సత్యాన్వేషణ ప్రయాణం ముగిసింది. సత్యం నగ్నంగా మన ముందు నిలబడింది. యింకెక్కడికి ప్రయాణం చేస్తావు మిత్రమా!
మనుషుల జాతి వైషమ్యాల మధ్య అనేకానేక భావోద్వేగాలు రాజేసే పరిస్థితులతో యుద్ధం తప్పనప్పుడు యుద్ధం చేసి తీరాల్సిందే.
వాస్తవాలను వెల్లడించాల్సిన మాధ్యమాలనే వుపయోగించి వాస్తవాలను దాచేసే ధోరణిపై యుద్ధం చేసి తీరాల్సిందే.
యెటువంటి నిర్ణయాలు జారీ చెయ్యటం వల్ల జాతి, కులం, మతం, ప్రాంతం మొదలైన వాటితో ప్రజలు వొకరి పట్ల వొకరు ద్వేషంతో రగిలిపోతున్నారో ఆ నిర్ణయాల మీద యుద్ధం చేసి తీరాల్సిందే.
వాస్తవానికి అవాస్తవానికి నడుమ రగులుతున్న మనుషులను కలిపే వో స్నేహపూరిత పరసువేది మనం కనిపెట్టాలిప్పుడు.
వున్మత్తగణం రాజేసే నిప్పు ఆర్పే జలమేదో కనిపెట్టాలిప్పుడు.
మణిపూర్ యెంత అందమైనదో అంత స్నేహశీలి. అపురూప సౌందర్యమంతమైన ప్రదేశంలోని ఆ పచ్చని కొండలు, లోయలు, పువ్వులు, విప్పారే వాన, కమ్ముకునే మంచు, స్నేహపు చిరునవ్వులు, పూల రంగులు, వారి పండగలు, వస్త్రాలు కలర్ఫుల్. రోజులకి రోజులు కన్నార్పకుండా చూసినా ఆ ఆకుపచ్చని తేమ మన హృదయాల్ని శుభ్రపరుస్తూనే వుంటుంది. వారి స్నేహం యెంతో అందమైనది. అపురూపమైనది.
మరిప్పుడు అక్కడ జరుగుతున్న, జరిగిన హింసకి కోల్పోయిన ప్రాణాలకి, అత్యాచారాలకి, విడిపోయిన మనుష్యులని చూస్తే దుఃఖపడని వారెవ్వరూ లేరు. యిప్పుడా లోయ, ఆ కొండా రగిలిపోతూ బద్దలైన అగ్నిపర్వతం.
యిట్లాంటి పరిస్థితి మానవులు యెందుకు యెదుర్కోవల్సి వస్తుంది? స్నేహపూర్వకంగా జీవించడం వో నెరవేరని కలా? లేక వద్దనా యీ హింస? గాయాలు చేయకుండా విద్వేషాన్ని వెదజల్లకుండా మనుషులని కలిపి వుంచాల్సిన మానవీయ నర్వ్ యేదో యిన్ ఆక్టివ్ అయిపోయిందా?
అధికారాన్నే సర్వసంగా భావించే వారెవ్వరూ ప్రజాస్వామ్యాన్ని కొనసాగించలేరు. పైగా వున్న ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే వరకు శాంతించరు. యిక ప్రజాస్వామ్యావాదులను సహించే గుణం వాళ్ళలో సున్నా కంటే తక్కువే.
సంభాషణ మీద యే మాత్రం నమ్మకం లేనప్పుడే యెదుటి వారి జీవితాల్ని లెక్కలేనంత హింసకి లోను చేస్తారు. వొక సంఘటన తర్వాత మరో సంఘటన వొక అంశం తర్వాత మరో అంశం యిలా తరుచు మానవ సమూహాలు కొట్టుకోవటం, విధ్వంసం సృష్టించుకోవడం యీ శత్రుత్వాన్ని చూస్తూనే వున్నాము.
పవర్ సెంటర్ అసలు యెలాంటి హింసాత్మక పనులు చెయ్యకుండా వాటి వైపు మొగ్గు చూపించకుండా వుండే విచక్షణని సమాజంలోకి యెలా తెచ్చుకోవాలి?
సమస్త దేశాన్ని ఐకమత్యంగా నిలబెట్టే వొక సంభాషణ కావాలిప్పుడు. మనుషుల ద్వేషం కరుడు కట్టిన బ్లాక్ బోర్డ్ పై వున్మాదం రాస్తున్న హింసని చెరిపి వేసే మంచితనపు డస్టర్ యేదో కావాలిప్పుడు.
సమస్త సమాజం మీదకి ఆ జాతి విద్వేష హింస వ్యాపిస్తుందా లేదా అటువంటి హింసని ప్రజలు యెదుర్కొంటారా లేదానే
అంచనాలు వేసుకున్నా వేసుకోపోయినా యెక్కడ హింస వున్నా ఆ హింసకి యెదురు నిల్చి గొంతులు విప్పే సమూహాలతో కలిసి పనిచేసే శక్తిని కూడగట్టుకోవాలి.
వో పక్క టెక్నాలజీ విస్మయపరిచే ఆవిష్కరణలు జరుగుతుంటే మరోవైపు కనీవినీ యెరుగని హింస. యెంతో అమానవీయమైన హింస. యెన్నాళ్ళిలా? ప్రేరేపించే వాళ్ళు యెవరైనా కావచ్చు… యీ వున్మాదపు పనులను చేసే వారి దుర్మార్గాన్ని తగ్గించాలనే ప్రయత్నాలు కలిసికట్టుగా చెయ్యాల్సిందే.
అమానుషాన్ని ప్రేరేపించేవారు ప్రేరేపిస్తారు. అది వాళ్ళ స్వార్ధం. హింసలో భాగం కాకుండా వుండే బలమైన మానవ హృదయాన్ని మానవులు కాపాడుకోవాలి.
ఆ వైపుగా పని చెయ్యకపోతే వున్మాదం జ్వాలలై సమాజాలను తగలబెడుతూ పోతూనే వుంటుంది. యిన్నేళ్ళ మానవ చరిత్రకి అర్థం లేకుండా పోతుంది.
యీ సమాజాన్ని ప్రేమించటమంటే హింసని అడ్డుకునే సున్నితమైన మనసుని నిలుపుకోవటమే. యెలుగెత్తే కంఠనాళాలని మూగపోనివ్వకపోవడమే. మనుషుల మధ్య బలమైన స్నేహ వారధులని నిర్మించే మనసుకి పదును పెట్టుకోవడమే.
అయితే –
నగ్న సత్యాన్వేషణకు ప్రయాణం వొక మణిపూర్ కేనా?
కాదు…