగ్రో అనే పదం వాడడం దాదాపు నిషేధించబడింది. ఐతే హిప్ హాప్ గాయకులు ఎక్కువగా నిగ్గా అనే పదాన్ని వాడతారు. ఐతే లామార్ ఆ పదం వాడకానికి ఒక కొత్త రాజకీయ అర్థం ఇచ్చాడు. నిగ్గా పదం ఇథియోపియన్ పదం నిగస్ నుండి వచ్చిందనీ, దానర్థం మహారాజు అనీ అది నల్ల వాళ్ళ ఆత్మగౌరవానికి చిహ్నమనీ, లామార్ ఆ పదాన్ని ఒక ఆత్మగౌరవ చిహ్నంగా మార్చి మరింత బలంగా ప్రచారం లోకి తెచ్చాడు. ‘చరిత్ర పుస్తకాలు మా ఆత్మ గౌరవాన్ని అణచివేశాయి. మాకు సంబంధించిన చిహ్నాలను, పతాకాలను మసిపూసి దాచేశాయి’ అని కుండ బద్దలు కొట్టినట్టు ప్రకటించాడు. నిగా లాంటి పదాలను ముందు ఒప్రా ప్రచారం లోకి తెచ్చినా లామార్ దాన్ని మరింత ముందుకు తీసికెళ్లి, 1960 ల్లో మాల్కం ఎక్స్ స్థాపించిన బ్లాక్ పాంథర్ ఉద్యమం పోరాడిన నల్ల జాతీయుల ఆత్మగౌరవానికీ , ప్రతిఘటనకూ చిహ్నంగా తన పాటల్లో ప్రతిధ్వనించాడు.
21వ శతాబ్దం ప్రతి హిప్ హాప్ సంగీత కారుని నుండీ లామార్ అన్ని రకాలుగా భిన్నమైన మార్గాన్ని అనుసరించాడు. నిజానికి ఇంతకు ముందెవ్వరూ ఇట్లా రాయలేదు, పాడలేదు. నల్లజాతి ఆత్మగౌరవాన్ని, ప్రతిఘటనను, భాషలో సంస్కృతిలో ప్రకటించి హిప్ హాప్ సంగీతానికి కొత్త ఊపిరినీ కొత్త మార్గాన్ని అందించాడు. నల్ల వాళ్ళు వేసుకునే బంగారు గొలుసుల గురించి , వాళ్ళు అనుభవించే అమ్మాయిల గురించి జూసీ జె లాగానో, విజ్ ఖలీఫా లాగానో కాకుండా, తన కాంప్టన్ వేర్లను మరిచిపోకుండా సామాజిక స్పృహతో, తన చుట్టూ నల్లవారి జీవితాల గురించి వ్యాఖ్యానిస్తూ నల్లజాతి సంస్కృతికి, సమాజానికి కొత్త భాష్యం చెప్పాడు.
లామార్ తన ‘టు పింప్ ఏ బట్టర్ ఫ్లై’ లో నల్ల జాతి అస్తిత్వ రాజకీయాలను, సిద్ధాంతాలను పాజిటివ్ , నెగెటివ్ దృక్పథాలతో పరిశీలిస్తాడు. ప్రపంచమంతా ఏదో నల్ల జాతి విప్లవం కోసం ఎదురుచూస్తున్నట్టున్న వింత పరిస్థితిలో, తను మొత్తం ఆ వ్యవస్థకు బయట నిలబడి నల్ల జాతి ప్రజల అస్తిత్వ , ఆత్మగౌరవ చైతన్యాన్ని పెంచడం లో అన్ని రకాల రాజకీయ వాదుల బాధ్యతను గుర్తు చేస్తూ తన పాటల్లో నిప్పు రవ్వలను జ్వలింపచేస్తాడు.
తనకంటే ముందు వచ్చిన టుపాక్ షాకుర్ లాంటి చైతన్యవంతమైన నల్ల జాతి హిప్ హాప్ సంగీతాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం లో లామార్ నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన పాత్ర ను నిర్వహించాడు. నిర్వహిస్తున్నాడు. తను ఈ ఆల్బమ్ తర్వాత విడుదల ఐన ఇతర పాటలు, ఆల్బంస్, ముఖ్యంగా ‘డామ్’ వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది.
కెండ్రిక్ లామార్ ‘డామ్’ ఆల్బమ్ కు పులిట్జర్ రావడం యాదృచ్ఛికం ఎంత మాత్రం కాదు. బాబ్ డిలాన్ కు సాహిత్యం లో నోబెల్ బహుమతి వచ్చినంక, సంగీతం సాహిత్యం లో ఇచ్చే పులిట్జర్ ను కెండ్రిక్ కు ప్రకటించారు. తలెత్తుకు ఎగురుతున్న నల్ల జాతి ఆత్మగౌరవ జెండాలు కెండ్రిక్ పాటలు. వాటికి పులిట్జర్ రావడం ఎంతో హర్షనీయం.
Parichayam baavundi.
కెండ్రిక్ లామార్ లా మన దేశంలో,మన రెండు రాష్ట్రాల్ల కూడా వున్నారు ,అయితే అక్కడ జాతులు మరియు రంగుల పరంగా వివక్ష ఏర్పడతుంటే ఇక్కడేమో కులాలు ,మతాల పరంగా వివక్ష జరుగుతున్నది .
వీళ్ళు రాసుకు పుసుకు తిరుగుతున్న కులాల కంటే ఎవరైతే దళిత ,బహుజనులు అనుకుంటున్నారో వారిలోనే కాండ్రిక్ లామార్ లాంటి అద్భుతమైన కళాకారులు ,మెధావులు ఎక్కవగా ఉన్నారు .వాళ్ళను ఎక్కడికక్కడ తొక్కిపట్టి ఎదగకుండా చేయడం జరిగుతుందనడంలో రోహిత్ ని మనం ఉదాహరణకు తీసుకోవచ్చు .వీళ్ళే ఇక్కడి నిగ్గర్లు అని ఈ వ్యాసమంతా చదివాక నాకర్థమైన విషయం .అద్భుతమైన వ్యాసం మీకు అభినందనలు సర్ 💐💐💐💐💐
చాలా బాగుంది స్వామీ!
గొప్ప వ్యాసం అందించారు- black poems కి and black songs కి ❤
గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు నారాయణస్వామిగారూ